–    తొలి సమావేశంలోనే కొవిడ్‌ ‌మీద రణభేరి

–    మహమ్మారి మీద పోరుకు రూ. 23వేల కోట్లు

–    కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ

–    జి. కిషన్‌రెడ్డికి కేబినెట్‌ ‌మంత్రిగా పదోన్నతి

–    కొత్త ఆరోగ్యమంత్రి మన్సుక్‌ ‌మాండవీయ

–    ధర్మేంద్ర ప్రధాన్‌కు కొత్త విద్యా విధానం బాధ్యత

–    11 మంది మహిళలకు అమాత్య పదవులు

ప్రజాస్వామిక వ్యవస్థగానే కాదు, బలీయ ఆర్థికశక్తిగా కూడా ఆధునిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి భారత్‌ ‌వడివడిగా అడుగులు వేస్తున్నది. చరిత్ర, సంస్కృతి, జీవన వైవిధ్యం, బహుళ సంస్కృతులు వంటి ప్రత్యేక లక్షణాలను, మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటూనే భారత్‌ ‌నేడు ప్రపంచంలో విశిష్టతను సంతరించు కుంటున్నది. అందుకు అవసరమైన జవసత్వాలూ, నేపథ్యం సమకూరుస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ప్రధాని మోదీ ప్రతి అడుగు ఆయన ఆశయం ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ఆవిష్కారం కోసమే పడుతున్నదని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. దేశ సమగ్రత, రక్షణ, జాతీయ శక్తుల పునరేకీకరణ, అట్టడుగు వర్గాలను పాలనలో భాగం చేయడం వంటి ఆశయాలు ఆయన ప్రతి ఆలోచనలోను, ఆచరణలోను కనిపిస్తున్నాయి. కమ్యూనిటీ కేంద్రంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పటిష్టతకు కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను కూడా మోదీ ప్రవేశపెట్టారు. రాజకీయ దళారీ సంస్కృతికి పాతరేసి, బుజ్జగింపు రాజకీయాల నడ్డి విరిచి, అందరినీ జాతీయతా స్రవంతిలోకి తేవడానికి అహరహం యత్నిస్తున్న వారు ప్రధాని నరేంద్ర మోదీ. జూలై 7వ తేదీ సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్‌ ‌వ్యవస్థీకరణలోను ఇదే ప్రతిఫలించింది. గడచిన ఏడేళ్లలో ఇంతవరకు పడని అవినీతి మచ్చ ఇకపైనా పడకుండా మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ విస్తరణ అంటే అసమ్మతి వర్గాన్ని జోకొట్టేందుకు చేసినది కాదు. పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన పక్రియ. నిన్నటి వరకు పనిచేసిన కేబినెట్‌ ఇచ్చిన అనుభవాలూ, పాఠాలూ ఆధారంగా నిర్మించిన కొత్త మంత్రిమండలి ఇది.

మౌలికమైన భారతీయతను విస్మరించకుండానే గొప్ప కసరత్తుతో ప్రధాని మోదీ మంత్రిమండలికి కొత్త రూపు ఇచ్చారు. 2019 మే మాసంలో రెండోసారి ప్రధాని అయిన తరువాత మంత్రివర్గ నిర్మాణంలో చూపించిన కౌశం 2014 నాటి మంత్రిమండలి ఏర్పాటుకు కొనసాగింపే. కేంద్రంలో ఇప్పుడున్న 53 మంత్రిత్వ శాఖలను 30 మంది కేబినెట్‌ ‌మంత్రులు, స్వతంత్ర హోదాతో ఇద్దరు సహాయ మంత్రులు నిర్వహిస్తారు. శాఖల మధ్య దూరం తగ్గించేందుకు మోదీ కొత్త శైలిలో కూర్పును చూపారు. ఉదాహరణకి మన్సుక్‌ ‌మాండవీయకు ఆరోగ్య శాఖతో పాటు రసాయనాలు, ఎరువుల శాఖను కూడా అప్పగించారు. మరొక మంచి ఉదాహరణ మీనాక్షి లేఖి. ఈమెకు భారత సాంస్కృతిక ప్రయోజనాల గురించి ప్రత్యేక అధ్యయనం ఉంది. అందుకే లేఖికి విదేశాంగ వ్యవహారాల శాఖలోను, సాంస్కృతిక శాఖలోను కూడా సహాయ మంత్రి హోదా ఇచ్చారు. అలాగే పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలను పెట్రోలియం శాఖతో కలిపారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని మన నగరాలలో, ఇళ్లలో ఎనర్జీ ఎఫిషియంట్‌ ‌పెట్రో ఉత్పత్తుల వాడకం అవసరాన్ని తెలియచేయడానికి ఈ చర్య తీసుకున్నారు. ఇప్పుడు ఈ శాఖను హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురికి అప్పగించారు.

కరోనా కట్టడికి ప్యాకేజీ

విస్తరణ మరునాడే కొత్త మంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది దేశంలో వైద్యరంగంలో మౌలిక వసతుల మెరుగు కోసం రూ. 23.123 కోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలియచేసింది. డెల్టా వేరియంట్‌తో ఇంకా కొన్ని ప్రపంచ దేశాలు యాతన పడుతూ ఉండగానే, ల్యామ్డా పేరుతో మరొక వేరియంట్‌ ‌దాదాపు ముప్పయ్‌ ‌దేశాల మీద పడగ విప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. వాటి విశ్వసనీయత మాట ఎలా ఉన్నా, కరోనా పట్ల అప్రమత్తత తక్షణ కర్తవ్యంగానే కొత్త మంత్రిమండలి గుర్తించింది. అలాగే వ్యవసాయరంగ మౌలిక వసతులకు నిధిని ఏర్పాటు చేయడం మరొకటి. రూ. 1,00,000 కోట్లతో ఆ నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధి నుంచి రుణం పొందేందుకు వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీలకు అవకాశం ఇస్తారు. ఇందుకు సంబంధించిన ఇతర వ్యవస్థలకు కూడా ఈ రుణం తీసుకునే అవకాశం ఇస్తున్నారు.

సహకారోద్యమానికి ఊపిరి

మంత్రివర్గ విస్తరణకు ముందురోజు అంటే జూలై 6వ తేదీన ప్రధాని మోదీ ఒక కొత్త మంత్రిత్వశాఖకు శ్రీకారం చుట్టారు. పైగా ఆ శాఖను హోంశాఖను నిర్వహిస్తున్న అమిత్‌షా ఆధ్వర్యంలోనే ఉంచారు. దీనిని బట్టే ఈ శాఖ పట్ల ప్రధాని శ్రద్ధాసక్తులు వెల్లడవుతున్నాయి. అదే సహకార మంత్రిత్వ శాఖ. దేశంలో సహకారోద్యమాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించారు. ‘సహకారంతో సమృద్ధి’ నినాదంతో ఇది ఊపిరి పోసుకుంది. ఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటు గురించి బడ్జెట్‌లో కూడా ఆర్థికమంత్రి ప్రస్తావించారు. ఇది లాభాపేక్ష లేని సులభ వ్యాపారానికి సాయపడుతుంది. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కమ్యూనిటీ కేంద్రంగా బలోపేతం చేస్తుంది.

విస్తరణ వెనుక విస్తృత దృష్టి

జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ప్రాధాన్యాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకునే మంత్రివర్గ పునర్‌ ‌నిర్మాణం జరిగిన సంగతి విస్మరించలేనిది. కొన్ని దశాబ్దాల పాటు కొనసాగే కరోనా ప్రభావం నుంచి మన వ్యవస్థలను కాపాడడానికి అత్యవసరంగా కావలసిన పటిష్ట పాలనను మంత్రివర్గ పునర్‌ ‌నిర్మాణం ద్వారా ప్రధాని ఆశిస్తున్నారని అర్ధమవుతుంది. అంతేకాదు, దేశంలో నానాటికీ పెరుగుతున్న నాయకత్వ కొరతను తీర్చడానికి మోదీ తనదైన ప్రయత్నం చేశారని అనిపిస్తుంది. గతంలో కంటే ఈసారి యువతరానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యమే ఇందుకు గీటురాయి. గరిష్టంగా 58 సంవత్సరాలు, కనిష్టంగా 32 ఏళ్ల వారికే మంత్రివర్గంలో చోటిచ్చారు. చిరకాలంగా అధికారానికి దూరంగా ఉండిపోయిన (ఎస్సీలలో) చమర్‌, ‌ఖాతిక్‌, ‌పాసీ, కోరి, మాదిగ, మహర్‌, అరుంధతీయార్‌, ‌మేఘ్వాల్‌, ‌రాజ్‌బోన్షి, మథువా-నామశూద్ర, దంగర్‌ ‌తదితర ఉపకులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారికి అవకాశం దక్కింది. ఎస్టీలలో గోండులు, సంథాలులు, మిజి వంటి వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారు. మొదటిసారి లోక్‌సభలో ప్రవేశించిన వారు కూడా తగిన సంఖ్యలోనే మంత్రులయ్యారు. ఈ విస్తరణ ఒక విస్తృత దృష్టితో, విశాల దృక్పథంతోనే జరిగిందని మీడియాలో ఎక్కువ మంది అభిప్రాయ పడడం ఇందుకే. మరొక అంశం- అనుభవజ్ఞులు, కొత్తవారికి మధ్య సమతౌల్యం ఉండే విధంగా కూడా ఈ కూర్పు జరిగిందని చెబుతున్నారు.

అనుభవానికి, కొత్తతరానికి చోటు

కొత్తగా 36 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. పదోన్నతి సాధించినవారు సహా మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేశారు. దీనితో మంత్రుల సంఖ్య (ప్రధాని సహా) 78కి చేరుకుంది. నిజానికి మరొక ముగ్గురికి ఇంకా అవకాశం ఉంది. అంటే 81 మంది మంత్రులు ఉండవచ్చు. పదోన్నతి పొందిన వారిలో సికింద్రాబాద్‌ ఎం‌పీ జి. కిషన్‌రెడ్డి సహా ఏడుగురు ఉన్నారు. ఇంతవరకు హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, విస్తరణ ఫలితంగా కేబినెట్‌ ‌హోదా పొందారు. సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖను ఆయనకు కేటాయించారు. మోదీ మంత్రివర్గంలో కేబినెట్‌ ‌హోదా పొందిన వారిలో రెండవ తెలుగు వ్యక్తి కిషన్‌రెడ్డి. మొదట ఆ గౌరవం ఎం. వెంకయ్యనాయుడు పొందారు. ఎన్‌డీఏ భాగస్వామి పక్షాలు జనతాదళ్‌(‌యు), లోక్‌జనశక్తి, అప్నాదళ్‌ ‌పార్టీలకు కూడా అవకాశం కల్పించారు. కరోనా కారణంగా విమర్శలు ఎదుర్కొన్న మంత్రుల పట్ల ప్రధాని కఠినంగానే వ్యవహరించారు. వేర్వేరు కారణాలతో మొత్తం 12 మంది పాతవారికి ఈసారి అవకాశం కల్పించలేదు. మొత్తం 15 మంది కేబినెట్‌ ‌మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఆరుగురు కేబినెట్‌ ‌మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు 50 లోపు వయసు వారే. ఐదుగురు మైనారిటీలు మంత్రివర్గంలో ఉన్నారు. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మోదీ మంత్రులుగా అవకాశం కల్పించారు. పదకొండు మంది మహిళలు మంత్రు లయ్యారు. ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. డాక్టర్లు, డాక్టరేట్లు, ఇంజనీర్లు, మాజీ ఐఏఎస్‌లు, లాయర్లు పదవులు పొందినవారిలో ఉన్నారు.

ప్రధాన స్రవంతి పత్రికలలో విస్తరణ గురించి రకరకాల విశ్లేషణలు, వివిధ కోణాలలో వచ్చాయి. కులాల మధ్య సమతౌల్యం చూశారనీ, త్వరలో ఎన్నికల జరగబోయే రాష్ట్రాలకు ఎక్కువ పదవులు ఇచ్చారనీ రాజకీయ పండితులు పేర్కొన్నారు. అలాగే మంత్రుల తొలగింపు గురించి కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. వాటి సంగతి అలా ఉంచితే, కొందరు మంత్రుల ఎంపికలో కొన్ని ప్రాధాన్యాలు ఉన్న సంగతి అర్ధమవుతుంది. ఇంకొందరు మంత్రుల నేపథ్యం కూడా గమనించదగినది.

కొందరి స్థానం యథాతథం

నాలుగు ప్రధాన శాఖల మంత్రులను ప్రధాని మార్చలేదు. వీరి శాఖలు మారతాయని కొన్ని విశ్లేషణలు, ఊహాగానాలు వచ్చినా అది జరగలేదు. రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ (‌రక్షణ), అమిత్‌షా (హోంశాఖ), నిర్మలా సీతారామన్‌ (ఆర్థికశాఖ), జైశంకర్‌ (‌విదేశీ వ్యవహారాలు) అవే పదవులలో కొనసాగుతున్నారు. స్మృతి ఇరానీ, రామదాస్‌ అథవాలే, ముక్తార్‌ అబ్బాస్‌ ‌నక్వి, పీయూష్‌ ‌గోయెల్‌లతో పాటు, చాలామంది సహాయమంత్రుల స్థానం కూడా భద్రంగానే ఉంది.

కేటాయింపులలో మర్మం

తాజా మంత్రిమండలిలో స్థానం పొందిన కొందరు కొత్త మంత్రుల నేపథ్యం గమనించదగినది. ప్రస్తుతం ఇచ్చిన శాఖకు, ఆ నేపథ్యానికి ఉన్న బంధం ఏదో కూడా చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. గడచిన రెండేళ్లలో ప్రపంచంతో పాటు భారత్‌ ‌కూడా ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట సమస్య కొవిడ్‌ 19. ‌మొదటి రెండుదశల కొవిడ్‌ను డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌నాయకత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఎదుర్కొన్నది. మూడోదశ కొవిడ్‌ అం‌చనాలు ఉన్నప్పటికి హర్షవర్ధన్‌కు మంత్రి మండలి పునర్‌ ‌వ్యవస్థీకరణలో చోటు దక్కలేదు. ఆ శాఖను తాజాగా మన్సుఖ్‌ ‌మాండవీయకు అప్పగించారు. గుజరాత్‌కు చెందిన మాండవీయ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించే మంత్రిత్వ శాఖలలో ఆరోగ్య శాఖదే అగ్రతాంబూలం. కొవిడ్‌ ‌మహమ్మారితో భారత్‌ ఇం‌కా పోరాడవలసి ఉంది. ఈ మహమ్మారి ఇచ్చిన అనుభవాలతో దేశ ఆరోగ్య వ్యవస్థను రూపుదిద్దే పని కూడా ఉంటుంది. ఇలాంటి శాఖను మాండవీయకు అప్పగించడానికి ఉన్న పెద్ద అనుభవం- ఆయన ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన్‌’ అమలు కార్యక్రమానికి చోదకశక్తిగా ఉన్నారు. ఔషధి పరియోజన కేంద్రాలు 347 నుంచి 5200కు పెరగడం ఆయన ద్వారా జరిగింది. గుండె స్టెంట్లు, మోకాళ్ల ఇంప్లాంట్లు కూడా ఈ కేంద్రాల ద్వారా సాధారణ ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా కారణంగా కుదేలైన వ్యవస్థలలో ఆరోగ్యం తరువాత చెప్పుకోవలసినది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. ఇప్పుడు ఈ శాఖను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నారాయణ్‌ ‌రాణేకు అప్పగించారు. ఆర్థికమంత్రి ఇంతవరకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలలో వీటి వాటా పెద్దది. వీటికి పూర్వ వైభవం కల్పించడం అంటే, నిరుద్యోగాన్ని తగ్గించడమే. ఆ విధంగా చూస్తే ఇటీవల బీజేపీలో ప్రవేశించి మంత్రి పదవి పొందిన ఈ నేత మీద ప్రధాని విస్తృత బాధ్యతనే ఉంచారు.

కరోనాకు ముందు నుంచి పలు సమస్యలతో, నష్టాల బాటలోనే ఉన్న పౌరవిమానయాన రంగం కరోనా నేపథ్యంలో మరీ కుంగిపోయింది. ఈ మంత్రిత్వ శాఖ ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. సమస్యల భారం దింపి, విమానాలను తేలికగా గాలిలోకి ఎగిరేటట్టు చేయడానికి సింధియా పెద్ద యజ్ఞమే చేయవలసి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

 మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగా అవకాశం అందుకున్న జాన్‌ ‌బర్లాను మంత్రివర్గంలోకి ఆహ్వానించడం కీలక సందర్భంలోనే జరిగింది. ఆయనకు అవకాశం ఇవ్వడం అంటే సబ్‌కా వికాస్‌ ఆశయాన్ని బీజేపీ ఆచరణలో చూపుతున్నదన్న విషయం రుజువు కావడమే కాకుండా, నేటి పరిస్థితులలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ ఎదుర్కొంటున్న తీవ్ర మత, సామాజిక సమస్యకు అవసరమైన రాజకీయ పరిష్కారాన్ని కూడా ప్రధాని ఆశించినట్టు కనిపిస్తుంది. ఉత్తర బెంగాల్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరుతున్నారు. వివక్షకు గురవుతూ, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన ఈ ప్రాంతాన్ని, అలాగే అక్కడి అదుపులేని అరాచకాలకు సమాధానంగాను తాను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరుతున్నట్టు బర్లా బాహాటంగానే చెబుతున్నారు. ఈ పిలుపు తరువాత ఆయన మీద టీఎంసీ కార్యకర్తలు లెక్కలేనన్ని కేసులు పెట్టారు. జాన్‌ ఉత్తర బెంగాల్‌లోని అలీపుర్దార్‌ ‌నియోజకవర్గం నుంచి 2019లో ఘన విజయం సాధించి లోక్‌సభకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఆయన బలమైన నాయకుడు. అందుకే అంతటి కీలకమైన పిలుపును ఇవ్వగలిగారు కూడా. మూడున్నర దశాబ్దాల మార్క్సిస్టుల పాలన, పదేళ్ల మమత పాలనతో పశ్చిమ బెంగాల్‌లో స్వైర విహారం చేస్తున్న విధ్వంసకర, వేర్పాటువాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జాతీయ స్ఫూర్తితో గళం విప్పిన గిరిజన నాయకుడు బర్లా. అఖిల భారతీయ ఆదివాసి వికాస్‌ ‌పరిషత్‌ ‌నుంచి ఆయన వచ్చారు. 2014లో బీజేపీలో చేరారు. గిరిజనుల విద్యావకాశాలు, తేయాకు తోటల కార్మికుల దుస్థితి పైన చిరకాలంగా పోరాడుతున్నారు. బర్లా తేయాకు కార్మికునిగానే జీవితం ఆరంభించి రాజకీయాలలోకి వచ్చారు. ప్రస్తుత బెంగాల్‌ అరాచకం నేపథ్యంలో ఉత్తర బెంగాల్‌కు కేంద్ర పాలిత ప్రాంత హోదా అంటూ నినదించిన బర్లాకు స్థానం ఇవ్వడం అంటే, చిన్న రాష్ట్రాలు అన్న బీజేపీ విధానం కొత్త ఆకృతితో మళ్లీ దేశం ముందుకు రాబోతున్నదేమో చూడాలి. అలాగే మతోన్మాదం, వేర్పాటువాదం పెచ్చరిల్లిపోతున్న తరుణంలో కొన్ని ప్రాంతాలను కేంద్రపాలితాలుగా చేయడం అవసరమని దేశ ప్రజలలో కూడా ఒక అభిప్రాయం ఉన్నమాట నిజం.

ఎన్నో అడ్డంకుల మధ్య ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్ట దలుచుకున్న కొత్త విద్యావిధానం అమలు మోదీ ప్రభుత్వానికి సవాలు వంటిది. ఇంతకు ముందు విద్యాశాఖను నిర్వహించిన రమేశ్‌ ‌నియాంక్‌ ‌పోఖ్రియాల్‌ అనారోగ్య కారణంగా ఆశించిన మేరకు కొత్త విద్యా విధానాన్ని విద్యా సంస్థలలోకి తీసుకువెళ్లలేక పోయారని అంటారు. కరోనా కూడా విద్యారంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బ తీసింది. దాదాపు ఈ రంగాన్ని పునర్‌ ‌నిర్మించవలసిన అవసరం కనిపిస్తుంది. ఈ వాస్తవాల మధ్య తాజా మంత్రిమండలిలో విద్యాశాఖను ధర్మేంధ్ర ప్రధాన్‌కు అప్పగించారు. మధ్యప్రదేశ్‌ ‌నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన్‌ ‌గతంలోను మంత్రిగా పనిచేశారు. నైపుణ్యాల పెంపు శాఖ కూడా ఈయనకే అప్పగించారు. ఆ విధంగా కరోనా తదనంతర పరిస్థితులలో ప్రధాన్‌ ‌మంత్రిత్వ శాఖ సామాజిక పునర్‌ ‌నిర్మాణంలో కీలక బాధ్యత నిర్వర్తించవలసి ఉంది. సామాజిక మాధ్యమాల మీద కేంద్రం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న తరుణంలో రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌నిర్వహిస్తున్న న్యాయశాఖను ఈశాన్య భారత్‌కు చెందిన కిరణ్‌ ‌రిజిజు చేతికి ఇచ్చారు. అలాగే బాధ్యతలు చేపట్టిన కొత్త ఐటీశాఖ మంత్రి అశ్విన్‌ ‌వైష్ణవ్‌ (‌రైల్వే శాఖకు మంత్రి) కూడా మా చట్టాలను పాటించక తప్పదని ట్విటర్‌ను ఉద్దేశించి చెప్పారు. పైగా ట్విటర్‌కు రక్షణ కల్పించలేమంటూ ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పేసింది. ఐటీ నిబంధనల నుంచి మినహాయింపు సాధ్యం కాదని కోర్టు చెప్పింది. అయినా సామాజిక మాధ్యమాలు లక్ష్మణరేఖ దాటకుండా చూడడం ఇప్పుడు పెద్ద సవాలే. రైతుల పేరిట జరుగుతున్న ఆందోళనకు ఎలాంటి ముగింపు ఉంటుందోనని ప్రస్తుతం భారత జాతీయులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వ్యవసాయ శాఖను నరేంద్ర తోమర్‌ ‌చేతిలోనే ఉంచి, సంఘ కుటుంబం నుంచి వచ్చిన శోభా కరంద్లాజేను (కర్ణాటక) సహాయమంత్రిగా నియమించారు. కార్మిక మంత్రిత్వ శాఖతో కూడా కరోనా సమయంలో కేంద్రం కోర్టుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నది. ఇప్పుడు ఈ శాఖను భూపేంద్ర యాదవ్‌కు అప్పగించారు. యువతరానికి పెద్ద పీట, సామాజిక న్యాయం వంటి అంశాలతో జరిగిన మంత్రి మండలి పునర్‌ ‌వ్యవస్థీ కరణను ఎక్కువమంది శ్లాఘిస్తున్న మాట నిజం. మంత్రిత్వశాఖ మధ్య పాలనాపరమైన జాప్యానికి చోటు లేకుండా శాఖలను కలుపుతూ ప్రధాని చేసిన ప్రయోగం కూడా ఆలోచింపచేస్తున్నది.


ఆ అపార అనుభవమే అందలం ఎక్కించింది

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుంచి వెళ్లి తొలి కేబినెట్‌ ‌మంత్రిగా ప్రమాణం చేసిన ఘనత గంగాపురం కిషన్‌రెడ్డికి దక్కుతుంది. ఇది నిజంగా చరిత్ర. ప్రపంచ నేతలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా అద్భుతం. అలా విప్లవాత్మకమైన, జాతీయత పునాది జరిగిన మార్పులలో ఆయన భాగస్వామి అయ్యారు. ఆపై పనితీరు ఆధారంగా పదోన్నతి పొందడం కూడా అపురూపమే. ఇంతవరకు హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణతో కేబినెట్‌ ‌హోదా అందుకున్నారు. సాంస్కృతిక వ్యవహారాల శాఖతో పాటు పర్యాటకం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలు కూడా నిర్వహిస్తారు. ఈ మూడింటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక స్థానం ఇస్తున్నది. ఆ విధంగా మరొక గొప్ప అవకాశం కూడా కిషన్‌రెడ్డిని వరించింది. అలా ఆయనను ఒక కీలక బాధ్యతలో పార్టీ మరోసారి నిలిపింది.

 రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపురం గ్రామంలో పుట్టిన కిషన్‌రెడ్డి ఢిల్లీ రాజకీయాలలో వెలు గొందడం అంత సునాయాసంగా జరగలేదు. దీని వెనుక సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉంది. పట్టుదల, కృషి ఉన్నాయి. బీజేపీ ఆవిర్భావం నుంచి అంటే, 1980 నుంచి ఆయన సామాన్య కార్యకర్తగా ఆ పార్టీతో ప్రయాణం ప్రారంభించారు. 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడయ్యారు. ఆయన ఎదుగుదల అంతా బీజేపీ యువమోర్చాతోనే ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఆ యువ విభాగానికి కిషన్‌రెడ్డి ఏపీ కోశాధికారిగా పనిచేశారు. తరువాత కార్యదర్శి అయ్యారు. ఆపై రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మరోమెట్టు ఎక్కి జాతీయ కార్యదర్శి అయ్యారు. అదే సమయంలో దక్షిణ భారత ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేశారు. ఆపై జాతీయ ఉపాధ్యక్షుడయ్యారు. 2002లో జాతీయ అధ్యక్షుడయ్యారు. ఒక బాధ్యత నుంచి ఒక బాధ్యతకు ఎదుగుతూనే ఆయన చట్టసభలలోకి ప్రవేశించారు.

మూడుసార్లు శాసనసభ్యునిగా (2004 హిమాయత్‌ ‌నగర్‌, 2009, 2014 అం‌బర్‌పేట), శాసనసభా పక్ష నేతగా కిషన్‌రెడ్డి సేవలు అందించారు. ఎన్నో ప్రజా సమస్యల మీద గళం విప్పారు. ఒక్క ఓటమితోనే పక్క పార్టీల వైపు చూసే నైజం లేకపోవడం, సిద్ధాంతం పట్ల నిబద్ధత, నిరంతరం ప్రజల మధ్య ఉండడం కిషన్‌రెడ్డిని విశ్వసనీయత కలిగిన నేతగా నిలబెట్టాయి. 2018లో అంబర్‌పేట (హైదరాబాద్‌) అసెంబ్లీ నియోజక వర్గంలో ఓడిపోయినా, 2019లో సికింద్రాబాద్‌ ‌లోక్‌సభ నియోజక వర్గ ప్రజలు ఆయనను ఢిల్లీకి పంపించారు. అలా ఆయనకు కొత్త రాజకీయ జీవితం ప్రసాదించారని అనవచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయనకు పార్టీ అవకాశం కల్పించింది. పైగా బీజేపీ దిగ్గజం, ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడు హోంశాఖ మంత్రి అమిత్‌షా దగ్గర సహాయకునిగా పనిచేసే అవకాశం ఆయనకు నిజంగానే వరమైంది. మోదీ రెండోసారి ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో స్థానం పొందడం, అందునా హోంశాఖలో బాధ్యతలు నిర్వర్తించడం కిషన్‌రెడ్డికి మరొక వరం వంటిది. జనసంఘ్‌ ‌కాలం నుంచి జాతీయతాశక్తులు కోరుకుంటున్న 370 అధికరణం (కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టేది) రద్దు అప్పుడే జరిగింది. ఆ పక్రియలో కీలకమైన కేంద్ర హోంశాఖలో నాడు భాగస్వామిగా ఉండడం ఆయన చేసుకున్న అదృష్టమే. కేబినెట్‌ ‌హోదాకి పదోన్నతి పొందిన తరువాత కూడా ఆయన అన్నమాట, మోదీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాననే. వివాదరహితుడిగా, కష్టించే తత్త్వం కల నేతగా, సౌమ్యునిగా ఉన్న పేరు ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఆయన పనితీరు రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏటా రెండుమూడుసార్లు నియోజక వర్గంలో కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యల గురించి స్థానికులతో చర్చించడం ఆ ప్రాంతవాసులకు అనుభవమే. కొవిడ్‌ ‌సమయంలో కూడా ఆయా ఆసుపత్రులకు వెళ్లి రోగులను పరామర్శించేవారు. ఆది నుంచి కూడా వేకువనే వ్యాహ్యాళి చేసే అలవాటును కూడా ప్రజలతో మమేకం కావడానికి వినియోగించుకున్నారాయన. పార్టీ కార్యకర్తగా దీర్ఘానుభం, చట్టసభలలో పనిచేసిన విలువైన అనుభవం ఆయనను కేంద్ర ప్రభుత్వంలో సభ్యుడిని చేశాయి. ఆయన మరిన్ని ఉన్నత పదవుల లోకి వెళ్లాలని, దేశానికి మరింత సేవ చేయాలని అంతా కోరుకోవాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE