శ్వాస మీద ధ్యాసే యోగా. పతంజలి మహర్షి ఇచ్చిన ఈ వరం మీద ఇవాళ విశ్వమే ధ్యాస పెట్టింది. ఎందుకు? మానవదేహానికీ, పంచభూతాలకీ మధ్య అవినాభావ సంబంధం ఉంది అని గుర్తు చేసేదే యోగా. ప్రకృతికి దూరమైన క్షణంలో శరీరం ఇబ్బందుల  పాలబడుతుందన్న తిరుగులేని సత్యాన్నీ చెబుతుంది. రోగంతో పోరాడడం కంటే, రోగాన్ని దరి చేరనివ్వని మహోన్నత శక్తిని శరీరానికి అందించడమే యోగా చేసే అద్భుతం. ఇంద్రియాలను అదుపు చేస్తే, రోగాలు అదుపులో ఉంటాయని బోధిస్తోంది. పంచభూతాలకు దూరంగా జరిగితే మనిషి ఈ సృష్టిలో, ఈ యుగంలో ఘోర తప్పిదానికి పాల్పడినవాడవుతా డని, అందుకు ఖరీదైన మూల్యం చెల్లిస్తాడని యోగా నిష్కర్షగా చెప్పింది. ఇందుకు కరోనా మహమ్మారి సాక్ష్యం. రోగభయం పోగొట్టగలిగితే రోగాన్ని నయం చేసినట్టేనని కూడా యోగా అంటున్నది. శారీరక, మానసిక ఆరోగ్యానికి కేంద్ర బిందువైన జీవనశైలిని ధ్వంసం చేసుకుంటున్న నేటి ప్రపంచానికి ప్రాణాయామం పెద్ద భరోసా అని యోగవిద్య నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. విశ్వమంతా గుర్తిస్తున్న ఈ పక్రియను భారతీయులు మాత్రం జీవితంలో భాగం చేసుకోవడానికి ఇప్పటికీ బద్ధకిస్తున్నారని అంటున్నారు, శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య సంస్థానాధీశులు  శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ. అష్టాంగ యోగ మన పూర్వికులు మనకు ఇచ్చిన మహా వరమని, దానిని సమాజంలోకి తీసుకువెళ్లి, సానుకూల పంథాలో శాంతిసౌభాగ్యాలను సమకూర్చడం అత్యవసరమని ‘జాగృతి’తో జరిపిన ముఖాముఖీలో స్వామీజీ ఉద్బోధించారు.

లెక్కించలేనన్ని అవాంఛనీయ ధోరణులతో జీవనశైలి సాగుతున్న కాలంలో అది చాలదన్నట్టు మహమ్మారి కరోనా బారినపడ్డాం. ఈ పరిస్థి తులూ, ఈ కాలానికీ యోగా అవసరం. నిజంగానే పరిష్కారం. ఈ వాస్తవాన్ని ప్రపంచంతో పాటు భారతీయులు గుర్తిస్తున్నారని అనుకోవచ్చా?

మొదట శరీరతత్త్వాన్ని గురించి తెలుసుకుంటే, మానవాళికి యోగాభ్యాసం ఎలా వరప్రసాదమైందో స్పష్టత వస్తుంది. ఈ శరీరం పంచ మహాభూతాల సారం. పంచ మహా భూతాలు – జలం, పృథ్వి, అగ్ని, ఆకాశం, వాయువు- వీటితో మన సహజ బంధాన్ని మనం విస్మరిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ ఐదింటి గురించి యోగాభ్యాసంలో చెప్పారు. ఆయుర్వేదమూ చాలా స్పష్టంగా చెబుతుంది. దాన్ని మనం మర్చి పోయి, పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకోవడం మూలంగా అనేక (శారీరక, మానసిక, ఆధ్యాత్మిక) సమస్యలు వస్తున్నాయి – పాశ్చాత్య దేశాలలో ఆరోగ్యం అంటే మొదట శారీరకమే అనుకున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా మానసికం కూడా అనే ఆలోచనకు వచ్చారు. మిగిలింది, అంటే మూడోదే ఆధ్యాత్మికం, అక్కడికి నెమ్మదిగా వస్తున్నారు వాళ్లు. మనం అన్నమయ్య కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్పుకుంటాం. పాశ్చాత్యులు ఈ మూడో కోశం వరకు వచ్చారు. ఈ క్రమాన్ని ప్రపంచం మొత్తం గమనించింది. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ పద్ధతి ఆచరణలో పెట్టడానికి లేదా స్వీకరించ డానికి సహకారం అందించేందుకు సరిపడా కేంద్రాలు లేవు. కానీ ఇక్కడ కావలసినన్ని అలోపతి ఆసుపత్రులు ఉన్నాయి. ఇంకొకటి- ఇప్పుడు ఈ ప్రపంచంలో జనాలని ఎలా తయారు చేశారంటే ప్రతి రోగానికీ ఒక టాబ్లెట్‌! (‌జుఙవతీ• ఱశ్రీశ్రీ •ష్ట్రవతీ ఱ • జూఱశ్రీశ్రీ) దీంతో ఏమైంది! యోగా అంటే కొద్దిగా శరీరాన్ని శ్రమ పెట్టాలి. టాబ్లెట్స్ అయితే, తిన్న తర్వాత వేసుకోవచ్చు. తినకుండా వేసుకోవచ్చు. ఏం తినేసినా వేసుకోవచ్చు. అంతే, అయిపోతుంది కదా, శరీరాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ధోరణి వచ్చింది. అయినా ఈరోజు భారతదేశంలో యోగాభ్యాసం చేస్తున్నవాళ్లు చాలామంది ఉన్నారు.

అంటే ఇబ్బందులనేవి కేవలం శారీరకం కాదు, మానసికం కూడా అని చెబుతోంది యోగా. ప్రస్తుతం కరోనా ఈ ప్రపంచాన్ని భయంతో నింపేసింది. మనసును కకావికలం చేస్తోంది. దీని గురించి ఏమైనా చెబుతుందా యోగాభ్యాసం?

ఎవరైతే భయపడతారో వారు చనిపోతారు. ఈ భయం వదలగొట్టే విధానం పాశ్చాత్యుల దగ్గర లేదు. దానికి అలోపతిలో మందు లేదు. కేవలం మన భారతీయ పద్ధతులకే అలాంటి భయం పోగొట్టే శక్తి ఉన్నది. భయం ఎట్లా పుడుతుంది? పులిని చూస్తే భయం. సింహాన్ని చూస్తే భయం. పామును చూసినా భయమే. ఎందుకీ భయం? ఆ పాము ఏదో చేసేస్తుంది అన్న ఆలోచన. అదేం చెయ్యదు! అంటూ మనం ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. అలాగే బొద్దింకను చూస్తే, చీమంటే, కప్పను చూస్తే భయం. ఈ భయాన్ని తొలగించి యోగాభ్యాసంలోని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది అంగాల ద్వారా ధైర్యాన్ని ఇస్తాం.

యమ, నియమాలు పాటించడం మూలంగా ధైర్యం పెరుగుతుంది. ఇది యోగాభ్యాసంలో సాధకులకు చెప్పినట్లయితే, ఈ సృష్టిలోని జీవరాశులన్నిటితో కూడా మనం కలసి జీవించవచ్చు అనే నమ్మకం కలుగుతుంది. అవి కూడా మనల్ని ఏమి చెయ్యవనే ధైర్యం సాధకులకు కల్పించవచ్చు.  సృష్టిలోని జీవరాశులన్నిటితో మెల్లమెల్లగా కలసి జీవించవచ్చు అనే దాన్ని ఇప్పుడు పాశ్చాత్యులు అలవాటు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన వారు వింటున్నారు, లోతులకు పోవడం లేదు. మరలా మరలా వినండి. మర(యంత్రం)లాగా కాకండి. యోగా పుట్టిన భారతదేశంలో వింత ఏమిటంటే అసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇదే యోగా అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడే అనుకున్నాం కదా, అష్టాంగాలు, అవి తీసుకోవాలి. పతంజలి మహర్షి ఏమన్నారు, ‘అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరిత్యాగః’. అహింస అనగా హింస చేయకుండా ఉండటం. దీని లాభమేమిటో చెప్పారు. స్వామి వివేకానంద కూడా రాజయోగంలో అదే చెబుతారు. మనసా, వాచా, కర్మణా అహింసా వ్రతాన్ని ఆచరిస్తే శత్రువులు కూడా మిత్రులైపోతారు. అప్పుడు మనం దేనికి భయపడుతాం? దేనికీ భయపడం. పురాణాలలో కనిపించే మున్యా శ్రమాలలో కనిపించేది ఇలాంటి ఆత్మీయతే. ఆశ్రమాల్లో క్రూర, సాధు జంతువులు కలసి ఉండేవని వింటున్నాం. ఈ సంస్కృతిని మనం వదిలిపెట్టేశాం. మరొకటి సత్యవాక్పరిపాలన ఉన్నట్టయితే మన సంకల్పం ఎవరో ఒకరి ద్వారా నెరవేరుతుంది. మనమే చేయాల్సిన అవసరం లేదు, ఎంత పెద్ద కార్యమైనా సరే. ఇట్లా ప్రతి దానికి పతంజలి మహాముని సూత్రాలు బ్రహ్మాండమైన అర్థాన్ని చెబుతాయి.

ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా ఆచరణలో ఉన్న వైద్య విధానానికీ, యోగాభ్యాసానికీ ఎక్కడ భేదం ఉంది?

 యోగా మీద రుషులు, పూర్వికులు కల్పించిన భావన అంతా మర్చిపోయాం, యోగా చెయ్యి, రోగం పోతుంది అనే దశకు చేరుకున్నాం. యోగాభ్యాసం ద్వారా, ఆయుర్వేదం ద్వారా రోగం పోతుంది, నిజమే. స్వభావ రీత్యా మన దేశ పద్ధతులు ఏం చేస్తాయి? అవి అలోపతి విధానంలో వలె రోగంతో కొట్లాడవు. మనది కొట్లాడే పని కాదు. దానికి బదులు మన శరీరంలోనే శక్తిని అధికం చేసుకుంటాం. లోపల టీబీ సెల్స్ ఉన్నాయి, క్యాన్సర్‌ ‌సెల్స్ ఉన్నాయి. నిజానికి మన లోపల ఎన్ని వైరస్‌లున్నాయో మనకే తెలియదు. అయితే, మనం మన శక్తిని అధికం చేసుకుంటున్నంత కాలం, కాపాడుకుంటున్నంత కాలం అవి బయటకు రావు. యోగాభ్యాసం చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన శక్తి ఎక్కువవుతూ ఉంటే బయటకు రావన్నమాట. ఎలా ఇంటి కిటికీలు భద్రంగా వేసు కున్నప్పుడు దొంగ ప్రవేశించలేడో అలా. అలోపతి వారు ఇచ్చే మందులు (యాంటిబయోటిక్స్‌తో సహా) రోగంతో కొట్లాడడానికి ఉపయోగపడతాయి. లోపల రియాక్షన్‌ అవుతుంది. ఆ రోగ కారక కణాలు చచ్చిపోతాయి, కానీ మళ్లీ పుడతాయి. ఎంతవరకు యాంటిబయోటిక్స్ ఇస్తూ పోతారంటే, వాటితో శరీరంలో ఉన్న అవయవాలు పాడయిపోతాయి. రెండోదశ కరోనా సమయంలో అలోపతి వైద్యంలో ఏం జరిగింది? స్టెరాయిడ్స్ ఇస్తే ఏమవుతోంది? కరోనా తగ్గి నెగిటివ్‌ ‌వచ్చిన తర్వాత కూడా ఫంగస్‌లు వస్తున్నాయి. చాలామంది చనిపోతున్నారు, ఇంకా గుండెపోటు అని, ఇంకోటి అని చనిపోతూనే ఉన్నారు. బలహీనపడినప్పుడు శరీరానికి శక్తినివ్వాలి కదా? కానీ అలా జరగడం లేదని అర్ధమవుతుంది. యోగాభ్యాసం అనేది ఈరోజు ప్రపంచంలో గొప్పగా ఎందుకు ప్రసిద్ధమయిందంటే, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తున్న కారణంగానే. కాని ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. యోగాభ్యాసంలో ప్రతిదానికి ఒక్కొక్క పరమార్ధం కనిపిస్తుంది. ‘ఆసనేన రుజం హన్తి’, ‘ప్రాణాయామేన పాతకం హన్తి’. (ఆసనాల ద్వారా రజో గుణం, ప్రాణాయామం ద్వారా రోగాలు తొలగిపోతాయి.) పాటకాలు అంటే రోగాలు. రోగం అంటే వీళ్లు చెప్పేవి కాదు. ఏదో ఇబ్బంది శరీరానికి. ఆంగ్లంలో రోగాన్ని ఏమంటున్నాం- డిసీజ్‌. ఇం‌దులో ఏడు అక్షరాలున్నాయి. మొదటి మూడక్షరాలు తీసేశామనుకోండి, మిగిలిందేమిటి, ఈజ్‌! అం‌టే మంచిస్థితి. అంటే ఈజ్‌ ‌నుంచే డిసీజ్‌ ‌వచ్చింది. నిన్న బాగున్నాం. ఈరోజు ఏదో ఇబ్బంది. ఏమిటి అని ఆలోచిస్తున్నామా? పరుగెడుతున్నాం డాక్టర్‌ ‌దగ్గరికి. ఐదు, పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని; తలనొప్పి వచ్చింది. లేదా కడుపునొప్పి వచ్చింది. జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చింది? అని ఆలోచన చేస్తే ఈ ప్రకృతితోటి మనం విపరీత పోకడకు పోయామని, ఫలితంగానే అది వచ్చిందని తెలుస్తుంది.

రోగ నిరోధక శక్తికి, ప్రస్తుత సమస్యకి ఎలాంటి పరిష్కారం ఉంది?

కరోనా చాలావరకు ఒక బిచ్చగానికి రాలేదు. ఒక హమాలికి రాలేదు. పొలంలో పనిచేసే వాడికి రాలేదు. ఎందుకూ అంటే వీరు మామూలు ఆహారం తిన్నారు. అత్యాధునిక ఆహారం తినలేదు. మామూలు నీళ్లు తాగారు. ఈ రోజు ఆర్వో వాటర్‌ ‌తాగుతున్నారు. ఆ వాటర్‌ ‌టీడీఎస్‌, అం‌టే టోటల్‌ ‌డిసాల్వుడు సాల్టస్ ‌చెక్‌ ‌చెయ్యండి 30, 40, 50, 60, 100 కంటే ఎక్కువ లేవు. దాంట్లో సాల్ట్‌ను తీసేస్తే ఏమవుతుంది? ఇవి మనకు కనబడవు. కానీ జల్‌ ‌హి జీవన్‌ ‌హై అంటారు. ఆహారం, నీరు, వాయువే కదా మనకు శక్తినిచ్చేవి. దురదృష్టం ఏమిటంటే- ఈ మూడూ శుద్ధిగా లేవు. ఆహారం, మందులతో పండించినదే. ఫెస్టిసైడ్స్ ‌మయం. నీళ్లైనా మంచివి తాగుతున్నామా, అదీ లేదు. గాలి వస్తే తలుపులు బిగించుకుంటున్నారు. ఇంక శరీరానికి శక్తి ఎక్కడది? చిన్న చిన్న ఇబ్బందులు కూడా తట్టుకోలేనంత సున్నితంగా శరీరాన్ని తయారుచేస్తే ఏమవుతుంది? ఈరోజు ఎవరిని కరోనా ఎక్కువగా తాకిందంటే నిరంతరం ఏసీ రూములకి పరిమిత మయ్యేవారిని, ఇన్ని అవలక్షణాలున్నా 100 రూపాయలు ఇచ్చి బిస్లరి నీళ్లు తాగుతున్నారో వారిని! ఎవరైతే సహజమైన గాలిలోకి రారో వారికి! ఎవరైతే కాస్సేపు కూడా ఎండలో ఉండరో వాళ్లకి. భయంతో చనిపోతున్నది కూడా వీళ్లే. ఈ పరిణామాలన్నీ యోగాభ్యాసం చెప్పిన విషయాలే.

సమాజంలో మన ప్రవర్తన, పరిస్థితులు దానితో వచ్చిన మానసిక స్థితితో శరీరానికి ఇబ్బందులు వస్తాయంటోంది యోగా. అదెలాగో చెబుతారా?

ప్రాణాయామం చేస్తుంటే రోగాలూ, వెంబడే శరీరంలో ఉన్న ఇబ్బందులు పోతాయి. పాణాయా మేనా పాతకం హన్తి, ప్రత్యాహారేన మానసం వికారం హన్తి. ప్రత్యాహారం అంటే డిటాచ్‌మెంట్‌. అనగా ఇంద్రియాల్ని వాటి లోలత్వం నుంచి మెల్లమెల్లగా దూరం చేయడం. దీంతో ఏమవుతుంది? మనసుకు కలిగిన వికారం తొలగిపోతుంది. ఇంద్రియాల వల్లనే మనసుకు ఇబ్బంది. ఇంద్రియాలను మెల్లమెల్లగా  అభ్యాసంతో పక్కకు పెట్టేస్తే, మనసుకు ఇబ్బంది లేకుండా చేస్తే ఇంకేంటి సమస్య! బీపీని ఏమంటున్నాం, హైపర్‌టెన్షన్‌. అం‌టే ఎక్కువ టెన్షన్‌ ‌తెచ్చుకున్నావు. డాక్టర్‌ ‌దగ్గరికి పోతే నీకు బీపీ అంటారు. ఏం చేయాలి అంటే, టాబ్లెట్‌ ‌జీవితాంతం వేసుకో అంటున్నారు. ఆ టెన్షన్‌ ఎం‌దుకు వచ్చింది? అతను ఉన్న స్థలంలో కావొచ్చు లేదా వాళ్ల ఆఫీసులో కావొచ్చు, బంధువులతో కావొచ్చు, స్నేహితులతో కావొచ్చు; ఎక్కడో గొడవ పడి ఉంటాడు. ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యకి సమాధానం వెతికితే పోతుందా? మెదడుకి మత్తు ఇచ్చి పడుకోబెడితే పోతుందా? సంబంధం లేనటువంటి ట్రీట్‌మెంట్‌. ఇప్పు‌డు ఒక్కప్రక్క కొవిడ్‌కి ట్రీట్‌మెంట్‌ ‌లేదంటున్నారు. ఇంకోప్రక్క మల్టిపుల్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌పేరుతో ఏవేవో యాంటిబయోటిక్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇవ్వకూడదనీ అంటున్నారు. రోగిని బతికించడం కోసం అవే ఇస్తున్నామనీ అంటున్నారు. ఏమిటిది? ఇట్లా ఈ ధోరణుల గురించి విశ్లేషించి చెప్పి, అందరికి యోగాను అందించగలిగితే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రాణాయామ పక్రియకి నిత్య జీవితంలో ఉన్న ప్రాధాన్యం చెప్పండి?

ప్రాణాయామం శ్వాసకు సంబంధించిన పక్రియ. శరీరంలో ఏదైనా ఇబ్బంది కలిగితే డాక్టర్‌ ‌దగ్గరికి వెళతాం. డాక్టర్‌ ‌గారు మొత్తం కళ్లు చూస్తారు, చెయ్యి, గుండె చూస్తారు, అన్నీ పరీక్షిస్తారు. చూసినా, మన సమస్య అర్థం కాకపోతే టెస్టులు రాస్తారు. మొట్టమొదటిది బ్లడ్‌టెస్ట్. ఒక చుక్క కర్తం తీసుకుని తద్వారా శరీరంలో ఏమేమి ఇబ్బందులున్నాయో చెప్తారు. శరీరంలో ఎన్ని పదార్థాలున్నాయో! ముఖ్యమైన పదార్థం రక్తం. ఈ రక్తానికి శక్తిన్నిచ్చే పదార్థం ఏమిటంటే ప్రాణవాయువు. దీనిని సరిగ్గా ఎక్కడ తీసుకుంటున్నాం మనం? దీన్ని మన పద్ధతిలో ఏం చేస్తామంటే కొద్దిగా ప్రయత్నపూర్వకంగా ఊపిరి తిత్తులలోకి ఎక్కువ తీసుకునేలా చేస్తాం. దీనిద్వారా ఊపిరితిత్తుల శక్తి పెరగడమే కాకుండా శరీరంలో ఉన్న రక్తానికి కూడా శక్తి వస్తుంది. శక్తి వచ్చాక అవయవాలకు అదే కదా వెళుతుంది. అప్పుడు అవయవాలకూ శక్తి వస్తుంది. ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తులే కాదు గుండెకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. ఇవన్నీ చేసేటప్పటికి మెదడులో కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలా మెదడుకూ మంచి శక్తి వస్తుంది.

ప్రాణాయామం ఎన్ని విధాలుగా ఉంటుంది?

శాస్త్రం ప్రకారం ఎనిమిది రకాల ప్రాణాయామా లున్నాయి- సూర్య భేదనం, ఉజ్జాయి, శీతలి, సీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావిని, మూర్ఛ. వీటినే కుంభకాలు అంటారు. శాస్త్రంలో ప్రాణాయామం అంటూ దొరకదు. కుంభకాలే ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటి? శరీరాన్ని వేడి చేసుకోవచ్చు, చల్లబరుచు కోవచ్చు. ఉష్ణం రావాలంటే భస్త్రిక ద్వారా సాధ్యం. పొట్టని బాగా వెనక్కి తీసుకెళ్లి మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడమన్నమాట. శీతలి, సీత్కారి శరీరాన్ని చ్లబరుస్తాయి. ఈ రెండు పద్ధతుల్లో మాత్రమే నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం. నాలుకని చెంచా లాగా మడిచి, నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ, నాలుక మీది నుంచి శ్వాస విడిచినప్పుడు చల్లదనం ఏర్పడుతుంది. నోటి ద్వారా తీసుకున్న గాలిని ముక్కు ద్వారా వదిలిపెడతాం. ఇలా శరీరాన్ని ఎట్లా ప్రకృతికి అనుగుణంగా చేసుకోవచ్చో ఏనాడో చెప్పారు. ఇదే ప్రాణాయామం.

ప్రాణాయామానికీ, ధ్యానానికీ వ్యత్యాసం ఉందా?

ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం, ధారణ. ఈరోజుల్లో ధ్యానం చేస్తున్నామంటారు. ధారణ అంటున్నారు. ‘ధ్యారణాభి మనోధైర్యం, ధ్యానేన మనోజయం, సమాధియో మోక్ష మార్గోతిః’- ఇది సూత్రం. అష్టాంగ యోగాలలో సామాజిక కట్టుబాట్లు ప్రధానం. అహింస మనకు సంబంధించిందే కదా! సత్యం మనకు సంబంధించినదే. అష్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం. దొంగతనం అంటే ఏమిటి? సూక్ష్మంగా చూసినట్లయితే ఇతరుల వస్తువులని వాళ్ల అనుమతి లేకుండా తీసుకోవడమే. మీ కుమారుడికి మీరే ఇచ్చిన కలాన్ని కూడా వాడిని అడగకుండా తీసుకుంటే దొంగతనమే. మన ఇంద్రియాలని మన వశంలో పెట్టుకోవడం మరొకటి. అపరిగ్రహమంటే ఉన్నదానిలో తృప్తి, మనసుకు సంతోషం. ఊరికనే ఎక్కువ తెచ్చి పెట్టుకున్నా మనుకోండి! దాని రక్షణకే మన శక్తంతా పోతుంది. బాగా తినేసి ఇబ్బంది పడడం ఇలాంటిదే. వ్యక్తిగత మైన నియమాలూ ఉన్నాయి. శౌచము అంటే శుభ్రత. తపహః అంటే శక్తిని పెంచుకోవడం. స్వాధ్యాయం అంటే మంచి అధ్యయనం. ఈశ్వర ప్రణిదానం. ఇవన్నింటిని మనం మెల్లమెల్లగా చేసినట్లయితే శారీరక, మానసిక శక్తులు పెరుగుతాయి. మన శరీరానికి ఏ ఇబ్బందీ రాదు.

ప్రకృతి పరిశుభ్రంగా ఉంటేనే శరీరం క్షేమంగా ఉంటుందని చెబుతోంది యోగా. దీనిని ఎలా సాధించవచ్చు?

సమాజం ఎలా తయారయ్యిందంటే చాలామంది స•గరొచ్చిందంటూ, బీపీ ఉందంటూ అదేదో పీహెచ్‌డీ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు ఇళ్లలో అమృతాంజనం డబ్బా వుంటే రోగం వచ్చిందా అని ఎగతాళి చేసేవాళ్లం. ఈరోజుల్లో పెద్ద పెద్ద జబ్బులకి కూడా మందులు ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఎందుకు దిగజారిపోయింది పరిస్థితి? దీనికి ఒక పెద్ద పరిణామం జరగాలి. మొత్తం డాక్టర్లు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి చర్చించాలి. ఏం పండించాలో వారు నిర్ణయం తీసుకోవాలి. భూమికి, పంటలకు రసాయన ఎరువులు పూర్తిగా విడిచిపెట్టి పూర్వ పద్ధతుల ప్రకారం సేంద్రియ ఎరువులు వాడినట్లయితే వ్యవసాయం దిగుబడి పెరుగుతుంది. అలాంటి ధాన్యం తినడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ రసాయ పదార్థాల వల్ల అంతులేని జబ్బులు వస్తున్నాయి. ‘గింగిగోవు పాలు గరిటడైనను చాలు’ అన్నట్లు మనం తినే ఆహారం శుద్ధమై ఉంటే కొంచమైనా చాలు అమోఘమైన శక్తినిస్తుంది.  ఆహారం మంచిదైతేనే అవయవాలకు పుష్టి. ఎప్పుడైతే ఆహారంలో శక్తి లేదో, నీళ్లల్లో స్వచ్ఛత లేదో, శుద్ధమైన గాలి లేదో అప్పుడు శరీరంలోకి శక్తి ఎలా వస్తుంది? అవయవాలు పాడై పోతున్నాయి. దీనితోనే ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి. ఈ ఇబ్బందులకే రకరకాల రోగాల పేర్లు పెట్టారు వీళ్లు.

ఆసనాల అసలు ప్రయోజనం ఏమిటి?

ఆసనాలు ఎందుకు వేస్తాం? శరీరంలో రెండు వ్యవస్థలున్నాయి. పంపింగ్‌ ‌సిస్టమ్‌, ‌లింఫాటిక్‌ ‌సిస్టమ్‌. ఈ ‌రెండు ఏం చేస్తున్నాయంటే రక్తాన్ని పంపు చేస్తున్నాయి. పాంక్రాయాస్‌ ‌వంటి కొన్ని అవయవాలు చిన్న చిన్న రసాలు పంపిస్తుంటాయి. వీటికి పంపులు లేవు. మరి అవి రక్తంలో ఎలా కలవాలి? మనం శరీరాన్ని ముందుకు వంచడం, వెనుకకు వంచడం, తిప్పినప్పుడు ఇది సాధ్యమవుతుంది. వీటి ద్వారా మొత్తం శరీరమంతా సమతుల్యత ఏర్పడుతుంది. పిక్క భాగం ఉంది. కొంతమంది తెలిసినవాళ్లు ఏమంటారంటే పిక్క భాగాన్ని రెండవ గుండె అంటారు. కిందికి వెళ్లిన రక్తం మళ్లి పైకి రావాలంటే ఏం చేయాలి? ఈ పిక్క భాగం సరిగ్గా పనిచేయాలి. దానికి ఏం చేయాలంటే చిన్న చిన్న ఆసనాలు అంటే జాను శిరాసనం, సూర్య నమస్కారాలలో రెండవ భంగిమ పిక్క భాగాన్ని కదిలిస్తాయి. నిలబడి పంజా ఆధారంగా పైకి లేవడం, కిందికి దిగడం. మడిమ ఆధారంగా పైకి లేవడం, కిందకి దించడం ఇదొకటి. అప్పుడు పిక్క భాగానికి కదలిక వస్తుంది.

యోగాభ్యాసం ఆహారానికీ, నీటికీ చాలా ప్రాధాన్యం ఇస్తుంది కదా! అది ఎలా ఉంటుందో చెబుతారా?

శరీరాన్ని పెంచటం సులభం, కానీ కాపాడడం కష్టం. పనికి, ఆహారం పథకం అందరికి కావాలి. ఎంత పని, ఏ పని? దానికి తగ్గ ఆహారమే తీసుకోవాలి. ఇదంతా యోగాభ్యాసంలో చెప్పారు. ఎంత ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? అదేవిధంగా నీళ్లు. ఎప్పుడు తాగాలి, ఎంత నీరు తాగాలి, ఎలా తాగాలి, ఏమేమి తాగాలి? ఇవన్నీ కూడా యోగాభ్యాసంలో భాగం. మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. కాబట్టి సమస్యలు. దీన్ని సరి చేసుకోవడానికి అష్టాంగ యోగాను అలవాటు చేయాలి. ప్రతి కాలనీ లోపల కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఉపయోగించుకోవాలి. ఒంగోలులో ఉన్నప్పుడు సంఘ కార్యాలయంలో యోగా నేర్పాను. ఇప్పటికైనా యోగాను ఒక పద్ధతిలో తీసుకెళ్లినట్టయితే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటాయి. కలతలు, కలహాలు ఉండవు. ఆర్థికంగా స్థిరపడతారు. ఇదంతా మనదైన ఓ మంచిమార్గం. సానుకూల దృక్పథం.

About Author

By editor

Twitter
YOUTUBE