– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌మళ్లీ అదే వ్యూహం. కశ్మీర్‌లో శాంతి, ప్రజాస్వామిక రాజకీయ పక్రియల ప్రతిష్టాపనకు భారత్‌ ఎప్పుడు ప్రయత్నం చేసినా ఉగ్రవాదుల ద్వారా పాకిస్తాన్‌ ‌భయోత్పాతం సృష్టించే పనికి పూనుకుంటుంది. అధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న కాలంలో డ్రోన్ల కలకలం ఇందులో భాగమే. కానీ ఈసారి కొత్త వ్యూహంతో, తొలిసారి డ్రోన్లతో జమ్ములోని వైమానిక స్థావరం మీద దాడి చేశారు. ఇది అనేక ప్రశ్నలకు తావిచ్చింది. 370 అధికరణ ఎత్తివేసిన తరువాత కశ్మీరీలకు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య జరిగిన తొలి సమావేశం తరువాత ఈ దాడి జరగడం కశ్మీర్‌లో రాజకీయ పక్రియకు విఘాతం కల్పించడమే ధ్యేయంగా జరిగిందని చాలామంది రక్షణ అధికారుల, నిపుణుల ఉద్దేశం. ఇలాంటి దాడులు కూడా జరపగలమని ఉగ్రవాదులు పంపిన సంకేతంగా కూడా భావించవలసి ఉంటుందని కొందరి అభిప్రాయం. అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి అమెరికా దళాల నిష్క్రమణ నేపథ్యంలో తాలిబన్‌కు పెరిగిన నైతికబలం కోణం నుంచి కూడా ఈ దాడి నేపథ్యాన్ని చూడడం అవసరమన్న అభిప్రాయం ఉంది. మరొక ముఖ్య అంశం కూడా రక్షణ నిపుణులలో అనుమానాలు రేకెత్తిస్తున్నది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌ ‌చేపట్టిన డ్రోన్‌ అభివృద్ధి పథకం ఫలితాలు పరీక్షించుకోవడానికే ఈ డ్రోన్లు ప్రయోగించారా? ఇంకొందరు పరిశీలకుల అనుమానాలు వేరే విధంగా ఉన్నాయి. 1989 నుంచి చేస్తున్న పరోక్ష యుద్ధానికి పాకిస్తాన్‌ ‌స్వస్తి పలికి, నేరుగా యుద్ధానికి సంకేతాలు ఇస్తోందా?

అధీన రేఖ దగ్గర లష్కర్‌ ఏ ‌తాయిబా డ్రోన్లు ఉపయోగిస్తున్న సంగతి 2018లోనే బయటపడింది. అప్పుడే ఆయుధాలను పంపడానికి చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగించింది. 2019లో పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్‌ ఏ ‌తాయిబా డ్రోన్‌లతో దాడికి ఒక ప్రయత్నం చేసింది. తరువాత ఉగ్రవాద మూకలు డ్రోన్లు ఐదు కిలోల వరకు పదార్థాలను మోసుకుపోయే విధంగా ఆధునీకరించారు. తాజా దాడితో కశ్మీర్‌ ‌ప్రజాస్వామిక పక్రియను భగ్నం చేయడం, అధీన రేఖ వెంబడి ఫిబ్రవరి నుంచి పాటిస్తున్న కాల్పుల విరమణకు విఘాతం కలిగించడం కోసం పాకిస్తాన్‌ ఎదురు చూస్తున్న సంగతి అర్ధమవుతున్నది.  లేదా ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకల తక్షణాశయం అని కూడా నమ్మవచ్చు. జమ్ములోని వైమానిక కేంద్రం మీద జూన్‌ 27 ‌నాటి డ్రోన్ల దాడి ఇందులో భాగమేనని  అంటున్నాయి అధికార వర్గాలు. భారతీయులు మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజం కూడా ఇటీవలి డ్రోన్ల కలకలం వెనుక ఉన్నది పాకిస్తాన్‌ అని గట్టిగా నమ్ముతున్నది.

రాజకీయ పక్రియకు అడ్డుపుల్ల

జమ్ము-కశ్మీర్‌లో శాంతిస్థాపన పాకిస్తాన్‌కు సుతారామూ ఇష్టం లేని విషయం.  ఇక పాక్‌ ‌నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీసెస్‌ ఇం‌టెలిజెన్స్) ‌నిత్యం కశ్మీర్‌లో అస్థిర పరిస్థితులు  సృష్టించే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడూ ఈ దిశగానే ప్రయత్నించి అంతర్జాతీయంగా అభాసు పాలైంది. జమ్ములో డ్రోన్‌ ‌దాడులకు పాల్పడటం ద్వారా దాని అసలు నైజం మరొకసారి అంతర్జాతీయ సమాజానికీ స్పష్టమైంది. ఇక పాకిస్తాన్‌కు, వేర్పాటు వాదులకు వంత పాడటానికి, పరోక్షంగా వారిని వెనకేసు కొచ్చేందుకు కొన్ని పార్టీలు కశ్మీర్‌లో పని చేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. మెహబూబా ముఫ్తీ సారథ్యంలో పీడీపీ (పీపుల్స్ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ), ఇతర ఛాందసవాద పార్టీలు గత నెల 24న ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అనూహ్యమైన డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చి తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. వేర్పాటువాదులతోనూ చర్చలు జరపాలన్నది వాటి డిమాండ్‌. ‌పాక్‌తో చర్చలు జరపాలన్న డిమాండ్‌ను కొంతవరకు అర్థం చేసుకో వచ్చు. కానీ భారత్‌ ఉనికిని, దాని సార్వభౌమత్వాన్ని గుర్తించని శక్తులతో చర్చలు జరపాలన్న వాదన అర్థరహితం. ఇది భారత రాజ్యాంగానికి, దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే అంశం.

కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ వల్ల రాష్ట్రం ప్రగతికి దూరంగా ఉంది. పెరిగినదేమిటీ అంటే ఉగ్రవాదం, వేర్పాటువాదం. అందుకే ఆ అధికరణ తొలగింపును పాకిస్తాన్‌ ‌వ్యతిరేకిస్తున్నది. ఈ పరిస్థితిని అధిగమించి సంక్షుభిత రాష్ట్రాన్ని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ ‌ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసింది. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా అభివద్ధి మండళ్ల (డీడీసీ-డిస్ట్రిక్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కౌన్సిల్‌) ఎన్నికలు నిర్వహిం చింది. అసెంబ్లీ ఎన్నికలకూ పావులు కదిపింది. ఇందుకే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంతో ఒక మంచి వాతావరణం ఏర్పడు తుందనుకుంటున్న తరుణంలో జరిగిన డ్రోన్‌ ‌దాడులు పరిస్థితిని మళ్లీ వెనక్కు తెచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యంగా మారింది.

అందరి చూపూ అటే

జమ్ము వైమానిక స్థావరంలో చోటుచేసుకున్న డ్రోన్‌ ‌దాడి సంచలనం కలిగించింది. భద్రతాదళాల అప్రమత్తతతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ దాడి ఎవరు చేశారో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు. దాడి ఘటన జరిగిన ప్రాంతం పాకిస్తాన్‌ అం‌తర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. దీనిని బట్టి ఇందులో పాక్‌ ‌ప్రమేయం ఉందన్న విషయం  స్పష్టమవుతుంది. కేవలం ఒక్క ఘటనతోనే దాడులు ఆగలేదు. తరవాత కూడా వరుస దాడులు జరిగాయి. గత నెల 30 న జమ్ము సైనిక స్థావరంలో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. కాలుచౌక్‌ ‌కంటోన్మెంట్‌ ‌వద్ద ఒక డ్రోన్‌ను గుర్తించారు. రత్నచౌక్‌ ‌సమీపంలో మరొకదానిని కనుగొన్నారు. మూడోది కుంజనీ ఎయిర్‌ఫోర్స్ ‌స్టేషన్‌ ‌వద్ద కనిపించింది. ఇవి రాత్రిపూట దూసుకువచ్చాయి. వీటి కదలికలను గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమై వాటికి తగిన బుద్ధి చెప్పింది. దాదాపు పాతిక రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు చీకట్లో మాయమయ్యాయి. సైన్యం అప్రమత్తతతో భారీ ముప్పు తప్పిందని లెఫ్టినెంట్‌ ‌కర్నల్‌ ‌దేవేంద్ర ఆనంద్‌ ‌చెప్పారు కూడా. జమ్ములోని ఆర్నియా సెక్టార్‌లోనూ డ్రోన్‌ ‌సంచరించింది. తెల్లవారు జామున వచ్చిన ఈ డ్రోన్‌ను పసిగట్టిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌ -‌బోర్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్) ‌కాల్పులు జరపడంతో వెనుదిరిగింది. ఇప్పటివరకు ఏడు డ్రోన్లు భారత్‌ ‌గగనతలంపై సంచరించడం ఆందోళన కలిగించే అంశం.

దౌత్య కార్యాలయాలనూ వదలడం లేదు

దాయాది దేశం కేవలం సరిహద్దుల్లోనే కాదు, దౌత్య కార్యాలయాలపైనా బరితెగింపులకు పాల్పడుతోంది. పాకిస్తాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపైనా డ్రోన్లు సంచరించినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. గతనెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌ ‌లోని భారత రాయబార కార్యాలయంలో ఓ కార్యక్రమం జరుగుతుండగా డ్రోన్‌ ‌కనపడింది. దీనిపై ఆగ్రహించిన భారత్‌ ‌తన నిరసనను పాక్‌ ‌ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేసింది. సమగ్ర విచారణకు డిమాండ్‌ ‌చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరవిందమ్‌ ‌బాగ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఎన్ని తగాదాలు ఉన్నప్పటికీ ప్రతి దేశం కొన్ని దౌత్య మర్యాదలను, సంప్రదాయాలను కచ్చితంగా పాటించి తీరాలి. రాయబార కార్యాలయా లకు, దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడం ఆయా దేశాల ప్రధాన బాధ్యత.ఈ విషయంలో అలక్ష్యం వహించడమంటే అంతర్జాతీయ సంప్రదాయాలను, పద్ధతులను అగౌరవపరిచినట్లే. ఎప్పటిలాగే డ్రోన్‌ ‌దాడి అవాస్తవమని పాక్‌ ‌ఖండించింది. భారత్‌ ‌తగిన సాక్ష్యాలు చూపలేదని బుకాయించింది. ఇది కేవలం విష ప్రచారమని పేర్కొంది. అయితే జూన్‌ 26‌న పాక్‌లోని భారత్‌ ‌రాయబార కార్యాలయంపై డ్రోన్‌ ‌సంచరించిన కొద్ది గంటలకే జమ్ము వైమానిక స్థావరంపై దాడి జరగడం గమనార్హం.

లష్కరే ఉగ్రవాది అరెస్టు..

దాడులకు సంబంధించి లష్కరే ఏ తాయిబా అగ్రశేణి కమాండర్‌ ‌నదీమ్‌ అ‌బ్రార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దుండగుడి నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ సందర్భాల్లో సైన్యం, ప్రజలపై జరిగిన దాడుల్లో ఇతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దాడుల్లో ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ ‌పేలుడు పదార్థాలను వాడినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ- ‌నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు జరుపుతోంది. దాడి జరిగిన జమ్ములోని వైమానిక స్థావరాన్ని ఎన్‌ఐఏ అధికారులు సందర్శించారు. సైనిక స్థావరాలపై సరిహద్దులకు అవతలి నుంచి దాడులు జరగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ఈ ఘటనను కేంద్రం తీవ్రంగా తీసుకుంది. ఘటన జరిగిన వెంటనే రక్షణమంత్రి రాజనాథ్‌సింగ్‌ ‌జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ ఇతర ఉన్నతాధి కారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా పరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు బలగాలకు అధునాతన ఆయుధాలను అందజేయాలని నిర్ణయించారు. వీటి తయారీలో అంకుర సంస్థలు, వ్యూహాత్మక సంస్థలను భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సవాళ్లను ఎదుర్కొ నేందుకు సరికొత్త విధానాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. రక్షణ మంత్రిత్వశాఖ, త్రివిధ దళాలు విధానాల రూపకల్పన, కార్యా చరణలో కీలకపాత్ర పోషించనున్నాయి. నానో టెక్నాలజీ, క్వాంటమ్‌ ‌కంప్యూటింగ్‌, ‌రోబోటెక్స్‌ను వినియోగించుకోనున్నారు.

వైమానిక స్థావరంపై జరిగింది ఉగ్రదాడేనని ఎయిర్‌ ‌ఫోర్స్ ‌చీఫ్‌ ఆర్‌.‌కె. ఎస్‌. ‌బధౌరియా స్పష్టం చేశారు. మొత్తం పరిస్థితిని సునిశితంగా పరిశీ లించాం. కూలంకుషంగా విశ్లేషించాం. దాడులు జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యలపై ఓ అంచనాకు వచ్చామని ఆయన వెల్లడించారు. దాడిని తీవ్రంగా పరిగణించాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌- ‌బోర్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్) ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌రాకేశ్‌ ఆస్థానా పేర్కొన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్‌ ‌టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్‌ ‌ఘటన పాకిస్తాన్‌ ‌పాపమేనని జమ్ము-కశ్మీర్‌ ‌డీజీపీ (డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌) ‌దిల్‌ ‌బాగ్‌ ‌సింగ్‌ ‌స్పష్టం చేశారు. గతంలో పాక్‌ ‌నుంచి వచ్చిన డ్రోన్లు పది నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణించాయని తెలిపారు. ఈ ఘటన వెనక లష్కరే ఏ తాయిబా హస్తం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్య సమితి దృష్టికి

డ్రోన్ల దాడులకు సంబంధించి పాక్‌ ‌నిర్వాకాన్ని అంతర్జాతీయ వేదికపై భారత్‌ ఎం‌డగట్టింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రస్తా వించింది. ఉగ్రవాద ముప్పుపై ఐరాస నిర్వహించిన ఉన్నత స్థాయి సదస్సులో కేంద్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీఎస్కే కౌముది మాట్లాడారు. ఉగ్రదాడుల కోసం సాంకేతికను వినియోగించడం తీవ్రమైన విషయమని, ఇవి చాలా ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. కౌముది తెలుగు రాష్టాలకు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఇటీవల కీలకమైన సీబీఐ డైరెక్టర్‌ ‌పదవికి ఆయన పేరును ప్రధాని నాయకత్వం లోని త్రిసభ్య కమిటీ పరిశీలించింది.

ఈ ఘటనపైన ప్రజల నుంచి సైతం నిరసన వ్యక్తం అయ్యింది. డ్రోన్‌ ‌దాడి, పుల్వామాలో పోలీస్‌ అధికారి కుటుంబాన్ని హతమార్చిన ఘటనకు నిరసనగా శివసేన, డోగ్రా ఫ్రంట్‌ ‌కార్యకర్తలు జమ్ములో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రాణి పార్క్ ‌దగ్గర కార్యకర్తలు పాక్‌ ‌పతాకాన్ని దహనం చేశారు. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తక్కువ అంచనా వేయలేం

 సంప్రదాయ పద్ధతుల్లో యుద్ధమన్నది పాత విషయమని భవిష్యత్తు యుద్ధ తంత్రాల్లో డ్రోన్లే కీలకమని భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.‌నరవణె వివిధ సందర్భాల్లో పేర్కొన్నారు. జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడితో ఇప్పుడు ఆయన మాటలు అక్షర సత్యాలయ్యాయి. రాడార్ల కన్నుగప్పి జమ్ము వైమానిక స్థావరంపై దాడులు చేసిన డ్రోన్ల లక్ష్యం ఎంఐ -17 హెలికాఫ్టర్లే కావడం గమనార్హం. డ్రోన్లతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న విషయాన్ని రెండేళ్ల క్రితమే గుర్తించినట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. ఆ మేరకు తగిన చర్యలూ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. యాంటీ డ్రోన్‌ ‌పరిజ్ఞానాన్ని డీఆర్డీవో (డిఫెన్స్ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) ఏడాది క్రితమే అభివృద్ధి చేసింది. అయితే దీనిని ప్రధాని నరేంద్రమోదీ భద్రతకు ఉపయోగించారు. డ్రోన్లను అడ్డుకునే ఇజ్రాయెల్‌కు చెందిన ‘స్మష్‌ -2000 ‌ప్లస్‌’ ‌సాంకేతికత సకాలంలో అందుబాటులోకి రాలేదు.

మానవ రహిత విమానాలు, డ్రోన్ల ద్వారా శత్రువుల పీచమణచడంలో అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్‌, ‌యూదు రాజ్యమైన ఇజ్రాయెల్‌ ‌ముందంజలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో దాదాపు 14వేలకు పైగా దాడులు వాషింగ్టన్‌ ‌చేసినట్లు అంచనా. ఈ దాడుల్లో రమారమి 17వేల మంది హతులయ్యారు. ఆరేళ్ల క్రితం ఉత్తర వజిరిస్తాన్‌లో ఈ పరిజ్ఞానంతోనే ఒక ఉగ్రవాదిని పాకిస్తాన్‌ ‌హతమార్చింది. ఆ తరవాత అనేక దేశాలు ఈ సాంకేతికతను సమకూర్చు కున్నాయి. ఆర్మేనియా సైన్యంపై అజర్‌ ‌బైజాన్‌ ‌దళాలు, సిరియా అంతర్యుద్ధంలో టర్కీ సైన్యం వీటిని వినియోగించాయి. ఆర్మేనియా, అజర్‌ ‌బైజాన్‌ ‌మధ్య యుద్ధం రెండుదేశాల మధ్య ప్రత్యక్షంగా జరిగినది. ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా) సైతం ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని మారణ హోమానికి పాల్పడుతోంది. సిరియాలో అది వేల మంది ప్రాణాలను కడతేర్చింది. ఇప్పటికీ అదే పనిలో ఉంది. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై హైతీ తిరుగుబాటు వర్గాలు ఈ సాంకేతికతతోనే దాడులకు దిగాయి. పంజాబ్‌, ‌కశ్మీర్‌లో తిష్టవేసిన ఉగ్రవాద మూకలకు ఆయుధాలను, మాదక ద్రవ్యాలను డ్రోన్ల ద్వారానే పాకిస్తాన్‌ ‌సమకూరుస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. డ్రోన్లతో కేవలం సరిహద్దుల్లోనే కాకుండా చమురు శుద్ధి కేంద్రాలు, పౌర వ్యవస్థలపైనా దాడులు జరిగే ప్రమాదం లేకపోలేదు. 2018లో రష్యా నిర్వహణలో గల సిరియాలోని హుమాయ్‌ ‌మిమ్‌ ‌వైమానిక స్థావరంపై డ్రోన్‌ ‌దాడి జరిగింది. దీంతో స్థావరంలోని రష్యా విమానాలు, ఇతర పరికరాలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు జమ్ములో జరిగిన దాడి నాటి హుమాయ్‌ ‌మిమ్‌ ‌దాడిని పోలి ఉందని భద్రతా అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. పేలుడు పదార్థాలను మోసుకుపోయేలా రూపొందించిన డ్రోన్లు భారీ నష్టం కలిగించగలవు.

మేల్కొనాలి

 మారుతున్న పరిస్థితుల్లో తక్షణమే యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థ రూపకల్పనకు భారత్‌ ‌చర్యలు చేపట్టాల్సి ఉంది. కేవలం ఇజ్రాయెల్‌ ‌దిగుమతులపైనే ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడటం అవసరం. రక్షణ రంగానికి చెందిన వివిధ పరిశోధన సంస్థలకు ఇందులో భాగస్వామ్యం కల్పించాలి. వాటికి తగిన మేరకు నిధులు, ఇతర సౌకర్యాలు సమాకూర్చడం తక్షణావసరం. నరేంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ ‌సర్కారు గత ఏడేళ్లుగా ఈ దిశగా అనేక చర్యలకు ఉపక్రమించింది. కేవలం సరిహద్దులను సంరక్షించుకునేందుకు భారీగా బలగాలను మోహరించడమే కాకుండా శత్రువుల ఆట కట్టించేందుకు అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం నేటి అవసరం. 2014 నుంచి ఎన్డీఏ సర్కారులో రక్షణ మంత్రులుగా పనిచేసిన అరుణ్‌ ‌జైట్లీ, మనోహర్‌ ‌పారికర్‌, ‌నిర్మలా సీతారామన్‌, ‌ప్రస్తుత రక్షణ మంత్రి రాజనాథ్‌ ‌సింగ్‌ ఈ ‌దిశగా కసరత్తు చేశారు. ఫలితంగా హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పరిశోధనల్లో కొంత పురోగతి కనబడింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన కౌంటర్‌ ‌సాంకేతిక పరిజ్ఞానానికి డ్రోన్లను తుదముట్టించే శక్తి ఉందని ఆ సంస్థ ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ‌జి.సతీష్‌ ‌రెడ్డి తాజాగా వెల్లడించారు. దీనిని సాఫ్ట్ ‌కిల్‌, ‌హార్డ్ ‌కిల్‌ ‌రూపంలో సాంకేతికతను అందుబాటు లోకి తీసుకువచ్చారు. చిన్న మైక్రో డ్రోన్లను సైతం రాడార్‌ ‌సాయంతో గుర్తించే సమగ్ర వ్యవస్థ ఇది. ఎలక్ట్రో ఆప్టికల్‌, ఇన్‌ ‌ఫ్రారెడ్‌ ‌సెన్సర్ల ఆధారంగా ఇది డ్రోన్లను గుర్తిస్తుంది. 300 డిగ్రీల కోణంలో లక్ష్యాలను గుర్తిస్తుంది. దీనికి సంబంధించి వ్యవస్థలన్నీ కమాండ్‌ ‌పోస్టుతో అనుసంధానించి ఉంటాయి. ఈ యాంటీ డ్రోన్‌ ‌సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణశాఖకు చెందిన భెల్‌ (‌బీఈఎల్‌- ‌భారత్‌ ఎలక్ట్రానిక్స్ ‌లిమిటెడ్‌)‌కు బదిలీ చేశారు. సాయుధ దళాలు ఆర్డర్లు పెట్టి వాటిని పొందే అవకాశం ఉంది. డీఆర్డీవో తయారు చేసిన ఈ యాంటీ డ్రోన్‌ ‌పరిజానం ఏ ఇతర దేశాలకు చెందిన పరిజ్ఞానానికి ఎంత మాత్రం తీసిపోదు. కేవలం డీఆర్డీవో పరిశోధనలకే పరిమితం కాకుండా ఈ దిశగా మరింత వేగంగా అడుగులు పడాలి. శత్రుదేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు తగిన అవసరమైన అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రభుత్వం ముందున్న నేటి కర్తవ్యం.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్


శ్రీ‌శైలంలోను చక్కర్లు

జమ్ములో డ్రోన్ల కలకలం నేపథ్యంలో ఆంధప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మూడు రోజులుగా రాత్రివేళల్లో డ్రోన్లు సంచరిస్తున్నాయంటూ వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. పురవీధుల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టడాన్ని స్థానికులు ప్రత్యక్షంగా గుర్తించారు. దేవస్థాన భద్రతా, అటవీశాఖ సిబ్బంది దీనిని గుర్తించేందుకు ప్రయత్నించారు. దేవస్థాన కార్య నిర్వహణ అధికారి కె.ఎస్‌. ‌రామారావు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు పట్టణ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌బి.వి.రమణ తెలిపారు. శ్రీశైలం ఆలయం మీద ముస్లిం మతోన్మాద ఉగ్రవాదుల కన్ను ఉన్నదని ఎప్పుడో నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.


ఉగ్రవాదుల చేతుల్లో…

ఉగ్రవాద సంస్థలకు డ్రోన్లు అందుబాటులోకి రావడం 2013- 15 ప్రాంతంలోనే మొదలయింది. అగ్రదేశాలకు దీటుగా తమకూ తగిన సాంకేతికత గల డ్రోన్లు ఉండాలని ఐఎస్‌ఐఎస్‌ అప్పట్లోనే ఆలోచన చేసింది. అందుకు అనుగుణంగా ఇరాక్‌, ‌సిరియాల్లోని యుద్ధక్షేత్రాల్లో గల తుక్కును ఉపయోగించి వీటిని తయారు చేయడం దాని పట్టుదలకు నిదర్శనం. క్రమంగా వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న క్వాడ్‌ ‌కాఫ్టర్లను ఆధునీకరిస్తూ ఐఈడీ లు, ఇతర పేలుడు పదార్థాలను మోయడానికి వినియోగించారు. 2018లో వెనెజులా అధినేత నికొలస్‌ ‌మదురో మీద హత్యాయత్నం ఈ సాంకేతికత ఆధారంగానే జరిగింది. మనదేశంలోని మావోయిస్టులు సైతం ఈ సాంకేతికతను సమకూర్చుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ‌మావోయిస్టులు ఆ రాష్ట్రంలోని బస్తర్‌లో పారామిలటరీ క్యాంపుపై నిఘాకు డ్రోన్లను వాడినట్లు సమాచారం.


ఇజ్రాయెల్‌ ‌సాయంతో డ్రోన్ల కట్టడి?

డ్రోన్‌ ‌దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం గట్టి కసరత్తే చేస్తోంది. పశ్చిమాసియా దేశమైన ఇజ్రాయెల్‌ ‌నుంచి యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థను కొనుగోలు చేస్తోంది. తన చుట్టు పక్కల గల ఇస్లామిక్‌ ‌దేశాల నుంచి ముఖ్యంగా పాలస్తీనా నుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ ‌దీనిని తయారు చేసింది. ఇజ్రాయెల్‌ ‌మనకు మిత్రదేశం. ముస్లిం దేశాల నుంచి ముఖ్యంగా పాలస్తీనా నుంచి వచ్చే ఒత్తిడులను కాదని ఇజ్రాయెల్‌తో భారత్‌ ‌దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్ల క్రితం ఆ దేశాన్ని సందర్శించి వచ్చారు. ఇటీవల ఒక దక్షిణాసియా దేశం తమ వద్ద నుంచి యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థను కొనుగోలు చేసినట్లు ఇజ్రాయెల్‌ ‌వెల్లడించింది. తద్వారా ఆ దేశం భారత్‌ అన్నది పరోక్షంగా చెప్పకనే చెప్పింది. భారత్‌ ‌కాక మరే దేశం ఈ ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేసే అవకాశం లేదు. దక్షిణాసియాలో ఏకైక పెద్ద దేశం భారత్‌ ‌మాత్రమే కావడం గమనార్హం.

మిగిలిన దేశాలన్నీ చిన్నవే. వాటికి ఆ యూదు రాజ్యంతో అంత గొప్ప సంబంధాలు లేవు. ఆయుధాల అవసరం కానీ, కొనుగోలు చేసేంత శక్తి కూడా వాటికి లేదు. ఈ నేపథ్యంలో యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థను కొనుగోలు చేసేది భారత్‌ అన్న ప్రచారం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆయుధం పేరు ఈఎల్‌ఐ – 4030 (‌సీ- యుఏఎస్‌). ‌దీనిని భారత్‌కు విక్రయించనున్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఏరో స్పేస్‌ ఇం‌డస్ట్రీ (ఈఏఎస్‌) ఈ ‌నెల 2న ప్రకటించింది. ఇంకా ఆయుధాల అప్పగింత జరగలేదు. వీటి పట్ల భారత్‌ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ప్రస్తుతానికి భారత్‌ ‌వద్ద యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థ లేదు. డ్రోన్లు వచ్చినప్పడు వాటిపై కాల్పులు జరపడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఆకాశంలో సంచరించే వీటిపై గురి చూసి కాల్పులు జరపడం అంత తేలికైన విషయం కాదు. గురి చూసి లక్ష్యాన్ని నిర్దేశించుకునే సమయంలోనే అవి వాటి గమనాన్ని మార్చుకుంటాయి. అందువల్ల డ్రోన్లు తప్పించుకునే అవకాశమే ఎక్కువ. అంతర్జాతీయంగా ఆయుధాల కొనుగోలుకు సహజంగా రష్యా, అమెరికా, ఇజ్రాయెల్‌పై భారత్‌ ఆధార పడుతుంది. ఆయుధాలకు సంబంధించి ఇజ్రాయెల్‌ ‌మనకు మొదటి నుంచీ నమ్మకమైన భాగస్వామి. యాంటీ డ్రోన్లలో షార్ట్, ‌లాంగ్‌, ‌మీడియం వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని 3.45 కిలోమీటర్లు, మరికొన్ని ఆరు కిలోమీటర్లు ప్రయాణించగలవు. వివిధ మార్గాలు, వైపుల నుంచి దూసుకువచ్చే డ్రోన్లను విజయవంతంగా ఎదుర్కొనే శక్తి ఇజ్రాయెల్‌కు చెందిన యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థకు ఉంది. వీటి నాణ్యత, పనితీరుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. భారీ అంచనాలే ఉన్నాయి. భారత్‌ ‌వద్ద యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థ లేని మాట నిజమేనని రక్షణ రంగ నిపుణుడు అభిజిత్‌ అయ్యర్‌ ‌వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ‌నుంచి యాంటీ డ్రోన్‌ ‌వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి అధికారికంగా ప్రకటన లేనప్పటికీ, కొనుగోలు వాస్తవమేనన్న ప్రచారం దౌత్య వర్గాల్లో ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE