– గంటి భానుమతి
జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీ(2021)లో మొదటి బహుమతి పొందిన రచన
‘‘అంటే రానంటావా?’’ అక్కడే నుంచుని బయటినుంచి అంది.
‘‘అంతే. రాను.’’ లోపల్నించి అంది.
‘‘అలా కాదు. వాళ్లు నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పారుట. అందుకని నాన్నగారు నిన్ను కూడా రమ్మంటున్నారు.’’ అని బయటినుంచే అంది.
‘‘సారీ మమ్మీ, నేను రాను. నాకు టైం దొరికేదే తక్కువ, దాన్ని కూడా వాళ్లింటికీ, వీళ్లింటికీ అని రమ్మనకు.’’
చేసేది లేక స్వర్ణ అక్కడే ఉన్న మంచం మీద కూర్చుని కూతురు కోసం ఎదురుచూస్తోంది.
అంతలో కాలింగ్‌బెల్ వినపడింది. స్వర్ణ తలుపు తీయడానికి వెళ్తూ బాత్రూం వైపు చూస్తూ అంది,
‘‘అదిగో నాన్నగారు వచ్చారు, తొందరగా తయారయి రా.’’
‘‘తయారుగా ఉన్నారా, నేను కూడా స్నానం చేసి, పది నిమిషాల్లో తయారయి వస్తాను.’’ భాస్కర్‌రావు లోపలికొస్తూనే అన్నాడు.
‘‘నాన్నగారు వచ్చేసారు. ఏం చెప్తావో చెప్పుకో.’’ గదిలోకి మళ్లీ వచ్చింది.
సుధీర జంకింది. తండ్రి సంగతి తెలుసు. ఇప్పుడు సుధాకర్ అంకుల్ ఇంటికి వెళ్లాల్సిందే. అందుకే నైటీ వేసుకోవాలనుకున్న ఆలోచనని పక్కకి పెట్టి సల్వార్ కుర్తా వేసుకుంది. మరొకరింటికైతే జీన్స్ టీషర్ట్ వేసుకునేది.
లోపల్నించి ఏం సమాధానం రాలేదు. అంత లోనే గది తలుపు తీసిన శబ్దం అయింది.
నిశ్శబ్దంగా సల్వార్ కుర్తా వేసుకుని బయటికి వచ్చింది. స్వర్ణ కూతుర్ని చూసి మొహం చిట్లించింది.
‘‘చీర కట్టుకో. మనం వెళ్తున్నది సుధాకర్ ఇంటికి.’’
‘‘అవును తెలుసు, అందుకే ఇది వేసుకున్నాను ’’
‘‘కానీ వాళ్లింటికి ఇంకెవరో కూడా వస్తున్నారు. కొంచెం పద్ధతిగా ఉంటుందని మీ నాన్నగారు ‘చీర కట్టుకోమని చెప్పు’ అని నాతో అన్నారు. ఆ మాట చెప్పాలనుకుంటున్నాను, ఇంతలోనే డ్రెస్ వేసుకుని వచ్చేసావు.’’
‘‘ఇది టూ మచ్ మమ్మీ. అంశూ ఇంటికి వద్దన్నావు. ఏం అనలేదు. టీవీ చూడొద్దని రిమోట్ లాక్కున్నావు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చీర అంటున్నావు. ఇప్పుడు మాత్రం నేను సరే అని అనను. నేను చీర కట్టుకోను. ఎప్పుడూ నీ మాటే వినాలా. నాకేం ఇండివిడ్యుయాలిటీ లేదా. నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకునే రైట్ నాకుందేమో.’’
చిరాగ్గా చూసింది కూతుర్ని.
‘‘రైట్ లేదని నేనలేదు. నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. కానీ కొన్నింటికి, కొన్ని చోట్లకి చీర కట్టుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది ఓ తెలుగు వాళ్లింటికి. పైగా వాళ్లెవరో కూడా వస్తున్నారని అన్నారు. అందుకని చెప్తున్నాను. అయినా నీకు చీర బాగా నప్పుతుంది.’’
‘‘అస్సలు నప్పదు. అయినా నాకు చీర కంఫర్టబుల్‌గా ఉండదు’’
‘‘నిజమే. కానీ ఈ రోజు అకేషన్ వేరు. బీరువాలోంచి నీకు నచ్చిన చీర తీసుకో. అయినా ఇది వర్షాకాలం కాదు. ఎండాకాలం కాదు. నవంబర్ నెల. పైగా రెండు రోజుల్నించి కురిసిన వర్షాలకి వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ ఏడాది చలి ముందరే మొదలయింది. వెదర్ కూడా ఎంతో చక్కగా ప్లెజెంట్‌గా ఉంటోంది.’’
‘‘ఈ డ్రెస్ బాగానే ఉంది కదా. మళ్లీ చీర అదీ ఎందుకో అన్నీ నువ్వు చెప్పిందే వినాలా!’’ అని మెల్లిగా అంది.
కూతుర్ని ఓసారి చూసి, మరో మాట మాట్లాడకుండా స్వర్ణ గదిలోకి వెళ్లి బీరువా తీసింది. వెనకాలే సుధీర కూడా వచ్చి తల్లి వెనకాలే నుంచుంది. హాంగర్‌కి ఉన్న ఓ చీర తీసి వెనక్కి తిరిగి కూతురికి ఇచ్చింది.
‘‘ఈ చీర కట్టుకో, దీనికి నీకున్న ఒకే ఒక్క జాకెట్టు నల్లది సరిపోతుంది’’ సుధీర ఏం మాట్లాడలేదు.
‘‘నీకే చెప్పేది. మొండిగా మాట్లాడకు, ఇది కట్టుకో’’
తల్లి చేతిలోంచి చీర తీసుకుంది.
మట్టి రంగు మీద చిన్న నల్లటి పూలున్న మెత్తటి పాము కుబుసం లాంటి షిఫాన్ చీర. ఆ చీరంటే సుధీరకి చాలా ఇష్టం. అందుకని ఆ చీరకి మేచింగని నల్ల జాకెట్టు కుట్టించుకుంది. ఆ తరవాత ఆ చీరని ఓ రెండుసార్లు కట్టింది. కొలీగ్స్ అందరూ ఆ చీర సుధీరకి నప్పిందని అన్నారు.
ఈ లోపలే ఓ రెండు సార్లు తండ్రి మాటలు, హెచ్చరింపులు వినపడ్డాయి.
చీర కట్టుకుని పిన్ను పెట్టుకుంది. నల్ల స్వెటర్ తీసుకుని భుజం మీద వేసుకుంది. స్వర్ణ కూడా బొమ్మలా ఉన్న కూతుర్ని సంతృప్తిగా చూసింది.
మరో అయిదు నిమిషాలకి భాస్కర్‌రావు కూడా తయారైయి ముందు గదిలోకి వచ్చాడు. భార్యని, కూతుర్ని చూసి, ‘‘ఇక వెళ్దామా’’ అంటూ కారు తాళంచెవి తీసుకున్నాడు.
ఓ గంట తరవాత అందరూ కలిసి మయూర్ విహార్‌లోని కనిష్క టవర్స్‌లోని ఆరో అంతస్థులోని సుధాకర్ ఇంటికి వెళ్లారు. తలుపు తీసిన సుధాకర్ నవ్వుతూ నుంచున్నాడు. ఆ వెనకే అతని భార్య విజయ కూడా నుంచుంది.
‘‘బావున్నారా!’’ అంటూ పేరు పేరునా నవ్వుతూ, పలకరిస్తూ పక్కకి జరిగి వాళ్లకి దారి ఇచ్చారు.
‘‘మీ కోసమే చూస్తున్నాం రండి,’’ నవ్వుతూ సాదరంగా ఆహ్వానించారు.
‘‘ట్రాఫిక్ చాలా ఉంది. అక్కడికీ ముందే బయల్దేరాం. అయినా ఇప్పుడు చేరుకున్నాం.’’ అంటూ వాళ్ల వెనకే నడిచారు.
సన్నగా ఉన్న లాబీ దాటి పెద్ద హాల్లోకి వెళ్లారు. హాల్లో ఓ వైపున డైనింగ్ టేబుల్, దాని మీద చిన్న చిన్న గళ్లున్న లేత నీలం బట్ట. టేబుల్ మీద గాజు బేసిన్‌లో రకరకాల పళ్లు, దాని పక్కనే బోర్లించిన గ్లాసులున్న చిన్న స్టాండు ఉంది.
మరోవైపున గోధుమ రంగు సోఫాలున్నాయి. వాటిలో నీట్‌గా స్వెటర్లు వేసుకుని ఉన్న వాళ్లు ముగ్గురు కూచుని ఉన్నారు. వాళ్లు ఎవరో భాస్కర్‌రావు వాళ్లకి తెలీదు. సెంటర్ టేబుల్ మీద తాగేసిన కాఫీ కప్పులున్నాయి. అంటే వాళ్లు వచ్చేసి చాలా సేపైందన్నమాట అని అనుకున్నారు. బాల్కనీ తలుపు తీసి ఉండడంతో చల్లగాలి వీస్తోంది.
ఆ ముగ్గురు మగవాళ్లు ఇంకా పరిచయం కాకుండానే, వీళ్లని చూడగానే లేచి నమస్కారం చేసారు. భాస్కర్‌రావు, స్వర్ణ కూడా నమస్కారం చేసారు. సుధీర కూడా నమస్కారం చేసి చెయ్యనట్లుగా చేతులు కదిలించింది. అందరూ కూచున్నారు.
సుధాకర్ అందరిని పరిచయం చేయడం కోసం నుంచున్నాడు.
‘‘ఇతనే నేను మీతో చెప్పిన భాస్కర్‌రావు. బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ట్రాన్సఫరై ఇక్కడికి వచ్చి చాలా ఏళ్లైంది. ఆవిడ స్వర్ణ. భాస్కర్‌రావు భార్య. సంగీతం వచ్చు. మంచి గాయని. ఆమె వీళ్లమ్మాయి సుధీర డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ కోర్సు చేసి ఉద్యోగం చేస్తోంది.’’ అని భాస్కర్‌రావు కుటుంబ సభ్యులని చూపిస్తూ పరిచయం చేసాడు.
వెంటనే అంతా మళ్లీ తలలూపుతూ నమస్కారం చేసారు.
‘‘ఈయన నరసింహారావు గారు. ఏదో పనిమీద ఢిల్లీ వచ్చారు. మా నాన్నగారికి చాలా దగ్గర. ఆయన అప్పారావు గారు. గుర్ గ్రామ్‌లో ఉంటున్నారు. వీళ్లిద్దరూ కూడా మా చుట్టాలు.
ఇంక ఈ అబ్బాయి పేరు విక్రాంత్. విక్రాంత్ తండ్రి సుబ్రహ్మణ్యం గారు అప్పారావుకి కజిన్ అవుతారు.
విక్రాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేసాకా అమెరికాలో ఎమ్మెస్ చేసాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. రేపు వాళ్ల ఊరు వెళ్లి పోతున్నాడు.’’ అంటూ పరిచయాలు పూర్తి చేసారు.
వెంటనే సుధీర విక్రాంత్ వైపు చూసింది. ఓహో ఇతను అమెరికా అబ్బాయన్న మాట. పరీక్షగా చూసింది. మంచి రంగు. జీన్స్‌పైన నల్ల ఫుల్ హాండ్స్ స్వెటర్ వేసున్నాడు. ఠీవిగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అదే సమయాన విక్రాంత్ కూడా సుధీరని చూసాడు. ఆమె తడబడింది. వెంటనే చూపులు తిప్పుకుంది.
గోడలవైపు చూడడం మొదలెట్టింది. ఇదివరకు వచ్చినప్పుడు చూసిన గోడల మీద ఉన్న పెయిం టింగ్స్‌ని మళ్లీ మళ్లీ చూస్తోంది. అదే మొదటిసారి చూస్తున్నంత దీక్షగా చూస్తోంది.
అంతలో వంటింట్లో ఉన్న విజయ సుధీరని పిలిచింది. సుధీర వంటింటి వైపు చూసింది. లోపలికి రమ్మని సైగ చేసింది. వెంటనే వెళ్లింది.
వంటిల్లు అంటూ సెపరేట్‌గా ఏం లేదు. చిన్నగానే ఉంది. కానీ చాలా నీట్‌గా, పొందికగా ఉంది. వంటింటికి తలుపులూ అవీ ఏం ఉండవు. ఓ నల్ల గ్రానైట్ కౌంటరు డైనింగ్ ప్లేస్‌ని, వంటింటిని సెపరేట్ చేస్తోంది.
అందుకే సుధీర కౌంటర్ దగ్గరికి రాగానే విజయ అవతలి వైపు నుంచి ఓ ట్రే అందించింది. అందులో వేడి టీ ఉన్న కప్పులు ఉన్నాయి.
‘‘నువ్వు ఇవి వాళ్లకిచ్చెయ్యి. నేను పకోడీలు మైక్రోవేవ్‌లో పెట్టాను. వేడి చేసి తెస్తాను’’
వాళ్ల దగ్గరికి వెళ్లాలంటే ఎందుకో సుధీరలో అలజడి మొదలైంది. స్కూలు, కాలేజీ, కోఎడ్యుకేషన్. ఆఫీసులో మూడొంతుల మంది మగవాళ్లే. అన్ని చోట్లా మగవాళ్ల మధ్యే ఉండాల్సి వచ్చింది.
అందరితో చనువుగా మాట్లాడే సుధీర ఎందుకో జంకింది. కారణం అమెరికా నుంచి వచ్చిన విక్రాంత్, అతని చూపులు కావచ్చు. తెలీకుండా ఆమెలో పిరికితనం వచ్చేసింది. అక్కడికి వెళ్లాలంటే ముందు విక్రాంత్ పక్కనుంచి వెళ్లాలి, అందుకే అయిష్టంగానే ట్రేని తీసుకుని అతిథుల వైపు వెళ్లింది. అందరికీ టీ ఇచ్చింది. ఆ వెంటనే విజయ పకోడీలు ఓవెన్‌లో వేడి చేసి ఓ ప్లేట్‌లో పెట్టి సుధీర కిచ్చి, అందరికీ చూపించు అంది. ఆమె పకోడీలు అందరికీ చూపించి, మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టింది..
తన కప్పు పట్టుకుని విక్రాంత్ బాల్కనీలోకి వెళ్లాడు.
‘‘సుధీరా ఈ పకోడీలు తీసుకుని వెళ్లి, అతనికి కొంచెం కంపెనీ ఇవ్వు’’ అని సుధాకర్ పకోడీల ప్లేటుని ఆమెకి అందించాడు. సుధీర తప్పనిస్థితిలో తన కప్పు తీసుకుని ఓ చేత్తో పకోడీల ప్లేటుని, మరో చేత్తో టీ కప్పు పట్టుకుని బాల్కనీలోకి వెళ్లింది.
ఆ బాల్కనీ వెడల్పుగా ఉంది. పావురాలు రాకుండా ఆకుపచ్చటి వల కట్టి ఉంది. అక్కడ ఓ చిన్న కేన్ టేబుల్, రెండు కేన్ కుర్చీలు ఉన్నాయి. ఓ పక్కగా బట్టలు ఎండేసుకునే స్టాండు ఉంది. ఆ పక్కన కొన్ని మొక్కలూ, ఓ తులసి కోట ఉన్నాయి.
సుధీర వెళ్లే సరికి విక్రాంత్ కుర్చీలో కూచోకుండా బయటికి చూస్తున్నాడు. సుధీర కూడా నుంచుని ప్లేటుని అతని ముందుంచింది.
అతను ఒకటి తీసుకుని, ఆమెనే చూస్తూ, ‘‘నా పేరు విక్రాంత్. మీ పేరు సుధీర కదా’’ ఇంగ్లిష్‌లో అన్నాడు.
డీప్ వాయిస్. ఆ గొంతుకి ఆమె ఫిదా అయిపో యింది. తనకి కాలేజీలో, ఆఫీసులో, తాము ఉంటున్న సొసైటీలో ఎంతో మంది మగవాళ్లతో పరిచయం ఉంది. ఏదో ఓ సమయాన వాళ్లతో అవసరం ఉంటుంది, ఎన్నోసార్లు వాళ్ల గొంతుల్ని వింది. కానీ ఎవరి గొంతులోనూ ఇటువంటి ఆకర్షణ లేదు. ఎప్పుడూ ఈ విధమైన అలజడి కలగలేదు. ఇప్పుడెందుకిలా!
అవునన్నట్లు తల ఊపింది.
‘‘మీరు చాలా బావుంటారు. అంటే అందంగా ఉన్నారు.’’
సిగ్గు పడింది. ఏం అనాలో తెలీలేదు. మాట ఎందుకు రావడం లేదో ఆమెకి తెలీడం లేదు. ఆఫీసులో కూడా అంటూంటారు. ‘ఓ థాంక్స్’ అని నవ్వేస్తుంది. కాని ఇప్పుడు సిగ్గు పడింది.
‘‘ఏదైనా చెప్పండి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, పైగా క్యాపిటల్ సిటీలో చెయ్యడం అంటే ఓ విధంగా ఛాలెంజ్. మీ గురించి, అంటే మీ హాబీలు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఇక్కడి మీ అనుభవాలు, ఆఫీసు విషయాలు ఎట్సెట్రా… ఎట్సెట్రా.’’
ఆఫీసులో, సొసైటీలో, కాలేజీలో మగవాళ్లతో మాట్లాడినంత స్వేచ్ఛగా విక్రాంత్‌తో మాట్లాడలేక పోయింది. భయం అని కాదు కానీ, ఏదో జంకు. అమెరికా నుంచి వచ్చాడని కావచ్చు. తనకన్నా ఎంతో అందంగా ఉన్నవాళ్లని చూసి ఉండచ్చు. తను అతన్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తోందా!
‘‘మావన్నీ మీకు తెలిసినవే. మీరు అమెరికా నుంచి వచ్చారు, అక్కడి విషయాలు చెప్పండి. మాకవన్ని తెలీదు. మేము చూడనివి తెలియనివి కొత్తవి కదా!’’
‘‘అయితే నన్నే మొదలు పెట్ట మంటారా, ఓకే నో ప్రాబ్లెం.’’ అంటూ కప్పుని టీపాయ్ మీద పెట్టి, ఓ పకోడీ తీసుకుంటూ కుర్చీలో కూచున్నాడు.
వెంటనే సుధీర కూడా తన కప్పుని తీసుకుని కుర్చీని కొంచెం పక్కకి జరిపి కూచుంది.
తను చదివిన ఎంసెట్ గురించి, ఇంజినీరింగ్ కాలేజీ గురించి, ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్లినప్పుడు, ఓ ఏడాది పడిన అన్ని రకాల ఇబ్బందుల గురించి, అక్కడి జీవితం గురించి, భోజనం గురించి చాలా సేపు మాట్లాడాడు. తన ఊరు గురించి, ఇంట్లో వాళ్ల గురించి చెప్పాడు.
ఆ తరవాత సుధీరని ఆమె చదువు, ఉద్యోగం గురించి, చాలా అడిగాడు
‘‘పుస్తకాలు చదువుతారా! ఎవరివి ఎక్కువగా చదువుతారు?’’
‘‘చదువుతాను, ఎక్కువగా చేతన్ భగత్, జెఫ్రీ ఆర్చర్, జాన్ గ్రీషమ్..’’
తరవాత విక్రాంత్ ఎన్నో విషయాలు మాట్లాడాడు.
సుధీర విక్రాంత్ మాటలు వింటూ తనని తాను మైమరిచిపోయింది.
‘‘నేను రేపు హైద్రాబాదు వెళ్తున్నాను. రేపు ఏర్పోర్ట్‌కి రాగలవా?’’ ఉలిక్కి పడింది, అతని మాటలకి.
మేము ఢిల్లీలో ఉన్నామన్న పేరే కానీ ఏర్పోర్ట్‌కి వెళ్లే అవకాశం రాలేదు. విమానంలో వెళ్లేంత తాహతు లేదు. అంత అవసరం కూడా రాలేదు. అసలు అది ఎక్కడుందో కూడా తెలీదు. హైద్రాబాదు వెళ్లాలంటే మేము రైల్లోనే వెళ్తాం, అని అనాలను కుంది.
కానీ అనలేదు ఇన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఏర్పోర్ట్ ఎక్కడుందో తెలీదా? అంటాడేమో అని జంకింది.
‘‘రేపు నాకు కష్టం. మా ఫ్రెండ్ అక్కది పెళ్లి ఉంది, లాస్ట్ మూమెంట్ షాపింగ్ చేయడానికి నన్ను రమ్మంది. అందుకని ఆఫీసు నుంచి మేము వెళ్లాలి’’ ఆగిపోయింది.
‘‘నో ప్రాబ్లెం. ఎందుకో నీతో ఇంకా మాట్లాడాలని పించింది. పోనీ, రేపు పొద్దున్న నాకు కొంచెం మీ ఢిల్లీని పరిచయం చేస్తావా అని అడగాలనుకున్నాను. కాని, రేపు ఆఫీసుంటుంది కదా. నో ప్రాబ్లెం. మరోసారి ఢిల్లీ చూడడానికి వస్తాను. అయినా నా ఫ్లైటు రాత్రి పదకొండు గంటలకి’’
అలా అడిగేసరికి ఆమెకి ఏం అనాలో తెలీలేదు. తన ఆఫీసు అదీ అన్నీ మర్చిపోయింది. మనసులో విక్రాంత్‌తో సైట్ సీయింగ్‌కి తయారైంది.
‘‘ట్రై చేస్తాను. మా బాస్‌కి ఏదో చెప్పేస్తాను.’’ అని ఆమె అనగానే గట్టిగా నవ్వాడు.
(ఇంకా ఉంది)