– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన


‘‘అయితే రేపు మార్నింగ్‌ ఎన్ని గంటలకు వెళ్తే బావుంటుంది. తరవాత చెప్పండి.’’

సరే అన్నట్లు తలూపింది. మళ్లీ వెంటనే ఆలోచనలో పడింది. ఈ సంగతి ముందు అమ్మా వాళ్లకి చెప్పాలి. అంకుల్‌కి తెలియాలి. ఒక్కరోజులో ఢిల్లీ చూపించడం అవుతుందా, కాదు. ఒక్కరోజులో అంటే ఏడు గంటలకైనా బయల్దేరాలి. ఏడు గంటలంటే చాలా ముందు లేవాలి, ఈ చలిలో మరీ పొద్దున్న లేవడం కష్టం. ఆమె మనసు గ్రహించినట్లున్నాడు.

‘‘మీరు ఇక్కడ ఎక్కడుంటున్నారు?’’ అని అడిగాడు.

‘‘నొయిడాలో ఉంటున్నాం. మరి మీరు ఎక్కడ దిగారు?’’

‘‘నేను గుర్‌‌గ్రాంలో వాంబ్లీ ఎస్టేట్‌లోని అంకుల్‌ ‌వాళ్లింట్లో ఉంటున్నాను. ఇవాళ తెల్లవారుఝామున ఏర్పోర్ట్‌కి వచ్చి, నన్ను రిసీవ్‌ ‌చేసుకుని వాళ్లింటికి తీసుకెళ్లారు.’’

‘‘అబ్బా దూరం. గుర్‌‌గ్రాం అంటే హర్యానాలోకి వస్తుంది. మేమున్నది నొయిడాలో. అది యూపీలోకి వస్తుంది. ఇదో మూలా, అదో మూలా. తూర్పూ, పడమర. అందుకని టైం వేస్ట్ ‌కాకుండా, అక్కడా ఇక్కడా కాకుండా మధ్యలో ఎక్కడో ఒకచోట కలుసుకుంటే బావుంటుందనిపిస్తోంది. సీపీ, అంటే కన్నాట్‌ ‌ప్లేస్‌లో కలుసుకుంటే బావుంటుంది. ఓ విధంగా చారిత్రాత్మక ప్రాముఖ్యం ఉన్న ఆ ప్లేస్‌ ‌కూడా చూసినట్లవుతుంది.’’ ఎంతో పరిచయం ఉన్నట్లుగా గబగబా మాట్లాడింది.

‘‘మీ ఇష్టం. ఢిల్లీలో ఎక్కడికి తీసుకెళ్లినా ఫరవా లేదు. నేను మొదటిసారి వస్తున్నాను. ఒక్కరోజులో ఏవి వీలయితే అవి. అయినా అంకుల్‌ని కూడా అడుగుతాను.’’

వాళ్లు మాట్లాడుతూండగానే విజయ బాల్కనీలోకి వచ్చింది.

‘‘సారీ డిస్టర్బ్ ‌చేస్తున్నాను. ఎనిమిదైపోయింది, భోజనానికి వచ్చేయండి. తింటూ మాట్లాడుకోవచ్చు’’ అంటూ ఇద్దరినీ చూసింది. వెళ్దాం అన్నట్టు సుధీర కేసి చూసి, తల ఊపాడు.

‘‘దేశ రాజధానికొచ్చాక ఏదీ చూడకుండా వెళ్లడం ఎలా?’’ లోపలికి వెళ్లాక ప్లేట్‌లో వడ్డించుకుంటూ అప్పారావుని చూస్తూ అన్నాడు.

‘‘అవును, నిజమే. చూడకుండా ఎలా వెళ్తావ్‌? అన్నీ కాకపోయినా కొన్నైనా చూడాల్సిందే’’

‘‘కానీ నిన్నెవరు తీసుకెళ్తారు, ఎవరు చూపిస్తారు. నాకైతే కష్టం’’ అని సుధాకర్‌ అన్నాడు.

తను ఢిల్లీ చూడాలనుకుంటున్నానని, ఆ విషయాన్ని ముందే సుధీరని అడిగానని విక్రాంత్‌ ‌చెప్పలేదు.

‘‘మంచి ఆలోచన. విక్రాంత్‌, అసలు మేమే నీకు చూపించేవాళ్లం. కానీ మాకు ఆఫీసుంది. నాకే కాదు మా అందరికీ కూడా ఉంది. సుధీరా, నువ్వు ఓ రోజు సెలవు పెట్టుకుని విక్రాంత్‌కి ఢిల్లీ చూపించకూడదా. ఏం చూపిస్తావో, ఎక్కడికి తీసుకెళ్తావో అది నీ ఇష్టం’’ అని విజయ అంది.

సుధీర తల్లిని చూసింది. స్వర్ణ, భాస్కర్‌రావు వైపు చూసింది. అలాగే అన్నట్లు తలూపాడు.

సుధీర ఇబ్బందిగా తండ్రిని చూసింది. అదేం పట్టించుకోలేదు భాస్కర్‌రావు.

‘‘సుధీ.. నీకు సెలవులుండిపోయాయని అన్నావు, విక్రాంత్‌ని నువ్వే తీసుకెళ్లి చూపించు’’ ఆమెకి మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే స్వర్ణ అనేసింది.

 అప్పుడు ఆమెకి తన ఆఫీసూ, అదీ గుర్తొచ్చింది. తల్లి అన్నట్లుగానే సెలవులున్నాయి. సెలవు పెట్టడానికి అభ్యంతరం ఏం లేదు. కానీ వెంటనే తల ఊపితే బావుండదని ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టింది.

 అందరూ కలిసి డిసైడ్‌ ‌చేసారు. సుధీర విక్రాంత్‌ని తీసుకెళ్లాలని, సీపీ అయితే బావుంటుందని. ఆ చుట్టు పక్కల ఉన్నవి చూపించేస్తే సరిపోతుందని పోగ్రాం వేసేసారు.

తన కారునివ్వడానికి భాస్కర్‌రావు సిద్ధపడ్డాడు.

‘‘ఓకే. సుధీర తొమ్మిది గంటలకి వస్తుంది. అప్పటికి మంచుతెరలు కరిగి పోతాయి, డ్రైవింగ్‌ ‌కూడా పెద్ద కష్టం కాదు.’’ అని మరోసారి సుధీర తరఫున తండ్రి మాట్లాడాడు.

 భోజనాలు చేస్తున్నంత సేపు విక్రాంత్‌ ఎక్కువ మాట్లాడాడు. మధ్య మధ్య సుధీరని చూస్తున్నాడు. అది అందరూ గమనించారు. కానీ చూడనట్లుగానే ఉన్నారు. ఆఖరున స్వీటు తీసుకుని సుధీర దగ్గరికెళ్లి నుంచుని మాట్లాడడం కూడా అందరూ చూసారు.

 కార్లో కూచున్నాకా స్వర్ణ, భాస్కర్‌రావులు ఇద్దరూ సుధాకర్‌ ఇం‌టికొచ్చిన వాళ్ల గురించి, విజయ చేసిన వంటల గురించి, వచ్చిన బంధువులు, వాళ్ల ఆస్తిపాస్తుల గురించి, వాళ్లకి తెలిసిన వాళ్ల గురించి ఎక్కడివో చుట్టరికాలు తీసి మాట్లాడుకున్నారు. వాళ్ల మాటల్లో విక్రాంత్‌ ‌గురించి రాలేదు.

 కానీ సుధీర మాత్రం విక్రాంత్‌ ‌గురించి ఆలోచిస్తోంది. మర్నాడు ఏ డ్రెస్‌ ‌వేసుకోవాలి, విక్రాంత్‌ని కలుసుకున్నాకా ఎక్కడికి తీసుకెళ్లాలి, బ్రేక్‌ఫాస్ట్ ‌సీపీలో ఎక్కడ చేస్తే బావుంటుందో, లంచ్‌ ‌కూడా చెయ్యాలి, ఆ దగ్గర్లో ఏం ఉన్నాయో అసలు ఎన్ని కవర్‌ ‌చెయ్యగలదో అనే దాని మీద ఆలోచనలో ఉంది.

 ఇంటికెళ్లాకా వెంటనే ఒంట్లో బాగాలేదని మర్నాడు ఆఫీసుకి రానని, అంశూకి, బాస్‌కి మెయిల్‌ ‌పెట్టింది.

 తండ్రిని అడిగి విక్రాంత్‌ ఇం‌డియా నంబరు తీసుకుంది. వాళ్లింటికి ఫోన్‌ ‌చేసి, విక్రాంత్‌ని తొమ్మిది గంటలకి పాలికా బజార్‌ ‌దగ్గర ఉండమని చెప్పమని తండ్రికి చెప్పింది.

మర్నాడు తొమ్మిది గంటలకి సుధీర తయారయింది.

జీన్స్ ‌వేసుకుని పైన ఓ గులాబీ రంగు గళ్లషర్టు వేసుకుంది. ఆపైన నల్ల స్వెటర్‌ ‌వేసుకుంది. రెండు భుజాల మీద వదిలేసిన జుట్టు పడుతోంది. లైట్‌గా మేకప్‌ ‌చేసుకుంది. మాయిశ్చరైజర్‌ ‌రాసుకున్న మొహం నున్నగా మెరిసిపోతోంది. చిన్న బొట్టు పెట్టుకుంది. తల్లి సంతృప్తిగా చూసింది.

‘‘పర్సులో కాస్త ఎక్కవ డబ్బే పెట్టుకో. బ్రేక్‌ఫాస్ట్, ‌లంచ్‌ ‌కూడా చెయ్యాలి, నువ్వే బిల్‌ ‌కట్టెయ్యి. అతని దగ్గర మన ఇండియన్‌ ‌కరెన్సీ ఉండకపోవచ్చు’’

‘‘ఆ విషయం నాకు తెలుసు. క్యాష్‌ ఎక్కువ పెట్టుకునే అలవాటు లేదు. అన్నింటికి కార్డు వాడుతాను కదా ఇప్పుడు కూడా అంతే’’ అంటూ భుజానికి బ్యాగ్‌ ‌తగిలించుకుంది.

‘‘లైసెన్స్, ‌కార్డులు అవీ పెట్టుకో, మర్చిపోకు..’’

‘‘అన్నీ చూసుకున్నానులే’’ కారు తాళంచెవి తీసుకుని టేబుల్‌ ‌దగ్గర కూచుంది..

 తండ్రి వెళ్లిపోయారని అర్థం అయింది. ఎలా వెళ్లారని అడగలేదు. మెట్రోలో వెళ్లి టాక్సీ చూసుకుని వెళ్తారు. ఇదివరకు చాలాసార్లు అలాగే వెళ్లారు.

బిస్కెట్లు తిని, టీ తాగి బయల్దేరే ముందు విక్రాంత్‌కి ఫోన్‌ ‌చేసింది.

‘‘నేను సుధీరని, మీరు తయారయ్యారా. ఇప్పుడు టైం సరిగ్గా ఎనిమిదయింది. నేను బయల్దేరుతున్నాను, తొమ్మిది గంటలకి పాలికా బజార్‌ ‌దగ్గర నేను మిమ్మల్ని కలుస్తాను. మీరు కూడా అక్కడికే వచ్చేయండి. ఇది నా నంబరు సేవ్‌ ‌చేసుకోండి’’

 ఓ గంట తరవాత పాలికా బజార్‌ ‌చేరుకున్నాకా, రెండు సార్లు ఫోన్‌ ‌చేసి విక్రాంత్‌ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్లింది. అంతకు ముందు రోజే చూసినా వెంటనే గుర్తు పట్టలేకపోయింది. విక్రాంత్‌ ‌సుధీరని చూడగానే చేయి ఊపాడు. పగలు వేరుగా ఉన్నాడు అని అనుకుంది. జీన్స్ ‌పైన లేత నీలం పోలో నెక్‌ ‌స్వెటర్‌లో ఉన్న విక్రాంత్‌ని చూడగానే హాండ్సమ్‌గా ఉంటాడు అని అనుకుంది.

‘‘హాయ్‌’’ అం‌టూ దగ్గరికి వచ్చాడు.

ఇద్దరూ కారు పార్క్ ‌చేసిన దగ్గరికి వెళ్లారు. సుధీర కొంచెం వంగి కారు తలుపు తీసింది.

‘‘ట్రాఫిక్‌ ‌చాలా ఎక్కువగా ఉంది’’ అని అంటూ కూచున్నాడు.

‘‘అవును. ఈ టైంలో గుర్‌‌గ్రాం నుంచి వచ్చే చాలా మంది ఆఫీసులు ఇక్కడే ఢిల్లీలో ఉంటాయి. మొదట్లో మా ఆఫీసు కూడా గుర్‌‌గ్రాంలో ఉండేది. నేను మా ఇంటినుంచి మెట్రోలో వెళ్లి అక్కడి నుంచి నడిచి వెళ్లే దాన్ని.’’

‘‘ఇప్పుడు కూడానా..’’

‘‘ఇప్పుడు కాదు. మా కంపెనీ నొయిడాలో బ్రాంచ్‌ ‌పెట్టింది. నేను రిక్వెస్ట్ ‌చేసి మార్చుకున్నాను.’’

‘‘ఇది దగ్గరా…’’

‘‘ఫరవాలేదు. మరీ అంత దూరం కాదు. మేం ఉండేది సెక్టార్‌ ‌యాభై ఒకటి. ఆఫీసు ఇరవై ఎనిమిది. ఇది కూడా యూపీలోకి వస్తుంది. అంతే’’

‘‘వెళ్దామా’’ అంటూ విక్రాంత్‌ని చూస్తూ, సీట్‌ ‌బెల్ట్ ‌తగిలించుకుంది.

అలాగే అన్నట్లుగా ఆమెని చూసి విక్రాంత్‌ ‌కూడా సీట్‌ ‌బెల్ట్ ‌పెట్టుకున్నాడు.

 ‘‘మనం సాయంత్రం ఆరు వరకూ ఎన్ని వీలైతే అన్ని చూద్దాం. ముందు బ్రేక్‌ఫాస్ట్ ‌చేద్దాం. ఢిల్లీ ఫేమస్‌ ఈట్‌‌స్ట్రీట్‌కి వెళ్దాం. అన్నీ బావుంటాయి. తప్పకుండా రుచి చూడాల్సిందే. వెళ్తూ దార్లోనే ఎర్రకోటని పైనుంచి చూడవచ్చు.’’

‘‘ఏది చూపించినా ఫరవాలేదు.’’

‘‘అలాగే. ఇది కన్నాట్‌ ‌ప్లేస్‌. ‌బ్రిటిష్‌ ‌వాళ్లు కట్టినది. అన్ని రకాల రెస్టారెంట్లూ, బ్యాంకులూ, సినిమా హాళ్లూ, షాపింగ్‌ ‌సెంటర్లూ అన్నీ ఉన్నాయి. సౌత్‌ ఇం‌డియన్‌ ‌బ్రేక్‌ఫాస్ట్ అం‌టే శరవణకి వెళ్దాం. లేదంటే బ్రంచ్‌ ‌చేసినట్లవుతుందంటే చాందినీ చౌక్‌ ‌వెళ్దాం. అక్కడ నార్త్ ‌వెరైటీలు అన్నిరకాలు దొరుకుతాయి. అది అసలైన ఢిల్లీ. ఆ సన్న సన్న సందులు, వందల ఏళ్ల నాటి దుకాణాలు, అన్నీ ఓ లివింగ్‌ ‌మ్యూజియంలా ఉంటుంది.’’

‘‘అయితే అక్కడికే వెళ్దాం’’

‘‘అయితే దానికన్నా ముందు ఓసారి కన్నాట్‌ ‌ప్లేస్‌లో వాకింగ్‌ ‌చేస్తే బావుంటుంది. ఇదో అనుభవం. ఈ అనుభవం కోసం మనం శరవణకి వెళ్లి మంచి కాఫీ తాగాల్సిందే. ఓ వైపు ఢిల్లీని కాస్త చూసినట్లవుతుంది. ఓకే..’’

చలికాలం మూలంగా అందరూ కోట్లు, ఫుల్‌ ‌స్వెటర్లూ, మఫ్లర్లూ, టోపీలూ పెట్టుకుని గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. అటూ ఇటూ తిప్పీ పార్కింగ్‌లో కారు ఉంచింది. ఇద్దరూ దిగి నడుచుకుంటూ దుకాణాల ముందు నుంచి నడుస్తూ శరవణలోకి వెళ్లారు. ఆమెకి ఈ అనుభవం కొత్తగా లేదు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నోసార్లు ఎంతో మందితో కలిసి వచ్చింది. అందులో మగవాళ్లు, క్లాస్‌ ‌మేట్స్, ‌కొలీగ్స్, ఆడవాళ్లూ అందరూ ఉన్నారు. అందుకే ఇప్పుడు విక్రాంత్‌తో రావడంలో ఏం తేడా కనిపించలేదు.

శరవణ రష్‌గా ఉంది. ఓ మూల ఖాళీ ఉంటే అక్కడికి వెళ్లి కూచున్నారు.

‘‘మీరు చాలా అందంగా ఉంటారు.’’ అన్నాడు హఠాత్తుగా.

‘‘నిన్న అన్నారు కదా… థాంక్స్’’ అం‌టూ నవ్వి, కాఫీ ఆర్డర్‌ ‌చేసింది.

 విక్రాంత్‌ ‌నవ్వి, తనుంటున్న ఏరియా గురించి చెప్పడం మొదలు పెట్టాడు. తెలుగువాళ్లు, వీకెండ్‌ ‌పార్టీలు, ఇండియన్‌ ‌రెస్టారెంట్ల గురించి, వాటి ధరల గురించి, ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా ఇద్దరూ మాట్లాడుకున్నారు.

‘‘మీరు నా గెస్ట్. ‌నేను పే చేస్తాను’’ అంటు బిల్‌ ‌పే చేసింది. సినిమాల గురించి, హీరో, హీరోయిన్లు గురించి, పుస్తకాల గురించి ఇద్దరూ మాట్లాడు కున్నారు.

‘‘ప్రస్తుతానికి ఇంక ఏం అక్కర్లేదు. లంచ్‌ ‌టైంకి చూద్దాం’’ అంటూ కార్లో కూచున్నారు.

‘‘చాందినీ చౌక్‌ ‌తరవాత వెళ్దాం. ఎందుకంటే మన లంచ్‌ అక్కడే. అక్కడే ఉన్న దరీబాకెళ్దాం అక్కడ వెండి జువెల్లరీ షాపులుంటాయి. నేను హాంగింగ్స్ ‌కొనాలి. ఆ ఇరుకు సందులు, అటూ ఇటూ ఉన్న చిన్న షాపులు, అదంతా ఓ హెరిటేజ్‌. ఆ ‌షాపులన్నీ కూడా ఓ నూటయాభై ఏళ్ల నాటివి. అది మీరు తప్పకుండా చూడాల్సింది. అక్కడ పాత ఢిల్లీ, తినేందుకు వంద వెరైటీలు అవీ అన్ని ఏళ్ల నుంచి అలాగే తరాలుగా అవే రుచులతో మెయింటేన్‌ ‌చేస్తున్నారు. అక్కడ తినాల్సిందే. తినకపోతే మీ ట్రిప్‌ ఇన్‌కంప్లీట్‌.’’

‘‘ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. చాందినీ చౌక్‌ అం‌టున్నారు, అంటే ఏంటీ? చాందినీ అనే ఆమె ఉండేదా అక్కడ?’’ అంటూ నవ్వాడు విక్రాంత్‌.

‌సుధీర కూడా నవ్వేసింది.

‘‘కాదు. దీనికి ఆ పేరు రావడానికి కారణం అది కాదు, ఒకప్పుడు ఈ చాందినీ చౌక్‌లో అలీ మర్దాన్‌ఖాన్‌ ‌కాలువ ప్రవహిస్తూండేదిట’’ అంది సుధీర.

‘‘అంటే ఇప్పుడు లేదన్నమాట. హిస్టరీలో ఓ పేజి. ఓ అలాగా వెరీ ఇంట్రెస్టింగ్‌’’

‌మీరంతా ఢిల్లీలో ఉంటున్నారు కాబట్టి, ఢిల్లీ గురించి, దాని చరిత్ర మీకు తెలియాలి. దాని మీద క్లాసులో మాట్లాడాలని ఇంగ్లిష్‌ ‌లెక్చరర్‌ అనడంతో స్టూడెంట్స్ అం‌దరూ బలవంతంగా నెట్‌, ‌గూగూల్‌, ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారి పుస్తకాలు చదివి ఢిల్లీ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సుధీర జ్ఞానం ఆనాటిదే. ఆ లెక్చరర్‌ ‌పుణ్యమే.’’

‘‘నిజమా. నమ్మడం కష్టమే. జస్ట్ ‌బియాండ్‌ ‌మై ఇమాజినేషన్‌’’

‘‘‌మీరే కాదు, ఎవరూ నమ్మరు. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి దృశ్యాలు అవి.’’

‘‘షాజహాన్‌ ‌కూతురు జహాఁనారా మంచి సౌందర్య పిపాసి. ఆమె డిజైన్లు వేసి, ఉద్యాన వనాలూ అవీ కట్టించేదిట. ఈ చాందినీ చౌక్‌ ‌కూడా ఆమె సృష్టి. ఇక్కడ అందమైన కాలువ పారుతూండేదిట. అటూ ఇటూ పెద్ద చెట్లుండేవిట. పున్నమి రోజుల్లో చంద్రుడి వెలుగులు నీళ్ల మీద పడి ఈ వీధులన్నీ వెండిలా తళతళా మెరిసిపోయేవట. వెండి దారులు మూలంగా దీన్ని చాందినీ చౌక్‌ అని అన్నారు. ఇప్పుడు అదేం లేకపోయినా పేరు అలాగే ఉండిపోయింది.’’

కారులోంచే ఎర్రకోట. అక్కడే ఉన్న ఓ రెండు గేట్లూ చూసారు, రాష్ట్రపతి భవన్‌, అం‌దంగా ఉన్న గుబురు చెట్ల మధ్య వరసగా ఉన్న వివిధ దేశాల ఎంబెసీలు, లోపలకి వెళ్లకుండానే శాంతివన్‌, ‌విజయఘాట్‌, ‌శక్తిస్థల్‌ అన్నీ చూపించింది.

‘‘ఢిల్లీ అందమైన నగరం’’ అని అన్నాడు, అన్నీ చూసాక.

‘‘అసలు ఆ మాట అమీర్‌ ‌ఖుస్రో ఎప్పుడో అన్నాడు. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది’’ అని.

‘‘ఈ అందమైన నగరాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. అమీర్‌ ‌ఖుస్రో అన్నది నిజం. ఇది అందమైన నగరమే. నో డౌట్‌.’’ అని అన్నాడు.

‘‘ఇది అందమైనది ఒక్కటే కాదు, చరిత్రలు సృష్టించిన నగరం. ధర్మరాజు ఇందప్రస్థం నుంచి ఈనాటి వరకూ ఈ సిటీ బార్న్ ‌టు పవర్‌, ‌వార్‌ ఆఫ్‌ ‌గ్లోరీ. ప్రతీ చోట, ప్రతీ రేణువులో చరిత్ర వాసనలు. ఎన్నో నాగరికతలు, ఎన్నో వంశాలు. ఎన్నో తరాలు ఈ నగరాన్ని ఏలాయి. ఈ దేశాన్ని ఆక్రమించుకున్న ప్రతీ వాడికి ఢిల్లీ ఓ ఉంచుకున్నదై పోయింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE