– స్వాతీ శ్రీపాద

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

సరిగ్గా ఒక నిమిషం ముందు హాల్‌లోకి నింపాదిగా అడుగుపెట్టింది సావిత్రి. అద్దాలు కుట్టిన నీలంరంగు గుడ్డ బ్యాగ్‌లో ఫైల్‌ ‌హోల్డర్‌, ‌చేతిలో చిన్న పర్స్.

అప్పటికే మూడుసార్లు ఫోన్‌ ఇం‌టర్వ్యూలు జరిగాక, ఒకసారి పర్సనల్‌గా రమ్మని అడిగితే వచ్చింది. అదొక మల్టీ నేషనల్‌ ‌కార్పోరేట్‌ ‌కంపెనీ.

అమెరికాలోని ఉద్యోగాలకున్నంత క్రేజ్‌ ఉం‌ది దాంట్లో ఉద్యోగాలకి.

రెసెప్షన్‌లో అడిగి ఆ హాల్‌లోకి వచ్చింది. అది నిజంగా అద్దాల భవనమే.

ఫ్లోరింగ్‌ ‌కూడా అద్దంలానే మెరుస్తూ ప్రతి రూపాలు కనిపిస్తున్నాయి.

ఓ చివర ఉన్న గ్లాస్‌డోర్‌ ‌తెరుచుకుని వచ్చాడు యూనిఫామ్‌లో ఉన్న అటెండర్‌.

‘‘‌మీరేనా సావిత్రి గారంటే… రమ్మన్నారు. లోపలకు వెళ్లండి.’’ తలుపు తీసి పట్టుకుని చెప్పాడు. లోనికి నడవగానే తలుపు మూసుకుంది. ఆ గది చిన్న సిట్‌ అవుట్‌లా ఉంది. దానికి ఆనుకుని విశాలమైన ఆఫీస్‌ ‌రూమ్‌.

‘‘‌కమిన్‌’’

అడుగుల శబ్దం వినబడినట్టుంది.

లోనికి వెళ్లి విష్‌ ‌చేసింది సావిత్రి.

ఎదురుగా కుర్చీ చూపించి, చూస్తున్న ఫైల్‌లో తలదూర్చాడు ఆ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌.

‌రెండు నిమిషాలకు ఆ ఫైల్‌ ‌మూసి తలెత్తాడు.

‘‘సారీ వెయిట్‌ ‌చేయించానా? నిజానికి మీరు సెలెక్టెడ్‌. ‌ఫార్మల్‌గా ఒకసారి ముఖాముఖి మాట్లాడితే బాగుంటుందని…

దిస్‌ ఈజ్‌ ‌జస్ట్ ‌కాజువల్‌’’

‘‘‌మీ పేరు… అఫ్‌కోర్స్ ‌మీకూ తెలుసు నాకూ తెలుసు, మీ పేరు మీకు ఇష్టమేనా? పాతపేరు కదా ఎప్పుడైనా మార్చుకోవాలి అనుకున్నారా సావిత్రీ’’

‘‘అబ్బేలేదండి. నా పేరు నిజానికి మా నాన్నమ్మపేరు. ఆ పేరే నాకు పెట్టుకున్నారు. నాకు చాలా ఇష్టం’’

‘‘ఇవ్వాళా రేపూ పేర్లు కుదించుకుని రెండక్షరాల తోనో, ఒకే అక్షరంతోనో పిలిపించు కుంటున్నారు కదా… మీకూ అలా పెట్టుకో వాలనిపించ లేదా?’’

‘‘లేదు. నిజానికి అర్థం పర్ధం లేని పిలుపుల కన్నా నాపేరే నాకు ఇష్టం’’

‘‘అకడెమిక్‌గా మీకున్న పరిజ్ఞానం ఎక్సె లెంట్‌. ‌మీ చురుకైన ఆలోచనా విధానం పనితీరు ఇదివరకే నాకు తెలుసు. ఇహ ఇప్పుడూ ఆఫీస్‌ ‌వర్క్ ‌గురించీ టైమింగ్స్ ‌గురించీ …  షిఫ్ట్ ‌డ్యూటీస్‌ ఉం‌డొచ్చు, అఫ్‌కోర్స్ ‌క్యాబ్‌ ‌ఫెసిలిటీ ఉంటుందనుకోండి’’

‘‘ఇక్కడ ఒక్క మాట. షిఫ్ట్ ‌డ్యూటీస్‌ ‌నాకు అంగీకారం కాదు. ఉదయం తొమ్మిది నుండి ఆరు వరకే నేను పనిచెయ్యగలను. కెరీర్‌ ‌పేరుతో నన్ను నేను బంధించుకోదలచుకోలేదు. నా ఆఫీస్‌ ‌వర్క్ ‌తొమ్మిది నుండి ఆరు వరకు అంతే. ఏదైనా ఆ సమయంలోనే ప్లాన్‌ ‌చేసుకోవాలి.’’

ఆ మాటలకు అతని మొహం ఒక్కసారి అవ మానపడినట్టు జేవురించింది.

‘‘మీరొక్కరే కాదుగా… సగానికన్నా ఎక్కువమంది స్త్రీలే. వారంతా షిఫ్ట్ ‌డ్యూటీలు చేస్తూనే ఉన్నారు’’ కొంచం పరుషంగానే వచ్చింది ఆ మాట.

‘‘కావచ్చును. కాని ఇది నా ప్రయారిటీ.’’

‘‘మీకు అంత గొప్ప పాకేజీ ఆఫర్‌ ‌చేస్తున్నాము, 60 లాక్స్ ఎ ఇయర్‌..’’

‘‘‌లక్షలు నాకు ముఖ్యం కాదండి. ఈ అరవై వేల పాకేజీ నా సమయానికన్నా విలువైనది కాదు. నాకు పని ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితమూ అంతే ముఖ్యం. నా సరదాలూ, సంతోషాలూ అంతే ముఖ్యం. నాతోపాటు ఉండే నా కుటుంబమూ అంతే ముఖ్యం. అదేవిధంగా నా భద్రత కూడా నాకు ముఖ్యమే’’

‘‘మీ ఒక్కరేనా… ఎంతో పెద్ద అపాయంలో ఉన్నట్టు… ఎంతమంది ఇలా షిఫ్ట్ ‌డ్యూటీలు చెయ్యడం లేదు?’’

‘‘కావచ్చు, అది వారి వారి ప్రయారిటీ, అపాయం అంటే అర్ధరాత్రి క్యాబ్లో ఒంటరిగా వెళ్తే రక్షణ హామీ మీరిస్తారా? క్యాబ్‌ ‌డ్రైవర్‌ ‌మంచివాడని హామీ ఇస్తారా? మధ్యలో ఎవరితోనూ లాలూచీ పడడని హామీ ఇస్తారా? ఎదుటి వారినో, సమాజాన్నో గుడ్డిగా నమ్మే బదులు నా రక్షణకు ముందు ఆలోచన చెయ్యవలసినది, కావలసిన జాగ్రత్తలు తీసుకో వలసినది నేనే కదా?’’

‘‘ఇంత చదువుకుని …’’

‘‘అవును చదువుకున్నాను. ఆ చదువు నా మనో వికాసానికీ నా ఆర్థ్ధిక సుస్థిరతకు, నా ఆత్మస్థైర్యానికీ కాని, అది నా శారీరిక సౌకుమార్యాన్ని పెంచ లేదుగా… అరవైలక్షల పాకేజీ నా శరీరాన్ని ఉక్కు గానో, రాయిగానో మార్చలేదుగా… మగవారితో సమానంగా అన్ని పనులూ చేయగలిగినంత మాత్రాన మగవాడిని అయిపోనని నాకు గుర్తుండాలి కదా.

నా చదువు నాకు ఆ సంస్కారాన్ని, విచక్షణను ఇచ్చింది. సంపాదించగలిగినంత మాత్రాన నేనేదో సూపర్‌ ‌విమెన్‌ అయిపోను. నా బాధ్యతలను వదిలించుకునో, విదిలించుకునో, కూతురిగానో, భార్య గానో, అమ్మగానో ఎలా విజయవంతం అవుతాను?

ఆర్ధిక స్వాతంత్య్రం వచ్చిందని, అర్ధరాత్రి తిరు గుతూ ప్రమాదాల అంచున నడవాలని లేదుగా? నా జాగ్రత్తలు నాకుండాలి. తప్పని పరిస్థితులు ఏమో కాని రోజువారీ వ్యవహారాలకు నాకు ఉదయం ఆరునుండి రాత్రి ఏడువరకూ సమయం చాలదా?’’

మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

‘‘ఇది మీ ఉద్యోగానికి సంబంధించినది కాక పోయినా కుతూహలం కొద్దీ … ఇవ్వాళా రేపూ కాలేజీ మెట్లెక్కుతూనే అమ్మాయిలు విదేశాల నుండీ దిగి వచ్చినట్టూ, అత్యాధునికులమైనట్టూ డ్రెస్సింగ్‌ ‌మార్చేస్తున్నారు కదా, మరి మీరేంటి ఇలా సంప్రదాయ దుస్తులతో..’’

‘‘నేను కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. డ్రెస్‌ ‌చేసుకునే విధానం వ్యక్తిగతం కదా, అది ఏ విధంగా మేధ స్సునో, చేసే పనినో ప్రభావితం చేస్తుం ది? చదివే విధానమూ, స్వచ్ఛమైన ఉచ్చారణా, విషయాన్ని సరళంగా, సులువుగా అర్థం అయ్యేటట్టు వివ రించడమూ ఇవి ముఖ్యం వార్తలు చదవడానికి,  వేసుకునే సూటూ బూటూ కాదు గదా?అలానే ఆఫీస్‌ ‌పని సక్రమంగా చెయ్యడం కావాలి. నేను ధరించే ఆధునిక దుస్తులు ముఖ్యం కాదు కదా.

నాకు ఇలాగ ఉండటమే ఇష్టం. ఇలాగే ఉంటాను. జీతం ఇచ్చినంత మాత్రాన నా వస్త్ర ధారణ ఇలా ఉండాలని ఎవరూ శాసించలేరు కదా’’

ఇంతలో అటెండర్‌ ‌కాఫీ తెచ్చింది.

‘‘ఇలా పనికి రాని ప్రశ్న       లన్నీ అడిగానని కోపం రాలే దా?’’

‘‘కోపమా? దేనికండి? ఈ ప్రశ్నలు పైకి మామూలుగా ఉన్నా, నా గురించి ఎంత వివ రణనిస్తాయో నాకు తెలుసు’’

‘‘థాంక్యూ. త్వరలో అపాయింట్‌ ‌మెంట్‌ ఆర్డర్‌ ‌పంపిస్తాం.’’

మరోసారి కృతజ్ఞతలు చెప్పి లేచి బయటకు వచ్చింది సావిత్రి.

నింపాదిగా అడుగులు వేస్తూ ఆఫీస్‌ ‌ప్రాంగణం దాటి బయటకు వచ్చింది.

ఫుట్‌పాత్‌ ‌మీద అడుగులు వేస్తూ ఆలోచనల్లో గతంలోకి నడిచింది.

చిన్నప్పుడు తెల్లగా ముద్దుగా ఉండేదని అందరూ ముద్దు చేసేవారు. అలాగే ఒకరోజున పక్కింటి రామం దగ్గరకు పిలిచి,

‘‘చాక్లెట్‌ ఇస్తాను. ఒక ముద్దిస్తావా?’’ అని అడగటం అమ్మ వింది.

వెంటనే గట్టిగా పిలిచింది

‘‘చిన్నపాపా’’

వెంటనే తను అమ్మ దగ్గరకు పరుగెత్తింది.

‘‘నీకు చాక్లెట్‌ ‌కావాలంటే నన్నడుగు నేనిస్తాను. అలా చాక్లెట్‌ ఇస్తాడని వాడికి ముద్దు పెట్టావనుకో, వాడి కుళ్లురోగాలు నీకు వస్తాయి’’ వాడు వినాలనే కసిగా అంది అమ్మ.

అప్పడు ఎనిమిదేళ్లు. ఆ ఒక్కమాటే పక్కవారికి దూరంగా ఉండటం నేర్పింది.

పదేళ్లు వచ్చాక కాబోలు ఒకసారి ఎందుకో నాన్న భుజాల మీద వాలిపోయి మాట్లాడుతుంటే చూసింది. కాని అప్పటికి ఏమీ అనలేదు. ఆ సాయంత్రం పెరట్లో సిమెంట్‌ ‌బల్ల మీద కూచుని సన్నజాజులు మాల కడుతూ,

‘‘ఈ పూలు చూసావా? ఎంత సుకుమారంగా ఉన్నాయో… అవి సుకుమారంగానే ఉండాలి. ఆ •పిల్లా అంతే చిన్నీ. పదేళ్లు రాగానే శరీరంలో మార్పులు మొదలవుతాయి. అందుకే ఆ శరీరం స్వంత ఆస్తిలా కాపాడుకోవాలి. కన్న తండ్రికీ, తోడబుట్టిన వాడికీ కూడా దూరంగా ఉండాలి. జీవితం సినిమా కాదు. ఒకరినొకరు హత్తుకుపోతూ అన్నయ్యా, చెల్లీ అనుకునేందుకు, నానా, అమ్మా అంటూ సెంటిమెంట్లు వల్లించేందుకు. మనసుకు బంధాలు తెలుసేమో కాని శరీరాలకు కాదుగా, అయినా ఆ విచక్షణ అందరికీ ఉండదు’’ అంటూ సున్నితంగానే అసలు తాను చెప్పదలిచింది తెలియ జెప్పింది.

హైస్కూల్‌కి రాగానే ప్రేమగానే కట్టడి చేసింది.

స్నేహితులో, సినిమాలో, సరదాలో ఏదైనా సరే సాయంత్రం ఆరయ్యేసరికి ఇంట్లో ఉండాలి అంటూ. మొదట్లో కష్టంగానే అనిపించేది. కాని జరిగే సంఘట నలు చూసాక ‘నిజమే కదా!’ అనిపించేది. స్నేహితు రాళ్లతో తిరగడమనే సరదా త్వరలోనే తీరిపోయింది.

కాలేజీకి వచ్చాక అందరిలానే జీన్స్‌ప్యాంట్‌, ‌టాప్‌ ‌వేసుకోవాలనిపించింది.

‘‘మగవాళ్లలా ఆ డ్రెస్‌ ‌నాకసలు నచ్చదు. ఒంటికి పట్టినట్టుగా ఉండి ఒంపు సొంపులన్నీ గుడ్డలో మూటకట్టినట్టూ చూపడం బాగుంటుందా? ఏవి దాచుకోవాలో, ఏవి ప్రద ర్శించాలో తెలియాలి కదా? ఎక్కడ కప్పుకోవా లో ఎక్కడ అక్కర్లేదో ఎవరి కి వారికే తెలియాలి. అయి నా అవే కావాలంటే నీ ఇష్టం.’’

‘నిజమే’ అని నాకూ

అనిపించింది.

‘‘అవును. అవయవ సౌష్టవాన్ని ప్రదర్శించు కుందుకా బట్టలు వేసు కోడం!’’ అనిపించింది.

తొమ్మిది నెలల పాపా యి నుండి తొంభై యేళ్ల ముది వయసు వరకూ అఘాయిత్యాలకు ఆడ తనం బలవుతున్న వార్తలు చదివాక తెలిసివచ్చింది ఎంత జాగ్రత్తగా ఉండాలో…

చదువు పూర్తయాక అమ్మ చెప్పిన మాటకు కళ్లు చెమర్చాయి.

‘‘చిన్నపాపా! నా మాటలు నీకు ఇన్నాళ్లు చాదస్తంగా అనిపించి ఉండవచ్చు. ఇప్పుడు నీకు విచక్షణ తెలుసు. మంచీ చెడు ఆలోచించగలవు. అందుకే నిర్ణయాలన్నీ నీకే వదిలేస్తున్నాను. పెళ్లితో సహా. ఎవరైనా నచ్చితే చెప్పు. మాకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. నాకిప్పుడూ చాలా గర్వంగా ఉంది. నీ నిర్ణయాల మీద నమ్మకమూ ఉంది’’

అప్పుడు తెలిసి వచ్చింది, ‘అమ్మతనం ఎంత కత్తి మీద సామో’.

ఈ రోజున ఇలా తన ఇష్టాలను నిర్ద్వందంగా బయట పెట్టగలిగిందంటే అది అంతా అమ్మ పెంపకమే గదా…

చదువు- అవసరాలూ తీర్చడమే కాదు. మానసిక ఔన్నత్యమూ, స్థైర్యమూ కూడా ఇవ్వాలి కదా…

అవి లేకపోయాక సమాజమో, చట్టమో ఏ విధంగా కాపాడగలదు?

వెంటనే తల్లికి కాల్‌ ‌చేసి మాట్లాడాలని పించింది.

జరిగినదంతా చెప్పింది సావిత్రి.

‘‘అయామ్‌ ‌ఫ్రౌడ్‌ ఆఫ్‌ ‌యు చిన్నీ…’’ అని మాత్రం అనగలిగింది అమ్మ.

About Author

By editor

Twitter
YOUTUBE