భారతీయ జీవన విధానంలో సుఖ జీవనం పొందడానికి, ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి భయం, ఆత్రుత, ఆందోళనలను దూరం చేసుకుని ధైర్యం పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పొందడానికి ఏదైనా ఒక సాధన అవసరం. అందరూ ఒప్పుకునేది, ఖర్చు లేనిది, ఇతరులకు ఇబ్బంది కలిగించనిది, అతి సరళమైనది యోగ. యోగసాధనలో ఆసనాలు ఒక భాగం. కొన్ని నెలల పాటు చేసిన వ్యాయామం ద్వారా పొందే లాభాలను యోగాసనాల ద్వారా ఒకటి రెండు రోజులలో పొందవచ్చు. ప్రస్తుత కరోనా సమయంలో అన్ని వయసుల వారికి అనుకూలమైన, అతిముఖ్యమైన కొన్ని ఆసనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. అందరూ ఈ ఆసనాలను ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ప్రయోజనం పొందవచ్చు. ఇక్కడ యోగాసనాలు, వాటి లాభాల గురించి ప్రస్తావించాం. వీటిని గురుముఖంగా నేర్చుకొని ప్రయోజనం పొందగలరు.
ప్రయోజనాలు : సూర్య నమస్కారాలు చేయడం వలన కాలి వేళ్లనుంచి తల వెంట్రుకల వరకు శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం కలుగుతుంది. అందువల్ల సూర్య నమస్కారాలను సర్వాంగ సుందర వ్యాయామంగా ప్రసిద్ధికెక్కాయి. సూర్యా నమస్కా రాలలో 7 ఆసనాలుంటాయి.
- ఊర్ధ్వ హస్తానాసన్
ప్రయోజనాలు : ఈ ఆసనం నాడీమండలాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాలి మడమలు, పిక్కలు బాగా దృఢంగా అవుతాయి. భుజాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఆస్టియో ఆర్థరాయిటీస్ వ్యాధి నివారణకు చాలా మంచిది.
- అర్ధ చంద్రాసన్
ప్రయోజనాలు : వెన్నెముకలోని నరాలు వదులయి, సులువుగా వంగే స్థితి వస్తుంది. తలలోకి రక్తప్రసరణ వృద్ధి అవుతుంది. మెడ కండరాలు దృఢమవుతాయి. ఛాతి మరియు భుజములను విశాలపరుచును. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మనం పనిచేయడం వలన ఖర్చు అయిన శక్తిని ఈ ఆసనం ద్వారా సమకూర్చుకోవచ్చు.
సూచన : తలతిరగడం వంటి బాధలు ఉన్నవారు, హెర్నియా ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు. కడుపుకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఆరునెలల వరకు వేయరాదు.
- పవన ముక్తాసన్
ప్రయోజనాలు : పొట్టలో పేరుకున్న వాయువు, దుర్గంధం బయటికి వెళ్లిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. కాలేయానికి హృదయానికి శక్తి వస్తుంది.
- సేతు బంధాసన్
ప్రయోజనాలు : నడుము కింది నుండి పైకెత్తడం, పైనుండి కిందకు దించడం వలన (ఇది నెమ్మదిగా చేయాలి) నడుము కండరాలు వదులయి, బలాన్ని పొందుతాయి. మోకాళ్లకు, భుజాలకు బలం చేకూరుతుంది. నిద్రలేమిని పోగొడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేస్తుంది. నాభి జరిగితే దానిని సహజ స్థితికి తీసుకొస్తుంది. నాభి జరగడం వల్ల వచ్చే కడపునొప్పి, విరేచనాలను నివారిస్తుంది. నడుంనొప్పి ఉన్నవారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది. థైరాయిడ్ నివారణకు
సేతుబం ధాసనం-1 విశేషంగానూ, సేతుబంధా సనం-2 ఓ మోస్తరుగానూ ఉపయోగపడతాయి.
- సరళ మత్స్యాసన్
ప్రయోజనాలు : మెదడుకు రక్తప్రసరణ జరిగి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. శరీరం, మనసు తేలికవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది. తల తిరగడం తగ్గుతుంది.
సూచన : శరీరం బరువు వెన్ను, మెడపై కాకుండా మోచేతులపై ఉంచాలి.
- భుజంగాసన్
ప్రయోజనాలు : మెడ కండరాలు, వెన్నునరాలు వదులయి, బలంగా అవుతాయి. మెడ, వీపు నొప్పి, జీర్ణవ్యాధులు, పొట్టలోని కొవ్వు తగ్గుతాయి. మోచేతులు, భుజాలు, మణికట్టు, అరచేతులు, చేతివేళ్ల ఇబ్బందులను దూరం చేస్తుంది. పొత్తి కడుపులోని అనవసర కొవ్వును తగ్గిస్తుంది. పెద్ద పేగుకు ఉద్దీపన కలుగుతుంది.
సూచన : హెర్నియా, రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
- శలభాసన్
ప్రయోజనాలు : వీపుకు, మెడ కండరాలకు, పిరుదులు, తుంటి, కడుపు, తొడలు, కాళ్లు మరియు మూత్రపిండాలకు శక్తి వస్తుంది. శరీరం తేలికయి, చురుగ్గా వుంటుంది.
మనోనిగ్రహం పెరుగుతుంది. గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగాడానికి ఈ ఆసనం ఎంతో ఉపకరిస్తుంది.
సూచన : మూత్రవ్యాధులు, హెర్నియా లాంటివి ఉన్నవారు ఈ ఆసనం చేయరాదు.
- ఉష్ట్రాసన్
ప్రయోజనాలు : ఊపిరితిత్తులు బాగా విశాలమయి, వాటి సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సమస్యలు తొలగిపోతాయి. ఛాతి విశాలం అవుతుంది. నడుము దగ్గర కొవ్వు తగ్గి బలంగా తయారవుతుంది. కీళ్ళు అన్ని బలంగా తయారవుతాయి. థైరాయిడ్ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది.
సూచన : ఛాతి, ఉదరభాగము శస్త్ర చికిత్స చేయించుకున్న వారు 6 నెలల వరకు, హెర్నియా ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
- వక్రాసన్
ప్రయోజనాలు : వెన్నెముకకు, కాలేయానికి, చిన్న పేగులకు, జీర్ణ గ్రంథులకు శక్తినిస్తుంది. మలబద్ధకం, మూత్ర పిండాల వ్యాధి, కాలేయానికి సంబంధించిన జబ్బులూ, నడుము కండరాల నొప్పి, తుంటి, కీళ్ల నొప్పులు పోతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారికి వ్యాధి పెరగకుండా కాపాడుతుంది. నిరంతరం అభ్యాసం చేస్తే వ్యాధిని సమూలంగా నిర్మూలించుకోవచ్చు. కనుక మధుమేహం ఉన్నవారు ఉదయం, సాయంత్రం అభ్యాసం చేసుకుంటే చాలా ఉపయోగం. ఇరువైపులా కొవ్వును తగ్గించి నడుము సన్నబడడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగపడుతుంది.
సూచన : హెర్నియా ఉన్నవారు ఈ ఆసనం చేయరాదు.
- మకరాసన్
ప్రయోజనాలు : మకర అంటే మొసలి. ఈ ఆసనం మొసలి ఆకారాన్ని పోలి ఉంటుంది. మకరాసనంతో పూర్తి ప్రశాంతత లభిస్తుంది. ఉరుకులు, పరుగులతో ఉండేవారికి ఈ ఆసనం వేస్తే వెంటనే ప్రశాంతత చేకూరుతుంది.
ప్రస్తుత కరోనా బాధితులకు ఈ ఆసనం గొప్ప వరం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా బాధితులు రోజు 5,6 గంటలు ఈ స్థితిలో ఛాతికింద దిండు పెట్టుకొని పడుకోవాలి. దీనివల్ల ఆక్సిజన్ శాతం వెంటనే పెరుగుతుంది. ఇప్పుడిది ప్రోనింగ్ ఎక్సర్‌సైజ్ పేరుతో బాగా ప్రచారంలో ఉంది.
- శవాసన్
ప్రయోజనాలు : యోగ సాధనలో శవాసనం ఎంతో ముఖ్యమైంది. దీన్నే ‘‘అమృతాసన్’’ అంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైనది. అయితే దీనిపై పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలో లేదా అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంత తను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది.
– యోగ సిద్ధిరాములు, యోగాచార్య.