ఈటల రాజేందర్‌ ‌వ్యవహారం నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రాష్ట్ర రాజకీయ యవనికపై కీలకమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యూహాల్లో చతురుడిగా పేరొందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కూడా తాజా పరిణామాలతో ఆలోచనలో పడిపోయినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈటల రాజేందర్‌ ‌వ్యవహారంలో తమ దూకుడు నిర్ణయాలు, శరవేగంగా తీసుకున్న చర్యలు బెడిసికొట్టాయని కేసీఆర్‌ ‌భావిస్తున్నారట. అయినా బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అంతర్గతంగా వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కేబినెట్‌లో అత్యంత సీనియర్‌ ‌మంత్రి అయిన ఈటల రాజేందర్‌.. ‌మొత్తానికి కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రముఖుల సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు.. ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, అశ్వత్థామ రెడ్డి కూడా చేరారు. మరింత సమయం తీసుకొని ఇంకొందరితో కలిసి బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్‌ ‌భావించినా.. ఇప్పటికే ఆలస్యమైందన్న సన్నిహితుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హస్తినలో అట్టహాసంగా ఈటల రాజేందర్‌ ‌చేరిక కార్యక్రమం నిర్వహించడం తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మార్పునకు కారణమయింది.

బీజేపీలో చేరిన సమయంలో ఈటల రాజేందర్‌ ‌కేసీఆర్‌ ‌టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ వేదికగా అస్త్రాలు సంధించారు. తన ఆస్తులను టార్గెట్‌ ‌చేసిన కేసీఆర్‌.. ఆయన ఆస్తులపైనా బహిరంగ చర్చకు సిద్ధమా? అని సూటిగా ప్రశ్నించారు. తన ఆస్తులపై సిట్టింగ్‌ ‌జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ఈటల మరోసారి ప్రకటించారు. తనతో పాటు.. చాలామంది అనేక రోజులు ఘర్షణ పడ్డ తర్వాతే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏదో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. తెలంగాణలో పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్యం, విలువలు లేకుండా, ప్రజలు అసహ్యించుకునేలా సాగుతున్న పాలనను తుద ముట్టించడమే తమ కర్తవ్యమని.. శంఖారావం పూరించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఏదైనా చేయవచ్చన్న అహంకారాన్ని తొక్కి పడేస్తామని సవాల్‌ ‌చేశారు. ప్రజలు కోరుకునే, ప్రజలు మెచ్చే తెలంగాణను రూపొందిస్తామని ఉద్ఘాటించారు. కేసీఆర్‌ ‌వ్యవహార శైలి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఉద్యమకారుల అణచివేత, తెలంగాణలో బీజేపీ అనుసరించబోయే విధానం, ఆ విధానంలో తాను భాగస్వామ్యం అయ్యే తీరును గురించి ఈటల విఫులంగా తేల్చిచెప్పారు.

ఈటల చేసిన వ్యాఖ్యలు, సవాళ్లు టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమకారులందరినీ బీజేపీ జెండా కిందికి తీసుకురావడమే తన ఎజెండాగా పెట్టుకున్నట్టు ఈటల చేసిన ప్రకటన అందరినీ ఆలోచింపజేసింది. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్లెవరూ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉనికిలో లేకుండా పోయారు. లేకుండా పోయారనేకంటే.. వాళ్ల ఉనికి కూడా కనిపించకుండా.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ‌వ్యూహరచన సాగించి తెరమరుగయ్యేలా చేశారన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన, త్యాగాలు సైతం చేసిన వాళ్లెవరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాధాన్యం ఇవ్వలేదన్నది జగమెరిగిన సత్యం. ఎవరో ఒకరిద్దరు మినహా.. నిజమైన పోరాట యోధులకు ఏ పదవీ దక్కలేదు. రాజకీయంగానూ పార్టీలో ఉండి పోరాటం చేసిన వాళ్లకు కూడా కేబినెట్‌లో సముచిత స్థానం లభించలేదు. ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన నేతలు, టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను బూతులు కూడా తిట్టిన నాయకులు కొందరు ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. అసలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి అర్హతలేని వాళ్లను కూడా పార్టీలో చేర్చుకొని కీలక పదవులు కట్టబెట్టిన వ్యవహారంపై చాలాసార్లు చర్చలు జరిగినా వాటిని బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకులు కరువయ్యారు. ఇది టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ఒకరకంగా కలిసొచ్చింది. ఫలితంగా కేసీఆర్‌ ‌చెప్పిందే వేదం, కేసీఆర్‌ ‌చేసిందే శాసనం మాదిరిగా తయారయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏడు సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్న సీనియర్‌ ‌నాయకుడిగా తనకు టీఆర్‌ఎస్‌లో ఉన్న పరిస్థితులు, కేసీఆర్‌ ‌ధోరణుల గురించి తెలుసన్నారు ఈటల రాజేందర్‌. ‌మంత్రి పదవి ఔన్నత్యం కాపాడేందుకు ప్రయత్నించానని, కానీ, కేసీఆర్‌.. ‌మంత్రి పదవిని తన చెప్పుచేతల్లో ఉండేలా మార్చారని దుయ్యబట్టారు. తాను అనేకసార్లు సీఎంను అడిగినా, చివరకు ప్రశ్నించినా ఏ రోజూ మాట వినలేదని, తన మాటే కాదు.. అసలు ఎవరి మాటా వినలేదని ఈటల మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నేతృత్వంలో పనిచేస్తున్న మంత్రులు ఎవరూ సంతృప్తిగా, ప్రశాంతంగా లేరని, మనసుకు నచ్చినట్టు పనిచేయలేకపోతున్నారని కేబినెట్‌లో పరిస్థితిని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కవోని దీక్షతో పనిచేసి, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, రాష్ట్ర సాధనలో తనతో పాటు.. ఆనాటి ఉద్యమకారులు, ముఖ్యనేతల పాత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేధావులతో కమిటీ వేసి తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని, ఉద్యమకారులు, ముఖ్య నేతలకు, త్యాగాలు చేసిన వారికి సముచిత గౌరవం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఆ ‌తర్వాత కనీసం మేధావులు, ఉద్యమకారులకు అపాయింట్‌మెంట్‌ ‌కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని కేసీఆర్‌ ‌తీరుపై మండిపడ్డారు. ఇలా వందల కోట్ల రూపాయలు కేవలం ఎన్నికల కోసమే ఖర్చు చేస్తున్నారని, మొన్నటి నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో కూడా వందల కోట్లు కుమ్మరించారని ఈటల ఆరోపించారు. ఆ డబ్బులకు లెక్క చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. అవి ఎక్కడినుంచి వచ్చాయో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

భారతీయ జనతాపార్టీలో చేరిన ఈటల రాజేందర్‌.. ఆ ‌వెంటనే పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌తో భేటీ కావడం తెలంగాణలో చర్చను లేవనెత్తింది. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి చిట్టాను బయట పెడతామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్‌.. ‌జలశక్తి శాఖమంత్రిని కలవడం కీలకంగా మారింది. ఎందుకంటే కేబినెట్‌ ‌మంత్రిగా ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఈటలకు కచ్చితంగా అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే బీజేపీ వ్యూహాలకు ఈటల రాజేందర్‌ అనుభవం కలిసి వస్తుందన్న చర్చ సాగుతోంది.

అంతకు రెండురోజుల ముందుగానే ఈటల రాజేందర్‌ ‌తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరికకు ఆటంకాలు ఉండకుండా ఉండేందుకు, టీఆర్‌ఎస్‌ ‌విమర్శలు తట్టుకునేందుకు ఈటల ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈటల రాజీనామా చేసిన వెంటనే స్పీకర్‌ ఆమోదించారు. ఆ సందర్భంలోనూ కేసీఆర్‌ ‌టార్గెట్‌గా ఈటల విమర్శనాస్త్రాలు సంధించారు. హుజురాబాద్‌లో జగబోయే ఉపఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంగా అభివర్ణించారు. కేసీఆర్‌ ‌దగ్గర వందలకోట్ల రూపాయలున్నాయని, అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో గెలవాలని ఆరాట పడుతున్నారని, అయితే, ఆ నియంతృత్వ పాలనకు గోరీ కట్టడమే తన ఎజెండాగా పెట్టుకుంటానని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో తన గెలుపు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. మొత్తానికి ఈటల బీజేపీలో చేరడం భారతీయ జనతాపార్టీ సుదీర్ఘ రాజకీయ వ్యూహానికి ఓ కీలక అస్త్రమన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా సాగుతోంది.

– సుజాత గోపగోని, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE