తీవ్రవాద సంస్థగా ప్రకటించి, నిషేధించిన సంస్థతోనే రహస్య మంతనాలు జరిపి రాజీ ఒప్పందానికి సిద్ధపడింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీనితో ‘తమది నయా పాకిస్తాన్’ అంటూ గొప్పలు చెబుతున్న ఆ దేశ ప్రధాని మాటలు ఎంత నీతిమూటలో అర్ధమవుతుంది. దేశవ్యాప్త సమ్మె, ప్రదర్శనలతో పాక్ ప్రభుత్వాన్ని తన ఎదుట మోకరిల్లే స్థితికి తెచ్చిన నిషేధిత తహరీక్ లబ్బైక్ (TLP) చివరికి తన డిమాండ్‌లకు ప్రభుత్వం తలొగ్గడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్ రాయబారిని బహిష్కరించాలన్న (ఫ్రాన్స్ ప్రభుత్వం మహమ్మద్ ప్రవక్తను అవమానపరచినందుకు ప్రతీకారంగా రాయబారిని బహిష్కరించాలన్న తహరీక్) తహరీక్ డిమాండ్‌కు తలొగ్గడం తప్ప మరొక మార్గం కనిపించని ప్రభుత్వం చివరికి అందుకు అంగీకరించింది.
షరియా చట్టాన్ని, మతదూషణ (నిరోధ) చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరే తహరీక్ తీవ్రమైన మతమౌఢ్య సంస్థ. ‘నేనే వర్తమాన పాకిస్తాన్’ (తహరీక్- ఏ- లబ్బైక్) అనే ఈ సంస్థను బరేల్వి ధోరణికి చెందినవారు ప్రారంభించారు. దేశంలో అమలవుతున్న మతదూషణ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్యతో ఈ సంస్థ పేరు బయటకు వచ్చింది. ముంతాజ్ ఖాద్రి అనే తహరీక్ కార్యకర్త ఆ హత్య చేశాడు. 2015లో అల్లామా ఖాదీమ్ హుస్సైన్ రిజ్వీ ఒక రాజకీయ పార్టీగా దీనిని ప్రారంభించాడు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఈ పార్టీని గుర్తించడమేకాక ఎన్నికల్లో పాల్గొనేందుకు కొంగ గుర్తును కేటాయించింది కూడా.
2018 ఎన్నికల్లో పెద్దగా సీట్లు గెలుచుకోలేక పోయినా తహరీక్ పార్టీ 20 లక్షలకు పైగా ఓట్లు సాధించి ఐదవ పెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం సింద్ శాసనసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. పంజాబ్‌లో మూడవ పెద్ద పార్టీగా గుర్తింపు పొందింది. పాకిస్తాన్‌లో దేవబంద్ మతధోరణి ఆధిపత్యాన్ని సవాలు చేసిన ఖాదిమ్ హుస్సైన్ రిజ్వీ సాధారణ ప్రజానీకపు మద్దతును కూడగట్టుకోవడంలో విజయవంతమయ్యాడు.
ఎన్నికల బిల్లు ద్వారా మతదూషణకు పాల్పడ్డ దేశ న్యాయమంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ నవంబర్ 2017లో తహరీక్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేసింది. ‘ప్రతిజ్ఞను – ప్రకటన’గా మార్చడం పట్ల తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. ఖత్మ్ -న-బూవత్ వివాదంగా పేరుపడిన ఆ ప్రదర్శనలు దేశమంతటా వ్యాపించాయి. మూడువారాలపాటు సాగిన ఆ ప్రదర్శనలు న్యాయమంత్రి రాజీనామాతో ఆగాయి. రాజధానికి వచ్చే మార్గాలన్నింటిని దిగ్బంధనం చేశారు ప్రదర్శనకారులు. అప్పుడు పిఎంఎల్ అధికారంలో ఉంది. ప్రదర్శనకారులు రావల్పిండి, ఫైజాబాద్‌లను పూర్తిగా స్తంభింప చేశారు. వారికి ఐఎస్‌ఐ మద్దతు ఉందన్న వార్తలు వచ్చాయి. పిఎంఎల్ అబ్బాసి ప్రభుత్వం గద్దె దిగాలని కోరుకున్న సైన్యం కూడా ప్రదర్శనకారులపై చర్యకు సిద్ధపడలేదు. వారితో రాజీ చేసుకోవాలని సలహా ఇచ్చింది. ఆరు అంశాల రాజీ ఒప్పందాన్ని రూపొందించిన సైన్యం న్యాయమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి ఫత్వా విడుదల చేయకూడదని నిరసన కారులను కోరింది. దీనితో దిగివచ్చిన ప్రభుత్వం నిర్బంధించిన ప్రదర్శనకారులను విడుదల చేయడంతో పాటు తహరీక్ సంస్థపై కేసులను ఉపసంహ రించుకుంది. దీనితో ప్రదర్శనలు ఆపడానికి తహరీక్ అంగీకరించింది. ఆ తరువాత తహరీక్ ప్రదర్శనకారు లందరికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి.
2018లో మతదూషణకు పాల్పడిందన్న ఆసియా బీబీకి మరణదండన విధించాలన్న కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసినప్పుడు కూడా తహరీక్ సంస్థ నిరసన ప్రదర్శనలకు సిద్ధపడింది. దీనితో అప్పుడు అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఐదు అంశాల రాజీ ఒప్పందాన్ని తహరీక్ ముందు ఉంచింది. పాకిస్తాన్‌ను వదలిపోకుండా ఆసియా బీబీపై ఆంక్షలు పెట్టడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించడాన్ని వ్యతిరేకించమని పేర్కొంది. అరెస్ట్ చేసిన ప్రదర్శనకారులను కూడా బేషరతుగా విడుదల చేసింది. అందుకు బదులుగా తహరీక్ కేవలం ప్రదర్శనల వల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తంచేస్తూ క్షమాపణలతో సరిపెట్టింది.
అంతకుముందు కూడా ప్రధాని ఆర్ధిక సలహా సంఘం (EAC) నుండి అహ్మదీ అయిన ఆతిఫ్ ఆర్ మియాన్‌ను తొలగించాలంటూ తహరీక్ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దానితో ప్రభుత్వం మియాన్ నియామకాన్ని వెనక్కు తీసుకుంది కూడా. ప్రభుత్వం ఇలా వెనుకంజ వేయడాన్ని సమర్ధించు కుంటూ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి రెండు ట్వీట్లు కూడా చేశాడు. అందులో ‘మతపెద్దలు, సామాజిక వర్గాలన్నిటిని కలుపుకుని ముందుకు పోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. అందుకు కేవలం ఒక నియామకం అడ్డంకి కారాదని భావిస్తోంది’ అని, మరో ట్వీట్‌లో ‘ఖత్మ్-నబువ్వత్ (ప్రవక్తలోనే అంతిమ, సంపూర్ణ విశ్వాసం) అనేది మా మతవిశ్వాసంలో భాగం. ఇటీవల మతదూషణ లను ఆడ్డుకునే విషయంలో మా ప్రభుత్వం తీసుకున్న చర్య (మియాన్ తొలగింపు) ఆ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది’ అని పేర్కొన్నాడు.
పై సంఘటన ద్వారా అపారమైన ప్రజా మద్దతు కలిగిన తహరీక్ సంస్థ ప్రభుత్వాన్ని, దేశాన్ని తన ఇష్టానుసారం ఆడించగలుగుతోందని స్పష్టమవు తోంది. శాంతియుత ప్రదర్శనల ద్వారా ప్రజా తిరుగుబాటనే ప్రమాదపు సూచనను ప్రభుత్వానికి పంపి రాజకీయ ఒత్తిడి తీసుకురాగలుగుతోంది.
మతదూషణ చట్టపు దుర్వినియోగాన్ని కళ్లకు కట్టించి, బుసాన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు కూడా గెలుచుకున్న ‘జిందగీ తమాషా’ అనే సినిమాను పాకిస్తాన్‌లో విడుదల చేయడానికి వీలులేదని తహరీక్ తెలిపిన అభ్యంతరానికి తలొగ్గుతూ ప్రభుత్వం జనవరి 2020లో ఆ సినిమా విడుదలను నిలిపివేసింది.
ప్రవక్త గొప్పదనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇటీవల మరొకసారి తహరీక్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. మతదూషణను సహించేది లేదంటూ నినదించారు. ప్రవక్తపై కార్టూన్‌లు ప్రచురించడం భావప్రకటీకరణ స్వేచ్ఛలో భాగమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మార్కాన్ పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తహరీక్ నిరసన ప్రదర్శనలకు దిగింది. ఇస్లామా బాద్‌లో ఫ్రాన్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో నిరసనకారులు ఇస్లామాబాద్‌ను దిగ్బంధనం చేశారు.
కొన్ని ముస్లిం దేశాల్లో కూడా ప్రవక్త గురించి కార్టూన్లు ప్రచురించడం పట్ల నిరసనలు వ్యక్తమైనా, ఎక్కడా అల్లర్లుగాని, ప్రజాజీవనానికి ఆటంకం కలగడంకానీ జరగలేదు. గొడవలు ఉధృతమవడంతో దేశంలో ఫ్రాన్స్ రాయబారిని తిప్పి పంపుతామని, ఫ్రాన్స్‌లో రాయబారిని వెనక్కు పిలిపిస్తామని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఐజాజ్ షా, మత వ్యవహారాల మంత్రి నూరుల్‌హక్ ఖాద్రిలు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈలోగానే తహరీక్ నాయకుడు ఖాదిమ్ రిజ్వీ కరోనా మూలంగా మరణించడంతో అతని కొడుకు సాద్ హుస్సైన్ రిజ్వీ పార్టీ పగ్గాలు చేపట్టాడు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ జనవరిలో తహరీక్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మూడు నెలల గడువు పూర్తవడానికి సరిగ్గా ఐదు రోజుల ముందు తహరీక్‌తో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం ఫ్రాన్స్ రాయబారిని బహిష్కరించడానికి వీలు కలిగించే చట్టాన్ని ఏప్రిల్ 20న జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రతిపాదించింది.
ఏప్రిల్ 10న ముందస్తు జాగ్రత్త చర్యగా తహరీక్ పార్టీ అధినేత సాద్ రిజ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానితో రెచ్చిపోయిన ప్రదర్శన కారులు రావల్పిండి, లాహోర్‌లలో అల్లర్లు సృష్టించారు. అందులో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు, 800మంది గాయపడ్డారు. హింసాత్మక అల్లర్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండడంతో తహరీక్ పార్టీని తీవ్రవాద సంస్థగా ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఏప్రిల్ 15న ఆ సంస్థపై నిషేధాన్ని విధించింది.
ప్రభుత్వం నిషేధం విధించినా వెనక్కు తగ్గని తహరీక్ కార్యకర్తలు మూడు రోజులపాటు దేశంలో ప్రజా జీవనాన్ని స్తంభింపచేశారు. 11 మంది పోలీసులను బంధించారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో దిక్కుతోచని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అంతకుముందు తాము నిషేధించిన సంస్థతోనే చర్చలకు సిద్ధపడింది. ప్రభుత్వం నిషేధిత సంస్థల ముందు ఇలా మోకరిల్లితే ఇతర దేశాల్లో అయితే తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూడవలసి వస్తుంది. కానీ పాకిస్తాన్‌లో అలా తీవ్రవాదులకు తలొగ్గడం సర్వసాధారణ విషయం. అక్కడ తీవ్రవాద, మతఛాందసవాద శక్తులదే పైచేయి అన్న విషయం ఇటీవలి కాలంలో ప్రపంచానికి మరింత స్పష్టంగా తెలుస్తోంది. తహరీక్ ప్రదర్శనకారులు ఆర్ధిక కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపచేశారు. ఇలా పాకిస్తాన్ ఇస్లాం మతమౌఢ్య గుప్పిట్లో చిక్కుకుంది.
తహరీక్ పార్టీ నాలుగు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టింది. ఫ్రెంచ్ రాయబారిని బహిష్క రించడం, తమ నాయకుడు సాద్ రిజ్వీని విడుదల చేయడం, పార్టీపై పెట్టిన నిషేధాన్ని ఎత్తివేయడం, అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేయడం. ఈ డిమాండ్‌లలో పార్టీపై పెట్టిన నిషేధాన్ని ఎత్తివేయడం తప్ప మిగిలినవన్నీ అంగీకరించి ప్రభుత్వం తమ పోలీసులను విడిపించుకుంది.
చివరికి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా తహరీక్ భాషనే మాట్లాడటం మొదలు పెట్టారు. ఒక టీవీ ఉపన్యాసంలో ఖాన్ తమ ప్రభుత్వపు ధోరణిని స్పష్టం చేశారు. ముస్లిం దేశాల మద్దతుతో ఇస్లాం వ్యతిరేక ధోరణిని అరికడతామని చెప్పిన ప్రధాని తహరీక్ ఏ లక్ష్యంతో ప్రజల్ని వీధుల్లోకి తెచ్చిందో ప్రభుత్వం కూడా అదే లక్ష్యం కోసం పనిచేస్తోంది అని అన్నారు. ‘దారులు వేరు కానీ లక్ష్యం ఒక్కటే’ అంటూ ముక్తాయించారు.
మతదూషణను అడ్డుకోవాలనే నెపంతో తహరీక్ పార్టీ షరియాను (ఇస్లాం మత నిబంధనలు) చట్టబద్ధం చేయాలనుకుంటోంది. తమ పబ్బం గడుపుకునేందుకు పాకిస్తాన్‌లో రాజకీయపార్టీలు మతసంస్థల మద్దతుకోసం ఆరాటపడుతుంటాయి. అందుకనే మత గురువులు, నాయకులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలను ప్రభావితం చేస్తుంటారు. దేశంలో వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా మతఛాందసవాదుల కనుసన్నల్లో పనిచేస్తుంటాయి. ఆ దేశంలో మతం, రాజకీయాలు కలిసే ఉంటాయి. మత సంస్థలకు ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. దీనివల్ల సమస్య మరింత క్లిష్టమవుతుంది. ఆ మత సంస్థలు అదుపు తప్పినప్పుడు వాటిని నియంత్రించ డానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉంటాయి.
కానీ ప్రస్తుత ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం బరేల్వీ మతఛాందసవాదాన్ని అదుపుచేయడంలో విఫలమైంది. తహరీక్ మత రాజకీయాల ముందు మోకరిల్లింది. ఇలా ప్రభుత్వాన్ని భయపెట్టి, బెదిరించి తహరీక్ పార్టీ తన ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని పెంచుకుంది. విదేశాంగ విధానం, చట్టాలను కూడా ప్రభావితం చేసే స్థితికి వచ్చిన తహరీక్ క్రమంగా రాజకీయ, సైనిక వ్యవస్థను కూడా హస్తగతం చేసుకునే దిశగా కదులుతోంది.
బరేల్వీ సిద్ధాంతం దేవబందీ ధోరణికి పూర్తి విరుద్ధమైనది. దేవబందీ పద్ధతి సౌదీ అరేబియాలోని వహాబీ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. అయితే బరేల్వీ సిద్ధాంతం దేవబందీ కంటే శాంతియుత మైనది, సహనశీలమైనదని మొదట్లో కొందరు అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా తహరీక్ అనుసరిస్తున్న హింసాత్మక విధానం ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది.
ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించడం వల్ల పాకిస్తాన్ విదేశాంగ విధానం పూర్తిగా పట్టాలు తప్పుతుంది. పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి. మతసంస్థల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పరిపాలన వ్యవస్థలను ఈ మతఛాందసవాదుల చేతిలో పెడుతున్నాయి. పాకిస్తాన్‌లో పెరుగుతున్న ఈ మతఛాందసవాదానికి మందు ఏది?
– డా. రామహరిత
అను : కేశవనాథ్