– క్రాంతి

ప్రశాంత లక్షద్వీప్‌ ఒక్కసారిగా వార్తలకు ఎక్కింది. పర్యాటకంగా తప్ప, రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లేని ఆ ద్వీపాల్లో కలకలం రేగింది. సోషల్‌ ‌మీడియాలో ‘సేవ్‌ ‌లక్షద్వీప్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ‌ట్రెండింగ్‌ ‌జరుగుతోంది. దీన్నో ఉద్యమంగా మార్చే కుట్ర జరుగుతోంది. అక్కడి ప్రజల జీవితాలకూ, సంస్కృతికీ ముప్పు వచ్చిందని విమర్శలు మొదలయ్యాయి. ఇందుకు బాధ్యునిగా అడ్మినిస్ట్రేటర్‌ ‌ప్రఫుల్‌ ‌ఖోడా పటేల్‌ను చూపిస్తున్నారు. సముద్రంలోని ఈ ద్వీపాల్లో పర్యాటకరంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతున్నారు. మతం రంగు పులిమి, దేశ సమైక్యతను దెబ్బతీసే పన్నాగం ఇది. ఈ పరిణామాల వెనుక కేరళ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది?

దేశంలో అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌. ‌భౌగోళికంగా అరేబియా సముద్రంలో ఉండే ఈ దీవుల మొత్తం భూవిస్తీర్ణం 32 చదరపు కి.మీ.. కేరళ తీరం నుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపాలు ఉన్నాయి. మలయాళం, సంస్కృతం పేరైన ‘లక్షద్వీప్‌’ అం‌టే లక్ష దీవులు. పేరుకు లక్ష అయినా ఉన్నది 36 దీవులు. 10 దీవుల్లోనే జనావాసం ఉంది. మిగతావి నిర్జన ప్రదేశాలు. ఆ సముదాయంలో కవరట్టి, అమిని, కల్పేని, ఆండ్రాట్ట్, అగాట్టి, బిత్రా, కాడ్మత్‌, ‌కిల్తాన్‌, ‌చెట్లత్‌, ‌చెరియుం, బంగారం, మినికాయ్‌ ‌ప్రధాన దీవులు. లెక్కలోకి తీసుకోని చిన్న ద్వీపాలు చాలా ఉన్నాయి.

పాకిస్తాన్‌ ‌కన్ను

దేశ విభజన తరువాత పాకిస్తాన్‌ ‌కన్ను ముస్లిం జనాభా అధికంగా ఉన్న లక్షదీవుల మీద పడింది. ఆ ప్రభుత్వం యుద్ధనౌకను అక్కడికి పంపింది. ఈ విషయం నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌దృష్టికి వెళ్లడంతో వెంటనే రాయల్‌ ఇం‌డియన్‌ ‌నేవీని లక్షదీవులకు పంపారు. భారత్‌లో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్న ట్రావెన్‌కోర్‌ ‌సంస్థానం నుంచి పోలీసులన• పంపారు. వీరంతా లక్షదీవుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సమీపానికి చేరుకున్న రాయల్‌ ‌పాకిస్తాన్‌ ‌నౌకలు దూరం నుంచే త్రివర్ణ పతాకం చూసి వెనుదిరిగాయి. ఉక్కుమనిషి ముందు చూపుతో ఇతర సంస్థానాల తరహాలోనే లక్షదీవులు స్వతంత్ర భారత పరిధిలోకి వచ్చాయి. పాకిస్తాన్‌ ‌తిష్టవేసి ఉంటే లక్షదీవుల సమస్య మరో కశ్మీర్‌ ‌వివాదంలా మారేది.

లక్షద్వీప్‌ ‌రాజధాని కవరట్టి. పరిపాలనా రీత్యా ఒకే ఒక్క జిల్లా ఉంది. దీని పేరు కూడా లక్షద్వీప్‌. ‌మొత్తం జనాభా 65 వేలు. లక్షద్వీప్‌ ‌పేరిట లోక్‌సభ నియోజకవర్గం ఉంది. ఇది కేంద్రపాలిత ప్రాంతంగా అడ్మినిస్ట్రేటర్‌ ‌పాలనలో ఉంది. 10 ద్వీపాలకు ఐలాండ్‌ ‌కౌన్సిల్స్ ‌పనిచేస్తున్నాయి. వీటిలో 79 మంది సభ్యులున్నారు. న్యాయవ్యవస్థ పరంగా కొచ్చిన్‌లోకి కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఆగట్టిలో విమానాశ్రయం ఉంది. కొచ్చిన్‌ ‌నుండి విమాన సౌకర్యం ఉంది.

లక్షద్వీప్‌ ‌జనాభాలో 93 శాతం మంది ముస్లింలే. వీరంతా కోయా తెగకు చెందినవారు. మాతృభాష మలయాళం. అరబిక్‌, ఉర్దూ కలగలిపి మాట్లాడుతారు. అధికారిక భాషగా మలయాళంకు గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఎస్టీలుగా గుర్తించి లోక్‌సభ సీటును రిజర్వు చేసింది. దక్షిణంవైపు మాల్దీవులకు సమీపంలో ఉండే దక్షిణ ప్రాంత మినికాయ్‌ ‌ద్వీపంలో మాత్రం మహ్ల్ ‌భాషను మాట్లాడతారు. ఇది మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషకు దగ్గరగా ఉంటుంది.

ప్రజల ప్రధాన వృత్తులు చేపలవేట, కొబ్బరి తోటల పెంపకం, కొబ్బరి పీచు తీయడం. కేరళకు దగ్గరగా ఉండటంతో ఆ సంస్కృతి ఎక్కువ. నిత్యావసరాలతో పాటు చాలా వస్తువులు కేరళ నుంచే వస్తుంటాయి. శతాబ్దాలుగా అరబ్‌ ‌వ్యాపారుల ప్రభావం కూడా ఎక్కువే. సముద్రంలో లభించే అత్యంత ఖరీదైన ‘ట్యూనా చేప’ ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తారు. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్‌ ‌స్పోర్టస్ ‌కోసమే అభివృద్ధి చేశారు.

 కొత్త నిబంధనలు

ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి మొన్న నవంబర్‌ ‌వరకూ దినేశ్వర్‌శర్మ అడ్మినిస్ట్రేర్‌గా ఉండేవారు. ఈయన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి. డిసెంబర్‌ 4‌న ఆయన మృతి చెందడంతో మరో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా-నాగర్‌ ‌హవేలీ, డామన్‌-‌డయ్యూ అడ్మినిస్ట్రేటర్‌ ‌ప్రఫుల్‌ ‌ఖోడా పటేల్‌ను లక్షద్వీప్‌ ఇన్‌ఛార్జిగా నియమించారు. నరేంద్ర మోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉండగా పటేల్‌ ‌మంత్రి. మోదీకి సన్నిహితుడిగా పేరుంది.

ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌లక్షద్వీప్‌ ‌పరిపాలనలో సంస్క రణలతోపాటు పర్యాటకరంగ అభివృద్దే లక్ష్యంగా ‘డెవలప్‌మెంట్‌ అథారిటీ డ్రాప్ట్ ‌రెగ్యులేషన్‌’ ‌రూపొం దించారు. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతవరకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్య, పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండేవి. వాటిని అడ్మినిస్ట్రేటర్‌ ‌పరిధిలోకి తీసుకువచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులనే చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. మద్యం నిషేధం అమల్లో ఉన్నా, పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. పశుమాంసం (బీఫ్‌) అమ్మకాలు నిషేధించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బీఫ్‌ ‌బదులు చేపలు, గుడ్లకు అనుమతి ఇచ్చారు. అక్రమ కట్టడాలు కూల్చి రోడ్ల విస్తరణ చేపట్టారు. ప్రస్తుతం కేరళలోని బైపూర్‌ ‌నౌకాశ్రయం నుంచి అక్కడికి సరుకులు దిగుమతి అవుతున్నాయి. అదనంగా కర్ణాటకలోని మంగుళూరు రేవు నుంచి కూడా తెచ్చుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వేసినవారిపై కేసులు పెట్టారు. అదే విధంగా యాంటీ సోషల్‌ ‌యాక్టివిటీస్‌ ‌రెగ్యులేషన్‌ ‌బిల్లు – 2021ని ప్రవేశపెట్టారు

కేరళ  కేంద్రంగా దుష్ప్రచారం

ఈ నిర్ణయాలతో వివాదాలు రాజుకున్నాయి. సోషల్‌ ‌మీడియాలో ‘సేవ్‌ ‌లక్షద్వీప్‌’ అం‌టూ ట్రెండింగ్‌ ‌మొదలైంది. ఒక రకంగా ఇది టూల్‌కిట్‌ ‌కాపీ పేస్ట్ ‌ప్రచారం. మొదట ఈ ప్రచారం ప్రారంభించినవాడు మళయాళ సినీ నటుడు పృథ్వీరాజ్‌ ‌సుకుమార్‌. ‌కుహనా లౌకికవాదులు, నకిలీ మేధావులు అతడికి తోడయ్యారు. దీని వెనుక ప్రధానంగా కేరళ వామపక్ష, కాంగ్రెస్‌ ‌నాయకులు ఉన్నారు. షరియాకు, ముస్లింలకు వ్యతిరేకంగా హిందుత్వాన్ని రుద్దుతున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ ‌కూడా అమలు చేయరాదని అంటున్నారు.

ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌నిరంకుశుడిగా వ్యహరిస్తున్నారని, కొన్ని దీవులను కార్పొరేట్‌ ‌కంపెనీలకు అప్పగిస్తున్నారని లక్షద్వీప్‌ ఎం‌పీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ఆరోపించారు. పటేల్‌ను తొలగించాలని రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. ప్రియాంక వాద్రా కూడా సేవ్‌ ‌లక్షద్వీప్‌ ‌నినాదంతో ట్విట్టర్‌ ‌క్యాంపేన్‌ ‌మొదలు పెట్టింది. ఎన్‌సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌, ‌తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌కూడా గొంతు కలిపారు.

కానీ లక్షద్వీప్‌లో ఏదో జరిగిపోతోందంటూ అతిగా ప్రచారం చేస్తున్నారని అస్కర్‌ అలీ కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఆయన అక్కడి కలెక్టర్‌. ‌లక్షద్వీప్‌లో ఎలాంటి ఆందోళనలు లేవని, ఇదంతా కేరళలో కొందరు స్వార్ధ ప్రయోజనాలతో చేస్తున్న ప్రచారమని, మీడియాలోని ఒక వర్గం పని గట్టుకొని ఈ ప్రచారం జరుపుతోందని అన్నారు. పటేల్‌ ‌తీసుకున్న నిర్ణయాలు లక్షద్వీప్‌లో అభివృద్ది, పర్యాటకరంగ వికాసం కోసమేనని తెలిపారు. ఈ అల్లరంతా కేరళదేనని చెప్పడానికి మంచి రుజువు-ఆ అసెంబ్లీ తీర్మానమే. కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్‌లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. పటేల్‌ను రీకాల్‌ ‌చేయాలని తీర్మానంలో కోరారు. పటేల్‌ ‌తీసుకువచ్చిన డెవలప్‌ ‌మెంట్‌ అథారిటీ డ్రాఫ్ట్ ‌రెగ్యులేషన్‌ ‌వల్ల లక్షద్వీప్‌ ‌సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, దీవి ప్రజల పరిరక్షణకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక పర్యాటక రంగాన్ని ప్రమోట్‌ ‌చేసే పేరుతో లక్షద్వీప్‌ ‌సహజ స్వరూపాన్ని నాశనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విజయన్‌ ‌వాదన. బ్రిటిష్‌ ‌పాలనకు మించి నేటి పరిస్థితులతోనే లక్షద్వీప్‌ ‌ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. ఈ మొత్తం ఆరోపణలను ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌కొట్టిపారేశారు.

వాస్తవాలు  ఏమిటి?

లక్షద్వీప్‌ ‌భారతదేశంలో భాగమే. మిగతా దేశంలో అమలవుతున్న చట్టాలే ఇక్కడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాద్ధాంతం ఎందుకు జరుగుతోందో గమనించాలి. అడ్మినిస్ట్రేటర్‌ ‌పటేల్‌ ‌ప్రతిపాదించిన ‘డెవలప్‌మెంట్‌ అథారిటీ డ్రాఫ్ట్ ‌రెగ్యులేషన్‌’ ‌కారణంగా అక్కడ ఏదో జరగరానిది జరుగుతోందని కాస్త అతిగానే ప్రచారం జరుగు తోంది. ఇందులో నిజమెంత?

లక్షద్వీప్‌ ‌ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. కానీ పర్యాటక రంగం వెనుకబడింది. పొరుగునే హిందూ మహా సముద్రంలో ఉన్న మాల్దీవులకు ఏటా 17 లక్షల మంది పర్యాటకులు వెళ్తుంటారు. అందులో భారతీయులే దాదాపు ఐదు లక్షలు. లక్షదీవులకు మాత్రం పర్యాటక తాకిడి పెద్దగా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌పర్యాటక రంగ అభివృద్దికి ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే లక్షదీవుల్లో మద్య నిషేధాన్ని సడలించారని గగ్గోలు పెడుతున్నారు. మరి మాల్దీవులు కూడా ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతమే. అక్కడ మద్యపానానికి అనుమతి ఉంది. పర్యాటకుల కోసం మద్యాన్ని అనుమతించిన మాత్రాన స్థానికులు తాగాలనే నిబంధన లేదు. ఉదాహరణకు గుజరాత్‌లో సంపూర్ణ మద్యనిషేధం ఉంది. కానీ పర్యాటకుల కోసం పరిమిత ప్రాంతాల్లో అనుమతిస్తున్నారు. ఇక పర్యాటక వికాసంలో భాగంగానే అక్రమ కట్టడాలను తొలగించి రోడ్లను విస్తరిస్తున్నారు.

పశుమాంసం నిషేధం

లక్షద్వీపాల్లో పశుసంపద చాలా తక్కువ. బయటనుంచి పశువులను తెచ్చి వధిస్తున్నారు. ముఖ్యంగా పాలిచ్చే ఆవులు, గేదెలను వధించడంతో పాలకు కొరత ఏర్పడుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పాల ధర లీటర్‌ ‌రూ.50-60 ఉంటే లక్షద్వీప్‌లో రూ.200-300. ఈ పాలు కేరళ నుంచి తెచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అందుకే పాడి పరిశ్రమకు ఊతం ఇచ్చేందుకు బీఫ్‌ ‌మీద నిషేధం విధించారు. ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్ష అమలు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బీఫ్‌ ‌బదులు చేపలు, గుడ్లను పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమింటంటే ముస్లింలకు ప్రధాన ఆహారం బీఫే అని అతిగా ప్రచారం చేస్తున్నారు. లక్షద్వీప్‌లో మత్స్య సంపద, ఇతర మాంసాలు అపారంగా దొరుకుతున్నాయి. బీఫే కావాలనే పట్టుదల స్థానికులకు పెద్దగా లేదు. పశుమాంసం మీద ఆంక్షలు లక్షద్వీప్‌ ‌లోనే కాదు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

పిల్లల నిబంధన

ముగ్గురు పిల్లలున్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన దేశంలోని అన్ని రాష్ట్రాల్లలోనూ ఉంది. దీనికి మతంతో సంబంధం లేదు. ఇప్పటి వరకూ లక్షద్వీప్‌లో అమలు చేయలేదు. ఇది ప్రగతిశీల చట్టమని, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం లభించడం ద్వారా మహిళా సాధికారతకు తోడ్పడుతుందని కలెక్టర్‌ అస్కర్‌ అలీ అంటున్నారు. వాస్తవానికి లక్షద్వీప్‌లో మెజారిటీ కుటుంబాల• ఇద్దరు పిల్లలతోనే ఉన్నాయి. పీవీ నరసింహారావు హయాంలో అమలులోకి వచ్చిన ఈ పంచాయితీ రాజ్‌ ‌చట్ట రూపకల్పనలో కేరళ కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు కరుణాకరన్‌ ఉన్నారు. విచిత్రంగా ఇప్పుడు కేరళకు చెందిన కాంగ్రెస్‌ ‌నాయకులు కూడా ఈ చట్టాన్ని లక్షద్వీప్‌లో అమలు చేయొద్దని వాదిస్తున్నారు.

నేరాల అదుపు కోసం చట్టాలు

లక్షద్వీప్‌లో నేరాలు, ఘోరాలు చాలా తక్కువే అయినా యాంటీ సోషల్‌ ‌యాక్టివిటీస్‌ ‌రెగ్యులేషన్‌ ‌బిల్లు -2021 తేవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరు. భారత ప్రధాన భూభాగానికి దూరంగా సముద్రంలో ఉన్న లక్షద్వీప్‌ ‌రక్షణపరంగా అత్యంత కీలకం. పలు దేశాల మధ్య ఈ మార్గంలో రవాణా జరుగుతోంది. శ్రీలంక, మాల్దీవులలో పెరుగుతున్న చైనా ఆక్రమణల మధ్య హిందూ మహాసముద్రంలో ఈ భూభాగం భారీ వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో డ్రగ్‌ ‌మాఫియా, స్మగ్లర్లకు తోడు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. కొంత కాలం క్రితం మినికాయ్‌ ‌ద్వీపంలో శ్రీలంకకు చెందిన బోటులో 300 కిలోల హెరాయిన్‌ ‌దొరికింది. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అదే విధంగా ఐదు ఏకే-47 రైఫిల్స్ ‌పట్టుబడ్డాయి. లక్షద్వీప్‌లో ఐఎస్‌ఐఎస్‌ ఉ‌గ్రవాదులు, ఏజెంట్ల కదలికలు కూడా కనిపిస్తున్నాయి. 2019లో 15 మంది ఉగ్రవాదులు శ్రీలంక నుంచి లక్షద్వీప్‌లోని మానవ రహిత ద్వీపాలలో శిక్షణ పొందారని తెలిసింది. సీఏఏ, ఎన్నార్సీ వివాదాలతో లక్షద్వీప్‌ ‌ప్రజలకు సంబంధం లేదు. అయినా గోడలపై నినాదాలు కనిపిస్తున్నాయి. చివరకు గాంధీజీ విగ్రహం పెట్టరాదనే ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటివి నివారించేందుకే గూండా చట్టాలను అమలు చేయాలని నిర్ణయించారు.

లక్షద్వీప్‌పై కేరళ రాజకీయాల ప్రభావం ఉన్నప్పటికి అక్కడి ఓటర్లు ఎప్పుడూ వామపక్షాలకు పట్టం కట్టలేదు. ముస్లింలీగ్‌ ‌ప్రభావం కూడా లేదు. ప్రజలను ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా గిరిజనులుగా గుర్తించి ఈ నియోజకవర్గాన్ని ఎస్టీలకు రిజర్వ్ ‌చేశారు. లక్షద్వీప్‌ ‌మొత్తం ఒకే లోక్‌సభ సీటు పరిధిలోకి వస్తుంది. ఓటర్ల సంఖ్య 55,057. 1957, 1962లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కె. నల్లకోయ తంగల్‌ ‌గెలిచారు. 1967లో పీఎం సయీద్‌ ‌స్వతంత్ర అభ్యర్థిగా,1971లో కాంగ్రెస్‌ ‌పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యారు. సయీద్‌ 10 ‌సార్లు, 1999 ఎన్నికల వరకూ వరుసగా పార్లమెంట్‌కు ఎన్నికవుతూ 35 ఏళ్లు ప్రాతినిధ్యం వహించారు. సయీద్‌ ‌కేంద్ర మంత్రిగా, లోక్‌సభ ఉపసభాపతిగా పని చేశారు.

పీఎం సయీద్‌ ‌మరణానంతరం వారసునిగా ఆయన కొడుకు మహ్మద్‌ ‌హమ్దుల్లా సయీద్‌ 2004 ‌లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా అపజయం పొందారు. ఆ ఎన్నికల్లో జనతాదళ్‌(‌యూ) అభ్యర్థిగా పోకున్హి కోయా గెలిచారు. 2009 ఎన్నికల్లో మహ్మద్‌ ‌హమ్దుల్లా సయీద్‌ ‌లక్షద్వీప్‌ ‌నుంచి గెలిచారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో మాత్రం పరాజయం పొందారు. ఈ రెండు ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహ్మద్‌ ‌ఫైజల్‌ ‌విజయం సాధించారు. అయితే ఫైజల్‌ ‌కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్‌తో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు.

ఎందుకీ దుష్ప్రచారం?

లక్షద్వీప్‌ ‌రాద్ధాంతానికి కారణాలు సుస్పష్టం. అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చిన ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌గతంలో గుజరాత్‌ ‌మంత్రి. రాజకీయ నాయకులను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించకూడదనే నిబంధనేమీ లేదు. కానీ ఆయనను కాంగ్రెస్‌, ‌వామపక్షాలు లక్ష్యంగా చేసుకోవడం వెనుక గుజరాత్‌ను అప్రతిష్ట పాల్జేయాలన్న దుగ్ధ ఉంది. సేవ్‌ ‌లక్షద్వీప్‌ ‌ప్రచారం కేరళ కేంద్రంగా జరుగుతోంది. ముస్లింలు అత్యధికంగా ఉన్న కేరళలో మద్య నిషేధం లేదు. కానీ లక్షద్వీప్‌లో కొనసాగించాలంటున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి పశువధ నిషేధం, అమూల్‌తో పాటు ఇతర ప్రైవేట్‌ ‌డెయిరీల ప్రవేశానికి అనుమతి కేరళ రాజకీయ వ్యాపారులకు ఇష్టం లేదు. అయితే అమూల్‌ ‌ఖ్యాతికి కారకుడైన వర్ఘీస్‌ ‌కురియన్‌ ‌మలయాళీ. లక్షద్వీప్‌కు మిగతా దేశంతో సమానంగా రూ.50-60 రూపాయలకే పాలు అందుబాటులోకి వస్తే, ఇకపై తాము రూ.200-300కు అమ్ముకోలేమని వారి భయం. రవాణాకు మంగళూరు పోర్టును కూడా అనుమతించడం కేరళ వర్గాలకు నచ్చలేదు. కొచ్చిన్‌ ‌పోర్టు ఆదాయం దెబ్బతింటుందనే భయం.

———————–

చరిత్రలో లక్షద్వీప్‌

అరేబియా సముద్రంలోని లక్షదీవుల్లో మానవ సంచార ఆనవాళ్లు క్రీ.పూ. 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది. ఇక్కడి ప్రజలు మాత్రం తమ పూర్వికులు తుపాను కారణంగా ఈ దీవులకు కొట్టుకువచ్చిన వర్తకులు అని భావిస్తారు. ప్రాచీనకాలంలో భారత దేశం నుంచి జరిగిన సుగంధ ద్రవ్యాల వ్యాపారమార్గంలో ఈ దీవులు కీలకంగా ఉన్నాయి. వాస్కోడిగామా ఈ మార్గంలోనే భారత దేశం చేరుకున్నాడు. సంగమ సాహిత్య పరిశోధన ప్రకారం ఈ ప్రాంతం చేర దేశ ఆధీనంలో ఉండేది. 7వ శతాబ్దంలో ఈ ద్వీపాలు పల్లవ సామ్రాజ్యంలో ఉన్నాయి. కేరళ చివరి రాజైన చేరమాన్‌ ‌పెరుమాళ్‌ ‌కాలంలో ఈ ద్వీపాలకు సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

కవరట్టి, అమిని, కల్పేని, ఆండ్రాట్ట్, అగాట్టి వంటి ద్వీపాలలో హిందూ మతాన్ని పాటించేవారు. కొందరు బౌద్ధం ఆచరించారు. క్రీ.శ. 661లో ఉబైదుల్లా అనే అరబ్‌ ‌దేశీయుడు లక్షద్వీపాలకు ఇస్లామ్‌ను తీసుకువచ్చాడు. ఆయన సమాధి ఆండ్రాత్‌ ‌ద్వీపంలో ఉంది. 14వ శతాబ్దంలో ఇక్కడి ప్రజలు ఇస్లాంలోకి మారారు. లక్షద్వీప్‌ 11‌వ శతాబ్దంలో చోళరాజుల పాలనలోకి, 17వ శతాబ్దంలో అలి రాజ్య ఆధీనంలోకి వచ్చింది. కొంతకాలం పోర్చుగీసు ఆధీనంలోకి పోయింది.

1787లో అమిందివి ద్వీపసముదాయంగా పిలిచే ఆమిని, కాడ్మత్‌, ‌కిల్తాన్‌, ‌చెట్లత్‌, ‌బిత్రా దీవులు టిప్పు సుల్తాన్‌ అధీనంలోకి వచ్చాయి. మూడవ ఆంగ్లో- మైసూరు యుద్ధం తరువాత ఈ ద్వీపాలు ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. మిగిలిన ద్వీపాలు కన్ననూరుకు చెందిన అరక్కల్‌ ‌కుటుంబం స్వాధీనంలో కొనసాగాయి. కప్పం కట్టలేదన్న నెపంతో బ్రిటిష్‌ ‌వారు దీవులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలోని మలబారు జిల్లా కిందకు వచ్చాయి.

నవంబర్‌ 1, 1956‌న భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో, లక్షద్వీప్‌ను మలబార్‌ ‌జిల్లా నుండి వేరుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అప్పటి వరకూ లక్షదీవులను లక్కదీవ్‌, ‌మినికోయ్‌, అమిండి దీవులుగా పిలిచేవారు. కేంద్రం నవంబర్‌ 1,1973‌న ప్రస్తుత లక్షద్వీప్‌ ‌పేరును స్థిరపరచింది. 1964 వరకు లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ‌కార్యాలయం కోజికోడ్‌లో ఉండేది. అదే సంవత్సరం దాన్ని కవరట్టికి మార్చారు. హిందూ మహాసముద్రంలో రక్షణ రీత్యా కీలకమైన లక్షద్వీప్‌లో భారత నౌకాదళం ఐఎన్‌ఎస్‌ ‌ద్వీపరక్షక్‌ను ఏర్పాటు చేశారు.

———————-

రాజీవ్‌ ‌విలాసయాత్ర.. మద్యం వరద

అడ్మినిస్ట్రేటర్‌ ‌పటేల్‌ ‌పరువు తీయాలని చూసిన గాంధీలు అనుకోకుండా తామే బురదగుంటలో పడ్డారు. లక్షద్వీప్‌లో మద్యపానానికి గేట్లు బార్లా తెరిచి అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ తన తండ్రి రాజీవ్‌ ‌ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన లక్షద్వీప్‌ ‌జాయ్‌‌ట్రిప్‌ను మరచిపోయారు. అది 1987 నాటి ఘటన. ఇప్పుడు అందరు గుర్తు చేసుకుంటున్నారు.

 రాజీవ్‌ ‌కుటుంబం, ఇటలీ బంధుమిత్రులు సెలవులు గడపడానికి లక్షదీవులను ఎంచుకున్నారు. సోనియాగాంధీ, రాజీవ్‌ అత్తామామలు, రాహుల్‌, ‌ప్రియాంక, అమితాబచ్చన్‌ ‌కుటుంబం కూడా ఉంది. ఐఎన్‌ఎస్‌ ‌విరాట్‌ ‌యుద్ధనౌకలో బంగారం దీవికి వెళ్లారు. విదేశీయులను అనుమతించే ద్వీపం ఒక్కటే కనుక దీనిని ఎంచుకున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ఖరీదైన మద్యం, వందకోళ్లు, చేపలు, రకరకాల ఆహార పదార్థాలు, పాక నిపుణులతో ఒక పటాలమే తరలింది. మద్యం ఏరులైపారింది. ఎంత ఖర్చయిందో లెక్కే లేదు. ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచే వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. దేశభద్రతలో కీలకపాత్ర పోషించే ఐఎన్‌ఎస్‌ ‌విరాట్‌ ‌యుద్ధనౌకను, దానితోపాటు జలాంతర్గామిని రాజీవ్‌ ఒక టాక్సీలా వాడుకున్నారు. దేశభద్రతనే ప్రమాదంలోకి నెట్టి జరిపిన జాలీ ట్రిప్‌ అది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తుచేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE