ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు కృష్ణా, గోదావరి సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో భావోద్వేగాలు సృష్టించి రాజకీయలబ్ధి పొందాలనుకుంటున్నారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు గాలేరు-నగిరి, హంద్రి-నివాను ఏమాత్రం చేప్టని జగన్మోహన్‌రెడ్డి ప్రజను మాయచేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభి స్తున్నట్లు నాటకం ఆడుతున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రజల్లో విద్వేషం నింపుతున్నారు.
తమపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దారిమరల్చేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు సాగునీటి పథకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగి అది చేతల వరకు వెళ్లింది. ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో గల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పులిచింతల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వద్ద పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. తగినంత నీటిమట్టం లేకుండానే విద్యుదుత్పత్తికి ఆదేశించడం ఆంధప్రదేశ్ హక్కులను కాలరాయడమే. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి ఏకపక్షంగా రోజూ 3 టీఎంసీల నీటిని వాడేస్తోంది. శ్రీశైలం గరిష్ట సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ఇప్పుడు అత్యల్పంగా 43.27 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. పూర్తిగా నిండాలంటే మరో 173 టీఎంసీలు కావాలి. సాగర్‌లో గరిష్ట నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గాను.. 176.26 టీఎంసీల నిల్వ ఉంది. మరో 135.79 టీఎంసీల వరద రావాలి. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను.. 21.21 టీఎంసీల నిల్వ ఉంది. పులిచింతల నీటిని 14 లక్షల ఎకరాల వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. వ్యవసాయ అవసరాలకు నీరు విడుదల చేసినప్పుడే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉండగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏపీని ఖాతరు చేయకుండా నీటిని విడుదలచేసి విద్యుదుత్పాదన చేపట్టడంతో ఆ నీరంతా అట్టడుగున ఉన్న ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 3.07 టీఎంసీలు మాత్రమే. బ్యారేజీలో నిల్వ చేయలేక సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లక తప్పదు.
ప్రతికూల పరిస్థితుల వల్లే
ఏడేళ్ల పాలనలో ప్రతికూల వాతావరణం ఏర్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల సెంటి మెంట్‌ను మరోసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావ్యతిరేకతను మొత్తం ఆంధ్రులపై తోసేసేందుకు సాగునీటి ప్రాజెక్టులను వాడుకుంటున్నారు. వాస్తవానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రాజెక్టుల విషయంలో నియమనిబంధనలను పాటించలేదు. తాము చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికలను కె.ఆర్.ఎం.బి, అపెక్స్ కౌన్సిళ్లకు సమర్పించలేదు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో సహా ఆరు ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతీ లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలవల వెడల్పు పెంచడం, విడుదల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడం.. వీటిలో దేనికీ ఆంధప్రదేశ్‌కు అనుమతులు లేవు.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తుంగభద్రపై తుమ్మిల్ల వద్ద ఎత్తిపోతల పథకాలతోపాటు ఆలంపూర్ వద్ద బ్యారేజ్ కట్టి పైపుల ద్వారా నీటిని తీసుకెళ్తామని, కల్వకుర్తి పంపు సామర్థ్యాన్ని పెంచి అదనంగా నీటిని తరలిస్తామని, పులిచింతల ప్రాజెక్టు వెనుక నుండి 2 లక్షల ఎకరాలకు నీరు తీసుకుపోతామని తెలంగాణ కేబినెట్ తీర్మానించింది. కరవు ప్రాంతమైన కర్నూలు జిల్లా పడమట ప్రాంతానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నాలుగు టీఎంసీల నీటికి వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు ప్రారంభం కావడం విచారకరం. ఆర్డీఎస్ కుడికాలువకు బ్రిజేష్‌కుమార్ కేటాయించిన 4 టీఎంసీల నీటి వాడకాన్ని తెలంగాణ ప్రశ్నిస్తోంది. కాని బచావత్ నివేదిక అమలులో ఉన్నందున మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఆంధప్రదేశ్‌కు ఉంది.
రాయలసీమకు జగన్ ఏం చేశారు?
ఏదో ఒకటి చేశానన్నట్టు, కనీసం చేస్తున్నట్టు ప్రచారం కోసం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలవల వెడల్పు పెంచడం వంటివి ముందుకు తెచ్చింది. వీటికి నిధులు లేవు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తద్వారా రుణాలు సేకరించి, కేవలం 600 కోట్ల రూపాయలతో సిద్ధేశ్వరం అలుగును నిర్మించి, వాలు ద్వారా కృష్ణా జలాలను తీసుకునే అవకాశం ఉండగా, రూ. 6,825.15 కోట్లతో ఎత్తిపోతల ద్వారా నీటిని తోడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం కృష్ణానీటిని ఏకపక్షంగా తోడేస్తుంటే ఆంధప్రదేశ్ సీఎం జగన్ చోద్యం చూస్తున్నారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పడితే అక్కడి ఆంధ్రులు ఇబ్బందులు పడతారని మాట్లాడటం చేతకానితనంగా ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్ర సెటిలర్లపై తెలంగాణవాదులు దాడులు చేయాలనేది జగన్ ఉద్దేశం కావచ్చు. జగన్ ఉద్దేశంతో కేసీఆర్ అనుకున్న క్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ జలదీక్ష, కాళేశ్వరం నిర్మాణంలో కూడా అక్కడ ఆంధ్రు లున్నారు. అప్పుడు జరగని దాడులు ఇప్పుడెలా జరుగుతాయనుకుంటున్నారు? ఇంత సంయమనానికి కారణం పక్క రాష్ట్రంలో ఆయన ఆస్తులు కాపాడు కోవడం కోసమేనని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. సున్నితమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాటా జలాలకు కట్టుబడి ఉంటూ, మిగులు జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా నీటి వివాదాలను పరిష్కరించుకోవాలి. భావోద్వేగాలు పెంచే వైఖరితో వ్యవహరించరాదు.
చిత్తూరు మామిడి రైతుల కష్టాలు
ధర లేకపోవడం, సరుకు తీసుకునే కంపెనీలు చేస్తున్న జాప్యంతో మామిడి రైతులు పంటను కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2.8 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. గుజ్జు (పల్ప్) కోసం 1.6 లక్షల ఎకరాల్లో తోతాపురి, బేనిషా, మల్లిక, ఇమాంపసంద్, నీలం రకాలు లక్ష ఎకరాల్లో సాగవు తున్నాయి. ఏటా వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి ఎగుమతి సంస్థ తోడ్పాటుతో ఎగుమతులు జరుగుతున్నాయి. రెండేళ్లుగా కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఎగుమతులు ఆగిపోయాయి. తోతాపురి రకానికి మద్దతు ధర ఇవ్వకపోవడం, ఇతర వెరైటీలకు లాక్‌డౌన్‌తో ఎగుమతులు జరగకపోవడంతో రెండువేల కోట్ల రూపాయల నష్టం జరిగినా ప్రభుత్వానికి పట్టకపోవడం విచారకరం. తోతాపురి కాయకు చిత్తూరు జిల్లా కలెక్టర్ రూ.13 ధర నిర్ణయించగా, గుజ్జు యజమానులు రూ.11 మాత్రమే చెల్లిస్తామని ఒప్పుకున్నారు. కాని తొమ్మిది రూపాయలు మాత్రమే చెల్లించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అండతో గుజ్జు యజమానులు జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని తుంగలో తొక్కారు. మామిడికి మద్దతు ధర లేక 15 రోజులుగా రైతులు ఆందోళన బాటపట్టారు. గత ప్రభుత్వం కిలోకు రూ.2.50 పైసలు సబ్సిడీ ఇచ్చి మామిడి రైతులను ఆదుకుంది. రైతాంగం డిమాండ్ మేరకు ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి కిలో ధర రు. 20లుగా నిర్ణయించి, మామిడి రైతుల వెతలు తీర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
గుజ్జు తయారీ కంపెనీల యాజమాన్యం పండ్లను తీసుకునే విధానంలో అనుసరిస్తోన్న జాప్యం కారణంగా పండ్లు మాగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. తోతాపురి రకం మామిడిపండ్ల నుంచి జ్యూస్ తయారు చేస్తారు. ఈ పంట మూడు విడతల్లో కోతకొస్తుంది. ధర లేకపోవడం, కరోనాతో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో రైతులు ఒకేసారి పంట మొత్తాన్ని దింపేస్తున్నారు. పంటనంతటినీ ఒకేసారి జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించాల్సి వస్తోంది. దీంతో, ఫ్యాక్టరీల వద్ద మామిడి ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. తమ వంతు వచ్చే వరకూ అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈలోపు కాయలు మాగిపోతున్నాయి. యాజమాన్యాలు వీటిని తిరస్కరిస్తుండడంతో మామిడి రైతులు నష్టపోతున్నారు. ఒక్కో ఫ్యాక్టరీ ఏడున్నర నుంచి పది వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 45 జ్యూస్ ఫ్యాక్టరీలు ఉండగా, కరోనా నేపథ్యంలో 27 ఫ్యాక్టరీలే పని చేస్తున్నాయి. జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులూ రోజుకు మూడు వేల రూపాయల చొప్పున ట్రాక్టర్ యజమానికి అద్దె చెల్లించాల్సి వస్తుండడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. తొలకరి చినుకులు పడుతుండడంతో కాయలు దెబ్బతినకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పాల్సి వస్తోంది. దీంతో రెండు, మూడు రోజులకే కాయలు మాగిపోతున్నాయి. ఇటువంటి కాయలను ఫ్యాక్టరీలు తీసుకోవడం లేదు. కొన్ని ఫ్యాక్టరీలు తమ వద్దకు పంటను తీసుకురావద్దని, ఇప్పటికే మా వద్ద స్టాక్ ఉన్నందున కొత్తగా కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ఫ్యాక్టరీల యజమానులు టన్ను 9వేలకే కొంటున్నారు.
ఉద్యానశాఖ పట్టించుకోదు!
రైతుల ఇబ్బందులను ఉద్యాన శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పర్మిట్లు మంజూరు చేయాలి. ఇలా చేస్తే తనకు కేటాయించిన సమయానికి రైతులు కాయలు కోస్తారు. దీనివల్ల నిరీక్షణ ఉండదు. కాయలు పాడవవు. రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఉద్యాన శాఖాధికారులు తమకెందుకొచ్చింది అనే తీరులో వ్యవహరిస్తున్నారు. మామిడి సీజన్ పూర్తి అయ్యేలోపు చిత్తూరు నుంచి డిమాండ్• ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక మామిడి కిసాన్ రైలు ప్రారంభిం చేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటే రైతులు గట్టెక్కుతారు.
మద్యనిషేధం ఏదీ?
వైకాపా ప్రభుత్వం మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కానీ దశలవారీ నిషేధం జరగకపోగా గ్రామాల్లో, వాడవాడలా మద్యం సరఫరా అవుతూ పేదల జేబులను గుల్లచేస్తోంది. ప్రభుత్వం రూ.25 కు మద్యం సీసాను కొంటుంది. దానిని రూ.300 లకు అమ్ముతూ సామాన్యుల జేబుకు చిల్లుపెడుతోంది. మద్యంపై రూ.18 వేల కోట్ల ఆదాయం లభిస్తుందంటే ఎంతగా ప్రజలను దోచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులు తొలగించినట్లు చెప్పినా పాన్ షాపుల్లో అమ్ముతున్నారు. గత ఏడాది మద్యం దుకాణాలను తగ్గిస్తున్నట్లు చెప్పినా అమ్మకాలు మాత్రం ఇంకా పెరిగాయి. ఒక్క షాపు నుండే ఆయా గ్రామాల్లోని వాడలకు చేరుతున్నాయి. ఒక్క క్వార్టర్ బాటిల్‌కు అదనంగా రూ.20 నుండి రూ.30 వరకూ విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయాల నిర్వహణకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా రూపొందించింది. మద్యం విక్రయాలు సిసి కెమెరా పర్యవేక్షణలో జరగడం, స్టాక్ బ్యాచ్ నంబరు మద్యం బాటిల్ కనుగోలుకు సంబంధించి ఆయా కొనుగోలు దారుడికి తప్పనిసరిగా బిల్లును ఇవ్వాలి. ఒక్కో వ్యక్తికి పరిమితంగానే మద్యాన్ని విక్రయించాల్సి ఉంది. నిబం ధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా మద్యం విక్రయాలు గ్రామాల్లో వాడవాడలా జరుగుతున్నాయి.
-తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్