ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌.. 37 ‌సంవత్సరాల నాటి ఈ ఘటన గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. నాటితరం వారికి బాగా గుర్తుండే ఉంటుంది. సిక్కులు పరమ పవిత్రంగా భావించే అమృత్‌సర్‌ ‌స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఉగ్రవాద మూకలను ఏరివేసేందుకు సైన్యం పెట్టిన పేరే.. ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌. 1984 ‌జూన్‌ ‌మొదటి వారంలో జరిగిన ఈ ఘటన దేశంలో ఉద్రిక్తతలకు దారితీసింది. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య దాదాపు ఆరు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో 83 మంది సైనికులు మరణించగా 249 మంది గాయపడ్డారు. 492 మంది పౌరులు హతులయ్యారు. ఉగ్రవాదులు సైతం పెద్దయెత్తున మరణించారు. అనధికార లెక్కల ప్రకారం రెండువైపులా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. స్వర్ణ దేవాలయంపై సైనికచర్యతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ ఘటన జాతీయ సమగ్రత, సమైక్యతకే సవాల్‌ ‌విసిరింది. హిందూ, సిక్కు సమాజాల మధ్య తెలియని అంతరాలు ఏర్పడ్డాయి. రెండు మతాల వారి మధ్య అనుమానపు నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకరినొకరు నమ్మే పరిస్థితి పోయింది. ఆపరేషన్‌ ‌బ్లూ స్టార్‌ ‌జరిగిన కొద్దినెలల్లోనే 1984 అక్టోబరు 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అంగరక్షకుల దాడిలో హత్యకు గురయ్యారు. అంగరక్షకులు ఇద్దరూ సిక్కు మతస్థులే కావడం గమనార్హం. స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య సమయంలో ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఏఎస్‌ ‌వైద్య పదవీ విరమణ అనంతరం హత్యకు గురయ్యారు. కాలక్రమంలో పరిస్థితి చక్కబడింది. మతాల మధ్య అంతరాలు తొలగాయి. అనుమానాలు వీడాయి. నీలినీడలు వీడాయి. రెండు మతాలవారు సోదరభావంతో జీవిస్తున్నారు. వ్యవసాయ రాష్ట్రంగా పేరొందిన పంజాబ్‌ ‌జనజీవన స్రవంతిలో కలిసింది. ప్రగతి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. పరుగులు పెడుతోంది. ఇదీ… నడుస్తున్న చరిత్ర.

అయితే ఈ ప్రశాంతతను చెడగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నిస్తున్నాయి. మానిన గాయాలను మళ్లీ కెలుకుతున్నాయి. ప్రజల్లో విభజన తెచ్చేందుకు, వారిలో విషబీజాలను నాటేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. శాంతియుతంగా, సాఫీగా సాగిపోతున్న ప్రజల జీవితాల మధ్య చిచ్చు పెట్టేందుకు, వారిలో అపోహలను పెంచేందుకు అదే పనిగా శ్రమిస్తున్నాయి. ఆపరేషన్‌ ‌బ్లూ స్టార్‌ ‌వార్షికోత్సవం పేరిట కొందరు నాయకులు చేపట్టిన కార్యక్రమాలు, చేసిన నినాదాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. అమాయక ప్రజలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంకుచిత భావాలను విడనాడి, విశాల దక్పథంతో, దేశ విశాల హితాన్ని గమనంలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్వర్ణ దేవాలయంపై సైనికచర్య చేపట్టి 37 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 6న కొందరు ‘ఖలిస్తాన్‌ ‌డే’ నిర్వహించడం, ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు చేయడం తీవ్రంగా పరిగణించవలసిన విషయం. అంతేకాక నాటి ఘటనలో మరణించిన ఉగ్రవాదులను అమరవీరులు అంటూ నివాళులు అర్పించడం మరింత తీవ్రమైన విషయం. నాటి ఘటనలకు నాయకత్వం వహించిన ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాది జర్నయిల్‌ ‌సింగ్‌ ‌భింద్రన్‌ ‌వాలేను అమరవీరుడు అంటూ కీర్తించడం ఎలా సమంజసమో, ఎంతవరకు సహేతుకమో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాక భింద్రన్‌ ‌వాలే తనయుడిని సత్కరించడం మరో విపరిణామం. ఈ సత్కారం ద్వారా అతని మనసులో విషబీజాన్ని నాటారు. ఖలిస్తాన్‌ ‌డే పేరిట జూన్‌ 6‌న నిర్వహించిన కార్యక్రమాల్లో సినీనటుడు, రాజకీయ కార్యకర్త, రైతు నేత దీప్‌ ‌సిద్ధూ పాల్గొనడం ఆందోళన కలిగించే అంశం. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకానికి జరిగిన అవమానం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన ముద్దాయిగా దీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దీప్‌ ‌సిద్ధూ ఖలిస్తాన్‌ ‌డే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దీనిని బట్టి ఆ కార్యక్రమాలు ఎలాంటివో, వాటికి హాజరైన వారు ఎలాంటివారో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.

అన్నింటికీ మించి ప్రముఖ క్రికెటర్‌ ‌హర్భజన్‌ ‌సింగ్‌ ఉ‌గ్రవాది సంత్‌ ‌జర్నయిల్‌ ‌సింగ్‌ ‌భింద్రన్‌ ‌వాలేకు నివాళులు అర్పిస్తూ ట్వీట్‌ ‌చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. హర్భజన్‌ను క్రికెట్‌ అభిమానులు ముద్దగా ‘భజ్జీ’గా పిలుచుకుంటారు. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మరళీధరన్‌ ‌తరవాత అత్యధిక వికెట్లు తీసిన ఘన చరిత్ర భజ్జీకి ఉంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఈ ఆఫ్‌ ‌స్పిన్నర్‌కు భారత క్రికెట్‌ ‌రంగం ఎన్నో అవకాశాలు అందిం చింది. అతని ప్రతిభా పాటవాల ప్రాతిపదికనే అవకాశాలు వచ్చాయి. అంతే తప్ప ఒక మతానికి చెందిన వ్యక్తిగా అతనికి అవకాశాలు రాలేదు. క్రికెట్‌ అభిమానులు సైతం భజ్జీ ఆటనే ఆస్వాదిస్తారు. అతని వ్యవహారశైలిని అభిమానిస్తారు. అతని ప్రతిభా పాటవాలను గుర్తిస్తారు. హర్భజన్‌ ఇవేమీ తెలియని అమాయకుడు కారు. వివేచన లేని వ్యక్తి అంతకన్నా కారు. కానీ అంతటి వ్యక్తిని సైతం కొన్ని అవాంఛనీయ శక్తులు ప్రభావితం చేశాయి. దీంతో భజ్జీ సైతం అమర వీరులకు వందనాలు అంటూ ట్వీట్‌ ‌చేసి చివరికి నాలిక కరచుకున్నారు. దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శలను చూసి వెనక్కి తగ్గారు. జరిగిన ఘటనలకు విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. తాను సమైక్య భారతాన్ని కోరుకునే సిక్కునని, బాధ్యతాయుతమైన పౌరుడినని స్పష్టం చేశారు. వేర్పాటువాదాన్ని, ఖలిస్తాన్‌ ‌వాదాన్ని, నినాదాన్ని సంపూర్ణంగా నిరసిస్తానని, వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. దాదాపు 103 టెస్టులు ఆడి, 417 వికెట్లు తీసిన హర్భజన్‌ ‌పొరపాటును సవరించుకుని హుందాగా వ్యవహ రించారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని, వారి మనోభావాలకు భిన్నంగా వ్యవహరించబోనని వివరించారు. ఇది ఆహ్వానించదగ్గ అంశం. ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాడు హర్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

వాస్తవానికి భింద్రన్‌ ‌వాలే ఉగ్రవాది కాదు. పంజాబ్‌లో అకాలీదళ్‌ ‌ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు కేంద్రంలోని నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అతన్ని కావాలనే ప్రోత్సహించింది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ప్రస్తుత మోగా జిల్లాలో ఆయన జన్మించాడు. దీనిని ఇటీవలే జిల్లాగా ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రాంతం ఫరీద్‌ ‌కోట జిల్లా పరిధిలో ఉండేది. కేంద్రం ప్రోత్సాహంతో భింద్రన్‌ ‌వాలే రెచ్చిపోయాడు. చివరకు ఆయన కేంద్ర పెద్దలకు ఏకు మేకుగా మారాడు. దీంతో అతనిపై ప్రభుత్వం కన్నేసింది. క్రమంగా అతని వెంట మరికొందరు నడిచారు. వీరికి నాటి పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం, ఆ దేశానికి చెందిన గూఢచారి సంస్థ ఐ.ఎస్‌.ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్) ‌పరోక్షంగా సహాయ సహకారాలు అందించింది. పవిత్ర స్వర్ణ దేవాలయం విస్తరించిన అమృత్‌సర్‌ ‌నగరం నుంచి పాకిస్తాన్‌ ‌సరిహద్దు కేవలం 32 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడే ఉభయ దేశాలకు చెందిన అట్టారీ – వాఘా సరిహద్దు విస్తరించి ఉంది. ఇక్కడ నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఉభయ దేశాల బలగాల కవాతు జరుగుతుంది. దీనిని చూడటానికి నిత్యం ప్రజలు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో సరిహద్దుల్లో ఏదో ఒక విధంగా భద్రతా బలగాల కన్నుగప్పి ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు పాక్‌ ‌సాయమందించేది. ఈ విషయాన్ని అప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ (‌ప్రస్తుత రష్యా) గూఢచార సంస్థ ‘కేజీబీ’ సైతం నిర్ధారించడం గమనార్హం. ఈ క్రమంలో పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. కెనడాలో స్థిరపడ్డ సిక్కులు వేర్పాటువాదులకు అన్నివిధాలా అండగా నిలిచారన్నది చేదు నిజం. భారత్‌లో కన్నా కెనడాలోనే ఎక్కువ మంది సిక్కలు ఉన్నారు. అక్కడి ప్రభుత్వంలో వారు మంత్రులుగా ఉండటం గమనార్హం. ఇటీవల కెనడా అధినేత జస్టిన్‌ ‌ట్రూడో భారత్‌లో జరుగుతున్న రైతుల ఉద్యమానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసు పాలయిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్‌ ఆం‌దోళన జరుగుతున్న సమయంలోనే సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న 1973 అక్టోబరు నాటి ఆనందపూర్‌ ‌సాహిబ్‌ ‌తీర్మానం తెరపైకి వచ్చింది. లండన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డ కొందరు సంపన్న సిక్కులు ఉగ్రవాదులకు దన్నుగా నిలిచారు. క్రమంగా స్వర్ణ దేవాలయం ఉగ్రవాదుల నిలయంగా మారింది. స్వయంగా అప్పటి అకాలీదళ్‌ అధ్యక్షుడు సంత్‌ ‌హరచంద్‌సింగ్‌ ‌లొంగోవాల్‌ ‌తనకు స్వర్ణ దేవాలయంలో బస కల్పించాలని కోరడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో 1984 జూన్‌ ఒకటిన కేంద్ర ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కేంద్రం మరుసటి రోజు సైనిక చర్యకు సిద్ధమైంది. తెల్లవారు జామున స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించిన సైనికులు ముందుగా లొంగిపొమ్మని ఉగ్రవాదులను పలుమార్లు హెచ్చరించారు. దీనిని విస్మరించి వారు కాల్పులకు దిగడంతో అనివార్యంగా బలగాలు తమ ఆయుధాలకు పనిచెప్పాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో సంత్‌ ‌జర్నయిల్‌ ‌సింగ్‌ ‌భింద్రన్‌ ‌వాలే హతమయ్యాడు. అతని మృతదేహాన్ని గుర్తించారు. కాల్పుల సమయంలో సైనికులు అత్యంత సంయమనం, నిగ్రహం పాటించారు. మరీ ముఖ్యంగా అఖల్‌ ‌తక్త్ ‌పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వ్యవహరించారు. ఎట్టకేలకు ఆరోతేదీ నాటికి సైన్యం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చింది. కొందరు ఉగ్రవాదుల మరణం, మరికొందరు లొంగిపోవడంతో సైన్యం ‘ఆపరేషన్‌ ‌బ్లూ స్టార్‌’ ‌ను ముగించింది. తరవాత అధికారం చేపట్టిన రాజీవ్‌ ‌గాంధీ, అకాలీ అధ్యక్షుడు మధ్య కుదిరిన పంజాబ్‌ ఒప్పందం పరిస్థితిని చక్కదిద్దలేకపోయింది. అనంతరం అధికారం అందుకున్న విశ్వనాద్‌ ‌ప్రతాప్‌సింగ్‌ ‌సైతం పంజాబ్‌ ‌పరిస్థితిని మార్చలేకపోయారు. 1996లో అధికార పగ్గాలు అందుకున్న పి.వి. నరసింహారావు సంక్షుభిత రాష్ట్రంలో ఎన్నికల పక్రియను ప్రారంభించి శాంతికి బాటలు పరిచారు. అప్పటినుంచి రాష్ట్రంలో శాంతి పరిఢవిల్లుతోంది.

సైనిక చర్యను దేశవ్యాప్తంగా కొందరు వ్యతిరేకించగా మరికొందరు సమర్థించారు. ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ చక్రం తిప్పుతోంది. ఆ పార్టీకి చెందిన పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి జ్ఞానీ జైల్‌సింగ్‌ను ఇందిరాగాంధీ 1980లో తిరిగి గెలిచిన తరవాత మంత్రివర్గంలోకి తీసుకుని హోంశాఖను కట్టబెట్టారు. అప్పటికే ఉగ్రవాదంతో పంజాబ్‌ అట్టుడుకుతోంది. దీంతో ముందుచూపుతో వ్యవహరించి తరవాత జైల్‌ ‌సింగ్‌ను రాష్ట్రపతిని చేశారు. ఒక సిక్కు మతస్థుడిగా సైనిక చర్యను జైల్‌ ‌సింగ్‌ ‌సమర్థించలేకపోయారు. అదే సమయంలో కీలకమైన రాజ్యాంగ పదవిలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేపోయారు. నాటి పరిస్థితులను గమనంలోకి తీసుకున్నప్పుడు సైనిక చర్య అనివార్యం. అంతకుమించి మరో ప్రత్యమ్నాయం లేదు. ప్రపంచంలోని ఏ దేశం సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్పాటువాదాన్ని ఉపేక్షించదు. హింసను చూస్తూ ఊరుకోదు. దేశ సమగ్రత, సమైక్యతకు భంగం వాటిల్లకుండా ఆందోళన కారుల డిమాండ్లను తీర్చడానికే ప్రయత్నిస్తుంది. అంతేతప్ప ప్రత్యేక దేశ వాదనకు అంగీకరించదు. పరిస్థితులు చేతులు దాటిన సమయంలోనే తీవ్రమైన చర్యకు ఉపక్రమిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా నాటి పరిస్థితుల్లో ఆపరేషన్‌ ‌బ్లూ స్టార్‌ అనివార్యం. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కఠినమైన చర్య తీసుకోక తప్పదు. అప్పుడు జరిగింది అదే. సైనిక చర్య ద్వారా స్వర్ణ దేవాలయం పవిత్రతకు భంగం వాటిల్లిందన్న విమర్శలు అప్పట్లో కొంతమంది మేధావులు, కొందరు విపక్షనేతలు, తటస్థుల నుంచి వచ్చాయి. ఈ వాదనలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. ఉగ్రవాదులు ఏళ్ల బాటు తిష్ట వేసి అమాయక ప్రజలను రెచ్చగొట్టి నప్పుడు, ఆయుధాలను పోగుచేసుకున్నప్పుడు, జాతి వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించినప్పుడు ఆలయ పవిత్రతతకు కలగని భంగం, సైన్యం ప్రవేశంతో ఎలా కలుగుతుందో ఎవరికీ అర్థం కాని విషయం. ప్రపంచంలోని అన్ని మతాలు శాంతి, సహనం, కరుణ, క్షమ, సోదర భవాన్ని బోధిస్తాయి. తోటివారికి చేతనైతే మేలు చేయమంటాయి. అంతే తప్ప ఏ మతం హింసను, వైరాన్ని ప్రోత్సహించదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి సిక్కు గురువు వీటినే ప్రబోధించారు. వారు స్వయంగా ఆచరించి చూపి ఆదర్శంగా నిలిచారు. వారి బాటలో నడిచినట్లయితే శాంతి విలసిల్లుతుంది. దీనిని ఇష్టపడని శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటి పట్ల సదా అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగడం పౌరుల ప్రస్తుత కర్తవ్యం. వేర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం ప్రభుత్వ బాధ్యత.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE