జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి జూన్‌ 22 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం

మన భరతమాత రత్న గర్భ. ఈ గడ్డపై జన్మించిన అగణిత మహాపురుషుల జీవితాలు, వారు మన ముందుంచిన ఆదర్శాలు, మన జాతీయ జీవన లక్ష్యమైన రాష్ట్ర పునర్‌ ‌వైభవ సాధనా మార్గంలో దీపస్తంభాల వలె నిలిచి, మనకు నిత్యమూ దారి చూపుతూ, రత్నాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ మహాపురుషుల ఉత్తేజకరమైన స్మృతులు, ఉదాహరణలు జాతి మనోపలకంపై స్వచ్ఛందంగా సదా నిలిచి ఉండాలి. వారి చర్యలను సరైన దృష్టికోణంలో భావితరాలు అర్థం చేసుకోవాలి.

అయితే ఆ మహాపురుషులు రూపొందించిన ఆదర్శాలను మననం చేసుకొని ఆచరణలో పెట్టే సంప్రదాయంలో నేడు ఒక విచిత్రమైన వికృతి మన సమాజంలో ప్రవేశించినట్లు కనబడుతుంది. మహాపురుషు లంతా మానవాతీతులని భావిస్తూ, సామాన్య మానవుడు తాను పరిస్థితుల ప్రాబల్యానికి లొంగిపోయే బలహీన ప్రాణిని మాత్రమే అని అనుకొంటూ, మహాత్ములను దివ్యాత్మలుగా ప్రకటిస్తూనే, తాను మాత్రం తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఒక సురక్షిత మార్గాన్ని వెతుక్కొంటున్నాడు. ఆపదలొచ్చినపుడు భగవంతుని ప్రార్థిస్తూ తాను మాత్రం బాధ్యతా రహితంగా ఉండటానికి అలవాటుపడుతున్నాడు. కొంతమందిలో ఇట్టి వికృత మనస్తత్వాన్ని తొలగించి, దాని స్థానంలో పౌరుషాన్ని, ప్రయత్న శీలతను నెలకొల్పాలి. ప్రయత్నమే పరమేశ్వరుడన్న సమర్థరామదాసు మాటలు నాటికీ, నేటికీ అనుసరణీయం. ఈ నేపథ్యంలోనే మనమంతా హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ప్రతిఏటా జరుపుకుంటున్నాం.

విజేతలను మాత్రమే ఆరాధించడం మన సనాతన సంస్కృతిలో ఒక భాగం. పరిస్థితులకు దాసుడైన ఏ వ్యక్తిని మనం ఆదర్శంగా స్వీకరించలేదు. పరిస్థితులను తన సామర్థ్య, సౌశీల్యాల ప్రభావంతో అదుపులోకి తీసుకుని, వాటి గతినే మార్చివేసి, తన జీవిత ఆశయ, ఆకాంక్షల సాధనలో పూర్తిగా విజయం పొంది, నిరాశా పూరిత హృదయాల్లో విశ్వాసం నింపి, మృత్యు ముఖంలో ఉన్నవారికి జీవం పోసిన వారి కోవకు చెందినవారే ఛత్రపతి శివాజీ మహారాజు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత సమాజంలో తీవ్ర నిరాశ నెలకొన్నది. ఈ నిరాశ పరిణామంగా ఆత్మవిశ్వాసం కోల్పోయాం. దీని కారణంగా స్వార్థం, అంతః కలహాలు, విదేశీ శక్తుల విజృంభణ పెరిగాయి. ఒకవైపు ఢిల్లీ ముస్లింల చేతిలో ఉంది. మరోవైపు హిందూ సమాజంలో ‘ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనేది నాటుకుపోయింది. వీటన్నిటినీ పటాపంచలు చేసింది 1674 సంవత్సరంలో రాయగడ్‌ ‌కోటలో హిందూ పద పాదుషాహీగా శివాజీకి జరిగిన పట్టాభిషేకం. హిందూస్వరాజ్య స్థాపనతో ఐదు శతాబ్దాల ఒక సమస్యకు పరిష్కారం లభించింది.

1630లో పూనా సమీపంలోని శివనేరి దుర్గంలో జన్మించిన శివాజీ.. తల్లి జిజా మాత పెంపకం ద్వారా దేశభక్తిని పుణికి పుచ్చుకొన్నాడు.

భూషణ కవి.. ఔరంగజేబు కొలువును కాలదన్ని తన ‘శివచావని’ కావ్యాన్ని శివాజీ ఎదుట గానం చేసారు. అలాగే కాశీలో విశ్వనాథ ఆలయ విధ్వంసాన్ని కళ్లారా చూసినవాడు, ఆ ఆలయ పరంపరాగత పూజారుల వంశంలో పుట్టినవాడైన గంగాభట్టు కూడా ‘ఆలయాలు అలవోకగా ధ్వంసం అవుతున్న వేళ దీనిని అడ్డుకోగల వారెవ్వరు?’ అని అడుగుతూ అడుగుతూ పోగా శివాజీ పేరు ఆయన చెవినపడింది. వెంటనే మహారాష్ట్రకు పయనమయ్యాడు. నాసిక్‌ ‌నుండి ప్రయాణిస్తూ శివాజీ వద్దకు వచ్చేలోగా శివాజీ గురించిన సమస్త విషయాలను తెలుసుకొన్నాడు. కొన్ని విషయాలు ఆయనకు ప్రత్యక్షంగా అనుభవమయ్యాయి కూడా. ఆయన శివాజీని కలుసుకొని ‘‘మీరు సింహాసనాన్ని అధిష్టించాలి’’ అని అన్నారు. అయితే ఈ పట్టాభిషేక పరిణామం ‘‘మహారాష్ట్రలో ఒక సింహాసనం ఏర్పడింది. శివాజీ రాజు అయ్యాడు’’ అనేంత మాత్రానికే పరిమితం కాలేదు. 1666 సంవత్సరంలో ఔరంగజేబును కలుసుకునేందుకు శివాజీ ఆగ్రా వెళ్లినప్పుడు, ఏమౌతుందో అని యావత్తు హిందూ సమాజం దృష్టి అటే ఉంది. అది అంతిమ పరీక్ష అని అందరూ అర్థం చేసుకున్నారు. అందరూ కదనశూరులే. వారికి కూడా హిందూ స్వరాజ్యం కావాలి. మాటలు వేరు వేరుగా ఉండవచ్చు. కాని శివాజీ చేస్తున్న ఉద్యమం నిజంగా సఫలమౌతుందా? కాదా? అన్న అనుమానం అప్పుడు వచ్చింది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూడనారంభించారు. తనను మోసపుచ్చిన ఔరంగజేబు దర్బారులోంచి (బందీఖాన నుంచి) ఉపాయంతో తప్పించుకొని, అన్ని చిక్కులను అధిగమించి తన 1498 మంది అనుయాయులతో సహా స్వస్థలానికి క్షేమంగా చేరుకున్న శివాజీ.. పట్టాభిషేకం జరుపుకొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి?

రాజస్తాన్‌లోని రాజపుత్ర రాజులందరూ తమ అంతఃకలహాలను విడిచిపెట్టి దుర్గాదాస్‌ ‌రాథోడ్‌ ‌నాయకత్వంలో ఒకటిగా నిలిచారు. దాని ఫలితంగా శివాజీ పట్టాభిషేకం తరువాత కొన్ని సంవత్సరాలకే విదేశీ ఆక్రమణదారులందరూ రాజస్తాన్‌ ‌ప్రాంతాన్ని విడిచిపోవలసి వచ్చింది. ఆ తరువాత ఏ మొగలులూ, ఏ తుర్కీయులు కూడా ఇక రాజస్తాన్లో రాజులుగా పాదం మోపలేకపోయారు. సేవకులుగా వచ్చి ఉంటే వచ్చి ఉండవచ్చు.

రాజా ఛత్రసాల్‌ ‌ప్రత్యక్షంగా శివాజీ నుంచే ప్రేరణ పొందాడు. ఆయన తండ్రి సంపత్‌ ‌రాయ్‌ ‌కాలమంతా మొగలులతో సంఘర్షణలోనే గడిచిపోయింది. శివాజీ మహారాజు కార్యశైలిని, యుద్ధనీతిని ప్రత్యక్షంగా చూసి వచ్చిన ఛత్రసాల్‌ ‌తన స్వస్థలమైన బుందేల్‌ఖండ్‌ ‌వెళ్లాడు. విజయాల మీద విజయాలు సాధించి స్వధర్మ ప్రభాశోభిత మైన సామ్రాజ్యాన్ని అక్కడ నిలిపి ఉంచాడు.

 అస్సాం రాజైన చక్రధ్వజ సింహుడు ‘‘అక్కడ శివాజీ అనుసరించిన నీతినే అనుసరించి మన అస్సాంలో కూడా ఏ ఆక్రమణకారుడూ అడుగు పెట్టకుండా చూస్తాను’’ అని ప్రతిజ్ఞ చేసాడు. దీని ఫలితంగా బ్రహ్మపుత్ర తీరం నుంచి విదేశీయులందరూ వెనక్కుపోవలసి వచ్చింది. అస్సాం ఎప్పుడూ మొగలుల బానిస కాలేదు, ఇస్లాంకు దాసోహం కాలేదు. శివాజీ పాటించిన నీతినే అవలంబించి మొగలులను తరిమి కొట్టాలనేది చక్రధ్వజ సింహుడు చెప్పిన మాట, ఆచరించి చూపిన బాట.

కూచ్‌ ‌బిహార్‌ ‌రాజు రుద్ర సింహుడు శివాజీ పద్ధతిలోనే పోరాటం జరిపి విజయం సాధించాడు. ‘‘ఈ విధంగానే ఈ విదేశీ మూకలైన దుర్మార్గులను బంగాళాఖాతంలో ముంచె య్యాలి’’ అన్న ఉత్సాహం దేశ నలుమూలల ఉప్పొంగింది.

చరిత్రలోకి తొంగి చూస్తే ఎంతమంది రాజులు మనల్ని పాలించలేదు? ఎవరి పట్టాభిషేక ఉత్సవాన్ని జరుపుకోము? కేవలం శివాజీదే ఎందుకు? శివాజీ గొప్పతనం ఏమిటి? రాజవంశీయుల వారసత్వం పుచ్చుకొన్న కుటుంబమా? కాదు. సాధనాలు, సంపదలు ఉన్నాయా? లేదు. పెద్ద సైన్యం అంటూ ఉండేదా? లేదు. సంపూర్ణ సమాజం మద్దతు పలికిందా? లేదు. అయినప్పటికీ, ప్రారంభంలో చెప్పిన నిరాశామయ వాతావరణం సర్వత్రా ఉన్నప్పటికీ సమాజంలో ఒక ఆశని, స్వాభిమానాన్ని నింపగలిగాడు. హిందూ సమాజంలోని పౌరుష పరాక్రమాల రుచిని శత్రువులకు చూపించాడు. అంతేకాదు శత్రువులను ఎదుర్కోవటంలో ఏది సరైన పద్ధతి అనేది స్వయంగా ఆచరించి చూపించాడు. ముల్లును ముల్లుతోనే, మోసాన్ని మోసంతోనే జయించాలని అఫ్జల్‌ఖాన్‌ ‌వధ వంటి సంఘటనల ద్వారా సమాజానికి తెలియజేశాడు. 350 కోటలు జయించాడు, 300 పైగా యుద్ధాలు చేశాడు కానీ ఎన్నడూ ఓడిపోలేదు. గెలుపే లక్ష్యం. సంపూర్ణ హిందూ సమాజాన్ని మ్లేచ్చుల నుండి ముక్తి గావించడమే తన లక్ష్యం. ఈ భావన తనలో మాత్రమే కాదు, తన యావత్‌ అనుయా యులలోనూ, తన రాజ్యంలోని ప్రజలలోనూ నింపాడు. దీనికి కారణం ఈ కార్యాన్ని తన సొంత కార్యంగా భావించ లేదు. ఈశ్వరీయ కార్యంగానే భావించాడు. తండ్రిని బీజాపూర్‌ ‌సుల్తాన్‌ ‌బందించినప్పుడు ఢిల్లీ చక్రవర్తి షాజహాన్‌ ‌సహాయం కోరడం ద్వారా బీజాపూర్‌ ‌సుల్తాన్‌ని భయపెట్టి యుద్ధం చేయకుండానే తండ్రిని విడిపించుకున్నాడు. ఎప్పుడు సాహసం ప్రదర్శించాలి, ఎప్పుడు వెనుకడుగు వేయాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు అణిగి ఉండాలి.. ఇలా అనేకమైన రాజకీయ చతురతకు సంబంధించిన అంశాలు ఆయన జీవితంలో మనకు కనబడతాయి. నౌక, అశ్వ, పదాతి దళాలను ఒకేసారి ఉపయోగించే వ్యూహరచన చేసిన మన రాజులలో శివాజీ మొదటి యుద్ధనీతి కోవిదుడు. మతం మార్చబడి శత్రువులవైపు ఉన్న నేతాజీ పాల్కర్‌, ‌బజాజీ నింబాల్కర్లను పునరాగమనం చేసి సొంత బంధువులతో పెళ్లిళ్లు చేయించాడు. సింధు దుర్గం, సువర్ణ దుర్గం, పద్మ దుర్గం, విజయ దుర్గం వంటి జల దుర్గాలను నిర్మించి, నావికా దళాన్ని నిర్మాణం చేశాడు. ఫిరంగుల తయారీ మొదలు పెట్టాడు. ఇలా ఎంతో దూరదృష్టిని ప్రదర్శించాడు. సతీ సహగమనం రద్దు, అంటరాని తనం నిర్మూలన చేసిన గొప్ప సమాజోద్ధారకుడు శివాజీ. జమీందారీ, వతన్దారీ వ్యవస్థలను రద్దు చేసాడు. సమాజ సంపదకు మనం ధర్మకర్తలం మాత్రమే కనుక ధర్మకర్తలుగా మనకు ‘హోదా’ ఉంటుందే తప్ప ‘హక్కు’ ఉండదు అన్నాడు. అప్పటి సర్దార్లకు, జాగీర్దార్లకు సొంత సైన్యాలు రద్దు పరిచాడు. పేదల పొలాలకు పన్నులో రాయితీలు కల్పించాడు. దుర్మార్గులకు కఠిన దండన అమలు చేసాడు, అష్టప్రధాన్‌ ‌వ్యవస్థ ఏర్పాటు గావించాడు. చెరువులు, బావులు తవ్విం చాడు. చెట్లు, అరణ్యాలు పెంచడానికి ప్రాధాన్య మిచ్చాడు. రహదారులు, ధర్మశాలలు, దేవాలయాలు నిర్మించాడు. పటిష్ట గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్య రక్షణకు గొప్ప భత్రను కల్పించిన సత్పరిపాలకుడు శివాజీ. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ తనకొరకు స్మారకాలు కట్టించుకోలేదు. స్వీయ జీవితం – సత్‌ ‌శీల యుక్తం. అధికారం కోసం హత్యలు లేవు, స్వరాజ్యం సాధించడమే లక్ష్యం కాదు, సురాజ్యం కూడా నిర్మించే విధంగా చక్కటి పరిపాలన వ్యవస్థ చేసాడు. ఇంతా చేసి ఇది నాది కాదు, అంతా ఆ ‘ఈశ్వరేచ్ఛ’ అనేవాడు. 1677లో శ్రీశైలంలో అమ్మవారి ఎదుట సంపూర్ణ వైరాగ్యంతో ఆత్మ సమర్పణ ప్రయత్నం కూడా చేశాడు. ఇది ఆయనలోని సమర్పణ భావానికి ప్రతీక.

శివాజీ అనంతరం అనేక సంవత్సరాలుగా  మహారాష్ట్ర ప్రాంతంలో చెప్పుకోదగ్గ నాయకుడు లేడు. శంభాజీ పట్టుబడ్డాడు. మ్లేచ్చులు నానా హింసబెట్టి అతడ్ని చంపారు. సాహు మొగలుల నిర్భందంలో ఉండిపోయాడు. రాజారాం జింజీకోటలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాడు. రాజు, ఖజానా, సైన్యం, సేనాపతి ఇవేమి లేని పరిస్థితులలో కూడా ప్రజలు స్వరాజ్య భావన మూర్తీభ వించినట్లు, శివాజీ తమను ఆవహించినట్లు యుద్ధం కొనసాగించారు. ఫలితంగా ఔరంగజేబు 27 సంవత్సరాలు పోరాడి అలసిపోయి, ఓడిపోయి నిస్పృహతో, భగ్న హృదయుడై మరణించాడు. ఇదే ఆ తరువాతి తరానికి ఆదర్శం. యుద్ధం చేసేది కత్తి కాదు, తుపాకి కాదు, దాని వెనుక ఉన్న హృదయం మాత్రమే అన్నది యథార్థం. హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయడంలో శివాజీ సైనికులు, శివాజీ అనంతరం ఆ సామ్రాజ్యంలోని ప్రజలు చేసిన పోరాటం దీనిని నిరూపిస్తున్నది. ఏ దేశమైనా, తాము ఎంత మందుగుండు సామాగ్రి లేదా ఎన్ని ఆయుధాలు కలిగి ఉన్నామనేది ముఖ్యం కాదు. ఈ రోజు మనదేశ సార్వభౌమత్వానికి విసురుతున్న అంతర, బాహ్య సవాళ్లను ఎదుర్కొవాలంటే శివాజీ నిర్మించిన హిందూ సామ్రాజ్యం, అందుకోసం ఆయన సాగించిన సాధనామార్గం మనకెంతో ఆదర్శం. శివాజీ తర్వాత, రాజుతో నిమిత్తం లేకుండా రాజ్యాన్ని శత్రువుల వశం కానీయకుండా కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తులై ఎంతో దేశభక్తిని ప్రదర్శించారు. అలాంటి పనిని నేడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తన శాఖల ద్వారా చేస్తున్నది. స్వయంసేవకులలో దేశభక్తితో బాటు విజయ ప్రవృత్తిని కూడా నిర్మాణం చేస్తున్నది.

మనది కర్మభూమి, పురుష ప్రయత్నమే ప్రధాన మైన భూమి. ఈ పురుష ప్రయత్నమే నేటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనలను ముందడుగు వేయిస్తు న్నది. ఆ మహాత్ములను దేవతలుగా గాక, సామాన్య మానవులై ఉండి కూడా తమ ప్రయత్నం ద్వారా మహోన్నతిని సాధించిన వారిగా గౌరవిద్దాం. వారి మేధస్సు, ధైర్యం, త్యాగం, కరుణ మొదలగు పురుషోచితమైన సద్గుణాల సామర్థ్యం చేత వారు అట్టి ఉన్నత శిఖరాలను అందుకొన్నారు. కనీసం కొంత మేరకైనా అట్టి సుగుణాలను మన జీవితంలో సాక్షాత్కరించుకోగలమని ఎందుకు విశ్వసించరాదు?

విశ్వసించి ఎందుకు ప్రయత్నించరాదు? తప్పక ప్రయత్నిద్దాం. జై భవానీ – వీరశివాజీ.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE