మే 2, 2021. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా.. కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తల వీరంగం మొదలైంది. బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని, ఎన్నికలలో గెలిచిన తృణమూల్‌ ‌నాయకులు, కార్యకర్తలు బీజీపీ క్యాడర్‌ ‌మీద కత్తి కట్టారు. నిజమే, బెంగాల్‌కు రాజకీయ హింస కొత్తకాదు. బెంగాల్‌ ఎన్నికలలో రక్తపాతం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మమతా బెనర్జీ సారథ్యంలో రాజకీయ అవతారం ఎత్తిన తృణమూల్‌ ‌గూండాలు సాగించిన హింస, 21వ శతాబ్దం ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా విన్నది కాదు, చూసింది అసలే కాదు.

తృణమూల్‌ ‌మూకలు కరుడగట్టిన హంతకుల కంటే ఘోరంగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులపై దాడులు చేశారు. బహిరంగంగా చెట్లకు కట్టి కొట్టి ఎందరినో హతమార్చారు. ఇళ్ల మీద దాడులు చేశారు. బహిరంగంగా ఉరి తీశారు. ఇవ్వన్నీ ఎవరో చెపుతున్న మాటలు కాదు, చేస్తున్న ఆరోపణలు కాదు. పత్రికలో సాక్ష్యాధారాలతో వచ్చిన వార్తలు. అనేక మంది బీజేపీ మహిళా కార్యకర్తలను తృణమూల్‌ ‌కార్యకర్తలు ఎత్తుకు పోయారు. సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ‌ప్రకారం తృణమూల్‌ ‌ముష్కర మూకలు చిన్నారులను, మైనర్‌ ‌బాలికలను సైతం వదిలి పెట్టలేదు. ఇక్కడా అక్కడా అని కాదు, కొల్‌కతా వీధులు, సందులు గొందులు మొదలు, చీకటి అడవుల వరకు రాష్ట్రం అంతటా అధికారుల అండదండలతో అధికార పార్టీ క్యాడర్‌ అరాచకానికి పాల్పడ్డారు. ఈ రాక్షస, రాకాసి దాడుల నుంచి తప్పించుకుని బయటపడిన బీజేపీ కార్యకర్తలు, పొరుగున అస్సాంలో తలదాచుకున్నారు.

బెంగాల్లో రాజకీయ హింసను ఇంకెవరో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే అందరికంటే ముందు అంగీకరించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ఆమె తమ దొడ్డ మనసును చాటుకున్నారు. తద్వారా ఆమె రాష్ట్రంలో రాజకీయ అరాచక హత్యలు నిజం అని అంగీకరించారు. అదే సమయంలో అమె మరో మహోపదేశం చేశారు. బెంగాల్లో అసలు హింసకు తావే లేదని, ఎన్నికల హింస అసలే లేదని, అదంతా అభూత కల్పన అంటూ కొట్టివేసిన తృణమూల్‌ ‌నాయకుల మాటల్లో నిజం లేదని, తమ ఔదార్య ప్రదర్శనలో భాగంగా ప్రకటించారు. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఆమె చేసిన ప్రకటన అలా ఉండగానే, మరోవంక ఆమె అధ్యక్షురాలుగా ఉన్న తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మూకలు హింస రచనను కొనసాగించాయి. ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. బాధితుల జాబితా పెరుగుతూనే ఉంది. నిజానికి, బెంగాల్‌లో జరుగుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తల హత్యలన్నీ సర్కార్‌ ‌స్పాన్సర్డ్ ‌హత్యలే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలు, అరాచకం గురించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్‌ ‌పదే పదే కోరినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌స్పందించనే లేదు. ఈ మౌనమే రాష్ట్రంలో జరుగతున్న హింస ప్రభుత్వ అండదండలతో జరుగుతోంది అనేందుకు నిదర్శనం. ఇది ప్రభుత్వ అధికారుల కర్తవ్య రాహిత్యం మాత్రమేకాదు, విచ్చల విడిగా అరాచకానికి పాల్పడుతున్న తృణమూల్‌ ‌ముష్కర మూకలకు రక్షణ కల్పించడమే అవుతుంది. ఓ 17 ఏళ్ల బాలిక మీద తృణమూల్‌ ‌కార్యకర్తలు లైంగిక అత్యాచారానికి పాల్పడితే, అది అవాస్తమని పోలీసులే కొట్టివేశారు. అరాచకాలకు పాల్పడుతున్న తృణమూల్‌ ‌కార్యకర్తలకు ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం ఎంతగా రక్షణ కల్పిస్తోందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. కానీ, ఇదొక్కటే కాదు ఇంకా ఇలాంటి ఉదంతాలు ఎన్నో! ఈ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఒక మైనర్‌ ‌బాలిక న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిం దంటే, రాష్ట్రంలో అరాచకం ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పనక్కర లేదు…

నా ఫిర్యాదు, నా ప్రార్ధన ప్రభుత్వ యంత్రాంగా నికి కాదు. రాజకీయ వ్యవస్థకు అసలే కాదు. ఆ ఇద్దరూ, ఆ రెండు వర్గాలు తమ బాధ్యతల నుంచి ఎప్పుడో తప్పుకున్నారు. వారిపై నాకు ఎలాంటి ఆశలు లేవు.

పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న (కొనసాగుతున్న) అరాచక, అన్యాయాలను చూడడంలో విఫలమైన (అవుతున్న) గౌరవనీయ న్యాయప్రభువుల గురించే నా బాధ, నా వ్యధ. ‘బ్లాక్‌ అవుట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌’, ‌సమాచారాన్ని మరుగుపరచడం పట్ల భగ్గుమన్న న్యాయస్థానం, అనేక సందర్భాలలో అనేక విషయాల్లో సుమోటో విచారణను మంత్రదండంగా ప్రయోగించే గౌరవ ప్రభువులు బెంగాల్‌లో కుళ్లిపోయిన బీజేపీ కార్యకర్తల శవాలను చూడలేకపోయారు. ఆ అరాచకాన్ని సుమోటోగా విచారణకు చేపట్టలేక పోయారు. పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా మరో రాష్ట్ర ప్రభుత్వంపై అసందర్భంగా, అవాంఛనీయ వ్యంగ్య వ్యాఖ్యలు చేసే గౌరవ న్యాయమూర్తులు పశ్చిమ బెంగాల్లో హత్యలు, మానభంగాలు, గృహదహనాలు ప్రభుత్వ అండదండలతో పెద్ద ఎత్తున సాగుతున్నా చర్యలు తీసుకునే సాహసం చూపలేక పోతున్నారు. గౌరవప్రభువులు బ్లాక్‌ ‌మార్కెటింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిలు అభ్యర్ధనను విచారించేందుకు పని గంటల తర్వాత కూడా కోర్టు తలుపులు తెరిచే ఉంచుతారు. కానీ, బెంగాల్‌ ‌హింసకు సంబంధించి పిటిషన్‌ ‌దాఖలై వారాలు గడుస్తున్నా విచారణకు సమయమే దొరకదు. విచారణ జాబితాలో చేర్చరు. అదీ నన్ను బాధిస్తున్న విషాదం. న్యాయమూర్తులు తీర్పులపై కంటే మీడియా దృష్టిని కేంద్రీకరించే కేసులకు ప్రాధాన్యం ఇవ్వడం నన్ను బాధిస్తున్నది. ఒక రాజకీయ నాయకుడి బెయిల్‌ అప్లికేషన్‌ను ఆఘమేఘాల మీద విచారించి, కొద్ది రోజుల్లోనే మధ్యంతర ఉపశమనం కలిగించే నాయ వ్యవస్థలోనే బెంగాల్‌ ‌హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు విచారణ కోసమే వారాలు నిరీక్షించవలసి రావడం నన్ను మనోవ్యధకు గురిచేస్తుంది. న్యాయవ్యవస్థ విచారణ విషయంలో చూపుతున్న వివక్ష నన్ను ఆవేదనకు గురిచేస్తోంది. చట్టం ఉన్నవారినీ లేనివారినీ, రాజకీయ హోదాలకు అతీతంగా న్యాయం కోరే అందరినీ సమానంగా చూస్తుందని గౌరవ న్యాయమూర్తులు విశ్వసించే టట్లయితే.. ఎన్నికలలో ఓడిపోయిన వారిపట్ల చూపుతున్న క్రూరత్వం, విశిష్ట అధికారాలు, చట్టపరమైన సౌలభ్యాల విషయంలో చూపుతున్న క్రియాశీలత, చురుకుదనం నన్ను ఆందోళకు, ఆవేదనకు గురిచేస్తున్నాయి.

సర్వోన్నత న్యాయస్థానం రిజిస్ట్రీ బెంగాల్‌ ‌హింసకు సంబంధించిన పిటిషన్లను రోజుల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉంచుతున్నదో, అందులో ఉన్న తర్క వితర్కాలు ఏమిటో అర్థం కావడంలేదు. ఈ వ్యవహారం నడిపిస్తున్న మేధో సంపన్నుల మేధస్సును నేను గౌరవిస్తాను, అయినా నాకు ఇందులో న్యాయం ఉందనిపించడం లేదు. నేను ఇంకా లోతుల్లోకి వెళ్లి, వారికి గల సైద్ధాంతిక ఒత్తిళ్లను ప్రస్తావించను. అది సముచితం కాదు. అయితే, అందులోని నిర్హేతుక, ఏకపక్ష ధోరణిని, ఇందుకు సంబంధించి ఒక విధానం అంటూ ఉంటే, దానిని ఎవరైనా వివరిస్తే బాగుంటుంది. అలాగే, దేశంలో ప్రతి విషయాన్ని పరిష్కరించాలని ఉత్సాహం చూపే గౌరవ న్యాయస్థానాలు బెంగాల్‌ ‌హింస గురించి ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఎందుకు సుమోటో మంత్రదండాన్ని ప్రయోగించడం లేదో కూడా నాకు అర్థం కావడంలేదు. గత కొన్ని సంవత్సరాలుగా మనం న్యాయ వ్యవస్థ చూపుతున్న క్రియాశీలతను, చురుకుతనాన్ని చూస్తున్నాం. అయితే ఆ చురుకుదనం బెంగాల్‌ ‌హింస విషయంలో కనిపించడం లేదు. అయితే ఇందుకు బాధితుల సైద్ధాంతిక లేదా రాజకీయ అనుబంధం కారణమా లేక కేవలం అనుకో కుండా వచ్చిన అవరోధాలు, సెలవులే కారణమా అనే విచికిత్స నేను చేయను.

బెంగాల్‌ ‌బాధితులు కేవలం ప్రభుత్వ హింసకు బలైన బాధితులు మాత్రమే కాదు, న్యాయవ్యవస్థ ఉదాసీనతకు గురయ్యారు. గౌరవ కలకత్తా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదికలు కోరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేవన్న సాకుతో కోర్టు విచారణను అడ్డుకుంటుంది. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం బెంగాల్‌ ‌హింసకు సంబంధించిన అంశాలను సాధారణ విషయంగా పరిగణిస్తుంది. అత్యవసర విచారణ అవసరం అన్న భావన ఎందుకనో న్యాయస్థానాలకు, న్యాయమూర్తుల మనసులను తాకడం లేదు. తొందరేముంది, మెల్లగా విచారణ చేపడదామన్న ధోరణే కనిపిస్తోంది. అందుకే కావచ్చును, నివేదికలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించే ఆలోచన చేయడం లేదు. అన్ని కేసుల విషయంలో న్యాయస్థానాలు ఇదే విధంగా వ్యవహరిస్తే అదొక పద్ధతి. కానీ, కేసుల విచారణ క్రమానికి సంబంధించిన అదృశ్య విధానం ప్రకారం గౌరవ న్యాయస్థానం బెంగాల్‌ ‌హింసకు సంబంధించి మాత్రమే చూపుతున్న ఉదాసీనత కలచివేస్తోంది.

ఇటీవల కాలంలో రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించి న్యాయశాస్త్ర విద్యార్ధులకు బోధించే తీరు ఒక విధంగా, కోర్టులలో జరుగుతున్న విచారణ తీరు మరో విధంగా ఉంటున్నాయి. విచారణ సమయంలో అసందర్భ, అనాలోచిత వ్యాఖ్యలు కొన్ని సందర్భాలలో చిత్రంగా, నాటకీయంగా ఉంటున్నాయి. న్యాయమూర్తుల వ్యాఖ్యలు సోషల్‌ ‌మీడియాలో యథాతథంగా రిపోర్ట్ అవుతున్న విషయం వారికి తెలియంది కాదు. బెంగాల్‌ ‌బాధితుల్లో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. వారికి, తమ హక్కుల గురించిగానీ ఇతర న్యాయవ్యవహారాల గురించికానీ అంతగా అవగాహన ఉండదు. దుండగుల నుంచి తమ ప్రాణాలను, కుటుంబాలను, ఆస్తులను కాపాడమని మాత్రమే వారు న్యాయస్థానాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సాగుతున్న హింస ఆగనంతవరకు న్యాయమూర్తులు  చక్కని ఇంగ్లిష్‌లో వల్లించే అద్భుత కవిత్వం, న్యాయశాస్త్ర విశేషాలు వారికి పట్టవు. అయినా, ఇప్పటకీ సర్వోన్నత న్యాయస్థానం బాధితులకు అండగా నిలవడం లేదు. హత్యలు, మానభంగాలు రేపో ఎప్పుడో ఆగి పోతాయనే ధోరణిలోనే విచారణ జరుగుతోంది. బెంగాల్‌లో పారిన రక్తం కంటే న్యాయమూర్తుల సిరాచుక్క ఖరీదైనదా, కాదా అన్నది నేను ఇక్కడ చర్చించను.

భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయం మానవ ముఖాన్ని కలిగి ఉండాలని అన్నారు. అవేవో మీడియా కోసం అన్నమాటలని నేను ఎంత మాత్రం అనుకోవడం లేదు. న్యాయం మానవత్వంతో మెలగాలని, కోర్టును ఆశ్రయించిన ప్రతిఒక్కరి ప్రాథమిక మానవహక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే వారు ఆ వ్యాఖ్య చేశారని నేను విశ్వసిస్తాను. అయితే దురదృష్టవశాత్తు మన న్యాయ వ్యవస్థలో అందరికీ ఏకరీతి, స్థిరమైన న్యాయ పక్రియ అమలు కావడం లేదు. మరోవంక న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కాకపోతే, వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది. న్యాయవ్యవస్థ తమకు అందుబాటులో లేదన్న భావన ఏర్పడినప్పుడు లేదా రాజకీయ, సైద్ధాంతిక విశ్వాసాల ఆధారంగా న్యాయస్థానం తీర్పులు ఉంటాయన్న అభిప్రాయం బలపడినా, అది ఆందోళన కలగజేస్తుంది.

కొవిడ్‌ 19 ‌కేసుల క్రమంలో బెంగాల్‌ ‌హింసకు సంబంధించిన కేసులు, సర్వోన్నత న్యాయస్థానానికి, న్యాయాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించి అవగాహనలేని సామాన్య ప్రజల వద్దకు న్యాయాన్ని తీసుకువెళ్లే మార్గాలను న్యాయవ్యవస్థ అన్వేషించాలని జస్టిస్‌ ‌భగవతి పేర్కొన్నారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లే అవకాశం లభించింది. అయితే, అందులో మర్మమేమిటో వారికే తెలియాలి. కానీ, న్యాయమూర్తులకు బెంగాల్‌లో జరుగుతున్న హత్యలు, మానభంగాలకంటే ఆంధప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకునికి అయిన గాయాలు ఎక్కవ ముఖ్యమనిపించాయి. తక్షణ విచారణ జరిపి తీర్పు నీయవలసిన అత్యంత ప్రాధాన్యతాంశంగా కనిపించింది. పైగా ‘న్యాయం జరగడంలో జాప్యం, న్యాయాన్ని తిరస్కరించడం’ (జస్టిస్‌ ‌డిలేడ్‌ ఈజ్‌ ‌జస్టిస్‌ ‌డినైడ్‌) ‌సూత్రాన్ని ఉచ్చరించడం కూడా హాస్యాస్పదం. ఇప్పటికే బెంగాల్‌ ‌బాధితులకు న్యాయం తిరస్కరణ జరిగింది. ప్రభుత్వ అండదండలతో సాగిన రాజకీయ హింసకు గురైన బాధితులను కాపాడటంలో కోర్టులు దారుణంగా విఫలమయ్యాయి. సామాన్య ప్రజలకు న్యాయవ్యసవస్థ పట్ల గల విశ్వాసాన్ని సమూలంగా తుడిచి వేశాయి. అయితే, న్యాయమూర్తులు ఎంతగానో అవసరమైన సెలవులను అనుభవిస్తున్న సమయంలో, దారి తప్పి ఇలా మాట్లాడడంలో అర్థం లేదు. సర్వోన్నత న్యాయస్థానం బెంగాల్‌ ‌రాజకీయ హింస కేసులను విచారణకు చేపట్టే సమయానికి, బాధితుల జాబితా న్యాయమూర్తుల చారిత్రక ఆధార్‌ ‌తీర్పు పేజీల సంఖ్యను దాటి పోదని, పోరాదని మాత్రమే ఆశిద్దాం.

మృతులు పిటిషన్లు దాఖలు చేయరు. చనిపోయిన వారు మీ అనర్గళ తీర్పులనూ చదవలేరు.

(భారత న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరచడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు.)

– అభిషేక్‌ ‌ద్వివేది, బొంబాయి, లక్నోలో ప్రాక్టీస్‌ ‌చేస్తున్న స్వతంత్ర న్యాయవాది.

అను: రాజనాల బాలకృష్ణ

About Author

By editor

Twitter
YOUTUBE