కెమల్ పాషా ఖిలాఫత్ వ్యవస్థను రద్దు చేయటాన్ని ఒట్టొమాన్‌ల కుటుంబాన్ని దేశం విడిచిపెట్టి పొమ్మని ఆదేశించటాన్ని మనదేశపు ఖిలాఫత్‌వాదులను నివ్వెరపోయేలా చేసింది. ఇది వారు కలలో కూడా ఊహించని పరిణామం. అయినప్పటికి వారు ఖిలాఫత్ ఉద్యమాన్ని కొనసాగించ టానికి నిర్ణయించారు. ఘనుడైన మౌలానా అజాద్ కెమల్‌పాషాను ఖలీఫాగా ప్రకటించుకొమ్మని వేడుకున్నారు కూడా! అయితే వారు వాస్తవాలు తెలుసుకొని మేలుకొనే వేళకు వారి మధ్య ఉన్న విభేదాలు బయటకు పొక్కాయి. మౌలానా అబ్దుల్ బారి, అజ్మల్ ఖాన్ వర్గీయులు ఖిలాఫత్ కేంద్ర కమిటీ విధానానికి వ్యతిరేకంగా శాసనసభలలో ప్రవేశించాలని అనుకొన్నారు. కాని కేంద్ర కమిటీ సహాయ నిరాకరణను కొనసాగించాలని తీర్మానం చేసింది. జమాయిత్-ఉల్-ఉల్మా సంస్థ చట్టసభలలోకి ప్రవేశించకూడదన్న ఫత్వాను జారీ చేసింది. మరికొందరు ఖిలాఫత్ వాదులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉందని భావించటం మొదలెట్టారు. ఖిలాఫత్‌వాదుల ఆంగ్ల వ్యతిరేకత అనేది స్వతహాగా వచ్చింది కాదు. •ర్కీ పట్ల బ్రిటన్ అనుసరించే వైఖరిని బట్టి వలసపాలకుల పట్ల వారివైఖరి మారుతూ వచ్చింది. బ్రిటన్ 1922లో టర్కీ పట్ల కొంత ఉదారంగా వ్యవహరించినట్లు మౌలానా అబ్దుల్ బారి, కిద్వాయి భావించారు. దానితో వారు బ్రిటిష్ వారితో సయోధ్యకై ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే ఖిలాఫత్‌వాదులలో ఎక్కువమంది టర్కీ పట్ల బ్రిటన్ అనుసరించిన విధానంతో అసంతృప్తిగానే ఉన్నారు.
అహింసా మార్గం కేవలం మాటలకే పరిమితం అయింది. 1922 నుండి దేశం నలుమూలలా మత ఘర్షణలు చెలరేగాయి. హిందూ-ముస్లిం ఐక్యత గురించిన ప్రవచనాల నడుమ హిందువులపై భయంకరమైన దాడులు జరిగాయి. 1924 జులైలో ఢిల్లీలో బక్రీద్ సందర్భంగా జరిగిన మత ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అదే నెలలో నాగ్‌పూర్‌లోనూ, ఆగస్ట్‌లో పానిపట్‌లోనూ ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత లాహోర్, లక్నో, మురాదాబాద్, భాగల్‌పూర్, రూర్కి, ఆగ్రా, హన్పార్, మీరట్, అహమ్మదాబాద్, ఫిల్‌భిత్, హర్దోయి, అలహాబాద్, జాంగ్, గుల్బర్గా మత ఘర్షణలతో అట్టుడికి పోయాయి. 1923లో ఆర్యసమాజ నాయకుడు స్వామీ శ్రద్ధానందను దారుణంగా హత్య చేశారు. హిందువులు కోపం కట్టలు తెంచుకుంది.
ఖిలాఫత్ నాయకులు ఉద్యమం కోసం సేకరించిన లక్షలాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారన్న వార్తలు వెలువడటంతో నాయకుల విశ్వసనీయతను అనుమానించి, ప్రశ్నించటం మొదలెట్టారు. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే నలభై నుండి ఏభైవేల రూపాయల నిధులు స్వంతానికి నాయకులు మళ్లించుకొన్నారు. రూ.16 లక్షల ఖిలాఫత్ నిధులను ఆ సంస్థ కోశాధికారి తన వ్యక్తిగత సంస్థకు మళ్లించాడు. నిధుల దుర్వినియోగ ఆరోపణలు వెల్లువెత్తడంతో రావటంతో, వివిధ స్థాయిలలోని నాయకులు అప్రతిష్ట పాలయ్యారు. మలిదశలో ఖిలాఫత్ ఉద్యమం అంతర్గత కుమ్ములాటలతో, పరస్పర ఆరోపణలతో, వర్గ పోరుతో, ఆర్థిక అవకతవకలతో, వీటన్నింటికి మించి తారస్థాయికి చేరిన హిందూ – ముస్లిం విభేదాలతో కునారిల్లింది. 1929 తర్వాత కూడా కేంద్ర ఖిలాఫత్ కమిటీ ఉన్నప్పటికి సమావేశాలు జరపలేదు. తమకు తాము జాతీయవాద ముస్లింలుగా అన్సారీ, అజాద్, కిద్వాయి, అసఫ్ అలీ, అక్రమ్ ఖాన్ మొదలైన వారు ప్రకటించుకొని ‘ఆల్ ఇండియా నేషనలిష్టు ముస్లిం కాన్ఫరెన్స్’ పేరిట ఒక ముస్లిం నేషనలిస్ట్ పార్టీని ప్రారంభించారు. ఆలీ సోదరులు, హస్రత్ మోహని, సుభానిలు ముస్లిం లీగ్‌తో కలసి ‘ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్’ను నెలకొల్పారు. అబ్దుల్ బారి, అజ్మల్ ఖాన్, డా।। అన్సారీ, ఆలీ సోదరులు 1920 తర్వాత కీర్తి శేషులయ్యారు. ఖిలాఫత్ ఉద్యమం చెల్లాచెదురైంది. 1938 నాటికి పూర్తిగా అదృశ్య మైయింది. అయితే ఈ ఉద్యమానికి సాక్షిగా బొంబాయి ‘ఖిలాఫత్ హౌస్’ నేటికీ నిలిచే ఉంది (Qureshi, ibid, pp.254-305).
ఖిలాఫత్ ఉద్యమ ప్రాముఖ్యం
ఖిలాఫత్ ఉద్యమం తన ఆశయసాధనలో విఫలమయింది. అంతమాత్రం చేత దానిని కొట్టి పారవేయవలసిన పనిలేదు. ఆ ఉద్యమానికి భారతదేశ చరిత్రలో విశేష ప్రాధాన్యం ఉంది. అఖిల భారతస్థాయిలో ముస్లిం ఛాందసవర్గాలు, సామాన్య ముస్లింలను సైతం భాగస్వాములను చేసి, చేపట్టినదే ఖిలాఫత్ ఉద్యమం. పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు రాష్ట్రాలు ఈ ఉద్యమంతో ముస్లిం రాజకీయాలకు బాంబే, బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాల ఒరవడిలో చేరాయి. 1857 తర్వాత, ముస్లిం రాజకీయాలు ఉన్నత, మధ్య తరగతి వర్గాలకే పరిమితం అయ్యాయి. ఖిలాఫత్ ఉద్యమంతో ముస్లిం మత పెద్దలు ఉలేమా ముస్లిం రాజకీయాలకు కేంద్ర బిందువులయ్యారు. పాశ్చాత్య చదువులు చదివిన ముస్లిం నేతలతో కలసి పనిచేశారు. ఉద్యమం సందర్భంగా అంతకుముందెన్నడూ లేని విధంగా ముస్లిం జనసమీకరణ జరిగింది.
కాంగ్రెస్ పక్షంలో తన నాయకత్వాన్ని సుస్థిరపర్చు కొనేందుకు గాను గాంధీజీ అదను చూసి ఖిలాఫత్ ఉద్యమంలోకి దూకారు. ఖిలాఫత్ ఉద్యమం అనేక ఇతర ఉద్యమాలకు దారితీసింది. ఒక ముఖ్యమైన ఉద్యమం పేరు తన్జీమ్. 1923లో దానిని ప్రారంభించారు. ముస్లింలను చైతన్యపరచటం, మసీదులో ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పటం, పాఠ్య గ్రంథాలు తయారు చెయ్యటం, నిర్ణీత సమయానికి ప్రార్థనలు జరిగేలా చూడటం, సాంకేతిక కళాశాలలను ఏర్పాటు చెయ్యటం, వక్ఫ్ ఆస్తులను అజమాయిషీ చేయటం, జకత్‌ను వసూలు చేసి విధవరాండ్రకు, అనాథలకు పంచటం, ముస్లిం సహకార సంఘాలను, బ్యాంకులను ప్రారంభించటం మొదలైన నిర్మాణాత్మక పనులను ఉద్యమంలో భాగంగా మొదలెట్టారు.
గాంధీజీకి, ఖిలాఫత్ నాయకులకు మధ్య ఏర్పడిన స్నేహం ఖిలాఫత్ ఉద్యమానికి హిందూ-ముస్లిం ఐక్యత కోసం పనిచేస్తున్న సంస్థగా కొంత గుర్తింపును తెచ్చుకొంది. ఆ ఉద్యమం స్వరాజ్యం కోసం చేపట్టిన ఉద్యమమని చాలాకాలం హిందువులు భ్రమలో ఉన్నారు. హిందూ-ముస్లిం ఐక్యతతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని హిందువులకు పదేపదే చెప్పటంతో వారు అది నిజమని నమ్మారు. ముస్లింలు తమ అంతర్జాతీయ ఇస్లామిక్ లక్ష్యాల సిద్ధికోసమే తాత్కాలికంగా హిందువులతో కలిసి ఉన్నట్లుగా నటించారు. 1920 నవంబరులో అబ్దుల్ బారి ఇలా అన్నాడు, ‘ఇస్లామ్ బలం గాంధీతో కలసి ఉండటంలోనే ఉంది’ (Religion and Politics: The Ulama and Khilafat Movement, Mushirul Hasan, Economic and Political Weekly, Vol.16, No:20, 1981, p. 907). కాకినాడలో 1927 డిసెంబర్ 23న జరిగిన ఖిలాఫత్ సభలో ఆలీ చాలా స్పష్టంగా చెప్పారు, ‘స్వరాజ్య సాధన ఒక రాజకీయ, జాతీయ కర్తవ్యం మాత్రమే కాదు, అది ఒక ఇస్లామిక్ కర్తవ్యం కూడా’ అని. హిందువులు భారతీయులు అయ్యేందుకు తమ హిందూత్వాన్ని వదిలివేశారు, కాని ముస్లింలు మొదటినుండి చివరి వరకు ముస్లింలుగానే ఉన్నారు.
ఖిలాఫత్ ఉద్యమం మతప్రాతిపదికన దేశ విభజనకు కావలసిన భూమికను తయారు చేసింది. ‘ఇస్లామ్‌కు ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా ఉద్యమం ముస్లింలలో తాము ముందుగా ముస్లింలు అనే చైతన్యాన్ని కలుగజేసింది. ఈ ఆలోచన ఎప్పటినుండో ఉన్నదే. అయిన్పటికీ అంతకుముందెన్నడూ లేని అస్థిత్వాన్ని తీవ్రతను ఆ భావనకు ఖిలాఫత్ ఉద్యమం జతచేసి బలం చేకూర్చటంతో తాము ముందుగా ముసింలమని, ఆ తర్వాతే భారతీయులమని వారు ప్రగాఢంగా విశ్వసించేటట్లు చేసింది. ముస్లింలమని జాతీయవాదానికి ఇదొక మహత్తర విజయం. దీని ఆధారంగా ఇతర ఐక్యతలను నిర్మించసాగారు’ (The Making of Pakistan: A Study in Nationalism, K.K.Aziz, Chatto and Windus, London, 1967, p. 115).
మొట్టమొదటి పాఠం
ముస్లిం రాజకీయాలను, ఖిలాఫత్ ఉద్యమం జరిగిన తీరు తెన్నులను గమనిస్తే ముస్లిం నాయకత్వ ఆలోచనా తీరు, వారి ప్రాధాన్యాలు, దేశం కంటె కూడా మతానికే పెద్ద పీట వేసే వారి ధోరణి మనకు తేటతెల్లమయ్యాయి. డా।। అనిబీసెంట్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యానం ఈనాటికి కూడా వర్తిస్తుంది. ‘ముస్లింల పాత మతమైన కత్తి (బలప్రయోగం, హింసోన్మాదం) పునరుద్ధరణ జరిగి, దైనందిన రాజకీయాలకు మార్గదర్శనం కావటాన్ని మనం గమనించాం. అనేక శతాబ్దాల కింద మరుగున పడిన అరేబియా ద్వీప పవిత్రత, ఆ పవిత్ర భూమిపై ముస్లిమేతరులు కాలుపెట్టకూడదన్న భావన తిరిగి వెలుగులోకి వచ్చాయి. అఫ్ఘాన్లు దేశం మీద దాడి చేస్తే, తోటి విశ్వాసులతో జతకట్టి, మాతృదేశ పరిరక్షణకై ముందుకు ఉరికే హిందువుల గొంతులు కత్తిరిస్తామని ముస్లిం నాయకులు బహిరంగంగానే హెచ్చరించటం మనం విన్నాం. ముస్లింల అనుబంధం ఇస్లామిక్ దేశాలతోనే తప్ప మన మాతృభూమి పట్ల కాదన్న సత్యాన్ని మనకు తెలియచెప్పారు. తాము ఏ దేశంలో నివసిస్తున్నామో, ఆ దేశపు చట్టాలకు లోబడి ఉండటం కాక, వారి ప్రత్యేక ప్రవక్త ఇచ్చిన చట్టాలకే విధేయులుగా ఉంటామని వారు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అటువంటి ప్రకటనలు దేశ సమగ్రతకు, సుస్థిరతకు భంగకరం, హానికరం. వారికున్న సీమాంతర విధేయత కారణంగా వారు మంచి పౌరులుగా ఉండలేరు. మౌలానా మహమ్మదాలీ, మౌలానా షాకత్ అలీ వంటి ముస్లిం నాయకుల అభిప్రాయానే వారు నమ్ముకున్నారు. కాని, సాటి పౌరులను నమ్మరు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లయితే, ముస్లిం జనాభా వారి అజ్ఞానంతో వారి ప్రవక్త పేరుతో మాటలు చెప్పే వారినే అనుసరిస్తారు. భారతదేశ స్వాతంత్య్రానికి అది పెద్ద ముప్పు’ (The Future of Indian Politics, Annie Besant, Theosophical Publishing House, 1922, pp. 301-303). అనిబీసెంట్ అభిప్రాయంతో డా।। అంబేడ్కర్ ఏకీభవిస్తూ ఇస్లామిక్ దేశాల పట్ల వారికున్న సీమాంతర విధేయత (Pan Islamism)పై ఇలా రాశారు, ‘దేశాల మధ్య ఉన్న భౌగోళిక హద్దులను ఇస్లాం గుర్తించదు. దానికి ఎల్లలు లేవు. సామాజిక, మత ఎల్లలే తప్ప భౌతిక ఎల్లలు దానికి లేవు. కనుక సీమాంతర విధేయత దాని మౌలిక లక్షణం. ఇదే ఇస్లామిక్ దేశాల పట్ల విధేయతకు కారణం. ఈ కారణంగానే ప్రతి ముసల్మాను తాను మొదట ముస్లింనని, ఆ తర్వాతే భారతీయుడినని ప్రకటించేవారు. ఇందువలననే భారతదేశ అభివృద్ధిలో ముస్లిం అత్యల్పమైన పాత్ర పోషించాడు. ఇస్లామిక్ దేశాల బాగోగులను పట్టించుకొని వాటికోసం తమ సర్వస్వాన్ని వెచ్చించాడు. అతని ఆలోచనలలో ఎప్పుడూ ఇస్లామిక్ దేశాలే ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఆ తర్వాత స్థానంలోనే భారతదేశం ఉంటుంది’ (Pakistan or Partition of India, pp.290-291).
రెండవ పాఠం – దేశ ఐక్యతకు పరిమితులు
ఇస్లామిక్ దేశాల పట్ల ఉండే సీమాంతర విధేయత ముస్లింలను తమతోటి ముస్లిమేతర ప్రజలతో కలవనివ్వదు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అభిప్రాయాలను ఏప్రిల్ 24, 1924న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికా సంపాదకుడు సేకరించి ప్రచురించాడు. ‘హిందూ-ముస్లిం ఐక్యతకు పెద్ద ప్రతిబంధకం భారతదేశం పట్ల వారికి విధేయత లేకపోవటమేనని విశ్వకవి అభిప్రాయపడ్డారు. భారతదేశంపై ఏదేని ముస్లిం రాజ్యం దాడిచేస్తే, తమ తోటి హిందూ పౌరులతో కలసి మాతృభూమి కోసం, పోరాడతారా అని అనేకమంది ముసల్మాను లను ప్రశ్నించినపుడు, వారిచ్చిన సమాధానం తనకు తృప్తి కలిగించలేదని విశ్వకవి చెప్పారు. మహమ్మదాలీ వంటివారు ఎటువంటి పరిస్థితులలోనైనా, వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఒక ముస్లిం మరొక ముస్లింకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి అనుమతి లేదని ప్రకటించాడు’ (Pakistan or Partition of India, ibid, pp.268-269).
గాంధీజీ వంటి నాయకులుకు హిందూ ముస్లిం ఐక్యత చాలా ముఖ్యం కాని నెహ్రూ వంటి నాయకులకు హిందూ-ముస్లిం ఐక్యత ప్రధానమైనది కానేకాదు. ఆయన కావాలని ముస్లిం మత తత్త్వాన్ని పట్టించుకోలేదు. ఆయన దృష్టిలో ముస్లిం సమస్య అనేది లేనేలేదు. ఆ సమస్యపై ఎక్కువ దృష్టిపెట్టి, ఎలాగైనా ఇరువర్గాల మధ్య ఐక్యత తీసుకొని రావాలన్న తపన వలన ఆ సమస్య ప్రధాన మౌతుందని, ఇతర సామాజిక అంశాలు తెరపైకి వచ్చినప్పుడు దానంతట అదే సమసిపోతుందని ఆయన భావించాడు. (K.K. Aziz, ibid, p.187)
డా।। అంబేడ్కర్ హిందువులకు ఈ విధమైన సలహా ఇస్తున్నారు, ‘హిందూ-ముస్లిం ఐక్యత సాధించేందుకు గతంలో అనేకసార్లు చిత్తశుద్ధితో నిరంతరంగా ప్రయత్నాలు జరిగాయి. అంతకంటె చేయవలసిందేమీలేదు. హిందూ – ముస్లిం ఐక్యత ఒక ఎండమావి లాంటిది. ఆ ఆలోచనను విరమించుకోవటం మంచిది. ఏ నాటికైనా ఇరువర్గాల మధ్య ఐక్యత రాగలదన్న ఆశావాహ ధృక్పధానికి ఎటువంటి ఆధారమూలేదు. అటువంటి సలహాయిచ్చేవారిని నిరాశావాదులుగా, సహనం కోల్పోయిన ఆశయవాదులుగా పేర్కొనటానికి సైతం ధైర్యం కావాలి. హిందువులు ముస్లింలతో ఎలా వ్యవహరించాలో తేల్చుకోవాలి. వారి గత అనుభ వాల విషాద ముగింపు నుండి ఈ వ్యర్థ ఆకాంక్షను పట్టుకొని వేలాడతారో లేదా ఐక్యతా ఆకాంక్షను వదిలివేసి, వేరే ప్రాతిపదిక మీద వారితో సర్దుబాటు చేసుకొంటారో వారు తెల్చుకోవాలి’ (Pakistan or Partition of India, ibid, p. 307).
మూడవ పాఠం – మత రాజకీయాలు
ఖిలాఫత్ ఉద్యమం మత పరమైనదా? రాజకీయ మైనదా? ఇస్లాం దృష్టిలో ఇదొక పిచ్చిప్రశ్న. ఎందుకంటే మతానికి, రాజకీయానికి మధ్య ఇస్లాం దృష్టిలో తేడా లేనే లేదు. ఇస్లాంలో ఆధ్మాత్మిక, భౌతిక అంశాలు వేరు వేరు కాదు. పౌర, రాజకీయ జీవితాలకు సంబంధించిన ప్రతి చర్య కూడా ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలను అనుసరించే ఉంటుంది. సయ్యద్ అబ్దుల్ అలీ మౌదుది (1903-79) ఆధునిక ఇస్లామిక్ మేథావి. ఆయన మాటల్లో, ‘ఇస్లామ్ అంటే కేవలం కొన్ని ఆచారాలు, సిద్ధాంతాలు కావు. అది ఒక పూర్ణజీవన విధానం. మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వ్యక్తిగత, ప్రభుత్వ, రాజకీయ, ఆర్థిక సామాజిక, సాంస్కృతిక, నైతిక, న్యాయపరమైన అంశాలు గురించి దైవం నిర్దేశించిన మార్గం ఇస్లాం. అన్నిటికీ దారి చూపగల, ప్రభావితం చేయగల సిద్ధాంతం. మతాన్ని, రాజకీయాన్ని విడదీయటానికి ఇస్లాం ఒప్పుకోదు. రాజకీయాలను సైతం ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగానే నడపాలి. రాజ్యం, ప్రభుత్వం కూడా అల్లాకు లోబడి, ఆయన చూపిన మార్గంలోనే నిర్వహించబడాలని ఖురాన్ చాలా స్పష్టంగా పేర్కొంది. అల్లాయే సార్వభౌముడు. ఆయనే న్యాయసూత్రాలను ప్రసాదించాడు. ఆయన ఇచ్చిన న్యాయసూత్రాలనే దేశపు చట్టాలుగా అంగీకరించి పాటించి తీరాలి’ (The Islamic Law and Constitution, Tr. Khurshid Ahmad, Islamic Publications Limited, Lahor, 1960, p.125).
మతం పూర్తిగా వ్యక్తిగతం. బయటకు వెళ్లేటప్పుడు దానిని ఇంటి దగ్గరే వదిలి వెళ్దాం. ప్రజా వ్యవహారాలలో మతాతీతంగా వ్యవహరిద్దాం. అనుకొనేవారు ఇస్లాం మూలసూత్రాలను అర్థం చేసుకోలేదు.
నాల్గవ పాఠం – పాన్ ఇస్లామిజం ఒక అభూతకల్పన
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎప్పుడూ ఒక ఖలీఫా ఏలుబడిలో లేరు. ముస్లిం రాజ్యాల మధ్య గతంలో యుద్ధాలు జరిగాయి. ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. భారత ఖిలాఫత్‌వాదులు పాన్ ఇస్లామిజంను తలకెక్కించుకున్నారు. టర్కీ ఖలీఫాకు వీరవిధేయులుగా మారిపోయారు. ఖిలాఫత్ రద్దును తట్టుకోలేక పోయారు. కానీ టర్కీ ముస్లింలు తమ ఖలీఫాను అసలు లెక్కే చెయ్యలేదు. ఖిలాఫత్ వ్యవస్థను రద్దుచేసింది టర్కీ జాతీయవాద ముస్లింలే. అంతేకాక మహమ్మద్ ప్రవక్త వంశస్థుడు, మక్కాకు షరీఫ్‌గా పనిచేసిన హుస్సేన్ సైతం టర్కీ ఖిలీఫాకు ఎదురు తిరిగాడు. మన ఖిలాఫత్‌వాదులకు అఫ్ఘానిస్తాన్ ఇస్లామిక్ స్వర్గం లాగా కన్పించింది. వేలమంది అఫ్ఘానిస్తాన్•కు హిజ్రత్ చేశారు. కాని ఆ దేశ అమీర్ వారిని మధ్యలో ముంచాడు. 1924లో సౌదీ రాజవంశానికి మూల పురుషుడైన ఇబ్న్‌సౌద్ మక్కా, మదీనాల పరిపాలకుడైన తర్వాత, ముస్లిం సమాధుల మీద ఉన్న బురుజులను, గోపురాలను తొలగించాడు. సంప్రదాయంగా వస్తున్న వాటిని తొలగించటం పెద్ద వివాదానికి దారితీసింది. మన దేశ ఖిలాఫత్ వాదులు కొందరు ఆయనను సమర్థించగా, మరికొందరు విమర్శించారు. ఖిలాఫత్ వాదులకు పాన్ ఇస్లామిజం ఒక అభూతకల్పన అన్న విషయం తెలుసుకోవటం కష్టమేమీ కాదు. కాని కల్పననే పట్టుకొనే వారు వేళ్లాడారు. ఎందుకంటే అది మతగ్రంథాల నుండి పుట్టిన ఆలోచన కనుక. చరిత్రకంటే మతగ్రంథాలే వారికి ప్రామాణికం కనుక. రాబోయే తరాలకు చెందిన ముస్లింలు ఈ కల్పనను తిరిగి ఆవాహన చేయవచ్చు. ముస్లిం నాయకత్వం, ముస్లిం ప్రజానికం వారి మధ్య ఉన్న వైరుధ్యాలను, భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఛాందసవాదులు నిలబెట్టే ఒక ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా పోరాడగలరు.
ఖిలాఫత్ ఉద్యమం జరిగి ఒక శతాబ్దం గడిచింది. ఆ ఉద్యమం నేర్పే పాఠాలను వినాశనాన్ని కోరి తెచ్చుకొనేవారే మర్చిపోగలరు.
(అయిపోయింది)
ఆంగ్లమూలం: శ్రీరంగ గాడ్బొలే
డా।। బి. సారంగపాణ