-క్రాంతి

కీలకమైన ప్రజాతీర్పు కోసం వెళ్లే ముందు ప్రజల నాడిని పసిగట్టడానికి కొన్ని అవకాశాలు, సంకేతాలు లభిస్తాయి. అది రాజకీయ పార్టీలకు ఊతమిస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తీర్పుకు ముందు అక్కడ జరిగిన పరిణామాలను కూడా బీజేపీ అలాగే భావించడంలో ఆశ్చర్యం లేదు. కానీ విపక్షాల అంచనాలకు, దురుద్దేశాలకు అతీతంగా కమలానికి తీపి తీర్పు రాబోతున్న సంకేతాలు అందాయి. తాజాగా జరిగిన జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌పని అయిపోయినట్టేనని పంచాయతీ ఎన్నికలతో చంకలు గుద్దుకున్న విపక్షాలు తాజా పరిణామాలతో చతికిల పడ్డాయి. జిల్లా పరిషత్‌లతో పాటు బ్లాకులను కూడా బీజేపీయే అత్యధిక సంఖ్యలో కైవసం చేసుకుంది. యోగి పాలనపై యూపీ ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని స్పష్టమైపోయింది.

దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ను అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. ఐదవ వంతు లోక్‌సభ స్థానాలు ఇక్కడివే. యూపీపై పట్టు సాధిస్తే జాతీయ రాజకీయాలు నల్లేరుపై నడకే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా ఇదే రాష్ట్రంలో ఉంది. ఇంత నేపథ్యం ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయ ఎత్తుగడలకు లోటేం ఉంటుంది? అక్కడ పాకిస్తాన్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులను పట్టుకున్నా, ఆ చర్యలను కూడా ఎన్నికల జిమ్మిక్కుగానే విపక్షాలు తక్కువ చేసి చూపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని అసాధారణ మెజారిటీతో గెలిపించారు. అనూహ్య పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ అనతి కాలంలోనే తన సత్తా ఏమిటో చూపించి, సమర్ధ నాయకుడుగా నిరూపించుకు న్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు కురిపించినా, మీడియా ఎంత రాద్ధాంతం చేసినా తనదైన శైలిలో పాలన అందిస్తు న్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయమే. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీతో పాటు కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీలు బొక్కబోర్ల పడ్డాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుం దని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ ‌విస్తరణలో యూపీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమ నించవచ్చు. యోగి పాలనపై రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృ ప్తితో ఉన్నారని ఓ తాజా సర్వే చెబుతోంది కూడా.

బీజేపీ క్లీన్‌ ‌స్వీప్‌

జూలై 3న 75 జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌పదవులకు పోలింగ్‌ ‌జరిగింది. వీటిలో 67 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ కేవలం 6 స్థానాలతో సరిపెట్టుకుంది. విజేతలలో బీజేపీ అభ్యర్థులు 21 మంది, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ గుర్తు లేకుండా ఈ ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో విజయం బీజేపీకి ఉత్సాహం ఇవ్వనుండగా సమాజ్‌వాదీ పార్టీకి నిరాశనే మిగిల్చాయి. మొత్తం 3,050 మంది జిల్లా పంచాయతీ సభ్యులు ఓటు వేసి జడ్పీ ఛైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మాయావతి బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ పోటీ చేయలేదు. ఇది ఎంత ఘన విజయమో మరొక అంశం కూడా రుజువు చేస్తుంది.
2016లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 60 స్థానాల్లో విజయం సాధించిన సంగతి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే తాజా ఎన్నికల ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకీ, ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ ‌యాదవ్‌కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా కంచుకోట రాయ్‌బరేలీలో కూడా బీజేపీ జెండా ఎగరేయడం విశేషం.

బ్లాక్‌ ఎన్నికల్లోనూ…

రాష్ట్రంలో బ్లాక్‌ ‌స్థాయి (తాలూకా) ఎన్నికల్లో కూడా బీజేపీ విజయపరంపర కొనసాగింది. మొత్తం 825 బ్లాక్‌లలో 635 బీజేపీ దక్కించుకుంది. మిత్ర పక్షాలతో కలిపి 85 శాతం సీట్లు అధికారపక్షానికి అనుకూలంగా వచ్చాయి. 349 బ్లాక్‌లకు ఎన్నికలు ఏకగ్రీవం కాగా 476 బ్లాక్‌లకు పోలింగ్‌ ‌జరిగింది. చాలా జిల్లాల్లో ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా, అనుకూలంగా రావడం విశేషం.

లక్నో, కన్నౌజ్‌ ‌లోక్‌సభ పరిధిలోని 8 చొప్పున బ్లాకులు ఉంటే అన్ని సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆగ్రా పరిధిలో 14 స్థానాల్లో పోటీ లేకుండా విజయం సాధించింది. సీతాపూర్‌లో 19 సీట్లలో 15, హర్దోయిలో 19 సీట్లకు 14 స్థానాలను ముజఫర్‌నగర్‌లోని 9 సీట్లలో 8 బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్‌లోని 8 సీట్లలో 6, భదోయిలో 6 సీట్లలో 3 బీజేపీకి దక్కాయి. ఎస్పీ కంచుకోట అజమ్‌గఢ్‌ 22 ‌సీట్లలో 12 స్థానాలను బీజేపీ గెలుచు కుంది. ఎస్పీకి 3 సీట్లు మాత్రమే రాగా, మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ ‌చేసి అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైం దన్న మోదీ, సీఎం యోగి, యూపీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్‌ ‌చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజాసేవ, న్యాయమైన పాలనను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. దీనితో యోగిని తప్పిస్తారనే ఊహాగానాలకు తెర దించినట్టయింది. ‘ఏడేళ్ల క్రితం ప్రధాని మోదీ దేశానికి ‘సబ్‌కా సాథ్‌ ‌సబ్‌కా వికాస్‌’ ‌నినాదం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు విజయవంతంగా సాగి ప్రజలకు ఫలాలు దక్కాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు దీనికి సజీవ ఉదాహరణ’ అని యోగి వ్యాఖ్యా నించారు. ఇదే ఉత్సాహంతో 2022 శాసనసభ ఎన్నికల్లోనూ గెలుపొందడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవ్‌సింగ్‌ ‌చెప్పడంలో అతిశయం లేదు.

గ్రామ పంచాయతీ ఎన్నికలలో…

అంతకు ముందు జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో కూడా నిజానికి బీజేపీయే సత్తా చాటింది. మొత్తం 58,176 గ్రామ పంచాయితీల్లో 7.32 లక్షల వార్డులకు, 3,050 క్షేత్ర పంచాయితీ (బ్లాక్‌)‌ల్లోని 75,852 వార్డులకు, 75 జిల్లాల్లోని 3,050 జిల్లా పంచాయితీ స్థానాలకు ఏప్రిల్‌ ‌చివరివారంలో ఎన్నికలు జరిగాయి. పార్టీ గుర్తులు లేకుండా బ్యాలట్‌ ‌పద్ధతిలో ఈ ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమైంది. మొత్తం 3,050 జిల్లా పంచాయితీ సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 చోట్ల, ఎస్‌పీ బలపర్చిన అభ్యర్థులు 504 సీట్లలో విజయం సాధించారు. బీఎస్‌పీ ఎన్నికలకు దూరంగా ఉన్నా ఆ పార్టీకి చెందిన వారు 132, కాంగ్రెస్‌ ‌నుంచి 62 మంది, ఇండిపెండెంట్లు 608 గెలిచినట్లు తేలింది.

కాగా పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరగడంతో తమ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచినట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రచారం చేసుకుంది. దీనికి ఒక వర్గం మీడియా హద్దులు లేకుండా ఊతమిచ్చింది. ఆ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎదురు దెబ్బ అని కీలక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారంటూ జాతీయ స్థాయిలో ప్రచారం కూడా జరిగింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి, సీఎం యోగి అదిత్యనాథ్‌ ‌సొంత జిల్లా గోరఖ్‌పూర్‌, అయోధ్య ఫలితాలను మసిబూసి మారెడుకాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ మొత్తం ఎన్నికల పక్రియ పూర్తయి జిల్లా పరిషత్‌ ‌ఛైర్మన్ల ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి బీజేపీ విజయం స్పష్టంగా కనిపించింది. మీడియా గాని, విపక్షాలు గాని ప్రజలు ఎంతగా మోసగిస్తు న్నాయో యూపీ స్థానిక ఎన్నికలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వాస్తవంగా ఎలా ఉన్నాయో గోప్యంగా ఉంచి, ప్రధాని మోదీ భవిష్యత్తును అంచనా కట్టే దాకా ఒక వర్గం మీడియా వెళ్లింది. ఇక మోదీ పని అయిపోయిందనే వరకు వాటి ప్రచారం సాగింది.

సర్వే బీజేపీకి అనుకూలం

ఉత్తరప్రదేశ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. ఆ ఎన్నికలల్లో బీజేపీ ఓటమి ఖామయని ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా సంస్థలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే వారి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువ. తాజాగా ఐఏఎన్‌ఎస్‌-‌సి ఓటరు సర్వేలో యూపీలో మరోసారి యోగి ఆదిత్వనాథ్‌ ‌నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. రాష్ట్రంలోని 12 వందల మందిని ఇంటర్వ్యూ చేయగా 52 శాతం మంది యోగి వైపే మొగ్గు చూపారని సర్వే తెలిపింది. 37 శాతం మంది వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రజలు యోగి పాలనపై సంతృప్తితో ఉన్నారని ఈ సర్వే ఫలితం చెబుతోంది.

కేంద్ర కేబినెట్‌లో పెద్ద పీట

వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. యూపీ నుంచి కొత్తగా మరో ఏడుగురికి చోటు దక్కింది. బీజేపీ భాగస్వామ్య పక్షం అప్నాదళ్‌ ‌నాయకురాలు అనుప్రియా పటేల్‌తో పాటు పంకజ్‌ ‌చౌదరి, డాక్టర్‌ ‌సత్యపాల్‌ ‌సింగ్‌ ‌భాగెల్‌, ‌భాను ప్రతాప్‌ ‌సింగ్‌ ‌వర్మ, కౌశల్‌ ‌కిశోర్‌, ‌బీఎల్‌ ‌వర్మ, అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రాలను తీసుకున్నారు. అనుప్రియా పటేల్‌, ‌బి.ఎల్‌.‌వర్మ, కౌశల్‌ ‌కిషోర్‌, ‌భాను ప్రతాప్‌ ‌సింగ్‌ ‌వర్మలకు కులాలను బట్టి మంత్రి పదవులు ఇచ్చారని మీడియా ప్రచారం చేయడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ‌నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే.

ప్రతికూల ప్రచారాన్ని తట్టుకొని..

ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యోగి ఆదిత్యనాథ్‌ ‌రాష్ట్ర సమగ్రాభివృద్దే లక్ష్యంగా అహర్నిశలు పని చేస్తున్నారు. రాష్ట్రంలో మాఫియాలు, గుండాలపై ఉక్కుపాదం మోపడం ద్వార శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారని పేరుంది. సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అభివృద్ది ఫలాలు ప్రజలక• అందేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు జాతీయ మీడియా వ్యతిరేక ప్రచారం కాస్త అతిగానే సాగించింది. చిన్ని చిన్న ఘటనలను కూడా భూతద్దంలో చూపించడం ద్వారా బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి.

కరోనా సంక్షోభ సమయంలో దేశంలోనే అతిపెద్ద జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ ‌కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే మహమ్మారిని అదుపు చేయడంలో చాలా వరకూ సఫలీకృతమైంది. కానీ కరోనా కట్టడిలో యోగి సర్కారు విఫలమైనట్లు ప్రచారం సాగింది. గంగానదిలో శవాలు కొట్టుకుని రావడం, కుంభమేళా, అయోధ్యలో భూసేకరణ, పంచాయితీ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాద్దాంతం సాగింది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిని మారుస్తారని ప్రచారం సాగింది. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్నో పర్యటనతో పాటు, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‌ఢిల్లీకి వెళ్లడంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు జరగబోతోందని వార్తలు వినిపించాయి. వాస్తవానికి ఇలాంటి పర్యటనలు, సమీక్షలు క్రమం తప్పకుండా జరిగేవే. మీడియా కథనాలు అవాస్తవమని సీఎం యోగి వివరణ కూడా ఇచ్చారు. ఏమైనా 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయదుందుభి మోగించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE