రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు అంటుంది కమ్యూనిస్టు పార్టీ. అక్టోబర్ 1, 1949న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావం గురించి మావో జెడాంగ్ ప్రకటించిన చరిత్రాత్మక స్థలం నుంచే ప్రస్తుత అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల కార్యక్రమాన్ని జూలై 1, 2021న ప్రారంభించారు. అందుకే ఈ మహాకుడ్యం వెనుక సాగుతున్న అణచివేత, నిరంకుశత్వం గురించి కొంచెమైనా చర్చించుకోవాలి. కొందరు బౌద్ధులు ఉన్న లద్దాఖ్‌లో దలైలామా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటే నిరసన ప్రకటించిన చైనాలో అసలేం జరుగుతోందో తెలుసుకునే హక్కు మిగిలిన దేశాలకీ ఉంటుంది. ప్రజాస్వామ్యం కోసం 1989లో గళమెత్తిన విద్యార్థులను అణచివేసిన స్థలం, ఇవాళ జిన్‌పింగ్ ప్రపంచం మా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పిన స్థలం కూడా తియనాన్మెన్ కూడలే. మార్క్సిస్టు పాలనలో అడుగు ‘వెనకకు’ అంటే చైనా చెప్పక చెప్పింది. ఆ అడుగు కింద వేలాది మంది ఆర్తనాదాలు ఉంటాయి. అణచివేసిన గొంతుకలు ఉంటాయి. చిందిన నెత్తురు ఉంటుంది. అందుకే చైనా కమ్యూనిస్టు పార్టీ నూరేళ్ల సందర్భం అంటే ఎన్ని లక్షల మంది ఉసురు పోయిందో స్వేచ్ఛా ప్రపంచం గుర్తు చేసుకోవడమే. జైలు గోడల వెనుక వినిపించే ఇంకొన్ని లక్షల నిస్సహాయ రాజకీయ ఖైదీల నిట్టూర్పులు ప్రజాస్వామికవాదులు వినే ప్రయత్నం చేయడమే. కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి అక్కడ పడిన ‘మహా ముందడుగు’ (గ్రేట్ లీప్ ఫార్వార్డ్) కింద చితికిపోయిన గ్రామీణుల, రైతుల ప్రాణాలెన్నో! ‘సాంస్కృతిక విప్లవం’ బలి తీసుకున్న మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఎందరో! ఎన్ని గ్రంథాలు దగ్ధమయ్యాయో! ఎన్ని కళాఖండాలు ఛిద్రమైనాయో! ముందుకు పడిన రెండు అడుగులలో ఏముంది? దాదాపు ముప్పయ్ దేశాలతో వైరం. చిన్నాచితకా దేశాల మీద జులుం. ఆ దేశం వైఖరిలో మార్పేమీ లేదని అధ్యక్షుడు సుదీర్ఘంగా ఇచ్చిన ఉపన్యాసమే చెప్పేసింది. చైనా వైపు చూసిన వాళ్ల తలలు మహా కుడ్యానికి తగిలి తుత్తునియలైపోతాయట. ఎంత సంస్కారం! ఎంత మృదువైన వ్యక్తీకరణ! సోవియెట్ రష్యా నాడు వాస్తవాలను దాచి చైనాను మోసగించింది. ఇప్పుడు చైనా వాస్తవాలను దాస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్క్సిస్టు పార్టీలను భ్రమలలో బతికిస్తున్నది. అలాంటి భ్రమలలో మనదేశ మార్క్సిస్టులు కూడా ఉన్నారు. ప్రపంచ చరిత్రకారులు బయటపెట్టిన కొన్ని వాస్తవాలను పాఠకుల ముందుకు తీసుకురావడం ఈ భ్రమలు, వాస్తవాల నేపథ్యంలోనే.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) శత వసంత ఉత్సవాలు జూలై 1న బీజింగ్‌లో అట్టహాసంగా ప్రారంభమయినాయి. కమ్యూనిస్టు పార్టీ ఉన్నత లక్ష్యాలనూ, చైనాను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి జిన్‌పింగ్ ప్రభుత్వం చేస్తున్న కృషినీ ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రచార యంత్రాంగం గట్టి ఏర్పాట్లే చేసింది.
ఆధిపత్య ధోరణే విధానం
ఈ సందర్భమని కాదు, పాశ్చాత్య దేశాల కంటే భిన్నమైన సిద్ధాంతం, పాలనా వ్యవస్థ కలిగిన చైనా తన ఆధిపత్యాన్ని, ప్రత్యేకతను చాటుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. 1971లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లభించిన నాటి నుంచి తన ప్రాబల్యాన్నీ, పరపతినీ పెంచుకునేందుకు తహతహలాడిపోతూనే ఉంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల్లో కూడా ప్రభావాన్ని పెంచుకుని, తన ప్రయోజనాలూ, విలువలకూ తగినట్లు మలచాలనుకుంది.
క్వింగ్ వంశం అంతమయ్యేవరకు 275 ఏళ్ల పాటు చైనాలో రాచరిక పాలనే సాగింది. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా చైనాను ప్రపంచానికి కేంద్ర బిందువును చేయాలన్న ఉద్దేశం నాటి పాలకులలోను ఉంది. అందుకనే చైనాకు ‘ఝోంగో’, అంటే ‘మధ్య సామ్రాజ్యం’ విధానం అమలు చేశారు. 1911 నాటి తిరుగుబాటుతో క్వింగ్ పాలన అంతమయిన తరువాత ప్రజానాయకులు ‘చైనా జాతి పునరుజ్జీవనం’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. రష్యా బొల్షివిక్ విప్లవం, మార్క్సిజం, లెనినిజం, ప్రపంచ విప్లవ నినాదాలతో ప్రభావితమైన చైనా మేధావులు జూలై 1,1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. వ్యవస్థాపక నేతలు చెన్ దుక్సియు, లీ డేజావో నాయకత్వంలో పెరిగి, పటిష్టవంతమైన చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయవాద కొమిటాంగ్‌లను 1949లో తైవాన్‌కు తరిమికొట్టింది. దానితో చైనా పూర్తిగా పీపుల్స్ రిపబ్లిక్‌గా మారింది.
ప్రస్తుత వ్యవస్థ ప్రకారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడే ప్రధాన కార్యదర్శి (ప్రజా బాధ్యతలు), కేంద్ర మిలటరీ చైర్మన్ (వీ), దేశ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాడు. అతనే దేశ ప్రధాన నాయకుడు. కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోనే దేశ కార్యకలాపాలు సాగుతాయి.
అయితే ఏక పార్టీ పాలన, ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోవడం వంటి ఆరోపణల నుంచి తప్పించుకోవ డానికి చైనా తమది కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని బహుళ పార్టీ వ్యవస్థ అనీ, అన్నీ పార్టీల సమన్వయం, సహకారంతో సాగే పాలన అనీ బుకాయిస్తూ ఉంటుంది. చైనా కొమిటాంగ్ విప్లవ కమిటీ; చైనా ప్రజాస్వామ్య లీగ్; చైనా జాతీయ ప్రజాస్వామ్య నిర్మాణ సంస్థ; ప్రజాస్వామ్య ప్రోత్సాహక సంస్థ; చైనా కర్షకులు, కార్మికుల ప్రజాస్వామ్య పార్టీ; చైనా జి గొంగ్ పార్టీ; జిశాన్ సొసైటీ; తైవాన్ ప్రజాస్వామ్య స్వయంపాలిత లీగ్ వంటి ఎనిమిది పార్టీలు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పనిచేస్తాయని, కమ్యూనిస్ట్ పార్టీ దేశ పరిపాలనా అధికారాలను కలిగి ఉంటే, ఇతర పార్టీలు ఆ పరిపాలనలో పాలుపంచు కుంటాయని నమ్మించేందుకు చూస్తుంటుంది. ఏ పార్టీతో సంబంధం లేని ప్రముఖ వ్యక్తులను కూడా ఒక పార్టీగా పరిగణిస్తారు ఈ వ్యవస్థలో.
ఈ సమూహాన్ని ఒక రాజకీయ పార్టీగా పరిగణించడం పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ వేరువేరు పార్టీలు కావని, వివిధ పాలనా అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చే చైనా కమ్యూనిస్ట్ పార్టీ విభాగాలేనని తెలుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే అట్టహాసమంతా ప్రచారమే. పార్టీలుకాని ఈ సంస్థల చరిత్ర చూస్తే అవన్నీ ఒకప్పుడు విప్లవంలో ప్రధాన పాత్ర పోషించిన సమూహాలేనని తెలుస్తుంది. అవే ఆ తరువాత పార్టీల అవతారం ఎత్తాయి.
సంస్థలు ఉన్నా, అవి డ్రాగన్ తోకలే
చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ సంఖ్య 91.9 మిలియన్ లు అయితే, ఈ ఇతర పార్టీలన్నింటి సభ్యుల సంఖ్య కొన్ని లక్షలకు మించదనే సంగతి అసలు విషయాన్ని బయటపెడుతోంది. వ్యాపార, పారిశ్రామిక, వైద్య, విదేశీవ్యవహారాల, వ్యవసాయ, కార్మిక, విద్య, శాస్త్ర రంగాలకు చెందిన నిపుణులే ఈ సంస్థల్లో సభ్యులు. తమది ప్రజాస్వామిక వ్యవస్థ అని ప్రకటించుకున్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ఏప్రిల్ 30, 1948న వివిధ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించాయని తరచూ ప్రచారం చేస్తుంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు వీలుగా వివిధ పార్టీల సహాయ సహకారాలు, సమన్వయానికి రాజ్యాంగం ఆమోద ముద్ర వేసినట్లుగా 1993లో ప్రకటించారు.
పరస్పర విరుద్ధమైన, గందరగోళ అంశాలతో కూడిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార పత్రం (మాన్యువల్) ఇలా పేర్కొంటుంది – ‘తమ అభిప్రాయాలూ, విమర్శలు, సలహాలను తెలిజేయడం ఇతర పార్టీలకు ఉన్న అధికారం. ఇది పూర్తిగా సహకారం, సలహాల స్థాయిలోనే ఉంటుంది. పాలనా పార్టీగా వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది. ఆ నిర్ణయాలను అన్నీ పార్టీలు స్వచ్ఛందంగా అంగీకరిస్తాయి’.
ఇలా సలహాలు, సంప్రదింపులు, సహకారం, సమన్వయం అంటూ అనేక భారీ పదాలు తరుచుగా వినిపించినా నిజానికి ఆ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న విమర్శ చేయడానికి కూడా వీలులేదు. ప్రభుత్వాన్ని విమర్శించేవారు, నిరసన వాదులు హఠాత్తుగా మాయమైపోవడం చైనాలో సర్వసాధారణం. దేశంలో మరింత ప్రజాస్వామిక విలువలు పాటించాలని ప్రకటించినందుకు నోబెల్ శాంతి బహుమతి అందుకోవలసిన లియు జియోబో జైలు పాలయ్యాడు. కేన్సర్‌తో బాధపడుతున్న జియోబోను కనికరం లేకుండా జైల్లో కుక్కిన చైనాలో ప్రజాస్వామ్య పాలనకు అవకాశం ఉందనుకోవడం వట్టి భ్రమ. అబద్ధాలు, మోసపూరితమైన నినాదాలతో కూడిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార హోరులో ప్రజాస్వామ్య పద్ధతులు, విలువలకు తావులేదు. అంతేకాదు పర్యవేక్షణ, పరిశీలన పేరుతో వ్యక్తుల కదలికలను నిరంతరం గమనించే వ్యవస్థ చైనాలోనే కనిపిస్తుంది. నిరంతరం కెమెరాల నిఘాలో గడిపే చైనా పౌరులకు కనీస, ప్రాధమిక వ్యక్తిగత గోప్యత కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
హక్కులు లేని ప్రపంచమే లక్ష్యం
ప్రపంచ ఆధిపత్యాన్ని తిరిగి సాధించడం, ప్రత్యా మ్నాయ ప్రపంచ పాలన విధానాన్ని స్థాపించడం అనేవే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన లక్ష్యాలు. అందుకనే చుట్టుపక్కల ఉన్న స్వతంత్ర దేశాలను కబళించే పని చైనా వేగంగా సాగిస్తోంది. ఆ స్వతంత్ర భూభాగాల్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మత స్వేచ్ఛలను పూర్తిగా హరిస్తుంది. ఉయిఘర్ ముస్లింలు ఎక్కువగా ఉండే జింజియాంగ్ ప్రాంతంలోని ఒక మిలియన్ ప్రజానీకానికి నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం, మసీదుల కూల్చివేత వంటి చైనా ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది.
స్వయం ప్రతిపత్తిని కోరుతూ వేలాదిమంది టిబెట్ వాసులు 2008 ఒలింపిక్స్ సందర్భంగా ఆత్మాహుతికి పాల్పడ్డ విషయాన్ని చైనా ప్రభుత్వం దాచిపెట్టడంలో విజయవంతమైనా జింజియాంగ్ ఉదంతాలు మాత్రం బయట ప్రపంచానికి తెలిసిపోయాయి. దీనితో 2022లో చైనాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్ పోటీలను బహిష్కరించాలని అనేకమంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు పిలుపునిచ్చారు.
ప్రపంచంలో తాము కోల్పోయిన స్థానాన్ని తిరిగి సాధించడం కోసం ప్రయత్నిస్తున్న చైనా ‘ఆసియాలో ఏకైక శక్తి, ప్రపంచంలో రెండవ ఆధిపత్య శక్తిగా’ ఎదగాలన్నదే లక్ష్యమని చెప్పక చెపుతోంది. ‘చైనా లక్షణాలతో కూడిన నూతన సోషలిజం’ అనే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన చైనా ఉత్పత్తి రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే ఆర్ధిక సూపర్ పవర్‌గా నిలిచింది. అయితే ఈ అభివృద్ధి అంత సులభంగా జరగలేదు. తీవ్రమైన అణచివేత, మారణకాండ, బానిసత్వం, ప్రాధమిక స్వేచ్ఛను హరించడం, హింస, మతపరమైన అణచివేత మొదలైన అవలక్షణాల ఫలితమది.
1978 ఆర్ధిక సంస్కరణల తరువాత నిమ్న ఆదాయ వర్గానికి చెందిన దేశం ఒక్కసారిగా ఉన్నత, మధ్య ఆదాయ దేశంగా మారింది. ఉత్పాదక రంగంలో ప్రపంచ కేంద్ర స్థానాన్ని ఆక్రమించిన చైనా ప్రపంచ ఆర్ధికశక్తిగా మారింది. వనరులను విపరీతంగా వాడటం, ఎగుమతులు, కార్మికులకు తక్కువ జీతాలు వంటి చైనా విధానాన్ని ఇప్పుడు పలు ఆగ్నేయాసియా దేశాలు అనుసరిస్తున్నాయి.
మహాకుడ్యం వెనుక ఆకలి చావులు
సీసీపీ నూరేళ్ల వేడుకల సందర్భంగా ఆ దేశ ప్రస్థానంలోని ఎత్తుపల్లాలు పరిశీలించాలి. ఆ దేశం ప్రపంచశక్తిగా అవతరించడం కమ్యూనిస్ట్ పార్టీ ఘనత అయితే 1958 నుండి 62 వరకు 55 మిలియన్ ప్రజల ఆకలి చావులకు కారణమైన ‘పెద్ద ముందడుగు’ విధానం కూడా ఆ పార్టీ పుణ్యమేనన్న సంగతి మరచిపోకూడదు. ఇక 1966-67 సాంస్కృతిక విప్లవం 20 మిలియన్‌ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇక ప్రజాస్వామ్య ప్రదర్శనకారులపై తీయనాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన దారుణ మారణ కాండను ప్రపంచం ఇంకా మరచిపోలేదు.
సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడటం వల్ల కలిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న చైనా తమ దేశంలో పార్టీకి అలాంటి గతి పట్టకుండా చూసుకునేందుకు గతంలో పార్టీ నాయకులు పాల్పడిన అకృత్యాలు, ఘోరాలను దాచిపెట్టి వారికి తిరుగులేని అధికారాలు కట్టబెట్టాలని నూరేళ్ల వేడుకల సందర్భంగా నిర్ణయించుకుంది. ఇది అక్కడ కొత్తేమీ కాదు. అందుకు తగినట్లుగానే ఉన్నతాధికారి (అధ్యక్షుడు) ఆదేశాలను ఉల్లంఘిం చడం పార్టీ పట్ల అవిధేయత చూపడంగా పరిగణి స్తారు. పార్టీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా తన ప్రధాన ప్రత్యర్ధి బో జీలై సహా పది లక్షల మంది పార్టీ కార్యవర్గ సభ్యులపై జిన్‌పింగ్ క్రమశిక్షణ, అవినీతి నిరోధక చర్యలు చేపట్టారు.
విద్యావేత్తలకు పాఠాలు
చైనా చరిత్రను తిరగరాసే బృహత్ ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టారు. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించేవారికి తగిన గుణపాఠం నేర్పుతారు. చరిత్రలో వివాదాస్పద, సందేహాస్పద అంశాలను అన్నింటిని తొలగిస్తారు.
పార్టీ నూరేళ్ల వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన విద్యావేత్తలు, రచయితల సమావేశంలో చైనా చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర గురించి తమ రచనల్లో ఎలాంటి విమర్శనాత్మక, వ్యతిరేక వ్యాఖ్యలు లేకుండా చూసుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. 1950 దశకంలో అమలైన హింసాత్మక భూ పునర్ పంపిణీ ఉద్యమంలో 20 లక్షలమంది చనిపోవడం, చైనా సర్వోన్నత నేత మావో జెడాంగ్ అనుసరించిన విధానాల గురించి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వారి రచనల్లో కనిపించరాదని పార్టీ వారికి తెలియజేసింది.
జిన్‌పింగ్‌కు ఇప్పుడు పార్టీలో ఎలాంటి అవరోధాలు లేవు. దేశాధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఎలాంటి కాలపరిమితులు లేవు. దీనితో 68 ఏళ్ల జిన్‌పింగ్ 2028 వరకు లేదా ఆ తరువాత కూడా పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఆర్ధిక, దౌత్యరంగాల్లో జిన్‌పింగ్ సాధించిన విజయాలు చైనా చరిత్రలో నిలిచిపోతాయంటూ, ‘పరివర్తన తెచ్చిన నాయకుడు’గా అనేకమంది ప్రశంసలు అందుకుంటున్న ఆయన పార్టీని మరింత వ్యవస్థీకృతం చేశారు.
నియంతృత్వమే వాస్తవం
జిన్‌పింగ్ కార్యశైలి మాత్రం సామూహిక నాయ కత్వం, అధికార బదలాయింపు వంటి విధానాలకు పూర్తి భిన్నం. పైనుంచి వచ్చిన ఆదేశాలను కింది వారు పాటించాలి. ప్రతి ఒక్కరిపై నిబంధనలు, ఆంక్షలు ఉంటాయి. స్థానిక అధికారులకు ఎలాంటి అధికారాలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించే వ్యవస్థ లేదు. ఎందుకంటే చర్చకు తావిస్తే రాజకీయ ఇబ్బందులు, అనిశ్చితికి దారితీయవచ్చన్నది భయం.
కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి అడ్డంకిగా మారే ఏ చిన్న విషయాన్నీ సహించదు. పారిశ్రామిక రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రైవేటు సంస్థలు ఇప్పుడు ఈ నిరంకుశ ధోరణి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రముఖులు హఠాత్తుగా మాయమవడం, ఆ సంస్థల్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను నియమించడం, చిన్న తప్పిదానికి కూడా ఈ సంస్థలపై భారీ జరిమానా విధించడం వంటి ప్రభుత్వ చర్యలు ప్రైవేటు రంగ ప్రభావాన్ని బాగా తగ్గించడానికేనని అంటున్నారు.
‘చరిత్రాత్మక సంశయవాదం’ (ఱ•శీతీఱమీ•శ్రీ అఱష్ట్రఱశ్రీఱఎ)(చరిత్ర గురించి కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యానం పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను సూచించే పదం) దూరం చేయడానికి చైనా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతోంది. కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న దాదాపు 20లక్షల పోస్ట్‌లను వివిధ వెబ్ సైట్‌ల నుంచి తొలగించారు. ఇప్పటి వరకు చైనా ప్రజలను మాత్రమే ఇబ్బంది పెడుతున్న జిన్‌పింగ్ నిరంకుశత్వం ఇప్పుడు ప్రపంచానికి కూడా సమస్యగా మారుతోంది. ఆయనకున్న అంతులేని అధికారం ప్రపంచంపై ప్రభావం చూపుతోంది.
ఇంట్లో గబ్బిలాల కంపు
చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఉత్సవాలకు ముందు కెనడాతోపాటు మరో 40 దేశాలు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమితిలో చైనాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాయి. హాంకాంగ్, టిబెట్‌లలో చైనా చర్యలను ఆ తీర్మానంలో ప్రశ్నించాయి. అలాగే జింజియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపించాలని కూడా కోరాయి. ఈ తీర్మానాన్ని పూర్తిగా తిరస్కరించిన చైనా ఎలాంటి దర్యాప్తుకు అనుమతినిచ్చేదిలేదని తేల్చిచెప్పింది. కానీ చైనాలో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించి అనేక ఉదంతాలు, వాటి వివరాలు ఇప్పటికే ప్రపంచానికి తెలిశాయి. చైనా సాగిస్తున్న దుండగీడు దౌత్య విధానం ఎలాంటిదంటే ఈ తీర్మానంపై మొదట సంతకం చేసిన ఉక్రెయిన్ దేశం చైనా బెదిరింపులకు భయపడి చివరికి తీర్మానానికి తన మద్దతు ఉపసంహరించు కుంది. అలా చేయకపోతే వ్యాక్సిన్ పంపేది లేదని చైనా బెదిరించింది.
హాంకాంగ్‌లో మిగిలిన ఏకైక ప్రజాస్వామ్య అనుకూల పత్రిక ‘ఆపిల్ డైలీ’ని కూడా చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇటీవల బలవంతంగా మూయించింది. దినపత్రిక యజమాని జిమ్మీ లై ఆస్తులను, బ్యాంక్ అకౌంట్‌లను స్తంభింపచేయడానికి ఇటీవల అమలు చేసిన జాతీయ భద్రత చట్టాన్ని ప్రయోగించింది.
2010లో జపాన్‌ను దాటి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపొందిన చైనా అప్పటివరకు అనుస రించిన స్తబ్ద దౌత్య విధానానికి స్వస్తి పలికి తన అసలు రంగును బయటపెట్టడం మొదలు పెట్టింది. 2013లో అధికారం చేపట్టిన జిన్‌పింగ్ ‘చైనా పునరుజ్జీవనం’ సాధనే తమ లక్ష్యమని ప్రకటించారు. జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చి, విదేశీ దండయాత్ర లను, వందేళ్ల బానిసత్యాన్ని (1849-1949) గుర్తుచేసిన జిన్‌పింగ్ ప్రపంచాన్ని మారుస్తానని ప్రకటించారు. ‘చైనా ముద్ర కలిగిన సోషలిజాన్ని అనుసరించి, మన వ్యవస్థ ప్రత్యేకతను, గొప్పదనాన్ని చాటిచెప్పి గొప్ప భవిష్యత్తును నిర్మించడమే మన లక్ష్యం’ అంటూ జిన్‌పింగ్ ప్రకటించారు. బలమైన కమ్యూనిస్ట్ పార్టీ అవసరాన్ని, ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
జిన్‌పింగ్ నిరంకుశ విధానాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మరింత బలాన్ని పెంచాయి. దక్షిణ చైనా సముద్రంలో 90శాతం తమదేనంటూ చైనా ఇటీవల వాదించడానికి కారణం ఈ పరిణామాలే. అలాగే ఇప్పటివరకు హాంకాంగ్‌లో అనుసరిస్తున్న ‘ఒకే దేశం రెండు వ్యవస్థలు’ అనే విధానాన్ని అతిక్రమించి అక్కడ కూడా తమ రాజ్యాంగాన్నే అమలు చేయాలని చూస్తోంది. కానీ తైవాన్ విషయంలో మాత్రం ‘ఒకే చైనా విధానం’ అందరూ అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. అనేక చిన్న దేశాలను ఆర్ధిక సహాయం పేరిట అప్పుల ఊబిలోకి దింపుతోంది. ‘ఇరుపక్షాలకు ప్రయోజనం’ కలిగించేవంటూ వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్న చైనా వాటిపై చివరికి ఒత్తిడి తెచ్చి తన దారికి తెచ్చుకుంటోంది.
కొవిడ్ మహమ్మారికి కారణమంటూ ప్రపంచం దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకున్న చైనా తన రాయబారుల ద్వారా, రహస్య దౌత్య ఒత్తిడి విధానం ద్వారా, కొవిడ్ మందుల సరఫరాల ద్వారా ఆ మచ్చను తుడిచేసుకునే ప్రయత్నం చేస్తోంది.
తన వ్యాక్సిన్‌లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిని సాధించిన చైనా వాటిని 60 దేశాలకు పంపిణీ చేసింది. కానీ చైనా వ్యాక్సిన్‌లు ప్రమాదకర మైనవని అనేక సందర్భాల్లో తేలుతోంది. ఇండో నేషియాలో చైనా వ్యాక్సిన్‌లు తీసుకున్న 26 మంది వైద్యుల్లో 10 మంది కొవిడ్ వల్ల మరణించడం వీటి నాణ్యతలేమిని రుజువు చేస్తోంది. ఇక చైనా వ్యాక్సిన్‌లను నమ్ముకున్న చిలీ, మంగోలియా, బెహరైన్, అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది.
కొవిడ్ కల్లోలాన్ని ఆసరాగా చేసుకుని చైనా వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లకు కూడా ప్రయత్నించింది. దీనితో 1967 తరువాత మళ్లీ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ద్వైపాక్షిక ఒప్పందాలను తుంగలోతొక్కి సరిహద్దు వెంబడి సైనిక బలగాలను మోహరించిన చైనా భూభాగాల ఆక్రమణకు కూడా తెగబడింది. తాజా సమాచారం ప్రకారం భూటాన్‌లో 5శాతం భూభాగాన్ని ఆక్రమించింది కూడా. ఆవిధంగా భారత్ ను బెదిరించి తన దారికి తెచ్చుకోవాలన్నది ఆ కమ్యూనిస్ట్ దేశపు వ్యూహం.
చైనా దురాక్రమణ, సామ్రాజ్య విస్తరణ చర్యలు, తమది ‘శాంతియుతమైన అభివృద్ధి’ అనే ఆ దేశపు ప్రచారానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకనే ఇటీవలి కాలంలో ప్రపంచంలో చైనా పరపతి విపరీతంగా తగ్గింది.
– డా. రామహరిత
– అను : కేశవనాథ్