(1971 ఫిబ్రవరిలో కలకత్తాలో పత్రికా రచయిత, ప్రముఖ అరబ్బీ పండితుడు డాక్టర్ సైఫుద్దీన్ జిలానీతో ఆర్‌ఎస్‌ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ జరిపిన సంభాషణలోని కొన్ని అంశాలు. ‘పాంచజన్యం’ నుంచి)
అన్నివైపుల నుంచీ దేశం ప్రమాదాల నెదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో హిందూ- ముస్లిం సమస్యకు పరిష్కారాన్ని కనుగొనటం అత్యవసరమని మీరు భావించటం లేదా?
దేశసేవలో హిందువులకూ, ముస్లింలకూ మధ్య తేడా ఉందని నేననుకోను. కానీ ఈ సమస్యల పట్ల ప్రజల దృష్టి ఏమిటి? ఈ రోజుల్లో బహుశః ప్రతివాడూ ఒక రాజకీయజీవైపోయాడు. రాజకీయ పరిస్థితులను తమ స్వార్థానికి వినియోగించుకోవడం ద్వారా తన తెగ కోసం కొన్ని కోర్కెలనో, లేక ప్రత్యేక సదుపాయాలనో ముందుకు నెట్టగలుగుతానని ప్రతివాడూ భావిస్తున్నాడు. ఈ స్థితి చక్కబడి, ప్రజలు దేశభక్తి దృష్ట్యానే కేవలం దేశభక్తితో మాత్రమే రాజకీయాలను పరిశీలించినప్పుడు క్షణంలో సమస్యలన్నీ తీరిపోతాయి.
దేశ వ్యవహారాల్లో, తమ వాటా తమకు రావటం లేదనే ముస్లింల నిష్టురోక్తికీ, ఈ సమస్యకూ ఏమైనా సంబంధం ఉందా?
అందిరికివలెనే ముస్లింలకు కూడా వారికి చెందాల్సినదాన్ని వారికివ్వవలసిందే. కానీ ఆ మాటకర్ధం అదనపు హక్కులూ, సదుపాయాలూ వారు కోరుకోవచ్చని కాదు. ప్రతి ప్రాంతంలోనూ ఒక పాకిస్తాన్ కావాలనే కోర్కెను గురించి నేను విన్నాను. ఒక ముస్లిం సంస్థ అధ్యక్షుడు ఎర్రకోటమీద తన జెండా ఎగురుతుంటే చూచేందుకు పధకం వేశానని చెప్పినట్లుగా పత్రికల్లో వచ్చింది. ఈ ప్రకటన అసత్యమని అతడు ఎన్నడూ ఖండించలేదు. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆలోచించేవారికి ఇలాంటి విషయాలే బాధాకరంగా ఉంటాయి.
ఉర్దూ విషయంలో వాళ్ల దృష్టి చూడండి. ఏభై ఏళ్ల క్రితం వివిధ ప్రాంతాల్లో, ముస్లింలు స్థానిక భాషలనే మాట్లాడారు. చదివారు కూడా. ఉర్దూ అనేది మొగలుల పరిపాలనా కాలంలో రూపొందిన సంకర భాష. దానికీ ఇస్లాంకీ ఎట్టి సంబంధం లేదు. ఇస్లాం అరేబియా దేశంలో పుట్టింది. పవిత్రమైన ఖురాను అరబ్బీభాషలో ఉంది. ముస్లింలకు మతభాషనేదే ఉంటే, అది అరబ్బీ అవుతుంది. అటువంటప్పుడు ఉర్దూ మీద ఎందుకింత పట్టుదల? ఎందుకంటే- ఒకే భాషనాధారం చేసుకొని ముస్లింలనందరిని రాజకీయశక్తిగా సంఘటితం చేసుకునేటందుకే. అట్టి రాజకీయశక్తి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండి తీరుతుంది. రుస్తుంను తమ జాతీయవీరునిగా కొందరు ముస్లింలు చెబుతుంటారు. ‘రుస్తుం’ పారశీక దేశవీరుడు. అతనికీ, ముస్లింలకూ సంబంధం లేదు. అతణ్ణే ముస్లింలు తమ వీరునిగా భావించగలిగితే, శ్రీరాముని ఎందుకు భావించలేరు? ఈ దేశ చరిత్రను ముస్లింలు తమదని ఎందుకొప్పుకోరని నేనడుగు తున్నాను.
ఈనాడు పాకిస్తాన్ అని పిలిచే భారత భూభాగంలో ‘పాణిని’ పుట్టారు. ఆయన ద్విసహస్ర జయంత్యుత్సవాన్ని పాకిస్తాన్ జరిపింది. పాకిస్తాన్ పాణినిని తమ పూర్వజులైన మహాపురుషులలో ఒకనిగా చెప్పుకొనగలిగినప్పుడు, స్థానికులైన వారిని హిందూ ముస్లింలనే నేను అంటాను. వారు పాణిని, వాల్మీకి, వ్యాసుడు, రాముడు, కృష్ణుడు వంటి వారందరూ కూడా తమ శ్రేష్ఠులైన పితరులుగా ఎందుకు చెప్పుకోరు?
ఈ సందర్భంలో శృంగేరి మఠ పూర్వపు శంకరా చార్యులు, పూజ్యశ్రీ చంద్రశేఖర భారతీస్వామివారికి సంబంధించిన ఒక ఉదంతం చెబుతాను. ఒక అమెరికా దేశస్థుడు తనను హిందుత్వంలోకి మార్చమంటూ ఆయన దగ్గరకు వెళ్లాడు. ఎందుకు మారదల్చుకున్నావని స్వామీజీ ప్రశ్నించారు. క్రైస్తవమతం తన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చలేక పోయిందని అతడు బదులు పలికాడు. అప్పుడు ఆచార్యులవారు ‘నీవు నిజాయితీతో క్రైస్తవాన్ననుస రించావా? ముందుగా అట్టి ప్రయత్నం చేయి. అదికూడా నీకు సంతృప్తినివ్వకపోతే అప్పుడు నా దగ్గరకు రా’ అన్నారు. ఇదీ మన ఆలోచనా పద్ధతి. మతమార్పిడులను ప్రచారం చేయని ధర్మం మనది. దాదాపు అన్ని సందర్భాల్లో కూడా మతాంతరీకరణ మనేది, రాజకీయమో, అటువంటి మరే ఇతర ప్రయోజనమో కారణంగా జరుగుతూ ఉంటుంది. అట్టిదానిని మనం తిరస్కరిస్తాం.
అల్పసంఖ్యాక వర్గాల సమస్య- అనుకునే ఇది, ముస్లింలకు సంబంధించింది మాత్రమే కాదు. హిందువుల్లో కూడా ఇట్టి సమస్య ఉంది. ఉదాహరణకు మనలో జైనులున్నారు. షెడ్యూల్డు కులాల వారని చెప్పేవారిలో కొందరు డాక్టర్ అంబేడ్కర్ అనుయాయులై బౌద్ధులుగా మారి, తాము ప్రత్యేకవర్గ•మని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మనదేశంలో ‘అల్పసంఖ్యాక వర్గా’నికి కొన్ని రాజకీయ సదుపాయాలు కల్గిస్తున్న కారణం చేత, ప్రతి ఒక్కడూ తాను అల్పసంఖ్యాక వర్గానికి చెందినవాడుగా రుజువు చేసికొని ఆయా సదుపాయాలను తాను పొందే అర్హతను సాధించాలని కోరుకుంటున్నాడు. ఈ పద్ధతి మన వినాశనానికి తోవ దీసేదిగా ఉంది; ఈ పద్ధతి ఈ దేశమంతనూ ముక్కలు చెక్కలు చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఆ దిశగానే పయనిస్తున్నాం.
రాజకీయమైన పేరు ప్రఖ్యాతులను పెంచుకో వాలన్న దృష్టితోనే కొందరు విషయాలనన్నింటినీ చూస్తున్నప్పుడు అనేక క్లిష్ట పరిస్థితులెదురౌతాయి. ఈ పేరు ప్రఖ్యాతుల మీద వ్యామోహాన్ని విడిచిపెడితే మన దేశం సమైక్యమవుతుంది.
హిందువులకూ, మహమ్మదీయులకూ కూడా పరస్పర సుహృద్భావం ఎక్కువగానే ఉందని మనకు తెలుసు. అయినప్పటికి అప్పుడప్పుడు చిన్నా, పెద్దా సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వీనిని తగ్గించటానికి గానీ, లేదా పూర్తిగా నిరోధించ టానికి గానీ ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?
ఇట్టి సంఘర్షణలకు ఒక కారణం గోవు. గోవుని చంపటం తమ హక్కనుకునే భావాన్ని ముస్లింలు ఎందుకు పట్టుక్కూర్చుంటారో నాకు తెలియటం లేదు. నిజం చెప్పాలంటే అది వారి మత నియమం కాదు. పూర్వకాలంలో వారు హిందువులను కించపరచేం దుకు అదొకమార్గం మాత్రమే. అది ఇప్పుడు కూడా అలాగే ఎందుకు కొనసాగాలి?
తోటివారి పండుగల్లో మనం పాలు పంచుకో లేమా? వివిధ స్థాయిలవారిని ఏకం చేసే ఉత్సవం మన హోలి. ఆ పండుగలో, ఒక ముస్లింమీద ఎవరో రంగునీళ్లు చిలకరించారనుకుందాం. అంతమాత్రం చేత ఖురాను ఆదేశాల అతిక్రమణ జరిగిందని మీరు అనుకుంటారా? అది ఒక సాంఘిక వ్యవహారమని ఎందుకు అనుకోకూడదు? అజ్మీర్‌లోని ఉరుసు వంటి అనేక ముస్లిం ఉత్సవాల్లో హిందువులు పాలు పంచుకుంటూనే ఉన్నారు. కానీ సత్యనారాయణ పూజలో పాల్గొనేందుకు రమ్మని ముస్లింలను మనం ఆహ్వానించామని ఊహించండి. అప్పుడేముంది? కాబట్టి ఒకరినొకరు గౌరవించుకునే ధోరణిని మనం అలవరుచుకోవటం అభ్యాసం చేయాలి. మనం కేవలం ఇతరుల విశ్వాసాలను సహించడం మాత్రమే కాదు. వాటిని తప్పక గౌరవించాలి.
మతవర్గాల పట్ల సామరస్య పూర్వకమైన వాతావరణాన్ని నిర్మాణం చేసేందుకు, అధిక సంఖ్యాకవర్గమైన కారణంచేత హిందువులే ప్రత్యేకం, ప్రముఖమూనైన బాధ్యత వహించాలని మీరను కోవటం లేదా?
నిజమే. తప్పనిసరిగా అది నిజమే. కానీ దానిలోని ఇబ్బందులను గుర్తించండి. హిందువుల మీద దోషారోపణ చేయటానికి, ముస్లింలను నిర్దోషులని ప్రకటించటానికీ, మన నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఇది ముస్లింలను తమ మతతత్త్వ దృష్టిలో మరింత రెచ్చిపోయేట్టుగా చేస్తోంది. కాబట్టి ఈ బాధ్యతను పంచుకోవాలని నేనంటాను.
ఇట్టి సామరస్య సాధనలో, రెండు మత వర్గాల వారూ సత్వరమే స్వీకరించదగినదిగా ఏ చర్యను మీరు సూచిస్తారు?
మతాన్ని సరిగా అవగాహన చేసుకునే విద్యా బోధన సామూహికంగా స్వీకరించాలి.ఇస్లాంను కూర్చినటువంటి యధార్థ విజ్ఞానాన్ని ప్రజల కందించండి. అలాగే హిందుత్వాన్ని గురించిన నిజమైన విజ్ఞానాన్ని ప్రజలకందించండి. అన్ని మతాలూ మనిషిని, నిస్వార్ధంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉండమనే బోధిస్తాయి అనే విషయాన్ని వారికి తెలియజేయండి.
ఇక ఉన్నదున్నట్లుగా చరిత్రను బోధించండి. ప్రస్తుతం ఉన్న అవకతవకలను సరిచేయండి. గతంలో ముస్లిం దురాక్రమణదారులు దండెత్తి వచ్చారనే చెప్పండి. అంతేకాదు దురాక్రమణదారులు విదేశీయులనీ, వాళ్లకీ ప్రస్తుతం ఇక్కడున్న ముస్లింకూ ఏ విధమైన సంబంధం, సమానత్వం లేవని కూడా చెప్పండి. తాము ఈ దేశానికి చెందినవారమేననీ, పూర్వకాలపు దురాక్రమణదారులూ, వారి దండయాత్రలూ తమ వారసత్వంలో భాగాలు కావనీ, ఇక్కడుంటున్న ముస్లింలను చెప్పమనండి.
సత్యమైనదాన్ని బోధించటానికి బదులు, ప్రస్తుతం ముస్లింలకు, అవకతవకగా తారుమారైన విషయాలని బోధిస్తున్నాం. సత్యాన్ని ఎంతోకాలం దాచలేం. ఎంత దీర్ఘకాలం దాచివుంచినా చివరకు బయటపడుతుంది. మరిన్ని విషమానుభూతుల్నే కలిగిస్తుంది. అఫ్జల్‌ఖాన్ శివాజీ చేతిలో చనిపోయాడన్న విషయాన్ని, ఒక విదేశీ దురాక్రమణదారుడు ఒక జాతీయవీరుని చేతిలో చచ్చాడని చెప్పండి.
‘భారతీయకరణంపై ఈ మధ్య ఎంతగానో చర్చ సాగుతోంది. ఎంతో గందరగోళం చెలరేగింది. ఈ గందరగోళం తొలగించడమెట్లా?
భారతీయకరణమనేది ‘జనసంఘం’ ఇచ్చిన నినాదం. దాన్ని గురించి అసలు తికమక ఎందు కుండాలి? భారతీయకరణ అంటే అందర్నీ హిందువులుగా మార్చడమని అర్ధం కాదు. మనమంతా ఈ భూమి సంతానమేనని మన జనమంతా ఒకటేనని, శ్రేష్ఠులైన మన పూర్వజు లందరూ ఒకరేననీ, మన ఆకాంక్షలు కూడా ఒక్కటేననీ మనమంతా గ్రహించాలి. విశ్వసించాలి. ‘భారతీయ కరణ’మంటే ఇదేనని నా నమ్మకం.
ఢిల్లీలో పత్రికా సంపాదకులతో…
స్వతంత్రజాతిగా ఇన్ని ఏళ్లు గడిచిన తర్వాత గూడా భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తలు తగ్గలేదు. దీనికి కారణం గురించి, మీ విశ్లేషణ ఏమిటి?
భారతదేశం, దాని ప్రజలూ, దాని సంస్కృతు లతో భారతీయ ముస్లింలు ఇంతవరకూ పూర్తిగా తాదాత్మ్యం చేసుకోకపోవడమే హిందూ ముస్లిం ఉద్రిక్తతకు ముఖ్యకారణం. ఇది తన దేశమనీ, వీరంతా తన ప్రజలనీ భారతీయముస్లిం హృదయపూర్వకంగా చెప్పగలిగితే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఇదంతా అతని మనస్తత్వంలో మార్పుకు సంబంధించిన వ్యవహారం.
అంటే మీరు హిందువుల ఆధిక్యతను కోరుతు న్నట్లే గదా! ఇందుకోసం రాజ్యాంగం సవరించటం అవసరమని మీరు కోరుతున్నారా?
ఒకరి ఆధిక్యమనే ప్రశ్న లేదిక్కడ. మేం కోరేది ఇక్కడ సువ్యవస్థితమైన సమాజం. మన రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల్ని ఇస్తోంది. అట్టి రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం లేదు. హిందువు పుట్టుకతోనే మత విద్వేషరహితుడు. భగవత్సాక్షాత్కానికి విభిన్న మార్గాలున్నాయనే సత్యాన్ని అతడు అంగీకరిస్తాడు.
మీరెప్పుడు హిందువులను గురించే మాట్లాడ తారేమి? భారతీయుల గురించి ఎందుకు మాట్లాడరు? మీ కార్యంలో ముస్లింలను మీరెందుకు చేర్చుకోరు?
మహాత్మాగాంధీ సహా, ఏ ఉత్తముడైన హిందువు కంటే గూడా, అతినికృష్టుడైన ముస్లిమైనప్పటికీ ఉత్తముడే అని మౌలానా మహమ్మదాలీ ప్రకటించి నప్పుడు కూడా, మన నాయకులు ముస్లింలను మంచి చేసుకోవాలనీ, స్వాతంత్య్ర సమర సమయంలో ప్రయత్నించారు. ఆ ప్రయత్న ఫలితంగానే హిందువు ‘హిందుస్తానీ’గా మారాడు. కానైతే ముస్లిం కూడా ఆ విధంగా స్పందించాడా? ముస్లిం కూడా హిందుస్తానీగా మారాడా? లేదు!
దాదాపు రాజకీయపార్టీలన్నీ కేవలం ముస్లింల మూకుమ్మడి ఓట్లను కోరుకుంటున్న కారణం చేతనే, తమ ప్రత్యేక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవలసిందిగా వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్నాయి. ముస్లింల నుండి హిందుస్తానీలను తయారుచేసే మార్గమదా? దాన్నిబట్టి ముస్లింలను సరిదిద్దే ప్రయత్నానికి ముందు, హిందువుల ధోరణిని, మనస్తత్వాన్ని సరిదిద్దటం అవసరమనీ తేలుతోంది. కాబట్టే నేను ముస్లింలను గురించికాక, హిందువులను గురించే పట్టించు కొంటున్నాను.
యధార్థంగా ముస్లింలు, మన జీవనంలో ఒక భాగమయ్యారు కదా:
నేనా విషయం ప్రశ్నించటం లేదు. వారు ఇలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నారనేదే నా ప్రశ్న. వాస్తవానికి ఇస్లాం వ్యాపించిన ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో అయినప్పటికీ, అంతకుపూర్వం నుంచీ ఉన్న, ఆయా దేశాలకు సంబంధించిన వస్త్రధారణ, భాష, జీవన పద్ధతులువంటివి మారలేదు. ఇరాన్‌లోనూ, టర్కీలోనూ ఇలాగే దేశాల్లోనూ వారి సహజ వస్త్ర ధారణ, భాష, జీవనదృష్టి వంటివి. యథాపూర్వంగానే ఉన్నాయి. కానీ మనదేశంలో ప్రతిదీ, చివరకు ఆలోచన కూడా మారిపోయింది. ఈ మార్పే గనుక లేకపోయినట్లయితే ముస్లిం సమస్య అనేదే ఉండేది కాదు. అదే, ముఖ్యమైన జాతీయ జీవన ప్రవాహం నుంచి, వారిని దూరం చేసేసింది.