– గంటి భానుమతి
‘నీ దృష్టిలో స్వేచ్ఛకి నువ్విచ్చుకుంటున్న అర్థం నాకు తెలీదు. కానీ, నీ మాటకి నేనేనాడు అడ్డు చెప్పలేదు. నేనే కాదు అమ్మ, ఇంట్లో వాళ్లెవరూ నీకు ఆంక్షలు పెట్టలేదు. అసలు నువ్వు వచ్చి ఎన్నోరోజులు కూడా కాలేదు. ఈ కాస్త సమయంలోనే నువ్వు మా ఇంటిమీద ఇంత వ్యతిరేకత పెంచుకున్నావంటే నాకేం అనాలో తెలీడం లేదు, ఈ రోజున నీ స్వేచ్ఛని లాగేసుకున్నామని నీకనిపిస్తే మమ్మల్ని క్షమించు. ఈ ఇంట్లో అందరూ నిన్ను ప్రేమించారు, కాబట్టి నిన్ను కట్టిపడేయాలని అనుకోవడం లేదు. నీకు ఎంతో స్వేచ్ఛని ఇచ్చారు. ఆ స్వేచ్ఛతోనే నీ అంతట నువ్వు వెళ్లిపోదామని అనుకుంటున్నావు.’
సుధీర ఏం మాట్లాడలేదు.
‘నిజమే. నీ వాదనని నేను అంగీకరిస్తున్నాను. ముందు అనుకున్న ప్రకారం పెళ్లైన నాలుగు రోజులకే మనం అమెరికా వెళ్లాల్సిన వాళ్లమే. టిక్కెట్లు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు వెళ్లలేకపోయామో నీకు తెలుసు. ఇది కావాలని చేసినది కాదు. పరిస్థితులు అలా వచ్చాయి. నేనన్నది నిలబెట్టుకోలేకపోయాను. అయితే మోసం కాదు, జరుగుతున్న దాంట్లో నా ప్రమేయం ఏం లేదు.’
‘ఇప్పుడవన్నీ ఎందుకు? నేనేం అనలేదు కదా’
విక్రాంత్ వినిపించుకోలేదు.
‘నువ్వు అనలేదు కానీ, నీ మనసులో ఇదే ఉంది. నా వర్షన్ కూడా నువ్వు వినాలి. ఢిల్లీ లాంటి సిటీలో పెరిగిన నిన్ను తీసుకొచ్చి, లంకంత ఇంట్లో ఊరికి దూరంగా, ఓ విధంగా పల్లెటూరులో ఉంచాం. అది తాత్కాలికం అని అందరం అనుకున్నాం. కానీ అది ఎప్పటికీ అయిపోయే పరిస్థితి వస్తుందని ఎవరం కూడా అనుకోలేదు. అందరూ మనం అమెరికా వెళ్తున్నామనే అనుకున్నారు. కాని వెళ్లడం లేదు. జరిగిందేంటో నీకు తెలుసు. ఇందులో మోసం ఏం లేదు. కానీ నువ్వు ఆ మాట పదే పదే వాడుతూ స్వేచ్ఛ, హక్కులు అంటూంటే చాలా బాధ అనిపిస్తోంది.
నువ్వు హక్కుల గురించి మాట్లాడితే, నేను నా డ్యూటీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. మా అమ్మకి ఎంత గౌరవం ఇచ్చానో, నీకు కూడా అంతే ఇచ్చాను. కానీ నిన్ను తీసుకొచ్చి పంజరంలో ఉంచామని అనుకోలేదు. ఈ కొద్ది రోజులకే అంత పెద్ద మాట వాడావు. పంజరం అని అన్నావు. నేను బాధపడతా నని నీకనిపించకపోవడం కష్టంగా ఉంది. నువ్వు అంతా అర్థం చేసుకుంటున్నావని అనుకున్నాను.
ఇప్పుడు నువ్వు వెళ్లి, మళ్లీ వస్తావని నాకు నమ్మకం లేదు. అందుకే నేను నీతో రావడం లేదు. వచ్చి, నా విలువని నేను పోగొట్టుకోదల్చుకోలేదు. నీకిష్టమై నువ్వెళ్తున్నావు. నీ కిష్టమైనప్పుడు రావచ్చు. అసలు రాకూడదని అనుకుంటే..’ ఆగిపోయాడు. గొంతు గాద్గదికం అయింది. అది సుధీర గమనించింది. కదిలిపోయింది.
‘నువ్వు ఏ రోజున కూడా గొడవ పెట్టలేదు. నా మాట కాదనలేదు. పరిస్థితులు నన్ను ఈ ఊరు నుంచి కదలనీయలేదు.’
ఇది రెండురోజుల క్రితం వారి మధ్య జరిగిన సంభాషణ. ఇద్దరికీ ఆనాటి సంభాషణ గుర్తుంది. ఈ క్షణాన గుర్తొచ్చింది.
అంతలో సీతారాం కారు డిక్కీలోంచి పెట్టెల్ని తీసుకొచ్చి కింద పెట్టాడు.
‘నేను అమ్మగార్ని అంతవరకూ దింపి వస్తాను. నువ్వు పార్కింగ్ లాట్‌లో ఉండు. నేనే అక్కడికి వస్తాను.’
వాడు తల ఊపి కారు వైపు కదిలాడు.
విక్రాంత్ పెట్టెని, బ్యాగ్‌ని ట్రాలీలో పెట్టి ముందుకు వెళ్లి గేటు దగ్గర నుంచున్నాడు. సుధీర మౌనంగా ఆ పక్కనే నుంచుంది.
‘నీ ఐడీ, టిక్కెట్టు ఓసారి చూసుకో’ వెంటనే చేతికున్న బ్యాగ్ తెరిచి చూసుకుంది.
‘తొందరలోనే వస్తావని అనుకుంటున్నాను. రాలేకపోతే ఇంట్లో ఏం సమాధానం ఇవ్వాలో, ఎలా ఇస్తే ఇంట్లో వాళ్లని కన్విన్స్ చెయ్యగలమో మనం ఇద్దరం కలిసి ఆలోచించుకోవాలి..’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళ్లిపోయాడు.
విక్రాంత్ వెళ్లిన వైపు ఒక క్షణం చూసి మెల్లిగా నిట్టూర్చింది.
పెళ్లి, అమెరికా జీవితం గురించి ఎంతో ఊహించు కుంది. ఆ ఊహల్ని విక్రాంత్, ఆ ఇంట్లో వాళ్లు చెరిపేసారు. అమెరికా గురించి ఎన్నో కలలు కంది. అన్నీ చెరిగి పోయాయి. కాదు, చెరిగిపోయేలా చేసారు. అందుకే ఆ ఇంటినుంచి వెళ్లిపోవాలని అనుకుంది. అలాంటప్పుడు ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేయడం తప్పు కాదు. అసలు తన జీవితం అనుకున్నట్లుగా ఎందుకు జరగలేదు? ఎందుకవడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? ఎంతలో ఎంత మార్పు! పెళ్లి తరువాత జీవితం ఊహించుకున్నట్లు జరగడం లేదని, విక్రాంత్ ఇంట్లో వాళ్లు ఆమెను అవమానించారని, ఏదో జరిగిపోయిందని ఇప్పుడు ఢిల్లీ వెళ్తోంది.
ఈ వెళ్లడంలో సంతోషం లేదు. మనసులో ఎక్కడో ఏదో చెప్పలేని భావం. అది తప్పు చేస్తున్నానన్న భావమా! వివాహ బంధాన్ని తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకా! ఆ బంధం తెగిపోయాకా జీవితం ఎలా ఉంటుందో తెలీదు. అంతదూరం ఆలోచించలేదు.
అసలు పరిస్థితి ఇంతవరకు ఎందుకొచ్చింది? కారణం ఎవరు? విక్రాంత్ కాదా! విక్రాంతే. ఏమాత్రం సందేహం లేదు. పెళ్లికి ముందు అమెరికా అన్నాడు. పెళ్లైన వెంటనే అమెరికా వెళ్లడం లేదన్నాడు. ఇది మోసం కాదా? ఏదైనా భరించవచ్చు కానీ మోసాన్ని భరించడం కష్టం. అందుకని, ఈ పరిస్థితికి కారణం తను కాదు, విక్రాంత్. అందుకే అందుకే వెళ్లిపోతున్నానని మనసులో ఎంత అనుకున్నా సమాధానపడలేకపోతోంది. తన ఆలోచనల్లో పరిపక్వత లేదా, చిన్నపిల్లలా ప్రవర్తిస్తోందా, తన ఆలోచనలు సరైన దిశలో వెళ్తున్నాయా, తనకి ఎవరు సరైన పరిష్కారం చెప్తారు?
ట్రాలీ తోసుకుంటూ లోపలికి వెళ్లింది. లోపల అంతా, అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న మనుషు లతో అంతా పెళ్లివారి హాలులా ఉంది. తను వెళ్తున్న ఏర్‌లైన్స్ కౌంటర్ దగ్గర ఎవరూ లేరు. అటూ ఇటూ చూసి ఖాళీగా ఉన్న కుర్చీ కనిపిస్తే ట్రాలీని పక్కకి జరిపి కుర్చీలో కూచుంది. అంతా పరికించి చూసింది. ఎక్కువ మంది యువతీ యువకులే కనిపించారు. కొంతమంది అయితే అప్పుడే నిద్ర లేచి వచ్చినట్లుగా, నిద్ర మొహాలతో, మరికొందరు బర్ముడాలతో ఉన్నారు. చాలా మంది ఆడవాళ్లు కబుర్లు చెప్పుకుంటూ ఏదో తింటూ, తాగుతున్నారు. సుధీరకి ఏం తాగాలనిపించలేదు.
నాలుగు నెలల క్రితం వరకూ విక్రాంత్ అంటే ఎవరో తెలీదు. అతనితో పెళ్లి నిర్ణయించారు. పెళ్లి అన్నారు. ఆ తరవాత అమెరికా అన్నారు. అందరికీ చెప్పుకున్నది. అందరూ అసూయపడ్డారు. పెళ్లి జరిగింది. కానీ అమెరికా వెళ్లలేదు. ఇప్పుడు అది అవమానంగా అనిపిస్తోంది. ఈ అవమానం తనకి మాత్రమే అర్థం అవుతుంది. ఇతరులకు అర్థం కాదు. పైగా విన్న వాళ్లకి సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది తన జీవితం.
‘జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది. ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలి పోవాలో అప్పుడే పోతుంది. దేన్నీ ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకూ నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే.’ ఇవి మామ్మ గారు అన్న మాటలు. ఆమె ఉండి ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఈ కాస్త సమయంలోనే ఎన్ని మార్పులు. ఊహించని మార్పు. పెళ్లి జరిగింది. ఎన్నో రోజులు కూడా కాకుండానే విడిపోవడానికి తయారయింది.
కళ్లు మూసుకుంది.
‘సారీ సుధీరా, నన్ను క్షమించు. మనం అనుకున్నట్లుగా వెంటనే అమెరికా వెళ్లడం లేదు. నాన్నగారు పడిపోయారు. హైద్రాబాదు తీసుకొచ్చాం. ప్రస్తుతం మంచం మీద ఉన్నారు, చూస్తున్నావుగా ఇంటి పరిస్థితి. కొన్ని రోజులు ఆగుదాం. పనివాళ్లు సరిగాలేరు. ఇంటికి ఫోన్ చేసి ఎవరైనా అటెండర్‌ని పంపించమన్నాను. వాళ్లు ఇద్దర్ని పంపిస్తారు. ఒకరు రాత్రి, మరొకరు పగలు. అమ్మకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మామ్మ పోవడంతో అమ్మ ఒక్కత్తి అయిపోయింది. అందుకే కొన్నిరోజులు మన ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాను. అయినా సరే ఈ నెలాఖరుకి బ్లాక్ చేస్తాను. ఆ తరవాత ఏ రోజుకి టిక్కెట్ దొరికితే ఆ రోజు ఢిల్లీ నుంచి వెళ్దాం. మీ పేరెంట్స్‌ని కూడా చూసినట్లుంటుంది.’ అని అన్నాడు.
కానీ అది కూడా జరగలేదు. ఇక చాయిస్ లేకుండా పోయింది. ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేకపోయింది. అన్నీ అలా అలా గబగబా జరిగిపోయాయి. ఆ మార్పులకి కోపం వచ్చింది. కానీ దాన్ని ఎవరి మీద చూపించగలదు?
ఆ ఇంట్లో వాళ్లని పరోక్షంగా కూడా అనలేకపోయింది. కారణం ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లోని మనుషులు, వాళ్ల ఆప్యాయతలు, ప్రేమలు. అందులో ఎక్కడా కపటం లేదు. ఎంతో సహజంగా మరో మనిషిని, ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలిని గౌరవంగా, మర్యాదగా, అభిమానంగా చూస్తూంటే ఏమీ అనలేకపోయింది. ఇప్పుడు, అక్కడి నుంచి బయట పడడానికి కారణం దొరికింది. స్నేహితురాలి పెళ్లి. వారం రోజుల ముందే వెళ్తోంది. పెళ్లి తరవాత మరో వారం రోజులు ఉంటుంది.
ఆ తరవాత. ఏం చెయ్యాలి? ఢిల్లీలో ఉండిపోతే! ఉండచ్చు. అయినా ఎన్ని రోజులని ఉండగలదు? ఉన్నా అమ్మా వాళ్లకి ఏం చెప్పాలి?
విక్రాంత్‌ని చూసిన రోజు గుర్తొచ్చింది. విక్రాంత్‌తో పరిచయం సుధాకర్ అంకుల్ వాళ్ల ఇంట్లో జరిగింది.
ఆ రోజునే విక్రాంత్‌ని మొదటిసారి చూసింది.
రోజూ ఏడు గంటలయితే గాని ఇంటికి చేరుకోని సుధీర, ఆ రోజు ఆఫీసు నుంచి కాస్త తొందరగా, అంటే నాలుగ్గంటలు కాకుండానే ఇంటికి వచ్చేసింది. దానికి ఓ కారణం ఉంది. ఆమె స్నేహితురాలు అంశు చాందినీ చౌక్ వెళ్దాం, కొంచెం వెండి నగలు కొనాలని అంది. వాటిని అక్కడికి వెళ్లి కొనాలని ముందు రోజే ప్లాన్ వేసుకున్నారు.
అక్కడి షాపింగ్ అయ్యాకా వచ్చేప్పుడు అక్కడే పరాఠా గల్లీ కెళ్లి ఓ నాలుగు రకాల పరాఠాలు అవీ హెవీగా తిని, ఇంటికి వచ్చేయాలని కూడా ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు ఇంట్లో ఏదో లైట్‌గా తినేసి, అంశూ ఇంటికి వెళ్తే, అక్కడి నుంచి వాళ్ల కార్లో వెళ్లాలి. మెట్రోలో వెళ్లచ్చు కానీ కార్లో వెళ్దామని అంది, దానికి ఓ కారణం ఉంది.
ఆ రోజున కారు వాళ్ల పప్పా తీసుకెళ్లరని, తను డ్రైవ్ చేస్తూ వెళ్లే అవకాశం దొరుకుతుందని అంది. డ్రెస్ మార్చాల్సిన పని లేదు. ఈ డ్రెస్‌తోనే వెళ్లొచ్చు. షాపింగ్ గురించే ఆలోచిస్తూ ఇంటికి వెళ్లింది.
లిఫ్ట్ దగ్గర ఉండగానే అంశు ఫోన్ వచ్చింది. ‘సారీ సుధీ, కారు అన్నయ్య తీసుకెళ్లాడు. మనకి ఈ రోజు వెళ్లడం కుదరదు. రేపు వెళ్దాం.’
సుధీర డీలా పడిపోయింది. చక్కటి పోగ్రాం పోయింది.
‘నో ప్రాబ్లం. రేపు వెళ్దాం. యూట్యూబ్‌లో మంచి హిందీ సినిమాలు ఉన్నాయి కదా ఆ సినిమాలు చూస్తూ కూచుంటాను. మసాన్, అక్టోబర్, రాజీ, బద్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా బావున్నాయిట కదా, హెచార్ పమ్మీ వాలియా చెప్పింది. అవి చూస్తాను.’
‘మా ఇంటికి వచ్చేసెయ్. ఇద్దరం కలిసి చూసెద్దాం’
‘డన్’
‘డిన్నర్ మా ఇంట్లో, ఓకే. ఆరు గంటలకి వచ్చెయ్యి.’
సెల్లో మాట్లాడుతూనే తలుపు తీసుకుని ఇంట్లోకి అడుగు పెడుతూ సెల్‌ని బ్యాగ్‌లో పెట్టేసింది.
ఆమె తల్లి, స్వర్ణ ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లుగా హడావుడిగా ఎదురొచ్చింది.
‘హమ్మయ్య వచ్చావా. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీకు ఫోన్ చేసాను, కానీ బిజీ అని వస్తోంది. మెసేజ్ పెట్టాను. మెసేజ్ కానీ, మిస్‌డ్ కాల్స్ కానీ చూసుకుని వస్తావని తెలుసు.’
తల్లిని తేరిపార చూసింది. ఎదురుగా ఉన్న తల్లిని నిర్లక్ష్యంగా రాసుకుంటూ సోఫా వరకు వెళ్లింది. ఆమె వెనకాలే స్వర్ణ వెళ్లి నుంచుంది. తల్లి తన జవాబు కోసం చూస్తోందనుకుని ఆగింది.
‘నేను అవేం చూడలేదు. నాకు వేరే పని ఉంది. చాలా సినిమాలు మిస్సయ్యాను. వాటిని అంశూతో కలిసి చూడాలి. వాళ్లింటికి వెళ్లాలి. అందుకే తొందరగా వచ్చాను.’
‘ఇప్పుడు వాళ్లింటికి వెళ్లక్కర్లేదు. సినిమాలూ అది ముఖ్యం కాదు. ఇప్పుడు మనం మయూర్ విహార్ సుధాకర్ ఇంటికి భోజనానికి వెళ్లాలి. అందుకని అలవాటుగా ఆ టీవీ ముందు కూచోకుండా తొందరగా తయారవు.’
‘ఇప్పుడా, అంత దూరం! ఎవరొస్తారు, నేనైతే రాను, పైగా రాగానే నా మూడ్ అంతా పాడు చేశావ్. నేనెక్కడికీ రాను.’
‘నాకు అవేం చెప్పకు. సాయంత్రం పీక్ టైం, ట్రాఫిక్ చాలా ఉంటుంది. అందుకని ఐదు గంటలకి బయల్దేరితేనే మనం టైముకి చేరగలుగుతామని మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. నాన్న వచ్చేసరికి మనం తయారుగా ఉండాలి. లేకపోతే కోప్పడతారు.’ అంది స్వర్ణ.
అసహనంగా తల ఎగరేసి తల్లిని చూసింది. నిర్లక్ష్యంగా చేతిలోని బ్యాగ్‌ని సోఫాలో పడేసి, రిమోట్ తీసుకుని సోఫాలో దభీమని కూచుంది.
‘నిన్నే. నీకే చెప్తున్నది, లేచి తయారవు’ అంటూ కూతురి చేతిలోని రిమోట్ లాక్కుంది.
తల్లిని కోపంగా చూసి, లేచింది.
‘సారీ మమ్మీ, నేను రాను. డిన్నర్‌కి మిమ్మల్ని పిలిచారు, నువ్వూ, డాడ్ వెళ్లండి. వెళ్లి భోంచె య్యండి. నా భోజనం గురించి బెంగ పడక్కర్లేదు. నేను అంశూ ఇంట్లో తినే•స్తాను. అక్కడ తినకపోతే మన సొసైటీ ఎదురుగా ఉన్న మెక్‌డోనాల్డస్ నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటాను, లేకపోతే నూడుల్స్ చేసుకుంటాను.’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. కూతురు వెనకాలే నడిచింది స్వర్ణ.
‘నాకేం తెలీదు. నాకేం చెప్పకు. మీ నాన్నగారు ఓ పదినిమిషాల్లో వస్తున్నారు. నాతో చెప్పినవే మీ నాన్నతో చెప్పు. నేను మాత్రం తయారవుతున్నాను.’
తండ్రి అంటే కాస్త భయం ఉంది. అందుకే కాస్త జంకింది.
‘అది కాదమ్మా, మేము షాపింగ్ పోగ్రాం పెట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్ మినిట్‌లో అది క్యాన్సిల్ అయింది. ఈ మధ్య ఎన్నో మంచి మంచి సినిమాలు మిస్ అయ్యాను. ఇప్పుడు వాటిని చూడాలి. నేను రాను. మీ ఇద్దరూ వెళ్లండి.’
‘నాకేం తెలీదు. ఇప్పుడు నాతో అన్నవన్నీ కూడా ఇలాగే చెప్పు, నాన్నగారికి.’
‘నాన్నగారికి నేనెలా చెప్తాను, నాకు భయం. నేను వచ్చి ఏం చెయ్యాలి, పైగా ఆ ఇంట్లో నా ఏజ్ వాళ్లు ఎవరూ లేరు, నాకు బోర్ కొడ్తుంది. నేను సినిమాలు చూసుకోవాలి.’ అని మరోసారి తన పోగ్రాం చెప్పి, బాత్రూంలోకి దూరి, వెంటనే తలుపు గట్టిగా వేసుసింది.
ఆమె వెనకాలే స్వర్ణ కూడా వెళ్లి, ఏం చేయాలో తెలీక మూసిన తలుపుని చూస్తూ బాత్రూం దగ్గర ఆగిపోయింది.
(ఇంకా ఉంది)