రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై దాడికి దిగింది. గత ఏడాది మాతృభాషను తొలగించి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలు అంగీక రించని రీతిలో వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను తగ్గించింది. పీజీ కోర్సులకు రీయింబర్స్ మెంట్ సదుపాయం తీసివేసింది. ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్థలపై దాడికి దిగింది. విద్యాసంస్థల స్థలాలు ప్రభుత్వ పరం చేస్తేనే ఆర్ధిక సహాయం చేస్తామని, లేకుంటే నిలిపి వేస్తామని పేర్కొంటూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలన మైంది. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య ఏర్పడిన ఈ ఘర్షణతో పేద విద్యార్థులు నష్టపోతున్నారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా 4.80 లక్షల మంది విద్యార్థులకు అందుబాటులో ఉంటూ నామమాత్రపు ఫీజుతో ప్రాథమిక, ఇంటర్, డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. 1,972 పాఠశాలల్లో 1,97,291 మంది విద్యార్ధులు; 120 జూనియర్ కళాశాలల్లో 31వేల మంది; 137 డిగ్రీ కళాశాలల్లో 2.50లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం సొంతగా విద్యాసంస్థలు నిర్వహించలేకే ఈ సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు బోధనా, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించే యోచనలో ఉన్నాయి. తమ స్థలాలను వదులుకోడానికి సిద్ధంగా లేవు. అయితే ప్రైవేటుగా కోర్సులను నిర్వహి స్తామని చెబుతున్నాయి. దీంతో పేద విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకుంటే విద్య ఖరీదైనదిగా మారిపోతుంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు ఏడాదికి రూ. 1000 లోపు, ఇంటర్‌కు రెండేళ్లకు కలిపి రూ.10 వేల వరకు, డిగ్రీకి ఏడాదికి కోర్సును బట్టి రూ.7 వేల నుంచి పది వేలవరకు ఫీజులున్నాయి. ఎయిడ్ లేని కోర్సులకు ఏడాదికి రూ. 25 వేల నుంచి 35 వేల వరకు ఫీజులు వసూలుచేస్తున్నారు. ఇప్పుడు పాత ఫీజులతో కాలేజీలను నడపడం కష్టం. దీంతో ఫీజులు పెంచక తప్పదు. ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకుంటున్న వారిలో 90 శాతం మంది పేద కుటుంబాల వారే. ఫీజుల పెంపుదల వారికి భారంగా మారుతుంది.
బీఏ, బీకాం, బీఎస్సీలు కనుమరుగేనా?
సాంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీలకు మాత్రమే తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో ఎయిడ్ ఉంది. వీటికి తక్కువ ఫీజు ఉండటంతో టీచింగ్‌కు వెళ్లాలను కునేవారు, పేదపిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు వీటి ఫీజులు రెండింతలైతే ఇక చదివేవారుండరు. బీఏ కోర్సుకు ఏడాదికి రూ.20 వేలు నిర్ణయిస్తే ఎవరూ చేరరు. బీఎస్సీకి రూ.30 వేలు నిర్ణయిస్తే ఆదరణ ఉంటుందా అనేది సందేహమే. ఉపాధ్యాయ వృత్తుల్లోకి వెళ్లాలనుకునేవారు బీఏ, బీఎస్సీ కోర్సులే చదవాలి. వీటిలో రీస్ట్రక్చర్డ్ కోర్సులు చదివితే బీఈడీకి అనుమతి లేదు. అందువల్ల ఈ కోర్సుల ఫీజులు పెంచితే ఎవరూ చేరని పక్షంలో భవిష్యత్‌లో ఇక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవారుండరు. దీంతో మానవ వనరులను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇప్పుడు రద్దయిన ఎయిడెడ్ కోర్సుల్లో చదువుతున్న 2.50 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు ఎక్కడ చదువు కోవాలనేది ప్రశ్నార్దకంగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు జిల్లాకు పది నుంచి 12 చొప్పున ఉన్నాయి. అయితే పట్టణాల్లో ఒకటి మాత్రమే ఉంది. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో 5 నుంచి పది వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ పది కళాశాలల్లోని విద్యార్థులు 30 నుంచి 40 కి.మీ.దూరంలో ఉన్న మరో ప్రభుత్వ కళాశాలల్లో చేరాలి. అయితే ఈ మేరకు ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు, తరగతి గదులు పెంచలేదు.
నియామకాలకు ఎసరు?
ఎయిడెడ్ పాఠశాల సిబ్బందిని ప్రభుత్వ పాఠశాలల్లో కలపడం వల్ల నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 1,972 పాఠశాలల్లో సుమారు 11వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయడం వల్ల కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఉండవని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఎయిడెడ్ డిగ్రీ విద్యాసంస్థల్లో 1091 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నియమించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 400 ఖాళీలే ఉన్నాయి. 700 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పిస్తే ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. ఇప్పుడు అధికంగా ఉన్న అధ్యాపకులను ఎక్కడ వినియోగిస్తారనేది ప్రశ్నార్థకం. ఒప్పంద అధ్యాపకులను ఏం చేస్తారనేది మరో సమస్య.
కొత్త కాలేజీలు ఎందుకు కట్టలేదు
ఎయిడెడ్ కళాశాలలపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితి గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. రాజధాని నిర్మించకుండా ఆంధప్రదేశ్‌ను విభజించినట్లు కళాశాలలు నిర్మించకుండా ప్రభుత్వం అధ్యాపకులను వాపసు తీసుకుంటోంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే బదులు ఈ ఏడాది ముందుగా కొత్త కళాశాలల భవనాలు నిర్మించి అప్పుడు ఎయిడెడ్ సహాయం నిలిపివేస్తే విద్యార్ధులకు సమస్యలు తప్పేవి. సంక్షేమాల పేరుతో ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 100 డిగ్రీ కళాశాలలను నిర్మించడం కష్టమేమీకాదు.
ఖాళీ ఖజానాలతో పంచాయతీలు
గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నో హామీలిచ్చి ఎన్నికైన సర్పంచ్‌లు ఖాళీ ఖజానాను చూసి ఉసూరుమంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 80శాతానికి పైగా పంచాయతీ లను వైకాపా కైవసం చేసుకుంది. అంటే 80 శాతం సర్పంచ్‌లు వైకాపాకు చెందినవారే. ఇప్పుడు వారే పంచాయతీల పట్ల రాష్ట్ర వివక్షను చూసి తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధులు విడుదల చేస్తాయి. ప్రతి పంచాయతీకి ఆర్థిక సంఘ నిధులు జనాభా ఆధారంగా వస్తుంటాయి. ఆర్థిక సంఘం ద్వారా ఎంత నిధులు వస్తాయో సర్పంచ్, కార్యదర్శి ఇతర అధికారులకు అవగాహన ఉంటుంది. అలాగే ఆ నిధులతో ఇతర వనరులు అనుసంధానం చేసి సర్పంచ్‌లు అభివృద్ధి ప్రణాళికలను రూపొందించు కుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు వచ్చే నిధులను దారి మళ్లిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అయిన వెంటనే సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దుచేసి, ఆ నిధులను ప్రభుత్వం తన ఖాతాలో బదలాయించుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు పంచాయతీ సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను ఇచ్చింది. ఆర్దిక సంఘం విడుదల చేసిన నిధులను పంచాయతీల అభివృద్దికి కేటాయించకుండా ఏకపక్షంగా విద్యుత్ బిల్లులకు చెల్లించారు. గతంలో కలెక్టర్ సూచనతో విద్యుత్ బిల్లులు వాయిదాల పద్దతిలో చెల్లించేవారు. ఇప్పుడు అదేమీ లేకుండా ఏకపక్షంగా సర్పంచులకు తెలీకుండా అర్దిక సంఘం నిధులు జమచేసుకున్నారు.
జమ కాని రిజిస్ట్రేషన్ సర్ చార్జీలు
పంచాయతీకు రిజిస్ట్రేషన్ సర్‌చార్జి నిధులు జమకావటం లేదు. ప్రతి జిల్లాలో స్వరూపాన్ని బట్టి 800 నుంచి వెయ్యి వరకు గ్రామ పంచాయతీ లుంటాయి. ఏటా ప్రతి జిల్లాలోని గ్రామ పంచాయతీ లకు సుమారు రూ.100 కోట్లకు పైగా సర్ చార్జి నిధులు సబ్‌రిజిష్టార్ కార్యాలయాల నుంచి జమ అవుతుంటాయి. 2017-18 నుంచి అన్ని జిల్లాలకు కలిపి సుమారు 700 కోట్ల నిధులు జమ కావాలి. నిధులు రాకపోవటంతో జనరల్ ఫండ్ తగ్గిపోయింది. పంచాయతీలు 2018 ఆగస్టు నుంచి మొన్నటివరకు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. వీరు రిజిస్ట్రేషన్ సర్‌ఛార్జి నిధులను జమచేయించటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రణాళికలు రూపొందించి కాలం వెళ్ళబుచ్చారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్పంచ్‌లు గ్రామాలలో ఏ పని చేయాలన్నా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో గ్రామ పంచాయతీలకు ఇచ్చే సీఎం ఎఫ్ ఎస్ నుంచి నిధులు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం దారి మళ్లీంచారంటున్నారు. ఇలా పనులు చేసుకోడానికి నిధులు లేక తాము ఎన్నికై ప్రయోజనం ఏమిటని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
పన్నులపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి
ఇదిలా ఉంటే మునిసిపాలిటీలలో ఆస్తి, చెత్త పన్నులను పెంచాలని ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలితంగా పన్నులు పెరిగాయి.
మున్సిపాలిటీలకు ఎన్నికయిన సంస్థలు ఆస్తి, చెత్త తదితర పన్నులను స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంది. కాని ఈ అధికారాన్ని కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పన్నులను నిర్ణయిస్తున్నందున ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ చర్యలు పూర్తిగా అప్రజాస్వామికం.
నిర్మాణాలకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు నమ్మకపోవడంతో ఏ పనీ జరగడం లేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయడం లేదు. కొత్తవి నిర్మించడం లేదు. ముఖ్యంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ హైవేలు తప్పించి, రాష్ట్ర హైవేలు, అంతరజిల్లాల రోడ్లు, గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లన్నీ గోతులు పడి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రహదారినీ నిర్మించలేదు. విపక్షాల విమర్శలు, ప్రజల ఆగ్రహంతో రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు రూ.2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఒక్కరూ రావడం లేదు.
గతంలో నిర్మించిన రోడ్లకు బిల్లులు ఇవ్వక పోవడం, అధికారులు, నాయకుల కోరికలు తీర్చలేకపోవడం కూడా ఒక కారణంగా కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల యాజమాన్యంలో నిర్మించాల్సిన రోడ్లు, డ్రెయిన్ల పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో కాంట్రాక్టు పనుల కోసం కాంట్రాక్టర్లు పోటీ పడేవారు. నేతలను ఆశ్రయించి మరీ పనులు దక్కించుకునే వారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. నెలల తరబడి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. పనులు చేయాలంటూ ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు అభ్యర్ధించినా పాత బిల్లులు త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అప్పులు తెచ్చి కొత్త పనులు చేయలేమని కాంట్రాక్టర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు, అధికారులకు ఇది పెద్ద తలనొప్పిగా తయారవడంతో మీరు వేయకపోతే బయట కాంట్రాక్టర్లతో వేయిస్తామని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరభ్యంతరంగా వేసుకోవచ్చని.. ఇందుకు తమకు ఏ విధమైన అభ్యంతరం లేదంటూ కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాలేదు. వీటిలో జనరల్ ఫండ్స్, 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో చేసిన పనులు ఉన్నాయి. ఈ బిల్లులు రాకుండా కొత్త వాటికి తాము ఎలా పెట్టుబడి పెట్టగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఫండ్స్‌లో చేసిన పనులకు ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు జరగకపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయామని వాపోతున్నారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్