– కృపాకర్‌ ‌పోతుల

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


క్రీస్తుశకం పదిహేడువందల తొంభై నాలుగవ సంవత్సరం..

జూలైనెల…ఏడవతారీఖు..

ఉదయం పదిగంటల సమయం..

కళింగాంధ్రకు మకుటాయమానమైన విజయనగర సంస్థానపు ముఖ్యపట్టణమైన విజయనగరం…

విజయనగరానికి ఇంచుమించు ఎనిమిదికోసుల దూరానున్న ‘పద్మనాభం’ గ్రామం…

పద్మనాభంలో కొలువైయున్న అనంతపద్మనాభ స్వామి దేవాలయం…

దేవాలయంలో, స్వయంభువుగా వెలసిన అనంత పద్మనాభుని మూడుమూర్తుల ఏకీకృతస్వరూపం… దేవాలయప్రాంగణంలో సువిశాలమైన ముఖ మంటపం…

అక్కడ…ఆ మంటపంలో…

పదిమంది వీరులు, మీసాలు మెలివేస్తూ, గంభీరంగా కూర్చొని ఉన్నారు. కోపంతో రగిలి పోతున్నట్టు కనిపిస్తున్న వారంతా వేరెవరోకాదు… విజయనగరసైన్యానికి చెందిన ఉన్నతాధికారులు. మహాదళపతిరాజా సాగి రామచంద్రరాజుతో పాటూ, పూసపాటి, దాట్ల, దంతులూరి, వత్సవాయి వంటి ప్రముఖ రాజకుటుంబాలకు చెందిన సర్దారు లక్కడ కూడుకొని ఉన్నారు.

వారందరి దృష్టి ఎదురుగా ఉన్నతమైన స్థానంలో ఆసీనుడై ఉన్నవ్యక్తిమీద కేంద్రీకృతమైఉంది. అంత కోపంతో కుతకుతలాడిపోతున్న వారు కూడా, తీవ్రమైన తపస్సులో మునిగిఉన్న మునీశ్వరునిలా నిశ్చలంగా కళ్లుమూసుకొని, ఠీవిగా కూర్చున్న ఆయనను అత్యంతగౌరవభావంతో, అంతకుమించిన భక్తి భావంతో వీక్షిస్తున్నారు. ఆయన కళ్ళుతెరిచి చెప్పబోయే మాటలకోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

కొద్ది సమయం తరవాత, నెమ్మదిగా కళ్ళు తెరిచారాయన. కూర్చున్న సర్దారులందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ‘‘విజయనగర సంస్థానాధీశులు, ‘మన్నెసుల్తాన్‌’ ‌బిరుదాంకితులు, శ్రీశ్రీశ్రీ చినవిజయ రామగజపతుల వారికి ప్రణామములు’’ అంటూ తలలు వంచి, సవినయంగా ఆయనకు అభివాదం చేసారు. వారివేపు చిరునవ్వుతో చూస్తూ, కూర్చోమని సైగచేసారాయన. వారు నిశ్శబ్దంగా తమ స్థానాలలో కూర్చున్న పిమ్మట, గొంతు సవరించుకొని గంభీరంగా మాట్లాడడం మొదలుబెట్టారు.

‘‘విజయనగర సంస్థానానికి గర్వకారణమైన యోధాగ్రేసరులారా! మనకత్యంత ప్రియమైన మన రాజ్యసంరక్షణార్దం మనమంతా కత్తులు దూయాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయం మీకందరికీ తెలిసినదే. ఇప్పటికి ముప్పైసంవత్సరాల క్రితం, పరాసువారి చేతిలో చావుదెబ్బతిన్న ఆంగ్లేయులను అక్కునచేర్చుకొని ఆదరించినది మా తండ్రిగారైన పెదవిజయ రామరాజుగారే అన్న విషయం నిర్వివాదం. అంతేకాక, మన రాజ్యంనుండి పరాసు వారిని పారద్రోలి, వారి ఆక్రమణనుండి స్వాధీనం చేసుకొన్న విశాఖపట్నాన్ని ఆంగ్లేయులకు అప్ప గించినదీ, మనప్రాంతంలో వారు నిర్భయంగా వ్యాపారం చేసుకొనే అవకాశం కలిగించినదీ కూడా మా తండ్రిగారే. అయితే ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఆంగ్లేయులు, అధికారమదంతో మనల్ని ఎన్ని ఇడుములకు గురిచేసారో మీకు ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరంలేదు.’’

‘‘మనలో మనకి ఐక్యతలేకపోవడం, మనమధ్య పొడచూపిన విభేదాల పరిష్కారంలో పరాయిదేశస్థుల ప్రమేయాన్ని కోరి ఆహ్వానించడం వంటి అనాలోచిత చర్యలవలన మనదేశాన్ని మనంతట మనమే వారికి, పువ్వుల్లోపెట్టి మరీ, సమర్పించుకున్నాం. వ్యాపారం నిమిత్తం ఎక్కడో కొన్నివేల కోసులదూరం నుండి మనదేశానికి వచ్చినవారిని, ప్రభువులుగా మన శిరస్సులపై ప్రతిష్టించుకున్నాం.’’

‘‘మనం వారికి కట్టాల్సిన ‘పేష్కసు’, మనతో మాటమాత్రం సంప్రదించకుండా, ఒక్కసారిగా యాభైవేల రూపాయలకు హెచ్చించారు. అంతేకాకుండా మనం చెల్లించాల్సిన బకాయిలట… ఎనిమిదిలక్షల యాభై వేలుగా లెక్కతేల్చారు. వెంటనే చెల్లించమని తాకీదు పంపించారు. మనం బాకీపడిన మొత్తం అంత కాదనీ, వారు మనకివ్వల్సిన దాన్ని అందులోనుండి మినహాయిస్తే, మనం చెల్లించాల్సినది బహుస్వల్ప మేననీ మనం వాదించడం మాత్రమేకాక, సంబంధిం చిన లెక్కలు కూడా సవివరంగా సమర్పించాం. కాని మన వాదాన్ని వారు నిర్ద్వందంగా తిరస్కరించిన విషయం కూడా మీకు విదితమే. గత్యంతరంలేని పరిస్థితుల్లో, దాన్ని మూడువాయిదాల్లో చెల్లించడానికి అనుమతికోరితే, సరియైన కారణం చూపకుండానే మన అభ్యర్దనను త్రోసిపుచ్చి, మన కోటను ఆక్రమించు కున్నారు.’’

‘‘అందువిషయమై ఆగ్రహించిన మన కర్షకులు శిస్తులు చెల్లించ నిరాకరించి తమ అసమ్మతిని శాంతియుతంగానే అయినా దృఢంగా తెలియజేసారు. అది సహించలేని కుంఫిణీవారు, మేము ఇక్కడ ఉన్నంతకాలం వారి ఆటలు సాగవని గ్రహించి మాకు దేశబహిష్కారశిక్ష విధించి, మచిలీపట్నానికి బలవంతంగా తరలిస్తున్న సమయంలో వారి చెరనుండి తప్పించుకొని, పవిత్రమైన పద్మనాభుని సన్నిధిలో ఆశ్రయం పొందడం…భగవత్సంకల్పం తప్ప వేరేదీ కాదని మా దృఢవిశ్వాసం’’ మాట్లాడడం ఆపుచేసి, తన అనుచరుల హావభావాలను నిశితంగా రెండుక్షణాలపాటూ గమనించారు చినవిజయ రామరాజు.

మహారాజు నోటివెంట వెలువడిన మాటలు, అవి తెలిసిన విషయాలే అయినా, వింటున్న సర్దారుల రక్తం ఉద్రేకంతో ఉరకలెత్తింది. క్రోధంతో కళ్లు చింతనిప్పుల్లా కణకణలాడాయి. దవడఎముకలు బిగుసుకున్నాయి. పిడికిళ్లు బిగించి ఆవేశంతో ఊగిపోయారందరూ. తన అనుచరుల వదనాల్లో సుస్పష్టంగా ప్రకటితమౌతున్న హావభావాలను వీక్షించిన మహారాజు తృప్తిగా తలపంకించారు. మాట్లాడడం కొనసాగించారు. ‘‘వీరులారా, ఇప్పుడు మనముందు ఉన్నవి రెండే రెండు ప్రత్యామ్నాయాలు. ఆంగ్లేయుల ఆదేశాలను శిరసావహించి, మాతృ సమానమైన మన నగరాన్ని వదిలిపెట్టి, అనాధల్లా మచిలీపట్నానికి పయనమవడం, అక్కడ మన శత్రువులు విదిల్చే ఎంగిలికూడు కతుకుతూ, వారి మోచేతినీరు తాగుతూ, కుక్కల్లా పడి ఉండడం… ఇది మొదటిది. దీనివలన మనం మరణించం. ప్రాణాలు నిలుపుకుంటాం. కాని…పౌరుషంగల రసపుత్రవీరుల్లా కాక, జీవచ్చవాల్లా శేషజీవితాన్ని గడుపుతాం.’’

‘‘ఇక రెండవప్రత్యామ్నాయం…చేత ఖడ్గం ధరించి, కదనరంగంలోకి దూకడం. బలవంతుడైన శత్రువుని కొదమసింహంలా ఎదుర్కోవడం. ఆఖరు నెత్తుటిబొట్టు చిందేవరకూ పోరాడి, వీరస్వర్గాన్ని అలంకరించడం. ఈ రెండింటిలో మనకు ఏది ఆమోదయోగ్యమో, నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది. జాగ్రత్తగా ఆలోచించండి. మన కర్తవ్యం ఏంటో సూచించండి. సముచితమైన నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం నాకు శిరోధార్యం’’ అన్నారు మహారాజుగారు తన దళవాయిలవేపు నిశితంగా చూస్తూ.

అధికారులందరూ ఒకరి మొహాలొకరు అర్థవం తంగా చూసుకున్నారు. కొద్ది సమయం పాటు దీర్ఘాలోచనలో మునిగిపోయారు. తమలోతాము నెమ్మదిగా చర్చించుకున్నారు. తరవాత ‘మహారాజు గారికి సమాధానం చెప్పగలిగే అర్హతా, సామర్ద్యం కలవారు మీరు తప్ప వేరెవరు?’ అన్నట్టు మహాదళపతి వేపు సాభిప్రాయంగా చూపులు సారించారు. సహచరుల మనోభావాల్ని అర్థం చేసుకున్న సైన్యా ధ్యక్షుడు లేచి నిలుచున్నాడు. గొంతు సవరించు కొని…‘‘శత్రువుతో పోరాడదాం మహారాజా. అనంత పద్మనాభునిమీద ఆన, మడమ తిప్పొద్దు.’’ అని తమ అభిప్రాయాన్ని ముచ్చటగా మూడుముక్కల్లో తెలియ జేసాడు. ఆలయ ప్రాంగణం జయజయ ధ్వానాలతో మారుమ్రోగింది.

— – – – – – – – – – – –

కరతాళధ్వనులు సద్దుమణిగాక మహారాజు ‘‘మన శత్రువు బలవంతుడు. కపటీ, కుటిలవర్తనుడూ కూడా. వంచనలకూ పాల్పడడంలోనూ, జగడాలు సృష్టిం చడంలోనూ వాడిని తలదన్నేవాడీ భూప్రపంచంలోనే లేడు. అది మాత్రమే కాక, సుశిక్షితమైన సైనికశక్తీ, అపారమైన ఆయుధసంపత్తీ కలిగినవాడుకూడా. వాడి ఫిరంగులనూ, తుపాకులనూ ఎదుర్కొనడానికి, మన కున్న ముఖ్యమైన ఆయుధాలు మన పరాక్రమమూ, ధైర్యసాహసాలూ మాత్రమే. యుద్దం జరిగితే, అందులో మన ఓటమి తథ్యం. మనలో చాలామంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఈవిషయాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఈ సూచన చేస్తున్నారు కదా?’’ అని ప్రశ్నించారు సైన్యాధ్యక్షుడ్ని.

‘‘శత్రువు సైనికబలాన్నీ, వాడి ఉన్నతమైన ఆయుధసంపత్తినీ మేము విస్మరించలేదు మహారాజా. కుయుక్తులతో, ప్రలోభాలతో ఫిరాయింపులను ప్రోత్సహించి నాలుగుదశాబ్దాల క్రితం వంగదేశాన్ని వాడేవిధంగా ఆక్రమించుకున్నదీ మేము ఏనాడైనా మరచిపోతేకదా. యుద్దం అనివార్యమైతే, అందులో మనం విజయం సాధించే అవకాశం మృగ్యం అన్న విషయం మాకు పూర్తిగా తెలిసినదే మహారాజా’’ అని సమాధానం ఇచ్చాడు సైన్యాధిపతి.

‘‘మరైతే…..’’ అంటూ అర్దోక్తిలో, సందిగ్ధంగా ఆగిపోయారు మహారాజు.

సమాధానం వెంటనే ఇవ్వలేదు ముఖ్యదళపతి. కొన్ని నిమిషాలపాటూ మౌనం వహించాడు. తరవాత మహారాజువేపు నిశ్చలంగా చూస్తూ ‘‘దానికి కారణం ఒకటే మహారాజా. ఓడిపోతామనీ, యుద్ద రంగంలో మరణిస్తామనీ భయపడి శత్రువు ముందు మోకరిల్లి, వాడికి దాసోహమైతే, చరిత్ర మనల్ని క్షమిస్తుందా? భావితరాలకు ఎటువంటి సందేశాన్ని అందించిన వారమవుతాం మనం? జీవితం అశా శ్వతం మహారాజా. ఎప్పటికైనా మరణించవలసిన వారమే మనమంతా. కాని, ఆ మరణించేది ఆత్మ గౌరవం నిలుపుకునే ప్రయత్నంలో, యుద్దరంగంలో అసువులుబాస్తే, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాం. ఆచంద్రతారార్కమూ ప్రజలచే కొనియాడ బడతాం. భావితరాల వారిలో స్పూర్తినీ, చైతన్యాన్నీ నింపినవారమౌతాం. అందుకే మహారాజా, శత్రువు ఎంత బలవంతుడైనా వెనుకంజవేసే ప్రసక్తేలేదు. సింహాల్లా పోరాడతాం. సంతోషంగా ప్రాణత్యాగం చేస్తాం. వీరస్వర్గం అలంకరిస్తాం’’ అని ఆవేశంగా ప్రత్యుత్తరం ఇవ్వగానే పట్టరాని ఆనందంతో ఆసనం నుండిలేచి రామచంద్ర రాజుని ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నారు చినవిజయరామరాజు.

— – – – – – – – – – – –

ఎనిమిదవ తారీఖు…

పద్మనాభానికి ఇరవైకోసుల దూరంలోనున్న విశాఖపట్నంలో, ఆంగ్లసైనికాధి కారి ‘కల్నల్‌ ‌పెండర్గాస్ట్’ ‌తో ములాకత్‌కై అతని బంగళా బయట, ఆతృతగా ఎదురుచూస్తున్నాడు పూసపాటి సీతారామ రాజు. అతనెవరో కాదు. చినవిజయరామ రాజుకు స్వయానా సవతిఅన్న. కొద్దికాలం క్రితంవరకూ విజయనగర సంస్థానాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన ‘దివాన్‌ ‌బహదూర్‌’ ‌కూడా.

విజయనగరమహారాజైన పెదవిజయరామరాజు ఆకస్మికంగా స్వర్గస్థుడైన పిమ్మట ఆయన కుమారుడు చినవిజయరామరాజు సింహాసనాన్ని అధిరోహిం చాడు. అప్పటికి చినవిజయరామరాజు ముక్కుపచ్చ లారని పదిసంవత్సరాల బాలుడు. దానితో రాజ్యానికి దివానుగానున్న అతని సవతిఅన్న సీతారామరాజు రాజ ప్రతినిథిగా పరిపాలన సాగించాడు. సీతారామ రాజు స్వతహాగా అహంకారి. అపరిమితమైన అధికార దాహం కలవాడు. విజయనగరానికి చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న జమిందారీలను బలప్రయోగంద్వారా లోబరచుకున్నాడు. ప్రజా కంటకుడిగామారి ప్రజలను అనేకమైన కష్టాలకు గురిచేయసాగాడు.

అది సహించలేని చినవిజయరామరాజు యుక్త వయసు రాగానే పాలనాపగ్గాలు తనచేతుల్లోకి తీసుకోవడమేకాక, సీతారామరాజును పదవీచ్యుతుని గావించాడు. ప్రజోపయోగమైన సంస్కరణలు అనేకమైన వాటికి శ్రీకారం చుట్టి, ప్రజాను రంజకంగా పరిపాలన సాగించడం మొదలుబెట్టాడు. అవమాన భారంతో రగిలిపోయిన సీతారామరాజు చెన్నపట్నానికి మకాం మార్చాడు. కుంఫిణీ అధికారులను వక్ర మార్గాలద్వారా తనవేపుకు మళ్లించుకున్నాడు. తమ్ముడన్న అభిమానం ఇసుమంతైనాలేకుండా, చినవిజయరామరాజుకు అనేకమైన ఇబ్బందులు సృష్టించడంలో సఫలీకృత్యుడయ్యాడు. దొరతనంవారు ఏకపక్షంగా ‘పేష్కసు’ హెచ్చించడానికీ, వాయిదాలపై బకాయి చెల్లించే వెసులుబాటు ఇవ్వ నిరాకరించ డానికీ సీతారామరాజు సాగించిన కుటిలరాజకీయమే ముఖ్యకారణం. అంతేకాక, విజయనగరసంస్థానంలో అధికారి అయిన ‘కాండ్రేగుల జోగిపంతులు’తో పాటు, మరికొంతమందిని తనవేపుకు తిప్పుకొని, రాజ్యంలో అరాచకం సృష్టించడానికి అతను చేయని ప్రయత్నం లేదు. చివరకు చినవిజయరామరాజు రాజ్యభ్రష్టుడై, మచిలీపట్నానికి బహిష్కరించబడడానికి సీతారామ రాజు నెరపిన దుష్ట మంత్రాంగమే తప్ప, వేరుకారణం లేదనడంలో ఏవిధమైన సందేహానికీ తావులేదు.

అటువంటి దేశద్రోహి, ఆనాడు, కల్నల్‌ ‌పెండర్గాస్ట్‌తో రహస్యచర్చలలో నిర్లజ్జగా నిమగ్నమై ఉన్నాడు. అనుచరగణ సహాయంతో తెలుసుకున్న విజయ రామరాజు ఆచూకీ ఎటువంటి అపరాధ భావమూ లేకుండా శత్రువుకు అందజేసాడు. అంతేకాక, మహారాజును తుదముట్టించడానికి సన్నద్దమౌతున్న పటాలాని కి పెండర్గాస్టే స్వయంగా నాయకత్వం వహించేలా అతడ్ని అంగీకరింప జేయడంలో కృతకృత్యుడయ్యాడు. తరవాత, విజయనగరరాజ్యలక్ష్మి తనవశమైనట్టూ, తాను యావత్కళింగాంధ్రకే మహారాజునైనట్టూ కలలుకంటూ తన బసకు చేరుకొని నిశ్చింతగా నిద్రపోయాడు.

— – – – – – – – – – – –

‘భీమునిపట్నం’ పద్మనాభం గ్రామానికి పది పన్నెండు కోసుల దూరంలోనున్న ప్రముఖమైన రేవుపట్టణం. అశోకుని కాలంనాటికే తూర్పు భారతంలో ప్రధానమైన ఓడరేవుగా విలసిల్లిన నగరం. సింహళదేశంలో బౌద్దాన్ని వ్యాపింపచేసిన బౌద్దభిక్షువులు అక్కడినుండే ప్రయాణించారన్నది ఇతిహాసం. తరువాతికాలంలో అది డచ్చివారి వ్యాపారకేంద్రంగా ఒక వెలుగు వెలిగి, పెదవిజయ రామరాజు దాతృత్వం వలన అంగ్లేయుల అధీనం లోకి బదలాయించబడినది. ఓడరేవుగా మాత్రమేకాక, ఆంగ్లసైన్యం శాశ్వతంగా మకాం చేసియున్న సైనికస్థావరంగా కూడా విరాజిల్లుతున్న గొప్ప నగరం.

అక్కడ విడిదిచేసియున్న ఫిరంగీల ఫౌజు, ‘పద్మనాభం’ మీదికి దాడికి సంసిద్దమౌతున్నట్టూ, దానికి కల్నల్‌ ‌పెండర్గాస్టే స్వయంగా నాయకత్వం వహిస్తున్నట్టూ వేగులద్వారా సమాచారం అందింది. దానితో, ముఖ్యదళపతితో సహా సర్దారులందరినీ సమావేశపరిచారు మహారాజు. తమ బలగాలను ఎక్కడ, ఎలా మోహరించాలో, శత్రువును ఎదురుదెబ్బ ఎలా తీయాలో కూలంకుషంగా చర్చించి, పటి•ష్టమైన యుద్దతంత్రాన్ని రూపొందించారు. శత్రుపటాలం కదలికలను ఎప్పటికప్పుడు తమకు చేరవేయడానికి మరికొంతమంది చారులను అదనంగా రంగంలోకి దించారు. యుద్దసన్నాహాలు పూర్తిచేసుకొని శత్రువుల రాకకోసం సంసిద్దతతో ఎదురుచూస్తున్నారు.

— – – – – – – – – – – –

ఇంగ్లీషు పటాలం ‘పద్మనాభం’వేపు సావ కాశంగా కదులుతున్న వర్తమానం వచ్చింది. శత్రు సైన్యంలో పన్నెండువందల కాల్బలం, అధునాతనమైన తుపాకులూ మాత్రమేకాక, శక్తివంతమైన రెండు ఫిరంగులుకూడా ఉన్న విషయం కూడా తెలియ వచ్చింది. అయితే ‘జరగబోయే యుద్దంలో పర్యవ సానం ఎలా ఉండబోతోంది’ అన్న విషయంలో ఏవిదమైన భ్రమలూ లేని విజయనగర సైన్యం ఎలాంటి కలవరపాటుకూ లోనుకాకుండా, గెలుపు ఓటములను సమదృష్టితో వీక్షించే స్థితప్రజ్ఞులవలే నిశ్చింతగా, నిర్భయంగా, విరోధి రాక కోసం ఎదురు చూస్తున్నారు.

— – – – – – – – – – – –

తొమ్మిదవ తారీఖు…

తెల్లగా తెల్లవారింది. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. తుఫాను ముందు ప్రశాంతతను తలపింపజేస్తోంది. రాత్రంతా నిద్రలేమితో అశాం తిగా గడిపిన మహారాజు, అంతవరకూ వాయిదా వేస్తూ వచ్చిన అతిముఖ్యమైన నిర్ణయాన్ని, ఎట్టకేలకూ తీసుకున్నారు. తన పట్టపురాణినీ, యువరాజు నారాయణగజపతినీ తన సమక్షానికి పిలువనంపారు. ఆత్మగౌరవాన్నీ, పూసపాటివంశ ప్రతిష్టనూ సంరక్షిం చుకునే ప్రయత్నంలో ఆంగ్లేయు లతో యుద్దం మినహా వేరుమార్గం లేదనీ, అందులో తాము పరాజయం పాలుకావడం తథ్యమనీ, ప్రాణాలు కోల్పోయే ప్రమాదంకూడా పొంచిఉందనీ వారికి సున్నితంగా విశదీకరించారు. ప్రాణాధికమైన అర్ధాంగినీ, ప్రాణ సమానమైన వంశాకురాన్నీ రక్షించు కోవడానికి వారిని సురక్షితప్రదేశానికి తరలించడం తప్ప వేరుమార్గం లేదని స్పష్టంచేసారు. చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మహారాణిని ఓదార్చి ఆమె కంటనీరు తుడిచారు. యువరాజును ప్రేమగా హృదయానికి హత్తుకొని, ఆశీర్వదించారు. తల్లిని జాగ్రత్తగా చూసుకో వలసినదిగా కుమారుని ఆజ్ఞాపించి, తమకు అత్యంత విధేయుడూ, విశ్వాస పాత్రుడూనైన కాకర్లపూడి బాపిరాజుతో ‘కాశీపురం’ సంస్థానానికి సాగ నంపారు. తరవాత, రోజంతా సర్దారులతోనూ సైనికులతోనూ యుద్ధతంత్రాన్ని చర్చిస్తూ గడిపారు.

— – – – – – – – – – – –

పదవతారీఖు… లక్ష్మీవారం… తెల్లవారుజాము ఐదుగంటల సమయం. చిన్నకుందేలు వంటి విజయనగరసంస్థానపు సైన్యంపై, వేటకుక్కల్లాంటి ఆంగ్లేయులు వికృతంగా విరుచుకుపడిన దుర్దినం. అయితే, తాము వేటాడుతున్నది తాటాకుచప్పుళ్లకు బెదిరే సామాన్యమైన కుందేలు మాత్రంకాదనీ, హరిహర బుక్కరాయల వేటకుక్కలకు ఎదురుతిరిగి వాటిని తరిమికొట్టిన కుందేళ్లవంటి శౌర్యమైన కుందేలనీ, వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న దినంకూడా. అనంతపద్మనాభుని సన్నిధిలో ధ్యానంలో నిమగ్నమైఉన్న మహారాజుకు ఫిరంగులు పేలుతున్న చప్పుడుకు ధ్యానభంగం అయ్యింది. ఒక్క ఉదుటున ఆలయంలోనుండి బయటకు వచ్చారు. అప్పటికే తుపాకులు కాలుస్తూ నలువేపులనుండీ ఆకలిగొన్న తోడేళ్లగుంపుల్లా దాడికి తెగబడ్డారు ఆంగ్లసైనికులు. వారి రాకకొరకు ఎదురుచూస్తున్న విజయనగర సైనికులు వారిని వీరోచితంగా ఎదుర్కొన్నారు. తమవారిని యుద్దానికి ఉత్తేజపరుస్తూ, అప్పటికే కదనరంగంలోకి దూకారు విజయనగర సరదారులు. పరిస్థితిని అవలోకించిన చినవిజయరామరాజు కళ్లు క్రోధంతో ఎరుపెక్కాయి. అప్రయత్నంగా ఎడమచేయి మీసాన్ని మెలివేసింది. కుడిచేత్తో కరవాలాన్ని అందిపుచ్చుకొని ‘జై అనంతపద్మనాభా’ అని గర్జిస్తూ, మృగరాజులా కదనరంగంలోకి ఉరికారు.

యుద్దం మొదలై దాదాపు రెండుగంటలు కావస్తోంది. పోరు ముమ్మరంగా సాగుతోంది. విజయనగర సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కాని శత్రువు తుపాకుల ధాటికి నిలువలేకపోతున్నారు. పదుల సంఖ్యలో నేలరాలు తున్నారు.

మహారాజు కళ్లముందే కాకలు తీరిన సర్దారులు ఒకరొకరే నేల కొరిగిపోయారు. పెద్దపులిలా పోరాడుతున్న సైన్యాధిపతి రామచంద్రరాజు ఫిరంగీల తుపాకిగుళ్లకు కూలిపోయాడు. అగ్నిగోళాల్లాంటి గుళ్లవర్షం కురిపిస్తున్న ఫిరంగులను నిర్వీర్యంచేసే సాహసంలో దాట్ల వెంకటపతిరాజూ, పూసపాటి విజయగోపాలరాజూ దంతులూరి అప్పలరాజులు అసువులుబాసారు.

ఎదురొచ్చిన శత్రుసైనికులను తన కరవాలానికి బలిచేస్తూ, సైనికులలో ఉత్సాహాన్ని రగిలిస్తూ, మధ్యాహ్నమార్తాండునిలా స్వైరవిహారం చేస్తున్నారు విజయరామరాజు. ఎత్తైన గుట్టపై నిలుచొని జరుగుతున్న మారణహోమాన్ని పైశాచికానందంతో వీక్షిస్తున్న కల్నల్‌ ‌పెండర్గాస్టూ, సీతారామరాజులు శత్రుసంహారంగావిస్తున్న మహారాజును చూసి పట్టరాని కోపంతో వణికిపోయారు. ఆయనను అంతమొందించనిది విజయనగర సైనికులు ఆయుధాలు త్యజించరనీ, యుద్దం ఆగదని గ్రహించిన సీతారామరాజు తన చేతనున్న తుపాకితో గురిచూసి కాల్చాడు. అయితే, గురితప్పిన గుండు చినవిజయ రామరాజు మణికట్టును తాకింది. చిన్నపాటి గాయమై రక్తం స్రవించసాగింది. మహారాజుకు రక్షణగా నిలబడి పోరాడుతున్న సర్దారులు…వత్సవాయి నరసరాజూ, జంపన వెంకట్రామ రాజులు జరిగిన విపత్తును గ్రహించి, సురక్షితప్రాంతానికి తరలించే లోపే, పెండర్గాస్ట్ ‌పేల్చిన మరొక తూటా సూటిగా ఆయన గుండెల్లోకి దూసుకొని పోయింది. తీవ్రంగా గాయపడ్డ చినవిజయరామరాజు ప్రాణాలు లిప్తపాటు కాలంలోనే అనంతవాయువుల్లో లీనమైపోయాయి. విజయనగరమహారాజు వాంఛించినట్టుగానే, వీరస్వర్గం అలంకరించారు.

— – – – – – – – – – – –

అనంతరం… యుద్దం ముగిసింది. విజయనగర సైన్యం ఓటమిని అంగీకరించింది. అనంతపద్మనాభుని సాక్షిగా విజయనగరం కోటమీద ఆంగ్లేయుల జెండా శాశ్వతంగా రెపరెపలాడింది.

(విజయనగర జమీందారు, పూసపాటి విజయ రామగజపతి (చినవిజయరామరాజు) ఆంగ్లేయులను దిక్కరించడం, దేశబహిష్కార శిక్ష విధించబడి, మచిలీ పట్నానికి తరలించబడే సమయంలో, ‘పద్మనాభం’ గ్రామం దగ్గర వారినుండి తప్పించుకోవడం, తరువాత ఇంగ్లీషువారితో జరిగిన ‘‘పద్మనాభయుద్దం’’లో అసు వులుబాయడం ఇదంతా వాస్తవం… చరిత్ర).

About Author

By editor

Twitter
YOUTUBE