‌కొవిడ్‌ 19 ‌రెండోదశ తన పంజాను అత్యంత క్రూరమైన రీతిలో భారతదేశం మీద విసిరింది. ఆరోగ్య వ్యవస్థను భీతావహం చేసింది. ఆక్సిజన్‌ ‌కొరత (కొన్ని చోట్ల నిజమైనది, ఇంకొన్ని చోట్ల కృత్రిమం), వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడం, మొదటిదశ కంటే వేగంగా, ప్రాణాంతకంగా వ్యాపించడం కూడా రెండోదశలో కనిపించాయి. ఈ తీవ్రతతో పాటు మూడు రకాల ఫంగి (ఫంగస్‌కు బహువచనం) కూడా బాధితులను తీవ్రంగా బాధపెట్టి, దేశాన్ని కలవర పెడుతున్నాయి. మొదట బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులకే వైట్‌ ‌ఫంగస్‌ ‌దాడి మొదలైంది. ఇది జరిగిన కొద్దిరోజులకే నేనూ ఉన్నానంటూ ఎల్లో ఫంగస్‌ ‌కనిపించింది. రెండోదశ తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా ఇప్పుడు ఈ మూడు రకాల ఫంగి ముప్పేట దాడి చేస్తున్నాయి. వీటి మధ్య కొవిడ్‌ 19 ‌మూడోదశ దాడి అంచనాలు ఎలాగూ ఉన్నాయి. ఈ ఏప్రిల్‌ ‌మధ్య నుంచి ఫంగస్‌ల సమాచారం దేశాన్ని కంగారు పెడుతూనే ఉంది. ఈ ఫంగి భయాందోళనల గురించి వైద్యులు చెబుతున్న ఒక్కమాట ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఫంగస్‌ ‌మనిషికి కొత్తకాదు. మన చుట్టూ ఉంటాయి. కానీ రోగ నిరోధక శక్తిని కోల్పోతే అవి మనిషి ప్రాణాలు అలవోకగా తీస్తాయి.

కరోనా నుంచి కోలుకున్న తరువాత దాడి చేస్తున్న ఈ ఫంగిని రంగుల పేర్లతో గుర్తించడం సరికాదన్న అభిప్రాయం కూడా ఉంది. ‘చాలా రకాల ఫంగస్‌ ‌సంబంధిత ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయి. కాండిడా, యాస్పెరిగిలోసిస్‌, ‌క్రిప్టోకోకస్‌, ‌హిస్టోప్లాస్మోసి, కొకొడియోయిడోమైకోసిస్‌ ‌వంటివి. మ్యూకర్‌మైకోసిస్‌, ‌కాండిడా, యాస్పెరిగిలోసిస్‌లను రోగ నిరోధక శక్తి సడలిపోయిన వారిలో గుర్తిస్తాం’ అని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా అసలు విషయం చెప్పారు.

బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌విజృంభించినది ఏప్రిల్‌లోనే అయినా, ఇది కరోనా రోగుల మీద దాడి చేస్తున్న సంగతిని డిసెంబర్‌, 2020 ‌లోనే కనుగొన్నారు. దీని శాస్త్రీయనామం మ్యూకర్‌మైకోసిస్‌. ‌మే నెలలోనే ఒక్క మహారాష్ట్రలోనే 2000 మంది దీని బారిన పడ్డారు. వీరిలో కొందరు కంటిచూపును కోల్పోయారు. పదిమంది మరణించారు. మే నెలాఖరుకు దేశంలో ఈ కేసులు పదివేలు నమోదైనాయి. రెండోదశ కరోనాలో ఇదే పెద్ద బెడదగా మారింది. ఈ ఫంగస్‌ ‌ప్రకృతి నుంచే మనకు సంక్రమిస్తుంది. గాయం, కాలిన గాయం వంటి వాటి ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనిని ప్రధానంగా కొవిడ్‌ ‌వైద్యం తీసుకున్నవారిలో వైద్యానంతర పరిణామంగా గమనిస్తున్నారు. మధుమేహం అదుపులో లేని, స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల బాగా రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం, దీర్ఘకాలం ఆసుపత్రి లేదా ఐసీయులో ఉంచడం వంటి కారణాలు రోగిలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌రావడానికి దోహదం చేస్తున్నాయని ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ‌వెల్లడించింది. నిజానికి గడచిన డిసెంబర్‌ ‌మధ్యలో ఢిల్లీలోనే శ్రీగంగారాం ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగంలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌లక్షణాలు ఉన్న 13 మందికి వైద్యం చేశారు. వీరిలో సగం మంది కంటిచూపును కోల్పోయారు. తరువాత అహమ్మదాబాద్‌, ‌ముంబైలలో 44 మంది బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌రోగులను కనుగొన్నారు. వీరిలో 9 మంది చనిపోయారు కూడా. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌ముక్కు, గొంతు, కళ్ల ద్వారా ప్రవేశిస్తుంది. కళ్లలోకి చేరితే అవి వాచి తెరవడం కష్టమవుతుంది. గొంతులో కూడా ప్రభావవంతంగా ఉంటే గడ్డం వాచిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నిజానికి ప్రపంచంతో పాటు భారత్‌కు కూడా కొత్తేమీ కాదు. అమెరికాకు చెందిన డిసీజ్‌ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌ప్రివెన్షన్‌ (‌సీడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం మ్యూకర్‌మైకోసిస్‌ ‌లేదా బ్లాక్‌ ‌ఫంగస్‌ ఒక ఫంగీతో లేదా మ్యూకర్‌మైసీటిస్‌ అనేవాటితో సోకుతుంది. చెడిపోయిన రొట్టెలో, కుళ్లిన పళ్లలో, కూరగాయలలో, కుళ్లిన చెత్తలో మ్యూకర్‌ ‌మైసీటీస్‌ ఉం‌టుందని మెడ్‌లైన్‌ప్లస్‌ ‌వెల్లడించింది. ముక్కు దిబ్బడ, ముఖం ఒకవైపునే వాచిపోవడం, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఫంగస్‌ ‌నిర్మూలనకు ఉపయోగించే యాంఫోటెరిసిన్‌ ‌బి, పోసాకాన్‌జోలె, ఇసావాకాన్‌జోలె ఇంజక్షన్లు వైద్యులు ఉపయోగిస్తున్నట్టు చెబుతున్నారు.

మే 13న ఢిల్లీ గంగారామ్‌ ఆసుపత్రిలోనే వైట్‌ ‌ఫంగస్‌ ‌కేసు కనుగొన్నారు. ఈ తరహా కేసు ప్రపంచంలో నమోదు కావడం ఇదే. 48 సంవత్స రాల మహిళ పేగుల భాగమంతా వ్యాపించింది. భరించలేనంత కడుపు నొప్పి, మలబద్ధకం, వాంతులతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఫంగస్‌ ‌మనిషి మీద ఈ విధంగా పనిచేయడం ఇంతకు ముందు వైద్యులు చూడలేదు. అయితే ఇది ప్రస్తుతం సర్వ సాధారణంగా కనిపిస్తున్నది. అలాగే నయం చేయడానికి వీలైనదేనని వైద్యులు చెబుతున్నారు. ప్రతి నెల ఐదుగురు ఈ లక్షణాలతో వస్తున్నట్టు జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాశ్‌చంద్ర బోస్‌ ‌వైద్య కళాశాల ఆసుపత్రి అధిపతి డాక్టర్‌ ‌కవితా సచిదేవ్‌ ‌చెప్పారు. మట్టి, గడ్డి వంటి వాటి నుంచి ఇది సోకుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారే దీనికి ఎక్కువగా గురవుతున్నారని వైద్యులు అంటున్నారు.

ఎల్లో ఫంగస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియా బాద్‌లో తొలిసారి కనుగొన్నారు. కరోనాకు వైద్యం చేసిన తరువాత బ్లాక్‌, ‌వైట్‌ ‌ఫంగస్‌ల బారిన పడిన రోగిలోనే ఎల్లో ఫంగస్‌ను కూడా కనుగొన్నారు. డాక్టర్‌ ‌బ్రిజ్‌ ‌పాల్‌ ‌త్యాగి (ఈఎన్‌టి) ఆసుపత్రిలో ఈ రోగిని కనుగొన్నారు. ఇది శరీరాంతర్భాగంలో వృద్ధి చెందు తుంది కాబట్టి కనుగొనడం కష్టమన్న అభిప్రాయం ఉంది. దీని శాస్త్రీయనామం మ్యూకర్‌ ‌సెప్టికస్‌. ‌నిజానికి ఈ ఫంగస్‌ ‌బల్లులకు తప్ప మనుషులకు రాదు. కొవిడ్‌ 19 ‌చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ ‌వల్ల ఈ ఫంగస్‌ ‌వస్తున్నదని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ 19‌కి ఇస్తున్న చికిత్సతో శరీరంలో రోగనిరోధక శక్తి అసాధారణంగా పడిపోవడం వల్లనే ఈ ఫంగస్‌ ‌వస్తుందని వీరు చెబుతున్నారు. మరికొందరు ఈ వాదనతో ఏకీభవిం చడం లేదు. అనాసక్తత, బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం ఎల్లో ఫంగస్‌ ‌సోకినవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. వీటిని సకాలంలో గుర్తించక పోతే చీము పట్టడం కూడా జరుగుతుంది. పుళ్లు కూడా ఆలస్యంగా తగ్గుతాయి. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన సమయంలో దీనిని గుర్తించగలిగితే వైద్యంతో నయం చేయవచ్చు. పరిశుభ్రత లేమి ఈ ఫంగస్‌కు ఆస్కారమిస్తుంది. దీనికి కూడా యాంఫోటెరిసిన్‌ ‌బి ఇంజక్షన్‌ ‌నివారణగా పలువురు వైద్యులు భావిస్తున్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌కు కూడా ఇదే ఇంజక్షన్‌ ఉపయోగిస్తున్నారు.

మనిషి విషయంలో ఫంగస్‌ ఇటు గొప్ప శ్రేయోభిలాషి, అటు శత్రువు కూడా. దీనినే yeast, mold, lichen, decay, rot, mycelium, agaric అని కూడా పిలుస్తారు. చౌడు భూములలో, మొక్కలలో, జంతువుల పేడలో ఇది పెరుగుతుంది. అలా భూమిలోకి చేరుతుంది. మనిషి రుగ్మతలను నయం చేసేది, ప్రాణం తీయగలిగినది కూడా ఫంగస్‌. ఒకరకం పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటారు. ఇంకొన్ని విషపూరితమైనవి. మనం తీసుకునే ఆహారంలో కూడా ఫంగస్‌ ఉం‌టుంది. ఉదాహరణకి బ్రెడ్‌. ఇం‌దులో ఫంగస్‌ ఉం‌టుంది. కానీ ఇది చేసే హాని ఏమాత్రం పరిగణించవలసింది కాదు. నిజానికి అంతటా ఫంగస్‌ ఉన్నా మనిషికి ప్రమాదం కాదు. మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడే అది బలపడి, ప్రాణాంతక మవుతుంది. ఏదో ఒక రుగ్మత నివారణ కోసం మందులు వాడితే, శరీరంలోని మిగిలిన భాగాలకు ఫంగస్‌తో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. అలా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కు శరీరంలో అవకాశం వస్తుంది. కాబట్టి ఫంగస్‌ ‌గురించి మనిషికి అంతో ఇంతో పరిజ్ఞానం ఉండాలి. కరోనా వైరస్‌ ‌సోకడం, దాని నిర్మూలనకు మందులు వాడడం వల్ల కొంత రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అప్పుడు ఫంగస్‌ ‌మనిషి మీద మరింత శక్తిమంతంగా దాడి చేస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. రోగ నిరోధకశక్తి పతనమైనవారు ఫంగస్‌ను గాలి ద్వారా పీలిస్తే నాసికలోని సైనస్‌కు, ఊపిరితిత్తులకు చేరుతుంది. ఫంగస్‌ అన్న పదానికి బూజు, కుక్క గొడుగు, బెండు మొక్క, క్లోరోఫిల్‌ ‌లేకుండా సేంద్రియ పదార్థం మీద పెరిగే మొక్క వంటి అర్ధాలు కనిపిస్తాయి.

About Author

By editor

Twitter
YOUTUBE