సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – 21 జూన్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అం‌తఃకరణ శుద్ధితో మతం మారడం రాజ్యాంగబద్ధమే. మత మార్పిడి, ప్రలోభాలు మాత్రం చట్టవిరుద్ధం. ‘హిందూ సమాజంలో భాగమైన ఎస్‌సీలు, గిరిపుత్రులు క్రైస్తవమతం తీసుకుంటే వారి ఎస్‌సీ, ఎస్‌టీ హోదా కోల్పోతారు.  వారిని కేవలం క్రైస్తవులుగానే చూడాలి. తమిళనాడులో క్రైస్తవులు బిసి-సి విభాగంలోకి వస్తారు. వీరు క్రైస్తవంలోకి వెళితే ఎస్‌సీ రిజర్వేషన్‌ అనుభవించ లేరు.’ జూన్‌ 2‌న మద్రాస్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పులోని వాక్యాలివి. నిజానికి ఇది సరికొత్త తీర్పు కాదు. ఈ కీలకమైన, దేశానికి గడ్డు సమస్యగా ఉన్న ఓ విషయాన్ని మళ్లీ గుర్తు చేయడమే. ఇది అవసరం, అభినందనీయం.

హిందూ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వెనుకబడిన వారి సంక్షేమం కోసమే రిజర్వేషన్లను అమలు చేస్తున్న సంగతిని కూడా కోర్టు పునరుద్ఘాటించింది. ఒక కులం/కమ్యూనిటీ కోటా కింద ఉద్యోగం సంపాదించి, తరువాత మతం మార్చుకుంటే ఆ ఉద్యోగం నుంచి వాళ్లని తొలగించి తీరాలని మద్రాస్‌ ‌హైకోర్టు నిర్ద్వంద్వంగా చెప్పింది. మతం మారితే ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదని తేల్చింది. కొలువులో చేరాక మతం మారితే చెల్లదు కానీ, ముందు చేరొచ్చన్నమాట అంటూ చొప్పదండి తర్కాలు చెప్పేవారికీ ఇందులో హెచ్చరిక ఉంది. వీళ్లకీ కులం ద్వారా వచ్చే రిజర్వేషన్‌ ‌సదుపాయాలు వర్తించవు.

కోయంబత్తూర్‌లోని భారతీయార్‌ ‌విశ్వవిద్యాలయంలో జరిగిన దొడ్డిదారి నియామకాల మీద జస్టిస్‌ ఆర్‌. ‌మహదేవన్‌ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగంలో చేరాక మతం మారిన వాడినీ, ఆ ఉద్యోగం ఇచ్చినవాడినీ ఇద్దరినీ శిక్షించమని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు కూడా. ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో అసిస్టెంట్‌ ‌టెక్నికల్‌ ఆఫీసర్‌గా ఎం. గౌతమన్‌ ‌నియామకం చెల్లదని డాక్టర్‌ ఆర్‌. ‌రమేశ్‌, ‌మరో ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. ఇందులో మెలికలు చూస్తే ఈ దేశంలో ప్రభుత్వ నియామకాలు ఇంత అధ్వానంగా ఉన్నాయా అన్న అనుమానం వస్తుంది. నిబంధనలు సరే, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పట్టించు కోవడం లేదు. గౌతమన్‌కు సరైన అర్హతలు లేకుండా ఉద్యోగం ఇచ్చారు. అనతికాలంలోనే పదోన్నతీ కల్పించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పదవీ విరమణ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. కానీ కోర్టు కీలెరిగి వాత పెట్టింది. పదవీ విరమణానంతర సదుపాయాలు నిలిపివేయమని ఆదేశించింది. ఇలాంటి నిర్వాకాలలో ఉద్యోగాలు తక్షణం ఊడగొట్టి జీతభత్యాలను కక్కించాలని కూడా చెప్పింది.

ఎస్‌. ‌యాస్మిన్‌ ‌కేసులో మద్రాస్‌ ‌హైకోర్టే చెప్పిన మాట రిజర్వేషన్‌ ‌పరమార్థాన్ని గుర్తు చేసేదే. ‘ఒక వ్యక్తి సామాజిక వెనుకబాటుతనం, లేదా అతి వెనుకబాటుతనం ఒక మతం నుంచి మరో మతంలోకి మారడం ద్వారా సిద్ధించదు. వెనుకబాటు తనాన్ని పుట్టుక నిర్దేశిస్తుంది, మత మార్పిడి కాదు’ అని ఆ కేసులో (జూన్‌ 24, 2013, ‌ది హిందు) జస్టిస్‌ ‌వి. రామసుబ్రమణియన్‌ ‌తేల్చి చెప్పారు. యాస్మిన్‌ ‌కేసులోనూ కోర్టు తేల్చిన అంశం అదే- మతం మారితే, అంతకు ముందు కులం ద్వారా అనుభవిస్తున్న సదుపాయాలకు అనర్హులు. నాడార్‌ ‌క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆ అభ్యర్థి (బీసీ) ప్రభుత్వోద్యోగానికి మరింత అర్హత సాధించాలన్న ఉద్దేశంతో ఒక ముస్లింను పెళ్లి చేసుకుని మతం మారింది. ఈ కేసు సందర్భంలోనే జస్టిస్‌ ‌సుబ్రమణియన్‌ ‌సుప్రీం కోర్టు వ్యాఖ్యను ఉదహరించారు. అది- ‘కులాలను గుర్తించని క్రైస్తవం, ఇస్లాం లేదా ఇతర మతాలలోకి ఒక హిందువు మారినప్పుడు కులం పేరుతో వచ్చే సదుపాయాల• వర్తించవు’. 1952లో మద్రాస్‌ ‌హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ ‌కూడా ఇదే- మతం మారితే కులాన్ని వదిలినట్టే. యాస్మిన్‌ ‌ముప్పయ్‌ ఏళ్లు వచ్చాక (2012) గ్రూప్‌ ‌ఫోర్‌ ‌పోటీ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే  మతం మారారు కాబట్టి కోరుకున్న రిజర్వేషన్‌ ‌వర్తించదని, అదర్‌ ‌కేటగిరీ కిందనే పరిగణిస్తామని ఇంటర్వ్యూలో చెప్పారు. పైగా ముప్పయ్‌ ఏళ్లు కూడా దాటిపోయాయి. అగ్రకులాల వయోపరిమితి ముప్పయ్యేళ్లు. దీనితో అసలుకే మోసం వచ్చింది. తాము బౌద్ధంలో ‘ఆది ద్రావిడులం’ కాబట్టి ఎస్‌సీ సర్టిఫికెట్‌ ఇవ్వవలసిందిగా ఆదేశించాలని జి.జె. తమిళరుసు వేసిన పిటిషన్‌ను కూడా మద్రాస్‌ ‌హైకోర్టే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది (ఆగస్ట్ 24, 2017, ‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా). అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు, ఇతడు క్రైస్తవుడు. పేరు విక్టర్‌ ‌జె జోసెఫ్‌. ‘‌క్రిస్టియన్‌ ఆది ద్రవిడార్‌’‌ను అంటూ 1989లో ఎస్‌సీ సర్టిఫికెట్‌ అడిగాడు. 2015లో బౌద్ధంలోకి మారి తమిళరుసు పేరుతో ఎస్‌సీ సర్టిఫికెట్‌ అడిగాడు. ఎస్‌సీ, ఎస్‌టీ ఆర్డర్స్ (‌సవరణ) చట్టం 1976లో బౌద్ధానికి ఇలాంటి సదుపాయం లేదు.

బౌద్ధం, జైనం, పార్సీ తరగతుల నుంచి రిజర్వేషన్‌ ‌వివాదాలు దాదాపు ఉండవు. ఇస్లాం స్వీకరించినవారు, మరీ ముఖ్యంగా క్రైస్తవం తీసుకున్న వారు  హైందవం ప్రాతిపదికగా లభించే రిజర్వేషన్‌ల కోసం కరవని గడ్డి ఉండదు. తొక్కని అడ్డదారి ఉండదు. దరఖాస్తులో హిందువు. ఆచరణలో కరుడ గట్టిన క్రైస్తవుడు. ఇక సచ్చీలత ఎక్కడ? దాన్ని ఏ సిలువ ఎక్కించారు? మళ్లీ దిగకుండా ఎన్ని మేకులు కొట్టారు? బైబిల్‌ ‌సుద్దులు ఏ తుంగలో తొక్కారు? ఈ దేశంలో క్రైస్తవం, ఆ మత గురువులు, సంఘాలు వాళ్ల అవమానకరమైన, జుగుప్సా కరమైన ధోరణుల ద్వారా క్రీస్తును మళ్లీ మళ్లీ సిలువ ఎక్కిస్తూనే ఉన్నారు. ప్రలోభాలతో యథేచ్ఛగా సాగిపోతున్న మతాంతరీకరణలు, క్రైస్తవ సన్యాసినులకు జరుగుతున్న అన్యాయాలు, కోర్టులు తప్పు పడుతున్న ఇలాంటి నియామకాలు, చదువులలో అక్రమాలు, పరమత దూషణ, వేర్పాటువాద ఉద్యమాలకు ప్రోత్సాహం, ఉగ్రవాదులకు సమర్ధన ద్వారా హింసకు మద్దతు, ఆఖరికి కరోనాకు కొబ్బరినూనె వైద్యం… ఎన్నెన్ని అకృత్యాలు! ఇవన్నీ క్రీస్తు శరీరంలోకి మళ్లీ మళ్లీ దిగబడుతున్న ఒక్కొక్క మేకుతో సమానం కాదా? అంతఃకరణ శుద్ధిగా వీరంతా క్రైస్తవం తీసుకుంటే చట్టాన్ని గౌరవించాలి. ఎస్‌సీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి.

About Author

By editor

Twitter
YOUTUBE