– కె.వి. లక్ష్మణరావు
వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
ఆఫీసులో లంచ్ అవర్‌కు సరిగ్గా పది నిమిషాల ముందు సెల్ చాటింగ్ చేస్తున్నాడు సుందర్. ‘సార్ మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు’ అంటూ వచ్చాడు అటెండర్. ‘తను సెల్ చాటింగ్ చేయడం బాస్ చూసేసారా?’ అనుమానంగా సీటు నుండి లేచి, బాస్ కేబిన్‌లోకి భయ భయంగా వెళ్లాడు సుందర్.
‘‘మే ఐ కమిన్ సర్?’’ సుందర్ డోర్ తీస్తూ బాస్ పర్మిషన్ కోరాడు.
‘‘యస్ కమిన్!’’ అంటూ బాస్ పరాంకుశం సుందర్‌ని రమ్మన్నట్టుగా సైగ చేశాడు. ‘‘పిలిచారట సర్!’’ మెల్లగా అన్నాడు సుందర్. ‘‘అవును పిలిచాను డోర్ పూర్తిగా వేసేయ్! నీతో పర్సనల్‌గా మాట్లాడాలి!’’ అంటూ బాస్ తన సీట్‌లో నుండి లేచాడు.
బాస్ అలా అనడంతో సుందర్‌లో అనుమానం కన్ఫర్మ్ అయింది. సెల్ చాటింగ్ చేసినందుకు బాస్ కచ్చితంగా ‘క్లాస్’ పీకుతారని నిర్ణయానికి వచ్చేశాడు. తన నుదిటిన పట్టిన చిరు చెమటలను తుడుచుకుంటూ డోర్ పూర్తిగా మూసేశాడు. అప్పటికే బాస్ సుందర్‌కు దగ్గరగా వచ్చి అతన్ని గమనిస్తూ, ‘‘మిస్టర్ సుందర్! సమస్య నాదైతే నీకు చెమటలు పట్టడం విచిత్రంగా ఉందోయ్ పైగా ఏ.సీ రూమ్‌లో !’’ అన్నాడు నవ్వుతూ.
‘‘హమ్మయ్య! సెల్ చాటింగ్ చేసినందుకు కాదన్నమాట!’’. సుందర్ తన మనసులో అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చాడు.‘‘ఇవి చిరు చెమటలు సార్! ఇవి నాకలవాటే’’ ఖర్చీఫ్‌తో తుడుచుకుంటూ చెప్పాడు సుందర్.
‘‘ఇట్స్ ఓకే ! ముందు కూర్చో!’’ బాస్ సుందర్ ఎదురుగా టేబుల్‌పై కూర్చుంటూ అన్నాడు. ‘‘సర్ ! మీరెందుకు పిలిచారో కారణం తెలుసుకోవచ్చా?’’ సుందర్ రిక్వెస్ట్‌గా అడిగాడు.
అప్పుడు బాస్ ‘‘ప్చ్!’’ అని నిట్టూర్చుతూ ‘‘మా ఇంట్లో అత్తాకోడళ్ల పోరు చూడలేకపోతున్నాను సుందర్. వాళ్లిద్దరితో పాట్లు పడలేకపోతున్నాను. అమ్మకు చాదస్తం ఎక్కువ, నా భార్యకు సహనం తక్కువ. సో! ఇద్దరి మధ్య వాదోపవాదాలు ఎక్కువ. నేను వాళ్ల వాదననుచూస్తూ ఉండలేక మధ్యవర్తిత్వం చేద్దామన్నా, అమ్మకు చెబితే ‘‘కష్టపడి పెంచాను! నాకే నీతులు చెబుతావా?’’ అంటుంది. పోనీ నా భార్యకు నచ్చ చె•బుదామా అంటే, ‘‘అంతే లెండి! కట్టుకున్న పెళ్లాం అంటే మీకు లోకువే కదా!’’ అంటుంది. అటూ ఇటూ చెప్పలేక వాళ్ల మధ్యనలిగి పోయి ఒత్తిడికి లోనై పోతున్నా సుందర్! ఈ అత్తా- కోడళ్ల ఒత్తిడి తగ్గే మార్గంచెప్పి పుణ్యం కట్టుకోవోయ్. బాస్‌లా కాదు, ఆఫీస్ కొలిగ్ అనుకుని నాకు సలహా ఇస్తావని పిలిచాను!’’
బాస్ మాటలు విన్న సుందర్ కుర్చీలోంచి లేచి బాస్ చేతులు పట్టుకుంటూ ‘‘సర్ ! ఇది కేవలం మీ సమస్య మాత్రమే కాదు! నా సమస్య కూడా ! ఎటొచ్చి మీరు బయటపడ్డారు. నేను పడలేదంతే’’ అన్నాడు. అతని మాటలకు బాస్ ఆశ్చర్యపడుతూ ‘‘సుందర్ నువ్వు నెగ్గుకు వస్తున్నావ్ అనుకున్నా, కానీ నువ్వు కూడా నాలా ఒత్తిడికి లోనవుతున్నావన్న మాట’’ అన్నాడు. సుందర్ కేసి జాలిగా చూస్తూ..!
సుందర్‌కు బాస్ అంటే భయం పోయింది. ఫ్రీగా అతను పడుతున్న బాధ బాస్‌తో చెప్పాలనిపించింది. ‘‘సర్! కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటారు, కానీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పరిష్కారం లభించక నాలో నేను, నాతో నేను మాట్లాడుకుంటూ నెట్టుకొస్తున్నా సర్. ఉదయం టిఫిన్ అమ్మ ఇడ్లి అంటే, నా భార్య పెసరట్టు అంటుంది. వంకాయ కూరని అమ్మంటే, తాను బెండకాయ ఫ్రై అంటుంది. ఏ విషయంలోనూ ఇద్దరి మధ్య పొంతన ఉండదు.’’
‘‘మరి! నీ ఇష్టంతో వారికి పనిలేదా?’’ బాస్ సుందర్‌ని అడిగాడు.
‘‘లేదు సర్. వాళ్లేది వండితే అది తింటాను. వండకపోతే పెరుగన్నం సరిపెట్టుకుంటాను.’’
‘‘భేష్! సుందర్ ! తగ్గడం తప్పు కాదంటావ్!’’
‘‘అవును సర్!’’
‘‘నువ్వు తగ్గుతున్నావ్ సరే ! కానీ రావణకాష్టంలా వాళ్లిద్దరి మధ్య వాదన తగ్గుతోందా? ఆ వాదన తగ్గించే ప్రయత్నం చేస్తే నీ ఇష్టాలు నెరవేరే రోజు వస్తుంది కదా? అలా ఎందుకు ప్రయత్నించడం లేదు?’’ బాస్ ప్రశ్నతో సుందర్ ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన బాస్ సుందర్‌తో ‘‘చూడు సుందర్! మనం ఒత్తిడిని దూరం చేసుకోవాలే గానీ, ఒత్తిడికి దూరంగా పారిపోతే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకప్పుడు నా ఫ్రెండ్ కూడా ఇలాగే అటు అమ్మకు చెప్పలేక, ఇటూ భార్యకు నచ్చ చెప్పుకోలేక అటూ, ఇటూ సతమతమై ఒత్తిడి తట్టుకోలేక రాత్రికి రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.’’
బాస్ చెప్పిన మాటలు వినగానే సుందర్ నిర్ఘాంతపోయాడు. ‘‘సర్ ! నిజమా?’’ అన్నాడు.
‘‘యస్ సుందర్ ! నిజాలెప్పుడూ నిష్ఠూరంగానే ఉంటాయి. పాపం నా ఫ్రెండ్ కొడుక్కి నిండా ఏడేళ్లైనా లేవు. తన తండ్రి శవంపై పడి ‘నాన్నా! లే’ అంటూ నాన్న అలా ఎందుకు పడి ఉన్నాడో తెలియక ఏకధారగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ పసి వాడిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. సుందర్! జరిగిన సంఘటనలో ఆ పసివాడి తప్పేంటి? చేయని తప్పుకు తండ్రి లేకుండా బ్రతకాలనే శిక్ష వాడెందుకు అనుభవించాలి?’’ అన్నాడు బాస్ ఆవేదనగా.
బాస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సుందర్ మౌనం వహించాడు. ‘‘సుందర్! మౌనం కొన్నిసార్లు సమాధానం అనిపించుకోదు’’.
బాస్ మాటలకు సుందర్ బదులిస్తూ ‘‘ఒత్తిడి ఎంత ఉన్నా ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికి తప్పు సర్!’’ గట్టిగా అన్నాడు.
‘‘దట్స్ గుడ్! బాగా చెప్పావ్! మరి సమస్యను ఎలా పరిష్కరిస్తావ్ ? ఒత్తిడినెలా అధిగమిస్తావ్?’’
కానీ బాస్ ప్రశ్నలకు సుందర్ నుండి సమాధానం (రా)లేదు.
‘‘చూడు సుందర్! ఒత్తిడికి గురి కాని మనిషి ఉండడు. పరిష్కారం దొరకని సమస్యా ఉండదు. ‘అమ్మా ! ఇంకా ఆకలివేస్తుంది’ అని బిడ్డ అడిగితే తాను తినే అన్నముద్ద కూడా బిడ్డకు పెడుతుంది. ఆ బిడ్డ అది తింటూ ఉంటే చూసి సంతృప్తిగా నవ్వే మనసు అమ్మది. ఆమె మనసు పసిడి మనసు. అంత మంచి మనసున్న అమ్మ, మనందరికీ ఆది గురువైన అమ్మ, మనం సరిగ్గా చెబితే అర్ధం చేసుకోదూ? కానీ పెళ్లయ్యాకా నన్ను పట్టించుకోవడం లేదనే అభద్రతా భావానికి అమ్మలోను కాకుండా కొడుకే చూసుకోవాలి. అదేవిధంగా, మన కోసం తన వాళ్లందరినీ వదలి వచ్చేసిన నీ కోడలు మనలో ఒకరిగా కలవడానికి కొంత సమయం పడుతుందని అమ్మకు మనం నచ్చ చెప్పుకోవాలి. అప్పుడు అమ్మకు తప్పకుండా కోడలిపై సాఫ్ట్‌కార్న్ ఏర్పడుతుంది. అర్ధం చేసుకుంటుంది.’’
‘‘అలాగే భార్యకు కూడా నచ్చచెప్పాలి. నీ కంటే ముందు ఈ ఇంట్లో దీపం పెట్టిన ఇల్లాలు మా అమ్మ. ఆమె అనుభవం మనకు ఒక పాఠం అని చెప్పాలి. కోడలిగా అత్తగారికి గౌరవం నువ్విస్తేనే, రేప్పొద్దున్న నువ్వు నీ కోడలి నుండి గౌరవం పొందుతావని చెప్పాలి. అమ్మ సంతోషమే మన సంతోషం అని చెబితే అర్ధాంగి కదా! అర్ధం చేసుకోదంటావా?’’ అడిగాడు బాస్.
సుందర్ బాస్ చెప్పిన మాటలు విని ఆశ్చర్య పోయాడు. ‘‘సార్! మీరు బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు చేస్తే అత్తా – కోడళ్ల సమస్యను తప్పకుండా అధిగమించగలం కాదనను. కానీ నాకో సందేహం?’’
‘‘సందేహించకు! అడుగు సుందర్’’ బాస్ అన్నాడు.
‘‘సమస్యకు పరిష్కారం చెప్పమని మొదట నన్నడిగారు. కానీ మీరే నాకు పరిష్కారం చెప్పేశారు. మరి మీ ఇంట్లో ఇలా చేస్తే మీకు ఒత్తిడి ఉండదు కదా! సార్’’ కొంచెం చొరవగా అన్నాడు. సుందర్ మాటలకు బాస్ నవ్వాడు. సుందర్‌కు ఆ నవ్వులో ఆంతర్యం అర్థం కాలేదు. ‘‘ఆశ్చర్యపోకు సుందర్! నీ సమస్య చెబుతావనే నా ఇంట్లో సమస్య ఉందని చిన్న ఎర వేశాను. మా అమ్మా-నా భార్య పేరుకు అత్తాకోడలైనా తల్లీ కూతుళ్లలా ఉంటారు.
బాస్ సమాధానానికి సుందర్ మళ్లీ ఆశ్చర్యపోతూ – ‘‘సార్ నేను ఒత్తిడిలో ఉన్నానని మీకెలా తెలిసింద’’ని అడిగాడు.
‘‘మిస్టర్ సుందర్ ! సమయపాలనకు సరైన నిర్వచనం నువ్వు. మూడేళ్లుగా ఒక్కరోజు కూడా నువ్వు ఆఫీస్‌కు లేటుగా రాలేదు. ఆ విషయం నీ బాస్‌గా నాకు బాగా తెలుసు. కానీ గత మూడు రోజులుగా మాత్రం నువ్వు ఆఫీసుకు లేటుగా వస్తున్నావు. నీ ఫేస్ డల్‌గా ఉంటోంది. వర్క్ యాక్టివ్‌గా చేయలేక పోతున్నావు, ఇంట్లో సమస్యలతో సతమతమై ఒత్తిడికి లోనైన వాడే ఆఫీస్‌లో డల్‌గా ఉంటాడు. అంతెందుకు? ఈ రోజు ఆఫీసులో లంచ్ అవర్‌కి పదినిమిషాల ముందు నువ్వు నీ భార్యకు పంపాల్సిన మెసేజ్ ఒత్తిడిలో నాకు వాట్సప్ పోస్ట్ చేశావ్’’ అంటూ సుందర్‌కు బాస్ ఆ మెసేజ్ చూపించాడు.
‘‘రమ్యా! నువ్వు మా అమ్మా ఇంకా వాదులాడుకొంటూ ఉంటే, నాకిక చావే శరణ్యం.’’ ఆ మెసేజ్ చదవగానే సుందర్ సిగ్గుతో తలవంచాడు. ‘‘సారీ సర్’’ అన్నాడు దీనాతిదీనంగా.
‘‘డోన్ట్ సే సారీ సుందర్!’’ చావుకు మించిన పెద్ద ఒత్తిడి మరేదీ లేదు. ఇది తెలిస్తే చావును బలవంతంగా వివేకం ఉన్న వాళ్లెవ్వరూ ఆహ్వానించరు. ఒత్తిడి మనకు పాఠం నేర్పుతుంది. ఆ పాఠం అనుభవం అవుతుంది. చదువుకున్న వాళ్లం కదా! ఆఫీస్‌లో అకౌంట్స్ సరిపోకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నామా? ఆలోచించి అకౌంట్స్ సరి చేసుకుంటున్నాం. జీవితమూ అంతే సుందర్. ఓర్పుతో ఒత్తిడిని చిత్తుచేసే నేర్పు మనం అలవర్చుకోవాలి. అప్పుడే వాడు ‘నేర్పరి’ అనిపించుకుంటాడు. అంతేగానీ ఆత్మహత్య చేసుకుంటే పిరికివాడిగా మిగిలి పోతాడు!’’ సుందర్ భుజం మీద చెయ్యి వేస్తూ బాస్ చెప్పాడు. బాస్ ధైర్య వచనాలు సుందర్‌లో జీవితం మీద ఆశలు పెంచాయి. తన మీద తనకు నమ్మకం ఏర్పడింది.
అది గమనించిన బాస్ సుందర్‌తో ‘‘చూడు సుందర్ ! మధ్యాహ్నం నీకు లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. ఇంట గెలిచి, రేపు విజయవంతంగా, సంతోషంగా ఆఫీసుకు రా!’’ అన్నాడు.
‘‘ఓకే ! సర్ ! మీ ప్రోత్సాహం మరువలేనిది. ఇంటికెళ్లి, అత్తా కోడళ్లకు చెప్పేలా చెబుతాను. ఒత్తిడిని జయిస్తాను’’ అని సుందర్ బాస్ కేబిన్ నుండి బయటకు అడుగేస్తూ, ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెనక్కు తిరిగి ‘‘సార్’’ అని పిలిచాడు.
‘‘యస్ ! వాట్ డు యూ వాంట్?’’ బాస్ సుందర్ కేసి చూస్తూ అడిగాడు.
‘‘ఏమీ లేదు సర్ !… నాకు మీరు హితబోధ చేసినట్టే మీ ఫ్రెండ్‌కు కూడా చేస్తే ఆయన కూడా నాలాగా ‘ఆత్మహత్య’ అనే తప్పుడు ఆలోచన మానుకుని బతికి బట్టకట్టే వారు కదా!’’ సందేహంగా అన్నాడు సుందర్.
బాస్ చిన్నగా నవ్వాడు. ‘‘అవును సుందర్! నువ్వన్నది నిజం. కానీ అప్పుడు నా వయసు ఏడేళ్లు. మానాన్న వయసు ముఫైయేడు మా నాన్నను మించిన ఫ్రెండ్ నాకెవ్వరూ లేరు. ఇప్పటికీ మా నాన్న లేని లోటు ఎప్పటికీ నాకు లోటే’’ తండ్రి గుర్తుగా రాగానే బాస్ గుండె బాధతో బరువెక్క సాగింది. ‘‘సారీ సర్!’’ అంటూ సుందర్ డోర్ తీసుకుంటూ బయటకు నడిచాడు.