ఒకప్పుడు అన్ని సమాజాలలో వస్తు మార్పిడి విధానమే చెలామణి అయింది. పురాతన భారతదేశంలోను అదే అమలయింది. కానీ కారణాలు ఏమైనా కొనుగోలుకు నగదు చెలామణిలోకి రాక తప్పలేదు. బంగారు, వెండి, రాగి నాణేలు వచ్చాయి. ఆ నగదుకు ఎన్నో పేర్లు. కొన్ని వందల సంవత్సరాల తరువాత నగదు చెల్లింపులలోను ఇబ్బందులు ఉన్నాయని తేలింది. కొన్ని వందల సంవత్సరాలు ఇచ్చిన ఈ అనుభవాల తరువాత ఇప్పుడు నగదు రహిత సమాజం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ‌కూడా అదే బాటలో పయనిస్తున్నది. ఈ ప్రయాణంలో కొన్ని అడుగులు పడ్డాయి కూడా. అందులో భాగమే ఆగస్ట్ 2‌న ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించిన ‘ఇ-రూపి’ విధానం.

వస్తు మార్పిడి వ్యవస్థ నుంచి ఇ-రూపి దాకా సాగిన ఈ ప్రయాణం సుదీర్ఘమైనదే కాదు, అవసరమైనది. కాలానుగుణంగా సాగుతున్నదే, మారుతున్నదే కూడా. రూపి లేదా రూపాయి అన్న పేరుతోనే బ్రిటిష్‌ ‌వాళ్లు కరెన్సీ ముద్రించారు. ఈ పదానికి మూలం ‘రూప్యకం’/‘రూప్య’ అనే సంస్కృత పదం. రూప్యకం అంటే వెండినాణెం. అయితే  షేర్‌షా సూర్‌ 1540-45 ‌మధ్య చెలామణిలోకి తెచ్చిన వెండి నాణెం చిరకాలం చెలామణిలో ఉంది. బానిస వంశరాజులలో ఒకడైన షేర్‌షా రూపొందించిన వెండినాణెం, తరువాత వచ్చిన మొగలులు, ఆపై బ్రిటిష్‌ ఇం‌డియా కూడా కొనసాగించారు. ప్రస్తుతం భారతీయ రిజర్వు బ్యాంక్‌ ‌చెలామణి చేస్తున్న రూపాయి లేదా రూపి 1934 చట్టం మేరకు విడుదల అవుతున్నది.

మన దేశంలో మొట్టమొదటిగా కాగితపు కరెన్సీ చెలామణిలోకి వచ్చిన  కాలం – క్రీస్తుశకం 1770-1832. మూడు బ్యాంకులు- బ్యాంక్‌ ఆఫ్‌ ‌హిందుస్తాన్‌ (1770-1832), ‌జనరల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌బెంగాల్‌ అం‌డ్‌ ‌బిహార్‌ (1773-75), ‌బెంగాల్‌ ‌బ్యాంక్‌ (1784-91) అప్పుడు ఉన్నాయి. అంటే ఈస్టిండియా కంపెనీయే దీనిని ఆరంభించింది. కాబట్టి అదొక దశగా చూడవచ్చు. దేశం రాణి పాలనలోకి వచ్చిన  ఐదేళ్లకే అంటే 1861లోనే కరెన్సీ ముద్రణ మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం వచ్చింది. ఏప్రిల్‌ 1, 1935‌లో రిజర్వు బ్యాంకు ఉనికిలోకి వచ్చింది. ఇదే 1938, జనవరిలో ఐదు రూపాయల నోటును విడుదల చేసింది. మరొక నెలకే రూ. 10, రూ. 100, రూ. 1,000, రూ. 10,000 నోట్లు విడుదలయ్యాయి. 1940లో రూపాయి నోటు మొదటిసారి అచ్చయింది. 1943లో రెండు రూపాయల నోటు ముద్రించారు. 1950లో మొదటిసారిగా స్వతంత్ర భారత కరెన్సీ తయారయింది. ఒక పైస, కొన్ని అణాల (ఆరు పైసలు), నాణేలు, రూపాయి నోటు వచ్చాయి.

 1954లో రూ. 1,000, 5,000, 10,000 పెద్ద నోట్లు రద్దు చేశారు. అంటే స్వతంత్ర భారతదేశంలో ఇంగ్లిష్‌ ‌వాళ్ల కరెన్సీ కొంతకాలం చెలామణి అయింది. 1987లో రూ. 500 నోటు వచ్చింది. 2010లో ఆర్‌ఎస్‌ అన్న గుర్తును అధికారికంగా గుర్తించారు. 2016లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేశారు. కరెన్సీ తయారీలో ఇన్ని మార్పులు రావడానికి ఆయా ఆర్థిక, సామాజిక పరిస్థితులు దారి తీశాయని మరువరాదు. ఇప్పుడు భారతదేశం ఇ-రూపి దిశగా అడుగులు వేస్తున్నది. ఇది నగద రహిత దశను చేరుకోవడానికి ముందుకు సాగుతున్న  ప్రయాణమే గానీ, వస్తు మార్పిడి వ్యవస్థ కోసం వెనకకు మరలడం మాత్రం కాదు.

ఆగస్ట్ ‌రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇ-రూపిని ఆవిష్కరించారని పత్రికల్లో చూసి ఉంటారు. ఈ ఇ-రూపి అంటే ఏమిటి? దీనిని ఎలా వాడాలి? దానివల్ల ప్రయోజనాలు ఏమిటి? తదితర అంశాలపై ప్రజలలో చాలా మందికి అవగాహన లేదు. అవగాహన కలిగిన కొందరిలో ఇది డిజిటల్‌ ‌కరెన్సీనా? బిట్‌కాయిన్‌ ‌వంటి వాటికి ప్రత్యామ్నాయమా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.  ఇ-రూపి అన్నది ప్రీపెయిడ్‌ (‌ముందస్తుగా చెల్లించిన బహుమతి కూపన్‌) ‌గిఫ్ట్ ‌వోచర్‌ ‌వంటిది. దీనితో ప్రభుత్వం ఇప్పటికే అమలు జరుపుతున్న డైరెక్ట్ ‌బెనిఫిట్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ (‌డిబిటి-నగదు బదలీ పథకం- లబ్ధిదారులకే నేరుగా చెల్లింపు) విధానం మరింత మెరుగైన రీతిలో అమలు జరపడానికి వీలవుతుంది. ఇ-రూపి విధానంలో లబ్ధిదారుల చరవాణికి సంక్షిప్త సందేశం కాని లేక ఒక క్యూ ఆర్‌ ‌కోడ్‌ ‌కాని వస్తుంది. దాని సారాంశమేమిటంటే ఒక నిర్ధిష్టమైన అవసరం కోసం కొంత నగదును ఈ సందేశం కాని, కోడ్‌ ‌కాని వచ్చినవారు వాడుకో వచ్చు. ఉదాహరణకు ప్రభుత్వం ఎవరికైనా హృద్రోగ చికిత్స కోసం రెండు లక్షల రూపాయలు సహాయాన్ని మంజూరు చేస్తే ఆ సొమ్మును లబ్ధిదారుడి చరవాణికి సంక్షిప్త సందేశం, లేదా కోడ్‌ ‌ద్వారా అందుతుంది. అప్పుడు ఆ లబ్ధిదారులు తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఈ కోడ్‌ ‌ద్వారా రెండు లక్షల రూపాయల వరకు చెల్లించవచ్చు. ఆసుపత్రి యాజమాన్యాలు ఇలాంటి చెల్లింపులకు అభ్యంతరం చెప్పవు. ఎందుకంటే ఈ కోడ్‌ను పంపడానికి ముందే ప్రభుత్వం లబ్ధిదారుని పక్షాన రెండు లక్షల రూపాయలు జమచేస్తుంది. కాబట్టి, ఆసుపత్రి వారికి ఈ సొమ్ము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుతుంది.

ఇ-రూపిని వినియోగించుకోవడానికి లబ్ధిదారు నికి ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సౌకర్యంకాని, క్రెడిట్‌ ‌లేదా డెబిట్‌ ‌కార్టు కాని ఉండవలసిన అవసరం లేదు. అలాగే లబ్ధిదారుడు తన వ్యక్తిగత వివరాలను కాని, బ్యాంకు ఖాతా వివరాలు కాని ఇతరులతో పంచుకో వలసిన అవసరం లేదు. దీనివల్ల లబ్ధిదారుడు తన వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుకున్నట్టు అవుతుంది. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా లేకపోయినా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. సాధా రణంగా అనేక కుటుంబాలలో ఒకరిద్దరు కీలక వ్యక్తులకు మాత్రమే బ్యాంకు ఖాతా ఉంటుంది. బ్యాంకు ఖాతా లేనివారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చటానికి ఇ-రూపి విధానం ఉపయోగపడుతుంది. అలాగే అనేక సంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలను ఈ విధానం ద్వారా కల్పించటం వల్ల అలాంటి సౌకర్యాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఇ-రూపి విధానం అన్ని రకాల చరవాణు లతో ఉపయోగించుకోవచ్చు కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌ ‌లేకుండా కేవలం బేసిక్‌ ‌చరవాణి వాడేవారికి కూడా లబ్ధి చేకూర్చవచ్చు. కొంతమందికి స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా, దానికి ఇంటర్నెట్‌ ఉం‌డదు. అటువంటి వారు కూడా ఇ-రూపి సౌకర్యాన్ని పొందవచ్చు.

ప్రస్తుతం దేశంలోని 1600 వరకు ఉన్న ఆసుపత్రులలో ఇ-రూపి సౌకర్యాన్ని ఉపయోగించు కుని చికిత్స పొందవచ్చు. దీని పరిధిని మరింత విస్తృతపరచటానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

రూపకర్తలు ఎవరు?

ఇ-రూపిని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (‌చీ×)కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఆర్థిక సేవల శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ (చీ) సంయుక్తంగా బ్యాంకుల భాగస్వామ్యంతో రూపొందించారు. దీనిని ఇతర చెల్లింపుల విధానం కంటే వేగంగా, సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించే ప్రయత్నం చేశారు. గతంలో అనేక సంస్థలు సోడెక్స్ ‌కూపన్లు పేరుతో తమ ఉద్యోగులకు కూపన్లు జారీ చేసేవారు. వాటితో వినియోగదారులు తమకు అవసరమైన అనేక వస్తుసేవలను పొందేవారు. ఇప్పుడు దాదాపు అదే విధానాన్ని ప్రభుత్వం డిజిటల్‌ ‌రూపంలో అందుబాటు లోకి తెచ్చింది. దీనివల్ల అనేక సంస్థలు తమ ఉద్యోగులకు, ఇతరులకు కొంతమేరకు కూపన్ల రూపంలో చెల్లింపులు చేయవచ్చు. దానివల్ల ఆ సంస్థలకు కొంత ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అంతే కాదు, ఈ కూపన్‌ ‌పొందిన లబ్ధిదారుడు, ఎప్పుడు, ఎక్కడ, ఎంతమేరకు వాడారనే సమాచారం కూపన్‌ ‌జారీ చేసిన వారికి తెలుస్తుంది.

ఈ కూపన్లను జారీ చేసేటప్పుడే వాటిని ఎందుకోసం వాడాలో నిర్దేశించవచ్చు. ప్రభుత్వం గర్భిణులకు అందించే పోషకాలు, మందులు, వంటి అవసరాలకు ఈ కూపన్లు జారీచేస్తే, వాటిని పొందిన లబ్ధిదారులు ఆ అవసరాలకు మాత్రమే వాటిని ఉపయోగించుకోగలుగుతారు. ఇతరులెవరు, మరే ఇతర అవసరాలకు వాటిని ఉపయోగించుకోలేరు. ప్రభుత్వం ఒకవేళ కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌వేయించుకోవటానికి ఈ ఇ-రూపిని జారీచేస్తే, లబ్ధిదారుడు తనకు నచ్చిన సెంటర్‌లో వ్యాక్సిన్‌ ‌వేయించుకోవటానికి సెంటర్‌కు వెళ్లి ఈ వోచర్‌ను చూపితే ఆ సెంటర్‌ ‌వారు దానిని స్కాన్‌ ‌చేస్తారు. అప్పుడు లబ్ధిదారుడి చరవాణికి ఒక సంక్షిప్త సంకేత సమాచారం వస్తుంది. దానిని ఆ సెంటర్‌ ‌వారు చూసుకొని చెల్లింపు జరిగినట్టుగా భావించి వ్యాక్సిన్‌ ‌వేస్తారు.

ఇందులో వ్యక్తిగత వివరాలు తెలియజేయవలసిన అవసరం ఉండదు కాబట్టి, ఒకరి చరవాణిని మరొకరు తీసుకొని సేవలు పొందే ప్రమాదం ఉన్నది. అయితే ఈ సదుపాయం వాడేవారి సంఖ్య పెరిగి, దాని సేవల పరిధి విస్తృతమైతే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనటం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో జన్‌ధన్‌ ‌ఖాతాల పేరుతో దేశ పౌరులందరికీ సున్నా బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని, పౌరులందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ పథకం నిబంధన క్రింద ఖాతాలు తెరిచి, ఖాతాలులేని పౌరులు ఎవరైనా ఉంటే నిర్దేశించిన గడుపులోపు ముందుకు వస్తే వారికి ఖాతాలు తెరుస్తామని, గడుపు తీరిన అనంతరం తమ అధికార పరిధిలోని ప్రాంతంలో పౌరులందరికి బ్యాంకు ఖాతాలు ఉన్నట్టుగా పరిగణిస్తామని ప్రకటనలు ఇచ్చి, దేశవ్యాప్తంగా పౌరులందరికి బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రకటించారు.

పాత సమస్యకు పరిష్కారం

అయితే వాస్తవానికి కొంతమంది పౌరులకి ఇప్పటికి బ్యాంకు ఖాతాలు లేవని ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆరోగ్య పథకాలను అమలుచేస్తున్నప్పుడు గుర్తించింది. ఇటువంటి పౌరులు, అంటే బ్యాంకు ఖాతాలేని పౌరులు దేశంలో దాదాపు 20 కోట్లమంది ఉన్నారని, వారికి ప్రత్యక్ష నగదు బదలీ పథకం అమలుచేయటం సాధ్యపడదని అధికారులు తెలియజేశారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఈ నూతన ఇ-రూపి విధానాన్ని, బ్యాంకు ఖాతాలేని పౌరులకు నగదు బదలీ విధానంలో లబ్ధి చేకూర్చటానికి, ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ఇటువంటి వోచర్‌ ‌విధానాన్ని అనేక ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వాడుతున్నారు. వారి అనుభవం ప్రోత్సాహకరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇ-రూపి పేరుతో అమలు జరుపుతున్నది.

నగదు బదలీ పథకంలోని లోపాలను కూడా ఈ విధానం కొంతమేరకు సరిచేసినట్టు చెప్పవచ్చు. ఆ పథకంలో ఇటీవలి కాలంలో కొన్ని అకతవకలు చోటుచేసుకోవడం, లబ్ధిదారుల ఖాతాలలోని సొమ్ము కొన్ని సందర్భాలలో వాడుకోనీయకుండా ఆటంకాలు ఏర్పడడం, మరికొన్ని సందర్భాలలో ఆ సొమ్మును ఇతర అవసరాలకు వాడటంవల్ల సమస్యలు ఎదురవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించి దానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఇ-రూపిని ప్రవేశపెట్టినట్టు భావించవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వం గ్యాస్‌ ‌సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేస్తున్నప్పటికీ ఆ సొమ్మును మద్యం కొనుగోలుకు వాడుతున్న సంగతీ చాలామంది, అనేకచోట్ల చర్చించటం జరిగింది.

ప్రస్తుతం ఆరోగ్య సేవలకు మాత్రమే పరిమితమైన ఈ నూతన ఇ-రూపి విధానం పటిష్టంగా అమలు జరిగి దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకి ప్రయోజనం చేకూర్చడంలో సఫలమైతే భవిష్యత్తులో గ్యాస్‌ ‌సబ్సిడీ వంటి అనేక నగదు బదలీ పథకాలకు విస్తరించే అవకాశం ఉంది. పేరుకు మాత్రం ఇది ఇ-రూపి అయినా, ఇది ఎలక్ట్రానిక్‌ ‌కరెన్సీ కాదు.

ఆర్‌బిఐ విడుదల చేస్తుంది

మన దేశంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కరెన్సీని భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేస్తుంది. అందుకే ఎలక్ట్రానిక్‌ ‌లేదా డిజిటల్‌ ‌కరెన్సీని కూడా భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేస్తుంది. ఈ దిశగా రిజర్వు బ్యాంకు పని మొదలు పెట్టింది. వారి అంచనాల ప్రకారం పనులు పూర్తి అయితే ఈ సంవత్సరంలోనే ఎలక్ట్రానిక్‌ ‌కరెన్సీని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం విడుదల చేసిన ఇ-రూపి వినియోగదారులకి సౌకర్యవంతంగా ఉంటే అతిత్వరలో ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలు, చిన్న, మధ్య తరహా, సూక్ష్మ పరిశ్రమలు వీటిని వాడే అవకాశం ఉంది. ఎవరైతే చెల్లింపులు కేవలం నిర్దేశిత అవసరాలకు వాడాలనే లక్ష్యంతో చెల్లింపులు చేస్తారో వారంతా దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక సంస్థ తమ ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులకు చెల్లింపులు చేస్తుంటే, ఆ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటానికి ఆ సంస్థ ఇ-రూపి వాడవచ్చు. దానివల్ల లబ్ధిదారుడు ఆ డబ్బును కేవలం ప్రయాణ ఖర్చులకి వాడతాడు. ఇతర అవసరాలకి వాడటానికి అవకాశం ఉండదు. యాజమాన్యానికి ఈ డబ్బుని ఎప్పుడు, ఎక్కుడ, ఏ విధంగా వాడారనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి, దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

ప్రారంభంలో కేవలం కొన్ని ఎంపికచేసిన వైద్యసేవలకే  దీనిని వాడుతున్నట్టు ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో అనేక చెల్లింపులకు ఈ సౌకర్యం విస్తరించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 54 మంత్రిత్వ శాఖలు ఇప్పటికే 314 నగదు బదలీ పథకాల ద్వారా ఏటా 5.52 లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకి చెల్లిస్తున్నాయి. అయితే ఆ సొమ్మును లబ్ధిదారులు కేవలం పథకంలో నిర్దేశించిన లక్ష్యాలకే వాడుతున్నారన్న సమాచారం ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి, ప్రభుత్వ పథకాల లక్ష్యాలు నెరవేరతాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ కొవిడ్‌ ‌సమయంలో లబ్ధిదారులకి మేలు చేకూర్చటానికి ప్రభుత్వం అనేక విధాల చెల్లింపులు చేసింది. కొన్ని పరిశ్రమలకు, ఇన్స్యూరెన్స్ ‌కట్టటానికి, కొందరికి ఉద్యోగుల భవిష్యనిధిలో జమచేయటానికి ఇలా అనేక అవసరాలకి చెల్లింపులు చేసింది. అయితే ఆ డబ్బు కేవలం దానికే వాడారనే నమ్మకం లేదు. ఇ-రూపి అమలు జరిపితే లబ్ధిదారుడు ఆ సొమ్ముని దేనికి ఖర్చు చేశాడో తెలిసిపోతుంది. దీని లాభాలు అర్థమయితే భవిష్యత్తులో వినియోగ దారుల రుణ సౌకర్యం కూడా ఇ-రూపి ద్వారా చెల్లించవచ్చు. దానివల్ల మన ఆర్థిక రంగం మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

– సాయి, ఆర్థికరంగ నిపుణులు

————————

‘లక్ష్మి ’-లబ్ధిదారులకు దీవెన

‘ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారునికి ప్రయోజనాలు చేకూరేలా చేస్తుంది’ అంటూ ఇ-రూపి గురించి ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ‘లక్ష్మి’ అని పిలుస్తున్నారు. ఆర్‌బిఐ లక్ష్మికి, బిట్‌కాయిన్‌ ‌లాంటి క్రిప్టో కరెన్సీకి వ్యత్యాసం ఏమిటి? లక్ష్మి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. బిట్‌కాయిన్‌ ‌ప్రైవేటు రంగంలో చెలామణి అవుతున్న అతి పెద్ద క్రిప్టో కరెన్సీ. వివిధ పథకాల ద్వారా పేదలకీ, రైతులకీ మన ప్రభుత్వం నగదు బదలీ చేస్తున్నది. ఇందులో కొన్ని చోట్ల ప్రభుత్వోద్యోగుల చేతివాటం ప్రదర్శిస్తున్న సంగతి బయటపడింది. దీనివల్ల ప్రభుత్వ సాయం చేరవలసిన వారికి సరిగా చేరడం లేదు. ఇ-రూపి దీనిని నివారిస్తుంది. అలాగే, దేశంలో డిజిటల్‌ ‌కరెన్సీని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ కీలక ముందడుగు వేసింది. అదే ఇ-రూపి. డిజిటల్‌ ‌చెల్లింపు ఆధారిత ఎలక్ట్రానిక్‌ ‌వోచర్ల జారీ ఇందులో కీలకం. ఇందులో డబ్బు చెల్లించేవారికీ, గ్రహీతలకీ నడుమ మూడో పార్టీ జోక్యం ఉండదు. దీనినే ఎండ్‌ ‌టు ఎండ్‌ ఎన్‌‌క్రిప్టెడ్‌ అం‌టున్నారు. సంక్షేమ సేవలలో అవకతవకలు జరగకుండా దీనితో నిరోధించవచ్చునని కేంద్రం భావిస్తున్నది. మాతాశిశు పౌష్టికాహార పథకం, క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌కింద మందులు, చికిత్స; ఎరువుల సబ్సిడీ వంటి కార్యక్రమాలలో ఇ-రూపి విధానం ద్వారానే చెల్లింపులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నందున ప్రాచుర్యంలోకి తెస్తున్నది. నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్‌ ‌పేమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (భారతదేశంలో రిటైల్‌ ‌చెల్లింపులు, సెటిల్మెంట్‌ ‌వ్యవస్థలను నిర్వహించే ఒక సంస్థ. ఇది కూడా రిజర్వు బ్యాంక్‌ అధీనంలోనే పనిచేస్తుంది) ముందుకు వచ్చింది. ప్రస్తుత చెల్లింపుల విధానాల కంటే సరళంగా, నగదు రహితంగా ఈ విధానాన్ని అమలు చేయవచ్చు. ఒకేసారి నగదు చెల్లింపు అవకాశం ఉన్న ఈ యంత్రాంగంతో వినియోగదారుల కార్డు, డిజిటల్‌ ‌చెల్లింపు యాప్‌ ‌లేదా ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ను వినియోగించకుండానే ఆయా సంస్థల దగ్గర సేవలు పొందవచ్చు. దీనికి యూనిఫైడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ ‌ఫేస్‌ (‌యూపీఐ) ప్లాట్‌ఫారమ్‌ ‌రూపొందించింది. యూపీఐ అంటే ఏమిటి? ఇది రియల్‌ ‌టైమ్‌ ‌చెల్లింపుల విధానం. దీని ద్వారా మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా తక్షణమే బ్యాంక్‌ ‌ఖాతాకు నగదు బదలీ చేయవచ్చు. యూపీఐ ప్లాట్‌ ‌ఫారమ్‌ ‌మీదనే ఇ-రూపిని కూడా సృష్టించారు. కానీ దానిని రీడీమ్‌ ‌చేయడానికి మొబైల్‌ ‌యాప్‌ అవసరం లేదు. సంక్షేమ సేవలు గోప్యంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని నిర్ధారించే పక్రియలో ఇదొక విప్లవాత్మక చర్యగా నిపుణులు భావిస్తున్నారు.  ప్రధానమంత్రి జన్‌ధన్‌ ‌పథకాల కింద సేవలు అందించడానికి కూడా ఇ-రూపి ఉపయోగించుకోవచ్చు. ప్రైవేటు రంగం తన ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల కోసం, జవాబుదారి పథకాల కోసం కూడా ఈ డిజిటల్‌ ‌వోచర్‌లను ఉపయోగించుకోవచ్చు.

—————-

మందగమనంతోనే అయినా….

డిజిటల్‌ ‌వాలెట్‌, ‌డిజిటల్‌ ‌చెల్లింపు వ్యవస్థలకు మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. 2016లో పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా అక్రమ నగదు చెలామణికి స్వస్తి పలికి దేశాన్ని నగదు రహిత సమాజంగా తీర్చిదిద్దుతామని మోదీ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే తరవాత ఆ ఆలోచనలో చిన్న మార్పు చేశారని అనిపిస్తుంది. తక్కువ నగదు చెలామణిలో ఉండేటట్టు చూస్తామని అన్నారు. ఇదే సమయంలో డెలాయిట్‌ ‌నివేదిక వెలువడింది. ఇటీవల విడుదల అయిన ఈ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో భారతదేశంలో 89 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి. చైనా సంగతి చూస్తే 2020లో 44 శాతం నగదు లావాదేవీలు జరిగాయని తేలింది. కాబట్టి నగదు రహిత వ్యవస్థ అనుకున్నంత వేగంగా సాగడం లేదు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఇ-రూపి మోదీ స్వప్నాలకు సానుకూల పరిణామమేనని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో చౌకగా లభించే స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ డిజిటల్‌ ‌వాలెట్ల వాడకం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. నిజానికి ప్రస్తుతం కూడా గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్‌ ‌పే, ఎయిర్‌టెల్‌ ‌మనీ వంటి డిజిటల్‌ ‌వాలెట్ల వాడకం సర్వ సాధారణ స్థాయికి చేరుకున్న విషయం గమనించాలి. మనిషి నుంచి మనిషి నేరుగా చెల్లింపులు జరగకుండా చూసే పద్ధతిని కరోనా అనివార్యంగా అమలులోకి తెచ్చింది కూడా. ఆ పరిస్థితి డిజిటల్‌ ‌వాలెట్ల వినియోగాన్ని వేగంగా పెంచింది.

——————-

ప్రపంచం నమ్మని బిట్‌కాయిన్‌

ఇది కూడా డిజిటల్‌ ‌కరెన్సీయే. ఈ డిజిటల్‌ ‌కరెన్సీ ‘ఎన్‌‌క్రిప్టెడ్‌’. అం‌టే కోడ్‌ ‌రూపంలో వినియోగంలో ఉంటుంది. కాబట్టి దీనికీ, డిజిటల్‌ ‌కరెన్సీకి కొన్ని పోలికలు ఉన్నాయి. కానీ ఈ రెండు ఒకటి కాదు. కొన్నేళ్లుగా డిజిటల్‌ ‌కరెన్సీకి ప్రాచుర్యం పెరుగుతున్నది. బ్లాక్‌ ‌చెయిన్‌ ‌సాఫ్ట్‌వేర్‌ ‌సాయంతో దీనిని వినియోగించుకుంటారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా కరెన్సీ విషయంలో ఒక కచ్చితమైన నిబంధన ఉంటుంది. అదేమిటంటే కరెన్సీ మీద అదుపు మొత్తం ఆయా దేశాల కేంద్రీయ బ్యాంకుల చేతిలో ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీ విషయం వేరు. దీని నియంత్రణ పూర్తిగా దాని కొనుగోళ్లు, అమ్మకాలు జరిపేవారి ఆధ్వర్యంలోనే ఉంటుంది. అంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటుంది. క్రిప్టో కరెన్సీ అంటే వర్చువల్‌ ‌లేదా డిజిటల్‌ ‌నగదు అని చెప్పవచ్చు. ఇవి టోకెన్‌ ‌లేదా డిజిటల్‌ ‌నాణేల రూపంలో ఉంటాయి. ప్రభుత్వ నియమ నిబంధనలతో సంబంధం లేకుండా  రూపొందాయి. అందుకే ఈ విధానం చర్చనీయాంశమే కాకుండా, వివాదాస్పదంగా కూడా తయారయింది. కొన్ని దేశాలలో దీని వాడకం మీద ప్రభుత్వాలకు వ్యతిరేకత ఉంది. పారదర్శకత మీద అనుమానాలు ఉన్నాయి. అందుకే బిట్‌కాయిన్‌ ‌వినియోగానికి ఆమోదముద్ర వేసిన ఎల్‌సాల్వెడార్‌ ‌దేశం ఈ విధానం కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని ప్రపంచ బ్యాంక్‌ను కోరినప్పటికీ ఆ బ్యాంక్‌ ‌నిరాకరించింది.

భారత్‌లో కూడా ఈ విధానానికి అంత మంచిపేరు లేదు. ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్‌చేంచ్‌ ‌మార్కెట్లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో వజీర్‌ ఎక్స్ ‌పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. దీని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వర్చువల్‌ ‌కరెన్సీని క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావచ్చుననే అభిప్రాయం కూడా ఉంది. క్రిప్టో కరెన్సీని నిషేధించకున్నా, నియంత్రించడం తప్పదని గతంలోనే ఆర్థికమంత్రి సూచనప్రాయంగా చెప్పారు.

ఆగస్ట్ ‌రెండోవారంలో ఒక బిట్‌కాయిన్‌ ‌విలువ రూ.30 లక్షలు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి బిట్‌కాయిన్లు రెండుకోట్లు చెలామణిలో ఉన్నాయని చెబుతారు. భారత్‌లో రెండువేలు వరకు ఉండవచ్చునని అంచనా.

———————

డిజిటల్‌ ‌కరెన్సీ… ఇ-రూపి

డిజిటల్‌ ‌కరెన్సీకీ, ఇ-రూపికి తేడా ఏమిటి? ఇ-రూపి అనేది నిర్దేశించిన ప్రయోజనాలలో ఉపయోగించుకునే అవకాశం కలిగి ఉంటుంది. వర్చువల్‌ ‌మనీతో పోలిస్తే ఇది భిన్నమైనదే కూడా. ఇక ప్రస్తుతం ఉన్న రూపాయి విలువతో సమానమైన నోట్లు కాకుండా డిజిటల్‌ ‌రూపంలో డబ్బు విడుదల చేయాలన్నది కేంద్రం యోచిస్తున్నది. అంటే కాగితం రూపంలో ఉన్న కరెన్సీని క్రమంగా తగ్గిస్తారు.  ప్రస్తుతం అమెరికా విద్యావ్యవస్థలో ఈ వోచర్ల విధానం అమలులో ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వోచర్ల రూపంలో ప్రభుత్వం సొమ్ము ఇస్తున్నది. తద్వారా విద్యార్థులు తమకు కావలసిన కోర్సులలో చేరుతున్నారు. మన దేశంలో కూడా డిజిటల్‌ ‌కరెన్సీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే రిజర్వు బ్యాంకుతో కలసి పనిచేయడం ఆరంభించింది. ఇ-రూపి కూడా అందులో భాగమే. కానీ పైన చెప్పుకున్న తేడాలు ఉన్నాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE