జూలై 24 గురుపూర్ణిమ

‘చక్రి సర్వోపగతుడు’ అన్నట్లుగాను గురువు అందులోనూ సద్గురువు సర్వ వ్యాపితుడు. జ్ఞానం ప్రచులితమయ్యే ప్రతిచోట గురు దర్శనమవుతుంది. ఇది వ్యాసభగవానుడి మాటగా చెబుతారు. ‘మిమ్ము పదేపదే దర్శించుకునే భాగ్యం లేదా?’ అని వేదనిధి అనే యువకుడు ప్రశ్నించినప్పుడు, ‘నిరంతర జ్ఞానాన్వేషణే నా సమగ్ర స్వరూపం. నన్ను దర్శించాలనే సంకల్పం కలిగినప్పుడు జ్ఞానంకోసం వెదుకు’ అని సూచించారట. అనంతరకాలంలో ఆ జ్ఞానప్రదాతలే గురువులు. రాగద్వేషాలకు అతీతంగా, అసత్యాలాడక, సంయమనంతో వ్యవహరిస్తూ శిష్యుల పట్ల సమాన వాత్సల్యం చూపేవారే  ఉత్తమ గురువులని, పవిత్రాత్మగల గురువులున్న చోట సర్వదేవతలు సంచరిస్తుంటారని శాస్త్ర వాక్యం. చిత్త శాంతి కలిగించేవారు, ప్రేరణాత్మక పలుకులు కలవారు. సందేహాలను సంయమనంతో నివృత్తి చేయగల మహానీయుడే సరైన గురువని, అలాంటి వారికోసం శోధిం చాలని పెద్దలు చెబుతారు. గురువంటే కేవలం తరగతిగదిలో పాఠాలు చెప్పేవారే కాదని, వివిధ రంగాలు, వృత్తులకు సంబంధించిన జ్ఞానప్రదాతలంతా ఆరాధ్య నీయులు గురుతుల్యులు. గురుశిష్యుల ప్రేమ లౌకిక బంధాలకు అతీతమైంది. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు  గురువుకు కొందరి శిష్యుల పట్ల  కాస్తంత  ఎక్కువ మమకారం ఉంటుందనేది పురాణ కాలం నుంచి  కనిపిస్తుంది. దానిని పక్షపాత వైఖరి అనడం కంటే వారి సమర్థత పట్ల విశ్వాసంగా చెబుతారు. గురువు జ్ఞానసాగరం లాంటివారు. ఆ సాగరం నుంచి విజ్జానాన్ని ఒడిసి పట్టడంపైనే శిష్యుని భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది.

గురువులకే గురువైన వ్యాసమహర్షి వేద మయుడైన నారాయణుడని ప్రతీతి. త్రేతాయుగంలో వశిష్ఠుడు ఇక్ష్వాక వంశ కులగురువు కాగా, ద్వాపరంలో కురువంశాంకురాలను సంరక్షించి ‘మహాభారతాన్ని నడిపిన వ్యాసుడు ఆయన మునిమనుమడు. వశిష్ఠుడు ఇనకుల చక్రవర్తి దశరథుడితో పుత్రకామేష్ఠి యాగం చేయించి రఘు వంశాన్ని నిలిపితే ద్వారంలో వ్యాసుడు తమ తపశ్శక్తితో కురు వంశానికి వారసులను ప్రసాదించి ఆ చంద్రవంశానికి దిశానిర్దేశంతో ఆచంద్ర తారార్కం చేశారు. తమ తండ్రి పరాశరుని శాస్త్ర రచనలను సంకలనం చేశారు.

వేదాలను వింగడించిన, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణాలకు ప్రాణం పోసిన మహారుషి. ‘యది హాస్తి తతన్యత్ర యన్నే హాస్తి న తత్క్వ చిత్‌’…‌భారతంలో లేనిది ఈ భూమిపై లేదు. భూమిపై ఉన్నదంతా భారతంలో ఉంది’ అంటూ విఘ్నదేవుడు గంటం పట్టగా దాదాపు లక్షకు పైగా శ్లోకాలను ఆశువుగా చెప్పి పంచమవేదం ‘శ్రీమహా భారతం’ను ఆవిష్కరించారు.వేద విభజన, మహా భారత, ఆధ్యాత్మ రామాయణం రచించి, సకల ధర్మాలను వివరించి, మానవుడు ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? అనే అంశాలను కథలో రూపంలో ఆవిష్కరించిన వ్యాసుడు అప్పటికీ సంతృప్తి చెందలేదు. చిత్తశాంతి లేక వ్యాకులపడుతున్న ఆయనతో ‘శ్రీవిష్ణుకథలు చెప్పకపోవడమే అందుకు కారణం’ అని నారదుడు తెలిపాడట. వెంటనే వ్యాసుడు శ్రీమద్భాగవత రచన చేపట్టి శుకునితో పఠింప చేశారు.

కలియుగంలోనూ వేదవ్యాసుడిని దర్శనం చేసుకున్న పరమపురుషులు ఉన్నారు. వారిలో ప్రథములు జగద్గురు ఆది శంకరులు. వ్యాసభగ వానుడి సూచన ప్రకారం ఆయన బ్రహ్మసూత్రాలకు శంకరులు భాష్యం రాశారని అందుకోసం ఆయన పదహారేళ్ల ఆయుర్దాయాన్ని రెట్టింపు అయ్యేలా వ్యాసుడు వరమిచ్చారని శంకరవిజయం చెబుతోంది. వ్యాసుడు నారాయణావతారం కాగా శంకరభగవత్పాదులు శంకరుడేనని ఆధ్యాత్మిక వాదుల విశ్వాసం. అందుకే..

‘శంకరం శంకరాచార్య గోవిందం బాదరాయణం!

సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః’!!..

ఒకరు సూత్ర నిర్మాణానికి, మరొకరు భాష్య రచనకు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటారని భావిస్తుంటారు.

యయునానదీ ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపా యనుడుగా, వేదాలను విభజించి వేదవ్యాసుడిగా, బదరీవనంలో తపస్సు చేయడం వల్ల బాదరాయుణు డిగా ప్రసిద్ధులయ్యారు.‘అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్‌’అని సర్వుల మన్ననలు అందు కుంటున్న సద్గురు పరంపరకు ప్రతినిధి. ఆయన జన్మతిథి ఆషాఢ పౌర్ణిమ గురువులు పూజలందుకునే శుభవేళ.

వ్యాస విడిది బాసర

కాశీ క్షేత్రాన్ని అపారంగా అభిమానించి ప్రేమించిన వ్యాసుడు తెలుగునాట దాక్షారామ, బాసర క్షేత్రాలను సందర్శించారని పురాణగాథ. బాసర వద్ద తపస్సు సమయంలో నిత్యం గోదావరిలో స్నాన మాచరించిన తరువాత తెచ్చిన పిడికెడు ఇసుకతో సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని రూపొందిచారట. ఆయనకు అమ్మవారు సాక్షాత్కరించారని, ఆయన తపస్సు కారణంగా ఆ ప్రాంతానికి ‘వ్యాసపురి’అని పేరు వచ్చి కాలక్రమంలో వాసరగా, బాసరగా మారిందని, నేటికీ పూజలందుకున్న అమ్మవారి విగ్రహం వ్యాసభగవానుడి సృష్టేనని స్థలపురాణం.

వ్యాసపీఠం

అవసరమైన విషయాన్ని విస్త్తారంగా, స్పష్టంగా చెప్పడాన్ని ‘వ్యాసం’ అంటారు. భాగవతాది పురాణాలను, చతుర్విద పురుషార్థాలను మానవాళికి విస్తారంగా చెప్పడం వల్ల కృష్ణద్వైపాయన మహర్షి ‘వ్యాసుడు’గా వినుతికెక్కారు. ఆ జ్ఞానమూర్తి అధిష్టించిన వేదిక ‘వ్యాసపీఠం’గా వ్యవహారంలోకి వచ్చింది.

అనంతర కాలంలో గ్రంథపఠన సమయంలో పుస్తకానికి ఆధారంగా ఉపయోగించే పీటను ‘వ్యాసపీఠం’గా వ్యవహరిస్త్తున్నారు. వ్యాస శబ్దం వ్యక్తి నామం కాదని, జ్ఞానపీఠానికి అన్వయించే పేరని పెద్దలు చెబుతారు.

భారతీయతలో గురుస్థానం

భారతీయ జీవన విధానంలో గురువుకు గల స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రత్యక్ష దైవాలుగా చెప్పే తల్లిదండ్రుల తరువాతి స్థానం ‘ఆచార్య దేవోభవ’అని ఆయనదే. గురువుకు భగవంతుడితో సమాన స్థానం కల్పించింది మన మన సంస్కృతి. అవతారపురుషులు కూడా గురువు చెంత వినయవిధేయులుగా నిలుచున్నారు. శ్రీరామ చంద్రుడు గురువు వశిష్టుని పాదతీర్థం సేవించి శిరస్సున చల్లుకొని భక్తితో దివ్యబోధ (యోగావాసిష్ఠం) ఆలకించాడు. శ్రీకృష్ణుడు సాందీప మహామునికి శుశ్రూష చేసి విద్యను అభ్యసించాడు. తాను జగద్గురువు అయి ఉండి కూడా తనకంటే సద్గురువును ఆశ్రయించాలని మీరాబాయిలాంటి మహాభక్తులకు సాక్షాత్కరించి సూచించాడు. ఈశ్వరాంశంగా, జగద్గురువుగా పూజలందుకుంటున్న ఆది గురువు శంకరా చార్యులు ఓంకారేశ్వర్‌లో గౌడపాదుల శిష్యుడు గోవిందాచార్యుల శిష్యరికంలో సకల శాస్త్రాలు అభ్యసించారు. ఈశ్వరావతారమైన వారికి వేరే గురువు అవసరం లేకపోయినా శ్రీరామ శ్రీకృష్ణులకు మాదిరిగానే తనకూ గురువు అవసరమని భావించారాయన. తనకు హాని తలపెట్టిన గురువును కూడా మన్నించి శిష్యకోటితో తాను ఆదర్శ ఆచార్యులుగా వినుతికెక్కారు భగవద్రామానుజా చార్యులు. లోకంలో గురు సంప్రదాయాన్ని పటిష్ట పరచడమే వారి ఆంతర్యంగా భావించవచ్చు. ‘గోవిందుడు, గురువు ఎదుట నిలుచుంటే గురువుకు ప్రథమ నమస్కారం చేస్తాను’ అన్నారు కబీర్‌దాసు. కుంభవృత్తికారులు ‘కుమ్మరి సారెపై తయారవుతున్న కుండపై వంకర్లను చెక్కతో కొడుతూ అందంగా రూపొందించి నట్లే గురువు శిష్యులకు మంచిచెడుల విడమరచి గుణవంతులుగా తీర్చిదిద్దు తారని కూడా ఆయన పేర్కొన్నారు. గురువు జ్ఞానసాగరం లాంటి వారు. ఆ సాగరం నుంచి విజ్ఞానాన్ని ఒడిసి పట్టడంపైనే శిష్యుని భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. గురుశిష్యుల ప్రేమ లౌకిక బంధాలకు అతీతమైంది. విశ్వాసం గల శిష్యుడు గురువును అనుసరిస్తాడు, అనుకరిస్తాడు.

‘శోక’తుల్య శ్లోకం

‘గురుబ్రహ్మ గరుర్విష్ణు:…’శ్లోకం ‘శోక’తుల్య మవుతోంది. గురువులను గౌరవించాలన్న భావన విద్యార్థి లోకంలో, భావి పౌరులకు తాము పథ నిర్దేశకులమన్న భావన గురువులలోనూ (కొందరి లోనైనా) లోపిస్తోంది. అజ్ఞానం, అహంకారంతో గురువును కించపరిచే విపరీతధోరణులు పెరగడం, చలనచిత్రాది మాద్యమాలలో గురువులను చిన్నబుచ్చే, ఆటపట్టించే సంభాషణలు, దృశ్యాలు రావడం శోచనీయం.‘గురువులకు పరువులేదు. విద్యాల యాలకు విలువలేదు. గురజాడ అంటే బెజవాడ పక్కన ఊరు అనుకుంటారు తప్ప ఆయనో మహాకవి అనే అవగాహన లేదు..’అంటూ అయిదు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ ప్రయోగాత్మక తెలుగు చిత్రలోని న్యాయమూర్తి పాత్ర వాపోయింది. అదే సమయంలో తులసివనం లాంటి గురువ్యవస్థలోనూ కలుపు మొక్కలు చోటు చేసుకుంటున్న సంఘటనలు, సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవంక ఉపాధ్యాయులకు బెదిరింపులు, దాడులు, మరోవంక అయ్యవార్ల దాష్టీకాలు ప్రసార మాధ్యమాలలో కనిపిస్తు న్నాయి. ‘గురువు అపవిత్రుడైతే శిష్యుడికి జ్ఞానప్రసరణ చేయడానికి అనర్హుడు’ అన్న స్వామి వివేకానంద వ్యాఖ్య ప్రస్తావనార్హం.

దేశానికి రాజయినా ఒక తల్లికి తనయుడే అన్నట్లు ఎంత గొప్ప మేధావి అయినా ఒక గురువుకు శిష్యుడే. తల్లిదండ్రులకైనా సంతానం సంపాదనపై హక్కు, ఆశ ఉంటాయేమో కానీ గురువు నిస్వార్థపరులు. నిజమైన గురువుకు శిష్యుడి ఎదుగుదలే గర్వకారణం.

‘శిష్యాదిచ్ఛేత్‌’ ‌పరాజయం అన్నట్లు శిష్యుడు తనను మించి పోవడం గర్వంగా భావిస్తాడు. ‘భగవంతుడు గురువుల ద్వారా నాపై కృపావర్షం కురిపించాడు. ‘రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందించగలగడం పూర్వ జన్మసుకృతమే. అయినా నన్ను మాజీ రాష్ట్రపతిగా కంటే ఆచార్యుని (ప్రొఫెసర్‌) ‌గా సంబోధించండి’అని అబ్దుల్‌కలాం కోరేవారు. పదవీ విరమణ అనంతరం అనేక విద్యాసంస్థల్లో బోధించారు. పాఠం చెబుతూనే ఒరిగిపోవడం ఆయనకు అధ్యాపకత్వం పట్ల గల మమకారం స్పష్ట మవుతోంది. గురుపూజోత్సవాలు మొక్కుబడిగా మారి పాదనమస్కారాలకు, పురస్కారాలకు పరిమితం కాకూడదు. గురుత్వ విశిష్టతపై పెద్దలు చెప్పిన మాటలు అక్షరసత్యం కావాలి. విజ్ఞాన సారథులను స్మరించుకుంటూ, గౌరవించుకుంటూ, సుజ్ఞాన దీపి కలు వెలిగించుకోవాలి. అదే గురుదక్షిణ. గురుపూజ దినోత్సవం శుభాభినందన చందనాలు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE