ఒక కుటుంబానికీ, ఒక రాజకీయ పార్టీకీ ఇష్టం లేనంత మాత్రాన చరిత్ర నమోదు పక్రియ నిలిచిపోదు. ఏవేవో కారణాలతో ప్రత్యక్ష సాక్షులు మౌనం దాల్చినా కూడా చరిత్ర మూగబోదు. పరిశోధన కన్నా, చారిత్రక సత్యాల కన్నా వాదాలకూ, రాజకీయ విశ్వాసాలకూ పెద్ద పీట వేసే చరిత్రకారుల కలం మూసినా చరిత్ర రచన ఆగదు. భారతదేశంలో అత్యవసర పరిస్థితి (1975-77) విషయంలోనూ ఇదే నిజం.

 స్వాతంత్య్రం తెచ్చుకున్న 27 సంవత్సరాలకే అత్యవసర పరిస్థితి పేరుతో భారతదేశాన్ని బందిఖానాగా మార్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఏనాడూ నిజాలు చెప్పలేదు.  అత్యవసర పరిస్థితి అత్యాచారాల మీద దర్యాప్తు కోసం నియమించిన షా కమిషన్‌ ఇచ్చిన వివరాల ప్రకారం 1,11,000 మంది అరెస్టయ్యారు. భయానకమైన జైలు జీవితాలు ఉన్నాయి. చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. నాడు అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన చాలా పార్టీలు తరువాత కాంగ్రెస్‌తోనే కలసి దేశాన్ని పాలించాయి.  వారు విడిపోయినప్పుడల్లా కూడా కొత్త నిజాలు వెలికి వస్తూనే ఉన్నాయి.

జూన్‌ 25, 1975 అర్ధరాత్రి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడానికి తక్షణ కారణం- అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే ఇవ్వడమే. 1971 సాధారణ ఎన్నికలలో రాయ్‌బరేలీ(ఉత్తర ప్రదేశ్‌) ‌లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని సోషలిస్టు పార్టీ నాయకుడు రాజ్‌ ‌నారాయణ్‌ ‌సవాలు చేశారు. సాంకేతిక కారణాలతోనే కావచ్చు, ఆ ఎన్నికలలో ఇందిర అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌జగ్‌మోహన్‌లాల్‌ ‌సిన్హా జూన్‌ 12, 1975‌న తీర్పు నిచ్చారు. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో చాలా తీర్పులు ప్రజాస్వామ్యాన్నీ, పార్లమెంటరీ విధానాన్నీ, ఎన్నికల వ్యవస్థనీ, నాలుగో స్తంభం పత్రికా స్వేచ్ఛనీ కాపాడాయి. జస్టిస్‌ ‌సిన్హా ఇచ్చిన తీర్పు కూడా వాటితో సమానమైనదే. ఈ తీర్పు మీద సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌వీఆర్‌ ‌కృష్ణయ్యర్‌ ఇచ్చిన షరతులతో కూడిన స్టే కూడా నిర్మాణాత్మకంగా కనిపిస్తుంది. ప్రధాని వంటి అత్యున్నత పదవికి సంబంధించిన వ్యవహారం కాబట్టి జస్టిస్‌ ‌సిన్హా తీర్పును తాత్కాలికంగా నిలుపుతూనే స్టే ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీకి తిరిగి ఎన్నిక జరగడం, వేరొకరు ఆ స్థానంలోకి రావడం, ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం ఏర్పాటు వంటి వాటికి కొంత సమయం పడుతుందని న్యాయమూర్తుల ఉద్దేశం. మొత్తంగా ఇందిర పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి. మరొక అంశం కూడా ఇందిరను తీవ్రంగా చికాకు పరచింది. అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాతీర్పు ఆ రోజే వెలువడ్డాయి. రెండూ ఆమెను హతాశురాలిని చేసినవే. అలహాబాద్‌ ‌హైకోర్టులో కాంగ్రెస్‌ అధినేత్రి ఓటమి. గుజరాత్‌ ‌ప్రజా కోర్టులో (జనతా ఫ్రంట్‌ ‌గెలిచింది) కాంగ్రెస్‌ ఓటమి. అలాంటి ఉత్కంఠ వాతావరణంలో నాటి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్‌రే ఇచ్చిన సహా మేరకు ఇందిర అత్యవసర పరిస్థితి వంటి చరిత్రలోనే అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.

రాజ్యాంగంలోని 356 అధికరణం అత్యవసర పరిస్థితిని విధించే అధికారం కేంద్ర మంత్రిమండలికి కట్టబెడుతున్నది. చాలామందికి తెలియని విషయం అప్పటికే 352 అధికరణం ప్రకారం ఒకరకం అత్యవసర పరిస్థితి అమలులోనే ఉంది. అదే ఎక్స్‌టర్నల్‌ ఎమర్జెన్సీ. 1971 పాకిస్తాన్‌ ‌యుద్ధం సమయంలో విధించారు. అంటే 1975 నాటి అత్యవసర పరిస్థితి కరవులో అధికమాసం వంటిదే. ఏమైనా రాజ్యాంగంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ప్రధాని సలహా సంప్రదింపులు చేయడం సహజం. అయితే శంకర్‌రే ఒక్కరి సలహాతోనే ఇందిర అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా? అంతటి అవాంఛనీయమైన అడుగు వేశారా?  గడచిన నలభయ్‌ ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న నలుగుతూనే ఉంది. నాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం గురించిన పలు వాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

‘శ్రీమతి ఇందిరాగాంధీ సోవియెట్‌ ‌నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు అర్ధమైంది. సోవియెట్‌లో అసంతృప్తిని ఏ మాత్రం సహించలేరు. అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిని ఇక ఎన్నటికీ తిరిగిరాని విధంగా సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు…’ ఈ వాక్యాలు ‘క్వెస్ట్ ‌ఫర్‌ ‌ఫ్రీడమ్‌ : ‌స్టోరీ ఆఫ్‌ ఏన్‌ ఎస్కేప్‌’ ‌గ్రంథం (తెలుగులో స్వేచ్ఛ కోసం: ఒక విహంగయాత్ర, అను: డాక్టర్‌ ‌జె. చెన్నయ్య, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, 2003, పే.34) లోనివి. అకాలీదళ్‌ ‌ప్రముఖుడు, పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్‌ ‌సుర్జీత్‌ ‌సింగ్‌ ‌బర్నాలా ఇది రాశారు. ఆయన కూడా అత్యవసర పరిస్థితిలో అరెస్టయి పంజాబ్‌ ‌జైళ్లలో దుర్భర జీవితం అనుభవించారు. అత్యవసర పరిస్థితి విధింపులో సోవియెట్‌ ‌రష్యా ప్రమేయం ఉందని ఇంత నేరుగా ఎవరూ ఆరోపించక పోయినా, ఇదే వాస్తవాన్ని ధ్వనింప చేసే పలు అధారాలు ఇంకొందరు అప్పుడప్పుడూ బయట పెట్టారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజన్‌ ‌మేనన్‌ ‘ఇం‌డియా అండ్‌ ‌ది సోవియెట్‌ ‌యూనియన్‌:ఏ ‌న్యూ స్టేజ్‌ ఆఫ్‌ ‌రిలేషన్స్’ ‌పత్రంలో (1978) రాసిన అంశాలు కూడా బార్నాలా వెల్లడించిన అభిప్రాయానికి సమీపంగా ఉంటాయి. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి సోవియెట్‌ ‌రష్యా పత్రికలు అత్యుత్సాహం ప్రదర్శించాయి అనడానికి తగ్గట్టుగానే వ్యవహ రించాయని మేనన్‌ ‌రాశారు. అత్యవసర పరిస్థితిని తొలగించి, మార్చి 21, 1977న లోక్‌సభకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా జనతా పార్టీ నాయకులను మితవాదులుగా, తిరోగమన శక్తులుగానే సోవియెట్‌ ‌రష్యా భావించిందని మేనన్‌ ‌చెబుతారు. మొరార్జీ దేశాయ్‌ ‌ప్రధాని కావడం కూడా ఆ దేశానికి రుచించని విషయంగానే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మొరార్జీ-కృశ్చేవ్‌ల ఉపాఖ్యానం ఒకటి ప్రసిద్ధి చెందింది. మొదటి నుంచి మొరార్జీ వామపక్ష వాదానికి వ్యతిరేకులని పేరు. 1960లో మొరార్జీ రష్యాలో పర్యటించినప్పుడు ‘మిస్టర్‌ ‌దేశాయ్‌! ‌మీరు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు. అలా వ్యతిరేకించడం కంటే, మీరనుకుంటున్న దెయ్యాలు ఇక్కడ ఏం చేస్తున్నాయో ఒకసారి పరిశీలిస్తే నిజం మీకే తెలుస్తుంది’ అని మాటామంతీ సందర్భంగా మొరార్జీతో సాక్షాత్తు కృశ్చేవ్‌ అన్నారు (ఈ విషయాన్ని మొరార్జీ ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్‌ ‌మై లైఫ్‌’‌లో రాసుకున్నారు).

సోవియెట్‌ ‌రష్యా పాలకుల సలహాతో ఇందిర అత్యవసర పరిస్థితిని విధించారు అనుకోవడం వేరు. ఆ దేశ వివాదాస్పద గూఢచారి సంస్థ కేజీబీ ఇందిరను అందుకు ఒప్పించి, విపక్ష నేతలందరినీ జైళ్లలో వేయించింది అనడం వేరు. కానీ ఒకటి నుయ్యి, రెండు గొయ్యి. కేజీబీ తమ ఏజెంట్లను ప్రయోగించి ఆ పని చేసిందన్న వాదన ఉంది. ‘ది మిత్రొఖిన్‌ ఆర్కైవ్స్ 2: ‌ది కేజీబీ అండ్‌ ‌ది వరల్డ్’ ‌పుస్తకం ఇదే చెబుతోంది. రచయిత వాజిలి మిత్రొఖిన్‌. ఇతడు కేజీబీ పత్రాల పరిశోధనలో అపార అనుభవం కలిగినవాడు. ఈ గ్రంథం ప్రకారం ఇందిర హయాంలో కేజీబీ భారతీయ పాలనా వ్యవస్థలో ఎంతగా చొరబడిందంటే, లంచాలు పడేసి కేంద్ర మంత్రుల నుంచి రహస్యాలు కొనుక్కునేది. ఇందులో కేజీబీ జనరల్‌ ఒలెఫ్‌ ‌కులుగిన్‌ ‌చెప్పిన విషయాలు ఎక్కువ. భారత్‌లో కార్యకలాపాల కోసం కులుగిన్‌ను 1970లో ఆ సంస్థ నియమించింది. ‘ఇందిరాగాంధీ 1975లో భారత్‌లో అత్యవసర పరిస్థితిని విధించేటట్టు చేయడంలో మా ఏజెంట్లు విజయ వంతంగా పని చేశారు. అదే విపక్షాల నాయకులను జైళ్లకు పంపించడానికి ఆమె ప్రభుత్వానికి అధికారం కల్పించింది. పౌర హక్కులను రద్దు చేయడానికీ, పత్రికల మీద 19 మాసాల పాటు సెన్సార్‌షిప్‌ ‌విధించడానికి అవకాశం చూపింది’ అని కులుగిన్‌ ‌చెప్పాడు. ఇతడు చెప్పినది సత్యదూరం కాదని అనుకోవడానికి కావలసిన పరిస్థితులు నాడు భారత్‌లో ఉన్నాయనే అనిపిస్తుంది. ‘ది మిత్రొఖిన్‌ ఆర్కైవ్స్ 2: ‌ది కేజీబీ అండ్‌ ‌ది వరల్డ్’ ‌పుస్తకంలోని విషయాల ఆధారంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌సెస్టెంబర్‌ 18, 2005‌లో ఒక లోతైన వార్తా కథనం ప్రచురించింది.

ఇందిర హయాంలో కేజీబీ జోక్యం తక్కువేమీ కాదు. కులుగిన్‌ ‌చెప్పిన అనుభవాలను బట్టి, మిత్రొఖిన్‌ ‌భారత్‌ ‌మీద ఒక దారుణమైన వ్యాఖ్య చేశాడు. ‘చూడబోతే దేశం మొత్తం అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది’ అన్నాడాయన. కేంద్రమంత్రులే దేశ రహస్యాలను అమ్మకానికి పెడితే ఎవరైనా ఇంకెలాంటి అభిప్రాయానికి రాగలరు? మూడో ప్రపంచ దేశాలలోకి ఎలా చొచ్చుకుపోవచ్చునో భారత్‌ ఒక నమూనాగా ఉంటుందని అతడి అభిప్రాయం. అంతేనా! తన ప్రత్యర్థి, అమెరికా నిఘా సంస్థ సిఐఏను మించి కేజీబీ భారతీయ ఉన్నతాధి కారులలో తమ మనుషులను చొప్పించగలిగిందని కూడా అతడు చెప్పాడు. ఇందిర హయాంలో ఒక అంటువ్యాధిలా ప్రబలి ఉన్న అవినీతిని కేజీబీ శక్తికొద్దీ ఉపయోగించుకున్నదని ఈ పుస్తకం ప్రకటిస్తున్నది. భారత ప్రభుత్వంలో నిఘా విభాగంలో, రక్షణ, విదేశ వ్యవహారాల శాఖలలో, పోలీసు యంత్రాంగంలో తమకు సాయం చేయడానికి (సోర్స్) ఉన్నారని కూడా కులుగిన్‌ ‌చెప్పాడు. ఒక సందర్భంలో 20 లక్షల రూపాయలు రహస్య కానుక రష్యా నుంచి నేరుగా ఇందిరకు అందిందని ఈ పుస్తకంలో రాశారు. పార్టీ కార్యకలాపాల కోసం నిరంతరం ప్రధాని నివాసానికి సూట్‌కేసులతో డబ్బు చేరేదని కూడా రాశారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో కేజీబీ హనీ ట్రాప్‌ ‌ద్వారా (మహిళలను ఎరవేయడం) ఎంతగా చొచ్చుకు పోతున్నదో నెహ్రూగాని, ఇంటెలిజెన్స్ ‌బ్యూరోగాని గ్రహించలేదు’ అని మిత్రొఖిన్‌ ‌పుస్తకంలోని విషయాలు ఆధారంగా రాసిన విశ్లేషణలో ‘ది టెలిగ్రాఫ్‌ ఆన్‌లైన్‌’ (‌సెప్టెంబర్‌ 9, 2005) ‌పేర్కొన్నది. నిజానికి ఈ విశ్లేషణ ప్రధానంగా హనీట్రాప్‌ ‌కోణాన్ని ఆవిష్కరించింది.  స్టాలిన్‌ ‌మరణం తరువాత 1953లో ఇందిర తొలిసారి రష్యాలో పర్యటించినప్పుడే కేజీబీ కన్ను ఆమె మీద పడింది. అక్కడ నుంచి రాసిన లేఖను బట్టి ఆమె కూడా కేజీబీ వలలో పడిపోయారనే అనిపిస్తుంది. ఈ అంశం కూడా టెలిగ్రాఫ్‌ ‌వెలువరించింది.

 మరి, అవినీతికి వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ ఉద్యమిస్తే ఎందుకు ఆయన మీద దేశ వ్యతిరేక ముద్ర వేయడం? సోవియెట్‌ ‌రష్యా పట్ల భారత్‌ ఎం‌త అణుకువగా ఉండేదంటే, అఫ్ఘానిస్తాన్‌ ‌మీద దాడిని కూడా ఖండించలేదు. ఈ విషయాలని యథా ప్రకారం అటు కాంగ్రెస్‌, ఇటు సీపీఐ ఖండించాయి. అయితే కాంగ్రెస్‌ ‌ప్రతినిధి అభిషేక్‌ ‌సింఘ్వి చిత్రమైన వ్యాఖ్య చేశారు- ‘ఈ విషయాలను ఎవరూ నిరూపించలేరు. ఎందుకంటే వారెవరూ ఇప్పుడు మన మధ్య లేరు.’

యూపీఏ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌కార్యదర్శి సంజయ్‌ ‌బారు రాసిన వ్యాసం (జూన్‌ 6, 2018, ‌డెయిలీ ఓ)లో ఇంకొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రతిపాదించారు. ఇవి కూడా వామపక్షం, ఇందిరకు సంబంధించిన అంశాలే. అత్యవసర పరిస్థితి నేపథ్యంలోనివే. నెహ్రూ అలీన విధానాన్ని నమ్మారు. తాను ఏ దేశ కూటమికి చెందని దేశంగా భారత్‌ను నిలబెట్టానని ఇందిర తనను తాను నమ్మించుకున్నారు. కానీ ఆమె చేసింది- ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో భారత్‌ను సోవియెట్‌ ‌శిబిరంలోకి చేర్చడమే అన్నారు సంజయ్‌ ‌బారు. 1971లో సోవియెట్‌ ‌రష్యాతో చేసుకున్న ఒప్పందం నెహ్రూ ప్రతిపాదిత అలీన విధానాన్ని అటకెక్కించిందనే అనుకోవాలి. అత్యవసర పరిస్థితి అంటే నెహ్రూ విదేశాంగ విధానం మార్పులో వచ్చిన అగాధమేనని సంజయ్‌ ‌నిష్కర్షగానే చెప్పారు. చిలీ పాలకుడు సాల్వెడార్‌ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది అంటూ క్యూబా అధ్యక్షుడు ఫైడెల్‌ ‌కాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ అగమేఘాల మీద అత్యవసర పరిస్థితిని విధించారన్న వాదన గురించి సంజయ్‌ ‌బారు ప్రస్తావించారు. కాస్ట్రో సలహా అనేది ఒక వాదనగానే ఆయన ప్రతిపాదించినప్పటికి ఆ రోజులలో ఇందిర ప్రతి చిన్న విషయానికి తనను హత్య చేసి, భారత్‌ను అస్థిరం చేయడానికి విదేశీ హస్తం పని చేస్తోందని ఆరోపించేవారు. ఈ అంశానికి ఆయన ఇచ్చిన కొసమెరుపు చిత్రంగానే ఉంటుంది, ‘కాస్ట్రో ఇచ్చిన సలహా అత్యవసర పరిస్థితిని విధించేందుకు (ఇందిరను) ప్రేరేపిస్తే, అప్పుడే ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ ఇచ్చిన సలహా అది ఎత్తివేయడానికి మార్గం చూపింది’. ఇవే కాకపోయినా అత్యవసర పరిస్థితి విధింపు వెనుక అనేక అంశాలు ఉన్న మాటను కాదనలే మని సంజయ్‌ ‌బారు అన్నారు. కానీ ఇందిర ప్రచార సలహాదారు హెచ్‌వై శారదాప్రసాద్‌ ‌చేసిన వ్యాఖ్య మాత్రం అద్భుతమే. అది, ‘తన ప్రధానమంత్రి పదవి నుంచి తననే కూల్చడానికి ఇందిరాగాంధీ స్వయంగా చేసుకున్న కుట్ర’. మిగతా వాదాలన్నింటి కంటే చరిత్రలో రుజువైన వాదన ఇదే అనిపిస్తుంది.

అరెస్టయిన వారిలో (జూన్‌ 25 ‌రాత్రి)  ‘అమెరికా అనుకూలురు’ ఎక్కువగా కనిపించడం యాదృచ్ఛికమే అయినా, రష్యాకు అనుకూలంగా ఉండే సీపీఐ నుంచి ఒక్కరు కూడా అరెస్టు కాలేదన్న విషయం గమనార్హమే. భారతదేశంలోని నాటి కొన్ని పరిస్థితులు అత్యవసర పరిస్థితి విధింపునకు దోహదం చేశాయని నమ్మించాలని చూసినా, దేశానికి బయట ఉన్న వాతావరణం కూడా తోడైంది. అదే- ప్రచ్ఛన్నయుద్ధం. మరొక యాదృచ్ఛిక అంశం కూడా ఉందని అనుకోవచ్చు. 1977 మార్చి ఆఖరున జనతా ప్రభుత్వం ఏర్పడింది. మొదటి నుంచి జనతాను, ఆ నాయకులను సోవియెట్‌ ‌రష్యా పత్రికలు మితవాదులు, తిరోగమనవాదులనే భావించాయి. ఈ నేపథ్యంలోనే మొరార్జీ ప్రధాని కాగానే 1978 జనవరిలో జిమ్మి కార్టర్‌ ‌భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో నాటి విదేశ వ్యవహారాల మంత్రి అటల్‌ ‌బిహారీ వాజపేయి చేసిన వ్యాఖ్య ఎన్నతగినది. భారత్‌ ఇప్పుడే ‘నిజమైన అలీన విధానం’ పాటిస్తున్నదని అన్నారాయన. అంటే ఇందిర అనుసరించిన వామపక్ష అలీన విధానం కాదని చెప్పడమే. కాబట్టి అత్యవసర పరిస్థితి వేళ ఇందిర రష్యా నుంచి సలహాలు స్వీకరించే పరిస్థితిలోనే ఉన్నారనుకోవచ్చు.

కమ్యూనిస్టులకు ఒక లక్షణం ఉంది. జరిగిన తప్పును కొన్ని ముసుగులతో, తాత్త్విక తొడుగులతో కొన్ని జన్మల తరువాతైనా అంగీకరిస్తారు. కలకత్తా డేట్‌లైన్‌తో జూన్‌ 27, 2015‌న ది హిందూలో వెలువడిన వార్త అలాంటిదే. 1975 సమయంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో పార్టీ విఫలమైందని అత్యవసర పరిస్థితిని సమర్ధించడం రాజకీయ తప్పిదమని సీపీఐ జనరల్‌ ‌సెక్రటరీ సురవరం సుధాకరరెడ్డి ఇచ్చిన ప్రకటన అది. అది చాలా పెద్ద రాజకీయ తప్పిదమని గురుదాస్‌ ‌దాస్‌గుప్తా కూడా అన్నారు. తప్పులు ఒప్పు కుంటున్నా రహస్యాలు మాత్రం కాపాడుకుంటూనే ఉన్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE