వైకాపా ప్రభ్వుత్వం రూపాయి కానుకిచ్చి రెండు రూపాయలు లాగేస్తోంది. వర్గ వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాలను దోపిడీ చేస్తోంది. మార్కెటింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో నిత్యావసరాల ధరలు రెండింతలు పెరిగాయి. రైతుల్ని నిలువునా మోసం చేసి లూటీ చేస్తోంది. 73వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా ఏపీ పంచాయతీ వ్యవస్థను మార్చారు. పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేసి పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను వీఆర్వోలకు కట్టబెట్టారు. వాలంటీర్ల వ్యవస్థతో పాలన సాగిస్తున్నారు. హిందూ ధార్మిక అంశాల్లో అనవసర జోక్యం కల్పించుకుంటున్నారు. మైనార్టీ సంతుష్టీకరణ కోసం ముల్లాలు, ఫాస్టర్లకు జీతాలిచ్చి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. హిందువులను ఊచకోత కోసిన టిప్పుసుల్తాను విగ్రహాన్ని ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విగ్రహం ఏర్పాటులో ఉన్న శ్రద్ధ హిందూ ఆలయాలు, రథాలు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడంలో చూపించడం లేదు. కానుకల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెడుతున్నారు. వడ్డీలు, అప్పులు తీర్చేందుకు ఆస్తిపన్నులు పెంచారు. చెత్తపై భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు భాషంటేనే ఈ ప్రభుత్వానికి మంట. అధికారం వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దానిని కబళిద్దామా అని చూస్తోంది. మొదట్లో పాఠశాలల్లో తెలుగు భాషను తీసేయించేందుకు శతవిధాలా ప్రయత్నించి హైకోర్టులో భంగపడి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడా కేసు సుప్రీం కోర్టులో ఉండగానే డిగ్రీ కళాశాలల్లో తెలుగును తీసేయాలని మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇదీ వైకాపా ప్రభుత్వ అసమర్ధపాలన.
మరోవైపు, రైతులను నిట్టనిలువునా దోచేస్తోంది. కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనడంలో దళారులు, మిల్లర్లు, ప్రభుత్వం కలసి నాటకం ఆడి రైతులను ముంచేస్తున్నారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు, దళారులతో కుమ్మక్కై రైతులకు మార్కెటింగ్‌లో ప్రతికూల పరిస్థితులు సృష్టిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన మద్దతు ధరకు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం లేదు. తాము పండించిన ధాన్యాన్ని తగిన రేటుకు అమ్ముకునే వెలుసుబాటును రైతులకు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ఏడాది రబీ సీజన్‌లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం ప్రకటించింది. కాని ఇంతవరకు అందులో సగం కూడా సేకరించలేదు. నెలలు గడుస్తున్నా సేకరించిన ధాన్యానికి చెల్లింపు జరగక రైతులు దీనంగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితిని చూసిన కొంతమంది రైతులు దళారులు, మిల్లర్లకు తక్కువ ధరకు ధ్యాన్యాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి.
రైతుల సేవ కోసం ఏర్పాటైన ఇ- కార్యాలయాలు రైతులకు భరోసా నివ్వడం లేదు సరికదా దోపిడీ కేంద్రాలుగా మారాయి. ధాన్యం అమ్ముకునే విషయంలో ఇ- కేంద్రాలు రైతులకు సహకారం అందించాలి. ధాన్యం వేసేందుకు కొత్త సంచులు, రవాణా ఖర్చులు ఇవ్వాలి. కాని కొత్త సంచులు కొనరు. పాత సంచులే ఇస్తారు. రవాణా ఖర్చులు ఇవ్వరు. వాటిని అధికారులే మేసేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే ధాన్యం రవాణా ఖర్చులు ఒక రబీ సీజన్‌లోనే రూ.150 కోట్లు అవుతుంది. ఈ ఆదాయం కోసమే పౌరసరఫరా శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఎండీగా వచ్చే ఒక్కో అధికారి 4, 5 ఏళ్ల వరకు తిష్టవేసుకుని కూర్చుంటున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆరోపించారంటే అవినీతి ఎంత వ్యవస్థాగతంగా పనిచేస్తోందో అర్థం అవుతుంది.
పన్నుల పెంపకంతో మరింత ఆర్థికభారం
ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను పెంచుతూ, చెత్తపై కొత్తగా పన్ను వేసేందుకు జీవోలు జారీచేసింది. కొన్ని మున్సిపల్ కౌన్సిళ్లు, కార్పొరేషన్లు గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రతిపాదనలను ఆమోదించి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయి. కౌన్సిళ్లు ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా వారికి వాస్తవాలు వివరించకుండా, పన్నులను పెంచి కొత్త పన్నులను వేయడం సరికాదు. పైగా లాక్‌డౌన్‌తో అల్లాడిపోతున్న ప్రజలపై ఈ ఆర్థికభారాలు మరింత కుంగదీసేలా ఉన్నాయి. గతంలో ఆయా భవనాలకు వసూలు చేసే అద్దె ప్రాతిపదికన పన్నులు వేసేవారు. ఇక నుంచి ఆ స్థలం, భవనం మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువను నిర్ణయించి పన్నును వేస్తారు. ప్రతిఏడాది పదిహేను శాతం వరకు పెంచుతారు. ఇది నాలుగైదేళ్లలోనే రూ.10 వేల కోట్లకు పెరుగు తుంది. 2021- 22 వార్షిక బడ్జెట్‌లో ఆస్తిపన్నులను రూ.1,600 కోట్ల నుంచి, ఈ ఏడాది ముందుగా రూ.3 వేల కోట్లు పెంచి వసూలు చేయాలని నిర్ణయించారు.
పట్టణాల్లో పన్నులు ఎందుకు పెంచాలని ప్రభుత్వాన్ని భాజపా ప్రశ్నిస్తోంది. పట్టణాలకు ఏ విధమైన సదుపాయాలు కల్పించకుండా పన్నులు పెంచాలని నిర్ణయించడం సరైన చర్యకాదు. పట్టణాలకు ఇప్పటి వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే. నేషనల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్టుల కింద దేశంలో రూ. 100.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలుచేస్తుంటే అందులో రూ.8.16 లక్షల కోట్ల విలువైన పనులు ఏపీలో జరుగుతున్నాయి. అందులో పట్టణాల్లో జరుగుతున్న పనుల విలువ 1.27 క్షల కోట్లు. రాష్ట్రంలో కాకినాడ, విశాఖ, తిరుపతి, అమరావతి పట్టణాలను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి వాటికి రూ.8,229 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కేంద్రం చేస్తోంది. అలాగే రాష్ట్రం లోని 33 పట్టణాల్లో అమృత్ పథకం కింద మౌలిక సదుపాయలకు కేంద్ర ప్రభుత్వం రూ.3,334 కోట్ల నిధులిచ్చింది. పీఎంఏవై కింద వేల కోట్ల నిధులతో గృహ నిర్మాణం చేపట్టింది. ఇంత పెద్ద స్థాయిలో కేంద్రం పట్టణాలకు నిధులిస్తున్నది. కాని పట్టణాలకు ఏ సౌకర్యాలు కల్పించకుండానే పన్నులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. వైకాపా ప్రభుత్వం లెక్కలేనితనంతో అప్పులుచేసి వాటిని తీర్చేందుకు పన్నులు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతోంది.
కేంద్రంపై అసత్య ప్రచారం
ఇదిలా ఉంటే పన్నులు పెంచడానికి కేంద్రమే కారణమని వైకాపా, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇది ఎంతమాత్రం నిజం కాదు. 2020 మే 17న కేందప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖలో కొన్ని సంస్కరణలు చేపడితే అధిక రుణసదుపాయం లభిస్తుందని సూచించింది. అంతేకానీ తప్పనిసరిగా పన్నులు పెంచాలని ఆదేశించలేదు. ఇలాంటి ఆదేశాలుంటే వాటిని చూపించాలి. కేంద్రమే ఆదేశాలిస్తే భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కూడా పెంచేవారు కదా! పన్నుల పెంపు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, అందులో కేంద్రానికి ఎలాంటి పాత్రలేదని స్వయంగా భాజపా రాజ్యసభ సభ్యులు జివిఎల్ సరసింహారావు స్పష్టం చేశారు.
మరోవైపు నిరుద్యోగులు జగన్ అబద్ధాలు చూసి మండిపడుతున్నారు. రెండేళ్ల నుంచి నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తుంటే.. 6.03 లక్షల ఉద్యోగా లిచ్చినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతటి మోసకారి మాటలను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎలా భర్తీ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి. నవరత్నాల అమలుకోసం సచివాలయాలు ఏర్పాటుచేసి అందులో తమ ప్రచారానికి 1.21 లక్షల మందిని తక్కువ జీతాలకు నియమించుకున్నారు. అలాగే తన పాలన, ప్రచారం కోసం 2 లక్షలకు పైగానే వాలంటర్లీను నియమించి వారికి ప్రజాధనం నుంచి జీతాలిస్తున్నారు. వైకాపా కార్యకర్తల కోసమే ఈ వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి వారిని ఉపయోగించుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వ పరంచేసి అందులోని ఉద్యోగులకు కొత్తగా ఉద్యోగాలి చ్చామంటున్నారు. ఏటా ప్రకటిస్తానన్న డీఎస్సీ లేదు. 18 వేల టీచర్ ఉద్యోగాలు, 6 వేల పోలీసు ఉద్యోగాలు, పశుసంవర్ధకశాఖలో 6,100 ఖాళీలున్నాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 2.10 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామన్నారు. వారినీ పట్టించుకోలేదు. అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ద్వారా 2.40 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. వా•న్నింటినీ చెత్తబుట్టలో పడేశారు. ఇదీ జగనన్న ప్రజావ్యతిరేక పాలన.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్