(‌బెంగాల్‌లో అనిశ్చితి-కారణాలు-పరిష్కారాలు అనే అంశం మీద బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ ‌సంబిత్‌ ‌పాత్రా మే 24వ తేదీన నిర్వహించిన వెబినార్‌లో ప్రసంగించారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఈ ఉపన్యాసం ఏర్౧పాటయింది. మొదట స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌లో పనిచేసిన డాక్టర్‌ ‌పాత్రా 2010లో బీజేపీలో చేరారు. ఆ ఉపన్యాసానికి జాగృతి స్వేచ్ఛానువాదం)

బెంగాల్‌లో ఇవాళ్టి పరిణామాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హింస. రాజకీయ కక్ష సాధింపు. మే 2న ఫలితాలు వెల్లడి కావడంతోనే వీధులలో అలజడి ఆరంభమైపోయింది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడినాయి. ఒక్క బెంగాల్‌ ‌మినహా మిగిలిన చోట్ల సజావుగా, ప్రశాంతంగా అధికార మార్పిడి జరిగింది. వేర్పాటువాదంతో సతమతమవుతున్న అస్సాంలో కూడా ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కానీ బెంగాల్‌ ‌పరిస్థితి ఘోరం. అక్కడి హింసను వర్ణించడానికి మాటలు చాలవు. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న హింసాకాండ అన్నది సత్యం. ఇప్పటికీ హింసాత్మక ఘటనలు యథేచ్ఛగా జరిగిపోతూనే ఉన్నాయి. ఈ హింస చుట్టూ ఒక కుట్రపూరిత మౌనం అలుముకుని ఉంది. మీడియా, పాలకులు, రాజకీయ వ్యవస్థలు బధిరత్వం పాటిస్తున్నాయి. హథ్రాస్‌లో ఒక యువతి మీద అత్యాచారం జరిగితే భూమ్యాకాశాలను ఏకం చేస్తూ గగ్గోలు పెట్టారు. రోజుల తరబడి మీడియాలో ఆ అంశాన్ని సుదీర్ఘ సమయం పాటు చర్చకు ఉంచారు. ఒక్క భారత్‌లోనే కాదు, విదేశాలలో కూడా దాని గురించి ప్రచారం చేశారు. అదే బెంగాల్‌కు సంబంధించి వందలాది మంది మీద పాశవిక దాడులు జరిగాయి. ఎన్నికల హింస, ఫలితాలు వెల్లడైన తరువాత ముప్పయ్‌ ‌మంది బీజేపీ కార్యకర్తలు టీఎంసీ గూండాల చేతిలో చనిపోయారు. వేలల్లో హింసాత్మక ఘటనలు యథేచ్ఛగా సాగిపోయాయి. వీటి మీద మీరు ఎందుకు స్పందించరని అడిగాను. మళ్లీ వాళ్లకి మన మీదే శంక. మీడియాది ఒకే పంథా- బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏదైనా జరిగితే దాని కోసం రంధ్రాన్వేషణ చేయడం.

బెంగాల్‌లో ఇవాళ హిందువులే లక్ష్యంగా సాగుతున్న హింసాకాండకు చాలా నేపథ్యం ఉంది. 1946, 1947 దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్‌ ‌ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది. ఘోరమైన రక్తపాతానికి పాల్పడింది. బెంగాల్‌ ‌ముస్లిం లీగ్‌ ‌పాలనలో ఉండేది. ముస్లిం లీగ్‌ ‌నాయకుడు జిన్నా ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చాడు. బెంగాల్‌ ‌పాలకుడు సుహ్రావర్ది  దానిని అక్కడ అమలు చేసి చూపించాడు. కలకత్తా, బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాలలో హిందువులపై జరిగిన దాడిని చరిత్ర మరచిపోవడం అసాధ్యం. స్వాతంత్య్రం తెచ్చుకోవడానికి ముందు అక్కడ ముస్లిం లీగ్‌ ఆధిపత్యం ఉండేది. ఆ సమయంలోను హిందువులే బలయ్యారు. స్వాతంత్య్రం తెచ్చుకున్న తరువాత కూడా అది హిందువుల పాలిట బలపీఠంగానే ఉంది.

ఇవాళ బెంగాల్‌ ‌పరిస్థితిని చూస్తే చరిత్ర సిగ్గు పడుతుంది. దేశ స్వాతంత్య్రానికి, సంస్కరణోద్య మానికి, సాంస్కృతిక రంగానికి, సాహిత్యానికి ఆ భూమి చేసిన సేవ స్మరణీయమైనది. ఒకప్పుడు కలకత్తా ఈ దేశ ఆర్థిక రాజధాని. ఢిల్లీకి ముందు అదే దేశ పాలనా రాజధాని కూడా. రిజర్వు బ్యాంక్‌ అక్కడే ఉండేది. ఎందరో మహానుభావులు… రాజా రామ్మోహన్‌రాయ్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, ‌రామకృష్ణ పరమహంస, వివేకానందులు, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, ‌సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ, బిపిన్‌ ‌చంద్రపాల్‌, ‌భాగాజతీన్‌, ‌రాస్‌ ‌బిహారీబోస్‌, ‌సుభాష్‌చంద్ర బోస్‌, ‌సూర్యసేన్‌… ఎం‌దరో.. ఎందరెందరో మహనీయులు అక్కడ జన్మించినవారే. ఇంకా, మహోన్నత శాస్త్రవేత్త జగదీశ్‌ ‌చంద్రబోస్‌ అక్కడి వారే. ఇప్పుడు టీఎంసీ అంతగా ద్వేషిస్తున్న బీజేపీ మూలపురుషులు శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జి పుట్టిన నేల కూడా అదే. సంఘ పరివార్‌తో ఆ నేలకు ఉన్న అనుబంధం కూడా గాఢమైనది. సంఘ్‌ ‌వ్యవస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గేవార్‌ (‌డాక్టర్జీ) వైద్య విద్యను అభ్యసించినది కలకత్తా నగరంలోనే. నాడు బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా బెంగాల్‌ ‌రక్తం చిందించిన అనుశీలన్‌ ‌సమితి అనే విప్లవ సంస్థలో డాక్టర్జీ క్రీయాశీలక సభ్యులు. రెండో సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ డాక్టర్‌ ‌మాధవ సదాశివ గోళ్వాల్కర్‌ ‌బెంగాల్‌కే చెందిన అఖండానంద స్వామి శిష్యులు. పాకిస్తాన్‌ ‌మొదటి న్యాయశాఖ మంత్రి మండల్‌ ‌కూడా ఇక్కడి వారే.

ఎంత గొప్ప స్రష్టలను అందించిన నేల అది! ఎంత గొప్ప చింతనాపరుల నిలయమది! అలాంటి పరంపర నుంచి బెంగాల్‌ ‌రాజకీయం ఎక్కడికి ప్రయాణించింది! అసలు బెంగాల్‌ ‌సామాజిక పరిణామమే ఆశ్చర్యంగా ఉంటుంది. శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ అవిభాజ్య బెంగాల్‌ ‌కోసం కలగన్నారు. ఇంకా ఎందరో కూడా అదే ఆశించారు. ఎన్‌సి చటర్జీ అనే గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ రీతిగానే ఆలోచించారు. అవిభాజ్య బెంగాల్‌ ‌కావాలను కున్నారు. సనాతన ధర్మానికి రక్షణ ఉండాలను కున్నారు. ఎన్‌సి చటర్జీ ఎవరో కాదు, ప్రముఖ సీపీఎం నాయకుడు సోమనాథ్‌ ‌చటర్జీ తండ్రి. అలాంటి స్రష్టలూ ద్రష్టల ప్రభావం నుంచి ఆ సమాజం కమ్యూనిజం వైపు, ఆపై నక్సలిజం వైపు నడవడమే వైచిత్రి. 1905లో బెంగాల్‌ ‌విభజనను పరిపూర్ణంగా వ్యతిరేకించిన సమాజమది. కానీ అదే సమాజం 1947లో విభజన పట్ల మౌన ప్రేక్షకపాత్ర వహించింది. కాంగ్రెస్‌ ‌పాలన, ఆ తరువాత కమ్యూనిస్టులు, ఆపై నక్సల్బరి వల్ల ఒక తరం పూర్తిగా పరంపర నుంచి వైదొలగింది. చారు మజుందార్‌ ‌పోకడ, 1970 దశకం నాటి హింస భయానకం. ఆ కాలంలోనే అక్కడ హింస వ్యవస్థీకృతమైపోయింది. తనయులను చంపి వారి రక్తం కలిపిన అన్నాన్ని వారి తల్లి చేత తినిపించిన రాక్షసత్వం నక్సలైట్లది. 1982లో కలకత్తాలో జరిగిన ఆనందమార్గీయుల సజీవదహనం సీపీఎం హింసాత్మక ధోరణికి నిదర్శనం. బీజేపీ ఎదుగుతున్న ఈ దశాబ్దంన్నర కాలంలో మూడు వందల మంది పార్టీ కార్యకర్తలను ప్రత్యర్థులు చంపారు.

గడచిన డెబ్బయ్‌ ఏళ్లుగా గతి తప్పిన రాజకీయాలతో అక్కడి పరిస్థితి పూర్తిగా కలుషితమైపోయింది. 1947, 1971 సమయంలో బంగ్లాదేశ్‌ ‌నుంచి వచ్చిన చొరబాటుదారులను ఈ రాజకీయవేత్తలు ఒక ఓటు బ్యాంకుగా పరిగణించడం కూడా ఈ దుస్థితికి కారణం. బంగ్లాదేశ్‌ ‌సరిహద్దు ప్రాంతం నదీ పరీవాహక ప్రాంతం కావడం వల్ల, చిన్న చిన్న ద్వీపాలు ఉండడం వల్ల చొరబాట్లను గుర్తించడం కూడా ఒక సమస్యగా మారింది. గడచిన 20 ఏళ్లలో బంగ్లాదేశ్‌ ‌చొరబాటుదారుల కారణంగా రాష్ట్రంలోని 294 శాసనసభ స్థానాలలో 50 స్థానాల గెలుపు ముస్లింల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అంతగా ముస్లింలు అక్కడ సంఖ్యాపరంగా ఆధిక్యం సాధించారు. ఇంకో వంద స్థానాల గెలుపోటములు ముస్లిం చొరబాటు దారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. ఒకనాటి రాష్ట్ర గవర్నర్‌ ‌రాజేశ్వర్‌ ‌వీటి గురించి హెచ్చరించారు కూడా. సరిహద్దు జిల్లాలో జనాభా సమీకరణలు మారిపోయిన సంగతిని చెప్పారు. మాల్డా, ముర్షిదాబాద్‌, ‌నదియా వంటి నగరాల చుట్టూ ఉన్న గ్రామాలలో జన సమీకరణాలు ఎలా మారి పోయాయో చెప్పారు. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఈ ‌చొరబాట్లను అనుమతిస్తూనే, వారి ఆధారంగానే మనుగడ సాగించారు. ఇదొక చేదువాస్తవం. బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను మాత్రం రాష్ట్రంలోకి అనుమతించకపోవడం ఎందుకో అర్ధం చేసుకోవాలి.

సరిహద్దున బంగ్లాదేశ్‌ ఉం‌డడమే కాదు, వ్యూహాత్మకంగా, దేశ భద్రత కారణాలతోను బెంగాల్‌ ఎం‌తో కీలకమైనది. బంగ్లాదేశ్‌ ‌నుంచి నిరంతరాయంగా సాగే చొరబాట్లతో కూడా ముప్పు ఉంది. ఈశాన్య భారతంతో మిగిలిన భారతావనికి సంబంధం తెగగొట్టడానికి చికెన్‌ ‌నెక్‌ అనే కనుమను నిర్బంధిస్తే చాలునంటూ సీఏఏ వ్యతిరేక ఆందోళనలో షర్జిల్‌ ఇమామ్‌ ‌షాహిన్‌బాగ్‌ ‌నిరసన శిబిరంలో మాట్లాడిన సంగతి గుర్తుంచుకోవాలి. హిందువులు ఇప్పటికైనా మేల్కొనాలి, ముందుకు సాగాలి.

(డాక్టర్‌ ‌పాత్రాను పరిచయం చేస్తూ డాక్టర్‌ ‌టిహెచ్‌ ‌చౌదరి, 1948కి ముందు పశ్చిమ బెంగాల్‌లో 28 శాతం ముస్లింలు ఉన్నారని, 1951 నాటికి 18 శాతం ఉన్నారని, ఇప్పుడు 35 శాతం ఉన్నారని తెలియచేశారు. అప్పుడు 18 శాతమే ముస్లింలు ఉండడానికి కారణం, తూర్పు బెంగాల్‌, ‌భారత్‌ల మధ్య వలసలు. హిందువుల జనాభా 65 శాతానికి పడిపోవడం, హైందవేతరులంతా మమతా బెనర్జీకి ఓటు వేయడం వలన ఆమె పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. హిందువులలో ఇలాంటి చీలికల వల్లనే సమాజం నష్టపోతున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు.)

———

ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి!

డాక్టర్‌ ఉపన్యాసం తరువాత ప్రశ్న జవాబుల కార్యక్రమం సాగింది. రాష్ట్రపతి పాలన విధింపు, రోహింగ్యాల చొరబాటు నిరోధానికి తీసుకున్న చర్యలు, జిహాద్‌ ‌బాధితులకు న్యాయ సహాయం, అక్కడ శాంతి లేనప్పుడు మనం రాజ్యాంగ బద్ధంగా ఎందుకు వెళ్లాలి, దీదీ అంటూ ఇంకా హిందువులు మమతా బెనర్జీని ఎందుకు సంబోధించాలి, సమస్యాత్మక ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎందుకు మార్చరాదు? వంటి ప్రశ్నలు వచ్చాయి. ఇంత హింస జరుగుతున్నా బెంగాల్‌లో 356 అధికరణాన్ని (రాష్ట్రపతి పాలన విధింపు) ఎందుకు విధించడం లేదు అన్న ప్రశ్నకు ఆయన, అన్ని కోణాల నుంచి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నదని, అలాంటి వివరాలు బహిర్గతం చేయడం సాధ్యం కాదని చెప్పారు.

ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణం తొలగించామని, రామమందిర నిర్మాణం సాధ్యం చేయగలిగామని, కానీ పౌరసత్వ సవరణ చట్టానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని డాక్టర్‌ ‌పాత్రా చెప్పారు. ఇలాంటి సమస్యలు, ప్రశ్నలు వచ్చినప్పుడు కేవలం చర్చలతో సరిపెట్టకుండా ఎవరికి తోచిన రీతిలో వారు వాటి మీద ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నంచేయాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న భావన సరికాదని కూడా చెప్పారు. శ్రద్ధ, సబూరి (సహనం) మనకి ఉండాలని కోరారు. శంకించడం మొదలైతే అది మన నమ్మకాన్ని చంపేస్తుందని కూడా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి వాస్తవాలు తెలియచేయడం, టీఎంసీ గూండాల చేతిలో దెబ్బ తిన్న కుటుంబాలకు సాయపడడం గురించి కూడా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన బెంగాల్‌ ఎన్నికల హింసలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటించారు.

About Author

By editor

Twitter
YOUTUBE