– ‌గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

ఒకళ్లా, ఇద్దరా ఎందరో రావడం ఆక్రమించు కోవడం వాళ్ల చరిత్ర రాసుకోడం, ఆర్యులు, ఆఫ్గన్లు, మొగల్స్, ‌బానిస వంశం తుగ్లకులు, సయ్యద్‌ ‌లోడీలు ఓ వంశం నుంచి, మరో వంశానికి, ఓ తరం నుంచి మరో తరానికి, ఓ యుగం నుంచి మరో యుగానికి, వాళ్ల భవనాలు, కోటలూ, తోటలూ, సమాధులూ, ఇరుకు సందులూ, స్మశానాలూ, వాటి మధ్య మనం, మన మధ్య అవి. ప్రపంచంలోనే అతి గొప్ప చారిత్రాత్మక పట్టణం.’’

‘‘చాలా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చావు. థాంక్స్. ‌గైడ్‌గా పనికొస్తావు, డిగ్రీ అయ్యాకా ట్రావెల్స్, ‌టూరిజం కోర్సు చేసి ఉండాల్సింది, అనవసరంగా ఈ లాంగ్వేజీలు నేర్చుకుని ఉద్యోగం చేస్తున్నావు.’’

సుధీర నవ్వేసింది.

‘‘అలాగే నవ్వుతూ ఉండండి, చాలా అందంగా ఉన్నారు.’’

ఆ మాటకి సిగ్గు పడింది. దాన్ని కనిపించ నివ్వలేదు. తల ఓ పక్కకి వంచి, రోడ్డు వైపు చూసింది.

‘‘ఆకలేస్తున్నట్లుగా ఉంది. తినేసి కుతుబ్‌మినార్‌, ‌హుమయూన్‌ ‌టూంబ్‌ ‌చూసాకా అక్కడ మిమ్మల్ని టాక్సీ ఎక్కిస్తాను. లోడీ గార్డెన్స్ ‌బావుంటుంది కానీ లోపల చాలా దూరం నడవాలి. మరి, టైం సరిపోతుందో లేదో.’’ అంటూ కారుని ఓ పక్కగా ఆపి టైం చూసుకుంది.

రామ్‌లీలా మైదాన్‌ ‌దగ్గర నుంచి నడుచుకుంటూ అడ్డొస్తున్న రిక్షాలని మనుషుల్ని తప్పించుకుంటూ, వెళ్తున్నారు.

‘‘ఇక్కడ రకరకాల పరాఠాలు, కచోడీలు, దహీబల్లాలూ, స్వీట్లూ అన్నీ ఉంటాయి.’’

‘‘అవన్నీ నాకు తెలీదు, కానీ హాయిగా తినగలిగేది, కారాలూ, మసాలాలూ అవి ఏం లేకుండా ఉండేలాంటిది చూడండి.’’

‘‘ఏం పరవాలేదు. ఏం కాదు. ఇది తినకుండా మీరు వెళ్తే ఈ ట్రిప్‌ ఇన్‌కంప్లీట్‌ అవుతుంది.’’

ఆ సన్న సందుల్లోంచి మనుషుల్ని తప్పించు కుంటూ అలాగే ఆగుతూ తింటూ తిరిగారు. ఇక్కడ ఇది తినాల్సిందే, బావుంటుంది, మరెక్కడా ఈ రుచి ఉండదు. ఇది ఇక్కడ ఫేమస్‌. ‌మా ఫ్రెండ్స్‌తో చాలా సార్లు తిన్నాను, అంటూ ఓ నాలుగు రకాలు తినిపించింది.‘‘రెండు అయింది’’ అని వాచీ చూసుకుంటూ అన్నాడు.

‘‘ఇంక కుతుబ్‌మినార్‌ ‌వెళ్దాం.’’

టికెట్‌ ‌తీసుకుని కుతుబ్‌ ‌కాంప్లెక్స్ ‌లోపలికి వెళ్తూనే విక్రాంత్‌ ‌ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టాడు. సుధీర ఫొటోలు ఆమెకి తెలీకుండా తీసాడు.

‘‘ఇక్కడ ఈ కాంప్లెక్స్‌లో మదర్సాలు (ఉర్దూ స్కూళ్లు), మసీదులు, ఇల్టుమష్‌, అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ సమాధులు, ఈ కూలిన గోడలు అన్నీ చరిత్రలో మిగిలిపోయిన ఆనవాళ్లు. వీటిని కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‌తరవాత ఇల్టుమష్‌, అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ కట్టారు. ఇక్కడ కూడా అన్నీ సమాధులే. ఈ ఐరన్‌ ‌పిల్లర్‌ ‌ప్రత్యేకత ఏంటంటే తుప్పు పట్టదు. ఏ లోహం కలిపారో కానీ, పరిశోధనలు జరుపుతున్నా కనుక్కోలేక పోయారు దాని మీద ఉన్న అక్షరాలు ఉర్దూ, పార్శీ కాదు. మన భాష. సంస్కృతం లాగా అనిపిస్తుంది. ఏదో రాజుని చంపి, అతని రాజ్యాన్ని ఆక్రమించి, ఈ పిల్లర్‌ని అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినట్లుగా ఉంది. ఇలా ఈ చరిత్ర అంతా తెలుసుకుంటూంటే బాధ కలుగుతుంది.’’ అంటూ వాచి చూసుకుంది.

‘‘మనకింక టైం ఎక్కువ లేదు. వెళ్తూ వెళ్తూ పైనుంచే హుమయూన్‌ ‌టూంబ్‌ ‌చూద్దాం. దాని లోపలికి వెళ్లి చూసేంత సమయం మనకి ఉండదు. ఇంక మనం బయల్దేరుదాం. ఇప్పుడు వెళ్తేనే నయం. ఎందుకంటే ట్రాఫిక్‌ అం‌త ఎక్కువ ఉండదు. అయినా ఎంత లేదన్నా ఓ గంట పడుతుంది.’’

బయటికి వస్తూ, అక్కడ కాంప్లెక్స్‌లో కనిపించిన ఆర్కియాలజీ దుకాణంలో ఢిల్లీ గురించిన పుస్తకాలు ఓ నాలుగు కొన్నాడు విక్రాంత్‌.

‌దారిలో సుధీర ఏం మాట్లాడలేదు. ఇంతవరకు అంశూ, సంగీత్‌ ‌గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్తూంటే గుర్తుకు రాగానే ఏం మాట్లాడాలని అనిపించడం లేదు. మౌనంగా కారు నడుపుతోంది. విక్రాంత్‌ అమెరికా జీవితం, తన ఊరు, అక్కడి వాతావరణం, అమెరికాతో కంపేరిజన్‌ ‌చెప్తూంటే నిశ్శబ్దంగా వింటోంది.

హుమయూన్‌ ‌సమాధిని పైనుంచే చూపించింది. ఆ తరవాత కారుని ఓ చోట ఆపింది.

‘‘మీరు ఇంకొక్క రోజుంటే షిమ్లాకి తీసుకెళ్లేదాన్ని, ఇప్పుడు చాలా బావుంటుంది. డిసెంబరు నెలాఖరుకి వస్తే వైట్‌ ‌క్రిస్టమస్‌ని చూసేవాళ్లం. నేను మా కొలీగ్స్‌తో కలిసి ఓ నాలుగు సార్లు వెళ్లాను. అంతా మంచు, కుఫ్రీ, నాల్డేరా అయితే ఇంకా బావుంటాయి. ఇంకో రెండు రోజులు ఉండకూడదా?’’

‘‘ఉండచ్చు. కాని ఇప్పుడు మాత్రం కాదు.’’ ఈసారి ఆమె కళ్లల్లోకి చూస్తూ. సుధీర కలవర పడింది. చూపులు తిప్పుకుంది. మాట మార్చింది.

‘‘నాకు ఇక్కడినుంచి నొయిడా దగ్గర, మీరు ఇక్కడినుంచి టాక్సీ తీసుకెళ్తే మంచిది. మీకు అడ్రస్‌ ‌తెలీదు కాబట్టి, అప్పారావు అంకుల్‌కి ఫోన్‌ ‌చేసి టాక్సీ బుక్‌ ‌చేయమని చెప్పండి.’’

‘‘ఓకే’’ అంటూ ఇంటికి ఫోన్‌ ‌చేస్తాను, ఊబర్‌ ‌బుక్‌ ‌చెయ్యమని అంటూ ఫోన్‌ ‌చేసాడు.

‘‘అలాగే. యా యా… రైట్‌.. ‌డెఫినిట్లీ. సీ యూ’’ అంటూ సెల్‌ ఆపేసి సుధీర వైపు చూసాడు.

‘‘ఆంటీ, అంకుల్‌ ‌మిమ్మల్ని కూడా ఇంటికి రమ్మంటున్నారు. వచ్చేయండి.’’ అన్నాడు విక్రాంత్‌.

ఇబ్బందిగా చూసింది.

‘‘ఇంత దూరం వచ్చారు. ఇక్కడికి దగ్గరే కదా?’’

‘‘దగ్గర, దూరం అని కాదు. ఇక్కడి నుంచి అంకుల్‌ ‌వాళ్లింటికి, అక్కడకి వచ్చాకా కాస్సేపు కూచోవాలి కదా, మళ్లీ అక్కడి నుంచి మా ఇంటికి.. ఇప్పుడు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇల్లు చేరుకోవడానికి నాకు కనీసం ఓ రెండు గంటలైనా పడుతుంది. సారీ మీ టాక్సీ వచ్చే వరకూ ఉంటాను. మీరు ఎక్కాకా నేను వెళ్తాను’’

ఓ పది నిమిషాల తరవాత టాక్సీ వచ్చింది. అది వచ్చే వరకూ కార్లో కూచునే ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.

‘‘ఓకే. నో ప్రాబ్లం. థాంక్యూ, సుధీరా. నాకు మీ ఊరు చూపించావు. ఓ అతిథికి ప్రాముఖ్యం ఇచ్చి, అతిథి దేవో భవ అని నిరూపించుకున్నావు. నువ్వు బాగా అలసిపోయావు. వెళ్లగలను. ఓకే’’ మరోసారి థాంక్స్ అని కారు దిగి తలుపు వేసాడు.

కారు దిగిన మరుక్షణంలోనే మళ్లీ ఫోన్‌.

‘‘‌సుధీరా, మీకే ఫోన్‌’’ అం‌టూ సెల్‌ ‌సుధీర కిచ్చాడు. విక్రాంత్‌ ‌సుధీరా అని పిలిస్తే కొత్తగా అనిపించింది ఆమెకి.

‘‘సుధీరా ఇంత దూరం వచ్చావు. విక్రాంత్‌ని తీసుకుని రా. మంచి చిక్కటి కాఫీ ఇస్తాను. నీ అలసట కాస్త పోతుంది.’’

‘‘లేదాంటీ, నేను వెళ్లిపోతాను. మరోసారి, ఎప్పుడైనా.’’

‘‘నీ ఇష్టం. థాంక్యూ సుధీరా. విక్రాంత్‌కి సిటీ చూపించినందుకు.’’

సుధీర ఏం మాట్లాడలేదు. నవ్వేసింది. విక్రాంత్‌ ఆమెనే చూస్తున్నాడని, గమనిస్తున్నాడని గుర్తించింది.

మరో గంటకి సుధీర ఇంటికెళ్లింది.

ఇంటికెళ్లేసరికి తలుపు తీసిన స్వర్ణ కూతుర్ని పరీక్షగా చూసింది.

‘‘వచ్చావా, ఇప్పుడే అనుకుంటున్నాం, సుధీర ఇంకా రాలేదే అని. పాపం బాగా అలసిపోయావు. కూచో మంచినీళ్లు తెస్తాను’’ తల్లి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.

సుధీర బ్యాగ్‌ని సోఫా పక్కనున్న చిన్న టేబుల్‌పైన పడేసింది. బయట అన్ని గంటలు తిరగడం మూలంగా ఒళ్లంతా చీదరగా ఉంది. ఫ్యాన్‌ ‌వేసుకుని, అలసటగా సోఫాలో కూచుంది. స్వర్ణ కూడా కూతురి పక్కన కూచుంది. మరోసారి ఆశ్చర్య పోయింది.

‘‘వచ్చావా, విక్రాంత్‌కి ఏం చూపించావ్‌, ఎన్ని చూపించావు, ఎక్కడెక్కడికి తీసుకెళ్లావు?’’ అంటూ తండ్రి కూడా గదిలోంచి బయటికి వచ్చాడు.

తల్లీతండ్రి విక్రాంత్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనిపించింది. తను కూడా ఇచ్చింది కదా. అది అంతా అమెరికా మహత్యమా!

‘‘ఏం అంటాడు, విక్రాంత్‌. ‌నీతో ఎలా ప్రవర్తించాడు. ఎక్కడ భోంచేసారు. బిల్లు ఎవరు పే చేసారు. ఏం మాట్లాడుకున్నారు?’’

‘‘ఏం లేదు. మామూలుగానే మాట్లాడుకున్నాము.’’ అంటూ లేచి గదిలోకి వెళ్లబోయింది. విక్రాంత్‌ ‌మీద ఆలోచనలు ఆమెని వదలడంలేదు. ఓ లోకంలోకి తీసుకెళ్తున్నాయి.

‘‘విక్రాంత్‌ ‌గురించి నీ ఉద్దేశం ఏంటి?’’

గదిలోకి వెళ్తున్న సుధీర ఆగి, వెనక్కి తిరిగి తల్లి కేసి చూసింది. తండ్రి కూడా సుధీరనే చూస్తున్నాడు. ఆ మాటలు అర్థం కాలేదు.

‘‘అంటే?’’

‘‘ముందు ఇలా కూచో, విక్రాంత్‌ ఎలిజిబుల్‌ ‌బ్యాచిలర్‌. ‌బాగా చదువుకున్నాడు, అమెరికాలో ఉద్యోగం. ఇంతకన్నా ఏం కావాలి. ఏ ఆడపిల్లకైనా’’

సుధీరకి తల్లి మాటలు అర్థమయ్యాయి. కానీ కానట్టుగా ఉంది.

‘‘ఒక్కడే కొడుకు. అక్కలు ఇద్దరు. వాళ్ల పెళ్లిళ్లయిపోయాయి. వేరే ఊళ్లల్లో ఉంటున్నారు. ఆస్తి అదీ బాగా ఉంది’’

ఆమెకి అంతా అర్థం అయింది. కానీ వెంటనే ఉత్సాహం చూపించడం ఇష్టం లేదు.

‘‘అయితే ఏం అంటావు ఇప్పుడు. నాకెందుకు చెప్తున్నావు ఈ విషయాలు. నేను బాగా అలిసిపోయాను. నన్నిప్పుడేం అడగకు.’’

‘‘ఇంతవరకూ జరిగింది ఓ విధంగా పెళ్లిచూపుల లాంటిది. పిల్లాడు అమెరికాలో ఉంటున్నాడు, పెళ్లి చేయాలనుకుంటున్నారని, నాలుగైదు సంబంధాలు వచ్చాయని వాళ్లని చూడడం కోసం ఇండియా వస్తున్నాడని విక్రాంత్‌ ఇం‌ట్లో వాళ్లు అప్పారావు గారికి, సుధాకర్‌కి చెప్పారట. వాళ్లకి నీ సంబంధం అయితే బావుంటుందని మాతో అన్నాడు. ఓ విధంగా సుధాకరే మధ్యవర్తిగా ఉన్నాడు’’

సుధీర ఏం మాట్లాడలేదు. కెనడా, అమెరికా, అన్నీ ఆమెని ఓ అందమైన ప్రపంచంలోకి లాక్కె ళ్తున్నాయి. అన్నిటి కన్నా ముందు విమానంలో ప్రయాణం. ఇంతవరకూ ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. ఇంతవరకూ టీవీలో చూసినవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తుంది. ఇలా ఎన్నో ఆలోచిస్తున్న ఆమె ఆ ఊహల్లోంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. కూతురి మౌనం స్వర్ణకి మరోలా అర్థం అవుతోంది.

‘‘బలవంతం ఏమీ లేదు. బాగా ఆలోచించుకో. నీకు నచ్చితేనే.’’

నాకు నచ్చాడు. నాకు ఇష్టమే అని వెంటనే సుధీరకి అనాలనిపించింది. కానీ అనలేదు.

‘‘మంచి పర్సనాలిటీ, తెలుపు కాకపోయినా నలుపు మాత్రం కాదు. చదువుంది, డబ్బుంది. ఒక్కడే కొడుకు. అన్నింటికి మించి అమెరికా. వద్దనడానికి కారణాలేం కనపడడం లేదు.’’ అంది స్వర్ణ.

‘‘వాళ్లది పల్లెటూరట’’ ఏదో అనాలని అంది.

‘‘నువ్వేం అక్కడే ఉండడం లేదు. ఏదో వెళ్లినా ఒక వారం పది రోజుల కోసం వెళ్తారు. అయినా అక్కడే ఉండే ఛాన్సే లేదు. అయినా ఈ పల్లెటూరు అదీ పెద్ద కారణాలుగా తీసుకోకు. ఇప్పుడు నీకు నచ్చడం ఒక్కటే కాదు, విక్రాంత్‌ ‌తల్లిదండ్రులు, నాయనమ్మ అందరికీ కూడా ఈ సంబంధం నచ్చాలి. వాళ్లు అంగీకరిస్తే మంచిదే. అంగీకరించకపోతే నువ్వేం బాధ పడకు. ఇది కాకపోతే మరోటి. మనం మాత్రం కష్టపడకుండానే వచ్చింది. కుదిరిందా సరే సరి. కుదర్లేదు. మరీ మంచిది.’’ అంది తేలికగా.

తల్లి తీసుకున్నంత తేలిగ్గా సుధీర తీసుకోలేక పోయింది. కుదరకపోతే తప్పకుండా బాధ పడ్తుంది.

తను నచ్చలేదంటే తనకి అవమానం కాదా. ఆ బాధ తల్లికి తెలీదు. తను తేలిగ్గా తీసుకోడం చాలా కష్టం.

ఈ సంబంధం కుదరాలి. ఆ ఇంట్లో వాళ్లకి తను నచ్చాలి. ఆమెకి ఆశ్చర్యం అనిపిస్తోంది. ఫ్రెండ్స్ ‌దగ్గర ఓ ఫెమినిస్ట్‌లా ఎన్నో మాటలు మాట్లాడే తను, వాళ్లకి నచ్చాలి అని తను అనుకోవడం ఏంటీ, వాళ్లు తనకి నచ్చాలి అని అనుకోవాలి.

ఓ వారం రోజులు మనసు మనసులో లేదు. అన్యమనస్కంగానే ఆఫీ సుకి వెళ్తోంది, వస్తోంది.

అంశూతో చాందినీ చౌక్‌ ‌వెళ్లింది. సంగీత్‌కి డాన్సు ప్రాక్టీసు చేస్తూ స్కైప్‌ ‌చూస్తూ స్టెప్పులు చేస్తున్నా ఆలోచనలన్నీ విక్రాంత్‌ ‌మీదనే వెళ్తున్నాయి.

విక్రాంత్‌ ‌పెళ్లిచూపుల కోసం వచ్చాడా, తన అందాన్ని మెచ్చుకున్నాడు, ఒకసారి కాదు, రెండు సార్లు మెచ్చుకున్నాడు.

కన్నాట్‌ ‌ప్లేస్‌లో, కుతుబ్‌ ‌మినార్‌లో, ఎర్రకోట గేటు దగ్గర, ఎన్నో ఫొటోలు తీసాడు. అంటే తను నచ్చినట్లు కాదా!

ఒకవేళ వాళ్ల ఇంట్లో వాళ్లకి నచ్చకపోతే. అప్పుడు ఏంటి? విక్రాంత్‌ ‌కాకపోతే మరో విరాట్‌ అని అనుకోగలదా! అంత సులభంగా మనసుని కన్విన్స్ ‌చేయగలదా!

అయినా ఓ మనిషి నచ్చిందో లేదో, అని ఒక్క మాట చెప్పడానికి ఇన్ని రోజులా? తెలీకుండా వాళ్ల అభిప్రాయం కోసం ఎదురుచూసింది. విక్రాంత్‌కి తను తప్పకుండా నచ్చుతుంది. ఆ విషయం అతని మాటల్లో గ్రహించింది.

మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ కలర్‌ ‌మీకు బాగా నప్పింది, అతని చూపులు, మాటలూ అన్నీ గుర్తు చేసుకుంటూంటే, విక్రాంత్‌కి తను నచ్చక పోవడం అన్న ప్రశ్న రానే రాదు. కాకపోతే అతనింట్లోని పెద్ద వాళ్లకి కూడా నచ్చాలి. తెలీకుండా దేవుడిని అదే కోరుకుంటోంది.

ఆమెకి తనేంటో తనకే అర్థం కావడం లేదు. ఎందుకింత ఆరాట పడుతోంది? వాళ్లకి నచ్చాలి అని ఎందుకంతగా అనుకుంటోంది? తనకి నచ్చాలి అని ఇంట్లో వాళ్లు ఎందుకనుకోవడం లేదు? ఓ విధంగా చూస్తే తను కూడా అనుకోవడం లేదు. ఓ మామూలు ఆడపిల్ల లాగా ఆలోచిస్తోంది. ఢిల్లీ లాంటి ఊళ్లో చదువుకుని, ఉద్యోగం చేస్తున్న తను డిఫరెంట్‌గా ఆలోచించాలి. ఇది వరకు ఓ ఫెమినిస్ట్‌లా ఆలోచించేది, మాట్లాడేది.

కాలేజీలో, ఆఫీసులో ఎన్నోసార్లు మగపిల్లల గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడుకునే వాళ్లు. మనం వాళ్లకి అణిగి మణిగీ ఉండకూడదు. మనకీ ఓ వ్యక్తిత్వం ఉంది. కట్నాలు ఇవ్వకూడదు. అలా అడిగినవాడిని చేసుకోకూడదు. భార్యని ఎన్నో ఊళ్లు తిప్పాలి. భార్యని గౌరవించాలి. భార్య మాట వినాలి.

ఇలా ఎన్నో మాట్లాడుకునే వాళ్లు. అభిప్రాయాలు కలవాలి. అన్ని విధాలా మనం మగవాళ్లకి సమానం. అలాంటప్పుడు మనం వాళ్లకి ఎందుకు లొంగాలి? వాళ్ల ఆధిపత్యాన్ని ఎందుకు అంగీకరించాలి? ఎక్కడ ఏ వార్త వచ్చినా ముందుగా స్పందించడం, దాని గురించి వాదించుకోడం.

అలాంటి తను ఈ సమయాన డిఫరెంటుగా ఆచిస్తోంది, ఎక్కడో అంతరాంతరాల్లో విక్రాంత్‌ ఇం‌టి వాళ్ల నుంచి పాజిటివ్‌ ‌జవాబుకోసం ఎదురు చూస్తోంది. ఓ విధంగా విక్రాంత్‌కి సరెండర్‌ అయి పోయింది. అది విక్రాంత్‌కా, అతని అమెరికాకా ఆమెకి తెలీదు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE