గోపరాజు

(కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృతోత్సవ్‌ ‌పిలుపు మేరకు ప్రచురిస్తున్న మూడోవ్యాసం.)

జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతానికి ఒడిగట్టిన బ్రిటిష్‌ ‌పాలకులనూ అహింసాయుత ఉద్యమంతోనే ఎదుర్కొనాలని గాంధీజీ ఆశించారు. జాతీయోద్య మానికి అహింసా సిద్ధాంతాన్ని చోదకశక్తిని చేశారు. ప్రజలు ఆచరించారు. ఆ సిద్ధాంతం కోసం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కూడా వదులుకున్న ఘటనలు జరిగాయి. కానీ బ్రిటిష్‌ ఇం‌డియా పోలీసులు ఏ చిన్న అవకాశం చిక్కినా, వీలైన చోటల్లా జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతాన్ని పునరావృతం చేయడానికే చూశారు. సెప్టెంబర్‌ 4,1920‌న గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సువిశాల భారతం మారుమూల ప్రాంతాలలో సైతం ఆ పిలుపు ప్రతిధ్వనించింది. చిత్రంగా, గాంధీజీలో ప్రజలు దేవుడిని చూశారు. నాటి మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రెండు ఘటనలు అహింసాయుత పంథాలో సాగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలకు రెండు రకాల అనుభవాలను ఇచ్చాయి. సాగరతీరంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది, గోదావరి తీరంలోని మరొక పెద్ద పుణ్యక్షేత్రం వాడపల్లి ఆ ఘట్టాలకు వేదికలైనాయి. అంతర్వేదిలో అహింసా వ్రతం కోసం రథయాత్ర ఆగింది. వాడపల్లిలో రథం ముందే రక్తం చిందింది.

తూర్పుగోదావరి జిల్లా, కోనసీమలో మారుమూల గ్రామం అంతర్వేది. లక్ష్మీనరసింహ స్వామి కొలువైన ఈ పుణ్యతీర్ధానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. శతాబ్దాలుగా అక్కడ ఏటా భీష్మ ఏకాదశికి గొప్ప ఉత్సవం జరుగుతున్నది. ఆ తీర్ధం (తిరనాల)లో రథోత్సవమే గొప్ప ఆకర్షణ. రథం ప్రధాన ఆలయం దగ్గర నుంచి బయలుదేరి, సమీపంలోని అశ్వరూఢాంబిక (స్వామివారి సోదరి) ఆలయం వరకు వెళ్లి వస్తుంది. తీర్ధానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఆ రథం లాగాలనీ, లోపల ఉన్న స్వామివారిని దర్శించుకోవాలనీ కోరుకుంటారు. కానీ చరిత్రలో మొదటిసారి, అదే ఆఖరిసారి కూడా కావచ్చు, 1922లో రథోత్సవం ఆగిపోయింది. కారణం- గాంధీజీ చిత్రపటం.

‘ది హిందు’ (ఫిబ్రవరి 13, 1922) సంచిక ఆ ఘట్టాన్ని నమోదు చేసింది. రాజమండ్రి దగ్గరి ధవళేశ్వరం నుంచి అంతర్వేది ఉత్సవానికి వెళ్లిన ఒక గ్రాడ్యుయేట్‌ ‌టీచర్‌ ఆరోజు జరిగిన ఘటనలను తెలియచేయగా, అక్కడ నుంచి ఆ పత్రిక విలేకరి నమోదు చేశారు. ఇదీ ఆ వార్త-

‘ఏటా ఏకాదశికి అంతర్వేదిలో జరిగే రథోత్సవం ఈ ఏడు జరగలేదు. ఉత్సవం చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులు నిరాశతో వెనుదిరగవలసి వచ్చింది. అంతర్వేది మహా పుణ్యక్షేత్రంలో రథం కదలకుండా నిలిచిపోయిన ఏకైక సంవత్సరం చరిత్రలో బహుశా ఇదే. గత ఏడాది ప్రజల అభ్యర్థనను అధికారులు మన్నించారు. గాంధీజీ చిత్రపటాన్ని అలంకరించి రథోత్సవం నిర్వహించు కోవడానికి నిరుడు అనుమతించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు చెప్పిన మరొక అంశం- ఈ ఉత్సవానికీ, రథం మీద దేవునితో పాటు గాంధీజీ పటం కూడా ఉంచాలన్న ఆశయానికీ, కాంగ్రెస్‌ ‌వాదులకీ ఏమీ సంబంధం లేదు. ఒక మతానికి చెందిన ఈ ఉత్సవంలో రథం లాగడం గురించి కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు జోక్యం చేసుకోరాదని పార్టీ తీర్మానించింది. అలాగే రథాన్ని గాంధీగారి పటంతో అలంకరించాలా వద్దా అనే అంశంలోను పార్టీ కార్యకర్తలు జోక్యం చేసుకోరాదని కూడా తీర్మానంలో స్పష్టం చేశారు. ఏది ఏమైనా తాము కోరుకున్నట్టు గాంధీజీ చిత్రపటాన్ని రథం మీద అలంకరించడానికి అధికారులు నిరాకరించడంతో రథాన్ని లాగడానికి భక్తులు కూడా నిరాకరించారు. పోలీసులు, సహాయవాదులు కూడా నయానా భయానా నచ్చ చెప్పే (భక్తులకు) ప్రయత్నం చేశారు. రథం లాగవలసిందని ప్రజలను ముందుకు నెడుతూ పోలీసులు, అధికారులు బలవంతపెట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఎల్‌సీ దివాన్‌ ‌బహదూర్‌ ‌డి. శేషగిరిరావు మాటను కూడా భక్తులు లెక్కపెట్ట లేదు. పంచములను, క్రైస్తవులను రథం లాగ వలసిందని కోరినా వారు ముందుకు రాలేదు.

విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాల దగ్గర జాతీయకాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పికెటింగ్‌ ‌జరపడంతో అమ్మకాలు బాగా పడిపోయాయి.’ (ఫ్రీడం స్ట్రగుల్‌ ఇన్‌ ఆం‌ధప్రదేశ్‌, ‌మూడో సంపుటం, మామిడిపూడి వెంకటరంగయ్య, 1965).

నిజానికి అంతర్వేది రథం ఘటనకు ఇది నూరేళ్ల సందర్భం.

ఒక సంప్రదాయం భగ్నమవుతున్నా గాంధీజీ పిలుపునీ, అహింసా వ్రతాన్నీ ఆచరించడానికే నాడు సాధారణ భక్తులు ప్రాధాన్యం ఇచ్చారని అంతర్వేది ఘటన చెబుతుంది. గాంధీజీ ఫొటోను రథం మీద నుంచి తొలగించినందుకు ఆ ఉత్సవాన్ని నిలిపివేశారు. తొమ్మిదేళ్ల తరువాత… అదే ఏకాదశి, అలాంటి రథయాత్ర, గాంధీజీ సహా స్వరాజ్య సమరయోధుల చిత్రపటాలను రథం మీద అలంకరించాలన్న యత్నం… కానీ స్థలం మారింది. వాడపల్లిలో జరిగిన ఈ ప్రయత్నం పోలీసు కాల్పులతో, రక్తపాతంతో భగ్నమైంది. రథం దగ్గర ఉన్న ప్రజలపై జరిగిన కాల్పులలో నలుగురు చనిపోయారు. కొందరు తూటాలు తగిలి గాయపడ్డారు. బ్రిటిష్‌ ‌వైఖరిలో వచ్చిన మార్పునకు ఇదొక గుర్తు.

రావులపాలానికి 10 మైళ్ల దూరంలో ఎగువ గోదారి తీరాన, ఆత్రేయపురం మండలంలో ఉంది వాడపల్లి. ఏడు శనివారా వెంకన్న పేరుతో ఇక్కడ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఏకాదశికే ఇక్కడ కూడా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలోను 1921 నుంచి రథం మీద గాంధీజీ చిత్రపటాన్ని అలంకరించి ఉత్సవ విగ్రహాలతో పాటు ఊరేగించేవారు. అందుకు మొదట అధికారులు అనుమతించారు కూడా. కానీ తరువాత అణచివేత పెరిగి పోలీసులు పరమ క్రూరంగా ఇలాంటి ఘటనలను ఆపడానికి యత్నించారు. మార్చి 30, 1931న వాడపల్లి రథోత్సవంలో జరిగిన రక్తపాతం దాని ఫలితమే.

వాడపల్లి వెంకన్న తీర్థం కూడా చాలా ప్రసిద్ధమైనదే. భక్తులు కూడా విశేష సంఖ్యలో హాజరవుతారు. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇది గతం నుంచి ఉన్నది. ఆ సంవత్సరం కూడా మార్చి 28న ఈ గ్రామానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న ఆత్రేయపురం పోలీసు స్టేషన్‌ ‌నుంచి సిబ్బంది వచ్చి బస చేసింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌పి.ఎస్‌. ‌రాఘవయ్య, ఎస్‌ఐ ‌ఖాదర్‌ ‌బాషా ఆరోజు వచ్చారు. కొత్తపేట మేజిస్ట్రేట్‌ ‌మహమ్మద్‌ అమానుల్లా, పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌బక్షి ముస్తఫాఅలీ ఖాన్‌ (‌రాజమండ్రి), కొత్తపేట ఎస్‌ఐ ‌బి. వీరాస్వామి మరునాడు వచ్చారు. రాజోలు ఫస్ట్‌క్లాస్‌ ‌మేజిస్ట్రేట్‌ (‌తహసీల్దారు) కోకా సత్యనారాయణ రథోత్సవం రోజే వచ్చాడు.

మువ్వన్నెల జెండా, గాంధీజీ, సరోజినీ నాయుడు, నెహ్రూ (తరువాతి కాలాలలో మొదలయింది) చిత్రపటాలను వాడపల్లి వెంకన్న రథానికి అలంకరించేవారు. ఇందుకు మొదట్లో పోలీసుల నుంచి, అధికారుల నుంచి ప్రతిబంధకాలు ఎదురుకాలేదు. అందుకే యథాప్రకారం 1931లో కూడా దంతులూరి లక్ష్మీపతిరాజు అనే జాతీయ కాంగ్రెస్‌ ‌స్థానిక నాయకుడు స్వరాజ్య సమరయోధుల చిత్రపటాలతో పాటు త్రివర్ణ పతాకాన్ని కూడా రథానికి అలంకరించారు. కానీ, మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రథం కొద్దిసేపట్లో కదులుతుందనగా కొందరు పోలీసులు వచ్చి వాటిని తొలగించారు. ఆ రోజులలో పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌ముస్తాఫా అలీఖాన్‌ ‌పరమ క్రూరునిగా పేరు మోశాడు. కాంగ్రెస్‌ ‌వారు చేసిన ప్రతి ఉద్యమాన్ని పరమ కిరాతంగా అణచివేసిన ఘనత ఇతడికి ఉంది. ఆ సంవత్సరం జెండా, చిత్రపటాల తొలగింపు కూడా ముఫ్తాఫా ఆజ్ఞ మేరకేనని నిరసన ప్రకటించిన ప్రజలకు పోలీసులు చెప్పారు. దీనితో భక్తులు రథం లాగడానికి నిరాకరించారు. పైగా రథం మోకుల మీదే కూర్చున్నారు. దీని గురించి ముస్తాఫాకు కబురు వెళ్లింది. తహసీల్దార్‌ ‌సత్యనారాయణ, కొత్తపేట సబ్‌ ‌మేజిస్ట్రేట్‌ అమానుల్లా, ముస్తాఫా అక్కడికి వచ్చారు. అక్కడే వీళ్లలో వీళ్లు చర్చించుకుని లాఠీచార్జికి ఆదేశించారు. తరువాత జనం తిరగబడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నలుగురు చనిపోయారు.

జరిగినది ఒకటైతే, పోలీసులు కోర్టులో దానికి పూర్తి విరుద్ధమైన కథనం వినిపించారు. అయినా ఇందులో కొన్ని తెలుసుకోవలసిన అంశాలు ఉన్నాయి. వాళ్లకి తెలియకుండానే కొన్ని చారిత్రక వాస్తవాలు వెలువడినాయి. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల వేళ 12 మంది పోలీసులతో కలసి ఆత్రేయపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌ఖాదర్‌ ‌బాషా, కొత్తపేట ఎస్‌ఐ ‌బి. వీరాస్వామి, రాజోలు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌రాఘవయ్య రథం చుట్టూ వలయంగా నిలిచారు. 3.30 ప్రాంతంలో ముస్తాఫా, కోకా సత్యనారాయణ ఉత్సవం దగ్గరకు వచ్చారు. స్థానాచారి పరవస్తు పట్టాభిరామ వెంకట రంగాచార్యులు రథం కదలవచ్చునన్నట్టు ‘గోవింద’ అని నినదించారు. కానీ మూడు లేదా నాలుగు వందల మంది సహాయ నిరాకరణోద్యమకారులు రథం తాడు మీద కూర్చుని గాంధీజీ, సరోజినీ నాయుడు, నెహ్రూ, త్రివర్ణ పతాకం అలంకరిస్తే గాని రథాన్ని కదలనీయమని భీష్మించారు. రథం లాగవద్దని భక్తులను హెచ్చరించారు. అయినా భక్తులు రథం లాగడానికి యత్నిస్తే ఉద్యమకారులు నిరోధించారు. దీనితో భక్తులే పోలీసులను కోరగా ఉద్యమకారులను వారు పంపేశారు. వెళ్లిపోయిన ఉద్యమకారులు ప్రజల మీద, అధికారుల మీద రాళ్లు రువ్వారు. కొత్తపేట ఎస్‌ఐ ‌గెడ్డానికి గాయమైంది. మొదట గాలిలోకి కాల్పులు జరిపినా ఫలితం లేకపోవడంతో మేజిస్ట్రేట్‌ ‌కాల్పులకు అనుమతించాడు. ఐదుగురు సాయుధ పోలీసులు కాల్పులు జరిపారు. మొత్తం 30 రౌండ్లు కాల్చారు. కరటూరి సత్యనారాయణ, పాతపాటు వెంకటరాజు, వాడపల్లి గంగాచలం, బండారు నారాయణస్వామి తూటాలకు నెలకొరిగారు. ఒక దశ తుపాకీ కాల్పులు జరిగాక జనం తిరగబడ్డారు. దాదాపు వేయి మంది పోలీసుల మీద దాడి చేశారని కొందరు చెబుతారు. దానితో రెండోసారి మళ్లీ కాల్పులు జరిగాయి. ఇందుకు పోలీసులు ఇచ్చిన వివరణను కూడా న్యాయమూర్తి విశ్వసించలేదు. కానీ కాల్పులు జరిపిన తరువాత కూడా ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకుని మరొకసారి పోలీసులను ఎదిరించారంటే చిన్న విషయం కాదు.

నంబూరి జగ్గరాజు, నామన బాపన్న, పెన్మత్స సత్యనారాయణరాజు, దాట్ల సత్యనారాయణరాజు (నాయకులు), పెన్మత్స వెంకట నరసింహరాజు, చేకూరి సత్యనారాయణరాజు, చేకూరి రామరాజు, ముదునూరి నారాయణరాజు, ముదునూరి గనిరాజు, మర్ల శాస్త్రులు, సాగిరాజు వెంకటసుబ్బరాజు, సాగిరాజు వెంకటరాజు, తూము వెంకన్న, ఇందుకూరి సత్యనారాయణరాజు, సఖినేటి సుబ్బరాజు, నంబూరి తాతరాజు, నంబూరి సత్తిరాజు, దంతులూరి లక్ష్మీపతిరాజు, ముదునూరి సూర్యనారాయణరాజు, పడాల సుబ్బిరెడ్డి, దండు జగ్గరాజు, ముదునూరి సుబ్బరాజు, మైపాల రామన్న, ఇందుకూరి రామరాజు, మద్దిపాటి సత్యనారాయణ లపై కేసు పెట్టారు. జిల్లా సెషన్స్ ‌కోర్టులో కేసు నడిచింది. ఆ సంవత్సరం నవంబర్‌ 23‌న తీర్పు వచ్చింది. కానీ పోలీసుల కథనాన్ని న్యాయమూర్తి కొట్టి పారేశారు. ఇందులో ఐదుగురు ఆరోజు అసలు సంఘటన జరిగిన సమయంలో వాడపల్లిలోనే లేరని తేలింది.

వాడపల్లిలో కూడా ప్రజలు గాంధీజీ, పతాకం, ఇతర నేతల చిత్రపటాలు తీసివేసినందుకు శాంతియుతంగానే నిరసన తెలియచేశారు. నిజానికి ముస్తాఫా, ఇతర అధికారులు కక్ష పూరితంగానే ఇంతమంది మీద కేసు పెట్టారు. ఈ ఉత్సవంలో నిరసన ప్రకటించిన కాంగ్రెస్‌ ‌వాదులలో అత్యధికులు అంతకు ముందు వరకు జరిగిన స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నవారే. అనేక కేసులను ఎదు ర్కొంటున్నవారే. కానీ గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికతో రాజకీయ ఖైదీలందరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసి వచ్చింది. అలా వారంతా శిక్షలు పడకుండా విడుదలయ్యారు. కానీ మళ్లీ ఏదో విధంగా కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ముస్తాఫా కేసులు బనాయించాడు. వాడపల్లి రథం మీద గాంధీజీ చిత్రపటాన్ని అలంకరించిన దంతులూరి లక్ష్మీపతిరాజు 1921 నుంచి తాలూకా, జిల్లా కాంగ్రెస్‌ ‌శాఖలలో సభ్యుడు. మొదట్లో కూడా రథం మీద గాంధీజీ చిత్రపటం పెట్టినందుకు ఆయన మీద కేసు నమోదు చేశారు. కానీ అది కోర్టు కొట్టివేసింది. ఆ ఘటన తరువాత నుంచి అంతా ఆయనను దళపతి అని గౌరవంగా పిలిచేవారు. జీవితాంతం ప్రజాసేవలోనే గడిపారు. ఆస్తంతా ప్రజాసేవలో, ఉద్యమంలో పోగొట్టుకున్నారు. ఈ కేసులో ఉన్నవారిలో మైపాల రామన్న తిరునాలలో అరటిపళ్ల దుకాణం పెట్టుకున్నాడు. తూటా వచ్చి తొడలో దూరిపోయింది. కానీ ఇతడి మీదనే తిరిగి కేసు బనాయించారు. మరొక ముద్దాయి ఇందుకూరి రామరాజు చలివేంద్రంలో సేవాదృక్పథంతో భక్తులకు మంచినీరు అందిస్తుండగా తుపాకీ గుండు వచ్చి తగిలింది. ఈ గొడవకు 70, 80 గజాల దూరంలో ఉన్న వ్యక్తి మద్దిపాటి సత్యనారాయణ. ఈయనకు కూడా తూటా తగిలింది. పోలీసులు కేసులో ఇరికించారు.

నిజానికి ఇదంతా ముస్తాఫా కుట్ర మేరకే జరిగినట్టు కనిపిస్తుంది. అంతర్వేది ఘటన తరువాత వాడపల్లిలో కూడా ఇలాంటి ఘటన జరుగుతుందని, దానిని ఎదుర్కొనాలని కొత్తపేట సబ్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌మహమ్మదుల్లా ముందే జిల్లా మేజిస్ట్రేట్‌కు ఒక రహస్య నివేదిక పంపాడు. అదే పునరావృతమైతే తాను చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అన్నదే అతడి విన్నపం సారాంశం. ఈ నివేదిక ప్రతిని ముస్తాఫాకు కూడా అతడు పంపించాడు. కాబట్టి అదంతా ఆ ఇద్దరి కుట్ర ఫలితమేనని తేటతెల్ల మవుతున్నది. కానీ సహాయ నిరాకరణ వాదులు జెండా, గాంధీజీ చిత్రపటం పెట్టినా (వాడపల్లిలో) పోలీసులు కలగజేజుకోరాదనే జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాలు ఇచ్చాడు. అయినా ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇంత హింసాకాండకు పాల్పడ్డారు. పోలీసులు దౌర్జన్యం చేయకుంటే రథయాత్ర శాంతియుతంగానే జరిగేది అని న్యాయమూర్తి ఎం.ఆర్‌. ‌శంకరయ్యర్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. ఏ సూచనా హెచ్చరికా ఇవ్వకుండానే శాంతి యుతంగా ఉన్న యాత్రికుల మీద, గ్రామంలోను పోలీసులు అనవసరంగా కాల్పులు జరిపారు అని ఆయన నిర్ధారించారు. స్థానాచారి రంగాచార్యులవారి సాక్ష్యం కూడా విఫలమైంది. పోలీసులు బెదిరించడం తోనే వారికి అనుకూలంగా సాక్ష్యం ఇచ్చానని ఆయన కోర్టులో చెప్పారు. కరణం, మునసబు, గ్రామస్తుల పేరుతో వచ్చిన ఫిర్యాదు ఇవన్నీ కూడా నమ్మశక్యంగా లేవనే న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ‌వాదులు దౌర్జన్యానికి దిగారంటూ ఊరివారు చెప్పినట్టు కరణమే ఒక ఫిర్యాదు పుట్టించారని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. ముస్తాఫా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వివరణ ఇవ్వడంతో అభాసు పాలయ్యాడు (ముఫ్తాఫా సహచరుడు కానిస్టేబుల్‌ ‌డప్పులు సుబ్బారావు. ఇతని ఇంటి పేరు డప్పులు కానేకాదు. ఏదో ఉంది. కానీ ఎక్కడ కాంగ్రెస్‌ ‌సభ జరిగినా డప్పులు ఏర్పాటు చేసి చెడగొట్టేవాడు. 1923 నాటి కాకినాడ కాంగ్రెస్‌ ‌సభల దగ్గర కూడా డప్పులు కార్యక్రమం ఏర్పాటు చేశాడని చెబుతారు ఒక కవి ఇతడిని డప్పుల సుబ్బిగాడు అని ముద్దుగా ప్రస్తావించాడు). సాక్షులుగా పోలీసులు ప్రవేశపెట్టిన వారిలో ఇద్దరు చిల్లర నేరగాళ్లు కావడం విశేషం. పోలీసులు తెచ్చిన మరొక సాక్షి బి. మాణిక్యం మొదటే లాఠీచార్జి జరిగిందని, ఆ తరువాత రాళ్లు వచ్చి పడ్డాయని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. గంటపాటు తుపాకీ కాల్పులు జరిగిన సంగతి కూడా ఇతడే చెప్పాడు. కాల్పుల ఘటన జరిగిన ఏడురోజుల తరువాత కూడా ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ గ్రామం మీద పడి పోలీసులు బీభత్సం సృష్టించారు. కాల్పులలో గాయపడి ఆసుపత్రులలో ఉన్నవారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఎవరు దొరికితే వారి మీద కేసు పెట్టారు. అరటిపళ్లు అమ్ముకునే వ్యక్తినీ, చలివేంద్రంలో నీళ్లు అందిస్తున్న వారిని కూడా కోర్టులో నిలబెట్టారు. (భారత స్వాతంత్య్ర సమరాంగణంలో గోదావరి తీరం పుస్తకం నుంచి. సంకలనం పిఎస్‌ ‌శర్మ, 1987 నుంచి)

వాడపల్లి రక్తపంకిల చరిత్ర స్మారక చిహ్నాన్ని అక్టోబర్‌ 7,1987‌న అక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర జిల్లా ప్రముఖులు ప్రతిష్టించారు.

About Author

By editor

Twitter
YOUTUBE