ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రెండు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసి 2001లో తాలిబన్‌ ‌నిష్క్రమించారు. మళ్లీ 2021లో అధికారం చేజిక్కించుకుని అధ్యక్ష భవనంలోకి అడుగు పెడుతూనే ఆగస్ట్ 17‌న అబ్దుల్‌ అలీ మజారి అనే షియా నేత విగ్రహాన్ని కూల్చారు. ఆ విధంగా 2001లో మొత్తం ప్రపంచం చేత ఛీ అనిపించుకున్న ఒక దుశ్చర్యను తమకి తామే తాలిబన్‌ ‌ప్రపంచానికి గుర్తు చేసినట్టయింది. మజారి కూడా తాలిబన్‌ ‌నాశనం చేసిన బుద్ధ విగ్రహాలు ఉన్న బమియాన్‌ ‌లోయ ప్రాంతానికి చెందిన వారే. తాలిబన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. 1996లో చర్చల కోసం రప్పించి, బంధించి మజారిని చంపారు. హెలికాప్టర్‌ ‌మీద నుంచి శవాన్ని బమియాన్‌ ‌ప్రాంతంలో పడేశారు. మజారికి తరువాత అమరవీరుడు అన్న గౌరవం ఇచ్చి ప్రజలు విగ్రహం నెలకొల్పారు. తాలిబన్‌ ‌మారరు. మారడం సాధ్యం కాదు. పైగా చైనా, పాకిస్తాన్‌ అం‌డదండలు దండిగా ఉండగా మార్పు అన్నది సాధ్యమే కాదు. కాబట్టి గతంలో జరిగిన సాంస్కృతిక వారసత్వం ఇకపైనా వాళ్లు యథేచ్ఛగా కొనసాగిస్తారనడంలో సందేహం లేదు. సాంస్కృతిక విప్లవం పేరుతో చైనా వారసత్వ సంపదను సర్వ నాశనం చేసిన చైనాకు కూడా తాలిబన్‌ ‌విధ్వంసం ఇంపుగానే ఉంటుంది.

ప్రజలందరికి సామూహిక క్షమాభిక్ష ప్రసాదిస్తు న్నామని అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్‌ ‌నేతలు ప్రకటించారు. అసలు భయంతో గడగడలాడిపోతున్న తమ దేశ ప్రజల గురించి తాలిబన్‌ ఇలా మాట్లాడడమే పరమ వికృతం కాదా! వీళ్లెవరు క్షమాభిక్ష పెట్టడానికి? పోనీ ఆ మాటైనా నిలబెట్టుకున్నారా? ఆ హామీ ఇచ్చిన కొన్ని గంటలలోనే ప్రజల మీద వారు కాల్పులు జరిపారు. విమానాశ్ర యానికి పరుగులు తీసిన వారిని అక్కడే పెట్టి రక్తమోడేటట్టు చావగొట్టారు. కళాఖండాల జోలికి, పురావస్తు ప్రదర్శన శాలల జోలికి ఎవరూ పోరాదని చెప్పిన కొన్ని గంటలకే మజారి విగ్రహం కూల్చివేశారు (ఇదే స్ఫూర్తితో కాబోలు ఆ వెంటనే పాకిస్తాన్‌లో కొంతమంది తాలిబన్‌ ‌వీరాభిమానులు మహారాజా రంజిత్‌ ‌సింగ్‌ ‌విగ్రహాన్ని పడగొట్టారు).

1990 నాటికే తాలిబన్‌ అఫ్ఘానిస్తాన్‌లో ఆధిపత్యం సంపాదించారు. ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా పాలిస్తామంటూ 1996 నుంచి 2001 వరకు ఆటవిక పాలన సాగించారు. ఆ సంవత్సరమే బమియాన్‌ ‌బుద్ధ విగ్రహాలను ‘యుద్ధ’ ప్రాతిపదికన కూల్చారు. తరువాత తాలిబన్‌ అరాచక పాలన కూడా కూలిపోయింది. అమెరికా దాడి జరిగే వరకు ఆ అరాచకం అప్రతిహతంగా సాగింది. తమ పాలన కంటే ముందు అఫ్ఘానిస్తాన్‌లో వెలసిన ఏ ఒక్క ముస్లిమేతర అవశేషాన్నీ, గుర్తునీ ఉంచబోమని ప్రతిజ్ఞ చేసి అందుకు అనుగుణంగానే వ్యవహరించారు. బమియాన్‌ ‌బుద్ధ విగ్రహాల పేల్చివేత గురించి ప్రపంచానికి తెలిసింది. తెలియని వారసత్వ విధ్వంసం ఎంతో ఉంది. జ్ఞానద్వేషానికి పరాకాష్టగా గ్రంథాలయాలను కూడా దగ్ధం చేశారు. మధ్యయుగపు ఈ వికార మనస్తత్త్వానికి మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేయాలని వాళ్ల స్పష్టమైన ఆశయం. నెలల తరబడి పురాతన కట్టడాలను కూల్చడం, ఆధునిక గ్రంథాలన్నీ తగలబెట్టడం అలాంటివే. మన దేశంలో రాకాసి తంగడి యుద్ధం తరువాత విజయనగరాన్ని ధ్వంసం చేయడానికి నెలల తరబడి అక్కడే తిష్ట వేసి సాగిం చారు, ముస్లిం మతోన్మాదులు. ఆధునిక కాలంలో చూస్తే లిబియాను ఏలిన పిచ్చిమారాజు కల్నర్‌ ‌గడ్డాఫి కూడా మత గ్రంథం తప్ప మిగిలిన అన్ని గ్రంథాలు అవసరం లేదని అన్నవాడే.

తాలిబన్‌ది ఎంత కరుడగట్టిన మత మౌఢ్యమో వారి ఏలుబడిలోనే జరిగిన బమియాన్‌ ‌బుద్ధ విగ్రహాలను కూల్చివేతతో మరింత తిరుగులేకుండా స్పష్టమయింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దానికి చెందిన ఆ గాంధార శిల్పాలది 1400 సంవత్సరాల చరిత్ర. మధ్య అఫ్ఘానిస్తాన్‌లోని బమియాన్‌ ‌లోయలో మహా కుడ్యంలా ఉండే పర్వత శ్రేణిలో శిల్పించారు.

ఆగస్ట్ 11,1998‌న పుల్‌ ఇ ‌కుమ్రి పబ్లిక్‌ ‌లైబ్రరీని తగలబెట్టారు. ఇందులో తాళపత్ర గ్రంథాలు, మరెన్నో విలువైన అచ్చు గ్రంథాలు దాదాపు 55,000 ఉండేవి. ఈ గ్రంథాలయాన్ని తమ వారసత్వ సంపదకు గుర్తుగా అప్ఘాన్‌ ‌ప్రజలు సగర్వంగా భావించేవారు. 2001 అక్టోబర్‌ ‌మాసంలో 2,750 కళాఖండాలను ధ్వంసం చేశారు. ఇవేమీ రహస్యం కాదు. పోనీ అమెరికాయో, మరొక ముస్లిం వ్యతిరేక వ్యవస్థ చెప్పిన మాట కూడా కాదు. ఈ పనులు తామే చేశామని తాలిబన్‌ ‌సగర్వంగా ప్రకటించు కున్నారు. వీటన్నిటికీ మించిన మరొక దుశ్చర్య బమియాన్‌ ‌బుద్ధ విగ్రహాల పేల్చివేత.

అఫ్ఘానిస్తాన్‌లో మిగిలి ఉన్న ఇస్లామేతర గుర్తుల న్నింటిని ధ్వంసం చేయమని రేడియో ప్రసంగం ద్వారా ఫిబ్రవరి 27, 2021న తాలిబన్‌ ‌నాయకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ ఆదేశించాడు. ఫలితమే బమియాన్‌ ‌బుద్ధ విగ్రహాల పేల్చివేత నిర్ణయం. దీనికి ప్రపంచం మొత్తం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక సహజంగానే దలైలామా వంటివారూ విన్నవించారు. దేశ చారిత్రక వారసత్వ సంపద జోలికి వెళ్లవద్దని కోరారు. యావత్‌ ‌ప్రపంచం చేసిన విన్నపం గడ్డిపోచతో సమానమైపోయింది. మార్చి 2వ తేదీన భూగోళం మీదే ఎత్తయిన ఆ మహా బుద్ధ శిల్పాలను కూల్చే పనిని ప్రారంభించారు. అందుకు ప్రత్యేక జిహాద్‌ ‌ప్రకటించారు. అందులో తూర్పు బుద్ధుడి విగ్రహం ఎత్తు 36 మీటర్లు(120 అడుగులు). పశ్చిమ బుద్ధుడి ఎత్తు 55 మీటర్లు (175 అడుగులు). కొండనే తొలిచి చెక్కారు. మొదట తుపాకులు, డైనమైట్లతో విధ్వంసం మొదలుపెట్టారు. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. మందు పాతరలు, రాకెట్ల ద్వారా ప్రయత్నించారు. మొత్తానికి 25 రోజులకు పని పూర్తయింది.

ఈ విధ్వంసం మొత్తానికి ప్రత్యక్షసాక్షి సయ్యద్‌ ‌మీర్జా హుసేన్‌ అహ్మది. ఇతడిని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఇతడు చెప్పిన విషయాలు వినడం ఎందు కంటే వారసత్వ సంపద మీద, తమ దేశానివే అయినా తాలిబన్‌ ‌యుగం కంటే ముందు ఉన్న చిహ్నాలను ధ్వంసం చేయడానికి ఎంత పాటుపడ్డారో తెలుస్తుంది. ఈ పనికే కొంతమందిని ఆ ఉగ్రవాద సంస్థ నియ మించుకుంది. బమియాన్‌ ‌ప్రాంతంలో యుద్ధఖైదీల పేరుతో పట్టుకున్న 116 మందిలో అహ్మది ఒకడని చెప్పవచ్చు. వీళ్లంతా పారిపోకుండా చేతలూ కాళ్లూ కట్టి ఉంచారప్పుడు. ఇతడు ద్విచక్ర వాహనాలను మరమ్మతు చేసేవాడు. ఒక విధంగా అంతర్యుద్ధంలో పట్టుబడిన వాళ్లనే విధ్వంసం చేయడానికి తాలిబన్‌ ఉపయోగించుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో పేలుడు పదార్థాలను ట్రక్కులతో తీసుకు వెళ్లవలసి వచ్చిందని అహ్మది చెప్పాడు. మందు పాతరలు పేల్చడానికి అక్కడికి దగ్గరలో ఉన్న మసీదుని ఉపయోగించుకున్నారు. అక్కడి నుంచే వైర్లు అమర్చారు. రెండో ప్రయత్నంలో ప్రతిమలు రెండూ కుప్పకూలిపోతాయని తాలిబన్‌ అనుకున్నారు. కానీ పెద్ద బుద్ధుడి విగ్రహం కాళ్లు మాత్రమే ధ్వంసం చేయగలిగారు.

తనకి ఆ పని ఇష్టం లేదని కాని తుపాకీ చూపించి చేయించారని చెప్పాడు. లోపల ఉన్న బుద్ధుడి విగ్రహం కాళ్ల దగ్గరకి మందుగుండు సామగ్రి చేరవేసే సమయంలోనే బందీల కట్లు విప్పేవారు. ఆ 116 మందిలో హుసేన్‌ ‌బంధువు కూడా ఉన్నాడు. ఒకసారి అతడు అనారోగ్యంతో బాంబులు మోయలేకపోతే ఇతడి కళ్ల ముందే కాల్చి చంపేశారు. శవాన్ని తీసుకువెళ్లి ఒక గుహలో పడేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా విజయోత్సవం పేరుతో తొమ్మిది ఆవులను చంపారు. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడతానని అహ్మది అనుకోలేదట. అఫ్ఘానిస్తాన్‌ని నా చేతులతో నేనే ధ్వంసం చేస్తున్నానని అనిపించింది. కానీ చేసేది ఏం లేదు అని చెప్పాడు. తాలిబన్‌కి కొందరు విదేశీ ఇంజనీర్లు కూడా సాయ పడ్డారు. ఆ 25 రోజుల పాటు నిత్యం రెండుమూడు పేలుళ్లు జరిపేవారు. మందు పాతరలు పెట్టడానికి విగ్రహానికీ, ఆ కొండకీ ఎన్నో రంధ్రాలు చేశారు. ఎట్టకేలకు మార్చి 11న విధ్వంసం పూర్తయింది. బమియన్‌ ‌విగ్రహాలను, జాతీయ వస్తు ప్రదర్శన శాలలో ఉన్న ఇతర విగ్రహాలను మొత్తం ధ్వంసం చేశామని మార్చి 14న తాలిబన్‌ ‌ప్రకటించారు.

తరువాత 2003లో ఆ పేలిపోయిన బుద్ధ విగ్రహాలనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 3డి హోలోగ్రామ్‌ ‌సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ విగ్రహాలు మళ్లీ అక్కడ ఉన్నట్టు చూపించి 2013లో ‘ఏ నైట్‌ ‌విత్‌ ‌ది బుద్ధా’ పేరుతో సాంస్కృతికోత్సవం చేశారు.

ఒకప్పుడు దక్షిణాసియాలో అఫ్ఘానిస్తాన్‌ ‌గొప్ప సాంస్కృతిక కూడలి. సిల్క్ ‌రూట్‌లో ఉండడం అందుకు కారణం. కానీ ఇప్పుడు అది మొదట సోవియెట్‌ ‌రష్యా కమ్యూనిస్టు విస్తరణ దెబ్బకు గుర్తుగా, రష్యాను అరికట్టే నెపంతో అమెరికా తెర వెనుక నడిపిన తతంగానికి సాక్షిగా, తాజాగా తాలిబన్‌ ‌మత మౌఢ్యం, వెనుకబాటుతనం వంటివాటికి అక్షరాలా కూడలిగా నిలిచి ఉంది. అయినా ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం ఆ దేశం సొంతం. నాటి భారత మహాజనపదాలలో ఒకటైన గాంధార ప్రాంతమే అదంతా. అందుకే గొప్ప కళా సంపద ఉంది. 1979లో సోవియెట్‌ ‌రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి పదేళ్ల పాటు కమ్యూనిస్టుల ఉక్కుపాదం కింద ఆ దేశం ఉండిపోయింది. ఆ సంఘర్షణలోనే దేశానికి చెందిన ఎన్నో కళాఖండాలకు కాళ్లు వచ్చాయి. అవే వేలల్లో ఉంటాయని అంచనా. అదే సమయంలో అంటే 1979 నుంచి 1992 మధ్యనే తాలిబన్‌ ‌బలపడ్డారు. ఆ సమయంలోనే తేపె మరాంజన్‌ ‌పురావస్తు తవ్వకాలు జరిగాయి. రష్యా ఆధిపత్యం నెలకొన్న తొలినాళ్లలోనే ఫ్రెంచ్‌, అఫ్ఘాన్‌ ‌పురావస్తు శాస్త్రవేత్తలు ఆ తవ్వకాలు జరిపారు. కానీ అక్కడ దొరికిన వాటిని రష్యా అనుకూల అఫ్ఘాన్‌ ‌ప్రభుత్వమే నాశనం చేసింది. తాలిబన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే కొనసాగింది. వాళ్లది మార్క్సిజం. వీళ్లది మతోన్మాదం. ఈ రెండూ సాంస్కృతిక వారసత్వానికీ, సృజనాత్మతకూ శత్రువులేనని తేలింది. తేపె అనేచోట ఉన్న బౌద్ధారామాలు (తేపె షార్టర్‌), ‌హడ్డా, ఐఖానమ్‌, ‌బాక్ట్రెస్‌, ‌తేపె మరందజన్‌ ‌వంటి ప్రదేశాలు అలాగే ధ్వంసమైనాయి.

తాలిబన్‌ ‌హయాంలో ధ్వంసమైన సాంస్కృతిక సంపదలో చెప్పుకోవలసినది- కాబూల్‌లోని జాతీయ వస్తు ప్రదర్శనశాల. తాలిబన్‌ ‌కంటే ముందు సోవియెట్‌ ‌రష్యా కన్ను దీని మీద పడింది.1992 వరకు దాదాపు లక్ష చారిత్రక అవశేషాలు మాయమయ్యాయి. అందులో చరిత్ర పూర్వయుగం మొదలు, 20వ శతాబ్దానికి చెందిన వస్తువులు కూడా ఉన్నాయి. 1993 మే మాసంలో ఆ ప్రదర్శనశాల మీద రాకెట్ల దాడి జరిగింది. తరువాత అక్కడ మిగిలిన వాటిలో 70 శాతం కనుమరుగయ్యాయి. అంతేకాదు, ఈ పురావస్తు ప్రదర్శన శాలకు సమీపంలోనే ఉన్న పురావస్తు సంస్థలో ఉంచిన మొత్తం వస్తువులు పోయాయి. ఈ మధ్యలో రహస్య తవ్వకాలు చాలాచోట్ల జరిగాయి. దొరికిన వాటిని అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించారు. 2001 ఫిబ్రవరి మాసంలో జరిగిన సంఘటన వింటే విస్తుపోతాం. ఒకరోజు కొన్ని వాహనాలు వచ్చి పురావస్తు ప్రదర్శనశాల ముందు ఆగాయి. అందులో నాటి ఆర్థికమంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి, ముల్లా ఖరి ఫయాజ్‌ ఉర్‌ ‌రెహ్మాన్‌ (‌బుద్ధ విగ్రహాల విధ్వంసకుడు) వాటిలో నుంచి దిగారు. గోదాము తాళాలు అడిగి తీసుకుని అక్కడ దాచిపెట్టిన కళాఖండాలన్నింటిని నాశనం చేసి, అల్లాహో అక్బర్‌ అం‌టూ వెళ్లిపోయారు.

ముస్లిం పవిత్ర గ్రంథం అడ్డం పెట్టుకుని మతోన్మాదులుగా మారిన వారి హక్కుల గురించి మాట్లాడేవారు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. సిరియా శరణార్ధులు విదేశాలకు వెళ్లే క్రమంలో చనిపోయిన ఒక బాలుని మృతదేహాన్ని ప్రపంచ మీడియా మొత్తం చూపించింది. అంటే ముస్లిమేతర దేశాలలో జరిగే దుర్ఘటనలే తప్ప, ఇప్పుడు అఫ్ఘాన్‌లో జరుగుతున్న దారుణాలను చూపించరా? బాలికలను ఎత్తుకుపోవడం, విధవలను లైంగిక బానిసలుగా చేసుకోవడం గురించి పట్టదా? ముస్లిం మతోన్మాదులను సమర్ధించడం తాలిబన్‌ ‌వ్యవస్థకు కొనసాగింపు మాత్రమే. వాళ్లను ఇంకా సహిస్తే, పెంచితే ప్రపంచంలోని అపురూప కళాఖండాలు, అసాధారణ గ్రంథాలు, వైవిధ్యం ధ్వంసం కావడానికి తగిన వాతావరణాన్ని తయారు చేసినట్టే.


పాక్‌, ‌చైనా సంబరాలు

అఫ్ఘాన్‌ ‌పరిణామాలపై సంతోషంగా ఉన్నవి రెండే రెండు దేశాలు- దాని పొరుగున ఉన్న పాక్‌, ‌చైనా. రష్యాదీ ఇదే పంథా. తాను పెంచి పోషించిన తాలిబన్‌ ‌కాబూల్‌ను కైవసం చేసుకోవడం పాక్‌ ‌కు పట్టరాని ఆనందాన్నిచ్చింది. భారత్‌ ‌ప్రాబల్యానికి గండి పడుతుందని దాని ఉద్దేశం. ఇప్పుడు అఫ్ఘాన్‌ ‌మీద పట్టు సాధించాలన్నది పాక్‌ ఆలోచన. అయితే తాలిబన్‌ ‌రాకతో పాక్‌ ‌ప్రత్యేకంగా బావుకునేదేమీ లేదు. భారత్‌ అం‌టే తనకు పడదు. తాలిబన్‌కూ గిట్టదు. అందువల్ల అది తాలిబన్‌ను వెనకేసు కొస్తోంది. ఇందుకు ప్రతిగా తాలిబన్‌ ‌కూడా ప్రత్యుపకారం చేసి పాక్‌ ‌రుణం తీర్చుకున్నారు. అఫ్ఘాన్‌ ‌జైళ్లలో గల వందమంది పాక్‌ ఉ‌గ్రవాదులను విడిచిపెట్టారు. కానీ కొందరు పాక్‌ ‌జాతీయులు అఫ్ఘాన్ల దుస్థితిని సొమ్ము చేసుకుంటున్నారు. సొంత వాహనాల్లో సరిహద్దులకు వెళ్లి అఫ్ఘానీలను పాక్‌ ‌లోని క్వెట్టా, కరాచీ తదితర నగరాలకు భద్రతా బలగాల కన్నుగప్పి తరలిస్తున్నారు. దీనిని మానవ స్మగ్లింగ్‌ అని వ్యవహరిస్తున్నారు. చైనా పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. దక్షిణాసియాలో భారత్‌ ‌ప్రాబల్యానికి గండి కొట్టడం దాని లక్ష్యం.

అఫ్ఘాన్ల మనోభావాలను, ఆకాంక్షలను మేము గౌరవిస్తాం. తాలిబన్‌ ‌సమ్మిళిత ఇస్లామిక్‌ ‌సర్కారును ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్‌ ‌యింగ్‌ ‌ప్రకటించారు. ఇక్కడ తాలిబన్‌తో వ్యూహాత్మకంగా సఖ్యతతో మెలగాల్సిన అవసరం చైనాకు ఉంది. చైనాలోని షింజియాంగ్‌ ‌ప్రావిన్స్ ‌చెందిన వారే ఉయిఘర్‌ ‌సంతతికి చెందిన ముస్లిములు. ఈ ప్రావిన్స్ అఫ్ఘాన్‌ ‌సరిహద్దుల్లోనే ఉంది. వీరి పట్ల చైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. వీరికి తాలిబన్‌ ‌తోడైతే ప్రమాద మని చైనా అనుమానం. అందుకనే ఉగ్రవాద సంస్థలకు అఫ్ఘాన్‌ ‌స్వర్గధామం కాకూడదంటూ ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి జెంగ్‌ ‌షుయాంగ్‌ ‌పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి చైనా, అఫ్ఘాన్‌ ‌మధ్య ఏ సారూప్యతలు లేవు. మతం, భాష, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్లో ఏ పోలికా లేదు. కానీ తాలిబన్‌ ‌రాకతో తన పెత్తనం కొనసాగుతందని చైనా అంచనా. నిజానికి అఫ్ఘాన్‌ ‌సహజ వనరులపైనే చైనా కన్ను. అక్కడ దొరికే ‘రేర్‌ ఎర్తస్’ ‌పై చైనా చూపు పడింది. కంప్యూటర్లు, రీ ఛార్జబుల్‌ ‌బ్యాటరీలు, పవన విద్యుత్‌ ‌టర్బయిన్లు, టెలివిజన్లు, సూపర్‌ ‌కండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీలో రేర్‌ ఎర్తస్ అవసరం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం రేర్‌ ఎర్తస్ ‌ఖనిజాలను సొంతం చేసుకున్న చైనా ఇప్పుడు అఫ్ఘాన్‌ ‌పైన గురి పెట్టింది. ఇటీవల కాలంలో పెట్రోలియం బావులు, రాగి గనుల తవ్వకాలపై ఆ దేశంతో ఒప్పందాలు చేసుకుంది. ఈ సహజ వనరులపై కన్నేసిన చైనా ముందుగానే వాటి రవాణాకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అఫ్ఘాన్‌ ‌సరిహద్దు ప్రావిన్స్ ‌బదక్షాన్‌ ‌లోని నజాక్‌ ‌ప్రాంతంలో 50 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తోంది. ఈ నిర్మాణాన్ని 2020లో నాటి అధ్యక్షుడు అష్రాఫ్‌ ‌ఘనీ ప్రారంభించారు. ఇప్పటికే 20 శాతానికి పైగా పని పూర్తయింది. ఈ రహదారి చైనాలోని షింజియాంగ్‌ ‌ప్రావిన్స్‌ను కలుపుతుంది. చైనా- అఫ్ఘాన్‌ ‌మధ్య సుమారు 57 కిలోమీటర్ల సరిహద్దుంది.

చైనా అంత కాకపోయినా రష్యా కూడా అఫ్ఘాన్‌ ‌పరిణామాలపై సంతోషంగానే ఉంది. 1970, 80ల్లో తనకు ఎదురైన చేదు అనుభవమే ఇప్పుడు అమెరికాకు ఎదురైందని అది భావిస్తోంది. దాని ఆనందానికి కారణం అదే. రష్యా సుప్రీంకోర్టు స్వయంగా తాలిబన్‌ను ఉగ్రవాదులుగా పేర్కొంది. అయినప్పటికీ ‘అష్రాఫ్‌ ‌ఘనీ సర్కారులో కన్నా తాలిబన్‌ ‌నియంత్రణలోనే పరిస్థితులు బాగున్నాయని అఫ్గాన్‌ ‌లోని రష్యా రాయబారి దిమిత్రి జిర్నోవ్‌ ‌ప్రకటించడం గమనించదగ్గ విషయం.

About Author

By editor

Twitter
YOUTUBE