– జె. శారద

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది

ట్రింగ్‌…

ఆగింది.

ట్రింగ్‌… ….  ‌ఫోన్‌ ‌రెండవసారి మ్రోగుతోంది.

వంటింట్లో ఉన్న రాధ పని ఆపేసి విసుగ్గా ‘ఈ సెల్‌ ఎక్కడ పడేసాను. అయినా ఆ చేసినవాళ్లు ఒక్క నిమిషం ఆగవచ్చు కదా! అవతల వాళ్లు ఏం పనిలో ఉన్నారో ఏమో? ఒక్కసారి ఫోన్‌ ‌చేస్తే ఎత్తలేదంటే ఎంత బిజీగా ఉన్నారో అని కనీసం ఆలోచించరు. ఛ! ….మళ్లీ మ్రోగుతోంది …. మూడవసారి’.

బయట బట్టలు ఆరేస్తూ ఫోన్‌ ‌మాట్లాడి అక్కడ వదిలేశానని అప్పుడు గుర్తొచ్చింది. స్నేహితురాలు మీన దగ్గర నుంచి ఫోన్‌.

‘‌హలో రాధ! కంగ్రాట్స్’

‘‌దేనికి ఇప్పుడు’

‘చూడలేదా టి.వి.లో’

‘ఉహు…. రేపు వియ్యాలవారు వస్తున్నారు కదా, బిజీగా ఉన్నాను.’

‘ప్రహ్లాద్‌కి ప్రభుత్వం పరమ వీరచక్ర ప్రదానం చేసారట, మీ అక్కయ్యకి మా తరపు నుండి కంగ్రాట్స్ ‌చెప్పు’.

ఈ వార్తతో పక్కనున్న సోఫాలో కూర్చుండి పోయింది రాధ. ఆ తర్వాత అరగంటలో కనీసం పది ఫోన్లు వచ్చాయి. వాటి సారాంశం ఒక్కటే…

‘ప్రహ్లాద్‌కి పరమ వీరచక్ర ప్రదానం చేశారట కదా, కంగ్రాట్స్! ‌నిజంగా మీ అక్కయ్య గారి అబ్బాయి మాకు తెలుసు అని చెప్పుకోవడానికి మేమే ఇంత గర్వపడుతుంటే మరి నీకు ఇంకెంత ఉంటుందో కదా! ప్రహ్లాద్‌ ‌నిజంగా అన్ని విధాలా అర్హుడు. మీ మాటల్ని బట్టి చూస్తే మీ అక్కయ్య తపస్సు ఇప్పుడు ఫలించింది. మీ అక్క, బావగారి జన్మ ధన్యం. ఎంతమందికి కలుగుతుంది ఈ అదృష్టం’. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఫోన్‌.

ఈ ‌వార్త ఒక్కసారిగా రాధని గత స్మృతుల్లోకి తీసుకెళ్లింది.

‘నాకు ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. అక్క సాధారణ గృహిణి. ఐదవ తరగతి వరకు చదువుకుంది. నాన్నకి పక్షవాతం రావడంతో అప్పటివరకు దర్జాగా పెరిగిన మేము జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకి లోను కావలసి వచ్చింది.

అక్కకి చిన్నతనంలోనే, అంటే పదిహేనేళ్లకే పెళ్లి చేసేశారు. బావ బ్యాంకులో పని చేస్తున్నారు. అక్కకి పెళ్లయిన పదేళ్లకి ఒక కొడుకు పుట్టాడు. బావ చాలా నెమ్మదస్తుడు. అక్క ప్రహ్లాద్‌ని పెంచిన పద్ధతి చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. చిన్నప్పటి నుండి వాడిలో ధైర్యం, సమస్య పరిష్కారం, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు, ఇమిడి పోగలగడం, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం, ఎక్కడ పోరాడాలో అక్కడ పోరాడటం మొదలైన గుణాలు నేర్పింది. దానికి కొన్ని ఉదాహరణలు:

బావగారు వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెళ్లు. బావగారు కుటుంబ పెద్ద. తన తరువాత పిల్లల బాధ్యతలు ఆయనపై పడ్డాయి. వాళ్ల పెద్ద తమ్ముడు ఒక ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగి. ఒక ఆక్సిడెంట్‌ ‌వల్ల ఆరు నెలలు మంచం మీద ఉండవలసి వచ్చింది. దానితో ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. ఆ భారం బావగారి మీద పడింది. అదే సమయంలో వేసవి సెలవులు వచ్చాయి. అక్క, బావగారు వేసవి సెలవులకని కులుమనాలి వెళ్దామని ప్రహ్లాద్‌తో అంతకుముందు జనవరిలో చెప్పారు. అనుకోని ఈ కష్టం వల్ల వారికి ఈ ప్రయాణం భారం అయ్యే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా పదవ తరగతి పరీక్ష రాసిన ప్రహ్లాద్‌ ‌తండ్రి దగ్గర గొడవ చేశాడు. బావగారు మెతక కావడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక నలుగుతున్నారు. ఇదంతా గమనించిన అక్క వాడికి గట్టిగా సమాధానం చెప్పనందుకు బావగారిని మందలించింది.

‘ప్రహ్లాద్‌! ‌బాబాయికి బాగాలేదు కదా! నువ్వు పరీక్షల మూలంగా ఇంతవరకు బాబాయిని చూడ లేదు. ఒకసారి చూసి వద్దాం. ఏమండి నేను, ప్రహ్లాద్‌ ఒకసారి వెళ్లి సాయిని చూసి రెండు రోజులుండి వస్తాం. ఈ లోపు మీరు మీ పనులు ముగించుకోండి.’ అని చెప్పి వాళ్ల మరిది ఊరికి అక్క, ప్రహ్లాద్‌ ‌వెళ్లారు. అక్కడ తన బాబాయి కుటుంబం ముఖ్యమైన అవసరాలు కూడా తీర్చుకోలేక పడుతున్న ఇబ్బంది చూసిన ప్రహ్లాద్‌ ‌కొంత తల్లడిల్లాడు.

‘పాపం బాబాయి వాళ్లు. బాబాయికి తిరిగి చక్కగా అయి, జాబ్‌ ‌వచ్చేవరకు ఎట్లాగమ్మా?’ అన్నాడు ప్రహ్లాద్‌ ‌తిరుగు ప్రయాణంలో.

‘అవును, కష్టమే. అయితే ఇటువంటి సమయంలోనే మనం వాళ్లకి అండగా ఉండాలి.’

‘నాన్న ఒక్కరి జీతంతో కష్టం కదా అమ్మా!’

‘ఊఁ….. అందుకే మనం కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి’

ఊరి నుండి వచ్చాక తనంత తానుగా సమ్మర్‌ ‌ట్రిప్‌ ‌వద్దని బావతో చెప్పాడు. ఈ విధంగా వాడిలో పరిస్థితుల పట్ల అవగాహన, ఇతరుల అవసరానికి ఎలా నిలబడాలో ప్రత్యక్షంగా చూపించేది.

అమ్మ, నాన్న పెద్ద వారయి ఊరిలో అవస్థలు పడుతున్నారు. మా దగ్గరికి రమ్మంటే రారు. తమ్ముడు విదేశాలలో ఉన్నాడు. నేను మా వారి ఉద్యోగరీత్యా పంజాబ్‌లో ఉన్నాను. అక్క ప్రహ్లాద్‌ని వాళ్లకి సహాయంగా ఉంటాడని వేసవి సెలవులలో పంపేది. తాను ఒక వారం రోజుల తర్వాత వెళ్లేది. అంతేకాదు అమ్మకి, నాన్నకి అన్ని రకాల పనులు చెప్పమని వాడికి ముందే స్పష్టంగా చెప్పేది. అప్పుడు ప్రహ్లాద్‌ ‌వయసు పన్నెండు సంవత్సరాలు. అది చూసి నేను,

‘అంత చిన్నవాడిని ఎందుకు పంపిస్తావు?’

‘వాళ్లకి వీడు చేసే పెద్ద సహాయం ఏమి లేదు, అయితే దీనివల్ల వీడికి వాళ్లతో అనుబంధం పెరిగి, వాళ్ల అవసరాలని అర్థంచేసుకునే అవకాశం వస్తుంది’.

‘మరి వాడికి తోడుగా నువ్వు కూడా వెళ్లవచ్చు కదా!’

‘నేను వెళితే వాడికి బాధ్యతగా ఎలా ఉండాలో తెలియదు. నా చాటున నేను చెప్పిన పని మాత్రమే చేస్తాడు. నేను లేకపోతే వాళ్లకి ఏమి కావాలన్నది గమనిస్తాడు.’

అంతేకాదు, ఎప్పుడైనా నేను ‘మీకున్నది ఒక్కడే కదా, అటువంటప్పుడు అందరిలా గారాబంగా పెంచకుండా ఇలా ఎందుకు పెంచుతున్నావు?’ అని ప్రశ్నిస్తే..

‘ఒక్కడే కాబట్టి రేపు వాడు జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కోవాలి. దానికి కావలసిన శిక్షణ ఇప్పుడే దొరికితే రేపు వాడు ఎటువంటి పరిస్థితినైనా తేలికగా ఎదుర్కోగలగడమే కాక, ఎంతో మందికి అండగా నిలబడగలుగుతాడు. అయినా మనమంతా ఉన్నా ఎవరి జీవితం వాళ్లం గడపవలసిందే కదా? మన జీవితంలో ఇంకొక్కళ్లకి అండగా నిలబడాలి కాని, మనం అండకోసం వెతుక్కునే పరిస్థితిలో ఉండకూడదు.’

అక్క మాటలు విన్న నాకు, పిల్లల్ని అతి గారాబం చేస్తున్న నా చెంప ఛెళ్లుమనిపించినట్టనిపించింది.. ఇది విన్నాక నాలో పిల్లల పెంపకం పట్ల చాలా మార్పు వచ్చింది.

ఈ రోజులలో ఇరవై ఏళ్లు వచ్చాక కూడా తమ పిల్లలు ఇంకా చిన్నవాళ్లే అని భావించే తల్లిదండ్రులను చూస్తున్నాం. కానీ అక్క ఆలోచనలో ఎంత ముందుచూపుందో అర్థమైంది. ఇలా పిల్లల్ని పెంచితే భారతీయతకి పట్టుకొమ్మ అయిన కుటుంబ వ్యవస్థ ఎందుకు ఛిన్నాభిన్నం అవుతుంది?

వాడి పుట్టిన రోజు కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. తిథులు, తారీఖుల ప్రకారం జరిపించేది. తిథుల ప్రకారం జరిపేటప్పుడు వాడిని ప్రత్యేకంగా ఒక వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమం తీసుకొని వెళ్లి అక్కడ అందరికి వీడి చేత బట్టలు, పండ్లు, స్వీట్లు ఇప్పించేది. వాడి పాకెట్‌మనీలో సేవ్‌ ‌చేసిన దానితోటే కొనేది. అందువల్ల వాడిలో తాను అనవసర ఖర్చులు తగ్గించుకొని వాళ్లకి ఎక్కువ ఇవ్వాలి అనే తపన సహజంగా ఏర్పడింది.

తారీఖుల ప్రకారం చేసేటప్పుడు మొత్తం బడ్జెట్‌ ‌ముందరే చెప్పి, వాడినే ప్లాన్‌ ‌చెయ్యమనేది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరిని పిలవాలి, బడ్జెట్‌ ‌మించకుండా ఫంక్షన్‌ ఎలా చెయ్యాలి.. మొదలైనవన్నీ వాడి చేతే చేయించేది. దానివల్ల వాడిలో ప్లానింగ్‌ ఎలా చేయాలి అనేది అలవాటు చేసింది. అక్క వాడికి ఎంజాయ్‌మెంట్‌కి అసలు నిర్వచనం ఇలా తెలియజేసింది.

నేటి పిల్లలలో చాలా మందిలో కనిపించే లెక్కలేనితనం, జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం, డబ్బే ప్రధానం అనే ఆలోచన, చిన్న ఒడిదుడుకులను కూడా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబం పట్ల బాధ్యతారహితంగా మెలగడం, ప్రతి లోపాన్ని పక్కవాళ్లపై తోసే అలవాటు.. వంటి రుగ్మతలు అన్నిటికి బహుశ ఇది ఒక మంచి సమాధానమేమో.

బహుశ వాళ్లందరి దీవెనలేనేమో ప్రహ్లాద్‌ అం‌త భయంకరమైన యుద్ధంలో శత్రువు చేతికి చిక్కబోయి, తప్పించుకొని వాళ్ల స్థావరాలనే మట్టు పెట్టగలిగి ఈ రోజు అవార్డుకి అర్హత సంపాదించుకున్నాడు.

వాడు పదవ తరగతి పరీక్షలు రాసాక.. తర్వాత ఏం చెయ్యాలి అనే చర్చ జరుగుతోంది, వాళ్ల ఇంట్లో. బావగారు మామూలుగా ఇంజనీరింగ్‌ అన్నారు. ఇంజనీరింగ్‌ ‌తర్వాత ఏమిటి? అన్న చర్చకి సమాధానంగా బావగారు ఏముంది యు.ఎస్‌. ‌వెళ్లి పి.జి. చేసి ఇండియాకి వస్తాడు, అన్నారు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పే అక్క మౌనంగా ఉండిపోయింది. అందరు పట్టుబట్టి అడగ్గా,

‘నాకు నా పెంపకం మీద నమ్మకం ఉంది. అందరిలా కాకుండా ఏదో ఒక మదర్స్ ‌డే నాడు నన్ను, ప్రహ్లాద్‌ని ఇంటర్వ్యూ చెయ్యడానికి టి.వి. వాళ్లు క్యూ కట్టాలన్నది నా కోరిక.’

ఇది విన్న మేమంతా ఆశ్చర్యానికి గురయ్యాం.

ఈ రోజు అక్క కల తీరే రోజు వచ్చింది.

మదర్స్‌డే స్పెషల్‌ ఇం‌టర్వ్యూ విత్‌ ‌పరమ వీరచక్ర అవార్డీ మిస్టర్‌ ‌ప్రహ్లాద్‌ ‌విత్‌ ‌హిజ్‌ ‌మదర్‌

‌యాంకర్‌ : ‌ప్రహ్లాద్‌గారు మీ జీవితంలో అమ్మ పాత్ర ఏమిటి?

ప్రహ్లాద్‌ : ‌మా అమ్మే నా గురువు. ఇంతకంటే ఏం చెప్పలేను.

యాంకర్‌ : ‌మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనే వాళ్ల కోసమైన మీరు కొంత విడమరచి చెప్పాలి.

ప్రహ్లాద్‌ : ఇం‌తవరకు నేను అమ్మకి కూడా చెప్పలేదు. నేను పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏం చదవాలి అనే చర్చ మా ఇంట్లో జరిగింది. నాన్న మామూలుగా ఇంజనీరింగ్‌ అన్నారు. నాకు అమ్మ ముఖంలో అసంతృప్తి కనిపించింది. అయితే మేం ఎంత అడిగినా తాను సమాధానం చెప్పలేదు. నేను ఇంటర్‌ ‌పూర్తిచేసి ఐ.ఐ.టి.లో సీట్‌ ‌సంపాదించాను. అమ్మ ముఖంలో నేను ఆశించినంత ఆనందం కనిపించలేదు. పైగా ఒక రకమైన నిస్పృహ కనిపించింది నాకు. కారణం ఏమిటని ఎంత అడిగినా అమ్మ సమాధానం చెప్పలేదు. కాలేజీలో మాత్రం నన్ను ఎన్‌.‌సి.సి.లో చేరమని సలహా ఇచ్చింది. ఇది నా చదువుకి ఇబ్బంది కలిగిస్తుందని నాన్న అంటే, మనిషికి మానసిక దృఢత్వంతో పాటుగా శారీరక దృఢత్వం చాలా అవసరం అని నాన్నని ఒప్పించింది. అయితే కాలేజీలో చేరాక, నా తోటి వారిని చూశాక నాకు అమ్మ పెంపకంలోని గొప్పతనం, ఆ తర్వాత జీవితంలో ఎన్నో సందర్భాలలో అమ్మ నన్ను ఎలా ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కిందో అర్థం అయ్యింది.

ఐ.ఐ.టి.చదువుతున్నప్పుడు ఒకసారి సెలవులలో తాతగారి ఊరు వెళ్లాను. అక్కడ ఇల్లు సర్దుతుంటే అనుకోకుండా అమ్మ నోట్‌బుక్‌ ‌నా కంటపడింది. దానిలో తాను చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గులు, నేను పుట్టినప్పుడు నా కోసం తాను నేర్చుకున్న పాటలు రాసుకుంది.

అందులో ఒకచోట కార్గిల్‌వార్‌ ‌గురించిన పేపర్‌ ‌కటింగ్‌ ఉం‌ది. ఆ కాగితంపై ఒక మూల ఇలా రాసి ఉంది ‘అందరు దేశం, దేశం అని మాట్లాడతారే. ఈ రోజులలో ఒక్కళ్లు, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అటువంటప్పుడు తమకోసం కాకుండా, దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని తయారు చేయగలరా? ఎవరి గురించో ఎందుకు? నేను ప్రహ్లాద్‌ని అలా తయారు చేయగలనా? కనీసం ప్రయత్నం చేయగలనా? వాడిని సైన్యంలోకి పంపగలనా?’ అని ఒక పెద్ద ప్రశ్న వేసి ఉంది. అది చూశాక నేను చాలా ఆలోచించాను. నిజమే కదా! ఎంతమంది తమ పిల్లల్ని పంపించగలరు? ఇలా ఆలోచిస్తున్నకొద్దీ నాకు అటువంటి తల్లికి పుట్టిన నేను చాలా అదృష్టవంతుడిని అని అనిపిస్తుంది.

మా నాన్నగారు చాలా భయస్థులు. ఈ విషయం నేను చెప్పగానే ఆయన చాలా కృంగిపోయారు. అమ్మ మాత్రం చాలా ఆనందించింది. మా ఇంట్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. అమ్మ నాన్నకి ఒకటే మాట చెప్పింది, ఎంత మంది ఆక్సిడెంట్లలో, ఆత్మహత్యలలో చనిపోతున్నారు. ఆర్మీలో ఎంత మంది చేరితే ఎంతమంది పోతున్నారు. ఇలా చాలా స్టాటిస్టిక్స్ ‌చెప్పేది. ఈ విధంగా రకరకాలుగా నాన్నని కన్విన్స్ ‌చేయడానికి ప్రయత్నం చేసి, చివరికి నాన్నతో అంది ‘రోజు ఊరికే కూర్చోని పేపర్‌ ‌ముందేసుకొని దేశం పాడైపోతోందని కబుర్లు చెప్పడం కాదు. నాకు భయం లేదు. ప్రేమంటే వాడు నా ముందు కూర్చొని నేను పెట్టేది తింటూ రోజులు గడపడం కాదు. నాకు మాత్రం ఫలానా వాళ్ల అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది. కోట్ల మందిలో ఒకడిగా కాదు, వాడు ఉండాల్సింది. అందరిలా కాకుండా ఏదో ఒకరోజు నన్ను, ప్రహ్లాద్‌ని ఇంటర్వ్యూ చెయ్యడానికి టి.వి. వాళ్లు క్యూ కట్టాలన్నది నా కోరిక. ఇంక మీ ఇష్టం’ అన్నది. నేను కూడా ‘నాన్న  నాకు ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని ఉంది. నేను ఒక సాధారణ వ్యక్తిగా జీవించలేను. రిస్క్ అనేది జీవితంలో ప్రతి అడుగులో ఉంది. అంత మాత్రాన అనాలోచిత నిర్ణయాలు తీసుకోవాలని కాదు నా ఉద్దేశం. ఏది ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ప్రతిరోజు మీరు చదివే భగవద్గీత అదే కదా చెప్తోంది. డాక్టర్లు రోగుల ప్రాణాలు కాపాడాలి. అది చాలా పెద్ద బాధ్యత. మరి ఆ వృత్తిలో రిస్క్ ఉం‌దని మానేస్తే మనకు డాక్టర్లు ఎక్కడి నుండి వస్తారు. మన ప్రాణాలను ఎవరు కాపాడతారు? అలాగే టీచర్లు, లెక్చరర్లు కూడా అంతే’ అని అన్నాను.

అమ్మ, నేను ఒక్క మాట మీద ఉండడంతో నాన్న ఒప్పుకోక తప్పలేదు. అయితే ఈరోజు అమ్మ కంటే కూడా నాన్న నన్ను చూసి గర్వపడుతున్నారు.

యాంకర్‌ : అమ్మా! మీరు చెప్పండి అసలు మీకు ఇలాంటి కోరిక ఎందుకు కలిగింది?

అమ్మ : నేను ఐదవ తరగతి వరకే చదువుకున్నాను. ఒకరోజు మా మాస్టారు శివాజీ గురించి చెబుతూ జీజాబాయి లేకపోతే శివాజీ లేడు, అలాగే భువనేశ్వరీ దేవి లేకపోతే వివేకానందుడు లేడు అని ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఆ వయసులో ఆ మాటల అర్థం నాకు తెలియలేదు కాని అవి నన్ను ఆకర్షించి నా మనసు పొరలలో బలంగా ఎక్కడో ముద్రించబడ్డాయి. వీడు పుట్టిన కొన్ని రోజులకే కార్గిల్‌ ‌యుద్ధం వచ్చింది. అందులో మేజర్‌ ‌పద్మపాణి ఆచార్య గురించి చదివాక పొరలలో దాగి ఉన్న కోరిక బయటికి తన్నుకొచ్చింది. నేను ఎందుకు వీడిని అలా పెంచలేను, వీడి జీవితంలో నేనెందుకు జీజాబాయిని కాకూడదు అనే ప్రశ్న నాలో ఉదయించింది.

యాంకర్‌ : ‌ప్రహ్లాద్‌! అమ్మకి గిఫ్ట్ ఇచ్చానన్న తృప్తి ఉందా మీకు?

ప్రహ్లాద్‌ : ‌లేదు నాకు ఇద్దరు పిల్లలు. నా పిల్లల్ని అమ్మ పెంచినంత బాగా పెంచిన రోజే నాకు ఆ భావన కలుగుతుంది.

——————

ఇంటర్వ్యూ చూసిన రాధ చాలా భావోద్వేగానికి గురైంది. రాధ ఎం.బి.ఎ. (ఫైనాన్స్) ‌చేసింది. భర్త ఉద్యోగరీత్యా అనేక ఊళ్లు తిరగవలసి వచ్చేది. దానితో తన చదువు వృథా అయ్యిందని బాధపడేది. దానికి సమాధానంగా అక్క ‘నీవు నీ పిల్లల్ని వాళ్ల కాళ్ల మీద వాళ్లు ఆర్థికంగానే కాక, మానసికంగా కూడా నిలబడేటట్టు తయారు చెయ్యి. వెళ్లిన ప్రతిచోట నీ చుట్టుప్రక్కల, మీ ఇంట్లో పనిమనిషి పిల్లలు ఇలా కనీసం ఇద్దరు, ముగ్గురు పిల్లలు నీకు అందుబాటులో ఉంటారు. వాళ్లలో మార్పుకి బీజం వెయ్యి. ఒక ఇరవై, ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్లు ఉన్నత స్థానానికి వెళ్లి నీ పేరు చెప్పుకోగలగాలి. అది జీవితాన్ని చూడవలసిన కోణం. అంతేకాని దానికోసం ఏడవడం కాదు’. అని నన్ను చివాట్లు పెట్టింది.

నిజమే, ఒక సాధారణ గృహిణి సమాజానికి ఏమి చెయ్యగలదు అని హేళనగా అనుకుంటారు. వాళ్లందరికి మా అక్క జీవితమే సమాధానం.

About Author

By editor

Twitter
YOUTUBE