‘స్కెచ్‌ ‌సిద్ధమేనన్నమాట!’ అన్నాడు రాహుల్‌ ‌గాంధీ, కన్నుగీటుతూ.
‘ఎప్పుడో సిద్ధం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్టు… ఒక్క ఐడియా పీఎంని కూడా మార్చేస్తోంది’ అన్నాడు ప్రశాంత్‌ ‌కిశోర్‌. ‌రాహుల్‌కి కన్నుగొట్టడం హాబీయే తప్ప మరొకటి కాదని తెలిసినవాడు కాబట్టి బెదిరిపోకుండా చెప్పాడు.
‘చెప్పు!’ అంది సోనియా. అప్పుడే పీఎం మార్పు దృశ్యం ఆమె కళ్లల్లో.
‘బెంగాల్‌లో మొన్న మమతా బెనర్జీకి 213 సీట్లు వచ్చాయి.’ అందుకున్నాడు పీకే.
‘నీ ఘనత!’ అంటూ రాహుల్‌బాబు భుజం తట్టబోగా, కరోనా సంగతి గుర్తుకొచ్చి పక్కకి ఒరిగాడు పీకే.

‘2019లో మోదీకి లోక్‌సభలో వచ్చిన సీట్లు 303. మళ్లీ అవే వస్తే మమత గొప్పేమిటి? పెరగాలి. 213 కాదు, 416 రావాలి. పూజ్యులు రాజీవ్‌ ‌గాంధీ రికార్డు బద్దలు కొట్టేస్తాం!.’ అని చటుక్కున ఏదో గుర్తుకొచ్చి సోనియా కేసి చూశాడు పీకే.

ఎంతయినా ఎన్నికల వ్యూహకర్త! అంచనా నిజమైంది. రాజీవ్‌ ‌రికార్డు బద్దలు అన్నమాటకే సోనియా ముఖం వాడిపోయింది. పార్టీలో చేరడం ఖాయమయ్యాక కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలని పీకే ముందు నుంచి ఉబలాటపడుతున్నాడు. మరి సోనియా మనసు కష్టపెట్టడమెందుకు అనుకుని మళ్లీ అన్నాడు.

‘సరే, మోదీ కంటే 97 సీట్లు ఎక్కువ రాబట్టాలి.’ సర్ది చెప్పాడు.

‘అలా అన్నావ్‌ ‌బావుంది!’ అంది సోనియా, తృప్తిగా.

రాహుల్‌ అన్నాడు, ‘మొన్ననే మా పార్టీ లెక్కేమిటో తేల్చాం! అది పనికిరాదా!’

‘కాస్తయినా నమ్మేటట్టు ఉండాలి రాహుల్‌ ‌జీ!’ బుజ్జగిస్తూ అన్నాడు పీకే.

‘మధ్యప్రదేశ్‌, ‌రాజస్తాన్‌ ‌మనం స్వీప్‌ ‌చేస్తామంటే ఎవడైనా నమ్ముతాడా? గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రజలు ఈవీఎమ్‌ల్లో చేతి గుర్తు మీద ఎప్పుడు వేలు పెడదామా అని ఎదురు చూస్తున్నారని చెబితే కితకితలు పెట్టినట్టు నవ్వరా?’ కాస్త నిర్మొహమాటం గానే అన్నాడు పీకే. మీరు పీఎం కావడం అసాధ్యం రాహుల్‌జీ, ఆ చాన్సేదో ఈసారికి మమతకి ఇద్దాం, ఇప్పట్లాగే మీరు ఏ పదవీ లేకుండా కాంగ్రెస్‌ను కాల్చుకు తింటూ కూర్చున్నట్టు రేపు మమతని కూడా బయటి నుంచి మద్దతు పేరుతో నంజేసుకోవచ్చు అని చెప్పి ఒప్పించినవాడు, ఈ చిన్న సంగతి దగ్గర మొహమాటపడతాడా?

‘ఆ రాష్ట్రాలవాళ్ల వేళ్లు మళ్లీ కమలాన్నే తాకుతాయంటారా?’ ఏడుపు గొంతుతో అన్నాడు రాహుల్‌. అలాంటి వేళ్లు నరికేస్తే పోలా అన్నంత ఉక్రోషం అందులో.

‘సరే.. స్కెచ్‌, అదే స్కెచ్‌ 2.ఒ. ఏమిటి?’ అడిగేసింది సోనియా, తట్టుకోలేనట్టు.

తన స్కెచ్‌ ‌మీద పీకేకి ఎప్పుడూ అపార విశ్వాసమే.

‘గుజరాత్‌లో ఏం వ్యూహం! మధ్యప్రదేశ్‌, ‌రాజస్తాన్‌లో ఏమిటి?’ కుర్చీలో నుంచి లేచిపోయి మరీ అడిగాడు రాహుల్‌.
‌గట్టిగా నవ్వేశాడు పీకే.

ఈ నవ్వు పరమార్ధం ఏమిటి? పైకే అనేశారు తల్లీకొడుకులు.

‘ఈ స్కెచ్‌కి అంత సోషల్‌ ఇం‌జనీరింగ్‌ అక్కర్లేదు మరి!’ తాపీగా అన్నాడు పీకే. ఒక్క నిమిషం ఆగి గంభీరంగా అన్నాడు తానే.

‘దీదీ బెంగాల్‌ ఎన్నికల్లో ఎలా గెలిచింది!’

‘అదే తెలిసేడిస్తే మేమే గెలిచేవాళ్లం!’ అంది సోనియా, మూతి నాలుగు వంకర్లు తిప్పుతూ.

‘ప్రచారంలో దీదీ ఒక కాలు కారు డోర్‌లో పెట్టి త్యాగం చేసింది!’ అన్నాడు పీకే.

‘అదంతా ఒట్టి నాటకం అన్నారు బీజేపీ వాళ్లు!’ గుర్తు చేశాడు రాహుల్‌.

‘‌నాటకమో బూటకమో. దీదీని గెలిపించానా లేదా?’ అన్నాడు పీకే, తలెగరేస్తూ.

‘ఔను, గెలిచింది…’ అన్నాడు రాహుల్‌. ‌తీక్షణంగా చూశాడు పీకే.

‘అదేలే, నువ్వే గెలిపించావ్‌. అయితే….’ అంది సోనియా.

‘అయితే ఏమిటి? 2024 మే నెలారంభంలో…’ అని ఆపేశాడు పీకే.

నెలారంభంలో… కొంపదీసి తన ప్రమాణ స్వీకారమని చెబుతాడా? రాహుల్‌ ‌మొహం నిండా దింపుడుకళ్లం ఆశ.
కాంగ్రెస్‌ ‌సీట్లు డబుల్‌ ‌డిజిట్‌కు తగ్గవు అంటాడా? సోనియా ఆశ.

‘ఒక కాలు మళ్లీ కారు డోరులో పడుతుంది.’ గొంతు తగ్గించి గుట్టు విప్పాడు పీకే.
అదిరిపడ్డారు తల్లీకొడుకులు. ఆ క్షణంలోనే కాలు డోర్‌లో ఉన్న అనుభూతి.

‘ఎవరిదో!’ బెదురుతూ అడిగింది సోనియా.
భయపడకండి, పీఎం చాన్సు ఎవరికి బలంగా ఉంటేవారు, అంటే దీదీ కాలే’ అన్నాడు పీకే.

‘ఎడం కాలా! కుడి కాలా? కుడికాలైతే మంచిది!’ వెంటనే అన్నాడు రాహుల్‌.
‘‌మీ అభీష్టం, రెండోవారంలో రెండో కాలు, అంటే ఎడం కాలు మీద డోరు దభీమని పడుతుంది.’ ముందుకు వంగి అన్నాడు పీకే.

‘మొదటి డోరు పడినప్పుడు బాధకీ, రెండో డోరు పడినప్పుడు రోదనకీ కాస్తయినా తేడా ఉండాలని చెప్పడం మరచిపోవద్దు పీకే! తర్ఫీదులో లోపం ఉండకూడదు!’ హుషారుగా అన్నాడు రాహుల్‌.

నువ్వుండ్రాబాబూ! అన్నట్టు రాహుల్‌ను వారించి నెమ్మదిగా అంది సోనియా, చిన్నపాటి శంకతో ‘అవి అసెంబ్లీ ఎన్నికలు కదా!’

‘ఏంటి మేడమ్‌! ‌సభలు వేరైనా ఓటు ఒక్కటే. అది వేసే ఓటరు మనస్తత్త్వం కూడా ఒకటే’ నమ్మ బలికాడు పీకే.

‘ఒక కాలు ఈజీకొల్టూ 213 అయితే, రెండు కాళ్లు ఈజీకొల్టూ ఎంత?’

లెక్క ఇచ్చి బయటకెళ్లిన మాస్టారిలా లేచి వెళ్లిపోయాడు ప్రశాంత కిశోర్‌ ‌శరద్‌పవార్‌ని కలవడానికి.

తామిద్దరి కాళ్లూ కాకుండా, మమత కాళ్లనే పీకే నమ్ముకుంటున్నందుకు అప్పటికి విపరీతంగా ఆనంద పడ్డారు తల్లీకొడుకులు.

About Author

By editor

Twitter
YOUTUBE