రోదసి అనగానే మరో మూడక్షరాల పేరు మన మదిలో తళుక్కుమంటుంది. శిరీష. మృదువు అని అర్థం. గుంటూరులో పుట్టిన ఈ అమ్మాయి మటుకు మహాగడసరి. ఎంత అంటే, మనదేశం నుంచి అంతరిక్షానికి వ్యోమనౌకలో వెళ్లి తిరిగి వచ్చేంత! మునుపు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్. ఇప్పు‌డు భారత సంతతి మూడో వనితగా ఈమె. నింగినుంచి నేలను చూడటం మహాద్భుత అనుభవం. ‘నా జీవితమంతా ఇదే గుర్తుంటుంది’ అని చారడేసి కళ్లు తిప్పుతూ మిలమిల పలువరస పిల్ల చెబుతుంటే కోట్లాది వీక్షక శ్రోతలు మైమరిచారు. గగనాన ఘనాతిఘన యాత్ర సాగించిన 33 ఏళ్ల తెలుగమ్మాయిని ప్రసార సాధనాల్లో కళ్లార్పకుండా చూస్తుండిపోయారు. సిసింద్రీ ప్రతి మాటనీ చెవులు రిక్కించి మరీ విన్నారు. వ్యోమయాన చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించడాన్ని… క్షణమైన ఆగకుండా హోరెత్తిన చప్పట్ల జోరు మధ్య స్వాగతించారు. కాదా మరి? నాడు కల్పన అనంతరం నేడు శిరీష-భారతదేశాన జనించిన తరుణీమణి వినువీధిన విహారం చేయడం ఇదే పప్రథమం. అందుకే కదా- నిఖిలావనీ ఇప్పటికీ ‘శిరీ శిరీ’ అంటూ పదేపదే అదే పనిగా పలవరిస్తోంది. ఆ భావోద్విగ్నత ఆకాశంలా అనంతరం!

అంబరం, మిన్ను, చుక్కలదోవ, తారాపథం, దివి, నభము, వియత్తలం, విహాయసం, భువనం – ఏ పేరుతోనైనా పిలవండి ఆ లోకం అవలోకనానికి అందనిదే. మూడున్నరేళ్ల పసిదానిగా ఉండగానే, అమ్మానాన్నతో పాటు గుంటూరు ప్రాంతం నుంచి అమెరికా చేరుకుంది, శిరీ. కొంత కాలానికి ఆ కుటుంబమంతా అక్కడి హ్యూస్టన్‌ ‌పరిసరాల్లో స్థిరపడింది. చిన్నప్పటినుంచీ చదువులో బహు చురుకైనది కావడంతో, ఎక్కడ తానుంటే అక్కడ మెరుపులే! అదేం చిత్రమో కానీ, ఎప్పుడూ గగనసీమ వైపు చూపు. ఆ పైన ఏముందో తెలుసుకోవాలన్నదే తపన. చూస్తుండగానే ఆ దేశంలోని పర్డ్యూవర్సిటీ నుంచి డిగ్రీ వచ్చేసింది. దరిమిలా మాస్టర్‌ ‌కోర్సూ అయింది. పట్టా తీసుకుంది. ఏ కోర్సులోనో తెలుసా? ఏరోనాటికల్‌ – ఆ‌స్ట్రోనాటికల్‌ ఇం‌జనీరింగ్‌. ‌తదుపరి నేషనల్‌ ఏరోనాటిక్స్, ‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌మీద దృష్టి మళ్లింది. మనందరికీ తెలిసిందే- నాసా. అక్కడ చేరితే వ్యోమగామి అయ్యే అవకాశముంటుందని కొండంత ఆశ. కారణాంతరాల వల్ల అది తీరలేదు. పోనీ కమర్షియల్‌ ‌స్పేస్‌ ‌ఫ్లయిట్‌ ‌దిశగా అయితే? ఒక నిశ్చయానికి వచ్చాక, వర్జిన్‌ ‌గెలాక్టిక్‌ ‌గురించిన అనురక్తి వెల్లివిరిసింది. అందునా ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన పక్రియలంటే మక్కువ మరీ ఎక్కువ. అనతికాలంలోనే నిర్వహణ బాధ్యతలూ మరింత దరిచేరాయి. పురోగమనాన్ని ఇక అడ్డుకునేది ఏముంటుంది? అంతే. పాదరసంలా విస్తరించిన శిరీష ఇప్పుడిక ‘కల నిజమాయెగా’ అంటూ జోరుగా పాడుకుంటోంది. ఇంతకీ గెలాక్టిక్‌ అనేది అమెరికన్‌ ‌రోదసీ వ్యవస్థ. ఆ అంతరిక్ష నౌక పేరైతే యూనిటీ-22. అదుగో అందులోనే సాహస ముదిత శిరీష విహారం, విజయం – రెండూనూ.

అడుగడుగునా విభిన్నత

వ్యోమనౌక సంసిద్ధతకు ముందువెనుకలు అన్నీ ఇన్నీ కావు. సంవత్సరాల పర్యంతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతకుమించి నానా రకాల ప్రయాసలు ఒకదాని వెంట ఒకటిగా వరుసబెట్టి చుట్టుముడు తుంటాయి. అనుకున్న సమయం రానేవచ్చింది. సహ వ్యోమగాములతో కలిసి నౌకా ప్రవేశం చేసినప్పుడు శిరి భావ సంచలనం కనీసం మరొకరి ఊహకైనా అందదు. నౌకలో వ్యక్తి తీరుతెన్నుల పరంగా ప్రయోగ నిర్వహణే ఈమె అసలు పని. నింగిలో భారరహిత స్థితి, అది కలిగించిన ప్రభావం అసాధారణం. తిరుగు ప్రయాణంలో వాహనం రెక్కల రీతి ఎక్కడి కక్కడే మారుతూ వచ్చింది. చక్రాలు విచ్చుకోవడం, షటిల్‌ ‌మాదిరిగా రన్‌వేపై దిగడం! ఏళ్ల తరబడి కొనసాగిన కృషి కొన్ని నిమిషాలకు పరిమితమైన యాత్రతో దిగ్విజయంగా ముగిసింది. నభోవీధి పర్యాటకంలో నిస్సందేహంగా ఇది వినూత్న అధ్యాయం. విహాయ సయానం చరిత్రాత్మక సందర్భం. ఇందులో మహిళల ప్రాతినిధ్యం ఇంకెంతో ఆసక్తి దాయక సమాచారం. ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ కాదు – ఐదు దశాబ్దాల కాలంలో తారాపథ విహారం సాగించిన అతివలు ఎంత మంది? ఈ ప్రశ్నకు సమాధానం 65కు పైమాటే. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా. వ్యోమగాముల్లో తరుణుల సంఖ్య స్వల్పం. అందులో అనల్పపాత్ర నిర్వర్తించడమే శిరీష ప్రత్యేకత.

తిరుగులేని శక్తియుక్తులు

పరిశోధనలన్ని ఎలాగూ విస్తరిస్తున్నాయి. వీటి ఆధారంగా స్త్రీల ప్రాధాన్యం పెంచాలన్నది నాసా ఆలోచన. ఆచరణలో భాగంగానే విలక్షణమైన స్పేస్‌సూట్ల నిర్మాణపక్రియ కొనసాగుతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సైతం స్త్రీ వ్యోమగాముల ప్రాధాన్య పెంపుదలను లక్ష్యిస్తోంది. ఇటువంటి తరుణంలో నారీనాదం మారుమ్రోగక తప్పదు. యువభారత యుగోదయంలో నవభారత మహోదయాన్ని మనమంతా నిండు మనసుతో ఆశించవచ్చు. శిరీష కంఠంలో చైతన్యరాగం, ఆమె గమనంలో విద్యుత్‌వేగం. ఆమె జీవితలక్ష్యం చుక్కలదోవలో వికాస విహారం. అది నేరవేరిన మహత్తర సమయంలో ఆ తెలుగు పడతికి, తెలుగుతేజాన్ని భువనానికి చేర్చిన ఆ విక్రమానికి ప్రతిఒక్కరూ జేజేలు పలకాల్సిందే! ఆశలు ఎందరిలోనో ఉంటాయి వాటికి రూపమివ్వడం, జయకేతనం ఎగురవేయడం కొందరివల్లనే సాధ్యపడతాయి. ఆ బహుకొద్ది మందిలోనూ ముందు నిలిచి వెలుగు కిరణాలు విస్తరింప జేసినందుకే ‘శిరిషా! శెభాష్‌!’ అం‌టోంది అఖిలప్రజ. ఎక్కడ ఉన్నా – భారతీయతా నీదే ఘనత. తెలుగుదనమా సదా నీదే భవిత.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE