తెలంగాణలో లాక్‌డౌన్ సంపూర్ణంగా ఎత్తివేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి లాక్‌డౌన్ క్రమక్రమంగా అన్‌లాక్ చేస్తారని అందరూ భావించారు. రాత్రి కర్ఫ్యూ విధించి పగలంతా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తారేమో అని అందరూ మానసికంగా సిద్ధమయ్యారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి అంచనాలను పటాపంచలు చేశారు.
సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ లేఖ అన్ని రాష్ట్రాలకు అందింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా.. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లాక్‌డౌన్ ఎత్తివేతలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ ఈ లేఖ రాశారు. కరోనా కల్లోలం పూర్తిగా తొలగిపోలేదని, లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాలు.. అన్‌లాక్ విషయంలో తొందరపాటు కూడదని సూచించారు. జూలైలో థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని, లాక్‌డౌన్ సడలింపులు, ఎత్తివేత విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌లు ఎత్తివేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. కేబినెట్ సమావేశం మొదలైన సమయంలోనే ఈ లేఖ రావడంతో సర్కారు సమయం ఇవ్వకుండా అత్యంత వేగంగా లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రతిసారీ కేబినెట్ సమావేశం జరిగినప్పుడు చివరి నిమిషంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుండగా… ఈసారి మాత్రం ఆగమేఘాలపై తొలుత లాక్‌డౌన్ ఎత్తివేత గురించి లీకులివ్వడం అందరినీ ఆలోచింపజేసింది. అయితే, ఇలా ముందుగానే ప్రకటించడం వెనుక కేంద్ర హోంశాఖ రాసిన లేఖ ప్రభావం ఉందన్నది లోగుట్టు. ఎందుకంటే కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిన విషయంపై సాయంత్రం వరకు మీడియాలో చర్చ జరిగిన తర్వాత తెలంగాణ కేబినెట్ లాక్‌డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటే సర్వత్రా విమర్శలు వినిపించేవి. అందుకే, ఆ లేఖ విషయం బయటకు వచ్చేసరికే..ఇటు, లాక్‌డౌన్ ఎత్తివేత, అటు.. జూలై 1నుంచి పాఠశాలల పునఃప్రారంభంపై కేబినెట్ తొలుత నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్లిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
లాక్‌డౌన్ ఎందుకు ఎత్తివేశామన్న విషయంలో కేబినెట్ వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుందన్న ప్రకటన వెలువడింది. అలాగే, దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులందించిన నివేదికల ఆధారంగానే కేబినెట్ ఈ నిర్ధారణకు వచ్చిందని పేర్కొంది.
లాక్‌డౌన్ ఎత్తివేసిన ప్రభుత్వం ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు, సూచనలు కూడా చేసింది. స్వీయ నియంత్రణ మరువద్దని హెచ్చరించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలన్నది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రావాలంటే, సంపూర్ణ సహకారం తప్పనిసరిగా అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.
ఇదే సమయంలో విద్యాసంస్థల ప్రారంభం విషయంలోనూ కేబినెట్ ప్రకటనలో ప్రత్యేకంగా పేర్కొంది. అన్ని కేటగిరీల విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయి సన్నద్ధతతో పునఃప్రారంభించాలని కోరింది. అయితే, విద్యాసంస్థల పునఃప్రారంభం నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల కొనసాగింపు, విద్యార్థుల హాజరు, ఇతర అంశాలకు సంబంధించి విధివిధానాలను విద్యాశాఖ ఖరారుచేయాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.
హైదరాబాద్‌లో పూర్తిస్థాయి కొవిడ్-19 ఆసుపత్రిగా కొనసాగుతున్న టిమ్స్‌ను ఇకపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో మూడు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికీ ఆమోదం తెలిపింది. వీటిలో హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి అవుటర్ రింగ్‌రోడ్ మధ్యలో మూడవ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రతిపాదించింది. ఈ సమావేశంలో వ్యవసాయం, సంక్షేమానికి సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకుంది.
అయితే, మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్ సంపూర్ణంగా ఎత్తివేత తొందరపాటు చర్య అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అంతటితో ఆగకుండా.. ప్రత్యేకంగా విద్యాసంస్థల ప్రారంభం గురించి తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొస్తోందంటూ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలకు తోడు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. పైగా.. థర్డ్ వేవ్‌తో పిల్లలకే ముప్పు పొంచి ఉందని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే మహారాష్ట్రలో భారీసంఖ్యలో చిన్నారులు కొవిడ్ బారిన పడుతున్నారు. అంటే, మహారాష్ట్రలో థర్డ్‌వేవ్ ఇప్పటికే మొదలైందన్న చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర తెలంగాణకు పొరుగు రాష్ట్రమే. తరచూ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు తెరవడం, అది కూడా అన్ని స్థాయిల విద్యాసంస్థల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక్కడే ఓ అంశం చర్చకు వస్తోంది. గత విద్యాసంవత్సరంలో కూడా ఉన్నట్టుండి కొద్దిరోజులపాటు పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. ప్రత్యక్ష బోధనకు కూడా అనుమతిచ్చింది. అయితే, అప్పటికీ కరోనా ముప్పు తొలగిపోలేదు. కానీ, సర్కారు మాత్రం అధికారికంగా అనుమతులివ్వడంతో కొద్దిరోజుల పాటు.. విద్యాసంస్థలన్నీ తెరిచారు. ప్రధానంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో తెరిచారు. దాంతో విద్యార్థుల నుంచి రావాల్సిన ఫీజులన్నీ విద్యాసంస్థలు ముక్కుపిండి మరీ వసూలు చేశాయి. పైతరగతులకు ప్రమోట్ చేయాలంటే ఫీజులు బకాయిలు లేకుండా మొత్తం చెల్లించాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాయి. అసలే కరోనా లాక్‌డౌన్‌తో కుదేలైపోయిన మధ్యతరగతి వర్గాలకు ఈ పరిణామం ఆశనిపాతమయింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించింది. అదే సమయంలో రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో, ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వందలసంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో, దిగొచ్చిన ప్రభుత్వం విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసుకున్నారు. కేవలం ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకే ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కూడా విద్యాసంస్థల ప్రారంభంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో అవే పరిణామాలు అందరికీ, ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సిన సమయం దాటిపోతున్న క్రమంలో మరోసారి అలాంటి పరిస్థితులు సృష్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకుందా? అన్న సందేహాలు తొలచివేస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ సాగుతున్న హెచ్చరికల కారణంగా.. కొద్దిరోజుల పాటు అయినా విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించు కున్నట్లు సమాచారం. అయితే, ఈ అవకాశాన్ని ప్రైవేటు యాజమాన్యాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినికిడి. తల్లిదండ్రులను భయపెట్టి.. ఫీజులు వసూలు చేయించుకోవచ్చన్న ప్రణాళిక చేసుకొని ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక, ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా పేరొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. కేబినెట్ సమావేశం జరిగిన మరుసటిరోజు నుంచే జిల్లాల పర్యటనలు రూపొందించుకున్నారు. పలు జిల్లాల్లో ఆర్భాటంగా పర్యటనలకు పూనుకున్నారు. అయితే, ఈ పర్యటనల వెనుక హుజురాబాద్ ఉపఎన్నికల వ్యూహం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068