‘ఈ దేశంలో మమ్మల్ని బతకనివ్వరు. మా బతుకు ఏమైనా మా పిల్లనైనా కాపాడండి!’ అఫ్ఘానిస్తాన్‌లోని కాబూల్‌ ‌విమానాశ్రయంలో తల్లుల ఆక్రందనల సారాంశమిది. ఆ తల్లులు లేదా విమానం ఎక్కడానికి సిటీ బస్సు వెనుక పరుగెత్తిన రీతిలో పరుగులు తీసిన జనం, ఎవ్వరూ విదేశీయులు కారు. స్వదేశంలో ఉండడానికి ఇష్టపడని దుర్భరస్థితిలో ఉన్న అఫ్ఘానిస్తానీయులే. కంచె పైనుంచి పిల్లలను అవతలకి అందిస్తున్న తల్లులు, తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాల దగ్గర విలపిస్తున్న మహిళలు, కాల్పుల మోతకు హడలెత్తిపోతున్న పసివాళ్ల ఏడుపులు.. ఇప్పుడు ఇవే అఫ్ఘానిస్తాన్‌లో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు. ఇదంతా తాలిబన్‌ అనే మతోన్మాదం తలకెక్కిన ముష్కరమూకల  స్వైర విహారం ఫలితం. మళ్లీ అదే రష్యా, అదే అమెరికా, అదే పాకిస్తాన్‌, అదే చైనా, అదే సౌదీ అరేబియా ఇంతటి ప్రారబ్ధాన్ని ఆ చిన్న దేశం మీదకు తిరిగి తెచ్చాయి. ఇంత జరుగుతున్నా కొన్ని దేశాలు మధ్యయుగాల  ఆలోచనతో ఉన్న తాలిబన్‌తో కలసి పనిచేస్తామని ప్రకటించడం వికృతం. వంట రుచికరంగా లేదన్న సాకుతో ఒక మహిళను చిత్రహింసలు పెట్టి దహనం చేసిన దుర్ఘటనను ఆ దేశ మహిళా న్యాయమూర్తి ఒకరు దు:ఖంతో చెప్పినా అంతర్జాతీయ హక్కుల కార్యకర్తలు స్పందించకపోవడం ఎందుకో! ప్రపంచంలోని అకృత్యాలను పాక్షిక దృష్టితో చూసే నీచ మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా! 21వ శతాబ్దాన్ని మధ్యయుగంలోకి తీసుకుపోయేందుకు జరుగుతున్న రాక్షస ప్రయత్నం పట్ల  ప్రపంచం చోద్యం చూస్తోంది.     

మధ్య ఆసియా దేశం అఫ్ఘానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందకుండా ఉండడం సాధ్యంకాదు. కానీ ఆ పరిణా మాలపై తక్షణం స్పందించేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా లేవు. తాలిబన్‌ ‌గతంలో మాదిరిగా రాక్షసపాలన కొనసాగిస్తారా? శాంతియుత పంథాలో ప్రయాణిస్తారా? అన్నవి మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నలు. కానీ తాలిబన్‌ ‌మారలేదని చెప్పడానికి అవసరమైన ఆధారాలు ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా వెలువడ్డాయి.

అలాగే 1996-2001 మధ్య కాలంలో మాదిరిగా తాలిబన్‌ అరాచక పాలనను ప్రజలు భరిస్తారా? ఇది కూడా పెద్ద ప్రశ్న. ప్రతిఘటనలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉండరనే అర్ధమవుతున్నది. దీనికి తార్కాణమే అఫ్ఘాన్‌ ‌స్వాతంత్య్ర దినం ఆగస్టు 19న ప్రజలు తాలిబన్‌కు వ్యతిరేకంగా వీధుల్లో జరిపిన నిరసనలు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడతామని వారు ప్రతిన బూనారు. మరోపక్క ‘పంజ్‌ ‌షేర్‌’ ‌ప్రావిన్స్ ‌ప్రజలు తాలిబన్‌ను అడ్డుకున్నారు. దేశం మొత్తం తమ స్వాధీనంలోకి తీసుకున్న తాలిబన్లు పంజ్‌ ‌షేర్‌ ‌దగ్గర ప్రతిఘటన ఎదుర్కొంటున్న సంగతి అర్ధమైపోయింది. కాబూల్‌కు ఈశాన్యాన సుమారు వంద కిలోమీటర్ల దూరంలో విస్తరించిన ఈ ప్రావిన్స్ ‌గతంలో సోవియట్‌ ‌యూనియన్‌ (‌నేటి రష్యా) దాడిని సైతం ఎదిరించి నిలబడింది. అమెరికా సేనలనూ అడ్డుకుంది. కేవలం లక్షా 70వేల జనాభా గల ఈ ప్రాంతం పోరాటానికి మారుపేరు. తాలిబన్‌ అరాచకాన్ని మొదటినుంచీ అడ్డుకుంటోంది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్‌ ఈ ‌ప్రాంతవాసే. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేని సమయంలో ఉపాధ్యక్షుడే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారన్న ఆయన ప్రకటనపై తాలిబన్‌ ఇం‌తవరకూ స్పందించలేదు. వారికి లొంగిపోయే ప్రసక్తి లేదని సాలెహ్‌ ‌ప్రకటించడం విశేషం. ప్రస్తుతం సాలెహ్‌ ‌పంజ్‌ ‌షేర్‌ ‌నుంచే వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. తాలిబన్‌ను అడ్డుకునేందుకు ఎంతటి త్యాగానికి అయినా సిద్ధమని ఈ ప్రాంత నాయకుడు అహమ్మద్‌ ‌షా మస్సౌద్‌ (‌జూనియర్‌) ‌ప్రకటించారు. తాలిబన్‌ ‌ఫైటర్లు పంజ్‌ ‌షేర్‌ను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అఫ్ఘాన్‌ ‌జాతీయపతాకంతో తుపాకులకు ఎదురొడ్డి నిలుస్తున్న ప్రజల సాహసం, మహిళల ఆత్మస్థయిర్యం అద్భుతమనిపిస్తుంది.

సంక్షోభం నుంచి సంక్షోభానికి…

1919లో పాలకుడు అమీర్‌ అమానుల్లా ఖాన్‌ ‌బ్రిటిష్‌ ‌పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించు కున్నాడు. నిజానికి నాటి నుంచి అక్కడ శాంతి లేదు. తరువాత జహీర్‌షా రాజయ్యాడు. ఇతడి ప్రధాని జనరల్‌ ‌దావూద్‌. ఇతడే సోవియెట్‌ ‌రష్యాతో సన్నిహితంగా ఉండి, బురఖాను నిషేధించాడు. తరువాత ఇతడు రాజీనామా చేశాడు. కానీ 1973లో ప్రభుత్వాన్ని కూలదోసి దావూద్‌ ‌పాలకు డయ్యాడు. ఇతడు కూడా సోవియెట్‌ ‌రష్యా పన్నిన కుట్రలో చనిపోయాడు. ఆపై సోవియెట్‌ ‌రష్యా అనుకూల పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ అఫ్ఘాన్‌ను పాలించింది. దీని మీద తిరుగుబాటుకు బయలు దేరినవే ముజాహిదీన్‌ ‌మూకలు. వీరిని ప్రోత్సహించి నదే అమెరికా. ఇదంతా ప్రచ్ఛన్నయుద్ధ క్రీడ. 1979లో రష్యా నేరుగా అఫ్ఘానిస్తాన్‌లో చొరబడింది. 1980లో బబ్రక్‌ ‌కర్మాల్‌ను పాలకుడిని చేసింది. రష్యా అనుకూల కర్మాల్‌కు వ్యతిరేకంగా పోరాడేం దుకు ముజాహిదీన్‌లకు అమెరికాతో పాటు పాక్‌, ‌చైనా, ఇరాన్‌, ‌సౌదీ అరేబియా సాయపడ్డాయి. ముజాహిదీన్ల ఏకీకరణకు నాటి వేదిక పాకిస్తాన్‌. 1988‌లో అఫ్ఘాన్‌, ‌సోవియెట్‌ ‌రష్యా, అమెరికా, పాకిస్తాన్‌ ‌శాంతి ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం 1989లో రష్యా సేనల నిష్క్రమణ జరిగింది. ఆపై…? ముజాహిదీన్లు రష్యా తొత్తు అన్న పేరు పెట్టి నాటి అధ్యక్షుడు మహమ్మద్‌ ‌నజిబుల్లా కేంద్రంగా అంతర్యుద్ధం ఆరంభించారు. రష్యా అనుకూల నజీబ్‌ ‌ప్రభుత్వం కూలింది. ఇతడు భారత్‌ ‌శరణు కోరాడు. కానీ విమానం ఎక్కబో తుండగా పట్టుకున్నారు. పారిపోయి అమెరికా దౌత్యకార్యాలయ ప్రాంగణంలో తలదాచుకున్నాడు. అక్కడికే వెళ్లి తాలిబన్‌ అతడిని హింసించి, కాల్చి చంపి అధ్యక్ష భవనం ఎదుట దీపస్తంభానికి వేలాడదీశారు. అంటే అష్రాఫ్‌ ‌ఘనీ ఈ స్థితిని తప్పించుకున్నాడు.

ఇలాంటి సంక్షుభిత దశలో వచ్చినదే తాలిబన్‌. ‌పుష్తు భాషలో తాలిబన్‌ అం‌టే విద్యార్థులు అని అర్ధం. నజీబుల్లా పతనం, సోవియెట్‌ ‌సేనల నిష్క్రమణ తరువాత ఉత్తర పాకిస్తాన్‌ ‌ప్రాంతంలో ఈ వర్గం పెరగడం ఆరంభించింది. నిజానికి వీళ్లు అఫ్ఘాన్‌లో సోవియెట్‌ ‌రష్యా ప్రాబల్యం మీద పోరాడడానికి సౌదీ అరేబియా వంటి దేశాలు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ దేశాల నుంచి వచ్చినవారే. సున్నీ మత విశ్వాసాల ఆచరణ, ప్రబోధం వీరి ప్రధాన ధ్యేయం. సోవియెట్‌ ‌రష్యా మీద పోరాడిన తరువాత ఆయా దేశాల వారు వీళ్లని సొంత దేశాలకు రానివ్వలేదని అంటారు. అఫ్ఘాన్‌లో షరియా, ముస్లిం చట్టాల ప్రాతిపదికగా శాంతిని నెలకొల్పుతామంటూ బయలుదేరారు.

నెమ్మదిగా అఫ్ఘాన్‌ను ఆక్రమించుకుని 1996లో తాలిబన్‌ అధికారానికి వచ్చారు. వీరి ప్రభుత్వాన్ని పాక్‌, ‌సౌదీ అరేబియా వెంటనే గుర్తించాయి. అప్పుడే ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌హవా మొదలయింది. లాడెన్‌ ‌సోవియెట్‌ ‌రష్యా మీద పోరాడిన ముజాహిదీన్‌ ‌సంస్థలో స్వచ్ఛంద కార్యకర్త. వారి హయాంలో అతడు అఫ్ఘాన్‌లో ఉన్నాడు. ఆఫ్రికా ఖండంలోని పలు అమెరికా దౌత్య కార్యాలయాల మీద 1998లో బాంబులు కురిపించాడు. 2001 సెప్టెంబర్‌ 11 ‌నాటి అమెరికా దాడితో తాలిబన్‌కూ, అమెరికాకు జగడం విశ్వవ్యాప్తమైంది. లాడెన్‌ ‌కోసం నాటో దళాలు అఫ్ఘాన్‌ ‌వచ్చాయి. లాడెన్‌ను చంపినా తాలిబన్‌ ‌మీద, అంతర్జాతీయ ఉగ్రవాదం మీద అమెరికా     పై చేయి సాధించలేకపోయిందనే చెప్పాలి. 2009 అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసిన బరాక్‌ ఒబామా సేనల వెనక్కి తేవాలన్న నినాదం అందుకున్నారు. అఫ్ఘాన్‌తో చేస్తున్న సుదీర్ఘ యుద్ధాన్ని విరమిస్తున్నట్టు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌శాంతి ఒప్పందం మీద సంతకం చేశారు.అదే ఈ ఆగస్ట్ 30 ‌నాటికి పూర్తవుతుంది. ఇంతలోనే తాలిబన్‌ ‌వీర విహారం ఆరంభించారు.

మాటల్లోనే శాంతి…

ప్రస్తుతం తాలిబన్‌ ఇటు శాంతి మంత్ర జపం, అటు రక్తపాతం ఏకకాలంలో చేస్తున్నారు. విదేశీ నిధులు ఆగిపోకుండా ఉండేందుకే వారు శాంతి శాంతి అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వారి శాంతిని అంతర్జాతీయ సమాజం విశ్వసించడం లేదు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 950 ‌కోట్ల డాలర్లు (సుమారు 70,500 కోట్ల రూపాయలు)ను స్తంభింపజేశారు. తాలిబన్‌ ‌చేతికి నిధులు అందకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. తాలిబన్‌పై ఒత్తిడికి మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి జానెట్‌ ‌యెల్లెట్‌ ‌ధ్రువీకరించినట్లు వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌పేర్కొంది. అమెరికా బాటలోనే మరికొన్ని పాశ్చాత్య దేశాలు ప్రయాణించే అవకాశం ఉంది. ఇప్పటికే జర్మనీ నిధుల విడుదలను ఆపేసింది. అఫ్ఘాన్‌ ‌పరిణామలను తాము అంగీకరించలేనప్పటికీ మానవతావాదంతో ఆర్థిక సాయాన్ని 10 శాతం పెంచుతున్నట్లు బ్రిటన్‌ ‌ప్రకటించింది. ఈ మొత్తాన్ని తాలిబన్‌కు చిక్కనివ్వ బోమని, సామాన్యులకు, శరణార్థులకు అందేలా జాగ్రత్తలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి డొమినిక్‌ ‌రాబ్‌ ‌చెప్పడం కొంచెం ఊరట. అక్కడి శరణార్థుల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకు వచ్చేందుకు ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌, ‌హోంమంత్రి ప్రీతీ పటేల్‌ ‌కసరత్తు చేస్తున్నారని రాబ్‌ ‌వెల్లడించారు.

యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌తాలిబన్‌ను అసహ్యించుకుంటూ ఉంటే ఇంగ్లండ్‌ ‌ప్రేమ ఒలకబోయడం ఎందుకు? పాకిస్తాన్‌, ‌చైనాలకు వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. తాలిబన్‌ ‌భుజాల మీదుగా భారత్‌ ‌మీద తుపాకీ గురిపెట్టడం వాటి ఉద్దేశం. తాలిబన్‌ ‌తమ పాత సున్నీ మతాచరణను కాస్త కూడా వీడలేదు. అఫ్ఘానిస్తాన్‌లో ఇకపై ప్రజాస్వామ్యం అయితే ఉండదు. అమలు జరిగేది షరియానే అని ఘంటాపథంగా చెప్పేశాక కూడా ఈ దేశాలు ఎందుకు తాలిబన్‌ను సమర్ధిస్తున్నాయి? తాజాగా కాబూల్‌ను కైవసం చేసుకున్న తరవాత సాగిన హింసాకాండ చిన్నదేమీ కాదు. మహిళల పట్ల కూడా వారి వైఖరిలో మార్పు లేదనీ తేలింది. మహిళలు రాజకీయాల్లో చేరి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికవడం, పదవులు చేపట్టడం మీకిష్టమేనా అన్న ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్నకు ఓ చిరునవ్వే సమాధానమైంది. తాను విధులకు వెళ్లకుండా తాలిబన్‌ అడ్డుకుంటున్నారని రేడియో, టెలివిజన్‌ ‌మహిళా యాంకర్‌ ‌షబ్నమ్‌ఖాన్‌ ‌దవ్రాన్‌ ఆరోపించారు. తనకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని మరో మహిళా పత్రికారచయిత ఖదీజా గోడు వెళ్లబోసుకున్నారు. వీటికి లెక్కలేదు.

అఫ్ఘాన్‌ ‌ప్రజలే నమ్మడం లేదు

అసలు సామాన్య ప్రజలు వారిని నమ్ముతు న్నారా? తాలిబన్‌ ‌మీద భయంతో, ద్వేషంతో ప్రజలు దేశం వీడి వెళ్లేందుకు తంటాలు పడుతున్నారు. విమానం రెక్కలు పట్టుకుని, విమానంపైనా ప్రయాణించేందుకు కూడా సిద్ధం కావడం ప్రజల భయాందోళనలకు దర్పణం పట్టింది. తమ సంగతిని పక్కన పెట్టి కనీసం పిల్లలను అయినా కాపాడంటూ తల్లుల నుంచి వస్తున్న వేడుకోళ్లు దేశ దయనీయ పరిస్థితులకు నిదర్శనం. పౌరులకు, తమపై పోరాడిన సేనలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు ప్రకటించిన తాలిబన్‌ ‌కొద్ది సమయానికే ఆ మాట మర్చిపోయారు. తమపై పోరాడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటు న్నారు. హెరాత్‌ ‌ప్రావిన్స్‌లోని బాద్గీద్‌ ‌నగర పోలీసు కమిషనర్‌ ‌హజిముల్‌ను కిరాతకంగా కాల్చి చంపారు. ఆయన బేషరతుగా లొంగిపోయినప్పటికీ కళ్లకు గంతలు గట్టి కాల్పులు జరపడం వారి నైజాన్ని చాటుతోంది. షియా ముస్లిములపై దాడులకు తెగబడుతున్నారు. ఘజ్నీ ప్రావిన్స్‌లో షియా ముస్లిములే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఈ విషయం ఎవరో చెప్పినది కాదు. స్వయంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ‌సెక్రటరీ జనరల్‌ ఆగ్నెస్‌ ‌కాలమర్డ్ ‌వెల్లడించారు. 1996-2001 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా తాలిబన్‌ ‌వీరిపైన ఉక్కుపాదం మోపారు. షియాలనే అక్కడ ‘హజారాలు’ అని వ్యవహరిస్తారు. మీడియా స్వేచ్ఛను హరించబోమని మాటిచ్చిన తాలిబన్‌ ‌జర్మనీకి చెందిన ‘డాట్షే విల్లె’ వార్తా సంస్థ సంపాదకుడి బంధువులపై దాడి చేశారు. 15 ఏళ్ల లోపు బాలికలను తమకు ఇవ్వాలనీ, నాలుగు పదులు దాటిన విధవలను అప్పగించాలని తాలిబన్‌ ఆదేశించడం అత్యంత జుగుప్సాకరం కాదా! మహిళలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? బాలికలను ఎత్తుకెళుతున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి.

ఒప్పందం మేరకు అమెరికా దేశం విడిచి వెళ్లే పనిలో ఉంది. తమ పౌరులను, శరణార్థులను తీసుకు వచ్చేందుకు వాణిజ్య విమానాలను వాడుకోనున్నట్లు అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ‌ప్రకటించారు. ఆరు విమానాయాన సంస్థలకు చెందిన 18 విమానాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వివిధ దేశాలు వారి పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. కాబూల్‌లోని తమ వంద మంది సిబ్బందిని ఐక్యరాజ్య సమితి పొరుగున కజికిస్తాన్‌కు తరలించింది.

భారత్‌ ఆపన్నహస్తం

అఫ్ఘాన్‌ ‌శ్రేయోభిలాషిగా, ఆ దేశానికి ఆపన్న హస్తం అందించిన దేశంగా, ఓ సరిహద్దు దేశంగా భారత్‌ ‌మాత్రం అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేం దుకు తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేస్తోంది. తాలిబన్‌ను వాడుకుంటూ భారత్‌లో అంతర్గత తీవ్రవాదాన్ని పెంచడం, కశ్మీర్‌లో అస్థిరత సృష్టించడంపై పాక్‌ ‌దృష్టి పెట్టింది. ఎప్పటినుంచో పాక్‌ ఈ ‌పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అఫ్ఘాన్‌లో తాలిబన్‌ ‌పట్టు బిగించడంతో పాక్‌ ఈ ‌పక్రియను వేగంగా అమలు చేస్తుందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో కశ్మీర్లో పట్టుబడ్డ ఉగ్రవాదులలో తాలిబన్‌ ‌కూడా ఉండటం గమనార్హం. పాక్‌, ‌చైనా దన్నుతో వీరు మున్ముందు భారత్‌లో విధ్వంసానికి దిగే ప్రమాదం లేకపోలేదు. తాలిబన్‌తో అఫ్ఘాన్‌ ‌శాంతికే విఘాతమనుకోవడం పొరపాటు. వారి ధోరణి, ఆలోచన ప్రపంచశాంతికే విఘాతమని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా భారత్‌ ‌కాబూల్‌లోని రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించింది.

తాలిబన్‌ ‌రాకతో గత 20 ఏళ్లల్లో సాధించిన ప్రగతి బూడిదలో పోసిన పన్నీరైందని ఆ విమానంలో వచ్చిన భారత సంతతికి చెందిన సిక్కు పార్లమెంటు సభ్యుడు నరేంద్ర సింగ్‌ ‌ఖల్సా ఆవేదన వ్యక్తం చేశారు. కాబూల్‌, ‌దుషాంబేల నుంచి 392 మంది పౌరులను భారత ప్రభుత్వం మూడు విమానాల్లో స్వదేశానికి తరలించారు. వీరిలో 329 మంది భారత పౌరులు. మిగలిన వారు అక్కడ స్థిరపడ్డ సిక్కులు, హిందువులు. దౌత్య సంప్రదాయాలకు విరుద్ధంగా కాందహార్‌, ‌హెరత్‌ ‌భారత కాన్సులేట్‌ ‌కార్యాలయాలను తాలిబన్‌ ‌తనిఖీలు చేయడం ఆందోళనకర పరిణామం. జలాలాబాద్‌, ‌మజారే ఇ షరీఫ్‌ల్లోనూ భారత కాన్సులేట్‌ ‌కార్యాలయాలున్నాయి.

 ఇరుగు పొరుగు బాగుంటే మనమూ బాగుంటా మన్నది మొదటినుంచీ భారత్‌ ‌నమ్మిన సిద్ధాంతం. అఫ్ఘాన్‌తో మనకు దాదాపు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీనినే డ్యూరండ్‌ ‌రేఖ అని వ్యవహరి స్తారు. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే) సమీపంలో ఈ సరిహద్దు ఉంది. అందువల్ల అఫ్ఘాన్‌లో అవాంఛనీయ శక్తులు అధికారంలో ఉంటే భారత్‌ ‌కు చికాకులు తప్పవు. పాక్‌ ‌సమస్యలకు తోడు ఇప్పుడు దానికి తాలిబన్‌ ‌ముష్కరులు తోడైనట్టే. వాస్తవానికి అఫ్ఘాన్‌ ‌పాలకులు, ప్రజలతో భారత్‌కు అవినాభావ సంబంధం ఉంది. సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్‌ అబ్దుల్‌ ‌గఫార్‌ ‌ఖాన్‌ ‌భారత్‌ ‌పట్ల ఎనలేని విశ్వాసం కనబరిచేవారు. రాజు జహీర్‌ ‌షా నుంచి 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు పాలించిన అధ్యక్షుడు హమీద్‌ ‌కర్జాయ్‌ ‌నుంచి అష్రాఫ్‌ ‌ఘనీ వరకూ అందరూ భారత్‌ను నమ్మకమైన మిత్రదేశంగా భావించేవారు. పొరుగున ఉన్న పాక్‌ ‌తమ దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఉగ్రవాదులకు ఊతమి స్తోందని హమీద్‌ ‌కర్జాయ్‌ అనేకసార్లు వ్యాఖ్యా నించారు. ఇప్పుడు శాంతిచర్చల్లో ఆయనదే కీలక పాత్ర.

తాలిబన్‌ ‌హయాంలో (1996-2001) అఫ్ఘాన్‌తో మనకు చేదు అనుభవం కూడా ఉంది. 1999 డిసెంబర్‌లో నేపాల్‌ ‌రాజధాని ఖట్మాండు లోని త్రిభువన్‌ అం‌తర్జాతీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని అఫ్ఘాన్‌ ఉ‌గ్రవాదులు దారి మళ్లించారు. లాహోర్‌, అమృత్‌ ‌సర్‌ ‌వంటి నగరాలకు తిప్పి చివరకు కాందహార్‌లో దించారు. భారత జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను తమకు అప్పగిస్తేనే ప్రయాణికులను వదిలి పెడతామని షరతు విధించారు. చివరకు ప్రయాణికుల క్షేమాన్ని దష్టిలో పెట్టుకుని నాటి విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌ ‌జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను అప్పగించి ప్రయాణికు లను తీసుకువచ్చారు. ఈ ఘటన భారత ప్రజల మస్తిష్కం నుంచి ఇంకా తొలగిపోలేదు.

పునర్నిర్మాణంలో…

అఫ్ఘాన్‌ ‌పునర్నిర్మాణానికి భారత్‌ ‌చేసినంత సాయం మరో దేశమేదీ చేయలేదు. అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు సైన్యాన్ని పంపగా భారత్‌ ఆపన్నహస్తం అందించింది. అంతర్యుద్ధంలో ధ్వంసమైన పార్లమెంటు భవనం స్థానంలో కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి ఇచ్చింది. 2008లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, అఫ్ఘాన్‌ అధ్యక్షుడు హమీద్‌ ‌కర్జాయ్‌ ‌శంకుస్థాపన చేయగా 2015లో ప్రధాని మోదీ, అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అఫ్రాఫ్‌ ‌ఘనీ ప్రారంభించారు. 218 కిలోమీటర్ల జరాంజ్‌- ‌డెలారం రహదారిని 15 కోట్ల డాలర్ల వ్యయంతో భారత్‌కు చెందిన సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్వో- బోర్డర్‌ ‌రోడ్‌ ఆర్గనైజేషన్‌) ‌నిర్మించింది. ఇది అఫ్ఘాన్‌ ‌సరిహద్దులోని జరాంజ్‌ ‌వద్ద ప్రారంభమై డెలారం వరకూ సాగుతుంది. తన భూభాగం గుండా అఫ్ఘాన్‌ ‌వెళ్లేందుకు పాక్‌ అనుమతి ఇవ్వకపోవడంతో భారత్‌ ఈ ‌రహదారిని నిర్మించాల్సి వచ్చింది. గత ఏడాది కరోనా సమయంలో ప్రజలను ఆదుకునేందుకు 75 వేల టన్నుల గోధుమలను పంపింది. హెరాత్‌ ‌ప్రావిన్స్‌లో ‘సల్మ’ డ్యామ్‌ను నిర్మించి ఇచ్చింది. 2016 జూన్‌లో ప్రధాని మోదీ దీనిని ప్రారంభిం చారు. ఇక్కడ 42 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. 75వేల హెక్టార్లకు సాగు నీరు అందిస్తుంది. బఘ్లాన్‌ ‌ప్రావిన్స్‌లో 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ ‌లైన్‌ ‌భారత్‌ ‌పునర్మించింది. దీనివల్ల రాజధాని కాబూల్‌ ‌నగరానికి విద్యుత్‌ ‌సరఫరా మెరుగుపడింది. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 400 బస్సులు, 200 మినీ బస్సులను అందించింది. పురపాలక సంఘాలకు 105 యుటిలిటీ వాహనాలను సమకూర్చింది. పది అంబులెన్సులను అందజేసింది. అంతేకాక మూడు ఎయిరిండియా విమానాలను బహూకరించింది. నాలుగు ఎంఐ-25 హెలికాఫ్టర్లను ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరు, యుద్ధరీతులు, గూఢచర్యం, ఐటీ వంటి అంశాలపై సైన్యానికి శిక్షణ ఇచ్చింది. రమారమి 300 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించి భారత్‌ అక్కడ 500 ప్రగతి ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పుడు వాటి పరిస్థితి అగమ్య గోచరం.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

About Author

By editor

Twitter
YOUTUBE