ప్రభుత్వం అంటే పాలనా వ్యవస్థకు ఊతం.. అభివృద్ధికి వాహకం.. ప్రభుత్వం అంటే వ్యాపార రహిత దృక్పథం. కానీ, కొన్నేళ్లుగా ప్రభుత్వానికి అర్థం మారిపోతోంది. సంక్షేమం, అభివృద్ధి కన్నా ఆదాయం, సంపాదన ప్రధానాంశం అయిపోతోంది. వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మొదలైన ప్రభుత్వ భూముల వేలం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు, విలువైన భూముల అమ్మకాలు సాగుతున్నాయి.

ప్రభుత్వం అంటే పాలనా వ్యవస్థకు ఊతం.. అభివృద్ధికి వాహకం.. ప్రభుత్వం అంటే వ్యాపార రహిత దృక్పథం. కానీ, కొన్నేళ్లుగా ప్రభుత్వానికి అర్థం మారిపోతోంది. సంక్షేమం, అభివృద్ధి కన్నా ఆదాయం, సంపాదన ప్రధానాంశం అయిపోతోంది. వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మొదలైన ప్రభుత్వ భూముల వేలం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు, విలువైన భూముల అమ్మకాలు సాగుతున్నాయి.

కేసీఆర్‌ ‌ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఉప్పల్‌ ‌భగాయత్‌ ‌భూములను వేలం వేసింది. హైదరాబాద్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎం‌డిఏ) ఆధ్వర్యంలో ఈ భూముల వేలం కొనసాగింది. ఆన్‌లైన్‌ ‌వేలం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంది. అదే ప్రేరణతో ఇప్పుడు హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతంలో ఉన్న కోకాపేట్‌, ‌ఖానామెట్‌ ‌భూములను వేలం వేసింది.

ఉప్పల్‌ ‌భగాయత్‌ ‌భూముల వేలం నిర్వహించిన సంస్థే.. కోకాపేట్‌, ‌ఖానామెట్‌ ‌భూముల వేలం పక్రియనూ నిర్వహించింది.

ప్రభుత్వం అంచనా వృథా పోలేదు. హెచ్‌ఎం‌డిఏ గురి తప్పలేదు. మొత్తానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వాస్తవానికి 2500 కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా వేయగా,  2700 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. ఈనెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆన్‌లైన్‌ ‌వేలం పక్రియలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.

అయితే ఈ భూముల వేలానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 13‌ను కొట్టివేయాలంటూ బీజేపీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆ మరుసటి రోజే భూముల వేలం కొనసాగింది. అయితే, ఖానామెట్‌ ‌భూముల వేలం తర్వాత స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. వేలం వేసిన ఈ స్థలంలో స్మశానవాటిక ఉందని, ఆ స్మశానవాటికను కూడా వేలం వేసి ప్రభుత్వం తమ మనోభావాలు దెబ్బ తీసిందని ఆరోపించారు. ఈ వాదనను సమర్థించిన న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీంతో, కోకాపేట్‌, ‌ఖానామెట్‌ ‌భూముల ప్రదేశంలో పూర్తిగా పోలీసులను మోహరించారు. అటువైపు ఎవరినీ వెళ్లనీయడం లేదు.

మరోవైపు ఈ వేలం పక్రియలో వెయ్యి కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు ఆరోపించాయి. సీఎం కేసీఆర్‌ అనుచరులే వేలం పాటలో పాల్గొని విలువైన ప్రభుత్వ భూములు దక్కించుకున్నారంటూ ఆరోపించారు. ఆన్‌లైన్‌ ‌వేలంలో ఇతరులు ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. దీనికి కొనసాగింపుగా.. కాంగ్రెస్‌ ‌పార్టీ చలో కోకాపేట్‌ ఆం‌దోళనలకు పిలుపునిచ్చింది. ఈనెల 19వ తేదీన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చలో కోకాపేట్‌కు సన్నాహాలు చేయగా..  కాంగ్రెస్‌ ‌నేతలు అందరినీ ఎక్కడికక్కడ పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. మధ్యాహ్నం దాకా ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా కాపలా కాశారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం అన్న విషయాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ‌స్వయంగా ఈ విషయాన్ని పలు సార్లు ప్రకటించారు కూడా. కేసీఆర్‌ ‌ప్రకటనే కాదు.. వాస్తవ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్‌ ‌మాత్రమే.

ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో 23 జిల్లాల పోషణ, వేతనాల వ్యవహారం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆదాయంలో అధికభాగం హైదరాబాద్‌ ‌నుంచే సమకూరేది. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్‌ ‌నగరం అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంది. అంతేకాదు, చుట్టూ దాదాపు 100 కిలోమీటర్ల మేర నగరం విస్తరించింది. స్థానిక పరిశ్రమలకు తోడు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆదాయం మొత్తం తెలంగాణకే పరిమితం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు వినియోగించిన ఆదాయం తెలంగాణ వచ్చాక పది జిల్లాల్లో మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు లభించింది. దీంతో దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కానీ, ఐదేళ్లు గడిచేసరికే ధనిక తెలంగాణ కాస్తా అప్పుల తెలంగాణగా మారిపోయింది. అత్యధిక ఆదాయం, మిగులు ఉన్న రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ ‌హయాంలో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఇప్పుడు భూములు వేలం వేసి నెట్టుకురావలసిన పరిస్థితి దాపురించింది. ఈ పరిణామాలు తెలంగాణవాదులను, ప్రజాస్వామ్యవాదులను, సామాజిక సంస్థలను, ప్రజాసంఘాలను, విపక్షాలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్తులో పరిస్థితి ఏంటని మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

– సుజాత గోపగోని, 6302164068 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE