ఏ దేశానికైనా జనాభాను సంపదగానే పరిగణిస్తారు. కానీ భారతదేశ ప్రస్తుత పరిస్థితి వేరు. పెరుగుతున్న జనాభా ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తున్నదన్న అభిప్రాయం ఉంది. అలాగే, జనాభా నియంత్రణను కొన్ని వర్గాలు పాటించక పోవడంతో సామాజిక అసమతౌల్యం పెరగడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి జనాభా నియంత్రణను ఇక అనివార్యంగా భావించవలసిన తరుణం వచ్చిందన్న మాట కూడా వినిపిస్తున్నది. అభివృద్ధిని వేగవంతం చేయడానికీ, విద్యాధిక సమాజంగా రూపొందడానికీ ఆ నియంత్రణ అమలు తప్పదు. తలసరి ఆదాయం పెరగాలంటే, పిల్లల విద్య కోసం ఎక్కువ మొత్తంలో కుటుంబం ఖర్చు చేయాలంటే జనాభా పరిమితంగా ఉండాలి. భారత్ ఏటా కోటిన్నర జనాభాను పెంచుకుంటున్న తరుణమిది. కాబట్టి గట్టి జనాభా నియంత్రణ విధానం తక్షణ అవసరంగా చాలామంది భావిస్తున్నారు.
దేశం పారిశ్రామికంగా, శాస్త్రసాంకేతిక రంగాలలో, ఇతర ముఖ్య రంగాలలో అభివృద్ధి సాధించినప్పటికీ ప్రజలందరి మౌలిక అవసరాలు తీరాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవు. అందులో మొదటిది జనాభా నియంత్రణ. దీని మీద దేశంలో ప్రత్యేక విధానం లేకున్నా, గడచిన యాభయ్ సంవత్సరాలుగా అందుకోసం తపన మాత్రం ఉంది. 1968లో విదేశాంగ విధాన సంఘం 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో మూడు రోజుల సదస్సు నిర్వహించారు. వారు పెరుగుతున్న జనాభా గురించే హెచ్చరించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. 1992లో 1,700 శాస్త్రవేత్తలు కలసి చర్చించి జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలను వివరిస్తూ ఒక పత్రం ప్రచురించారు. 2017లో 184 దేశాలకు చెందిన 15,000 మంది శాస్త్రవేత్తలు జనాభా పెరుగుదల అతి పెద్ద సమస్య అని తేల్చి చెప్పారు.
మన పార్లమెంటులో కూడా జనాభా నియంత్రణ గురించి అడపా దడపా బిల్లులు సభల ముందుకు వస్తూనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అలాంటివి 40 వరకు బిల్లులను సభలలో ప్రవేశపెట్టారు కూడా. కాంగ్రెస్ (16), బీజేపీ (12), తెలుగుదేశం (5), అన్నాడీఎంకే (2), టీఎంసీ, ఆర్‌ఎస్‌పీ, సమాజ్‌వాదీ పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి, ఆర్‌జేడీ (1వంతున) బిల్లులను ప్రవేశ పెట్టాయి. ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ అంశం కోసం ఉద్దేశించిన ఆ బిల్లులను ఎవరూ తీవ్రంగా పరిగణించలేదు. 1992లో నాటి కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి ఎంఎల్ ఫోతేదార్ జనాభా నియంత్రణను ప్రోత్సహించడానికి, చిన్న కుటుంబం నిబంధన కోసం రాజ్యాంగానికి 79వ సవరణ చేయాలని రాజ్యసభలో ప్రతిపాదించారు. కానీ సభ చర్చకు స్వీకరించలేదు. 2018లో కూడా ది రెస్పాన్సిబుల్ పేరెంట్ బిల్ పేరుతో సంజీవ్ బల్యాన్ ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇది ప్రైవేట్ బిల్లు. 2018 శీతాకాల సమావేశాలలో ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని 125 మంది ఎంపీలు నాటి స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. అయినా జరగలేదు. ప్రస్తుతం లభిస్తున్న సమాచారాన్ని బట్టి దేశంలో ఏటా 2.40 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు. 88 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే ఏటా కోటిన్నర జనాభా పెరుగుతున్నది.
ఇప్పుడు ఈ జనాభా నియంత్రణ ఆలోచనకు హఠాత్తుగా కొత్త ఊపు వచ్చింది. జనాభా నియంత్రణను మతం ప్రాతిపదికగా అంగీకరించని పరిస్థితి ఈ దేశంలో కొన్ని వర్గాలలో ఉన్నప్పటికీ నియంత్రణ దిశగా అడుగు వేసే వాతావరణం బలపడింది. రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు అందుకు నడుం బిగించాయి. ఇలాంటి ఒక బిల్లును ప్రవేశ పెట్టాలని ఉత్తర ప్రదేశ్, అస్సాం దాదాపు ఒకేసారి భావించాయి. ఇది ముస్లింల మనోభావాలకు విరుద్ధమంటూ అస్సాం, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముస్లిం నాయకులతో పాటు ఎంఐఎం అధినేత ఒవైసీ వంటివారు కూడా మొదటే వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ఈ బిల్లు గురించి ఎందుకు ఆలోచించవలసి వచ్చిందో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. అధిక జనాభా అభివృద్ధికి ఆటంకం. అస్సాం పరిస్థితి వేరు కాబట్టి, అక్కడ ఈ సమస్య ప్రధానంగా ముస్లింలతో ముడిపడి ఉందన్నది నిజం. అలాగే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ రెండు రాష్ట్రాల బిల్లులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలి.
ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని చెప్పే చట్టం రూపొందించడానికి అస్సాం, ఉత్తరప్రదేశ్ కొన్ని వారాల నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ రెండు బీజేపీ పాలనలో ఉండడం వల్ల మీడియా గగ్గోలు ప్రారంభించింది. మేం ఇద్దరు పిల్లల చట్టాన్ని వ్యతిరేకిస్తాం అని చెబితే, అలాంటి వాళ్లని దేశం నుంచి వెళ్లగొట్టరు. లేదా కారాగారంలో పెట్టరు. కానీ ప్రభుత్వ పథకాలు ఏవీ వారికి వర్తించవు. ‘జనాభా అదుపు, సంక్షేమం గురించి మాకు రాష్ట్ర లా కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇద్దరు పిల్లల నిబంధనను పాటించిన దంపతులకు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు వర్తింపచేస్తాం. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు అర్హులవుతారు’ అని ఉత్తర ప్రదేశ్ లా కమిషన్ చైర్మన్ ఆదిత్యనాథ్ మిట్టల్ చెప్పారు. దీనిని బట్టి చట్టం స్వరూప స్వభావాలు కూడా తెలుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ జనాభా (అదుపు, కుటుంబ నియంత్రణ, సంక్షేమ) బిల్లు 2021 పేరుతో ఆ రాష్ట్రం ముసాయిదా రూపొందించింది. దీని ప్రకారం ఇద్దరు పిల్లలుకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హులవుతారు. ప్రభుత్వోద్యోగాలలో పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హత కోల్పోతారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు దక్కవు. ఇద్దరు పిల్లల నిబంధన పాటించిన వారికి ఉద్యోగ కాలమంతా రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇస్తారు. అర్హత ఉన్న మహిళలకు 12 మాసాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు భత్యాలతో సహా ఇస్తారు. జాతీయ పింఛను పథకం కింద యజమాని చెల్లించే మొత్తంలో మూడు శాతం పెంపు కూడా ఉంటుంది. ప్రసూతి కేంద్రాల ద్వారా గర్భనిరోధక సాధనాలు పంచిపెట్టాలని కూడా బిల్లులో ప్రతిపాదిం చారు. జనాభా నియంత్రణ అనే అంశం మీద సెకండరీ పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదించారు. ఇదంతా అమలులోకి తేవడానికి స్టేట్ పాపులేషన్ నిధిని ఏర్పాటు చేస్తారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇద్దరు పిల్లల సూత్రానికి గట్టి మద్దతుదారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఆశిస్తున్నారు. ఈ పథకం గురించి ప్రకటించడానికి కొంచెం ముందు ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి చెందిన 150 మంది ముస్లిం మేధావులతో చర్చించారు. రాష్ట్రంలో దశల వారీగా ఇద్దరు పిల్లల పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ నిబంధన కేంద్ర పథకాలకు వర్తింప చేయడం లేదు. ‘కొన్ని ప్రాథమిక పథకాలు అందరికీ వర్తింపచేస్తాం. కొన్ని ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాలకు వర్తిస్తాయి. స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాలలో కీలక ప్రకటన వెలువడుతుంద’ని బిశ్వశర్మ చెప్పారు.
ఈ రెండు రాష్ట్రాలు తీసుకువస్తున్న విధానంలో సమంగా కనిపిస్తున్న అంశం ఇద్దరు పిల్లలు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు కావడం. నిజానికి 2017లోనే జనాభా, మహిళా సాధికారత విధానాన్ని అస్సాం తప్పనిసరి చేసింది. దీని ప్రకారం ప్రభుత్వోద్యోగులంతా ఇద్దరు పిల్లల నిబంధనను పాటించవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సంక్షేమ పథకాలు స్వీకరించాలన్నా ఆ నిబంధన పాటించాలి. కానీ ఎస్‌సీలు, ఎస్‌టీలు, తేయాకు తోటల కార్మికులను ఈ నిబంధన నుంచి మినహాయించారు.
ఈ బిల్లులు ఆర్‌ఎస్‌ఎస్ ఆశయం మేరకు వస్తున్నాయని, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకమని ఎందరు వితండవాదం చేసినా అది వాస్తవాన్ని ప్రతిబింబించడంలేదు. జనాభా నియంత్రణ నేటి అవసరం. అయితే ఇప్పుడు అంతా యువతరమే ఉన్నా, ముప్పయ్ ఏళ్ల తరువాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఈ అసమతౌల్యం బారిన పడిన చైనా, విధానం మార్చింది. అది గుర్తించాలి.
– జాగృతి డెస్క్