తిలక్ శతజయంతి ముగింపు సందర్భంగా
ఆధునిక కవితా నికేతనంలో మానవతావాద కేతనాన్ని నిలిపిన మహాకవి దేవరకొండ బాలగంగాధరతిలక్ (01.8.1921-01.7.1966). అనుభూతి వాద కవిగా ప్రకటించుకున్న తిలక్, చేపట్టిన ప్రతి వస్తువునీ కవితామయం చేసి కవిత్వంలో వెలుగులు విరజిమ్మిన రవి. శైలీరమ్యత సాధించిన నవకవి. 1921 ఆగస్ట్ మొదటి తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు సమీపాన మండపాక గ్రామంలో జన్మించారాయన. తండ్రి సత్యనారాయణ లోకమాన్య బాలగంగాధర తిలక్పై ఉన్న అభిమానంతో ఈ పేరు పెట్టాడు.
తణుకులో స్కూల్ ఫైనల్ పూర్తయిన తర్వాత మద్రాసు, విశాఖపట్టణాల్లో ఇంటర్మీడియట్ చదివినా పూర్తి చేయలేదు. సాహిత్యంపై ఆసక్తితో సాహిత్యాధ్య యనం చేశాడు. ఆధునిక కవితా ఉద్యమాల్లో నాడు ప్రముఖంగా ఉన్న భావ కవితా ఉద్యమ ప్రభావంతో వివిధ పత్రికల్లో ప్రచురించిన ‘పద్యాలు’ ప్రచురిం చారు. 1935 నుండి 45 వరకు వచ్చిన రచనలను ‘ప్రభాతము-సంధ్య’ పేరుతో పద్యగేయ మిశ్రమ ఖండ కావ్యంగా వెలువరించాడు. ఆయన 1942-62 మధ్యకాలంలో భావ కవితా ప్రభావం తోనే రాసిన 18 పద్య కవితా ఖండికలను తిలక్ కుమారుడు డా।। సత్యనారాయణమూర్తి (లండన్) 1993లో ‘గోరువంకలు’ పేరుతో ప్రచురించాడు. దీనికే ప్రఖ్యాత సంపాదకుడు నండూరి రామమోహన రావు అద్భుతమైన పీఠిక రాశారు. ఈ ఖండికలన్నీ ‘ప్రతిభ’, ‘భారతి’ వంటి పత్రికలలోను, తల్లావజ్జల శివశంకర శాస్త్రి భావ కవితా సంకలనాల్లో ప్రచురిత మయ్యాయి. వాటిపై ప్రముఖ భావకవులు రాయప్రోలు, కృష్ణశాస్త్రి, వేదుల, నాయని వంటి వారి ప్రభావం కనిపస్తుంది. తిలక్ ప్రసిద్ధ కవితా సంకలనం ‘అమృతం కురిసిన రాత్రి’ వచన అభ్యుదయ కవితా దృక్పథంతో వచ్చింది.
ముంబాయిలో 1942లో జరిగిన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో తిలక్ ప్రతినిధిగా పాల్గొన్నాడు. అనారోగ్యం వల్ల 1945 నుండి 1955వరకు సాహిత్యం కృషి అంతగా సాగలేదు. 1961 నుండి కవిత్వంలో కొత్త పోకడలు చూపించారు.
కవిత్వంతో పాటు ‘కథలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, లేఖా సాహిత్యం వంటి పక్రియలన్నింటినీ స్పృశించి సుసంపన్నం చేశాడు తిలక్. కవిత్వానికి కావలసిన ప్రతిభ – వ్యుత్పన్నత – అభ్యాసం పుష్కలంగా ఉన్నందున ఉత్తమ శ్రేణి కవిగా ప్రసిద్ధుడయ్యాడు. కథా రచయితగా అంతే ప్రసిద్దుడు.
‘అమృతం కురిసిన రాత్రి’లో చెప్పినట్లు ‘లలిత లలిత లతాంతమాలగా’ భావించాడు. బ్రతుకులో నుండి చావునీ, దుఃఖాన్నీ వెళ్లిపొమ్మన్నాడు. అతి పిన్న వయసులో జూలై 2, 1966న 45వ ఏట తానే బ్రతుకు నుండి నిష్క్రమించాడు.
మరణానంతరం 1968లో ఆయన వచన కవితలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ‘అమృతం కురిసిన రాత్రి’ పేరిట సంకలనంగా వెలువరించారు. ఆ సంకలనానికి 1969లో ఆంధప్రదేశ్ సాహిత్య అకాడెమీ, 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలు ఇచ్చాయి. అంతకుముందే కవితా ప్రియుల హృదయాల్లో ఆ ఖండికలు నిలిచి పోయాయి. ‘అమృతం కురిసిన రాత్రి’ ఇప్పటివరకు 15 ముద్రణలు పొందింది. ఆ సంపుటి ఆధారంగా తిలక్ కవితా విశేషాలను స్థూలంగా పరిశీలిద్దాం.
తిలక్ కవితా విశేషాలు: కవిత్వ తత్త్వవివేచన, 2. నగర జీవిత చిత్రణ, 3. స్మృతి కవితా చిత్రణ, 4. మధ్యతరగతి జన జీవిత చిత్రణ, 5. అట్టడుగు జన జీవిత చిత్రణ, 6. యుద్ధోన్మాద నిరసన 7. అధిక్షేపాత్మక కవితా చిత్రణాలుగా విశ్లేషించి వాటిని పరిశీలిద్దాం.
1. కవిత్వ తత్త్వవివేచన
‘నా కవిత్వం’, ‘నవత-కవిత’ ఖండికల్లో తిలక్ తన కవితా లక్ష్యాన్ని వివరిస్తూ ‘ఇజాలలో ఇంప్రిజన్’ కావడం ఇష్టం లేనందున ‘నా కవిత్వం కాదొక తత్త్వం’ అన్నాడు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు /విజయ ఐరావతాలు/వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’-అని అందమైన ఆర్ద్రమైన భావాలను అందమైన శైలిలో చెప్పడమే తన కవితా లక్ష్యమన్నాడు. ఆధునిక కవిత్వతత్త్వాల్లో ఉన్న దేనికీ తన కవిత్వం చెందదని స్పష్టీకరించాడు. ఏ ఇజానికి కట్టుబడకున్నా నిరంతర కవితాన్వేషిగా కవితా ఎవరెస్ట్ని అధిరోహించిన ప్రతిభాసంపన్నుడు. స్వేచ్ఛాప్రియుడు, సౌందర్యం- అభ్యుదయం ఆయనకు రెండు కళ్లు. భావకవితా యుగం నుండి సంక్రమించిన శబ్ద శైలీ సౌందర్యం, అభ్యుదయ కవితా యుగ ప్రభావంతో సామాజిక హితాన్ని కాంక్షించే వస్తు స్వీకరణ ఆయన కవితకు ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ఆయన భావ కవితా సౌందర్య పిపాస కవిత్వ సీమను సౌందర్య సీమగా చేసింది. అందుకే ‘గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ, జాజిపువ్వుల అత్తరు దీపాలూ మంత్ర లోకపు మణిస్తంభాలూ నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు’ అని అభివర్ణించాడు.
తిలక్ కవితా విమర్శకుడిగా ‘నవత-కవిత’ ఖండికలో ‘కవిత్వం ఒక ఆల్కెమి. దాని రహస్యం కవికే తెలుసు. కాళిదాసుకు తెలుసు. పెద్దన్నకు తెలుసు. శ్రీశ్రీకి తెలుసు’ అని కవితాకళను రసవాద విద్యతో పోల్చాడు. కవిత్వ పరమావధిని వివరిస్తూ ‘కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమను బహిర్గతం చేయాలి. విస్తరించాలి చైతన్యపరిధి/ అగ్ని చల్లినా / అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి కావాల’ని వివేచించాడు. తిలక్ భావకవా? అభ్యుదయకవా? అనే చర్చ విమర్శకుల్లో సాగింది. కుందుర్తి చెప్పినట్లు, ‘తిలక్ అభ్యుదయ భావాలకు రమ్యమైన శైలిని సమకూర్చడంలో కృతకృత్యు డయ్యాడు’. మొత్తం పరిశీలించి చూస్తే అభ్యుదయ భావన, కాల్పనికోద్యపు నాద శబ్ద సౌందర్యమూ రెండింటి మేళవింపు తిలక్ కవిత్వమన్న అభిప్రాయం సమంజసం.కృష్ణశాస్త్రి భావనాశక్తి, శ్రీశ్రీ అభ్యుదయాను రక్తి తిలక్ కవిత్వంలో అంతర్వాహినులుగా కనిపిస్తాయి. జీవితంలో సుఖం కోసం, శాంతి కోసం పరితపించే మానవ మనుగడను తలచి విలపించాడు. జీవితంలో బీభత్సానికి భయపడక జీవితాన్ని సాహసయాత్రగా భావించమని ప్రబోధించాడు.
2. నగర జీవిత చిత్రణ
ఆధునిక కవితాధోరణుల్లో నగర జీవిత చిత్రణం ఒకటి. ఆంగ్లకవులు టి.యస్. ఇలియట్, బ్రౌనింగ్ వంటి వారి ప్రభావంతో అభ్యుదయ కవులు అనిసెట్టి, పఠాభి, నారాయణరెడ్డి వంటి కవులు మద్రాసు నగరాన్ని వర్ణించారు. నారాయణ బాబు విశాఖ పట్టణాన్ని వర్ణించాడు. తిలక్ హైదరాబాదు నగరాన్ని స్త్రీతో పోల్చి ‘నగరం మీద ప్రేమగీతం’ ఖండిక రాశాడు. ట్యాంక్బండ్ని స్త్రీ నడుంతో, అబిడ్స్ని కళ్లతో పోల్చాడు. ‘నౌ బత్ పహాడ్స్’ నాగారంగా భావించాడు.
హైదరాబాదు నగరాన్ని ‘ఫ్యూడల్ రహస్యాల్ని / నేటికీ దాచుకున్న / పుండ్రేక్షు కోదండంగా’ నిరసించాడు. యాంత్రిక నాగరిక విలాసాల్లో మునిగి తేలుతున్న ప్రజల దుస్థితిని ‘నగరంలో హత్య’ ఖండికలో అధిక్షేపించాడు. ‘రాజమండ్రి పాటలు’ ఖండికలో గోదావరి వరదల్లో రాజమండ్రి స్థితిని ‘అంచులు మోసిన గోదావరి ఆకాశం క్రిందికి దిగినట్లు వుంది / ముచ్చటగా రైలు వంతెన ముత్యాల వడ్డాణంలా అమరింది’ అని ఉత్ప్రేక్షించాడు. రాత్రిపూట రాజమండ్రి వెళుతుంటే రమ్య గౌతమీ జలాలలో / కొన్నివేల విద్యుద్దీపాలు ప్రతిఫలిస్తాయి / ఎవరీవిడ ధమ్మిల్లంతో యిన్ని / కాంతి లతాంతాల్ని తురిమారు’ అని రాజమండ్రిని సుందరిగా భావించి భావ కవిత్వపు పోకడలో వర్ణించాడు.
3. స్మృతి కవితా చిత్రణ
పాశ్చాత్యుల ఎలిజీ ఆధారంగా తెలుగులో స్మృతికవిత్వం వచ్చింది. ఆత్మీయులు మరణించినప్పుడు రాసే స్మృతిగీతమే ఎలిజీ. తిలక్ ముచ్చటగా మూడు స్మృతి కవితా ఖండికలు రాశాడు. వాటిలో నెహ్రూ, కెనడీ మరణాలకు స్పందించి రాసినవే, దేశ నాయక స్మృతి ఖండికలు. కొనకళ్ల వెంకటరత్నం మరణానికి స్పందించి రాసిన ఖండిక ఆప్తస్మృతి.
జవహర్లాల్ నెహ్రూ మరణానికి స్పందించి కవులంతా స్మృతి కవితలు రాశారు. తిలక్ స్మృతిగీతం అత్యద్భుతం. నెహ్రూ మరణంతో ప్రపంచం దుఃఖసాగరంలో మునిగిన విషయాన్ని ‘ఈవేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు/ ఏకాంతంలో భూమి ధృవ గళాలెత్తి ఏడ్చిన రోజు’ అంటాడు. అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ దేశాల మన్ననలందిన కెనడీ మరణానికి స్పందించిన తిలక్ ‘దుర్మరణవార్త’ ఖండిక రచించాడు. కెనడీ మరణంతో ‘నివ్వెరపడింది జగత్తు/నిజం నమ్మలేకపోయింది/ చరిత్రకేదోశాపం వుందని’ ఆవేదన వ్యక్తపరచాడు. కెనడీ హత్యోదంతం బాపూజీ విషాదగాథను ప్రతిధ్వనింపజేస్తూందని ‘మహాత్ముల మహనీయుల రుధిరంతో మరకపడింది ధరిత్రీ వదనం’ అంటూ విషాదాశ్రువులు చిందించాడు.
‘బంగారు మామ’ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణానికి స్పందించి ‘కొనకళ్ల•కు అక్షరాంజలి’ స్మృతిగీతం రాశాడు తిలక్. అందులో ఆయన నిబద్ధతను ప్రశంసిస్తూ ‘తెలుగుదనం, వెలుగుదనం’ పంచిన రచయితగా అభినుతించాడు.
4. మధ్యతరగతి జన జీవిత చిత్రణ
అభ్యుదయ కవులు ఆరుద్ర, అనిశెట్టి, కుందుర్తి మధ్య తరగతి జన జీవిత చిత్రణను నిశిత పరిశీలనతో వర్ణించారు. తిలక్ మధ్య తరగతి జీవితాల్లో సమస్యలను పరిష్కరించుకోలేక గొంగళి పురుగులాంటి జీవితాలను గడిపే కోటేశ్వరరావు, వీరేశ్వరరావు, జోగేశ్వరరావుల వ్యధార్త గాధ యధార్థ చిత్రణను ఆర్ద్రంగా చేశాడు. తపాలా వార్షికోత్సవం కోసం మిత్రుడు డా।। తంగిరాల వెంకటసుబ్బారావు కోరిక మేరకు ‘తపాల బంట్రోతు’ ఖండిక రాశాడు తిలక్. అప్పటి కవుల దృక్పథాన్ని అన్యాపదేశంగా అధిక్షేపిస్తూ ‘ఈ నీ ప్రార్ధన కడుంగడు అసహ్యం సుబ్బారావు / ఉత్త పోస్ట్మేన్ మీద ఊహలు రానే రావు’ అంటూనే ప్రారభించి తపాలా బంట్రోతు స్థితిని, ‘ఎండలో, వానలో ఎండిన చిలికిన చిన్న సైజు జీతగాడు/ చెవిలో పెన్సిల్, చేతిలో సంచి, కాకి దుస్తులు, అరిగిన చెప్పులు ఒక సాదా పేదవాడు/ ఇంటింటికి వీధి వీధికి తిరిగేవాడు ప్రైమ్మినిస్టరా? ఏం’ అంటూ ఆరంభించి అతడి వృత్తిధర్మంలో నిబిడీకృతమైన సేవాదృష్టిని గొప్పగా కవిత్వీకరించాడు. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో పోస్టుమేన్ ఉత్తరాల కోసం ప్రజలు ఎదురుచూసేవారు. ‘వర్తకుడికీ, నర్తకుడికీ, ఉద్యోగశప్తుడైన నవీన యక్షుడికీ, ఖైదులో దొంగకీ, హంతకుడికీ, మనిషికీ, రాక్షసుడికీ /నువ్వు దూరాల తీరాల విచిత్రంగా ఒకే నిమిషం అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి, కూర్పరివి/అదృష్టాధ్వం మీద నీ గమనం శుభాశుభాలకు నువ్వు వర్తమానం’ అంటూ అతడి ఘనతను వినుతించాడు. అతడి ఆర్థిక దుస్థితికి సానుభూతి చూపిస్తూ ‘ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండె బరువు దించుకోవడానికి ఒక్క గడపలేదు/ ఇన్ని కళ్లు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలికి చూడదు’ అని ఆర్ద్రతతో వర్ణించాడు.
ఆధునిక కవిత్వంలో పోస్ట్మేన్ గురించి ఇంత గొప్పగా రాసిన ఖండిక మరొకటి లేదు. భారతీయ భాషల్లో కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
5. అట్టడుగు జన జీవిత చిత్రణ
అభ్యుదయ కవులంతా అట్టడుగు జన జీవిత చిత్రణను మానవతా దృష్టితో చేశారు. గురజాడ, రాయప్రోలు ప్రభావంతో ఆధునిక కవులంతా దేశభక్తి కవితలు రాసే సమయంలో, తిలక్ ఆర్ద్ర హృదయాను భూతితో, కరుణ రసస్ఫోరకంగా, పాఠకుల గుండెలు పిండే సామాజిక దుర్భర సంఘటనలతో మానవతా దృష్టితో ‘ఆర్తగీతం’ రాశాడు. ‘నా దేశాన్ని పాడలేను/ నీ ఆదేశాన్ని మన్నించలేను/ ఈ విపంచికలో శృతి కలుపలేను’ అని ప్రకటించాడు. తన యెడదమ్రోడైన దుస్థితికి హేతువులను కవిత్వీకరిస్తూ, ‘నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టుకింద మరణించిన ముసలివాణ్ణి నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన క్రింద నిండు చూలాలు ప్రసవించిన దృశ్యాన్ని / నేను చూశాను. నిజంగా తల్లి లేక, తండ్రి లేక తిండిలేక ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాలువ ప్రక్కనే నిద్రించిన మూడేళ్ల పసిబాలుణ్ణి / నేను చూశాను. నిజంగా పిల్లలకు గంజి కాసిపోసి తాను నిరాహారుడై రుద్ధ బాష్పాకులిత నయనుడై ఆఫీసుకు వచ్చిన వృద్ధుని ప్యూన్ వీరన్నని నేను చూశాను నిజంగా క్షయగ్రస్థ భార్య యిక బతకదని డాక్టరు చెప్పినప్పుడు ప్రచండ వాతూల హతనీపశాఖ వలె గజగజ వణికిపోయిన అరక్త అశక్త గుమస్తాని / అయిదారుగురు పిల్లలు గలవాణ్ణి / నేను చూశాను నిజంగా మూర్తీభవిత్ దైన్యాన్ని హైన్యాన్ని క్షుభిత కల్లోల నీరధుల్ని గచ్ఛ•త్ శవాకార వికారుల్ని / ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?’ అని ఆవేదనతో ప్రశ్నించాడు. ‘ఇది ఏ విజ్ఞాన ప్రకర్షక•• ప్రకృతి? అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఏ బుద్ధదేవుని జన్మభూమికి గర్వస్మృతి? అని అధిక్షేపించాడు. దుర్భర సంఘటనల దృశ్య మాలికలతో తిలక్ కుమిలిపోయాడు. పేదరికం సమసిపోయేంత వరకు తనకు మనశ్శాంతి లేదని అలమటించాడు. ఆధునిక కవిత్వంలో తిలక్ అట్టడుగు జనజీవిత చిత్రణ మానవతా దృక్పథంతో అద్భుతంగా చిత్రించాడు.
6. యుద్ధోన్మాద నిరసన
అభ్యుదయ కవులంతా రెండో ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని అల్లకల్లోల స్థితిని నిరసించారు. ‘ఒక బాంబు ఉరిమి ఊడి గుడ్డివాడి చేతిలో పడింది. వాడు మాదా కబళం’ అని మహదానందంతో దోసిలి పట్టడంతో తల పగిలి వాడి కల చెదిరింది’- అని ప్రభుత్వ నిర్లిప్తతను, అమానుషత్వాన్ని ఆవేదనతో అధిక్షేపించాడు.
‘సైనికుడి ఉత్తరం’ – ఖండికలో సైనికుడు తన భార్య అనుభూతుల స్మృతులను స్ఫురణకు తెచ్చుకొని కొన్నివేల మైళ్ల దూరం మన మధ్య ఒక యుగంగా అడ్డు పడిందని ఆమె రూపం దేహం చలిలో వెచ్చగా తగిలిందన్న పలవరింపులతో ఉత్తరం ముగించాడు.
టులాన్ పట్టణపు గుండెల్లో పేలి జర్మనీ శతఘ్నిని, అది సృష్టించిన విధ్వంసానికి చలించి తిలక్ నరహంతక నాజీలను గుడ్లగూబలని అధిక్షే పించాడు. సైనికుల సమాధుల చుట్టూ తిరిగేవారి ఆత్మబంధువులను ఓదారుస్తూ సాను భూతితో ‘శవాలు మాట్లాడవు, మృత్తిక గుర్తించదు. మృత్తికకు దయవుండదు’ అందుకే మీరు వెళ్లిపోండి అన్నాడు.
‘‘అమ్మా! నాన్న ఇంకా రేలేదేందని’ ప్రశ్నించిన పిల్లాడిని పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం చెందిన సైనికుడి భార్య ఆవేదనతో అక్కున చేర్చుకొని రుద్ధ కంఠంతో ‘జైహింద్’ అన్నది. వీరపత్నిగా, వీరమాతగా ఆమె ఆత్మ స్థయిర్యాన్ని తిలక్ ప్రశంసించాడు. యుద్ధోన్మాదాన్ని నిరసించాడు.
7. అధిక్షేపాత్మక కవితా చిత్రణలు
తిలక్ కవితా ఖండికల్లో అధిక్షేపాత్మకాలెన్నో ఉన్నాయి. ‘న్యూ సిలబస్’ ఖండికలో భారతదేశంలో అధిక జనాభాను, ఆర్థిక దుస్థితినీ అధిక్షేపిస్తూ ‘‘అమెరికాలో డాలర్లు పండును / ఇండియాలో సంతానం పండును’’ అంటాడు.
స్త్రీలపై జరిగే అత్యాచారాలను, వేధింపులను అధిక్షేపిస్తూ ‘గజానికొక గాంధారీ కొడుకు, గాంధీగారి దేశంలో’ అంటాడు. ఆధునిక సమాజంలో అభినవ దుశ్శాసనులున్నారని ధ్వని పూర్వకంగా చెప్పాడు. రాజకీయ నాయకుల మానసిక స్థితిని అధిక్షేపిస్తూ ‘మాలిన్యం మనసులో వున్నా మల్లెపూవులా నవ్వగల్గడం ఈనాటి తెలివి’ వంటి పంక్తుల్లో అధిక్షేపాత్మక ధ్వనులు ఆలోచనాత్మకాలు.
-డా।। పి.వి.సుబ్బారావు