శ్రీనివాస రావుకు అక్షర నీరాజం

కొత్త ఉద్యోగంలో చేరే ముందు వేతనంపై బేరసారాలు సహజం. యాజమాన్యం నెలకు యాభై వేలు ఇద్దామనుకుంటే, ఉద్యోగార్థి అంతకంటే ఎక్కువ అడగడం లోకరీతి. కానీ అంత జీతం నాకు అక్కర్లేదు, పాతిక వేలు చాలని ఎవరైనా అంటారా? అందుకు యాజమాన్యం ఒప్పుకోకపోతే ఆ ఉద్యోగం వద్దని వెళ్లిపోయేవాళ్లు ఎక్కడైనా ఉంటారా?

ఒక ఉద్యోగిని ఏదైనా పనిమీద పక్క ఊరికి పంపి, అర్హతల ఆధారంగా ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు ఇస్తే… వెనక్కి వచ్చిన తర్వాత తొమ్మిది వేలు తిరిగిచ్చే వారిని ఎవరైనా చూశారా? రైల్లో మొదటి శ్రేణి ప్రయాణార్హత ఉన్నప్పటికీ మూడవ తరగతిలో ప్రయాణించి, మిగిలిన సొమ్మును యాజమాన్యానికి తిరిగిచ్చే వారి గురించి విన్నారా?

ఇలాంటి లక్షణాలున్న వాళ్లను పాతకాలపు కథల్లో చూస్తుంటాం. ఈ కాలంలో ఇలాంటి వాళ్లు ఉంటారని కూడా అనుకోలేం.. కానీ, నిన్నటిదాకా మన మధ్యే కదలాడిన ఓ వ్యక్తిలో ఈ అసాధారణ లక్షణాలున్నాయి. ఆయనే యెన్న శ్రీనివాసరావు. వైఎస్‌ఆర్‌గా పాత్రికేయ వర్గాలలో సుపరిచితులైన శ్రీనివాసరావు వ్యక్తిత్వం ఎంత ఎత్తైనదో, అంతరంగం అంత లోతైనది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీలో ఎంఏ, ఎంఫిల్‌ ‌చేసి అనంతరం పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రికలలో కొద్దికాలం పనిచేశాక ఆంధప్రభలో చేరి దాదాపు దశాబ్దం పాటు సేవలు అందించారు. మధ్యలో దాదాపు మూడేళ్లు శ్రీశైలం చుట్టుపక్కల గూడేలలో ఉంటూ వనమూలికలపై పరిశోధనలు చేయడంతోపాటు అనాధ ఆదివాసీ బాలబాలికల కోసం ఆశ్రమాన్ని నిర్వహించారు.

శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ ‌తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఓ నిరుపేద చెంచు బాలికను దత్తత తెచ్చుకున్నారు. ఆ అమ్మాయికి స్వాతి అని నామకరణం చేసి ఉన్నత విద్యావంతురాలిగా తీర్దిదిద్దడంతో పాటు తన వారసురాలిగా ప్రకటించారు. స్వాతి ఆయన ప్రాణం, స్వాతికి ఆయనే లోకం. వైఎస్‌ఆర్‌ ‌చివరి కోరిక ప్రకారం ఆ అమ్మాయే తలకొరివి పెట్టింది.

ఆంధప్రభలో ఉన్నప్పుడు భాజపా, సంఘపరివార్‌ ‌సంస్థల కార్యకలాపాలను ఆయన కవర్‌ ‌చేసేవారు. ఒకప్పుడు వాజపేయి గారు ప్రధానమంత్రి హోదాలో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తూ హైదరాబాద్‌లో పావుగంట విరామం కోసం లేక్‌వ్యూ అతిథి గృహానికి వచ్చారు. ఆయనతో ఐదు నిమిషాల ముఖాముఖి ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌ ‌భాజపా అగ్రనాయకులకు విన్నవించుకున్నారు. నాయకులు కుదరదన్నా ఆయన పట్టువీడలేదు.

చివరికి దత్తాత్రేయ గారు అటల్‌జీకి వైఎస్‌ఆర్‌ ‌విశిష్టతను తెలియజేసి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా కోరారు. అలాంటి వ్యక్తిని తాను చూడాలను కుంటున్నానని వైఎస్‌ఆర్‌ను లోపలికి పిలిపించారు అటల్‌జీ. ముఖాముఖి ప్రారంభమైంది. వైఎస్‌ఆర్‌ ‌విలక్షణ శైలికి ముగ్ధుడైన వాజపేయి, ఇంకో ఐదు నిమిషాల సమయం ఇస్తున్నానని చెప్పారు. సాధారణంగా ఏ పాత్రికేయుడైనా ఎగిరి గంతేసి అదనపు సమయాన్ని కూడా వాడుకుంటారు. కానీ, అలా చేస్తే వైఎస్‌ఆర్‌ ఎం‌దుకవుతాడు?

అదనపు ఐదు నిమిషాల సమయం అవసరం లేదని సవినయంగా తెలియజేసి లేచి నిల్చున్నారు. తాను ఐదు నిమిషాలే అడిగానని, ప్రధానమంత్రి అమూల్యమైన సమయంలో అంతకంటే ఎక్కువ తీసుకోలేనని చెప్తూ ముఖాముఖి అవకాశం ఇచ్చి నందుకు ధన్యవాదాలంటూ చేతులు జోడించారు. ముగ్ధుడైన అటల్‌జీ లేచి వైఎస్‌ఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు.

ప్రేమ తప్ప ద్వేషం ఎరుగని శ్రీనివాసరావు సాత్వికుడు, శాకాహారి. మూగజీవాల పట్ల కారుణ్యం చూపే వైఎస్‌ఆర్‌ ‌తన అంతరంగాన్ని అక్షరాలకే పరిమితం చేయకుండా చేతల ద్వారా వేల గోవులను, వందల ఒంటెలను వధశాలలకు పోకుండా కాపాడారు. మూగజీవాల అక్రమరవాణా జరుగు తున్నట్లు సమాచారం అందగానే భుజాన ఓ సంచి వేసుకొని పాత స్కూటర్‌పై వెళ్లి రోడ్డుపైనే అడ్డగించే వారు. ఇందుకోసం ఆయన ఎవరి సహాయం అర్థించ కుండా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడేవారు.

ఒకసారి హైదరాబాద్‌లో ఎవరో కొంటామంటే రాజస్తాన్‌ ‌నుంచి ఓ పేద రైతు రెండు ఒంటెలను తీసుకొని బయలుదేరాడు. మధ్యలో అడ్డుకున్న వైఎస్‌ఆర్‌కు ఆ పేదవానిపై జాలి కలిగింది. అప్పుచేసి ఆ రెండు ఒంటెలని కొన్నాడు. కొననైతే కొన్నాడుగానీ వాటిని పోషించేదెలా? మూడునాలుగు రోజులు వాటిని మేపేటప్పటికి అది ఎంత భారమో అర్థమైంది. చివరికి కొంపల్లిలో ఉన్న రాజస్తానీ సాంస్కృతిక, భోజనశాల ధోలారీధని యాజమాన్యాన్ని కలిసి వాటిని ఉచితంగా ఇచ్చేశారు.

అతి మంచితనం వల్ల ఆయన చాలా ఉద్యోగా లను వదులుకున్నారు. ఆంధప్రభ తర్వాత ఆయన ఏడాదికన్నా ఎక్కువ ఎక్కడ పనిచేయలేదు. నాలుగేళ్ల క్రితం 99టీవీలో ఆయనకు సహాయ సంపాదకునిగా ఉద్యోగం వచ్చింది. 90వేల రూపాయల జీతం ఆఫర్‌ ‌చేశారు. కానీ, అక్కడా ఆయన పాత పంథానే అనుసరించారు. తనకు 30 వేల రూపాయలు చాలని పేచీ పెట్టారు. 90వేలు తీసుకొని అందులోంచి 60 వేలు ఎవరికైనా విరాళం ఇచ్చుకొమ్మని మిత్రులు సలహా ఇస్తే కుదరదన్నారు. తన సేవల ప్రతిఫలం విలువ 30 వేల రూపాయలే నని, అంతకన్నా ఒక్క నయాపైసా ఎక్కువిచ్చినా తాను ఉద్యోగంలో చేరనని మొండికేశారు.

2014లో కొంతకాలం జాగృతి వారపత్రికలో కూడా వైఎస్‌ఆర్‌ ‌సహాయ సంపాదకునిగా సేవలు అందించారు. సంఘపరివార్‌ ‌సంస్థలతో సుదీర్ఘ అనుబంధం ఉన్నందుకేమో అసలు జీతమే వద్దని వాదనకు దిగారు. జీతం ఇచ్చేటట్లయితే తాను ఉద్యోగంలో చేరనని అప్పటి ప్రధాన సంపాదకులు వేణుగోపాల్‌రెడ్డి గారితో కరాఖండిగా చెప్పారు. అదెలా కుదురుతుందయ్యా, సేవలకు ప్రతిఫలం తీసుకోవడం నీ హక్కు, ఇవ్వడం మా బాధ్యత అని చెప్తే వినిపించుకోలేదు. చివరికి తనకు ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే అడుగుతానని చెప్పి పనిలో చేరారు.

రోజు కార్యాలయానికి వచ్చేటప్పుడు సంచిలో రెండు పాల ప్యాకెట్లు, నాలుగు బిస్కెట్‌ ‌ప్యాకెట్లు వేసుకొని వచ్చేవారు. ఇంటినుంచి జాగృతికి వచ్చేదాకా దారిలో రెండు మూడు వీధి కుక్కలకు పాలు తాగించి, ఉపాహారం తినిపించి వచ్చేవారు. ఆఫీసుకు ఒక పాల ప్యాకెట్‌ ‌తెచ్చి కిచెన్‌లో పెట్టి పనిలోకి దిగేవారు. తనను కలవడానికి ఎవరైనా వస్తే, క్షణంలో మాయమై స్వయంగా కాఫీ కలుపుకొని వచ్చి అతిథి మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు.

ఉస్మానియాలో చదువుకునే రోజుల్లో పాత పీజీ హాస్టల్లో సంచి శీనుగా సుపరిచితుడైన వైఎస్‌ఆర్‌ అనేకమంది తత్వవేత్తల జీవితాలను అధ్యయనం చేసి వారి నిగూఢ వ్యక్తిత్వాలను రంగరించి తనలో ఇముడ్చుకున్నారు. హాస్టల్‌ ‌ముందున్న బండలపై ఎన్నో రాత్రులు టీ తాగుతూ జిడ్డు కృష్ణమూర్తి నుంచి గౌతమ బుద్ధుని దాకా, రామానుజుని నుంచి ఆదిశంకరుల దాకా, ప్లేటో నుంచి మార్క్సు దాకా.. ఇలా అత్యున్నత శిఖరాలు చేరుకున్న వారి అంతరంగాలపై సహపాఠీలతో చర్చిస్తూ గంటలు గంటలు గడిపే వారని ఆయన మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు.

వైఎస్‌ఆర్‌ ‌విలక్షణతపై చిన్న చిన్న సంఘటన లను గుదిగుచ్చినా ఓ పెద్ద గ్రంథం అవుతుంది. అయితే, ఆయనలా మనం తక్కువ జీతం కోసం కొట్లాడగలమా? ధనంపై వ్యామోహం లేకుండా ఉండగలమా? ఖర్చు పెట్టుకొని మరీ నిస్సహాయులపై కరుణ కురిపించగలమా? కచ్చితంగా అలా చేయలేం, జీవించలేం. పైగా ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని మంచితనంలో కూడిన పిచ్చితనంగా భావిస్తాం. ఎందుకంటే ఆయనను కొలిచే సాధనాలు మనవద్ద లేవు. ఆయనను తూచే త్రాసు మనవద్ద లేదు. మనం సగటు మానవులం, స్వార్థపరులం.

ఆయన ఓ మనిషి, ఓ మహర్షి.

ఆయన మనసు వెన్న, మనిషి నిప్పు…

– పసుల శ్రీనివాస్‌రెడ్డి

About Author

By editor

Twitter
YOUTUBE