కరోనాకి టీకా అంటున్నారు.. వ్యాక్సిన్‌ అం‌టూ వస్తున్నారు. దానిని తీసుకోకండి! అదంతా విషం. అది నరేంద్ర మోదీ వ్యాక్సిన్‌, ‌దానికి వశీకరణ శక్తి కూడా ఉంది. జీవితాంతం మీరు కాషాయం వైపు ఉండిపోక తప్పదు.. మీకు తెలుసో లేదో, అది తీసుకుంటే పిల్లలు పుట్టరు-అనగా పుట్టించలేరు.. బహుపరాక్‌… అక్షరాలా ఇదే ప్రచారం చేశారు విపక్షాల నేతలు. ఆ వ్యాక్సిన్‌ ‌భారత్‌లో తయారయింది కదా! నేను అసలే తీసుకోను అని మరొక మహిళా హక్కుల కార్యకర్త చెప్పారు. చివరికి ఏమైంది? వ్యాక్సిన్‌ ‌మాత్రమే మిమ్మల్ని కరోనా నుంచి కాపాడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, విశ్వ విఖ్యాత వైద్య నిపుణులు చావు కబురు చల్లగా చెప్పారు. అప్పుడు మొదలయింది- వ్యాక్సిన్‌ ‌కేంద్రాల దగ్గర హడావుడి, తొక్కిసలాట. కానీ ఇప్పటికీ, ఇంత శాస్త్రీయంగా చెబుతున్నప్పటికీ వ్యాక్సిన్‌ ‌యజ్ఞాన్ని భగ్నం చేయాలని చూస్తున్న రాక్షసగణాలు విరివిగానే ఉన్నాయి.

ఈ నెల ఒకటో తేదీన విస్తుపోయే ఒక వార్త వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగిన ఘటన అది. కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌నింపిన 29 వరకు సిరెంజ్‌లు చెత్తబుట్టలో కనిపించాయి. ప్రాథమిక దర్యాప్తులో తేలిన వాస్తవం ఏమిటంటే- వ్యాక్సిన్‌ను సిరెంజ్‌లలో నింపారు. ఆ సూదులు కేవలం గుచ్చి తీయడం వరకే చేశారు. వ్యాక్సిన్‌ ‌వ్యక్తి శరీరంలోకి చేరలేదు. ఇందుకు కారకురాలు ఆక్సలరీ నర్స్ ‌మిడ్‌వైఫ్‌ ‌నేహా ఖాన్‌. ఈమె మీద, అలీఘర్‌ ‌కమ్యూనిటీ హెల్త్ ‌సెంటర్‌ అధికారి అర్ఫీన్‌ ‌జెహ్రా మీద కేసులు నమోదయ్యాయి. మే 22, 24 మధ్య జరిగిన ఈ వ్యాక్సిన్‌ ‌వృధా మీద ఇద్దరు సభ్యుల దర్యాప్తు బృందం వాస్తవాలు తేల్చిన తరువాత చర్యలు తీసుకున్నారు. పైగా వ్యాక్సిన్‌ ఇవ్వక పోయినా ఇచ్చినట్టే నమోదు చేశారు. వ్యాక్సిన్‌ ‌పంపిణీ గురించిన వాస్తవాలలో ఇదొక ఉదాహరణ మాత్రమే.

నేహా ఖాన్‌ అలా చేస్తున్న సంగతి తెలిసినప్పటికీ జెహ్రా పై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అందుకే, కొద్దికాలం క్రితం కొందరు మౌల్వీలు ఇచ్చిన వ్యాక్సిన్‌ ‌బహిష్కరణ పిలుపును ఈ ఇద్దరు అమలు చేస్తున్నారన్న అనుమానాలు బలపడ్డాయి. నిజానికి నేహా ఖాన్‌ ఇం‌తకు ముందు కూడా నిబంధనల మేరకు కరోనా విధులు సరిగా నిర్వర్తించలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. విపక్షాలు, ముస్లిం మతోన్మాదులు, కుహనా మేధావులు చేస్తున్న వ్యాక్సిన్‌ ‌సంబంధిత గలభానీ, అలీఘర్‌ ‌వ్యాక్సిన్‌ ‌వృధా ఉదంతాన్నీ బేరీజు వేసి చూస్తే వాస్తవం కొంతమేరకైనా అవగతమవుతుంది. దేశంలో వ్యాక్సిన్‌ ‌కొరత నిజం. అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లేని మాట నిజం. కానీ దీనిని ప్రజారోగ్యం కోణం నుంచి కాకుండా, మోదీని అపఖ్యాతి పాల్జేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే వచ్చిన వ్యాక్సిన్‌ అయినా సక్రమంగా వినియోగించేలా అంతా చూడాలి.

కొన్నిచోట్ల 37 శాతం డోస్‌లు వృధా

కరోనాయే కాదు, ఏ వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో అయినా, అందునా జాతీయస్థాయిలో జరిగే వ్యాక్సినేషన్‌లో కొంత వృధాను అనుమతిస్తారు. అసలు డోసులు సేకరించేటప్పుడే ఈ వృధానూ కలుపుతారు. కానీ నిపుణులు ఆదేశించిన స్థాయికి మించి వృధా జరగకుండా చూడవలసి ఉంటుంది. కానీ వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం గురించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులతో కేంద్రం జరిపిన సమీక్షలో బాధాకరమైన అంశాలు బయటపడ్డాయి. ఇవి మార్చి, ఏప్రిల్‌ ‌నెలల వివరాలు. కొన్ని రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ ‌లోటు స్పష్టంగా ఉంది. అదే సమయంలో వ్యాక్సిన్‌ ‌వృధా కూడా ఉంది. ఇందులో అత్యంత ఎక్కువగా, అంటే, 37.3 శాతం వృధాను నమోదు చేసుకున్న రాష్ట్రం జార్ఖండ్‌. ‌చత్తీస్‌గఢ్‌ 30.2 ‌శాతం వ్యాక్సిన్‌ను వృధా చేసింది. తమిళనాడులో అయితే 15.5 శాతం వృధా అయింది. జమ్ముకశ్మీర్‌ (10.8‌శాతం), మధ్యప్రదేశ్‌ (10.7 ‌శాతం) వృధా చేశాయి. ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో సగటు వృధా (6.3 శాతం)ను మించిపోయాయి. వ్యాక్సిన్‌ ‌వృధా 1 శాతానికి మించకుండా జాగ్రత్త పడాలని కేంద్రం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. జూన్‌ ఆఖరి వరకు అందిన వ్యాక్సిన్‌నే అంతటా అందేలా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది. అంటే అప్పటికి తగిన స్థాయిలో వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రావచ్చు.

మార్చి 27 ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్‌ ‌వృధా గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజు జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఈ ఏప్రిల్‌ 20 ‌నాటికి అందిన ఒక అంచనా ప్రకారం భారతదేశంలో అప్పటికి 46 లక్షల డోస్‌ల వ్యాక్సిన్‌ ‌రకరకాలుగా వృధా అయింది. ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన చేదునిజం. ఈ వృధాను నివారించగలిగి ఉంటే బెంగళూరు నగరంలో సగం మందికి వ్యాక్సిన్‌ అం‌ది ఉండేది. ఇంతకీ ఇది వ్యాక్సిన్‌ ఇవ్వడం ప్రారంభించిన వారానికి తేలిన లెక్క. దేశంలో జనవరిలోనే వ్యాక్సినేషన్‌ ‌పరిమితంగా ప్రారంభమై, ఏప్రిల్‌ 11‌న ప్రజలందరికీ ఇచ్చే కార్యక్రమం ఆరంభమైంది. కేరళ, పశ్చిమబెంగాల్‌, ‌గోవా ఒక్క వ్యాక్సిన్‌ను కూడా వృధా చేయకుండా వినియోగించుకున్నాయి. అప్పటికి 12 శాతం వృధాతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 9 శాతంతో హరియాణా రెండోస్థానంలో ఉంది. అంతకు ముందు మార్చిలో కూడా కొంత వృధా జరిగింది.

 ప్రాణం పోసే ఔషధంగా ప్రస్తుతం భావిస్తున్న వ్యాక్సిన్‌ ‌వృధా కావడానికి అపోహలు, మతోన్మాదం, అవగాహనా లోపం కూడా కారణమే. ఏప్రిల్‌లో హరియాణా (9.74 శాతం), పంజాబ్‌ (8.12 ‌శాతం), మణిపూర్‌ (7.8 ‌శాతం), తెలంగాణ (7.55 శాతం) వ్యాక్సిన్‌ ‌వృధా చేశాయి. అంతకు ముందు వెలువడిన సమాచారం ప్రకారం వ్యాక్సిన్‌ ‌వృధా చేసిన రాష్ట్రాలలో ఆంధప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌కర్ణాటక, జమ్ము, కశ్మీర్‌ ‌కూడా ఉన్నాయి. ఒక దశలో తమిళనాడు కంటే తెలంగాణలోనే ఎక్కువగా అంటే 17.6 శాతం వృధా అయింది. వివేక్‌ ‌పాండే అనే సమాచార హక్కు కార్యకర్తకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలన్నీ ఇచ్చింది. అదే సమయంలో కేరళ, పశ్చిమ బెంగాల్‌లతో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మిజోరం, గోవా, డామన్‌-‌డయ్యు, లక్షదీవులు వ్యాక్సిన్‌ను అస్సలు వృధా చేయలేదు. వ్యాక్సిన్‌ ‌సరఫరా కోసం భారత ప్రభుత్వం సీరం ఇనిస్టిట్యూట్‌కు (కోవిషీల్డ్) ‌రూ. 3,000 కోట్లు, భారత్‌ ‌బయోటెక్‌కు (కోవాక్సిన్‌కు) రూ.1,500 కోట్లు చెల్లించింది. వ్యాక్సిన్‌ ‌కొరత కంటే, రాష్ట్రాలు కోరుతున్న వ్యాక్సిన్‌ ‌మొత్తాల సరఫరా కంటే కూడా దానిని వృధా చేయడమే పెద్ద సమస్యగా మారిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌ ‌చెప్పారు కూడా. అంటే వ్యాక్సిన్‌ ‌వినియోగానికి సరైన ప్రణాళికను అమలు చేయడం లేదని ఆయన అంటున్నారు.

నిజానికి వ్యాక్సిన్‌ ‌వృధా కావడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. వివిధ దశలలో తెలిసి కొంత, తెలియక కొంత వృధా చోటు చేసుకుంటోంది. అయితే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ వృధా కావడానికి కారణం, ప్రణాళిక లేకపోవడమేనని కేంద్రం నిర్ధారణకు వచ్చింది. ఉదాహరణగా చెప్పాలంటే, ఒక సీసా (వయిల్‌)‌లో వ్యాక్సిన్‌ ‌పదిమందికి సరిపోతుంది. కానీ ఆరుగురే వస్తారు. మిగిలినది వృధా. కొన్ని గంటలలోనే అది కాలదోషం పడుతుంది. కొన్నిచోట్ల నిర్వాహకులు తొమ్మిది మందికి ఇచ్చి, ఒక్క డోసే కదా అని నిర్లక్ష్యం చేయడమూ కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కోవిషీల్డ్ ‌లేదా కోవాక్జిన్‌ ఒక సీసాను తెరిచిన తరువాత నాలుగు గంటల లోపే ఉపయోగించాలి. ప్రణాళిక లేకపోవడానికి తోడు ఈ నిబంధన కూడా వృధాకు దారి తీస్తోంది. తెలంగాణ, ఏపీ, యూపీ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్‌ ‌వృధా గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ప్రధాని సలహా ఇచ్చారు. వ్యాక్సిన్‌ ‌కేంద్రాలు పెంచి, వ్యాక్సిన్‌ ‌కాలదోషం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.

వ్యాక్సిన్‌ ఇం‌త వృధా అయినప్పటికి, సరఫరా లోపాలు ఉన్నప్పటికి చాలా దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో ఎక్కువ మందికే, పరిమిత సమయంలో వ్యాక్సినేషన్‌ ‌పూర్తయింది. ఈ వాస్తవాలను కూడా విపక్షాలు, ఒక వర్గం మీడియా దాచిపెడుతున్నాయి. మెడికల్‌ ఆక్సిజన్‌ ‌విషయంలో ఇదే జరిగింది. తరువాత వాస్తవాలు బయటపడ్డాయి. వ్యాక్సిన్‌ ‌విషయంలో కూడా మోదీ వ్యతిరేకులు అదే వ్యూహం అనుసరిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ – ‌కొన్ని వాస్తవాలు

భారత్‌ ‌జనాభా దాదాపు 138 కోట్లు. ఇక్కడ వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం ఒక మహా యజ్ఞం. కానీ రెండు మూడు కోట్లు, పది పన్నెండు కోట్లు మాత్రమే జనాభా ఉన్న దేశాలలో జరిగిన వ్యాక్సినేషన్‌తో పోలుస్తూ భారత ప్రధాని మోదీని కించపరచడానికి విపక్షాలు చూస్తున్నాయి. నిజానికి భారతదేశంలో 1.17 శాతం జనాభాయే కొవిడ్‌ ‌బారిన పడ్డారు. విదేశాలతో పోల్చుకుంటే ఇక్కడ మరణాల సంఖ్య (మహమ్మారి బారిన పడిన వారి సంఖ్యతో కూడా పోల్చుకుంటే) తక్కువ. ఏప్రిల్‌ 24 ‌ప్రాంతానికి భారత్‌లో 13 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేయడానికి 95 రోజులు పట్టింది. కానీ అంతే సంఖ్యలో పౌరులకు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి అమెరికాకు 101 దినాలు పట్టింది. చైనాకు 109 రోజులు పట్టింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం, అంటే మే 27 నాటి సమాచారం ప్రకారం దాదాపు 20 కోట్ల మందికి పైగా దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పూర్తయింది. ఇది భారత్‌ 130 ‌రోజులలో పూర్తి చేయగా, అమెరికా 124 రోజులు తీసుకుందని పీటీఐ వార్తా సంస్థ తెలియచేసింది. ఇవేమీ చెప్పకుండా ఈ దేశంలో వామపక్ష మేధావులు, జర్నలిస్టులు వ్యాక్సినేషన్‌ ‌విషయంలో మోదీ విఫలమవుతున్నారంటూ విషం చిమ్ముతున్నారు. దీనికి అంతర్జాతీయ మీడియా కూడా తోడై గురవింద సామెతను గుర్తు చేస్తున్నది. మన దేశ జనాభా అమెరికా జనాభా కంటే నాలుగు రెట్లు అధికం. కానీ ఇక్కడ కొవిడ్‌ ‌మరణాల రేటు అమెరికా కంటే మూడు రెట్లు తక్కువ. అమెరికాలో వైరస్‌ ‌విస్తరించిన తీరునీ, అందుకు ఉన్న పరిస్థితులనూ బేరీజు వేసి చూడాలి. అమెరికాలో ఒక చదరపు కిలోమీటర్‌ ‌పరిధిలో 36 మంది నివసిస్తారు. భారత్‌లో అయితే చదరపు కిలోమీటర్‌ ‌పరిధిలో 455 మంది ఉంటారు. ఇక్కడికీ అమెరికాకీ ఇంత తేడా ఉంది.

వందేళ్ల క్రితం మశూచికి టీకా కనుగొంటే కొందరు దానిని వ్యతిరేకించారు. కానీ ప్రపంచం ఇంత ఆధునికమైన తరువాత కూడా వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఆధునికులమని చెప్పుకుంటున్నవాళ్లే ప్రచారం చేయడం పెద్ద వైచిత్రి. కరోనా వైరస్‌ని అరికట్టాలంటే ముందు వ్యాక్సిన్‌ ‌మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టాలని అంటున్నారు అమెరికాకు చెందిన ప్రఖ్యాత పిల్లల వైద్యుడు డాక్టర్‌ ‌పీటర్‌ ‌హోటెజ్‌. ‌ప్రపంచంలో గడచిన ఆరు మాసాలలో ఒక బిలియన్‌ ‌డోసులు తయారయ్యాయి. వాటిని పలు దేశాలు ప్రజలకు ఇచ్చాయి. అయినా ఇప్పటికీ వ్యాక్సిన్‌ ‌వ్యతిరేకుల నోరే పెద్దగా వినిపించడం దురదృష్టకరమని ఆయన అంటున్నారు. వాళ్లంతా శాస్త్రవేత్తలను దుమ్మెత్తి పోస్తున్నారు. దీనితో వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో వేగం తగ్గిపోయిందని ఆయన అంటున్నారు. కొవిడ్‌కు ముందు కూడా ఆయన కొన్ని వ్యాక్సిన్‌ల తయారీలో పాలు పంచుకున్నారు. నిజానికి ఈ మహమ్మారి రావడానికి ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌ల మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్ట డానికి ఏనాటి నుంచో శ్రమిస్తున్న మాట నిజం. ఈ మేరకు చైతన్యం కలిగించడానికి నిర్వహించిన ఎన్నో సమావేశాలలో డాక్టర్‌ ‌హోటెజ్‌ ‌కూడా పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ల విషయంలో దేశాల మధ్య కుట్రలు సాగుతున్నాయని డాక్టర్‌ ‌హోటెజ్‌ ఆరోపిస్తున్నారు. పశ్చిమ దేశాలలో తయారైన కొవిడ్‌ 19 ‌నిరోధక టీకాను అపఖ్యాతి పాల్జేయడానికి రష్యా నిఘా విభాగం పనిచేస్తున్న సంగతి అమెరికా, ఇంగ్లండ్‌ ‌విదేశాంగ శాఖల దృష్టికి వచ్చిన సంగతిని కూడా ఆయన బయటపెట్టారు. ఎంత హాస్యాస్పదమంటే, పాశ్చాత్య దేశాల వ్యాక్సిన్‌ ‌తీసుకుంటే కోతులుగా మారిపోయే ప్రమాదం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారం ఆపాలని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌రష్యా మీడియాను హెచ్చరించ వలసి వచ్చింది. ఇలాంటి ప్రచారాలు చేయడమంటే ప్రపంచంలో రోగాల బారిన పడి మరింత మంది ప్రజలు చనిపోవడానికి దోహదం చేయడమేనని కూడా డాక్టర్‌ ‌హోటెజ్‌ ‌చెప్పడం సబబే అనిపిస్తుంది. కొందరి అభిప్రాయం ప్రకారం అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఒక ఉద్యమమే మొదలయింది. కొద్ది నెలల క్రితం వరకు అక్కడ వినిపించిన నినాదమే ఇందుకు నిదర్శనం. ‘నా దేహం, నా ఇష్టం’ అంటూ వ్యాక్సిన్‌ను వ్యతిరేకించినవారు అక్కడ ఎందరో ఉన్నారు.

అమెరికా అత్యాధునిక దేశం కావచ్చు. కానీ అక్కడ పాత భావాలతో జీవించే వారి తత్త్వం గురించి డాక్టర్‌ ‌హోటెజ్‌ ‌బయటపెట్టారు. అలాంటి మూఢులు మన దేశంలో కూడా కనిపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని సిసౌర్హా అనే గ్రామం ఉంది. 1500 జనాభా. ఇది సరయూ నది ఒడ్డునే ఉంటుంది. ఆ గ్రామంలోకి కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌పట్టుకుని ఏప్రిల్‌ ‌ప్రాంతంలోనే ఆరోగ్య సిబ్బంది వెళ్లింది. మాకు టీకా అవసరం లేదంటూ దాదాపు 200 మంది నదిలోకి దూకి అవతలకి పారిపోయారు. పెద్దలని పిలిచి నచ్చ చెబితే అతి కష్టం మీద 18 మంది టీకా తీసుకున్నారు. ఉజ్జయినిలో అయితే వైద్య సిబ్బందిని కొట్టారు. ఇదంతా వ్యాక్సిన్‌ ‌వ్యతిరేక ప్రచార ఫలితమే. కొంతమంది ముస్లిం మౌల్వీలు కూడా ఈ వ్యాక్సిన్‌ ‌తీసుకోవద్దని చెప్పారు. ఈశాన్య భారతంలో కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా ఇదే ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ రెండు వర్గాలలోను కొందరు మాత్రం వ్యాక్సిన్‌కు అనుకూలంగా ఉన్నారు.

భారతీయులు శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను శంకించిన సందర్భాలు తక్కువ. ఇక్కడ మూఢ నమ్మకాలు లేవని కాదు. వాటితో పాటు అత్యవసర వైద్యాన్నీ, దానికి కారణమైన శాస్త్రాన్నీ భారతీయులు ఆహ్వానించడమే కనిపిస్తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పోలియో వ్యాక్సిన్‌. ‌దేశం నుంచి పోలియోను దాదాపు పాలద్రోలారంటే కారణం వ్యాక్సిన్‌. ‌కానీ ఇక్కడే మళ్లీ కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను తిరస్కరించమంటూ ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలు తలెత్తాయి. ఇప్పుడు కొన్ని మతశక్తులు, మోదీ వ్యతిరేకులు అదే బాటలో నడుస్తున్నారు. ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌వ్యాక్సిన్‌ ‌వద్దు, మాస్క్ ‌వద్దు అంటున్నారు. వ్యాక్సిన్‌ అనే శాస్త్రీయ ఔషధాన్ని నిరాకరించమంటూ చేసే ఒక మూఢ ప్రచారం కోసం ప్రపంచంలో అత్యాధునికమైన సమాచార వ్యవస్థలను వీరు ఉపయోగించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ ‌వ్యతిరేక ప్రచారానికి వాట్సాప్‌, ‌ఫేస్‌బుక్‌, ‌యూట్యూబ్‌, ‌టెలిగ్రామ్‌ ‌వంటి వేదికలను ఉపయోగిస్తున్నారు. మాస్క్ ‌ధారణకు సంబంధించి క్లినికల్‌ ‌ట్రయిల్స్ ‌జరగలేదు, కాబట్టి దానిని నేను ధరించను అని యోహాన్‌ ‌టెంగ్రా అనేవాడు ఉద్యమం మొదలుపెట్టాడు. క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌జరగక, దీర్ఘకాలం మాస్క్ ‌పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని అతడి వాదన. కానీ కొన్ని దశాబ్దాలుగా ఆపరేషన్‌ ‌థియేటర్లలో వైద్యులు మాస్క్‌లు వేసుకుంటున్నారు. గంటల తరబడి ఉంటున్నారు. మాస్క్‌లోనే కాదు, వ్యాక్సిన్‌లో కూడా కుట్ర సిద్ధాంతం చాలామంది చూస్తున్నారు. మోడెర్నా, ఫైజర్‌ ‌వ్యాక్సిన్లు వాడితే అసలు డీఎన్‌ఏ ‌మారి పోతుందని భావిస్తున్నవారు ఉన్నారు. మీరు ఎన్ని చెప్పండి! కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ అత్యంత ప్రమాదకారి. అది వేసుకుంటే ప్రాణాలకే ముప్పు అని సందేశాలు పంపుతున్నారు. కొన్ని క్రైస్తవ సంఘాలు కొవిడ్‌ను తొక్కేస్తాం అంటూ గంతులు వేస్తున్నట్టు, అసలు కొవిడ్‌ అనేదే లేదనీ ప్రచారం చేస్తున్నారు. అందుకే కొందరు ప్రముఖులు ఇండియాకు అసలు సమస్య వ్యాక్సిన్‌ ‌లేకపోవడం కాదనీ, ప్రజలలో అవగాహన లేకపోవడ మని చెప్పవలసి వచ్చింది. మోదీ వ్యతిరేకులు, సంఘ విద్రోహుల సంఖ్య బాగా పెరగడం కూడా ఇందుకు కారణమని చెప్పుకోవాలి. ఫేస్‌బుక్‌లో సిటిజన్‌ ‌వర్సెస్‌ ‌గవర్నమెంట్‌ అన్న పేజీ ఇచ్చిన కుట్ర సిద్ధాంతం చూడండి. మే 1వ తేదీన సుదర్శన్‌ ‌టీవీ ఇచ్చిందంటూ ఇందులో ఒక వార్త కనిపించింది. భారత్‌లో కొవిడ్‌ 19 ‌కుట్ర బిల్‌ ‌గేట్స్‌దేనని అది చెప్పింది. బిశ్వజిత్‌ ‌రాయ్‌ ‌చౌధురి, తరుణ్‌ ‌కొఠారి వంటివారు ఇలాంటి కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. మాస్క్, ‌వ్యాక్సిన్‌ ‌రెండూ ఆరోగ్యానికి హానికరమని వారి వాదన. లాక్‌డౌన్‌ ‌వద్దు, సామాజిక దూరం వద్దు. మాస్క్ ‌వద్దు. పరీక్షలు వద్దు అన్న నినాదంతో అవేకెన్‌ ఇం‌డియా మూవ్‌మెంట్‌ అనే గ్రూప్‌ ‌యథేచ్ఛగా ప్రచారం చేస్తోంది.

About Author

By editor

Twitter
YOUTUBE