ఆఫ్టరాల్ అతడో చుంచెలుక – నేను గండర గండుపిల్లిని అనుకుంది కొమ్ములు తిరిగిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం. ఆట మొదలుపెట్టింది. రెండేళ్ళు దాటినా ఇంకా ఆడుతూనే ఉంది. ఎలుక మాత్రం దొరకలేదు.
మొదట కోల్‌కతాలో ఎలుక ఉన్న బొరియ చుట్టూ డజన్ల కొద్దీ పిల్లులను కాపలా పెట్టింది. అన్నిటి కళ్ళలో కారం కొట్టి ఎలుక తప్పించుకుపోయింది. కొన్ని నెలల తరవాత కాబూల్ నుంచి బయలుదేరి ఇరాన్, ఇరాక్, టర్కీల మీదుగా ఎలుక జర్మనీకి పారిపోనున్నదని గండుపిల్లికి ఉప్పందింది. ఎక్కడ దొరికినా చంపెయ్యమని ఆ దారి పొడవునా దేశదేశాలలోని తన గూఢచారి పిల్లులను పురమాయించింది. దాని నెత్తిన జెల్ల కొట్టి ఎలుక ఆకాశంలోంచి బెర్లిన్‌కు ఎగిరి పోయింది. అది అక్కడ చేరిన సంగతి చాలా నెలలకు గానీ గండుపిల్లి వాసన పట్టలేకపోయింది. దాన్ని ఎలా ఒడిసిపట్టాలా అని ప్లాన్లు వేయగా వేయగా ఇన్నాళ్ళకు చుంచెలుక జాడ పిల్లి మారాజులకు తెలిసింది.
నేతాజీ సుభాస్ చంద్ర బోస్‌ను సముద్రమార్గాన తూర్పుకు తరలించాలన్న నిర్ణయాన్ని జర్మన్ ప్రభుత్వం అతి రహస్యంగా ఉంచింది. ఫ్రీ ఇండియా సెంటర్ లో తన ఉత్తరాధికారి అయిన ఎ.సి.ఎన్.నంబియార్‌కి మినహా ఆ సంగతి నేతాజీ బెర్లిన్‌లో తన సహచరులెవ్వరికీ తెలియనివ్వలేదు. ఆయన ప్రైవేట్ సెక్రటరీగా వెంట వెళ్ళిన ఆబిద్ హసన్‌కు తాను ఎటు వెళ్ళుతున్నదీ సబ్ మెరైన్‌లోకి దిగేదాకా తెలియదు. అసలు నేతాజీకే ప్రయాణానికి పది రోజుల ముందుగానీ వివరాలు చెప్పలేదు. అంతకుముందు నేతాజీ ఇటలీ నుంచి విమానంలో దూరప్రాచ్యానికి వెళ్ళాలని ప్రయత్నిస్తే ‘వద్దు. క్షేమం కాదు. ఇటలీ వాళ్ళు రహస్యాన్ని గుట్టుగా ఉంచలేరు’ -అని జర్మన్ అధికారులు వారించారు. గుట్టు దాచటం తమకే బాగా చేతనవునని వారికి పెద్ద నమ్మకం.
కానీ రహస్యతంత్రాల్లో ఆరితేరిన నాజీలు పసిగట్టలేనిది ఏమిటంటే వారి అతి రహస్యం బట్టబయలయింది. నేతాజీ సబ్ మెరైన్‌లో తూర్పుకు వెళ్ళబోతున్న వైనం ఆయన బెర్లిన్ నుంచి బయలు దేరకముందే తెలియకూడని వారికి తెలిసిపోయింది.
నాజీలు కలనైనా ఊహించలేని.. తెలిస్తే హిట్లర్‌కి గుండెపోటు రాగల భయంకర రహస్యం ఇంకొకటి ఉంది. ఒక్క నేతాజీ సముద్రయానం గురించే కాదు. జర్మన్ ప్రభుత్వ గుట్టుమట్లు, టాప్ సీక్రెట్ కమ్యూ నికేషన్లు అన్నీ ఎప్పటికప్పుడు బ్రిటిష్ నిఘా వ్యవస్థకు చేరిపోతున్నాయి.
అది ఎలా జరిగింది అన్నది తెలియాలంటే మన కథాకాలానికి తొమ్మిది నెలల వెనక్కి వెళ్ళాలి. 1941 మే 9 మధ్యాహ్నం ఉత్తర అట్లాంటిక్‌లో జర్మన్ల U-110 జలాంతర్గామిని బ్రిటిష్ యుద్ధ నౌక HMS Bulldog పేల్చేసింది. దానిలోని నావికులు ప్రాణాలు దక్కించుకోవటానికి హడావుడిగా పారిపోయారు. ఆ తొందరలో మెషిన్లను కట్టెయ్యటం మర్చిపోయారు. ధ్వంసమైన సబ్మెరైన్ ఉపరితలానికి తేలింది. బ్రిటిష్ యుద్ధనౌక లోంచి పందొమ్మిది ఏళ్ళ సబ్ లెఫ్టినెంట్ డేవిడ్ బామే తాడు కట్టుకుని సబ్మెరైన్ శిధిలాలలోకి చేరాడు. నిచ్చెన మెట్లు దిగి వైర్లెస్ టెలిగ్రాఫ్ ఏరియాలోకి వెళ్ళాడు.
అక్కడ టైప్ రైటర్ లాంటి మెషిన్ ఒకటి కనిపించింది. అది ఇంకా పని చేసే స్థితిలోనే ఉంది. ఇంగ్లీషు వాళ్ళ పంట పండింది. అది Enigma మెషిన్! రెండో ప్రపంచ యుద్ధ కాలమంతటా దుర్భేధ్యమైన సీక్రెట్ కోడ్‌లో అతి రహస్య వర్తమానాలను పంపటానికి జర్మన్ ప్రభుత్వం ఉపయోగించిన రహస్య యంత్రమూ, దాని సీక్రెట్ సెట్టింగులు, అందులో వాడే కోడ్ భాష అలా అనుకోకుండా బ్రిటిష్ మిలిటరీ ఇంటలిజెన్స్ వారికి చిక్కాయి. గణిత శాస్త్రంలో దిట్టలైన Alan Turing, John Jeffreys ల బృందం సంవత్సరం పైగా కష్టపడి మొత్తానికి 1942 జూలైలో ఎనిగ్మా కోడ్‌ను భేదించింది. నాజీ జర్మనీ రహస్య రేడియో సందేశాల ట్రాన్స్మిషన్ల ట్రాఫిక్ అంతటినీ బ్రిటిష్ కోడ్ బ్రేకర్ల బృందం డీకోడ్ చేయగలిగింది. ఆ పరిజ్ఞానంతో జర్మన్ల రహస్య వర్తమానాలు అందింది అందినట్టు డీకోడ్ చేయగల Ultra మెషిన్ తయారైంది. అది మొదలు రెండో ప్రపంచ యుద్ధం గతి మారింది. హిట్లర్ పతనానికి బీజం పడింది. (దీని మీద 2014లో The Imitation Game అనే ఇంగ్లీషు సినిమా కూడా వచ్చింది.)
1943 ఫిబ్రవరి 9న కీల్ నుంచి U-120 జలాంతర్గామిలో సుభాస్ చంద్ర బోస్ బయలు దేరనున్నాడని బెర్లిన్‌లోని జపాన్ రాయబారి ఒషిమా హిరోషి బెర్లిన్‌కు పంపిన రహస్య వర్తమానం టోక్యోతో పాటు లండన్‌కి కూడా చేరింది! దారి మధ్యన బోటు మార్పిడి చేసి బోస్‌ను అందిపుచ్చుకోవటానికి జపాన్‌వారు సన్నాహాలు చేసినట్టే దారికాచి బోస్‌ను అంతమొందిచటానికి బ్రిటిషువారూ కసరత్తు చేశారు.
నేతాజీ ఉన్న U బోటు అట్లాంటిక్‌ను చుట్టుదారిలో దాటి కేప్ ఆఫ్ గుడ్ హాప్ వైపు సాగుతుండగా బయలుదేరి నెల గడిచాక లండన్‌కు వాయవ్యాన చిన్న పట్టణం Bletchley లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు చెందినమూడు కీలక విభాగాల ప్రతినిథులు సమావేశమయ్యారు. బ్లెచ్లీ్చ లో ఎందుకంటే – ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇంటలిజెన్స్‌కు అదే హెడ్ క్వార్టర్స్. శత్రువుల గుట్టు విప్పే అల్ట్రా మెషిన్ ఉన్నదీ అక్కడే.ఇండియన్ పొలిటికల్ ఇంటలిజెన్స్ (ఐ.పి.ఐ.), సీక్రెట్ ఇంటలిజెన్స్ సర్వీస్ (ఎస్.ఐ.ఎస్.), కౌంటర్ ఇంటలిజెన్స్ చేసే MI ఏజెన్సీల అధికారులు ఆవాళ భేటీ అయ్యారు. సుభాస్ చంద్ర బోస్ విషయంలో ఏమి చేయాలన్నది మీటింగు ఎజెండా. బెర్లిన్ నుంచి, జలాంతర్గామి నుంచి వెలువడిన రేడియో మెసేజిలను బట్టి బోస్ ఎప్పుడు ఎక్కడ బయలుదేరాడు, ఎటువైపు వెళుతున్నాడు అన్నది తెల్లదొరలకు తెలుసు. మధ్యలో ఎక్కడో జలాంతర్గామి మారబోతున్నాడనీ వారు ఎరుగుదురు. అందిన సమాచారాన్ని మదింపు చేసి తదుపరి కర్తవ్యం నిర్ణయించటానికి. ఇంతకీ నిర్ణయం ఏమి చేశారన్నది తెలియదు. దీనికి సంబంధించిన సమాచారం అనంతరకాలంలో బహిరంగపరచిన బ్రిటిష్ రహస్యపత్రాల్లో ఎక్కడా లేదు. కొన్నేళ్ళ కింద ఒక రష్యన్ పరిశోధకుడికి సోవియట్ ఆర్కైవ్స్ లో ఒక సీక్రెట్ డాక్యుమెంట్ దొరికింది. బ్రిటిష్ ఇంటలిజెన్స్‌లో చొరబడ్డ ఒక సోవియట్ ఏజెంటు పంపిన రహస్య నివేదిక అది. జర్మన్ సబ్మెరైన్‌లో బోస్ జపాన్‌కు వెళుతున్న సంగతి 1943 మార్చ్ 12 లండన్ సమావేశంలో గూఢచారి సంస్థల ప్రతినిథులు చర్చించినట్టు అందులో ఉంది.
కాబట్టి బ్రిటిషు ప్రభుత్వానికి ఉప్పందింది. అయినా బోస్‌కి ఏమీ కాలేదు. సాగరగర్భంలో ఆయన సాహసయాత్ర నిరాటంకంగా సాగింది. నేతాజీ క్షేమంగా గమ్యం చేరాడు. తెలిసి కూడా అడ్డగించే ప్రయత్నం చేయక బ్రిటన్ నేతాజీని వదిలేసిందా? అడ్డగించాలని చూసినా ఏమీ చేయలేక బ్రిటన్ విఫలమయిందా ?
దీని మీద గ్రంథకర్తలు, చరిత్రకారులు ఎవరికి తోచిన ఊహ వారు చేశారు. చాలామంది (వారిలో The Lost Hero రాసిన మిహిర్ బోస్ ఒకడు) తేల్చింది ఏమిటంటే జర్మనీ నుంచి నేతాజీ సబ్మెరైన్‌లో బయలుదేరిన సంగతి బ్రిటిష్ ప్రభువులకు తెలుసట. తలచుకుంటే ఆయనను సముద్రంలో ఉండగానే గువ్వపిట్టలా పట్టుకోగలిగే వారేనట. అయినా పట్టకుండా వదిలేశారట. ఎందుకంటే బోస్‌ను దారికాచి పట్టుకుంటే అతడి ప్రయాణం వివరాలు బ్రిటన్‌కు ముందే తెలుసని జర్మనీకి అర్థమవుతుందట. దాంతో జర్మన్ల ఎనిగ్మా సీక్రెట్ కోడ్ ను బ్రిటన్ Ultra మిషను భేదించిందన్న రహస్యం రట్టు అవుతుందట. అలాగే అమెరికా వారు కనిపెట్టిన Magic మిషను జపాన్ వారి రహస్య వైర్లెస్ వర్తమానాలనన్నిటినీ న్యూస్ పేపర్ చదివినట్టు చదివేస్తున్నదట. బోస్ మీద బ్రిటన్ చేయి వేస్తె ఒక్క Ultra సంగతే కాదు. అమెరికన్ల Magic మర్మం కూడా జపాన్‌కు తెలిసిపోతుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదట. ఎందుకంటే 1941 డిసెంబరులో పర్ల్ హార్బరు మీద బాంబులేసిన యమమోతో అనే జపాన్ వాడిని మట్టుపెట్టాలని అమెరికా పగపట్టిందట. అతగాడి ఆనుపానులు ‘మాజిక్’ మిషను ద్వారా ఆరా తీస్తూ మాటువేసి వేటు వేయటానికి సమయం కోసం ఎదురు చూస్తున్నదట. ఇప్పుడు బోస్ పని పడితే అన్నిటికంటే ముఖ్యమైన ఆ ప్రతీకార హత్య పథకం చెడిపోతుందట. అది బ్రిటిషువాళ్లకు ఇష్టం లేదట. అందుకే అసలైన టార్గెట్ అయిన యమమోతో వధకు ఆటంకం వస్తుందన్న భయంతో ఆఫ్టరాల్ నేతాజీ బోస్‌ను పోతేపోనీ అని వదిలేశారట.
ఇది తలతిక్క తర్కం. ఎందుకంటే అప్పుడు మిత్రరాజ్యాలకూ అక్షకూటమికీ మధ్య అట్లాంటిక్ , హిందూ మహాసముద్రాలలో భీకర యుద్ధం జరుగుతున్నది.చేతికి చిక్కిన ప్రతి జర్మన్ సబ్మెరైన్‌నూ బ్రిటిష్ యుద్ధనౌకలు ధ్వంసం చేస్తున్నాయి. బ్రిటిష్ యుద్ధ విమానాలు శత్రు జలాంతర్గాములమీద బాంబులేయటానికి నిరంతరం ఆకాశంలో ఎవర్ రెడీగా ఉన్నాయి. అలాంటి సమయంలో బోస్ ప్రయాణిస్తున్న జర్మన్ జలాంతర్గామిని పేల్చేసి ఆయనను పట్టుకున్నా మట్టుపెట్టినా అది మామూలు యుద్ధంలో భాగమే అవుతుంది. జర్మనీ అతి రహస్యాలను ఇంగ్లిషు వాళ్ళ అల్ట్రా మిషను పట్టేసింది కాబట్టే అలా అయిందన్న అనుమానం జర్మన్లకు కానీ జపనీయులకు కానీ అతీంద్రియశక్తి ఉంటే తప్ప కలగదు.
అదీ కాక – అసలు గురి అని చెప్పబడే అడ్మిరల్ యమమోతో కదలికలను ‘మాజిక్’ ద్వారా కనిపెట్టి, ఐలాండ్స్‌కు సైనిక తనిఖీకి వెళ్తూండగా అమెరికన్లు మాటువేసి 1943 ఏప్రిల్ 18న ఖతం చేశారు. అప్పటికి నేతాజీ ఇంకా సబ్మెరైన్‌లోనే ఉన్నాడు. ఆ తరవాత పదిరోజులకు గానీ ఆయన జపాన్ జలాంతర్గామిలోకి మారలేదు. మరి యమమోతోను చంపాక కూడా బోస్‌ను ఎందుకు వదిలేసినట్టు? తూర్పుకు వెళ్లి మాత్రం అతడేమి చేయగలడు? పోతే పోనీ – అన్న చిన్నచూపుతోనా? నేతాజీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి భయం లేదా? అలా చెప్పటానికీ వీల్లేదు.
జపాన్ దౌత్యాధికారి అన్న మారుపేరుతో సుభాస్ చంద్రబోస్ రష్యా గుండా ప్రయాణం చేయవచ్చు. అతడిని అడ్డుకోండి. అతడో ఫాసిస్టు. అలాంటివాడిని ఉపేక్షించటం మిత్రరాజ్యాల ప్రయోజనాలకు హానికరం – అని రష్యా విదేశాంగ మంత్రి మాలతోవ్‌కు చెప్పవలిసింది అంటూ ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం మాస్కోలోని తన రాయబారి సర్ ఆర్చిబాల్డ్ కెర్‌కి 1942 జూన్ 22న టెలిగ్రాం పంపింది. The Man India Missed The Most అనే గ్రంథం 227వ పేజీలో భువన్ లాల్ బయటపెట్టిన విషయమిది. అవి ఇటలీ సాయంతో విమానం మీద ఎలాగైనా తూర్పు ఆసియాకు వెళ్ళాలని నేతాజీ విశ్వప్రయత్నాలు చేస్తున్న రోజులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోస్‌ను తూర్పుకు వెళ్లనివ్వకూడదు అని బ్రిటన్ ఎంత పట్టుదలతో ఉన్నదో ఆ టెలిగ్రాంను బట్టే అర్థమవుతుంది. మా శత్రువును మా ఇలాకాల వైపు వెళ్ళనివ్వకండి బాబూ అని రష్యాను దేబిరించిన బ్రిటిష్ మారాజులు అదే శత్రువు తమ కళ్ళముందే ఏకంగా మూడు నెలల పాటు సముద్రాలలో ప్రయాణం చేస్తూంటే చేతుల్లో కావలసినన్ని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, లెక్కలేనన్ని బాంబులు ఉన్న ఆంగ్ల మహా సామ్రాజ్యం పోతే పోనీ అని చూస్తూ చూస్తూ వదిలేస్తారా?
బోస్ విషయంలో లండన్ లెక్క ఇప్పటికే ఒక సారి తప్పింది. 1941లో కోల్‌కతా ఇంటి నుంచి జేమ్స్ బాండ్ తరహాలో సుభాస్ చంద్ర బోస్ తప్పించుకు పోయిన సంగతి చాలా రోజుల తరవాతకానీ బ్రిటిష్ ప్రభుత్వం వాసన కనుక్కోలేక పోయింది. పెషావర్ నుంచి అతడు కాబూల్‌కు వెళ్ళబోతున్నాడని తన గూఢచారి భగత్ రాం తల్వార్ ద్వారా ముందే తెలిసింది. వెళ్లి మాత్రం అతడేమి చేయగలడు ? అతడి వల్ల ఏమవుతుంది? అతడు ఇండియాలో ఉంటేనే ప్రమాదం. దేశం వదిలి పోతే మనకే లాభం. పీడ విరగడ అవుతుంది – అని తలపోసి బ్రిటిష్ ప్రభుత్వం బోస్‌ను ఇండియా దాటనిచ్చింది. ఆ అతితెలివే దాని కొంప ముంచింది.
కాబూల్ నుంచి బోస్ నాజీ జర్మనీకి చేరబోతున్నా డని తెలిశాక లండన్ నాలిక కరుచుకుని కంగారు పడింది. అతడు కనిపిస్తే కాల్చేయ్యమని అతడు వెళ్తాడనుకున్న దారి పొడవునా ఉన్న తన ఏజెంట్లకు ఆజ్ఞ ఇచ్చింది. నాజీలతో బోస్ కలవబోతున్నాడంటేనే అంత గంగవెర్రులెత్తిన బ్రిటిష్ మహా సామ్రాజ్యం అతగాడు నాజీల కోటలో పాగావేసి, జపాన్‌తో మాట్లాడుకుని తమపై సైనిక దండయాత్ర చేయటానికి ఒంటరిగా వేలమైళ్ళ దూరం సముద్రంలో మెల్లిగా సాగిపోతున్నాడని తెలిశాక తెల్లవాళ్ళు ఊరు కుంటారా? ఏ మాత్రం వీలు చిక్కినా ఇండియాలో తమ ప్రధాన శత్రువును సముద్రంలోనే సమాధి చేయకుండా ఉంటారా? అంత కసి ఉన్నా, అపార ఆయుధ శక్తి ఉండి కూడా నేతాజీని ఏమీ చేయలేక పోయారంటే- చేతకాకే అని మట్టిబుర్రలకు కూడా అర్థం కాదా?
రెండు ఖండాల మీదుగా రెండు మహా సముద్రాలలోంచి సాగిన నేతాజీ ప్రయాణంలో ముఖ్యంగా బ్రిటన్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయో ఇంతకు ముందు చూశాం. సముద్రపు వేర్వేరు లోతుల్లో అమర్చిన బాంబులు,పేల్చిన మందుపాతరలు, యుద్ధవిమానాల గిరికీలు ప్రపంచ యుద్ధంలో మామూలే. కానీ అదే దారిన తమ సామ్రాజ్యానికి ప్రబల శత్రువు వెళ్లనున్నాడని ముందే ఉప్పందినప్పుడు బ్రిటిషు బలగాలు కొంతమంది గ్రంథకర్తలు ఊహించి నట్టు గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవు. అవి మామూలుకంటే ఎక్కువ ఎలర్టుగా ఉండి బోస్‌ను తమ పద్ధతిలో రిసీవ్ చేసుకోవటానికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశారనటంలో అనుమానం అక్కర్లేదు. కెప్టెన్ మూసెన్ బెర్గ్ నావికా బృందం చాకచక్యం వల్ల తప్పిన అనేక గండాలు ముఖ్యంగా నేతాజీకి గురిపెట్టినవని ఊహించవచ్చు.
మరి దారి వెంబడి ఇన్ని మారణాస్త్రాలను ముందే మొహరించి ఉంచినా, సబ్మెరైన్ కు వెళ్ళే, దానినుంచి పోయే వైర్లెస్ వర్తమానాలను పొంచి వినగలిగినా బ్రిటిష్ సామ్రాజ్య మహా సైనిక శక్తి నేతాజీని ఎందుకు మట్టుపెట్టలేకపోయింది? His Majesty’s Opponent గ్రంథంలో సుగతా బోస్ చెప్పినట్టు సముద్ర గర్భంలో అతడి ఉనికిని కచ్చితంగా పసికట్టి, గురి చూసి దాడిచేయగల నిఘా, మిలిటరీ వ్యవస్థలు ఆ కాలాన శత్రువుల చేతిలో లేకపోవటమే దీనికి కారణం అనుకోవచ్చు.
అయితే ఆ సంగతి నేతాజీకి కానీ , నావికులకు కానీ తెలియదు. ముప్పులను ఒడుపుగా తప్పించు కుంటూ ముందుకు సాగుతూనే శత్రువులను ముప్పతిప్పలు పెట్టటానికి వారు చేయాల్సింది వారూ చేశారు. U-120 ని పంపించింది కేవలం నేతాజీని సగం దూరంలో డ్రాప్ చేసి రావటానికే కాదు. దొరికిన శత్రునౌక నల్లా ముంచేసే డ్యూటీ కూడా దానికి పురమాయించారు. అది అంత పనీ చేసింది కూడా. అట్లాంటిక్ మధ్యలో ఇంధనం నింపుకున్న తరవాత మూసెన్ బెర్గ్ వేట మొదలు పెట్టాడు. బ్రెస్ట్ రేవు నుంచి దక్షిణం వెళ్ళవలసి ఉండగా పడమరకు మళ్ళి శత్రువుల సరుకు నావలను గాలిస్తూ బ్రెజిల్‌తీరం దాక వెళ్ళాడు. కానీ వేట దొరకలేదు. ఆఫ్రికా తీరం మీదుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్‌కు వెళ్తుండగా మధ్య దారిలో శత్రువుల MV Corbis ఆయిల్ టాంకర్ కనపడింది. దాని బరువు 8 వేల టన్నులు. కొంతదూరం దాన్ని కిందినుంచి వెంబడించిన తరువాత U బోటు ఉపరితలానికి వెళ్లి కార్గో బోటును టార్పెడో చేసింది. బోటు మునిగిపోయింది. ఆయిల్ పొర్లి సముద్రంలో చాలాదూరం విస్తరించింది. అంతలో మంటలు లేచాయి. నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మింది. సముద్రం మండే భయానక దృశ్యాన్ని జీవితంలో మొదటిసారి బోస్ చూశాడు. దానికంటే భయంకరమైనది మునగనున్న బోటులోని నల్లజాతివాళ్ళ దుర్గతి. ముందుగా నల్లవాళ్ల కోసం ఒక మామూలు బల్లకట్టును విసిరేశారు. వాళ్ళు ప్రాణాలు దక్కించు కోవటానికి ఆబగా దాని మీదికి దూకారు. దాని వెనుక తెల్లతోలు సిబ్బంది కోసం అసలైన లైఫ్ బోటును బయటికి విడిచారు. తెల్లవారు అందులో క్షేమంగా ఎటో చేరతారు. నల్లజనం నడిసంద్రంలో ఎక్కడో గల్లంతవుతారు. జాతి వివక్ష మరీ ఇంత క్రూరమా అని నిర్ఘాంతపోయాడు నేతాజీ.
ఇది జరిగిన రెండు రోజులకు ఇంకో వైపు నుంచి ప్రమాదం ముంచుకొచ్చింది. శత్రువుల యుద్ధ నౌకల బారి నుంచి నేర్పుగా తప్పించుకోగలిగిన U బోటు కర్మకాలి ఒక మామూలు కార్గో బోటు పాల పడింది. మామూలుగా అయితే జలాంతర్గామికి కార్గోబోటు లోకువే. వాటం చూసి గురిపెట్టి ఇట్టే టార్పెడో చేయగలదు. కానీ ఆ లోపే దానికి చిక్కితే అదే జలాంతర్గామిని నుజ్జు చేయగలదు. అదే జరగబోయి వెంట్రుకవాసిలో ముప్పు తప్పింది. ప్రమాదవశాత్తో, అంచనా తప్పటం వల్లో గాని సబ్మెరైన్ ఉపరితలంపైకి తేలి కార్గోబోటుకు చాలా దగ్గరికి వెళ్ళింది. అది చూసి కెప్టెన్ నావను టక్కున వెనక్కితిప్పి అతివేగంగా జలాంతర్గామి వైపు ఫుల్ స్పీడులో ఉరికించాడు. ఆ తరవాత ఏమైందో ఆబిద్ హసన్ మాటల్లో వినండి:
ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టంలో కెప్టెన్ ‘‘డైవ్ డైవ్’’ అంటూ కంగారుగా కేకలు పెట్టాడు. కాని పొరపాటున ఉపరితలం పైకి వెళ్ళినప్పుడు ఉన్నపళాన కిందికి మునగటం కుదరదు. దానికి కాస్త సమయం పడుతుంది. ఆ లోపే దాన్ని చిదిమెయ్యటానికి కార్గో బోటు పెద్ద చప్పుడుతో దూసుకొస్తున్నది. నా గుండె ఝల్లుమన్నది. మా పని అవాళిటితో అయిపోయిందనే అనుకున్నాను. నావికులందరూ భయంతో గజగజలాడారు. అంతలో ‘‘హసన్! ఇప్పటికి రెండు సార్లు చెప్పాను. నువ్వు రాసుకోవటం లేదు’’ అని నేతాజీ మందలింపు! అది నేను జన్మలో మరచిపోలేను. జర్మన్ క్రూ హడలి పోయారు. కెప్టెన్ హడావిడిగా అరుస్తున్నాడు. అంతటా భయవిహ్వలత. ఒక్క నేతాజీ మాత్రమే నిర్వికారంగా ఉండిపోయాడు. అంతా గమనిస్తూనే ఏమీ జరగనట్టు డిక్టేషన్ ఇస్తూ పోయాడు.
మా రోజులు బాగుండి బతికిపోయాం. కార్గో బోటు మా బ్రిడ్జి రైలింగులని రాచుకుంటూ వెళ్ళింది. రివెట్లు బుల్లెట్లలా లేచిపడ్డాయి. సబ్మెరైన్‌ను చివరి సెకండులో నావికులు డైవ్ చేయించగలిగారు. మేము 45 డిగ్రీలలో పక్కకి నెట్టివేయబడ్డాము. నెమ్మదిగా స్థిమితపడ్డాం. తరువాత కెప్టెన్ ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టంలో మాతో మాట్లాడాడు: ‘‘మనం నిజంగా పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాం. మనది జర్మన్ జాతి. మహా ధైర్యస్థులం అని మనం చెప్పుకుంటాం. కానీ మీలో చాలామంది ఇందాక ఎలా రియాక్ట్ అయ్యారో నేను గమనించాను. ఆపదలో ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మనతో పాటు ఉన్న ఇండియన్ లీడర్ మిస్టర్ బోస్‌ను చూసి మనం నేర్చుకోవాలి’’
[Netaji Subhas Chandra Bose.. From Kabul to Battle of Imphal, H.N.Pandit, pp 159-160]
ఎట్టకేలకు జర్మన్ జలాంతర్గామి కేప్ ఆఫ్ గుడ్ హాప్‌ను చుట్టి హిందూ మహా సముద్రంలో క్షేమంగా ప్రవేశించింది. మరి కొన్నాళ్ళలో మడగాస్కర్‌కు నైరుతి దిక్కున జపాన్ జలాంతర్గామిని కలుసుకోవలసిన సంకేత స్థలానికి ఏప్రిల్ 26 న చేరుకుంది. బ్రిటిష్ నౌకలు హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్ట కుండా సబ్మెరైన్ బారికేడ్‌ను ఏర్పరచమని హిట్లర్ జపాన్‌కు సూచించింది ఆ స్థలమే. సాధారణంగా అక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. కాని ఇప్పుడు మాత్రం మహా సంక్షుభితంగా ఉంది. వీరు వెళ్ళేసరికే జపాన్ I-29 రకం సబ్మెరైన్ వచ్చి వేచి ఉన్నది. మలయా తీరంలోని పెనాంగ్ రేవులో ఏప్రిల్ 20న బయలుదేరి నిర్ణీత స్థలానికి పదిగంటలముందే అది చేరుకుంది.
నేవిగేషన్ డేటాను ముందే సేకరించినందువల్ల దాన్ని తేలిగ్గానే పోల్చుకున్నారు. ఇందులోంచి అందులోకి ప్రయాణికులను తరలించటం ఎలా అన్నదే సమస్య. సముద్రం చాలా రఫ్‌గా ఉన్నందువల్ల జలాంతర్గాములు ఒకదానికి దగ్గరగా ఇంకొకటి వెళితే అలల వేగానికి పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంది. ఒకరికొకరు రేడియో మెసేజిలూ పంపుకోలేరు. వాటిని బట్టి శత్రు విమానాలు ఎక్కడ వస్తాయోనని భయం. కనుచూపు దూరంలో రెండు సబ్మెరైన్లూ చాలా సేపు మెల్లిగా కదులుతూ చాలాసేపు వేచి ఉన్నాయి. సముద్రం ఎంతకీ శాంతించలేదు. త్వరలో నెమ్మదిస్తుందన్న ఆశా అగుపించలేదు. ఇంకా ఎక్కువకాలం అలాగే సమయం వృథా అయితే తిరుగు ప్రయాణానికి ఇంధనం తక్కువ పడవచ్చన్న భయమూ జర్మన్లను పట్టుకుంది.
అలా రెండు రోజులు గడిచాక కెప్టెన్ మూసెన్ బెర్గ్ తెగించి ఒక సాహసం తలపెట్టాడు. 27వ తేదీ సాయంత్రం జర్మన్ బోటు నుంచి ఒక ఆఫీసరు, ఒక సిగ్నల్ మాన్ సముద్రంలో ఈదుకుంటూ జపాన్ బోటును చేరారు. ఆరాత్రి అక్కడే గడిపారు. జపనీస్ భాష రాదు కనుక పరిస్థితిని సైగలతో వివరించారు. నేతాజీని స్వాగతించటానికి ప్రత్యేకంగా వచ్చిన జపాన్ నౌకా దళ ఉన్నతాధికారి కమాండర్ తెరావొక అర్థం చేసుకుని మర్నాడు ఉదయం ఒక రబ్బరు తెప్పను, ఒకకొసను తమ నావకు గట్టిగా కట్టిన పెద్ద తాడును జార విడిచాడు. జర్మన్లు ఆ తెప్పలో తమ బోటుకు తిరిగివెళ్ళి తాడు రెండో కొసను దానికి గట్టిగా కట్టారు. వాళ్ళు దిగిన తెప్పలోకి నేతాజీ, హసన్‌లు ప్రాణాలకు తెగించి ప్రవేశించారు. సముద్రపు అలలు మహా ఉధృతంగా తెప్పను ఈడ్చి కొట్టసాగాయి. ఏ మాత్రం జారిపోయినా సముద్రంలో ఆనవాలు మిగలకుండా కొట్టుకుపోతారు. పైగా అది షార్క్ చేపలు తెగ తిరుగుతుండే మడగాస్కర్ సముదప్రాంతం. జర్మన్ నావికులు తుపాకులు పేల్చి, చప్పుళ్ళు చేసి సొరచేపలను అటువెళ్ళ నీయరాదని ప్రయత్నించారు. కాని అవి మనిషి వాసన పట్టినట్టు ఎంతకీ ఆ చుట్టే తిరగ సాగాయి. అది మహా అనుభవ శాలురైన నావికులకే గుండె గతుక్కుమనే పరిస్థితి. నడిసంద్రంలో తెప్ప మీద పోవటం నేతాజీకి, హసన్ కు అదే మొదలు. అయినా మొండి ధైర్యంతో ప్రాణాలు చిక్కబట్టుకుని తాడును గట్టిగా పట్టుకుని, ప్రమాదకరంగా అన్ని వైపులా ఊగిసలాడే తెప్పకు అంటిపెట్టుకుని ఎలాగో ప్రాణాలతో ఆ కొసకు చేరుకున్నారు. సురక్షితంగా జపాన్ జలాంతర్గామిలోకి అడుగుపెట్టారు.
అది నౌకా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని అద్భుతం. భీకర యుద్ధం సాగుతున్న కాలంలో జలాంతర్గామి నుంచి జలాంతర్గామిలోకి మహా సముద్ర మధ్యాన సివిలియన్లను తరలించటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహా సాహసం. దేశం కోసం మన స్వాతంత్య్రం కోసం మన మహా నాయకుడు చేసిన ఆ అపురూప విన్యాసాన్ని వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కళ్ళు చెమర్చుతాయి. కాని ఈ పరమాద్భుత సాహసకృత్యం ఈ తరంలో ఎందరికి తెలుసు?
మలి ఘట్టంలో ప్రయాణం సాఫీగా సాగింది. కమాండర్ తెరావొక I-29 లోకి నేతాజీని సాదరంగా ఆహ్వానించాడు. సరిగ్గా అదే రోజు జపాన్ చక్రవర్తి హిరోహితో జన్మదినం కూడా. దానికీ, నేతాజీ విజయయాత్రకూ గౌరవార్థంగా మాంచి మసాలా కూరతో వేడివేడిగా భోజనం పెట్టారు. చాలా కాలం తరవాత తూర్పు తిండి దొరకటంతో నేతాజీకి ఇంటికి తిరిగొచ్చిన ఫీలింగు కలిగింది. జర్మన్ దానికంటే జపాన్ జలాంతర్గామి పెద్దది. సౌకర్యాలూ మెరుగే. తరావోకే తన కాబిన్ ఖాళీ చేసి నేతాజీకి ఇచ్చాడు. దాంతో తుది మజిలీ హాయిగా గడిచింది. రోజుకు నాలుగుసార్లు జపనీయులు ఆరార తినిపించిన తిండిని సుష్టుగా మెక్కటం ఒక్కటే కాస్త వెక్కసమైనదల్లా !
మొదట అనుకున్న ప్రకారం పెనాంగ్‌లో బయలుదేరిన సబ్మెరైన్ మళ్ళీ అక్కడికే తిరిగిరావాలి. అయితే మామూలుగా గస్తీ కి వెళ్ళే జలాంతర్గామికి కెప్టెన్ గా తెరావొక అంతటి నౌకాదళ ఉన్నతాధికారి వెళ్ళటం రేవులో స్థానికులు గమనించి చెవులు కొరుక్కు న్నారు. వెళ్తూ వెళ్తూ భారతీయులు ఇష్టపడే కూరగాయలను సబ్మెరైన్ వంటవాళ్ళు కొనుక్కు వెళ్ళారు. అది చూసి వస్తాడు వస్తాడు అని ఎప్పటి నుంచో వినవస్తున్న నేతాజీ బోస్ ను వెంటబెట్టుకు రావటానికే వీరు వెళ్ళారా అనీ ఊహాగానాలు సాగాయట. ఇది తెలిశాక ఎందుకైనా మంచిదని తిరుగు ప్రయాణంలో రూటు మార్చారు. పెనాంగ్‌లో కాక సుమత్రాకు ఉత్తరాన విసిరేసినట్టు ఉండే సబాంగ్‌లో దిగమని మధ్యదారిలో ఉండగా ఆదేశాలు వెళ్ళాయి. కీల్‌లో జలాంతర్గామి ఎక్కి దాదాపు మూడు నెలలు కావస్తుండగా 1943 మే 6న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ సబాంగ్ రేవులో దిగి మళ్ళీ ఆసియాలో అడుగుపెట్టాడు.
– ఎం.వి.ఆర్. శాస్త్రి