జీవరాశి మొత్తానికి మృత్యువు తప్పదన్నది సత్యం. అదే అన్నింటీ గమ్యం. జ్ఞానం, అధికారం, సంపద, అందం లాంటి వాటన్నిటికి అది చరమరేఖ. దీని నుంచి ఎవరికి, దేనికీ మినహాయింపులు లేవు. మృతి వృద్ధాప్యానికే పరిమితం కాదు. జీవన ప్రస్థానంలో ఎప్పుడైనా, ఏవయస్సులోనైనా, ఏ అవస్థలోనైనా ఎవరికైనా అనివార్యం. అయితే అది ఎంత గౌరవప్రదంగా సంభవిస్తుంది? వ్యక్తి యొక్క గొప్పతనం ఆ వ్యక్తి చావులో తెలుస్తుందని పెద్దలు చెప్తుంటారు. సునాయాసంగా జీవి వెళ్లిపోతుందా? ఓపలేని ప్రయాసలకు, యాతనలకు గురిచేస్తుందా? అంటే అది కేవలం మృత్యువు ఆసన్నమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది కానీ ముందుగానే అంచనా వేయలేం. ఆ ‘బహుదూరపు బాటసారి’ పయనం ఎంత మర్యాదకరంగా సాగుతుంది? ఆ వ్యక్తి సంబంధీకులకు (జీవిత భాగస్వామి) లభించే ఆదరణ, గౌరవం ఏ పాటివి? అనే వాటిపైనే మానవీయత ఆధారపడి ఉంటుంది.
‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్యచ!
తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి!!’ అన్న భగవానుడి పలుకులు సృష్టి అంతటికీ వర్తించేవే. జనన మరణాలు వదిలించుకోవాలనుకున్నా వదిలేవికావు కనుక వాటి గురించి దుఃఖింపదగదని ఉపదేశించారు. విజ్ఞానశాస్త్ర అభివృద్ధి వల్ల దానిని కొంతకాలం వాయిదా వేయవచ్చేమో కానీ శాశ్వత నివారణ, నియంత్రణకు అవకాశం లేదు.
మృత్యువు నుంచి తప్పించుకునేందుకు పురాణాలలో ఎందరో బ్రహ్మాది దేవతల గురించి తపస్సు చేశారు. వారిని మెప్పించారు. కానీ వారు మాత్రం ‘మృత్యు నివారణ’ వరం పొందలేక పోయారు. ఏదో వరం పొందినా ఏవో షరతులతో కూడినవి, నామమాత్రమే. ఆ షరతులకు లోబడే అంతిమంగా పరలోకయాత్ర సాగిందనేదే సత్యమని చివరకు తెలిసింది. భూమి మీదకు వచ్చిన వారంతా తుది ప్రయాణానికి సిద్ధం కావలసిందే. అందుకే మరణ భయాన్ని వీడి మృత్యువు నుంచి అమృతత్వానికి సాగాలని ‘మృత్యోర్మా అమృతంగ మయా’ అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. విధాత మానవ జీవితానికి నాలుగు దశలు – బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలను ప్రసాదించాడు. ప్రతి దశకు కాలపరిమితిని నిర్దేశించాడు. మొక్క లేదా చెట్టు మొగ్గతొడిగి, పూసి, కాసి, ఫలించే మాదిరిగానే మానవ జీవితం ఈ నాలుగు దశలతో ముగియాలి తప్ప అర్థాంతరంగా పరిసమాప్తి కాకూడదంటారు.
కానీ ఈ క్రమం ఎందరి విషయంలో సాకారమ వుతుంది? అని ప్రశ్నించుకుంటే ‘అంత వరకే ఆయుష్షు’ అనే సమాధానం వస్తుంది. జననం ఎంత ప్రశాంతంగా, మంచిగా ఉండాలో, మరణమూ అంత సునాయాసంగా సంభవించాలన్నది ప్రతి వారి భావన. మొదటి దాని సంగతి ఎలా ఉన్నా రెండవది వారి వారి అదృష్టాలపైనే ఆధారపడి ఉంటుందనేది కనిపిస్తున్నదే. ఆకాశమే హద్దుగా అనంత ఐశ్వర్యాలు ఆర్జించి వారసులకు దఖలు పరిచినవారు కూడా అమానవీయ స్థితిలో, అనారోగ్యం తదితర బాధలతో జీవనయానం ముగించవచ్చు. సాదాసీదా జీవితం సాగించినవారు నిశ్శబ్దంగా నిష్క్రమించవచ్చు.‘ ఎంత గొప్పగా జీవించాలో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి’ అన్న గాంధీజీ మాటలు, అశాశ్వతమైన ఈ శరీర సహాయంతో శాశ్వత ఉత్తమ గతి పొందాలని (‘అశాశ్వతేన దేహేన సాధనీయం హిశాశ్వతమ్) ఒక కవి హితోక్తి ప్రస్తావించదగినవి.
సాంత్వన పరమౌషధం
విషాదంలో మునిగిన వారికి ఓదార్పు, సాంత్వన దివ్యౌధం. మానవీయ కోణంలో అతి ప్రధాన మైనవని చెబుతారు. అయితే అవి మొక్కుబడిలా కాక ఎదుటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలగాలి. ‘నే(మేము)నున్నాననే భరోసా కలిగించగలగాలి. వాలి వియోగంతో విలపిస్తున్న ఆయన సతి తారకు ప్రాజ్ఞుడు, కర్తవ్యపరాయణుడు హనుమ ‘జనన మరణాలు అనిశ్చితాలు అనే సంగతి బుద్ధిమంతు రాలివైన నీకు తెలియనిది కాదు. నీవంటి వారు ఇలాంటి అనిశ్చిత విషయాల గురించి విచారించ కుండా శుభయత్నాలను ఆరంభించి వాటి విజయానికి ముందుకు సాగాలి’ అని కర్తవ్యోపదేశం చేశారు. ఈ ఉపశమన వాక్యాలు నిత్య స్మరణీయంగా చెబుతారు. బాధాకరసంఘటనలు, విషాదకర సందర్భాలు ఎదురైనప్పుడు బాధితులకు ఓదార్పు, శక్తిమేరకు సాయం అవసరం. ‘ఇతరులకు సాయ పడడం అంటే మనల్ని మనం శుద్ధి పరచుకోవడమే. ఇతరులకు సాయం చేసే అవకాశాలు పుష్కలంగా వస్తాయి. ప్రతి మనిషికి దయ చూపే అవకాశం ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న సహాయాలే అవతలి వారికి కొండంత బలాన్నిచ్చి అండగా నిలబడతాయి. ఇతరులకు సహాయంగా ఉంటే భగవంతుడు సదా మనల్ని రక్షిస్తుంటాడు’ అని స్వామి వివేకానంద ఉద్బోధించారు. ఇక్కడ ‘సాయం’ అనే దానికి విస్తృతార్థం చెబుతారు. మాట సహాయం నుంచి భూరి వితరణ వరకు ఏదైనా కావచ్చు.
నరజన్మకు విలువేది?
వారివారి కర్మానుగతంగా రకరకాల జన్మలు అనుభవించిన మీదట చివరకు ఈశ్వరానుగ్రహంతో మానవ జన్మ ప్రాప్తిస్తుందని చెబుతారు. అందుకే ‘నరజన్మ దుర్లభం’ అన్నారు. అంతటి ఉత్కృష్టమైన జన్మలో మానవీయ కోణం అతి ప్రధానమని, ‘మానవ సేవే మాధవ సేవ’ అనీ అన్నారు. మానవజన్మ అశాశ్వతమని తెలిసినా తా(మే)ము శాశ్వతులమన్న భావనతో మానవ ధర్మాలను పక్కనపెట్టే వారిని వారి విజ్ఞతకే వదలవలసి ఉంటుందంటారు జ్ఞానులు. ఒక మనిషి తోడును కోల్పోయిన బాధ కంటే వారి పట్ల సమాజంలోని కొందరి ప్రవర్తన తీరు మరింత బాధించే అంశం. అందరం ఏదో ఒకనాడు దాటి పోవలసిందే అనే సత్యం తెలిసినా, అప్పటికి ఆసంగతి మరచినట్లు తామే శాశ్వతమనేలా వ్యవహరించడం కనిపిస్తుంటుంది. అందుకు కొంత స్వార్థం, అశక్తత, నిర్లిప్తత, మూఢవిశ్వాసాలు కారణమన్నది నిష్ఠురసత్యం. ఇలాంటి భయాలతో నిండిన జీవితం మనిషిని శారీరకంగా, మానసికంగా బలహీనుడిని చేస్తుందని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు.
ఉపకరించని విశ్వాసాలు
ప్రతి మతంలోనూ, సమాజంలోనూ నమ్మకాలు, విలువలు ఉంటాయని, అయితే అవి శాశ్వతం కాదని, మార్పు సహజమని, అది ప్రగతికి సూచిక అని స్వామి వివేకానంద పేర్కొన్నారు. అలా మార్పులు చోటు చేసుకుంటునప్పటికీ చాలామంది మనస్తత్వాలలో అవి అంతగా కనిపించడంలేదని ఆయన సిద్ధాంత వర్తనులు అంటారు. నమ్మకాలు, మూఢ విశ్వాసాలు కర్మ సిద్ధాంతంలాంటివని, మనలోని లోపాలను, బలహీనతలను దానిపైకి నెట్టి ఓటమిని కప్పి పుచ్చుకుంటున్నట్లే, అంధవిశ్వాసాలను పూర్వీకులు నిర్దేశించినట్లుగా చెప్పడం పలాయన వాదమేనని కూడా ఆయన అన్నారు. నమ్మకాలు, విశ్వాసాల పేరుతో సమాజం లోని కొందరి తీరు వింతగొలుపుతోంది. విజ్ఞానంతో సమాంతరంగా అవీ పెరుగుతున్నాయి. కొందరు తమ అవసరాలు, స్వార్థానికి అనుగుణంగా వీటిని వాడుకోవడం పరిపాటిగా మారుతోందనే వ్యాఖ్యానాలు ఉన్నాయి.
ఎవరి నమ్మకాలు వారివి అనుకున్నా అవి ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ముఖ్యంగా బాధితులను మానసికంగా కుంగతీసేలా, న్యూనపరిచేలా, సహాయనిరాకరణలా ఉండకూడదు. ‘మంచిచెడులు, నమ్మకాలు మనస్తత్వానికి సంబంధిం చినవే కాని ప్రకృతికి సంబంధించినవి కావు. వీటిని సార్వజనీనం చేయడం తగదు. ఆత్మవిశ్వాస లేమి, చంచలత్వమే కష్టాలపాలు చేస్తాయి’ అని పెద్దలు చెబుతారు. అసలు నమ్మకం, శాస్త్రం భయపట్టేవిగా ఉండవని, ఉండకూడదని అంటారు. ఇవి పదుగురికి మేలు చేసేలా ఉండాలే తప్ప అయోమయంలో పడవేసేలా కాదు. విషాదంలో ఉన్న వారికి అనునయించ లేని వీటివల్ల ప్రయోజనం ఏముంది? వెళ్లిపోయిన వారి గురించి బాధపడడమూ, మరవ డమూ సహజమే. అదే సమయంలో ఉన్నవారి సంగతి కూడా ఆలోచించాలి. ఉదాహరణకు, భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న మనిషిని ఇతరులతో పాటు అయినవారు, సంతానం సైతం అపరాధ భావంతో చూడడం, ‘ఆకొద్ది రోజులు’ ఆమెను చూడడమే మహాపరాధంగా భావించడం తరచూ కనిపించే దృశ్యాలే. ‘ఆనాథ ప్రేత సంస్కారం పుణ్యప్రదం’ అని పెద్దలు చెబుతుండగా, మరోవంక ఇలాంటి సందర్భాలలో అయినవారూ కాదనుకునేలా వ్యవహరించడం విపరీత పరిణామం. అన్నిటిని వదులుకుని పోయిన వ్యక్తి విషయంలో మంచి చెడులు ఏముంటాయి? మరణం అంటే కొత్త జీవితానికి ఆరంభమే తప్ప అంతం కాదని తాత్వికులు చెబుతారు.
మానవతామూర్తులకు వందనాలు
‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్లు మానవీయ విలువలు కాపాడేవారు ఉన్నారని కోవిడ్ కష్టకాలంలో మరోసారి నిరూపితమవుతోంది. ఎవరికి వారు తమతమ స్థాయిలో వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రధానంగా కొవిడ్ మహమ్మారికి బలైన వారికి కులమతాలకు అతీతంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మానవతామూర్తులు ఎందరో! భువికి ఎంత పవిత్రంగా వచ్చామో అలాగే దివికి వెళ్లగలిగే (అంతిమ సంస్కారాలకు నోచుకునే) భాగ్యం ఎందరికి? పాపుపుణ్యాలు, స్వర్గనరకాలు అనేదానిని అటుంచితే, అంతిమ సంస్కారాలైనా సంతృప్తికర స్థాయిలో జరగని పరిస్థితి. పదిహేను నెలలకు పైగా ప్రపంచాన్ని పట్టి కుదుపుతున్న కొవిడ్ మహమ్మారి వైపరీత్యమే అందుకు ఉదాహరణ….‘కడుపుచించుకు పుట్టిందొకరు/ కాటికి నిన్ను మోసేదొకరు/తలకు కొరవి పెట్టేదొకరు’ అన్న సినీకవి మాటలు అక్షరసత్యమవు తున్నాయి. ఎటువంటి సందర్భంలోనైనా సరే మానవతను మరవకుండా ఉండడమే మనిషి ముందున్న కర్తవ్యం.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్