– పూసర్ల
రెండేళ్ల తరువాత జూన్ 11 నుండి 13 వరకు ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లో జరిగిన జి7 (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, అమెరికా, ఇంగ్లండ్, జపాన్) 47వ సమావేశాలు ఉత్సాహ భరితంగా జరిగాయి. అంతర్జాతీయ సహకారంపై దృష్టి సారించిన సభ్యదేశాలు ఐదు ముఖ్య అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. వుహాన్ వైరస్ సృష్టించిన కల్లోలం సద్దుమణిగిన తరువాత మొదటిసారి సమావేశమైన దేశాధినేతలు కొవిడ్ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధన జరగాల్సిందేనని నిర్ణయించారు.
‘పునర్నిర్మాణం’ అనే పేరు పెట్టిన ప్రణాళికను జి7కు అధ్యక్షత వహిస్తున్న ఇంగ్లండ్ సభ్య దేశాల ముందు ఉంచింది. అందులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం, భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను మరింత సమర్ధంగా ఎదుర్కునే శక్తిసామర్ధ్యాలు సంపాదించడం, న్యాయమైన, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, స్వేచ్ఛాయుత సమాజాలను ప్రోత్సహించడం, విలువలను పరస్పరం పంచుకోవడం వంటి నాలుగు ప్రధాన అంశాలను చేర్చింది.
పై అంశాలు బహుముఖ సహకారాన్ని పెంపొం దించే విధంగా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ అంశాన్ని పక్కన పెడితే మిగిలినవన్నీ చైనా దుందుడుకు ధోరణికి సంబంధించినవే. కొవిడ్ మహమ్మారికి పుట్టినిల్లు చైనాలోనే వైరస్ వ్యాప్తికి సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలాగే చైనా దురాక్రమణ వాణిజ్య విధానం వల్ల అనేక చిన్న దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. చైనా నిరంకుశ, రహస్య తీరు మూలంగా విలువలను పంచుకునేందుకు ఏమాత్రం అవకాశం లేదు.
క్వాడ్(అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లతో కూడిన సంస్థ) నేతల సమావేశంలో వుహాన్ వైరస్ గురించి విచారణ సాగించాలని ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, తనకు ముందున్న అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన చైనా ప్రతికూల విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. ప్రజాస్వామిక, స్వేచ్ఛాయుత సమాజ విలువలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకోవాలని జి7 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఆ విధంగా చైనా నిరంకుశ ధోరణిని అడ్డుకోవాలని నిర్ణయించు కున్నట్లయింది.
చైనాతో ఉన్న బలమైన ఆర్ధిక సంబంధాల దృష్ట్యా వెంటనే తుది అంగీకారానికి రాలేకపోయినా చైనా పట్ల అనుసరించవలసిన ప్రతికూల విధానం అవసరాన్ని అన్నీ దేశాలు గుర్తించాయి. కొవిడ్ మహమ్మారిపై పోరును తీవ్రతరం చేయాలని నిర్ణయిస్తూ పేద దేశాలకు 1బిలియన్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేయాలని జి7 దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ సహాయం చాలా తక్కువని, అది కూడా ఆలస్యంగా అందుతున్నదనే విమర్శలు వస్తున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి సంపన్న దేశాలు ఆలోచిస్తున్నాయనే విషయాన్ని ఈ నిర్ణయం తెలుపుతోంది.
జి7 దేశాలు పేదదేశాలకు అందించే 1బిలియన్ వ్యాక్సిన్‌లలో 50 మిలియన్ డోసులు ఫైజర్‌కు చెందినవి ఉంటాయి. 100 మిలియన్ డోసులు ఇంగ్లండ్, కెనడాలు కలిపి అందిస్తాయి. అయితే మహమ్మారిని అరికట్టడానికి జి7 కేటాయించే 2 బిలియన్ డాలర్ల నిధి నుంచి అమెరికా వ్యాక్సిన్‌లు కొనుగోలు చేస్తారన్నది ఆసక్తికరమైన విషయం. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ కొనుగోలుకు, పంపిణీకి అవసరమైన వ్యవస్థ, ఆర్ధిక స్థోమత లేని కారణంగా ప్రపంచ బ్యాంక్ 12 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించ డానికి ముందుకు వచ్చింది. అయితే దీనివల్ల పేద దేశాలపై రుణభారం పెరుగుతుందని, వ్యాక్సిన్‌ల అందుబాటులో ఉన్న వ్యత్యాసం మరింత పెరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పారదర్శకత, జవాబుదారీతనం కోసం వుహాన్ వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి నిపుణులతో క్షుణ్ణమైన విచారణ జరగాలని జి7 దేశాలు కోరాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులను నివారించడానికి, వైరస్‌ల వ్యాప్తిని ముందుగా పసిగట్టి హెచ్చరించే ప్రపంచవ్యాప్త వ్యవస్థను ఏర్పాటుచేయడం, వ్యాధులకు అవసరమైన చికిత్స, వ్యాక్సిన్‌ల తయారీకి ప్రస్తుతం పడుతున్న 300 రోజుల కాల వ్యవధిని 100రోజులకు తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలపై ఈ దేశాలు అంగీకరించాయి.
చైనా ‘మార్కెటేతర విధానాలు, పద్ధతుల’ను వ్యతిరేకించిన జి7 దేశాలు ‘నిబంధనలకు లోబడిన అంతర్జాతీయ వ్యవస్థ, అంతర్జాతీయ న్యాయాన్ని సంపన్న దేశాలు పరిరక్షించాలి’ అన్న బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటామని మరోసారి ఉద్ఘాటించాయి. అలాగే చైనాలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గురించి ఆందోళన వ్యక్తంచేశాయి. ఉయిఘర్‌లపై బీజింగ్ ప్రభుత్వం సాగిస్తున్న అత్యాచారాలకు, ‘మరణకాండ’కు నిరసనగా అమెరికా, యూరోపియన్ యూనియన్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారులపై ఆంక్షలు విధించాయి. ప్రతిస్పందనగా చైనా కూడా ఆంక్షలు విధించింది. చైనా చర్యలతో ఆగ్రహించిన యూరోపియన్ యూనియన్ సమీకృత పెట్టుబడి ఒప్పందం (సిఐఏ)పై చర్చించడానికి నిరాకరించింది.
వెట్టిచాకిరీ, మానవహక్కుల క్షీణత వంటి అంశాలపై ఆందోళన తెలిపిన జి7 ‘మా విలువల ప్రకారం చైనా కూడా మానవహక్కులు, మౌలిక అధికారాలను గౌరవించాలని, పరిరక్షించాలని కోరుతున్నాం. అలాగే చైనా-బ్రిటిష్ సంయుక్త ఒప్పందం, చట్టం ప్రకారం హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రధాన భౌగోళిక రాజకీయ వివాదాలకు కేంద్రమయింది. అందుకనే జి7 దేశాలు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి తమ విధానాన్ని ప్రకటించాయి. స్వేచ్ఛాయుత వాతావరణం ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమని పేర్కొన్న ఈ దేశాలు తైవాన్ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితుల గురించి ఇలా వ్యాఖ్యానించాయి. ‘ఈ ప్రాంతంలో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అలాగే దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో యధాతథ స్థితికి భంగం కలిగిస్తూ ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలైనా తీసుకోవడాన్ని, ఉద్రిక్తతలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం.’ ఈ ప్రకటనతో జి7 దేశాలు చైనా గీసిన ‘ఏక చైనా విధానం’ అనే లక్ష్మణరేఖను దాటినట్లయింది.
చైనా బెల్ట్, రోడ్ వ్యూహాన్ని తిప్పికొట్టడం కోసం జి7 దేశాలు పునర్నిర్మాణ ప్రణాళిక కింద మౌలిక సదుపాయాల కల్పనకు 40 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాయి. వుహాన్ వైరస్ పేరు ఎత్తకుండానే ఇటీవల చిన్న, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లో మౌలిక సదుపాయాల వ్యవస్థ అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్న ఈ దేశాలు ‘పారదర్శక ఆర్ధిక, పర్యావరణ, సామాజిక ధోరణిలో మౌలిక సదుపాయాల వ్యవస్థ అభివృద్ధికి చేసే కృషి వల్ల సంబంధిత దేశాలు, ప్రజలు లాభం పొందుతారు’ అని ప్రకటించాయి.
చైనాతో పాటు రష్యా గురించి కూడా జి7 దేశాలు ప్రస్తావించాయి. ‘ఇతర దేశాల ప్రజాస్వామిక వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడం, వాటిని అస్థిర పరచడం వంటి కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలి. అలాగే అంతర్జాతీయ మానవహక్కుల హామీలు, కర్తవ్యాలను పూర్తిచేయాలి’ అని రష్యాను కోరాయి.
ఈ ప్రకటన ద్వారా జి7 దేశాలు ఉక్రెయిన్ విషయంలో నోర్మండి పక్రియకు, మిన్సక్ ఒప్పందాల అమలుకు మరోసారి మద్దతు తెలుపడమేకాక బెలారస్ అధికారుల నిరంకుశ ధోరణి పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. మైన్మార్‌లో సైనిక తిరుగుబాటును ఖండించిన జి7 దేశాలు అఫ్ఘానిస్తాన్‌లో హింస చల్లారి సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకున్నాయి. అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా ఇరాన్‌ను ఎలాగైనా నిలువరించాలని మరోసారి ప్రతిన పూనిన ఈ దేశాలు అమెరికా, ఇరాన్‌ల మధ్య సంయుక్త, సమీకృత కార్యాచరణ ప్రణాళిక (జీ) సంప్రదిం పులు తిరిగి ప్రారంభం కావాలని అభిప్రాయపడ్డాయి.
సమానత్వం, ముఖ్యంగా, స్త్రీ పురుష సమానత్వం, ఆడపిల్లల విద్యావకాశాలు, భూమిని సంరక్షించడం, ఆర్ధిక వ్యవస్థలను పటిష్టపరచడం, ప్రపంచ సమస్యల పరిష్కారానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అంతరిక్ష, సైబర్ సహకారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని జి7 దేశాలు నిర్ణయించుకున్నాయి.
ఈసారి సమావేశాలలో అతిథుల హోదాలో పాల్గొనవలసిందిగా భారత్ సహా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలకు ఆహ్వానం అందించాయి జి7 దేశాలు. ఆహ్వానాన్ని అందుకుని సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడంలో జి7 దేశాల సహాయ, సహకారాలను ప్రశంసించారు. అలాగే దక్షిణాఫ్రికాతో కలిసి ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో ట్రిప్స్ నిబంధనలను తాత్కాలికంగా పెట్టాలన్న ప్రతిపాదన భారత్ చేసింది.
సమావేశాల్లో మాట్లాడిన ప్రధాని మోదీ స్వేచ్ఛా యుత సమాజాలు, ఆర్ధిక వ్యవస్థల పునర్నిర్మాణం, పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ వంటి విషయాల్లో భారత నాగరిక విలువలు ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత సమాజాలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు, జి7 దేశాలతో కలిసి భారత్ ‘స్వేచ్ఛాయుత సమాజాల’ గురించి సంయుక్త ప్రకటనపై సంతకం చేసింది.
మరొక సమావేశంలో అన్నీ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ‘ఒక భూమి-ఒకే ఆరోగ్య వ్యవస్థ’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. పరోక్షంగా చైనాను ప్రస్తావిస్తూ భవిష్యత్ సమస్యలను ఎదుర్కొనడానికి ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
2019లో ఫ్రాన్స్‌లో జరిగిన జి7 సమావేశాల్లో ప్రధాని మోదీ సుహృద్భావ పూర్వక భాగస్వామిగా పాల్గొన్నారు. ఆ తరువాత 2020లో కేంప్ డేవిస్‌లో జరిగిన సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానిం చారు. కానీ వుహాన్ వైరస్ వ్యాప్తి మూలంగా ఆ సమావేశాలు రద్దయ్యాయి. ఇప్పుడు వుహాన్ వైరస్ రెండవ పర్యాయం వ్యాప్తి చెందడంతో కార్న్‌వాల్ సమావేశంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయారు.
కార్న్‌వాల్‌ను ప్రజాస్వామ్య దేశాల కూటమి సమావేశాలుగా ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. యూరప్ పర్యటనకు బయలుదేరే ముందు ‘నూతన యుగపు సమస్యలను ఎదుర్కొన డంలో ప్రజాస్వామిక దేశాల పరస్పర సహకారం, సమన్వయం, సామర్ధ్యాలను ఈ పర్యటన మరింత పటిష్టపరుస్తుంది’ అని అమెరికా అధ్యక్షుడు జాన్ బైడన్ పేర్కొన్నారు.
కొవిడ్ మహమ్మారి చైనా పట్ల ప్రపంచ దృష్టిని మార్చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో చూపిన నిర్లక్ష్య ధోరణి, నివారణ మందులను ఇతర దేశాలను లోబరచుకునేందుకు, లొంగదీసుకునేందుకు ఉపయోగించడం, మోసపూరిత దౌత్యం, దక్షిణ చైనా సముద్రం మొదలైన ప్రాంతాల్లో విస్తరణవాదం, కొవిడ్ మహమ్మారి పరిస్థితులను ఆసరా చేసుకుని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు సృష్టించడం, వుహాన్ వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధన జరగాలన్న దేశాలపై ఆర్ధికపరమైన ఆంక్షలు విధించడం, హాంకాంగ్ స్వేచ్ఛను హరించడం వంటి చర్యల ద్వారా అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనా దుర్మార్గపూరిత, వినాశనకారి ధోరణిని మరోసారి బయటపెట్టారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా చైనా పరపతి ఎన్నడూ లేనంతగా క్షీణించింది.
ఇలాంటి చైనా ధోరణిని అడ్డుకుని పారదర్శకమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రపంచం ముందు ప్రధాన అంశం అయింది. అందుకు ఈ ప్రజాస్వామ్య దేశాల కూటమి ఒక మంచి ఆరంభం అవుతుంది.
జి7 సమావేశాల ప్రభావం గురించి చర్చ జరుగుతున్నప్పటికీ ఈ సమావేశాల్లో ప్రతిపాదించిన ‘పునర్నిర్మాణ’ ప్రణాళిక పట్ల భారత్ విశ్వాసాన్ని ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా విస్తరించే చైనా బిఆర్‌ఐ (బెల్ట్, రోడ్ నిర్మాణ పధకం)ని భారత్ మొదటినుండీ వ్యతిరేకిస్తోంది. ఇది చైనా విస్తరణ వాదానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెపుతూనే ఉంది.
జి7 దేశాల సంయుక్త ప్రకటనకు ప్రతిస్పందనగా చైనా కూడా ‘చిన్నచిన్న సమూహాలు ప్రపంచ భవితవ్యాన్ని శాసించే రోజులు పోయాయి’ అంటూ వ్యాఖ్యానించింది. ‘జి7 దేశాలవన్నీ ఆధారరహితమైన ఆరోపణలే. జిన్‌పింగ్ విధానాలను సాకుగా చూపి చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని జి7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము’అని లండన్ లో చైనా రాయబారి పేర్కొన్నారు. జి7 దేశాల ధోరణికి ఆగ్రహం చెందిన చైనా, ప్రతీకార చర్యగా తరచూ తైవాన్ గగనతలంలోకి చొరబడింది. చైనాకు చెందిన 28 యుద్ధ విమానాలు తైవాన్ వైమానిక రక్షణ ప్రదేశం(ణ్గ)లోకి చొరబడటం ద్వారా ‘ఒకే దేశం, రెండు వ్యవస్థలు’ అనే విషయాన్ని, వాదనను స్థిరపరచేందుకు ప్రయత్నించాయి.
జి7 సమావేశాలను ‘ఆఖరి జి7 సమావేశం’ అంటూ లియనార్డో డావిన్సి ‘లాస్ట్ సప్పర్’కు పేరడీగా వైబో ప్రచురించిన ఒక కార్టూన్‌ను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక తిరిగి ప్రచురించింది. ఆ కార్టూన్ ఇలా ఉంది.
– కార్టూన్‌లో దేశాలు. ఎడమ నుండి కుడికి వరుసగా: జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇటలీ, అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, భారత్
బల్ల క్రింద ఉన్న రెండు కప్పలు: తైవాన్, హాంకాంగ్.
ఒక చిత్రం వంద వాక్యాలకు సరిసమానం అని ఈ కార్టూన్ చైనా సంకుచిత మనస్తత్వాన్ని, ఒంటెత్తుపోకడ విధానాన్ని తెలియజేస్తోంది.
అను: కేఎన్