– ఎమ్‌. ‌సుగుణరావు

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

మా అపార్ట్‌మెంట్‌ ‌సముదాయం ముఖద్వారంలోకి కారు పోనిస్తూ, గేటు వేసి ఉండటంతో హారన్‌ ‌మ్రోగించాను. సెక్యూరిటీ రాలేదు. మరోసారి మ్రోగించినా ఫలితం లేదు. ఏదో అత్యవసర పనిమీద సెక్యూరిటీ గార్డు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడేమో అనుకుని కారు దిగబోయేంతలో, గేటు తెరచుకుంది. ఒక అబ్బాయి వచ్చి నాకు సాయం చేసాడు. కారు లోపలికి పోనిచ్చి నా పార్కింగ్‌ ‌స్థలంలో కారు పార్క్ ‌చేసాను. ఆ తర్వాత ఆ అబ్బాయికోసం నా కళ్లు వెతికాయి. అయినా అతను కనబడలేదు. అతడిది తెలిసిన ముఖమే!

ఇపుడు అర్థమైంది. అతడు నన్ను చూసినపుడల్లా పారిపోతున్నాడు. రెండు రోజుల క్రితం లిఫ్ట్ ‌దగ్గర నుంచోగానే అతను వచ్చాడు. నన్ను చూసి గబగబా మెట్ల వైపు నడక సాగించాడు. మొన్న సాయంత్రం మా అపార్ట్‌మెంట్‌లోని వాకింగ్‌ ‌ట్రాక్‌ ‌మీద నడుస్తుంటే కనిపించాడు. నన్ను చూసి తప్పుకున్నాడు. ‘ఔను అతగాడు, నన్ను చూసినపుడల్లా తప్పించుకు తిరుగుతున్నాడు.

కారణం!? నెల క్రితం జరిగిన ఆ సంఘటన!

మేము ఆ గేటెడ్‌ ‌కమ్యూనిటీకి వచ్చి రెండు నెలలే అయింది. ఈ నగరంలో ఊరికి దూరంగా, మా ఫార్మా కంపెనీకి దగ్గరగా కట్టిన నాలుగొందల ఇళ్ల సముదాయం మాది. నాకు ఇదివరలో ఉన్న రెండు బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు అమ్మేసి ఆ మూడు బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌ ‌కొన్నాను కొంత బ్యాంక్‌లోన్‌ ‌తీసుకుని. అమ్మ, నేను, మా ఆవిడ, ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు ఇంటర్‌ ‌సెకండీయర్‌, ‌చిన్నవాడు ఇంటర్‌ ‌ఫస్ట్ ఇయర్‌. ఇద్దరిదీ ఒకటే కాలేజి. మా కొత్త ఇంటికి దగ్గరే! అందుకోసమే ఈ ఇల్లు తీసుకున్నాను. పైగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.

నెల క్రితం అమ్మకు మోకాలి నొప్పులు మొదలైనాయి. వయసు డెబ్బై దాటింది. డాక్టర్లు మోకాలికి ఆపరేషన్‌ ‌చేస్తే బాగవుతుందని చెప్పినా, అమ్మ ఆపరేషనుకు భయపడింది. అందుకు ప్రత్యామ్నాయంగా సర్జన్‌ ‌రోజుకు ఒక ఇంజక్షన్‌ ‌చేస్తున్నాడు. దాంతోపాటూ ఐస్‌ ‌ముక్కలున్న సంచీతో మోకాలి చిప్పల మీద ‘కోల్డ్ ‌బాత్‌’ ‌చేయమన్నాడు. రోజుకు మూడుసార్లు చెయ్యాలి. అందుకోసం ఐస్‌ ‌ముక్కలకోసం జరిపిన అన్వేషణలో అవి మా అపార్ట్‌మెంట్‌ ‌పక్కనున్న బార్‌లో దొరుకుతాయని తెలిసి అక్కడకు వెళ్లాను. రిసెప్షన్‌ ‌కౌంటర్లో డబ్బులు చెల్లించి సర్వర్‌ ‌తెచ్చే ఐస్‌ ‌ముక్కలకోసం ఎదురు చూస్తూంటే, నాకు ఎదురుగా సిగరెట్టు పొగ గుప్‌మని వదులుతూ ఒక కుర్రాడు కనిపించాడు. అతని చేతిలోని గాజు గ్లాసులో ద్రవ పదార్ధం …!

అతడికి ఇరవై సంవత్సరాలుంటాయేమో అనిపించింది. ముఖం లేతగా ఉంది. పలచగా పెరిగిన గెడ్డం, మీసాలు. చూడగానే ఎప్పుడో చూసిన ముఖంలా అనిపించింది. ఎక్కడ చూసానో, ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నా పని ముగించుకుని ఇంటికి వచ్చేసాను. ఆరోజు సాయంత్రం అపార్ట్‌మెంట్‌లో సాయంకాలపు నడక సాగిస్తుంటే, క్రికెట్‌ ఆడుతున్న పిల్లల్లో కనిపించాడు. అప్పుడు నాకు అర్ధమయింది, ఆ అబ్బాయి మా అపార్ట్‌మెంట్‌ అబ్బాయి అని. రెండు రోజుల తర్వాత ఐస్‌ ‌ముక్కల కోసం ఆ బార్‌కు వెళ్లినపుడు ఇదివరకూ కనిపించిన స్థితిలోనే ఉన్నాడు. నోట్లో సిగరెట్టు, చేతిలో గ్లాసు. నా వంక ఇబ్బందిగా చూసాడు. నేను అతడి అవస్థ గమనించి అతడికి దూరంగా జరిగాను.

ఇంటికి వచ్చినా ఆ కుర్రాడి గురించిన ఆలోచనలు. అంత చిన్న వయసులో అలా వ్యసనాల పాలవడం బాధ కలిగించింది. ‘ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ వయసు కుర్రాడు, అలా ఎందుకు మారాడో?’ అనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి.

 ‘ఇంట్లో వాళ్లకు తెలీదేమో! అతడి గురించి చెపితే సరైన దారిలో పెడతారేమో!’ అనిపించింది. ‘అయినా ముందు ఆ కుర్రవాడితో మాట్లాడాలి.

ఆ అలవాట్లు మానుకోమని చెప్పాలి’ అని బలంగా అనుకున్నాను. అయినా ఎన్నిసార్లు కనిపించినా అతను నా నుంచి పలాయనం సాగి స్తున్నాడు. ఈరోజు ఎలాగైనా అతడిని పట్టుకోవాలని దృఢ నిశ్చయానికి వచ్చేసాను. అలా ఆ కుర్రాడికోసం అపార్ట్‌మెంటులోని సెల్లార్‌ అం‌తా గాలిస్తూ ముందుకు కదిలాను.

జిమ్‌ ‌దగ్గర కనిపించాడు. నన్ను చూసినట్టు లేడు. ఎవరితోనో మాట్లాడు తున్నాడు. మెల్లగా వెళ్లి చెయ్యి పట్టుకున్నాను. అంతవరకూ చూడని ఆ అబ్బాయి నన్ను చూడగానే షాక్‌ ‌తిన్నట్టు అయ్యాడు. ముఖం పాలిపోయింది.

‘‘బాబూ! కంగారుపడకు. నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి’’ అన్నాను. ‘‘సరే అంకుల్‌’’ అం‌టూ ముందుకు నడిచాడు.

‘‘ఏం చదువుతున్నావ్‌?!’’ అన్నాను,

‘‘ఖరగ్‌ ‌పూర్‌ ఐఐటిలో మొదటి సంవత్సరం పూర్తయింది. సెమిస్టర్‌ ‌సెలవులకు వచ్చాను’’ అన్నాడు.

‘‘బావుంది. ఇంత మంచి చదువులోకొచ్చావ్‌. ‌మరి నీకు ఈ అలవాట్లు ఎలా వచ్చాయి?’’ అన్నాను.

‘‘ఇంటర్‌ ‌ఫస్ట్ ఇయర్‌లో మొదలయింది’’ అన్నాడు.

‘‘మై గాడ్‌… అం‌త తొందరగానా?!’’ అన్నాను ఆశ్చర్యంగా.

అతను క్షణం ఆలోచించి – చెప్పడం మొదలు పెట్టాడు.

‘‘నేను టెంత్‌ ‌క్లాస్‌ ‌లో స్కూల్‌ ‌ఫస్ట్. ‌నన్ను ఇంటర్‌ ఐఐటి స్క్రీములో చేర్పించారు డాడీ. అక్కడ టెన్షన్‌ ‌మొదలయింది’’ అన్నాడు ‘‘అంటే…’’ అన్నాను ప్రశ్నార్ధకంగా చూసి. ‘‘అక్కడ చాలా మంది నాకు పోటీగా ఉన్నారు, వారికన్నా నాకు తక్కువ మార్కులు వస్తే బాధ, భయం రెండూ కలిగేవి. మైండు బ్లాక్‌ అయ్యేది. అప్పుడు నా మిత్రుడు ఒక సలహా చెప్పాడు’’ అంటూ చెప్పడం ఆపాడు.

‘‘ఏమిటా సలహా?!’’ అన్నాను.

‘‘ఒక సిగరెట్‌ ‌దమ్ము లాగమన్నాడు. అదే సర్దుకుంటుంది’’ అన్నాడు. అలా మొదలెట్టాను. చాలా బావుండేది. రిలీఫ్‌గా ఉండేది. టెన్షన్‌ ‌వచ్చినపుడు ఒక సిగరెట్‌ ‌తాగేవాడిని.’’

‘‘అయ్యో!’’ అంటూ అతడి వంక జాలిగా చూసాను. అతను చెప్పడం కొనసాగించాడు.

‘‘ఇంటర్‌ ‌పరీక్షలు పూర్తయిన తర్వాత, ఐఐటి ఎంట్రెన్స్ ‌సమయంలో బాగా ప్రెజర్‌ ‌పెరిగేది. రాత్రిళ్లు నిద్ర పట్టేదికాదు.’’

‘‘అందుకని బార్‌కు వెళ్లి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఒక పెగ్‌ ‌త్రాగేవాడిని. పడుకోబోయే ముందు అలా నిద్ర పట్టేసేది’’ అన్నాడు.

‘‘అర్ధమయింది. నీకు ఈ అలవాట్లు ఎలా వచ్చాయో! ఇంతకీ సినిమాలు చూస్తావా?’’ అన్నాను.

‘‘చూస్తాను.’’ ‘‘మరి సినిమా మొదలయ్యే ముందు వచ్చే యాడ్‌ ‌చూసినపుడు భయం వెయ్యదా?!’’ అన్నాను.

‘‘ఏ యాడ్‌?’’ అన్నాడు. ‘‘అదే, నగరానికి ఏమయ్యింది?!’’ అన్నాను చిన్నగా నవ్వి.

‘‘ఔను. భయం వేసేది. అదైనా ఆ క్షణమే. నాకు తెలుసు, సిగరెట్‌లో నికోటిన్‌తో పాటూ రకరకాల హానికారకాలు ఉన్నాయి. అలాగే ఆల్కహాల్‌ ‌లివర్‌ ‌పై భయంకరమైన ప్రభావం చూపిస్తుంది. అయినా మానలేకపోతున్నాను’’ అన్నాడు దిగులుగా,

‘‘మీ ఇంట్లో వాళ్లకు తెలుసా?!’’ అన్నాను.

‘‘తెలీదు… తెలిస్తే, బాబోయ్‌! ఊహించడానికే భయంగా ఉంది’’ అన్నాడు. ‘‘నువ్వే, ఆ విషయం చెప్పెయ్యరాదూ!’’ అన్నాను.

‘‘నేనా, నేను చెప్పడమా!’’ అన్నాడు భయంగా నా వంక చూసి.

‘‘చూడు బాబూ. ఎవరో ఈ విషయం మీ ఇంట్లో వాళ్లకు చెపితే, వాళ్లు నిన్ను తిట్టడమో, కొట్టడమో చేసే పరిస్థితి రాకుండా ఉండాలంటే, నువ్వే చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటుంది. తమ పిల్లలు వ్యసనాల పాలయితే, వారిని నయానో భయానో వాటి నుంచి బైట పడేలా చేస్తారు’’ అన్నాను.

ఆ కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. నేను వెంటనే అన్నాను. ‘‘నేరం చేసి, తప్పు ఒప్పుకున్న వాడికి శిక్ష తగ్గుతుంది. సానుభూతి ఉంటుంది.’’ ఆ కుర్రాడికి నా మాటలు రుచించినట్టున్నాయి.

‘‘ధాంక్స్ అం‌కుల్‌. ‌మీరు చెప్పింది నిజమే. నా అలవాట్ల గురించి ఎవరో చెప్పే బదులు నేనే చెప్పేస్తాను.’’

‘‘గుడ్‌… ‌మంచి నిర్ణయం’’ అన్నాను. అతను గబగబా అక్కణ్ణించి కదిలాడు.

ఆరోజు ఆదివారం ఇంట్లో అందరూ గుడికి వెళ్లారు, మా అమ్మతో సహా. మా అపార్ట్‌మెంట్‌ ‌దగ్గరిలో కొత్తగా వెలిసింది ఆ గుడి. ఆ అమ్మవారికి మ్రొక్కుకుంటే కోరికలు తీరతాయట. ‘కాళ్లు నొప్పులు కదా అమ్మా నీకు, గుడికి వద్దులే ’ అన్నా వెళ్లింది. నేను ఆరోజు ఆలస్యంగా నిద్ర లేచాను. కాఫీ ఆస్వాదిస్తూ పేపర్‌ ‌చూస్తున్నాను. ఆరోజు సంపాద కీయం వైపు దృష్టి సారించాను. ఆ అక్షరాల వెంట నా కళ్లు పరుగులు తీసాయి.

నేటి సమాజం, విషపూరిత వాతావరణానికి లోనవుతోంది. కలుషితమవుతున్న పసి మనసులు, ఆహ్లాదకరమైన బాల్యం, ఆవేశపూరితంగా మారు తోంది. ఈ రకమైన హింసాత్మక ధోరణులకు కారణం తల్లి తండ్రుల వేగవంతమైన జీవనశైలి, కుటుంబ సభ్యుల చెడు వ్యసనాలు. మాదకద్రవ్యాలు, తప్పుదారి పట్టించే సామాజిక మాధ్యమాలు, ఇంకా పోటీగా మరీ టెన్షన్‌ ‌పెడుతున్న చదువులు, వీటన్ని టిలో పసితనాన్ని కసితనంగా మార్చుతోంది. నమ్మకం, విలువలు ప్రాతిపదికగా బాల్య దశ సాగాలంటే ఏం చెయ్యాలి?

ఆ సంపాదకీయం నాలో ఏదో భయం కలి గించింది. కిటికిలోంచి చూసాను. క్రింద పిల్లలు అడుకుంటున్నారు. నేను కలిసిన ఆ అబ్బాయి కనిపించాడు.

ఎందుకో ఆ అబ్బాయిని చూసి జాలి కలుగు తోంది. తల్లితండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంటే… ఇలా వ్యసనాల బారిన ఇంత చిన్న వయసులో పడితే… వీడి భవిష్యత్‌ ఏమిటి?… ఇలాంటి కుర్రవాళ్లు కదా రేపటి పౌరులు. సంపాద కీయంలో రాసింది నిజమే… పెద్దలు పూనుకోవాలి కదా…!

గబగబా లిఫ్ట్ ‌వైపు నడిచి క్రిందకు చేరాను. ఆ అబ్బాయి నన్ను చూసి పరిగెత్తుకొచ్చి ‘‘గుడ్‌ ‌మార్నింగ్‌ అం‌కుల్‌’’ అన్నాడు. ‘‘ఇంతకీ చెప్పావా… ఇంట్లో నీ సంగతి’’ అన్నాను.

లేదంకుల్‌, అమ్మ ఉంది… అందుకే చెప్పలేక పోయాను. అన్నట్టు అమ్మ గుడికి వెళ్లింది. అమ్మ ఉండగా చెబితే ఏడుస్తుంది. ఇదే మంచి టైమ్‌. ‌నాన్నతో ఇప్పుడే చెపుతాను. మీరూ రాకూడదు నాకు ధైర్యంగా ఉంటుంది’’ అన్నాడు ముందుకు నడుస్తూ.

‘‘నేనా…’’ అంటూ క్షణం ఆలోచనలో పడి ‘‘సరే’’ అన్నాను, అతడిని అనుసరిస్తూ. ఇద్దరం లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ ‌నాలుగో ఫ్లోర్‌ ‌లో ఆగింది. గబగబా నడుచు కుంటూ తమ అపార్ట్మెంట్‌ ‌తలుపు బయట కాలింగ్‌బెల్‌ ‌నొక్కాడు. నాలో ఉత్కంఠ మొదలయింది. చిన్నగా టెన్షన్‌. అతని తండ్రిగారు ఈ విషయం ఎలా తీసుకుంటారు? నాలో ఆ క్షణంలో రకరకాల ఆలోచనలు. నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది.

తలుపు తీసిన వ్యక్తిని చూసి ఒక్కసారి ఆశ్చర్య పోయాను. ఆయనది మా ఫార్మా కంపెనీనే! అయితే అతనిది వేరే డిపార్ట్‌మెంటు. ఆయనది మార్కెటింగ్‌. ‌నాది ప్రొడక్షన్‌. ఇద్దరం ఎప్పుడూ కలవం. నాలుగు వేల మంది ఉద్యోగులున్న మా కంపెనీలో ఆయనతో ముఖ పరిచయం మాత్రమే ఉంది తప్ప ఆయనతో కలిసిన సందర్భాలు తక్కువే! మేం నెలకోసారి కలిసేది మా కంపెనీ రిక్రియేషన్‌ ‌క్లబ్బులో జరిగే పార్టీలలో, ‘‘సార్‌! ‌చాలా సంతోషం. ఏమిటి ఇలా వచ్చారు?’’ అన్నాడు.

‘‘మీరు ఈ సముదాయంలో అపార్ట్‌మెంట్‌ ‌కొన్నారని మీ అబ్బాయి ద్వారా తెలిసి వచ్చాను’’ అన్నాను అతికినట్టుగా.. ‘‘సంతోషం! రండి కూర్చోండి’’ అంటూ డ్రాయింగ్‌ ‌రూమ్‌ ‌లోని సోఫా చూపించాడు.

నేను కూర్చుంటూ చుట్టూ చూసాను. ఆ గదిలో పొందికగా సర్దిన సామాను గోడకు తగిలించిన ప్లాస్మా టీవి. పక్కనే ఫ్రిజ్‌. ఆ ‌గదిలోనే మూలగా దేవుడి పూజా మందిరం.

అతను నా వంక చిన్నగా నవ్వి, ‘‘బావుంది మీరు రావడం.’’ అంటూ

 ‘‘నాన్నా! అంకుల్‌ ‌గారికి మంచినీళ్లు తీసుకురా!’’ అని వాళ్ల అబ్బాయితో అన్నాడు. ఆ అబ్బాయి లోపలకు వెళ్లాడు. నేను ఏం మాట్లాడాలో అర్ధంకాక, ఆ గదిలోని టీపాయ్‌ ‌మీద వున్న ఆరోజు దినపత్రికను చేతిలోకి తీసుకున్నాను.

ఇంతలో ఆ అబ్బాయి మంచినీళ్లున్న గ్లాసు నాకు అందించాడు. తాగుతూ, ఆ అబ్బాయి వంక పరిశీల నగా చూసాను. అతనికి చెమటలు పడుతు న్నాయి. చేతులు వణకడం గమనించాను.

ఉన్నట్టుండి హఠాత్తుగా తండ్రిగారి కాళ్లపై పడ్డాడు. ‘‘నాన్నా… నన్ను క్షమించు. సిగరెట్లు, మందు తాగుతున్నాను. మానేయడానికి ప్రయత్నిస్తున్నాను’’ అన్నాడు ఏడుస్తూ. ఊహించని ఈ పరిణామానికి ఆయన విస్తుపోతూ,

‘‘అయ్యో…. లెగు నాన్నా’’ అంటూ ఆ అబ్బాయిని గుండెలకు హత్తుకున్నాడు. నాకు ఆ దృశ్యం ఎంతో మనోహరంగా అనిపించింది.

ఆయన రెండడుగులు ముందుకు వేసి, కళ్లు తుడుచుకుంటూ ఆ గదిలోని పూజా మందిరం వైపు నిలబడ్డాడు. నేను ఊహించని ఆ దృశ్యం నాకు ఆశ్చర్యం కలిగించింది.

దేవుడి విగ్రహం ముందు రెండు చేతులు జోడించాడు. ఏదో ప్రార్థించినట్లుగా పెదాలు కదులుతున్నాయి. ఆయన దేవుడిని ఏమని ప్రార్థించి ఉంటాడు?!

 ఏం కోరుకున్నాడు!?

తన తప్పు ఒప్పుకొంటూ, ‘‘నా కొడుకు నన్ను క్షమించమని అడిగాడు. దేవా, నన్ను నా కొడుకులా సత్యవంతుడిని చెయ్యి.’’

అంతేనా, అతడి ప్రార్థన సరిగ్గా అలాగే ఉంటుంది అంతే అనుకున్నాను. ఆ తండ్రి గతం గురించి నాకు పూర్తిగా తెలిసి ఉండడంతో – ఇక నా అవసరం ఆ కుర్రాడికి లేదనిపించి ఆ ఇంట్లోంచి బైటకు నడిచాను.

About Author

By editor

Twitter
YOUTUBE