‘నాకు ఈ దేశ యువత మీద విశ్వాసం ఉంది. దేశ సోదర సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తినిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మనలో ఉన్న ఉత్సాహం, మనలో ఉన్న సోదరభావమే మన బలం….’ ఆయన ఎర్రకోట మీద నుంచే ప్రసంగిస్తున్నా, ఏనాడూ కోటలు దాటేవి మాత్రమే అనిపించే మాటలు నోటి నుంచి రాలేదు. ఈ దేశం కూడా ఆ మాటల గురించి కలలో కూడా అలా అనుకోలేదు. ఏడేళ్ల కాలంలో తమ ప్రభుత్వ చేతల గురించి, అమృతోపమానమైన సమున్నత భవిష్యత్తు గురించి 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్ట్ 15‌న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఉత్తేజకర ఉపన్యాసం విన్నవారికి కూడా ఇదే అనిపించింది. కాషాయచారల తలపాగాతో, తనవైన హావభావాలతో, కదలికలతో ఆద్యంతం ఆసక్తి కలిగించే రీతిలో 90 నిమిషాల పాటు మోదీ ప్రసంగించారు. అందులో భవిష్యత్తు మీద అచంచల విశ్వాసం తొణకిసలాడింది. వర్తమానం మీద గురి కనిపించింది. ఈ రెండింటినీ ప్రభావితం చేసే, నడిపించే మన గతం మీద అపార మర్యాద పొంగిపొరలింది. జాతీయతా భావమే శ్వాసగా జీవించే ఒక రాజనీతిజ్ఞుని అంతరంగం ఆవిష్కృతమైంది కూడా.

వచ్చే ఎన్నికల గురించి ఆలోచించకుండా వచ్చే పాతికేళ్లు భారతదేశానికి ఎంత కీలకమో మోదీ తన మాటలతో ఈ దేశం ముందు ఉంచారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో రాజకీయాలు మాట్లాడడం దాదాపు పరిహరించారు. ప్రపంచంలో ఒక ప్రబల ఆర్థికశక్తిగా ఆవిర్భవించాలన్న ఆశయం కలిగిన జాతి స్వరాజ్యం వచ్చి నూరేళ్లు గడిచిన సందర్భంలో ఎలా ఉండాలి? అదే స్వప్నిస్తున్నారు మోదీ. ఇప్పటి నుంచి నూరవ స్వాతంత్య్ర దిన వేడుకల సమయానికి భారత్‌ ‌ప్రబల శక్తిగా ఎదిగేలా సంకల్పం తీసుకోవాలని ఆయన దేశ ప్రజలను కోరడం అందుకే. వందో స్వాతంత్య్ర దినోత్సవం వరకు అమృత ఘడియలుగా భావించుకుందాం. ఈ సమయంలో ఒక కొత్త లక్ష్యంతో ముందుకువెళదాం. ఈ పాతికేళ్లలో దేశాభివృద్ధి కోసమే పనిచేద్దామని ఆయన సుస్పష్టంగా చెప్పారు. మోదీ అభివృద్ధి సమగ్రత కలిగి ఉంటుంది. అందుకే ఆ అమృత ఘడియలలో జరగవలసిన జాతి నిర్మాణం అంటే, సౌకర్యాల విషయంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా ఉండకూడదు. పౌరుల జీవితంలో ప్రభుత్వం అనసవర జోక్యం ఉండరాదు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి అని ఒక స్పష్టమైన చిత్రాన్ని మన ముందు ఉంచారు. దీని కోసమే గతిశక్తి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేసేందుకు రూ.100 లక్షల కోట్లతో భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను అమలు చేయబోతున్నట్టు మోదీ ప్రకటించారు. దీని పేరే ‘ప్రధాన మంత్రి గతిశక్తి నేషనల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌’. ‌దీనితో ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయి.

2024 నాటికి గ్రామీణులందరికీ ఇళ్లకి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో జాతీయ జలజీవన్‌ ‌మిషన్‌ ‌ప్రారంభించినట్టు చెప్పారు ప్రధాని.

 జైకిసాన్‌, ‌జైజవాన్‌ ‌నినాదాన్ని ప్రగాఢంగా నమ్మే మోదీ, దేశంలో 80 శాతం ఉన్న చిన్న రైతులే గర్వకారణమని అన్నారు. పదికోట్ల మంది రైతులకు 1.5 లక్షల కోట్లు వారి అకౌంట్లలో జమ చేసిన సంగతిని గుర్తు చేశారు. సబ్‌ ‌కా సాథ్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌, ‌సబ్‌ ‌కా విశ్వాస్‌ అన్న తన నినాదానికి కొత్తగా సబ్‌ ‌కా ప్రయాస్‌ (‌సమష్టి కృషి)అన్న దానిని చేర్చి దేశ ఐక్యత, కలసి సాగడంలోని సౌందర్యానికి కొత్త సొబగులు కూర్చారు. దీనిని ప్రతిపక్షాలు, ఉదార వాదులు పేరుతో చెలామణి అవుతున్న అర్బన్‌ ‌నక్సల్స్, ‌కుహనా మేధావులు అర్ధం చేసుకోవడం అవసరం. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని పునరుద్ఘాటించారు. ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా భారత్‌ ‌వెనుకాడదు అంటూ చేసిన హెచ్చరిక పాకిస్తాన్‌, ‌చైనాలకు వర్తిస్తుంది.

 నేటి యువతరం ఏదైనా చేయగలదు అన్న మాట ప్రధాని నోటి నుంచి వచ్చింది. అలాంటి తరం ఇప్పుడున్నదని ఆయన విశ్లేషించారు. ఒలింపిక్స్‌లో అద్భుత విజయాలు సాధించిన మన క్రీడారత్నాలను చూసి ఆయన ఈ వ్యాఖ్య చేశారంటే సత్యదూరం కాబోదు. అందుకే వారికి ఏనాడూ ఏ ఆ•గాళ్ల తరానికి దక్కనంత గౌరవం ఇస్తూ, పతకాలు తెచ్చిన, ఆ విశ్వ క్రీడోత్సవంలో పాల్గొన్న యువతను క•రతాళధ్వనులతో అభినందించాలని ఎర్రకోట నుంచి ప్రధాని కోరారు. టోక్యో వెళ్లి పతకాలతో వచ్చిన వారిని దేశం సగర్వంగా జరుపుకునే స్వాతంత్య్ర దిన వేడుకలో భాగం చేయడం నిజంగా అద్భుతం. ఆ క్రీడోత్సవాలలో యువతులది అసాధారణ విజయం. ఆ స్ఫూర్తితోనే కాబోలు, ప్రధాని ఈ ఏడాది నుంచి దేశంలోని సైనిక స్కూళ్లలో బాలికలకు కూడా ప్రవేశం కల్పిస్తున్నట్టు చెప్పారు. భారతదేశం సనాతనత్వాన్నీ, ఆధునికతనూ కూడా సమంగా, హేతుబద్ధంగా స్వీకరిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. బాలురకు మాత్రమే ప్రవేశం ఉన్న సైనిక స్కూళ్లలో బాలికలకు కూడా అవకాశం ఉండాలని తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక స్కూళ్లలో ఇక బాలికలు కూడా చేరబోతున్నారు. రెండేళ్ల క్రితం, అంటే మోదీ హయాంలోనే మిజోరంలో ఇందుకు సంబంధించి ప్రయోగాత్మకంగా ప్రవేశాలు కల్పించారు. ఇప్పుడు దేశవ్యాప్తం చేస్తున్నారు. కొత్త జాతీయ విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. జీవితం పరిపూర్ణం కావడానికి క్రీడలు ఉండాలి. మాతృభాషలో చదువుకుని ముందుకు వెళ్లాలని, అప్పుడే ప్రతిభకు న్యాయం చేకూరుతుందని అన్నారు. అసలు నూతన విద్యావిధానం ధ్యేయమే మాతృ భాషలను ప్రోత్సహించడం, పేదరికాన్ని నిర్మూలించడమని వివరించారాయన. మనం ఖండాంతరాలు దాటినా, మన కీర్తిప్రతిష్టలు నింగిని అంటినా మన మూలాలు మన భూమిలో ఉండాలన్నదే ఆయన ఆశయమని వేరే చెప్పక్కరలేదు.

ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగే క్రమంలో భారత్‌ ‌పెద్ద ముందంజే వేసింది. దీనిని రుజువు చేసే చిన్న ఉదాహరణ ఒకటి చెప్పారు ప్రధాని. ఏడేళ్ల క్రితం 800 కోట్ల డాలర్ల విలువైన మొబైల్‌ ‌ఫోన్లను మన దేశం దిగుమతి చేసుకోవలసి వచ్చేది. ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన మొబైల్‌ ‌ఫోన్లను మనం ఎగుమతి చేస్తున్న సంగతిని చెప్పారాయన. అసలు దిగుమతులను గణనీయంగా తగ్గించాలన్నదే మోదీ ప్రభుత్వ వ్యూహం. రెండేళ్ల క్రితం స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించిన తరువాత జమ్ము కశ్మీర్‌లో వచ్చిన మార్పులను దేశం గుర్తిస్తున్నది. అలాగే లద్ధాఖ్‌లో వచ్చిన మార్పులను కూడా గమనిస్తున్నది. నియోజక వర్గాల పునర్‌ ‌విభజన తరువాత కశ్మీర్‌లో ఎన్నికలు, అది కూడా త్వరలోనే జరుగుతాయని మోదీ ఎర్రకోట నుంచి హామీ ఇచ్చారు.

కొవిడ్‌ 19‌కు అడ్డుకట్ట వేయడంలో మోదీ చూపిన శ్రద్ధను కొనియాడడం ద్వారా మన విపక్షాల విమర్శలలోని డొల్లతనాన్ని ప్రపంచ దేశాలే రుజువు చేశాయి. ఒక మహమ్మారి దాడిలో దేశం ఉన్నప్పుడు జాతి ప్రజలంతా ఐక్యంగా ఉండడానికి మోదీ చేసిన ప్రయత్నాలు విపక్షాలకు అర్ధం కాలేదు. అర్ధమైన వాళ్లు సహృదయతతో స్వీకరించలేదు. అయినా మోదీ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. దానితో వచ్చిన ఫలితాలను ఆయన ఎర్రకోట మీద నుంచి తన ప్రభుత్వ విజయాలుగా జాతికి తెలియచేశారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్నప్పుడు భారత్‌ ‌వ్యాక్సిన్‌ ‌తయారు చేసి అందించే పని చేసింది. అలా జరగకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమేనని మోదీ చెప్పారు. ఆ సమయంలో దేశ ప్రజలకు ఉచిత రేషన్‌ ‌వంటివి ప్రకటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన చేయూతను గురించి గుర్తు చేశారు. మిగతా దేశాలతో పోల్చి చూస్తే ఇక్కడ తక్కువ వ్యాపించిందని ఎన్నో ప్రాణాలు కాపాడుకోగలిగామని మనకు ఉన్న సదుపాయాలు తక్కువే అయినా ఇది సాధించామని, కానీ ఇది ప్రశంసలకు వేళ కాదనీ మరింత మెరుగ్గా పనిచేయాలని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వ్యాక్సిన్‌ ‌తెచ్చిన శాస్త్రవేత్తలను స్మరించుకోవాలని మళ్లీ చెప్పారు. అంతేకాదు, గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌ ‌రూపు దిద్దడానికి హైడ్రోజన్‌ ‌మిషన్‌ ‌కూడా ప్రధాని ప్రకటించారు. స్వతంత్ర భారత శతాబ్ది ఉత్సవాల నాటికి ఇంధన రంగంలో మనం స్వయంసమృద్ధిని సాధిస్తామని, నేను ఈ విషయాన్ని త్రివర్ణ పతాకం సాక్షిగా చెబుతున్నానని కూడా మోదీ చెప్పారు. రెండు మేకిన్‌ ఇం‌డియా వ్యాక్సిన్లు తయారు చేసిన సంగతిని కూడా ఆయన సగర్వంగా చెప్పారు.

ఈ దేశాన్ని కలిపి ఉంచడమే ఇవాళ్టి సవాలు. దానిని మోదీ మొదటి నుంచి స్వీకరిస్తున్నారు. అందుకే దేశం నలుమూలలకు రైళ్లు నడపడం ద్వారా సయోధ్య ఏర్పరిచే ఒక పథకాన్ని ప్రకటించారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌నిర్వహించే 75 వారాల్లో 75 రైళ్లను కొత్తగా పరిచయం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాల రాజధానులన్నీ కలిపే విధంగా కూడా రైళ్లు నడుపుతామని ఆయన చెప్పారు.

ఏ దేశానికైనా గతం దిక్సూచి వంటిదే. ఆ శాశ్వత సత్యాన్ని ఎరిగినవారు నరేంద్ర మోదీ. ఎప్పుడు అవకాశం వచ్చినా స్వాతంత్య్ర సమరాన్ని, దానిని నడిపించిన వారిని ఆయన స్మరించుకుంటూనే ఉంటారు. గాంధీజీ, సర్దార్‌ ‌పటేల్‌, ‌నెహ్రూ, సుభాస్‌ ‌బోస్‌, ‌డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌వంటి మహనీయులను ఈ సందర్భంగా కూడా మోదీ స్మరించుకున్నారు. కానీ ఆయన 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతజాతి నిర్వర్తించవలసిన మరొక బాధ్యత గురించి కూడా వెల్లడించారు. అది దేశ విభజన వేళ జరిగిన ఘోర చారిత్రక తప్పిదాల కారణంగా చనిపోయిన అమాయక భారతీయులను స్మరించుకోవడం. ఇక నుంచి ప్రతి ఆగస్ట్ 14‌న ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని ఆయన జాతిని కోరారు. వాటిని తలుచుకుంటే మనసు వికలం కావడం తథ్యం. అయినా వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించడం నేటి భారతీయుల కర్తవ్యం. ఆజాదీ కా అమృతోత్సవ్‌ ఉద్దేశమే స్థానిక చరిత్రలను వెలుగులోకి తేవడం. మరుగున ఉండిపోయిన త్యాగాలను గుర్తించడం.

ఒక మంచి కవితతో ప్రధాని తన ప్రసంగం ముగించారు. దీనితో ఆయన ఉపన్యాసానికి మరింత శోభ వచ్చింది. అది-

‘ఇదే సరైన సమయం. దేశానికి అత్యంత కీలకమైన సమయం.

అసంఖ్యాకమైన ఆయుధాలు మన దగ్గరున్నాయి.

దేశభక్తి ప్రతిచోటా పొంగిపొరలుతున్నది.

అందరూ కదలిరండి! త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి!

దేశ భవితను సమున్నతంగా రెపరెప లాడించండి!’

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE