కుటుంబ ప్రబోధన్‌ ‌పేరుతో లోతైన ఒక అంశం మీద ప్రసంగించేందుకు గౌరవనీయులు సురేశ్‌జీ సోనితో ఈమధ్య ఒక కార్యక్రమం ఏర్పాటయింది. కుటుంబ ప్రబోధన్‌ ‌విభాగం ద్వారానే పుస్తక రూపంలో ఈ ప్రసంగ పాఠాన్ని అందరికి అందించారు కూడా.

ఒక ఉపన్యాస కార్యక్రమానికి పరిపూర్ణత సిద్ధించాలంటే అందుకు నాలుగు సోపానా లుంటాయి. 1. వినడం 2. తెలుసుకోవడం 3. లోతుగా అర్థం చేసుకోవడం 4. స్వీకరించడం. చివరిమా• లేదా సోపానమే – సాధించడం. కానీ దానిని సాధించి అచరణలో పెట్టడం అంత సులభమైన పని కాదు.

కాబట్టి ఆచరణ అనే దశకు వచ్చినట్లయితే కేవలం ఒకసారి వినడం, మననం చేయడంతోనే సరిపోదు. మాటిమాటికి నెమరు వేస్తూ ఉండాలి. నిబద్ధతతో సంకల్పించాలి. ఆ సంకల్ప సాధనకు ఆ అంశాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి.

ఈ విషయాన్ని సురేశ్‌జీ సోని లోతుగా అధ్యయనం చేసి, అత్యంత జటిలమైన అంశాన్ని చాలా సహజంగా, సరళంగా నిత్య జీవితం నుంచి తీసుకున్న ఉదాహరణలతో వివరించారు. ఒక సమున్నత మార్గదర్శనం లభించింది. భారతీయ మహర్షులు ఒక జీవనదృష్టిని ఇచ్చారనీ, ఆ ఆలోచనల వెలుగులోనే జీవన విలువలు మన సమాజ ఔన్నత్యానికి కారణ మయ్యాయనీ, ఆ జీవన విలువలే మన జీవన శైలిలో ప్రతిబింబించాయనీ చెప్పుకుంటున్నాం.

విలువలతో కూడిన జీవనశైలి వల్లనే వ్యక్తి, కుటుంబం, సమస్త సమాజానికి గుర్తింపు లభిస్తుంది.

ఈ ప్రసంగంలో మూడు శుద్ధులు, పంచయజ్ఞాలు (పంచ రుణాలు) గురించి వివరించారు. ఈ పుస్తకంలోని విషయాన్ని తరచు అధ్యయనం చేయగలరని ఆశిస్తున్నాం. వర్తమానకాలంలో చేయవలసిన మంచిపనుల గురించి అన్ని వయసుల వారి బృందాలతో చర్చించాలి. ‘అహం’ అంటే ‘నేను’ నుండి ప్రారంభమై ‘మనం’ అనే స్థాయికి చేరుకోవాలి. శ్రేష్ఠమైన ఆచరణను విశ్వమానవాళి ముందు మనం పెట్టాలి. ఇది నా బాధ్యత అని మనమందరం కూడా అనుకోవాలని మా ఆకాంక్ష. రండి! ‘పంచయజ్ఞాలు’ కేవలం ఓ సిద్ధాంతం కాదనీ, ఆచరణీయమనీ నిరూపిద్దాం! దానితోనే ఈ విషయానికి పరిపూర్ణత లభిస్తుంది.

– భయ్యాజీ జోషి,  ఆర్‌ఎస్‌ఎస్‌-అఖిల భారత కార్యకారిణి సదస్యులు


మాననీయ ప్రాంత సంఘచాలక్‌గారు, కుటుంబ ప్రబోధన్‌ ‌కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్న సమస్త ఆదరణీయ కార్యకర్తలారా, సోదర సోదరీమణులారా…

గతంలో ఏ శతాబ్దంలో కూడా అనుభవించని రీతిలో, గత కొద్ది నెలలుగా ఈ సమస్త విశ్వం పలు విధాలైన సవాళ్లను ఎదుర్కొంటూ సాగింది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రజా జీవనానికి కొత్త అనుభవాన్నిచ్చింది. కొత్త పాఠాలు కూడా నేర్పింది. మనిషి కొంతమేర తనకు తానుగా మమేకమయ్యాడు. గత్యంతరం లేని పరిస్థితులనుకోండి, మరేమయినా భావించుకోండి. చాలాకాలం తరువాత అధిక సమయం కుటుంబ సభ్యులంతా కలిసి ఉండే అవకాశం దొరికింది. ఒకరికొకరు ఎదుటివారిని అర్థం చేసుకోవడం లాంటి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మామూలు ప్రకృతి-పరిశుభ్రమైన ప్రకృతిలో ఉన్న తేడా ఏమిటో అర్థమయింది. అంతేకాదు-స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి లాంటి విషయాలు కూడా అనుభవంలోకి వచ్చాయి. సమస్త ప్రపంచంలో ఈ స్వచ్ఛతని ఉపయోగించుకునే విషయంలో పోటీ నెలకొంది. సంయమనంతో ఎంతమేరకు వీటిని ఉపయోగించుకుంటూ బ్రతుకుని వెళ్లదీ యాలో, అలాంటి అనుభవాలను కూడా చవిచూసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

ఒకేచోట ఉండటమన్నది జరిగితే మానసిక పరమైన ఒత్తిడి పెరుగుతుంది, డిప్రెషన్‌ ‌సహా సమస్యలని పెంచుతుంది. ఇలాంటి అనుభవాలు కూడా చవిచూశాం. మొత్తమ్మీద సమస్త విశ్వంలో మన జీవనశైలి, మన ఆలోచనా విధానం, జీవన విలువలు. మొదలైన సందర్భాలన్నిటిలోనూ కొంతవరకు సంపూర్ణ ఆలోచనా పక్రియ తిరిగి మొదలయినట్టు కనిపిస్తుంది. ఇక, ప్రత్యేకంగా భారత్‌ ‌విషయానికొచ్చినప్పుడు భారతీయ చింతన, భారతీయ జీవన విలువల విషయంలో ఒక విధమైన ఉత్సుకత ప్రపంచానికి కనబడుతోంది. అందుకే ఒకవేళ మానవ సమాజం సుఖంగా ఉండాలంటే అందుకు అవసరమైన నమూనా ఏమై ఉంటుంది? అందుకు భారతీయ చింతన, యుగాల తరబడి భారత్‌కు ఉన్న అనుభవం నేటి పరిస్థితులని ఎదుర్కొనేందుకు ఎలాంటి మార్గాన్ని సూచిస్తుంది? ఈ దృష్టితో ఇవాళ మన కార్యక్రమంలో ‘పంచ యజ్ఞాలతో పరమ వైభవం’ అనే అంశంపై చర్చిద్దాం.

నాలుగు రకాల ప్రపంచం

రుషులు, మునులు మన పూర్వీకులు. వారు లోకానికి సంబంధించి చేసిన విశ్లేషణ ప్రకారం ఈ సృష్టిలో నాలుగు రకాలయిన ప్రపంచాలున్నాయి, 1.మనం చెప్పుకునే పంచ మహాభూతాల సృష్టి, గ్రహాలూ, నక్షత్రాలు, భూమి, ప్రవాహాలు, పర్వతాలు, సముద్రాలు… ఇవన్నీ ఒక ప్రపంచం. 2వ ప్రపంచం వనస్పతి జగత్తుకు చెందినది. చిన్నపాటి గడ్డిపోచ నుండి విశాలమైన వటవృక్షం దాకా.. 3వ ప్రపంచం పశుపక్ష్యాదుల జగత్తు 4వ ప్రపంచం మన మానవులకు సంబంధించిన లోకం. ఇందులో సముద్రాలు, పర్వతాలు, భూమి, గ్రహ – నక్షత్రాల ప్రపంచం, వనస్పతి జగత్తుకు సంబంధించిన ప్రపంచం, ప్రాణి జగత్తుకు సంబంధించిన ప్రపంచం అనే ఈ మూడింటి విషయంలో భగవంతుడు వీటికి స్వేచ్ఛని ప్రసాదించలేదు. ప్రకృతి కనుసన్నల్లో పెట్టేశాడు. అవి తమ హద్దుల్ని దాటవు, దాటలేవు కూడా. ప్రకృతి కనుసన్నల్లో ఉంటూనే తమ తమ ధర్మాలను కొనసాగిస్తాయి. ఆవుదూడలు నడకకి సంబంధించి ప్రకృతి నిర్దేశించిన నియమాలను అవి ఉల్లంఘించవు, ఉల్లంఘించే ప్రయత్నాలు కూడా చేయవు. పశువులకు, పక్షులకు భగవంతుడు ఏ గొంతయితే ఇచ్చాడో, ఆ గొంతులకు భిన్నంగా అవి అరవలేవు, కూత పెట్టలేవు కూడా. ఈ మూడు ప్రపంచాలు ప్రకృతి నిర్దేశించిన నియమాలకు భిన్నంగా వ్యవహరించలేవు. కనుక ఇవి ప్రకృతికి ఎలాంటి నష్టాన్ని కలిగించలేవు.

అయితే మనిషికి చెందిన నాలుగవ ప్రపంచ మున్నది, దానికి భగవంతుడు రెండు ప్రత్యేకతలు ప్రసాదించాడు. మనిషి స్వేచ్ఛాజీవి కావటం ఒకటి, రెండవది ముక్త ఇచ్ఛా శక్తిని (కోరుకున్నదానిని అనుభవించే శక్తి) ప్రసాదించినట్లు మన శాస్త్రాల్లో కనిపిస్తుంది. మనిషి సంకల్పం తీసుకున్నాడంటే దేవుడిగా గాని, దానవుడిగా గాని మారే ప్రయత్నం చేయగలడు. ఎందుకంటే మనిషి స్వేచ్ఛాజీవి. మంచిచెడ్డలను విశ్లేషించే బుద్ధిని మనిషికి భగవంతుడు ఇచ్చాడు. మంచి చేసేందుకు, చెడు చేసేందుకు మనిషి తన బుద్ధిని ఉపయోగించగలడు. అవసరమైతే మనిషి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కూడా వ్యవహరించగలడు. పుట్టగానే లేగ దూడ నడవటం మొదలెడుతుంది, అయితే మనిషి మాత్రం పుట్టగానే నడక మాట దేవుడెరుగు, అలా పడి ఉంటాడంతే. కానీ మనిషి తన బుద్ధితో, స్వతంత్ర ఇచ్ఛాశక్తితో, కల్పనాశక్తితో నూతన ఆవిష్కారాలు చేశాడు. కేవలం నేల మీదే కాదు, జలంలో – గగనంలో కూడా పరుగులు తీస్తున్నాడు. కోకిలకి కాకిలాగా కావ్‌ ‌కావ్‌ అనటం రాదు, ఆవు పిల్లి లాగ మ్యాప్‌ ‌మ్యావ్‌ అని అనలేదు. అయితే పుట్టగానే ఏడవటం మాత్రమే చేతనయిన మనిషికి నవ్వటం సరికదా, మాట్లాడటం కూడా రాదు. అలాంటి మనిషి మెలమెల్లగా ఎన్నో భాషలను ఆవిష్కరించాడు, పశుపక్షుల శబ్దాలను తన గొంతుకలో పలికిస్తున్నాడు. నేను చూసిన ఒక మనిషయితే తన గొంతుకతో పలు వాద్య సంగీత ధ్వనులను కూడా పలికిస్తాడు. ఆ మనిషి తన గొంతుకతో గాత్ర సంగీతాన్ని, వాద్య ధ్వనులను పలికిస్తాడు. ఇదెలా సంభవం? ఇది ప్రకృతి నియమాలకు సవాలు విసురుతూ సమర్థతను చాటుకోవటం కాదా? అందుకనే ప్రపంచం ముందు సంకట పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని మనం చెప్పుకుంటుంటాం. దీనికి కారణమెవరు? దీనికి పంచ మహాభూతాలు, వనస్పతి, పశుపక్ష్యాదులు అనే మూడు సృష్టులు కారణం కాదు, అవి తమకు నిర్దేశించిన హద్దుల్లోనే ఉంటాయి. ప్రపంచంలోని సమస్యలన్నింటికి మూలకారణం మానవుడే. ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించ గలిగేవాడు కూడా మానవుడే. అందుకే మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే మనిషి వికాసం చెందాలి, అతని ఆలోచనలు వికసించాలి. అతనిని శ్రేష్ఠమైన వాడిగా తీర్చిదిద్దాలి.

అతని హృదయం విశాలం కావాలి. అతని హృదయం సంవేదనాశీలంతో నిండాలి. అందుకే ఈ ప్రపంచంలోని మానవుడిని సంస్కారవంతునిగా, సంవేదనశీలిగా తయారుచెయ్యాలని, ఇదే ప్రధానమైన కార్యమని మన పెద్దలు చెప్పారు.

కుటుంబమే మూలభూతమైన ఆధారం

ఈ సృష్టి నిర్మాణానికి సంబంధించి ఆరంభమైన పక్రియలో పూర్తిగా పునాది పటిష్టతకు ముఖ్యమైన బంధం ఏమిటి? ఈ మధ్య కాలంలో ‘బిల్డింగ్‌ ‌బ్లాక్‌’ అనే పద ప్రయోగం ఎక్కువగా వినబడుతోంది. ఏదయినా భవన నిర్మాణం జరిగితే దాని పునాదుల పటిష్టతకు ఇటుకలు ఉపయోగపడతాయి. ఆ మాటకొస్తే సమస్త సృష్టికి సంబంధించిన బిల్డింగ్‌ ‌బ్లాక్‌ ఏమిటి? దీనికి సమాధానంగా కుటుంబమే సృష్టికి సంబంధించిన బిల్డింగ్‌ ‌బ్లాక్‌ అని మన పూర్వీకులు చెప్పారు. ఇదే మొదటి యూనిట్‌. ఇదే పటిష్టమైన పునాది. దాని తర్వాత వచ్చిన యూనిట్లన్ని ఇందులోనివే.

మనకున్న అతి ప్రాచీనమైన జ్ఞానరాశి వేదాలు. అథర్వణంలో ఒక సూక్తముంది, దాన్ని ‘విరాట్‌ ‌సూక్త’మని అంటారు. ఆ సూక్తంలోని తత్త్వంలో అన్నిటికన్నా మొదట వ్యక్తపరిచేది ‘కుటుంబం’ గురించి. ‘సా ఉత్క్రామక్‌ ‌సా జ్ఞాన పత్యేర ఋకామక’ అని ఆ మంత్రం చెబుతుంది. అధిరోహించే వాడు ఒకడు అనేకులయ్యారు. అంటే అన్నిటికన్నా మొదటి పునాది ఎక్కడపడింది? కుటుంబం నుండి. అది మొదలై సంపూర్ణ నిర్మాణ కార్యం అక్కణ్ణించే జరిగింది. కుటుంబం పేరిట జరిగిన పునాది నిర్మాణానికి ఆధారం అక్కడున్న మనుషుల మధ్య ఒకరిపట్ల మరొకరికి పెరిగిన ఆత్మీయతానుబంధం, పరస్పర సహకారం ఏర్పడింది. దానితోనే కుటుంబం ఏర్పడింది. అందువల్లే మున్ముందు జరిగిన సృష్టి నిర్మాణంలో దేన్నయితే మనం కుటుంబ భావనతో పరిగణించామో దాన్ని బలీయమైన పునాదిగా భావించాం. అందువల్లే ఈ కుటుంబ భావనని మరింతగా వికసింపజేస్తూ ప్రతిసృష్టి నిర్మాణాన్ని చూసేందుకు భారత్‌ ఒక దృష్టిని ప్రసాదించింది. అది కేవలం ఒక దృష్టి కాదు, మన జీవన వ్యవహారాలతో ముడివేసింది. ఈ దృష్టితోనే మనం ప్రతి వస్తువుని వికసింపచేయాలని ఆలోచించ గలుగుతున్నాం.

మా అమ్మ, నాన్న, సోదరులు, సోదరీమణులు ఉన్నారు, ఇది నా కుటుంబమైపోయింది. మరి ఈ కుటుంబాన్ని విస్తరింప చేస్తే, ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ ‌వచ్చేస్తుంది. మా చిన్నాయన, మా చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, ఆడపడుచు, బావ, మరిది ఇలా మరిన్ని సంబంధాలతో విస్తరించుకుంటూ పొతే ఉమ్మడి కుటుంబమవుతుంది. అది కూడా కుటుంబమే కదా! ఈ ఉమ్మడి కుటుంబానికి, సహకారం కోసం మరికొంతమంది దగ్గరౌతారు. ఇంటిలో పనిచేసే నౌకర్లు, చాకర్లు ఉంటారు. వారిని పలకరించే తీరులో కూడా సంబంధాలు కనిపిస్తాయి. మీకు తెలిసే ఉంటుంది పాత కాలంలో ఏ దేని ధనిక కుటుంబంలో లక్ష్మి అనే పేరు గల పరిచారిక ఉంటే పిల్లలతో ‘లక్ష్మి అవ్వా’ అని పిలవాలని చెబుతాం. లేదా అలా సంబోధించేలా నేర్పుతాం. రాము అనే పేరు గల నౌకరుంటే ‘రాము తాతా’ అని పిలవమని మన పిల్లలతో చెబుతాం. వారిని కూడా మన కుటుంబంలో సభ్యలుగానే పరిగణిస్తాం. కొన్ని వంశాలే ఈ కోణంలో విస్తరించాయి. రఘువంశం లాగ కొన్ని వంశాలు విస్తరించాయి. వంశాలు కూడా ఒక కుటుంబం కోవలోకే వస్తాయి కదా! వృత్తుల ఆధారంగా కొన్ని కులాలు ఏర్పడ్డాయి. ఆ మేరకు కులం కూడా ఒక కుటుంబమే, గ్రామం కూడా ఒక కుటుంబమే. ఇంకా ముందుకెళ్లి చూస్తే దేశం సైతం కుటుంబమే. ఇంకా ఇంకా విస్తరిస్తూ పోతే ఈ వసుధ, ఈ నేల – వీటి నడుమ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలని ప్రాచీనకాలం నుండి మన గ్రంథాలు ఏ విషయాన్నైతే ఉద్ఘోషిస్తున్నాయో వాటినే మనం ‘వసుధైవ కుటుంబకం’ అని పదేపదే ఉచ్చరిస్తున్నాం. ప్రపంచం కూడా కుటుంబమే కదా. ఇది కుటుంబం పట్ల మనకున్న భావన.

కేవలం మానవ సమాజానికి సంబంధించిన నిర్మాణం వరకే కాదు, మిగతా సృష్టికి సంబంధించిన విషయాలని కూడా నేను ప్రస్తావించాను కదా! ప్రాణి జగత్తు ఉంది, అక్కడ కూడా కుటుంబ సంబంధాలకి చెందిన పిలుపులనే కొనసాగిస్తున్నాం. పిల్లి పిన్నిగా మారింది, ఆవు గోమాతగా మారింది, తులసి సైతం మాతగా మారిపోయింది. ఇంతేకాదు దేన్నయితే మనం జడ సృష్టిగా భావిస్తున్నామో, వాటిల్లోని కొన్నిటితో మనకు సంబంధాలు ఏర్పడ్డాయి. చంద్రుడు చందమామగా మారిపోయాడు, సూర్యుడు కాస్తా సూరి తాతగా మారాడు. గలగలా ప్రవహించే ఏ నదుల తీరాన సభ్యతా సంస్కారాలు వికసించాయో ఆయా నదులను లోక మాతలని, నదీమతల్లులని ‘కాకా కాలేల్కర్‌’ ‌కీర్తించారు. ఇక సమస్త సృష్టి ఏ ఏ వస్తువుల చేరికతో జరిగిందో వాటిని మనం పంచ మహాభూతాలంటున్నాం. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ.. వీటితో మనకున్న సంబంధమేమిటి? మహాయోగి భర్తృహరి నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకమనే మూడు గొప్ప శతకాలు రాశాడు. వైరాగ్య శతకంలోని ప్రతి శ్లోకం చివర్లో పంచ మహాభూతాలతో తనకున్న సంబంధాన్ని కుటుంబ సంజ్ఞలతో ప్రస్తావించాడాయన.

‘మాతా మోదినీ, తాత మారుతః, సఖే తేజః, సుబంధు జలః,

భ్రాతృ వ్యోమః వివథ దేవః భవతామంక్యా ప్రణమాంజలి’

అంటే భూమి నా తల్లి, వాయువు నా తండ్రి, అగ్ని నా మిత్రుడు, నీరు నా దగ్గరి బంధువు, ఆకాశం నా సోదరుడు (భ్రాతృ వ్యోమః) అని భర్తృహరి చెబుతాడు. ఈ సంబంధాలతో నేను నిబద్ధుడనై ముడిపడి ఉన్నాను అని అర్థం. సంపూర్ణ సృష్టితోపాటు ఈ సంబంధాలన్నిటితోనూ మనం కుటుంబ బంధు త్వాలని కొనసాగించటం వల్ల మన వ్యవహార శైలిలో సానుకూల భావన ఏర్పడుతుంది. సార్థకమైన మానవ సమాజాన్ని చూడాలన్న మన స్వప్నం సాకారమవు తుంది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధీకులతో కూడిన కుటుంబం కాదు, భావనాత్మక సంబంధాలతో కూడా ఉంటుంది. భావనాత్మక సంబంధం అనేది కూడా అందులో ఇమిడి ఉన్న ఒక విశిష్టత. నిన్న, నేడు, రేపుల సమన్వయమే కుటుంబం. గడిచిపోయిన నిన్నలో మన తాతలు, నేడు అనే వర్తమానంలో అమ్మానాన్నలు ఉన్నారు. రాబోయే రేపులో భవిష్యత్‌ ‌తరం ఉంటుంది. అందుకే నిన్న, నేడు, రేపులది ఒక సమన్వయమని నేనన్నాను. కుటుంబంతో ఎలా ఉంటారు? ప్రతివ్యక్తి స్వభావం భిన్నంగా ఉంటుంది. స్వభావం, వ్యవహారం భిన్నంగా ఉండి కూడా పర స్పరం వివాదాలు, గొడవలకు తావీయకుండానే పర స్పర పూరకాలుగా ఎందుకు మారతారు? ఎందుకంటే మనదేశం విభిన్న స్వభావాల, గుణ ధర్మాలకు చెందిన వ్యక్తులకు సంబంధించిన సమన్వయ భూమి.

–  సురేష్‌జీ సోని, ఆర్‌ఎస్‌ఎస్‌-అఖిల భారత కార్యకారిణి సదస్యులు

About Author

By editor

Twitter
YOUTUBE