కరోనా ప్రపంచాన్ని చుట్టేసిన అంటువ్యాధి, మహమ్మారి. ఇందులో భారతదేశం కూడా ఒకటి. కానీ ఈ విషయంలో మన ప్రతిపక్షాలు అంధత్వం ప్రదర్శించాయి. ఇందుకు మంచి ఉదాహరణ మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కొరత. కొవిడ్‌ 19 ‌రెండోదశలో ఈ ఆక్సిజన్‌ ‌కొరత దేశాన్ని కకావికలం చేసింది. సమస్య నిజం. కానీ సమస్య గురించి జరిగిన ప్రచారం అత్యంత నీచమైన పద్ధతిలో సాగింది. ఆక్సిజన్‌ ‌కొరత తీర్చడానికి కేంద్రం ఏమీ చేయలేదన్న ప్రచారం జరిగింది. కానీ వాస్తవాలు ఏమిటి?

మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కొరతను ఒక్క భారతదేశమే కాదు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వ్యవస్థలుగా పేర్గాంచిన పలు ప్రపంచ దేశాలు కూడా ఎదుర్కొన్నాయి. చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రాణవాయువు కొరత కారణంగా ఆయా దేశాలలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారు తక్కువేమీ కాదు. ఈ నష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాలను  బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ‌జర్నలిజమ్‌ అనే సంస్థ కొన్ని వాస్తవాలను బయటపెట్టింది. ఆక్సిజన్‌ ‌కొరతను ఎదుర్కొన్న దేశాలు కనీసం ముప్పయ్‌ ఉన్నాయి. ఆ దేశాలు మొన్న మార్చి నెలలో వినియోగించిన ఆక్సిజన్‌ ‌కంటే ప్రస్తుతం రెట్టింపు ఆక్సిజన్‌ అవసరమైన స్థితికి చేరుకున్నాయి. ఫిజి, వియత్నాం, అఫ్ఘానిస్తాన్‌, ‌కంబోడియా, మంగోలియా, అంగోలా, కిర్ఘిస్తాన్‌ ‌వంటి దేశాలు ఆక్సిజన్‌ ‌కొరత సమస్యతో బాధపడుతున్నాయి. నిజానికి భారతదేశంలో ఈ ఆక్సిజన్‌ను అపారంగా నిల్వ ఉంచే పద్ధతి లేదు. వైద్యానికి సంబంధించి అవసరం కూడా పరిమితం. అయినా కొవిడ్‌ 19 ‌రెండోదశలో ఈ సమస్య భయానక రూపం దాల్చింది. అప్పటికి కావలసిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడం, ఉన్న ఆక్సిజన్‌ను అయినా సకాలంలో రవాణా, పంపిణీ గావించడం కూడా సమస్యగా మారింది. దీనికి విపక్షాల రాజకీయం తోడైంది. కోర్టుల ద్వారా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి పెద్ద ప్రయత్నమే చేశాయి. నిజానికి ఈ సమస్యను సకాలంలో పరిష్కరించడానికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంది. అయినా నింద మోయవలసి వచ్చింది. ఇందుకు కారణం దుష్ప్రచారమే.

ముందే చెప్పుకున్నట్టు మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కొరత మన దేశంలో కొవిడ్‌ 19 ‌రెండోదశలోనే అనూహ్యంగా పెరిగింది. కొవిడ్‌ ‌బారిన పడిన వారికి మాత్రమే అనుకున్నా దేశంలో రోజుకు 15.5 క్యూబిక్‌ ‌మీటర్ల ఆక్సిజన్‌ అవసరమైంది. అయితే మార్చి నుంచి మే మాసంలోకి ప్రవేశించేసరికి ఆ అవసరం భయానకంగా పెరిగింది. మే మధ్యలోకి వచ్చే సరికి మార్చి నెల అవసరం కంటే 14 రెట్లు పెరిగింది. మన సమస్యను పరిష్కరించడానికి అమెరికా, ఇంగ్లండ్‌, ‌కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌వంటి దేశాలు ముందుకు వచ్చాయి. పెద్ద సంఖ్యలో ఆక్సిజన్‌ అం‌దచేశాయి. ఆక్సిజన్‌ ‌కాన్సంటేటర్లు, క్రయోజనిక్‌ ‌ట్యాంకర్లు పంపించి ఆ సంక్షోభ సమయంలో ఆ దేశాలు ఆదుకున్నాయి.

ఈ భూమ్మీద బతకాలంటే ఆక్సిజన్‌ అత్యవసరం. పర్యావరణంలో ఈ వాయువు 21 శాతం ఉంది. శుద్ధి చేసిన రూపంలో ఆక్సిజన్‌ ‌చాలా వ్యవస్థలకు అవసరమే. అందులో పారిశ్రామిక, వైద్య అవసరాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో తయారవుతున్న ద్రవ రూప ఆక్సిజన్‌లో మెడికల్‌ అవసరం కోసం తయారయ్యేది ఒక శాతమే. మిగిలిన 99 శాతం పరిశ్రమలలో, గనుల తవ్వకాలలో, పెట్రో కెమికల్స్ ‌కోసం, ఎయిరోనాటిక్స్, ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్ల కోసమే వినియోగిస్తారు. ఉక్కు తయారీ, ఇతర లోహాల శుద్ధిలో, రసాయనాల తయారీలో, మందుల తయారీలో, పెట్రోలియం ప్రోసెసింగ్‌లో, గాజు, సెరామిక్‌ ‌తయారీలో ఆక్సిజన్‌ ‌వినియోగిస్తారు. ఇంకా ప్లాస్టిక్‌ ‌పరిశ్రమలో, జౌళి పరిశ్రమలో, వెల్డింగ్‌లో, ఉక్కు కత్తిరించే పక్రియలో, రాకెట్‌ ‌ప్రయోగంలో, ఆక్సిజన్‌ ‌థెరపీలో విమా నాలు, జలాంతర్గాము లలో కూడా ఆక్సిజన్‌ ‌వాడకం సర్వసాధారణం.

ఆసుపత్రులకు సంబంధించి శ్వాసకు అత్య వసరం. ఒక కొవిడ్‌ ‌రోగి రెండు వారాలు ఆసుపత్రిలో ఉంటే, రోజుకు 14 నుంచి 43 క్యుబిక్‌ ‌మీటర్ల ఆక్సిజన్‌అవసరం. పరిస్థితి మరీ విషమించిన వారికి ఆక్సిజన్‌ ‌థెరపి కూడా అవసరం. ఒక అధ్యయనం ప్రకారం కొవిడ్‌ ‌లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో నాలుగోవంతు మందికి ఆక్సిజన్‌ ‌థెరపి అవసరమైంది. ఈ రోగులలో ఐసీయులో ఉంచి వైద్యం అందించవలసిన వారికి నిరంతరం మెడికల్‌ ఆక్సిజన్‌ ‌సరఫరా ఉండాలి. అందుకే ప్రస్తుత పరిస్థితులలో చాలా దేశాలకు ఆక్సిజన్‌ అవసరం అంతగా పెరిగింది. నిపుణుల అధ్యయనం ప్రకారం ఒక దేశం చాలినంతగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకుంటున్నదీ అంటే, అది రోజుకు 7000 టన్నులు. ఇందులో అధిక భాగం పారిశ్రామిక అవసరాల కోసమే. అయితే పరిస్థితులను బట్టి దీనిని వైద్య అవసరాలకు మళ్లించవచ్చు. అందుకే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు మళ్లించమని కొవిడ్‌ 19 ‌రెండోదశ పరిస్థితిలో  కేంద్రం ఆదేశించింది.

మెడికల్‌ ఆక్సిజన్‌కు ఈ రీతిలో అసాధారణంగా పెరిగిన అవసరం మేరకు కేంద్రం బహుముఖ వ్యూహం అనుసరించింది. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్‌ ‌దిగుమతి చేసుకుంది. విదేశాలలోని మన దౌత్య కార్యాలయాల ద్వారా ఈ ప్రయత్నం సాగించింది. దిగుమతిలో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు అన్ని రకాల నిబంధనలను సడలించింది. నౌకల ద్వారా సరఫరా చేయడం అంత యోగ్యం కాదు కాబట్టి, ఆక్సిజన్‌ ‌సరఫరా దారులు ఆక్సిజన్‌ ‌జనరేటర్లు, ఇండస్ట్రియల్‌, ‌వ్యక్తిగత కాన్సంటేటర్లు, క్రయోజనిక్‌ ‌ట్యాంకర్లు పంపడానికి మన దౌత్యవేత్తలు సహకరించారు. ఇక దేశం నుంచి ద్రవ, సిలిండర్‌ ఆక్సిజన్‌ ఎగుమతులన్నీ నిషేధించారు. ఇంతలోనే సరిహద్దులలో కూడా కేసులు పెరగడంలో ఆక్సిజన్‌ అవసరం మరింత తీవ్రమైంది. అయితే ఆక్సిజన్‌ ‌దిగుమతుల మీద అతిగా ఆధారపడడం శ్రేయస్కరం కాదు కాబట్టి సొంతంగానే ఆక్సిజన్‌ అధిక ఉత్పత్తికి పూనుకుంది. అదే సమయంలో సరఫరా బాధ్యతను కూడా తీసుకుని సకాలంలో అవసరం తీరే విధంగా చూసింది.

About Author

By editor

Twitter
YOUTUBE