మే నెల 2వ తేదీన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, భారతీయ జనతా పార్టీ వెనుకపడిందని రూఢి కాగానే అక్కడ అక్షరాల నరమేధం  ఆరంభమైంది. ప్రత్యక్ష కార్యాచరణ దినం పేరుతో 1946/1947 సంవత్సరాలలో జరిగిన అపార రక్తపాతంతోనో, మధ్య యుగాలలో మొగలులు సాగించిన భీకర హింసాకాండతోనో మాత్రమే ఆ నరమేధాన్ని పోల్చగలం. ఇంకా అర్ధం కావాలంటే 1990 డిసెంబర్‌ ‌నాటి కశ్మీర్‌ ‌లోయ హత్యాకాండతో పోల్చవలసి ఉంటుంది. వందలాది గూండాలు గ్రామాల మీద పడి రాజకీయ ప్రత్యర్థులను కొట్టి చంపడం, స్త్రీల మీద అత్యాచారాలు చేయడం, ఇళ్లు తగుల బెట్టడం, కసి తీరక బుల్‌డోజర్లు తెచ్చి వాడలకు వాడలను నేలమట్టం చేయడం బెంగాల్‌ ‌గడ్డ మీద యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దేశ మహిళా జనాభాకు తానే అండ అన్నట్టు, ఇక వీరికి దిక్కు అన్నట్టు ప్రవర్తిస్తున్న మహిళ నాయకత్వంలోని పార్టీ గూండాలు ఆమె సొంత గడ్డ మీద ఆడవారి జుట్టు పట్టుకుని నడిరోడ్డు మీద ఈడ్చుకెళ్తున్నారు. లైంగిక అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. 142 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. అందిన సమాచారం మేరకు 3,662 గ్రామాలు ధ్వంసమైనాయి. ఇందులో 353 రూపురేఖలను కోల్పోయాయి. మొత్తం దాడికి గురైన హిందువులు 38,715. ఇందులో ఎస్‌సీలు 17,643, బీజేపీ కార్యకర్తలు 4,235. గూండాలు తరిమేస్తే కుటుంబాలు పారిపోగా 11,000 గృహాలు ఖాళీగా ఉండిపోయాయి. దోపిడీ దొంగలను మరిపిస్తూ దోచుకున్న దుకాణాలు 4,062. కోర్టుల లెక్క ప్రకారం లక్షలాది మంది పక్కనే ఉన్న అస్సాం వెళ్లి కాందిశీకుల్లా గుడారాలలో బతుకుతున్నారు. వీళ్లు చేసిన నేరం ఏమిటి? తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అనే నెత్తుటి చరిత్రలో తడిసిన పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే. ఆ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సాగించిన దుండగీడుతనమిది. ఆ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ కనుసన్నలలో జరుగుతున్న అమానుష కాండ ఇది. ఇంత జరుగుతున్నా ఈ దేశ మీడియా ధృతరాష్ట్ర పాత్రనే ఎంచుకుంది. ముస్లిం స్త్రీల మీదనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ మహిళ మీద అత్యాచారం జరిగినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టే హక్కుల కార్యకర్తలు ఇప్పుడు నోళ్లు కుట్టేసుకున్నారు. జాతి విద్రోహక టీవీ చానళ్లలో గంటల కొద్దీ చర్చలు లేవు. ఒక్కటి నిజం, బీజేపీని అభిమానించే, ఓటేసే మహిళలంటే మీడియాకు చులకన. మహిళలు, ఎస్‌సీ, ఎస్టీలు, బాలలు ఎంతమందికి ఎలాంటి హాని జరిగినా, ఒక పార్టీకి చెందిన కార్యకర్తలను సామూహికంగా ఊచకోత కోసినా విపక్షాలకి మచ్చ పడుతుందనుకుంటే వాటి మీద ఈ మీడియా నోరు విప్పదు. కోర్టులు సుమోటొ సంగతి కూడా మరచిపోయాయనిపిస్తుంది.

బెంగాల్‌ ‌ఛాందస ముస్లిం మతోన్మాదులకు అడ్డా. రోహింగ్యాలకు భూలోక స్వర్గం. కొన్నేళ్లు నక్సలైట్లకు కొలువు. కొన్ని దశాబ్దాలు చైనా భక్తులైన కామ్రేడ్లకు నెలవు. మొత్తంగా అది ఆత్మగౌరవం కలిగిన హిందువులకు మాత్రం బలిపీఠం.

ఇలాంటి బీభత్సంలో చిన్న ఆశారేఖ విరిసింది. ఎన్నికల హింస దరిమిలా పిల్లలు, స్త్రీలు సహా లక్షలాది మంది బెంగాలీలు సామూహికంగా వలస వెళ్లిపోవడం గురించి మీ స్పందన ఏమిటి అంటూ సుప్రీం కోర్టు మే 25వ తేదీన ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ, పోలీసు శాఖకీ తాఖీదులు జారీ చేసింది. ఢిల్లీలో ఉంటున్న అరుణ్‌ ‌ముఖర్జీ అనే సామాజిక కార్యకర్త, మరో నలుగురు కలసి వేసిన పిటిషన్‌తో అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జూన్‌ 7‌వ తేదీన ఈ వివాదం మీద వాదనలు వినడానికి జస్టిస్‌ ‌వినీత్‌ ‌శరన్‌, ‌జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌లతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తమ నివేదికను అందించాలి. ఇంత హింస జరుగుతున్నా రాష్ట్ర యంత్రాంగం గాఢ నిద్రలో ఉన్నదని కూడా పిటిషన్‌లో ఆరోపించారు. అలాగే అధికార పార్టీ తృణమూల్‌కు చెందినవారిగా చెప్పుకుంటున్న వ్యక్తులు బాధితులు చేసిన ఫిర్యాదులు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారని కూడా అందులో ఆరోపించారు. ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్లిపోయిన వారికి దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆశ్రయం కల్పించాలని, ఈ రక్తపాతమంతా బీజేపీ కార్యకర్తల లక్ష్యంగా సాగినదేనని వారు కోర్టుకు విన్నవించారు. కూచ్‌బిహార్‌, ‌కామాఖ్యపురి, తుపాన్‌గంజ్‌, అల్పియుర్దార్‌, ‌ఫాలిమారి, రాంపూర్‌ ‌గ్రామాల వారు రంగపాలి, శ్రీరాంపూర్‌ (అస్సాం) శిబిరంలో తలదాచుకుంటున్న సంగతిని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాజ్యాంగంలోని 355 అధికరణ ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పే బాధ్యత తీసుకునే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్లు కోరారు. జరిగిన రాజకీయ హింస, హత్యాకాండ మీద దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌, ‌బాలల హక్కుల జాతీయ సంస్థ వంటి పలు సంస్థలు బెంగాల్‌ ‌వెళ్లి ఆయా ప్రాంతాలను చూసి వచ్చాయని వారికి కూడా నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది పింకి ఆనంద్‌ ‌కోర్టును కోరారు.

ఇదే సమయంలో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. దేశం నలువైపుల నుంచి దాదాపు 2000 మంది న్యాయవాదులు బెంగాల్‌ ‌హింసాకాండపై విచారణ గురించి పరిశీలించ వలసిందని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హింసాకాండ గురించి, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు గురించి దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా వినియోగించవలసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణకు రాసిన లేఖలో నివేదించారు. రాష్ట్రంలో తలెత్తిన రాజ్యాంగ సంక్షోభం, ఎన్నికల అనంతర హింస ఫలితంగా అక్కడ పౌరులు నివసించలేని పరిస్థితులు తలెత్తడం వంటి అంశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ పరిస్థితులపైన దృష్టి సారించాలని న్యాయవాదులు కోరారు. అక్కడి హింస దేశంలోని అనేక మంది మహిళా న్యాయమూర్తుల ఆత్మసాక్షిని కలవర పరించిందని కూడా పేర్కొన్నారు. పోలీసులు గూండాలతో కుమ్మక్కు కావడం వల్ల బాధితులు ఫిర్యాదుచేసే పరిస్థితిలో లేరని ఆ లేఖలో బాహాటంగానే న్యాయవాదులు ఆరోపించారు. ఆ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని కూడా తెలియచేశారు.

బెంగాల్‌లో జరుగుతున్న దానిని ప్రభుత్వ హింసగా పేర్కొంటూ, దాని మీద దర్యాప్తు జరిపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని  ఒక పౌర బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను కోరింది. ఆ బృందానికి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాయకత్వం వహించాలని కూడా సూచించారు. అందుతున్న నివేదికలను బట్టి ఎన్నికల తరువాత రాష్ట్రంలో 15,000 హింసాత్మక ఘటనలు జరిగాయని కూడా వారు ఆ వినతిపత్రంలో తెలియచేశారు. వందలాది మంది అస్సాం, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లకు వలస పోయారని పేర్కొన్నారు.

——————————————

మారుమూల పల్లెలలోనే కాదు, పట్టణ ప్రాంతాలలో కూడా టీఎంసీ గూండాలు ఎంత యథేచ్ఛగా హింసాకాండను కొనసాగించారో చెప్పే ఘటన బెహాలా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆ నియోజకవర్గంలోని ఐదో మండల్‌లో బీజేపీకి క్రియాశీలక కార్యకర్త సంజయ్‌ ‌బాగ్‌. అతడిని దారుణంగా హింసించి మమతా బెనర్జీ జిందాబాద్‌ అనిపించారు. మోదీని బూతులు తిట్టారు. ఈ గూండాలంతా కొలకత్తా మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ 125‌వ వార్డు టీఎంసీ కౌన్సిలర్‌ ‌గణశ్రీ బాగ్‌ ‌పోషణలోని వారే. ఇదంతా మే 7,8 తేదీలలో జరిగింది. నిజానికి ఇప్పటికి కూడా చాలామంది బీజేపీ కార్యకర్తలు వారి ఇళ్లకు దూరంగా ఉండిపోయారు. ఇలాంటి దాడులు మూడువేల వరకు నమోదైనాయి.

——————————————

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి సంజయ్‌ ‌సేన్‌. ‌పురూలియా గ్రామంలో 285వ బూత్‌లో పనిచేసిన బీజేపీ కార్యకర్త. ఇది సురి అసెంబ్లీ నియోజకవర్గంలోనిది. ఈయన చేసిన తప్పు కూడా అదే- బీజేపీకి ప్రచారం చేయడం, ఓటు వేయడం. అందుకు ఎలాంటి శిక్ష అనుభవించవలసి వచ్చిందో ఈ రెండు చిత్రాలను చూస్తే తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. అయినా సేన్‌ ‌తన ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతడు పని చేసిన బూత్‌లో బీజేపీ ఆధిక్యం సాధించింది. అలా 18 రోజులు ఇంటికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. ఆఖరికి మే 19న ఇల్లు చేరుకున్నాడు.  మరునాడే పక్కనే ఉన్న హాజీపూర్‌ ‌నుంచి టీఎంసీ గూండాలు ఇంటి మీద దాడి చేశారు. సేన్‌ను స్పృహ తప్పేవరకు కొట్టారు. ఇంకా ఆయన భార్య, పెద్దవారైన తల్లిదండ్రులను వదలలేదు. నిజానికి పురూలియా హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న గ్రామం. టీఎంసీ గూండాలు ఇంతగా రెచ్చిపోయినా ఎవరూ కలగచేసుకోలేదు. వీళ్ల వెనకాల ఉన్నది ముస్లిం మతోన్మాదులు. ఇలా కొద్దిరోజుల తరువాత ఇళ్లు చేరుకుంటున్నవారిని ముస్లిం గూండాలు, మతోన్మాదులు బెదిరిస్తున్నారు. మళ్లీ ఇక్కడకు రావద్దని చెబుతున్నారు. అందుకే సేన్‌ ‌కుటుంబం మళ్లీ ఆ ఊరు వదిలిపెట్టింది. ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయంటే, సంజయ్‌ ‌సేన్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా సాహసించలేకపోయారు.

——————————————

ఈ ఫొటోలో కనిపిస్తున్న క్షతగాత్రుని పేరు ధర్మా మండల్‌. ‌బీజేపీ కార్యకర్త. నాడియా జిల్లాలోని హృదయ్‌పూర్‌ అనే గ్రామంలో మే 14వ తేదీన టీఎంసీ గూండాల చేతిలో దారుణంగా గాయపడ్డారు. మే 16వ తేదీన కొల్‌కత్తాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ ఆసుపత్రిలో చనిపోయారు. ఇతని భార్య మీద కూడా దాడి జరిగింది.

——————————————

About Author

By editor

Twitter
YOUTUBE